శ్రీకనకధార-15

Updated By ManamTue, 08/21/2018 - 00:09
Bhakthi

నమోస్తు  దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై 
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదరవల్లభాయై 

imageనమ్మి కొలిచిన భక్తులకు కొంగుబంగారం లక్ష్మీదేవి. ఆ తల్లి బ్రహ్మ ఆజ్ఞమేరకు తపస్సు చేసిన కారణంగా భృగు - ఖ్యాతి దంపతులకు పుత్రికగా జన్మించింది. బ్రహ్మమాసనపుత్రుడు, సప్తర్షుల్లో ఒకడైన భృగు మహర్షి తండ్రియైన బ్రహ్మ ఆదేశం మేరకు నిష్కామంగా తపస్సు చేశాడు. అందుకు పరాశక్తి ప్రసన్నురాలైంది. వరం కోరుకోమంటే ఆ మహర్షికి ఆదిపరాశక్తిని తన ఇంట నిలుపుకోవాలనుకోవడం తప్ప మరేదీ తోచలేదు. వెంటనే ఆ తల్లిని తన ఇంట పుత్రికగా ఉదయించమని కోరుకున్నాడు. అప్పడు ఆదిపరాశక్తి లక్ష్మీస్వరూపంలో భృగు ఇంట జన్మించింది. భార్గవి అయింది. మరోలా చెప్పాలంటే భృగు నిష్కామతపానికి మెచ్చి, ఆయనకు తండ్రిపదాన్ని అందించింది. ఆయనను భృగుసంహిత రచయితగా మారేలా చేసింది. అంతటి భక్తవరద ఆ తల్లి.

 భార్గవిగానే విష్ణుపత్ని స్థానాన్ని పొంది, ఆయన హృదయాధినేత్రి అయింది. కమలాధివా సినియైన ఆ తల్లికి ఉన్న లక్ష్మి అన్న పేరు కూడా జనోద్ధరణను సూచించేదే.  లక్ష్యాయిధి లక్ష్మిః- అంటే జనులను ఉద్ధరించే లక్ష్యం కలిగింది అని అర్థం. ఆ తల్లే దామోదరుని పాణిగ్రహణంతో లోకమాతగా నిలిచింది. దామం అంటే తాడు. దాన్ని ఉదరంపై గలవాడు దామోదరుడు. సదా విష్ణుగళంలో ఉండే దామం వైజయంతి. అది విజయకారకం. బాలశంకరులు ఈ స్తుతి శ్లోకంలో  అమ్మవారి భక్తసులభతని, ఆశ్రితవరదత్వాన్ని, కోమలావాస స్థానాన్ని, ఆర్తోద్ధరణ పరాయణత్వాన్ని సూచించారు.  అంతేకాదు భృగు ప్రస్తావనలో అమ్మవారి విద్యాతత్త్వాన్ని, లక్ష్మీ శబ్దంతో అర్థతత్త్వాన్ని, దామోదర వల్లభత్వంతో శక్తితత్త్వాన్ని చెబుతూ స్వరూపాలు వేరైనా అమ్మవారు ఒక్కటే అని మార్మికంగా సూచించారు. ఇదిగదా శాక్తేయమైన అద్వైతం. భృగువంశపుత్రిక, విష్ణువక్షస్థలనిలయ, కమలాలయ, దామోదర ప్రియయైన ఓ లక్ష్మీదేవీ నీకు వందనం.
-డా. కె. పూర్ణప్రజ్ఞాభారతి

English Title
kanakadhaara
Related News