ఒక్కసారే నీట్.. జేఈఈ మెయిన్స్ రెండుసార్లు!

Updated By ManamTue, 08/21/2018 - 20:13
Medical Entrance Exam, NEET, NEET-2018, HRDA Department, JEE Mains
  • అది కూడా పెన్ను-పేపర్‌తోనే.. ఆన్‌లైన్ పరీక్ష యోచనకు గుడ్‌బై

  • రెండుసార్లు నీట్ వద్దన్న ఆరోగ్యశాఖ.. గ్రామీణ విద్యార్థులకు ఆన్‌లైన్ కష్టమే

  • పిల్లలపై ఒత్తిడి పెరుగుతుందని వెల్లడి.. హెచ్‌ఆర్‌డీ శాఖ సానుకూల స్పందన

  • జేఈఈ మెయిన్స్ మాత్రం రెండుసార్లు.. పరీక్షల షెడ్యూలు వెల్లడించిన ఎన్‌టీఏ

Medical Entrance Exam, NEET, NEET-2018, HRDA Department, JEE Mainsన్యూఢిల్లీ: ఏడాదికి రెండుసార్లు నీట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలన్న ప్రతిపాదనను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఉపసంహరించుకుంది. ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన సూచనల నేపథ్యంలో  నిర్ణయం తీసుకుంది. అయితే జేఈఈ మెయిన్స్‌ను మాత్రం రెండుసార్లు నిర్వమించనున్నారు. 2018 డి సెంబరు, 2019 మే నెలల మధ్యలో వివిధ పరీక్షలు నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం షెడ్యూలు విడుదల చేసింది. అందులో నీట్‌ను 2019 మే 5వ తేదీన పెన్ను-పేపర్ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విజ్ఞప్తి మేరకు నీట్ పరీక్ష విధానాన్ని మార్చామని, గత సంవత్సరం ఉన్న పద్ధతే ఈసారీ ఉండాలని ఆరోగ్యశాఖ తెలిపిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వర్గాలు చెప్పాయి. అయితే ఆరోగ్యశాఖ ఎందుకలా చెప్పిందన్న వివరాలు మాత్రం తెలియజేయలేదు. నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని భావిస్తున్నట్లు హెచ్‌ఆర్‌డీ మంత్రి ప్రకాష్ జావడేకర్ జూలై నెలలో చెప్పారు. ఎన్‌టీఏ నిర్వహించే పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారితంగానే ఆన్‌లైన్‌లో ఉంటాయని కూడా అప్పట్లో తెలిపారు. 

అయితే, నీట్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తే పరీక్షల క్యాలెండర్ రూపొందించడం కష్టం కావడంతో పాటు విద్యార్థులపై అదనపు ఒత్తిడి పడుతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ హెచ్‌ఆర్‌డీ శాఖకు రాసి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయంపై కూడా విమర్శలు వచ్చాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండే ఆవకాశం తక్కువని, అలాంటప్పుడు  ఆన్‌లైన్‌లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తే వారు చాలా ఇబ్బందులు పడతారని అన్నారు. కొందరు విద్యార్థులు రెండుసార్లు పరీక్ష విధానాన్ని స్వాగతించగా, మరికొందరు మాత్రం వద్దని చెప్పారు.

రెండుసార్లు పరీక్షలంటే ఎనిమిది సెట్ల ప్రశ్నపత్రాలుంటాయని, అలాంటప్పుడు అదృష్టం బాగుంటే మార్కులొస్తాయి, లేకపోతే లేదని అన్నారు. ఈ సంవత్సరం నీట్ పరీక్ష రిజిస్ట్రేషన్ నవంబరు 1 నుంచి 30 వరకు ఉంటుంది. అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 15 నుంచి డౌన్‌లోడ్ చే సుకోవచ్చు. పరీక్ష నిర్వహించిన సరిగ్గా నెల రోజుల తర్వాత.. అంటే జూన్ 5న ఫలితాలు ప్రకటిస్తారని నేషనల్ టెస్టింగ్ ఏజె న్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక జేఈఈ మెయిన్స్ పరీక్షను మాత్రం 2019 జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండుసార్లు నిర్వహిస్తారని ఎన్‌టీఏ చెప్పింది. యూజీసీ-నెట్, సీమ్యాట్, జీప్యాట్ పరీక్షలకు కూడా ఎన్‌టీఏ తేదీలు ప్రకటించింది.

English Title
Medical Entrance Exam NEET Once A Year, To Be Handwritten
Related News