యువరాజునవుతాను...

Updated By ManamSun, 08/26/2018 - 05:06
Raakhee

imageరాఖీ పండుగ.. ఈ పేరు వినగానే నా ముఖం నిండు పున్నమి ఆకాశం అవుతుంది. ఎందుకంటే రాఖీ అనంగానే మా అక్క గుర్తొస్తుంది, చెల్లి నవ్వు వినిపిస్తుంది. ఈ రక్తసంబంధ దృశ్యం నా ఒక్కడికేం పరిమితం కాదు. ఇది హృదయాల సవ్వడి సందర్భం.. అనురాగాల సంగమ తీరం...

నేను కాంక్రీట్ జంగిల్‌లో ఎడారిని.. జానెడు పొట్ట మూపురాన్ని నడి వీపున మోసుకు తిరుగుతున్న ఒంటెని.. ఎప్పుడో ఒక విరామ శ్రమలో ఎండమావి వైపు ఆశగా చూస్తూ ఆకుపచ్చని నా పల్లె బతుకును కలగంటుంటాను. ఏడాదికోసారి అదిగో అటువంటి తథాస్తు రోజున నా ఆశ మొలుస్తుంది. అంతకు ముందే, నా దేహమంతా అనురాగ వాన కురుస్తుంది. అవును.. మా అక్క రెక్కలు కట్టుకొని వాలితే పల్లెలో మా రంగు ముగ్గు వాకిలి కనపడుతుంది. చిలుకల నవ్వుతో మా చెల్లి చేరితే మొన్నమొన్ననే నాటిన మా ఊరి వరి పొలాలు కళ్ళముందు కదలాడుతాయి.. ఊరి పొలం నుండి గోరటి వెంకన్న పల్లెపాట నాదాకా వినిపిస్తుంటుంది.. ఒక చేత్తో రాఖీ, మరో చేత్తో మిఠాయి, వాళ్ల నిండు గుండె దోసిళ్ళతో ప్రేమపూర్వక దీవెన.. వహ్.. ఇంతకన్నా పండుగేముంది..!

ఒకరి గుండె చెరువు నిండుతుంది, imageఇంకొకరి మనసు బావి పొంగుతుంది. ఇంకో చోట సంతోష జలపాతం దూకుతుంది. మా ఇల్లే కాదు, పట్నాలు నగరాల్లోని అన్నదమ్ముల ఇళ్ళ మత్తడి నుండి ఆప్యాయత నదీ ప్రవాహమవుతుంది. కాలంతో పోటీపడి నిమిషాలు గంటలను పనితో కొలుస్తుంటానని గడియారం తన నాడీ స్పందనతో ఏడాదంతా నా దండ చేతిపై సవ్వడి వినిపిస్తుంది. కానీ ఎందుకో.. రాఖీ సమీపిస్తుండగానే గడియారం మోము వాడిపోతుంది. రాఖీ పండుగ నాడు నా రక్త బిందువులు కట్టే కంకణాల మధ్య గడియారం బిక్కమొహమేస్తుంది.

నా చేతికి కట్టే రక్షాబంధనం కోసం అక్కచెల్లెళ్ళ లోకకల్యాణపు విశ్వశాంతి యాగక్రతువు అప్పటికి వారం రోజుల ముందే మొదలై ఉంటుంది. వాళ్ళ ఇల్లు, పిల్లలు, సంసారం, ఉద్యోగాలు, వృత్తి వ్యాపారాలు మెట్టినింటి గడపకు అప్పజెప్పే ప్రణాళికలో మునిగితేలి ఉంటారు...

చెల్లెలు కట్టే రాఖీ పొద్దుతిరుగుడు రెక్కల్లా ఉంటుంది. అక్క తెచ్చే రాఖీ ముద్దబంతిపువ్వులా ఉంటుంది...
నా చేతికి రాఖీ మొలిచాక పట్టాభిషేక యువరాజునవుతాను. నేను బహూకరించే కానుకతో వాళ్ళ మనసులో ఆనందం తాండవిస్తుంటుంది.. ఆ సంగీతం ఈ సోదరునికే వినిపిస్తుంది. వాళ్ళు నాతో ఉన్న ధైర్యంతో బాల్యాన పోగొట్టుకున్న రాజ్యాన్ని ఒక్కసారిగా గెలుచుకొస్తాను. జగజ్జేత అలెగ్జాండర్‌ను ‘‘అన్నా!’’ అనే పిలుపుతో కట్టిపడేసిన రోజు కదా.. అందుకే ఇంత బలమైన బాంధవ్యం.. అక్కా చెల్లి ఉన్నంతసేపు మా బాల్య స్మృతులు గుబాళిస్తుంటాయి. ఎప్పుడన్నా తోబుట్టువు రాఖీతో పలకరించకపోతే.. నా కళ్ళు కన్నీటి సంద్రాలవుతాయి. పోస్టులోనైనా అన్నా, తమ్ముడూ.. అన్న పిలుపు వినిపించకుంటే.. నా గుండె చెవులు వీధికి వేలాడుతుంటాయి.

రాఖీ అనే రెండక్షరాల రక్షరేఖ కోసం.. తోబుట్టువుల ఆశీర్వచనం కోసం చెల్లెళ్ళు, అక్కల వద్దకే నడిచే సోదరులు కూడా ఉంటారు. కులమతాలకతీతంగా కంటికి కనిపించని దేవుడి రూపాన్నే చూపుల్లో నిలుపుకొని కొండాకోన దాటి దర్శించుకునే మనకు.. కళ్ళముందు తిరుగాడే తోబుట్టువు దీవెన దైవశక్తి సమానమే.. ప్రహరీ అడ్డుగోడలు.. మందిర్, మసీదు, చర్చిలకే కానీ దేవుడికి కాదు. అలానే సోదరి ప్రేమకు ఆశీర్వాద దీవెనకు కులాలు అడ్డురావు. నీ ముంజేతిని ముందుకు చాపి ‘‘చూడు అన్నా చూడు.. తమ్ముడూ చూడు..’’ అంటూ ఒక మసీదు రాఖీ కడుతుంది, ఒక చర్చి దీవిస్తుంది. అందుకే.. లేనోడు ఉంటాడేమో కానీ అక్కచెల్లెళ్లు లేనోడెవడూ ఉండకూడదు.

- ప్రణయ్‌రాజ్ వంగరి

వారే నా బలం! నా ధైర్యం!
ఎల్లప్పుడూ ప్రవహించే నదీ ప్రవాహాల్లా అన్నా చెల్లెళ్ల మధ్య, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమలూ, అనురాగాలూ, imageఆప్యాయతలూ నిరంతరం నిస్వార్థంగా సాగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడూ వారి మధ్య అభిప్రాయభేదాలు, కోపతాపాలు పొడచూపినా మళ్లీ కొన్ని క్షణాలకే అవి మంచు కరిగినట్లు ఇట్టే కరిగిపోతాయి. మబ్బులు తొలగిన ఆకాశంలా వారి మనసులు నిర్మలమైపోతాయి.

ఒకే ప్రేగుతో పెనవేసుకున్న చెక్కుచెదరని అనుబంధాలు వారివి! నేను కూడా నా తోబుట్టువుల ప్రేమకు ఉక్కిరిబిక్కిరి అయినవాడినే. మధురమైన అనుభూతులకు లోనైనవాడినే. కమ్మని జ్ఞాపకాలను మదిలో దాచుకున్నవాడినే.

మా అమ్మానాన్నలకు మేము నల్గురం సంతానం. అక్క, నేను, చెల్లి, తమ్ముడు. మా అక్క అన్నపూర్ణ రైల్వే ఉద్యోగి భార్య. వారిది చోడవరం దగ్గర గజపతినగరం. చెల్లి దేవి. మా ఊరు కశింకోటలోనే మా మేనత్త కొడుక్కిచ్చి పెళ్లి చేశాం. బావ సింగపూర్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తమ్ముడు నూకేశ్వరరావు వ్యవసాయం చేస్తుంటాడు. నేను ఓ ప్రైవేట్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. 

నిజం చెప్పాలంటే ప్రేమను పంచడంలో నాకంటే ఎప్పుడూ వారే ఓ మెట్టు పైనుంటారు. ఎందుకో తెలీదు కానీ మా చెల్లికి నేనంటే ప్రత్యేక అభిమానం. ఎనలేని గౌరవం! మా బావ సింగపూర్‌లో ఉంటున్న కారణంగా, మా తమ్ముడు వ్యవసాయంలో తలమునకలవుతూ ఉండటం వల్ల ఏ ముఖ్యమైన పనైనా నాకే చెబుతూ ఉంటుంది. ఏ సంతోషమైనా, ఏ కష్టమైనా నాతోనే పంచుకుంటుంది. ఏ శుభకార్యానికైనా నన్నే ముందు నిల్చోబెడుతుంది. మా అందరికంటే తను ఆర్థికంగా కాస్త ఉన్నత స్థితిలో ఉన్నా ఏమాత్రం అహమూ, కల్మషమూ లేని మా ఇంటి మందారం మా చెల్లి! ఐదేళ్ల కిందట.. రాత్రి పది గంటల సమయంలో హఠాత్తుగా నాకు సీరియస్ అయింది. నా భార్య సత్య వెంటనే చెల్లికి ఫోన్‌చేసి విషయం చెప్పగానే ఆగమేఘాల మీద వచ్చి విలవిల్లాడిపోయింది. తమ్ముడు ఆటో తీసుకొచ్చాడు. నన్ను వెంటనే అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యం చేయించారు. నేను హాస్పిటల్లో ఉన్న మూడు రోజులూ సత్యతో పాటు చెల్లి, అక్క, తమ్ముడు చేసిన సపర్యలు ఎప్పటికీ మర్చిపోలేను. 

ఏడాదిన్నర క్రితం నాన్న చనిపోయాడు. నాన్న దినకర్మలకు తమ్ముడూ, నేనూ డబ్బులు ఖర్చు పెడుతుంటే చెల్లి నా చేతిలో కొంతడబ్బు పెట్టి ‘‘ఇబ్బందిపడకుండా ఖర్చు పెట్టండన్నయ్యా’’ అంది. ‘‘ఆడపిల్లవు నువ్వెందుకమ్మా డబ్బులివ్వడం, మేం ఖర్చుపెడతాంలే’’ అనంటే చెల్లి వినలేదు. ‘‘ఏం.. ఎందుకు ఇవ్వకూడదు? ఆడపిల్లను అయినంత మాత్రాన నా తండ్రిపై నాకు బాధ్యత ఉండదా ఏమిటి? అయినా మీరు మాత్రం ఉన్నవాళ్లేమిటి? ఫర్వాలేదు.. ఖర్చు పెట్టండి. చాలకపోతే అడగండి. అప్పులు మాత్రం చెయ్యొద్దు’’ అంటూ మెత్తగా నచ్చజెప్పింది.

రాఖీ పౌర్ణమి వచ్చిందంటే ఎక్కడున్నా, ఎన్ని పనులున్నా మానుకొని మరీ వస్తారు అక్కా, చెల్లి. అక్క నెమ్మదస్తురాలు. మాటలు మితం, ప్రేమ అమితం. అన్నదమ్ముల మీద గుండెల నిండా ప్రేమ నింపుకొని, ఆప్యాయంగా రాఖీ కట్టి ఆశీర్వదిస్తుంది. మేం కానుక రూపంలో సంతోషంగా ఇచ్చే డబ్బులు తీసుకొని, తిరిగి మా పిల్లలకే పంచేస్తుంది. ఇక చెల్లి డబ్బులివ్వబోతే అస్సలు తీసుకోదు. ‘‘నేను డబ్బులు కోసం రాఖీ కడుతున్నానేమిటీ? నా అన్నదమ్ములు చల్లగా ఉండాలని రక్ష కడుతున్నాను’’ అంటుంది. మేం బలవంతం చేస్తే చివరకు ‘‘అయితే గాజులకు ఓ యాభై ఇవ్వండి. చాలు’’ అంటూ అంతే తీసుకుంటుంది. మా అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల మమతానురాగాల గురించి నాలుగు ముక్కల్లో చెబితే అయిపోయేది కాదు. పూర్తిగా రాస్తే ఓ కావ్యమే అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే వారే నా బలం, నా ధైర్యం!

- బొడ్డేడ బలరామస్వామి

వాళ్ల కళ్లకి చిన్నవాళ్లమే!
రాఖీ పండుగ వస్తోందంటే, చాలా ఆనందంగా ఉంటుంది. ఈ పండుగ అంటే చిన్నతనం నుంచి భలే ఇష్టం. నిజానికి నా చిన్నప్పుడు ఈ పండుగ గురించి అంత తెలియదు. అప్పట్లో మా ప్రాంతాల్లో జరుపుకునేవారు కాదు. కొంతకాలానికి మేము హైదరాబాద్ వచ్చాం, నాన్నగారి ట్రాన్స్‌ఫర్ మూలంగా. అప్పుడు బాగా తెలిసింది ఈ పండుగ గురించి. అది చాలా గమ్మత్తుగా జరిగింది. మా పెద్దమ్మ వాళ్లు ఎప్పటినుంచో హైదరాబాద్‌లోనే ఉండేవారు. రక్తసంబంధం ఉన్నా అప్పటివరకూ పెద్దగా చనువు లేదు పెద్దమ్మ పిల్లలతో. మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కాస్త దగ్గరతనం మొదలయింది. పెద్దమ్మకి నలుగురు మగపిల్లలు. పెద్దవాళ్ళిద్దరూ ఇంజనీర్లు. పెద్దన్నకి పెళ్లి కూడా అయింది. తర్వాత వాళ్ళు నాకంటే కొంచెం పెద్దవాళ్ళు. ఒక అక్క కూడా ఉంది. తనకి పెళ్లయి అమెరికాలో ఉంటుంది. ఉన్న ఒక్క చెల్లెలు అమెరికాలో ఉండటం వల్ల మమ్మల్నే సొంత చెల్లాయిలుగా చూస్తారు. రాఖీ పండుగకి సంబంధించిన మొదటి అనుభవం ఇప్పటికీ మర్చిపోలేనిది. అప్పుడు నేను ఇంటర్, చెల్లెలు పదో తరగతి చదువుతున్నాం. గమ్మత్తు ఏమిటంటే మా పెద్దమ్మ మా ఇద్దర్నీ వాళ్ళింటికి రమ్మనమని చిన్నన్నయ్యతో కబురు పంపించింది. దగ్గర్లోనే ఉన్న వాళ్ళింటికి ఇద్దరమూ వెళ్లాం. మా పెద్దమ్మ ఒక పళ్లెంలో రాఖీలు, కుంకుమ భరిణ, కొన్ని అక్షింతలు ఇచ్చి, మా ఇద్దర్నీ అన్నయ్యల చేతికి కట్టమంది. అంతే! ఇద్దరం హుషారుగా కట్టేశాం. కానుకలు ఇస్తారని మాత్రం తెలుసు. ఆ రోజు నుంచి ఇప్పటివరకూ మా ఆత్మీయబంధం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. అన్నయ్యల పిల్లల పెళ్లిళ్లయి మనవలు కూడా వచ్చేశారు. అయినప్పటికీ వాళ్ళ కళ్ళకి మేమెప్పుడూ చిన్నవాళ్ళమే. వాళ్ళ అభిమానం, ప్రేమ ఎప్పటికీ మరవలేనిది. అందుకే సొంత అన్నయ్యలు, తమ్ముళ్లు లేరనే భావనే లేదు మాకు. రాఖీ.. మాకెప్పటికీ ఇష్టమైన పండుగ.

- మణి వడ్లమాని

English Title
Yuvarajunavutanu ...
Related News