విద్యావ్యాపారంలో టీచర్లూ సమిధలే

Updated By ManamTue, 09/11/2018 - 01:40
Teachers

Teachersప్రైవేటు బడుల్లో వెట్టి కూలీల్లా పనిచేస్తున్న టీచర్ల వ్యథ ఇది. దశాబ్దాల వ్యథార్థ జీవితాలు మెల్లగా రోడ్డెక్కుతు న్నాయి. గొంతులు సవరించుకుంటున్నాయి. అమానవీయ విద్యా వ్యాపారానికి ఒకపక్క రోజుకొక్క బిడ్డ రాలిపోతుంటే, మరో పక్క టీచర్లు జీతమంటే ఏమిటో, జీవన భద్రత అంటే ఏమి టో తెలీకుండా తాము శిథిలమవుతూ, అనివా ర్యంగా విద్యార్థుల్ని కూడా ఆ రొంపిలో వేధిస్తున్న ఈ పరిస్థితి మారాలని మంద్ర స్వరంలోనైనా ఇప్పుడు మాట్లాడుతు న్నారు. అనేక ప్రయత్నాలు చేసి ఓడిపోయి ఇన్నాళ్ళకు ఇప్పు డొక యూని యన్ పెట్టుకున్నారు. ఇది కూడా ఎన్నాళ్ళు ఉండనిస్తారో తెలీదు కానీ కిందా, మీదా పడుతూ, చిన్నా చితకా సహకారాలు తప్ప పెద్దగా ఎవరి దన్ను లేకపోయినా ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాకు దిగారు. వీరిని సంఘటితం కాకుండా చేయడానికి ప్రైవేట్ స్కూల్ యజమానులు చకచకా కదులుతున్నారు చాలామందికి తెలిసే ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ టీచ ర్లకు రోజు కూలీ కూడా గిట్టదు. ఉదయం ఆరుగంటల నుం డే క్లాసులు మొదలు. రాత్రి తొమ్మిది గంటల దాకా చాకిరీ. ఇదికాక రోజూ పరీక్షలు, ఆన్సర్ పేపర్ల వాల్యుయేషన్. ఎప్పు డో తప్ప సెలవులుండవు. ఆదివారం పదో తరగతికి స్పెషల్ క్లాసెస్, స్టడీ అవర్స్. ఎప్పుడన్నా లీవడిగితే తమ శరీరంలో భాగాన్ని కోసిమ్మన్నట్లు మేనేజిమెంట్ విలవిల్లాడి పోతుంది. బడులు చూస్తే ఇరుకిరికు గదుల్లో పిల్లలను కిక్కిరిసి పడేసే కోళ్లఫారాలు. మైదానం ఉండదు, చెట్లు ఉండవు, గాలి చొర బడదు, వెలుతురు కూడా తక్కువే. ప్రైవేట్ స్కూళ్లొచ్చాక ఆటలు, వ్యాయామం అనేవి ఉంటాయని కూడా విద్యా ర్థులు, తల్లిదండ్రలు ఎప్పుడో మర్చిపోయారు. చూపుడుకు ఒక పీఈటీ టీచర్ ఉంటారు గాని ఆయనకు ఉండేది పిల్లలు అల్లరి చేస్తే అదుపులో పెట్టే పోలీసు పనే. ఇది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. కార్పొరేట్ విద్యాసంస్థల్లో, హాస్టళ్లలో ఈ హింస 24 గంటలూ ఉంటుంది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వందల సంఖ్యలో పిల్లలు చనిపోతున్నా ప్రభుత్వాలకు సిగ్గు లేదు, బాధ్యత అంతకన్నా లేదు. 

ఈ విద్యాసంస్థ మౌలిక సౌకర్యాల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. మామూలుగా పత్రికలన్నీ ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు లేవు అని రాస్తుంటాయి. నిజానికి ప్రైవేటు బడులు అధ్వానంగా ఉన్నాయి. విద్యార్థులకే కాదు, టీచర్లు ప్రశాంతంగా కూర్చోడానికి కూడా సరైన గదులు ఉండవు. మహిళా టీచర్లకు టాయిలెట్లు కూడా సరిగా ఉండవు. స్టాఫ్ రూంలో నలుగురూ కలిసే పరిస్థితి ఉండదు. చాలా చోట్ల అసలు స్టాఫ్ రూమే ఉండదు. రోజంతా నిలబడీ నిల బడీ ముప్పై ఐదేళ్లకే మడిమ నొప్పులొచ్చి, మోకాళ్ళ చిప్పలు అరిగిపోయే పరిస్థితి. కాలేజీల విషయానికొస్తే ఏప్రిల్, మే నెలల్లో క్లాసులుండవు కాబట్టి స్టాఫ్ రానక్కర్లేదు. అంటే ఆ రెండు నెలలూ జీతాలుండవు. లేదా ఆ రెండు నెలలూ ఊర్లు తిరిగి పిల్లల్ని తమ స్కూళ్ళలో చేర్పించమని ప్రచారం చేయాలి. ఇటీవలి కాలంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేసే టీచర్లు తప్పనిసరిగా కొంతమంది విద్యార్థులనైనా చేర్పిస్తేనే ఉద్యోగాలుంటాయని ఆర్డర్లు వేస్తున్నారు. ‘మీకు అన్నం పెట్టే సంస్థను మీరే కాపాడుకోవాలి, లాభాలు తెచ్చిపెడితేనే మీకు జీతాలివ్వగలం’ అంటున్నారు. నోరెత్తితే బైట నిరుద్యోగులు చాలామంది వెయిటింగ్, నువ్వు వెళ్లిపోవచ్చు. 

చాలామంది టీచర్లు ఏకకాలంలో రెండు మూడు స్కూళ్ల లో పనిచేస్తారు. స్కూల్ యాజమాన్యాలకు ఏదో పద్ధతిలో క్లాసులు జరిగితే సరి. ఫుల్ టైం పేమెంట్ కన్నా ఇలా పార్ట్ టైం వాళ్ళతో నడిపిస్తే సరిపోతుంది అనుకుంటారు. ఒకే స్కూల్లో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా చేయడం కన్నా వేరు వేరు స్కూళ్ళలో గంటల చొప్పున ఒప్పుకుంటే కొంతైనా డబ్బులొస్తాయి. కానీ ఊర్లో నాలుగు మూలల ఉండే నాలు గు స్కూళ్ళకు రోజంతా పరుగులు తీయాలి. గడియారం ముల్లు జీవితం. ఇంత మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంది. ప్రైవేట్ స్కూల్ టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వరు. సర్టి ఫికెట్లు చూపిస్తే పనిలో పెట్టుకుంటారు. ఇచ్చినంత తీసుకొని నచ్చినట్లు పనిచేస్తే ఉంచుకుంటారు. లేదంటే వద్దు పొమ్మం టారు. ఇక ఇంక్రిమెంట్లు, పిఎఫ్ అంటే అవేమిటి అని అడిగే పరిస్థితి.

ఈ విద్యా వ్యాపారస్తులంతా ఎప్పుడో యూనియన్ పెట్టే సు కున్నారు. దానిపేరు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్. ఇది ప్రభుత్వ అధికారులతో లాబీలు చేయడానికి, విద్యార్థి సం ఘాలను ఎదుర్కోడానికీ, ఒకరి దోపిడీకి ఒకరు సహకరిం చుకోడానికి ఒక ఏర్పాటు. వీరిలో వీరికి ఎన్ని వైరుధ్యాలున్నా, ఒకరికొకరికి శత్రుపూరిత పోటీ ఉన్నా ఉమ్మడి ప్రయో జనం కోసం అసోసియేషన్‌గా కలుస్తారు. ఇప్పుడుండేది కార్మిక సంఘాలు కాదు. అన్నిచోట్లా యజమానుల సంఘా లు, పెట్టుబడిదారుల సంఘాలే. శ్రమదోపిడికి గురయ్యే కార్మికుల మధ్య వైరుధ్యాలను, పోటీని, ఈర్షా ద్వేషాలను పెంచిపోసిస్తూ యజమానులు మాత్రం ఎవరికే ఇబ్బంది వచ్చినా ఐక్యంగా ఉంటారు. ప్రైవేట్ స్కూళ్లలో ఇదే జరు గుతోంది. (స్కూళ్ళు అన్నప్పుడల్లా కాలేజీలు అని కూడా చదువుకోండి) ప్రభుత్వ యంత్రాంగానికి ప్రైవేట్ విద్యాసంస్థల మీద నియంత్రణ ఏమాత్రం లేదు. ఒకవేళ పొరపాటున ఏ అధికారైనా రూల్స్ ఫాలో కమ్మంటే ‘మేం స్కూళ్ళు నడిపేదెట్లా’ అని విచిత్రంగా అడుగుతారు. రిజిస్టర్ దగ్గరి నుంచి పరీ క్షలు, రిజల్ట్స్ దాకా అడుగడునా మోసాలే. ఒక ఫ్రాడ్ విద్యా వ్యవస్థ పునాది మీద చదువులు నేర్చుకునే విద్యార్థులు ఎటు వంటి పౌరులుగా తయారవుతారోనన్న కనీస పట్టింపు ప్రభు త్వానికి ఉండదు. ఇక టీచర్లు తమ బాధను  ఎవరికి చెప్పా లి, ఏమని చెప్పాలి? చెప్పుకుంటే ఉన్న ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి.  

ఈ స్థితి భరించీ భరించీ చివరికి ఒక యూనియన్ పెట్టు కోగానే సభ్యులను స్కూల్ యాజమాన్యాలు బెదిరించడం మొదలుపెట్టాయి. యజమానులకు సంఘం ఉండొచ్చు గాని కార్మికులకు ఉండకూడదట. ఇక్కడ టీచర్లు కార్మికులే. చాక్ పీస్ దుమ్ముతో సావాసం చేస్తూ, అరిచీ అరిచీ గొంతులు అరిగిపోయేలా, గంటల తరబడి నిల్చొని చాకిరీ చేసే కార్మి కులు. ఒక వర్గంగా సంఘటితం కాలేని కార్మికులు. సహజం గానే సంఘటితమయ్యే ప్రయత్నం చేస్తుంటే ప్రైవేట్ స్కూల్ యజమానుల అసోసియేషన్ టీచర్స్ యూనియన్ నాయకు లను టార్గెట్ చేసింది. ఎవరైనా పొరపాటున కాస్త మంచి కరస్పాండెంట్లు వీళ్ళను ఉద్యోగంలో ఉంచుకుంటే అసోసియే షన్ వాళ్ళ మీద ఒత్తిడి తెస్తోంది. ఇలాంటి ఎన్నో సవాళ్ళ మ ద్య టీచర్లు రాష్ట్రవ్యాప్త ధర్నాలకు సిద్ధమయ్యారు. ప్రైవేట్ విద్యాసంస్థలు కనీస నిబంధనల పాటించాలని వీళ్లు డిమాం డ్ చేస్తున్నారు. ప్రధానంగా జి.వో. ఎం.ఎస్. నెం.1 అమల య్యేలా చూడాలని అడుగుతున్నారు. స్కూలు ఆదాయంలో 50 శాతం ఉపాధ్యాయిలకు జీతాలుగా చెల్లించడం, 15 శాతం ప్రావిడెండ్ ఫండ్, భీమా వంటి సౌకర్యాలకు కేటా యించడంతో పాటు ఈ జీవో ఒక స్కూలుకు ఉండవలసిన మౌలిక సదుపాయాల గురించి చెప్తుంది. తక్షణంగా వీళ్లు కోరుకునేది ఆదివారాలు, రెండో శనివారాలు సెలవు ఇవ్వా లని, అధిక పనిగంటలు నియంత్రించాలని. అట్లాగే టీచర్లకు ఉద్యోగ భద్రత పి.ఎఫ్, ఈ.ఎస్.ఐ సదుపాయాలు కల్పించా లని అడుగుతున్నారు.

ప్రైవేట్ టీచర్ల, లెక్చరర్ల యూనియన్‌పై ఉక్రోషం పట్ట లేక ఒక ఊర్లో (ప్రొద్దుటూరు) ప్రైవేట్ స్కూల్ యాజమా న్యాలు నిరసన ర్యాలీ తీశాయి. అది కూడా యూనియన్ ధర్నా చేస్తున్న సమయంలోనే. పైకి వీళ్ళ నిరసన బందులకు వ్యతిరేకంగానని చెప్పారు. ఉద్దేశం మాత్రం తమ టీచర్లు యూనియన్ తరపున జరుగుతున్న ధర్నాకి వెళ్లకుండా చేయ డం. బందుల వల్ల క్లాసులు నష్టపోయి సిలబస్ పూర్తి చేయ డానికి ఇబ్బందులు పడుతున్నామని, పైగా సెలవులు కూడా ఎక్కువగా ఉన్నాయని, విద్యార్థులు, రాజకీయ పార్టీలకు తో డు ఇప్పుడు టీచర్లు కూడా యూనియన్లు, బందులంటే విద్యార్థులు నష్టపోతారని మాట్లాతున్నారు. ఈ ర్యాలీకి తమ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లను తరలించారు. దాదాపు అంద రూ మహిళా టీచర్లు. దుర్భరమైన శ్రమదోపిడికి గురవుతున్న వాళ్ళు బందులు వద్దని ప్లకార్డులు పట్టుకున్నారు. వీళ్లను చూస్తే మా రక్తం ఇంకా ఇంకా పీల్చండి అని పీక్కుపోయిన ముఖాలతో మధ్యాహ్నపు ఎండలో నాలుగు రోడ్ల కూడలి వ ద్ద నిలబడినట్లుంది. ఈ యాజమాన్యాలు ప్రభుత్వం మమ్మ ల్ని కాదని ఎక్కడికి పోతదనే ధైర్యంతో ఇట్లా కూడా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

మనకు ఎన్నో ఏళ్ల నుంచి ఉపాధ్యాయ సంఘాలున్నా యి. భద్రత జీవితాలు గడుపుతున్న ప్రభుత్వ టీచర్లే ఇం దులో ఉంటారు. నిజానికి ఇప్పుడు విద్యారంగంలో సంఖ్య రీత్యా చూసినా, ప్రయివేట్ సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయిలే కీలకం. కనీసం అభ్యుదయ ఉపాధ్యాయ సంఘాలైనా ప్రైవేట్ టీచర్ల దారుణమైన స్థితిగతుల్ని చూడాలి. వీరిని ఉపాధ్యా య ఉద్యమంలో భాగం చేసుకొని కొత్త పంథాలో పోరాటా లు నడపాల్సిన అవసరం ఇవాళ ఉంది. విద్యావ్యవస్థ ఇప్పటికే సర్వనాశనమై పోయిందని గుర్తించి, సరిదిద్దే బాధ్యత ఉపాధ్యాయ సంఘాల మీద ఉంది. విద్యార్థి సంఘాలు ప్రైవేట్ టీచర్ల పోరాటానికి మద్దతు తెలపడం మాత్రమే కాదు, వీళ్ళతో కలిసి పోరాడాల్సి ఉంది. పిల్లల మీద పెరిగిపోతున్న ఒత్తిడి, ఆత్మహత్యలు, సారం లేని చదువులు వీటితో ముడి పడి ఉన్నదే ఈ పోరాటం కూడా. ఈ తరాన్ని, భవిష్యత్ తరాలకు కాపాడుకోవాలంటే పరమ అనైతికమైన విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా అందరం పోరాడాలి.
పి.వరలక్ష్మి
8179912123 

Tags
English Title
Teachers are equally educational in education
Related News