దివ్యాంగుల సంక్షేమానికే ప్రాధాన్యత

Updated By ManamWed, 08/15/2018 - 00:43
kadiyam
  • ఉపకరణాల పంపిణీలో మంత్రి కడియం

kadiyamహైదరాబాద్: సంక్షేమంలో మొదటి ప్రాధాన్యత దివ్యాంగులకే ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. సిఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులకు 500రూపాయల పెన్షన్ వస్తుంటే...తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దానిని 1500 చేసిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన దివ్యాంగులకు నేడు హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో ఉపకరణాలను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పంపిణీ చేశారు. దివ్యాంగుల పరిస్థితులను తెలిపిన వాసుదేవరెడ్డిని కార్పొరేషన్‌కు చైర్మన్ చేయడం మంచి పరిణామమని అన్నారు. వచ్చే మూడు నెలల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దివ్యాంగులందరికీ ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ఉపకరణాలు ఇచ్చేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చైర్మన్ వాసుదేవరెడ్డికి సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయినా ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో దివ్యాంగులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లకు 3 నుంచి 4 శాతానికి పెంచారని, విద్యలో 4నుంచి5 శాతానికి, ఆర్థిక మద్దతు పథకాలలో 5శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఉపముఖ్యమంత్రి  అన్నారు. అదేవిధంగా కార్పొరేషన్‌కు 100 కోట్ల రూపాయలు సిఎం కేసీఆర్ కేటాయించారన్నారు. దివ్యాంగుల కోసం హాస్టళ్లు, పక్కా భవనాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగులకు ఇచ్చే రుణాల్లో 20శాతం బ్యాంకు లింక్ ఉండటం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో వీరిని చాలా ఇబ్బందులు పెడుతున్నాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు. బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా వంద శాతం సబ్సిడితో దివ్యాంగులకు రుణాలు ఇవ్వాలని సిఎం కేసీఆర్‌కు తను విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ సేకరించాలని చైర్మన్‌కు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు పసునూరి దయాకర్, సీతారాం నాయక్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ ఆమ్రపాలి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

English Title
The priority of the welfare is the priority
Related News