అందరూ మహాబలి ప్రతిరూపాలే!

Updated By ManamFri, 08/24/2018 - 22:23
kerala onam

imageకేరళలో ఆగస్టు- సెప్టెంబరు మాసాల మధ్య ‘ఓనమ్’ పండుగ వస్తుంది. కేరళ పంచాంగం ప్రకారం ఓనమ్ పండుగ ‘చింగమ్’ మాసంలో వస్తుంది. మహావిష్ణువు దశావతారాల్లో ఒకరైన వామనునికి సంబంధించిన గాథ ఆధారంగా మలయాళీలు ఈ పండుగను జరుపుకుంటారు. హిందూ పురాణగాథల ప్రకారం కశ్యపుని కుమారుడైన బలి చక్రవర్తి ముల్లోకాల్లో దేవతలపై విజయం సాధిస్తాడు. అయితే ఆడినమాట తప్పని మహామహునిగా, ధర్మమూర్తిగా బలిచక్రవర్తి పేరు పొందుతాడు.

బలి చక్రవర్తి చేతిలో ఓడిపోయిన దేవతలు మహావిష్ణువు సహాయాన్ని అర్థిస్తారు. అయితే బలిచక్రవర్తి దానప్రవృత్తిని గురించి తెలిసిన మహావిష్ణువు అతని మీద యుద్ధం చేయడానికి నిరాకరించి, అతని ధర్మనిరతిని పరీక్షించాలని నిర్ణయించుకుం టాడు. బ్రాహ్మణుని రూపంలో వచ్చి మూడడుగుల చోటును దానంగా ఇమ్మంటాడు. వామనుని కోరికను మన్నించిన బలిచక్రవర్తి మూడడుగుల నేలను దానంగా ఇవ్వడానికి సంసిద్ధుడవుతాడు. ఒక అడుగు ఆకాశం మీద, మరొక అడుగు భూమండలం మీద మోపిన వామనుడు మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతాడు, అందుకు జవాబుగా బలి చక్రవర్తి తన శిరస్సును చూపుతాడు. దాంతో బలి చక్రవర్తిని భూమిలోకి తొక్కివేస్తాడు మహావిష్ణువు. ఆడిన మాట తప్పని బలి చక్రవర్తి నిజాయితీని మెచ్చిన మహావి ష్ణువు ఏడాదికి ఒకసారి తాను పాలించిన ప్రజల్ని చూడడానికి బలి చక్రవర్తి తిరిగి తన దేశానికి వచ్చేలా వరమిస్తాడు. బలి చక్రవర్తి తిరిగి వచ్చే సందర్భంగానే కేరళ ప్రజలు ఓనమ్ పండుగను జరుపుకుంటారు. ఓనమ్ పండుగ నేపథ్యమిది. కానీ ఈ ఆగస్టు 27 వచ్చే ఓనమ్ మాత్రం కేరళ ప్రజలకు బలిచక్రవర్తిని పలురూపాల్లో ముందుగానే పరిచయం చేసింది. 

కేరళలో బలి చక్రవర్తి లేదా మహాబలిని ‘మావెలి’ అని పిలుస్తారు. ఈసారి మావెలి ఓనమ్ కంటే కాస్త ముందుగానే కేరళ ప్రజల్ని పలుకరించాడు. బలిష్ఠమైనదేహంతో పెద్ద మీసాలతో కనిపించే బలి చక్రవర్తి రూపం ఈసారి కాస్త సాధారణ మానవరూపాన్ని సంతరించుకుంది. 

భారత నావికా దళానికి చెందిన 321ఫ్లైట్ స్క్వాడ్రన్ విజయ వర్మ రూపంలో వచ్చిన బలి చక్రవర్తి ఒక నిండుగర్భిణిని తన హెలికాప్టర్‌లో తీసుకువెళ్ళి, కొచ్చిన్‌లోని ఒక ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించాడు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తల్లీబిడ్డలకు విజయ వర్మ రూపంలో బలిచక్రవర్తి ఎప్పటికీ గుర్తుండి పోతాడు. మరోచోట రేజిఛాయన్ రూపంలో బలి చక్రవర్తి దక్షిణ మధ్య కేరళలో వరదధాటికి దారుణంగా దెబ్బతిన్న గ్రామాలకు పడవను నడిపి, ప్రజలకు పాలు, తాగునీరు వంటి అత్యవసర పదార్థాల్ని నిరంతరాయంగా అందించాడు. 

ఇంకోచోట కన్హయా కుమార్ అనే కానిస్టేబుల్ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దక్షిణ కేరళలోని చెరథోని గ్రామంలో క్షణాల్లో కూలిపోబోతున్న వంతెన మీద చిక్కిన బాలుణ్ణి ప్రాణాలకు తెగించి కాపాడాడు. బలిచక్రవర్తి సాహసాల గురించి కేరళ ప్రజలు అనేకానేక కథల్ని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ ధీశాలి వారసులుగా ఇంతటి మహోపద్రవాన్ని గెలిచి, ప్రాణాలతో మిగిలిన వారంతా మరో ఓనమ్ నాటికి తమ సంతోషాన్ని పునరుజ్జీవింప చేస్తారని ఆశిద్దాం. 
- కల్కి

English Title
onam festival
Related News