C/O కంచరపాలెం రివ్యూ

Updated By ManamFri, 09/07/2018 - 13:23
C/O Kancharapalem
C/O Kancharapalem

చేసే ప్ర‌య‌త్నంలో నిజాయ‌తీ.. చెప్పాల‌నుకున్న దాన్ని సూటిగా, హ‌త్తుకునేలా ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు దాన్ని రీచ్ ఎక్కువ‌గా ఉంటుంది. అందుకు ప‌రిస్థితులు కూడా కూడి వ‌స్తాయి. ఇప్ప‌డు `కేరాఫ్ కంచ‌ర‌పాలెం` సినిమా విష‌యంలో అదే జ‌రుగుతుది. ద‌ర్శ‌కుడు వెంక‌టేశ్ మ‌హా ఓ మెయిన్ పాయింట్‌ను బేస్ చేసుకుని చివ‌రి వ‌ర‌కు రివీల్ చేయ‌కుండా నాలుగు జంట‌ల క‌థ‌ను తెర‌పై ఆవిష్క‌రించిన ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం. ఇంత‌కు కంచ‌ర‌పాలెంలో వెంక‌టేశ్ మ‌హా ఏం చెప్పాడు? అత‌ను చెప్పాల‌నుకున్న విష‌య‌మేంటి? అనే సంగ‌తుల‌ను తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం. 
నటీనటులు: సుబ్బారావు, రాధా బెస్సి,కార్తీక్‌ రత్నం, ప్రణీత పట్నాయక్‌,  మోహన్‌ భగత్‌, ప్రవీణ పరుచూరి,  కేశవ కర్రి, నిత్యశ్రీ గోరు తదితరులు.
బ్యాన‌ర్‌: సురేశ్‌ ప్రొడక్షన్స్‌  
సమర్పణ: రానా దగ్గుబాటి 
నిర్మాత: విజయ ప్రవీణ పరుచూరి 
దర్శకత్వం: వెంకటేశ్‌ మహా 
సంగీతం: స్వీకర్‌ అగస్థి 
కూర్పు: రవితేజ 
ఛాయాగ్రహణం: వరుణ్‌ చపేకర్‌, ఆదిత్య జవ్వాది 

క‌థ:
గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస్‌లో అటెండ‌ర్‌గా ప‌నిచేసే రాజు(సుబ్బారావు)కి 49 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చినా పెళ్లి కాదు. అదే ఆపీస్‌లో పెద్ద ఆఫీస‌ర్‌గా వ‌చ్చిన 42 రాధ‌(రాధా బెస్సి)కి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డి ప్రేమ పుడుతుంది. అయితే అప్ప‌టికే రాధ‌కు ఇర‌వై యేళ్ల కూతురుంటుంది. త‌న కుటుంబం త‌న‌ను త‌ప్పుగా అనుకుంటుందేమోన‌ని, లోకం త‌న‌ను ఏమ‌నుకుంటుందోన‌ని రాజు ఆలోచ‌న‌లో ఉంటారు. 
ఏడ‌వ త‌ర‌గ‌తి చ‌దివే సుంద‌రం(కేశ‌వ కర్రి), త‌న క్లాస్ మేట్ సునీత‌(నిత్య‌శ్రీ గోరు)ని ఇష్ట‌ప‌డ‌తాడు. ముందు సుంద‌రంతో సునీత మాట్లాడ‌దు. సుంద‌రం తండ్రి బొమ్మ‌లు చేస్తుంటాడు. వినాయ‌క చ‌వితికి తండ్రి చేసి వినాయ‌కుడి బొమ్మ‌కు దండం పెట్టుకున్న రోజున సుంద‌రంతో సునీత మాట్లాడుతుంది. అయితే అనుకోని ప‌రిస్థితుల్లో సునీత ఊరు విడిచి పెట్టి వెళ్లిపోతుంది. అప్పుడు సుంద‌రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు. ఆ నిర్ణ‌యం అత‌ని జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? జోసెఫ్‌(కార్తీక్ ర‌త్నం) అనాథ‌, అమ్మోరు అనే వ్య‌క్తి చెప్పిన వాళ్ల‌ని కొడుతూ చిన్న చిత‌కా ప‌నులు చేస్తుంటాడు. ఓ గొడ‌వ‌లో భార్గ‌వితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. గొడ‌వ‌తో ప్రారంభ‌మైన ఇద్ద‌రి ప‌రిచ‌యం ప్రేమ‌కు దారి తీస్తుంది. మ‌రి వీరి ప్రేమకు అడ్డుప‌డే విష‌యాలేంటి? వైన్ షాప్‌లో ప‌నిచేసే గ‌డ్డం(మోహ‌న్ భ‌గ‌త్‌).. స‌లీమా అనే ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె వేశ్య అని తెలిసినా పెళ్లిచేసుకోవాల‌నుకుంటాడు. చివ‌ర‌కు వారి జీవితం ఎలాంటి మ‌లుపు తిరిగింది? నాలుగు జీవితాలకు మెయిన్ పాయింట్ ఏంటోతెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:
నటీనటుల విషయానికి వస్తే.. నాలుగు జంటల్లో రాజు, రాధ జోడికి ఎక్కువ మార్కులు వేయాల్సిందే. ముఖ్యంగా సినిమాలో సందర్భానుసారం వచ్చే కామెడీ అంతా రాజు పాత్ర కారణంగా వచ్చిందే. పెళ్లి కానీ రాజు పాత్రలో సుబ్బారావు .. భర్త చనిపోయి కూతురున్నా మళ్లీ పెళ్లి చేసుకోవాలనే తల్లి పాత్రలో రాధ బెస్సి.. వేశ్యను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే గడ్డం పాత్రలో మోహన్ భగత్.. ప్రేమించిన వాడి కోసం పరితపించే సలీమా పాత్రలో ప్రవీణ పరుచూరి, అనాథ అయిన జోసెఫ్ ప్రేమ కోసం బుద్ధిమంతుడిగా మారిపోతే.. ప్రేమించినా కులం కోసం ప్రేమను వదులుకునే బ్రాహ్మణ యువతి భార్గవిగా ప్రవీణ పట్నాయక్ చక్కగా నటించారు. వీరు తప్ప మరొకరు ఈ పాత్రలు చేయలేరనేంత చక్కగా నటించారు. వీరు నటన పరంగా సినిమాకు ఎంత ప్లస్ అయ్యారో అంతే మైనస్ కూడా ఉంది. ఆడియెన్ కొత్త ముఖాలను కనెక్ట్ చేసుకుని సినిమా చూడాలనుకోడు.. ఒకవేళ అలా అనుకోవాలంటే అందరూ కొత్తవాళ్లే కావడంత సినిమాకు సమయం పడుతుంది. ఇక దర్శకుడు వెంకటేశ్ మహా సినిమాను చక్కగా తెరకెక్కించాడు. ప్రతి పాత్రను, సన్నివేశాన్ని నేటివిటీకి దగ్గరగా చిత్రీకరించాడు.  వరుణ్ చపేకర్, ఆదిత్య జవ్వాది కెమెరా వర్క్ కారణంగా ప్రేక్షకుడు ఆ నేటివిటీని ఫీల్ అవుతాడు. స్వీకర్ అగస్థి సంగీతం, నేపథ్య సంగీతం మెచ్చుకునేలా ఉంది. ఇలాంటి క‌థ‌, క‌థనాన్ని న‌మ్మి సినిమాను నిర్మించిన నిర్మాత విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి, సినిమాను ప్రేక్ష‌కుల‌కు చేర‌వేయ‌డానికి ముందుకు వ‌చ్చిన సురేశ్ ప్రొడ‌క్షన్స్ అభినందనీయులు. సినిమాలో ద‌ర్శ‌కుడు చెప్పిన పాయింట్‌లో కొత్త‌దనం లేదు. అయితే తెర‌కెక్కించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. స్లో నెరేష‌న్ వంటివి మిన‌హా సినిమాను చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. 
కేరాఫ్ కంచ‌ర‌పాలెం... కాన్సెప్ట్ పాత‌దే.. అయితే ప్ర‌య‌త్న‌మే కొత్త‌ది
రేటింగ్: 3/5

English Title
C/O Kancharapalem review
Related News