రైతు సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం

Updated By ManamFri, 07/27/2018 - 22:40
akun
  • విత్తన విక్రయాల్లో అవినీతిపై కఠిన చర్యలు

  • తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ ఆకున్ సబర్వాల్

akunహైదరాబాద్: రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ఆకున్ సబర్వాల్ అన్నారు. తూనికల, కొలతల శాఖ నిబంధనలపై విత్తన ఉత్పత్తిదారులకు  తెలంగాణ సీడ్‌మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆకున్ సబర్వాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత, ప్రమాణాలు కలిగిన విత్తనాలను సరైన తూకంలో రైతులకు అందించడం ద్వారా వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించినట్టు అవుతుందన్నారు. విత్తనాల నాణ్యతా, తూకంలో ఏమాత్రం రాజీ పడొద్దని విత్తన కంపెనీ యాజమాన్యాలకు కంట్రోలర్ విజ్ఞప్తి చేశారు.

విత్తనాల విక్రయంలో అక్రమాలకు పాల్పడుతూ తూకాల్లో రైతులను మోసం చేస్తున్నారని అనేక ఫిర్యాదులు రావడంతో తూనికల కొలతల శాఖ మే నెలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిందన్నారు. ఈ తనిఖీల్లో 154 కేసులు నమోదు చేసి, రూ. 2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేసినట్లు కమిషనర్ చెప్పారు.  విత్తన కంపెనీల విజ్ఞప్తి మేరకు తూనికల కొలతల శాఖ నిబంధనలు పాటించడానికి వారికి కొంత సమయం ఇచ్చామని చెప్పారు.  విత్తన ఉత్పత్తిదారులు కూడా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

రైతులకు విక్రయించే విత్తనాల విషయంలో నిజాయితీగా వ్యవహరించాలని విత్తనాల వ్యాపారులకు సూచించారు. రైతులకు విక్రయించే విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల తూకాల్లో మోసాలకు పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని చెప్పారు. అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని కమిషనర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో సీడ్‌మెన్ అసోసియేషన్ ప్రతినిధులు ఎస్. జగదీశ్వర్, నిరంజన్, మల్లారెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

English Title
Government Priority to the farmer's welfare
Related News