పార్కర్ ప్రోబ్ ప్రయోగం వాయిదా

Updated By ManamSat, 08/11/2018 - 22:30
image
  • చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు

  • గుర్తించిన నిపుణులు.. వెంటనే నిలిపివేత

  • సూర్యుడిపై అధ్యయనానికి నాసా ప్రయోగం

imageకేప్‌కెనరావల్: సూర్యుడిపై అధ్యయనానికి అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ (నాసా) తలపెట్టిన ‘ పార్కర్ సోలార్ ప్రోబ్’ ప్రయోగం వాయిదా పడింది. ప్రయోగానికి ఉపయోగించనున్న డెల్టా 4 రాకెట్‌లో చివరి క్షణంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధంచేయగా ప్రయోగానికి ఒక నిమిషం 55 సెకన్లు మిగిలి ఉన్న తరుణంలో సాంకేతిక సమస్యలను నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దాంతో వెంటనే ప్రయోగాన్ని నిలిపివేశారు. ఆదివారం రాకెట్‌ను ప్రయోగించే అవకాశాలను పరిశీలస్తానమని అధికారులు తెలిపారు. తొలుత హీలియం ప్రెషర్ సిస్టంలో సమస్యలు తలెత్తగా హుటాహుటిన దానిని సరిచేశారు. అయినా రెడ్ అలారం మోగడం తో ప్రయోగాన్ని నిలిపి వేశారు. 1.5 మిలియర్ డాలర్ల వ్యయంతో ఈ ప్రాజె క్టును నాసా చేపట్టింది. వారం క్రితమే దీనిని ప్రయోగించాల్సి ఉన్నా.. రాకెట్‌లో సమస్యల కారణం గా వాయిదా పడింది.

తాజాగా మళ్లీ సమస్యలు తలెత్తాయి. సూర్యుడిపై అధ్యయనం కోసం  పార్కర్ ప్రోబ్ నింగికి ఎగరనున్నది. ఫ్లోరిడా imageనుంచి నాసా దీన్ని ప్రయోగిస్తున్నది. అయితే నింగికి ఎగిరిన మూడు నెలల్లోనే సూర్యుడి సమీపానికి పార్కర్ వెళ్లనున్నది. ఈ ఏడాది నవంబరులోనే పార్కర్ ప్రోబ్.. భానుడి సమీపానికి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది చివరి నెల డిసెంబర్‌లో.. పార్కర్ మొదటి డేటాను రిలీజ్ చేస్తుందని నాసా వెల్లడించింది. సూర్యుడికి చాలా దగ్గర వరకు వ్యోమనౌక వెళ్లే ప్రయోగాన్ని గతంలో ఎప్పుడూ చేపట్టలేదు. పార్కర్‌తో సౌర రహస్యాలు చాలా వరకు బయటపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సూర్యుడి వాతావరణం కంటే అధికంగా.. కరోనా ఎందుకు సెగలు చిమ్ముతుందో ఈ పరిశోధన ద్వారా తేల్చనున్నారు.పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి పరిశోధనలు చేస్తుంది.

2025 ఆగస్టు వరకు ఈ మిషన్ కొనసాగనున్నది. నాసా తన అంతరిక్ష నౌకకు మొదటిసారిగా బతికున్న వ్యక్తి పేరు పెట్టింది. సూర్యుడి స్థితిగతులపై పరిశోధనలు చేస్తున్న ఖగోళ భౌతికశాస్త్రవేత్త యూజీన్ పార్కర్ గౌరవార్థం ఈ పేరు పెట్టింది. మొదటి యూజీన్ పార్కర్ ఆరు దశాబ్దాలకుపైగా సూర్యుడిపై పరిశోధనలు చేస్తున్నారు. సూర్యుడి చుట్టూ అయస్కాంత క్షేత్రం సర్పిలాకారంలో ఉన్నదంటూ 1950లో పార్కర్ స్పైరల్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కరోనా నుంచి వెలువడే సౌరతుఫానులపైనా పరిశోధనలు చేస్తుంది. ఇవి భూమిని తాకితే కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సౌర తుఫాన్లు ఎలా పుడుతాయి? వేగం ఎలా పెరుగుతుంది? వంటి ప్రశ్నలకు పార్కర్ సమాధానాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఈ సమాచారం ఆధారంగా సౌరతుఫాన్ల నుంచి తప్పించుకోవడానికి గల మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషించనున్నారు.

English Title
The Parker probe was postponed
Related News