ఇది మాటలకందని ప్రమాదం..

Updated By ManamTue, 09/11/2018 - 18:32
PM Narendra modi, Kondagattu, Bus accident, shocking beyond words 

PM Narendra modi, Kondagattu, Bus accident, shocking beyond words న్యూఢిల్లీ: తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద మంగళవారం జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు చనిపోవడం తననెంతో బాధ కలిగిస్తోందని అన్నారు. ఇది మాటలకందని ప్రమాదమని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఆర్టీసీ చరిత్రలోనే పెద్దప్రమాదమైన ఈ ఘటనపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. 

ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి, టీఎస్ఆర్టీసీ అధికారులను వెంటనే తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆర్టీసీ తరపున 3 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించినట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల బస్సు డిపో హనుమంతురావును సస్పెండ్ వేటు పడింది. కాగా, కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో 50మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. 

English Title
Kondagattu bus accident is shocking beyond words, says PM Narendra modi
Related News