భావం చెడకూడదు

Updated By ManamSat, 12/16/2017 - 08:19
​​​​భావం చెడకూడదు

భావం చెడకూడదుఅనువాదం అనేది ఒక తీరం నుంచి మరొక తీరానికి చేసే సముద్రయానం వంటిది. ఒక భాష నుంచి మరొక భాషలోకి చేసే అనువాదం ప్రతిసారి నూటికి నూరుపాళ్ళు యధాతథంగా ఉంటుందని ఆశించడం కొంచెం కష్టమే. ఎందుకంటే, అనువాద ప్రక్రియలో మూలభాష, సామాజిక సంస్కృతుల పరంగా కొన్ని అధిగమించలేని అడ్డంకులు ఉంటాయి. అయినప్పటికీ అనువాదకులు మాతృకకు, మాతృకలోని భావవ్యక్తీకరణకు ఎలాంటి అన్యాయం జరగకుండా జాగ్రత్త పడుతూనే ఉంటారు.

           తెలుగు నుంచి హిందీలోకి అనువదించేటపుడు ఎక్కువ సమస్యలు రావు. కానీ మొదటి నుంచి నాకు గ్రామీణ వాతావరణం పరిచయం లేకపోవడం వల్ల వాగులు, వంకలు, నాట్లు లాంటి ఎన్నో పదాలకి సమానార్ధకాలైన హిందీ పదాలు తెలిసేవి కావు. గ్రామీణ జీవనానికి సంబంధించిన కొన్ని తెలుగు పదాలకు కూడా నాకు అర్థాలు తెలిసేవి కావు. ‘పోడు చెయ్యటం’, ‘పొక్కిలి’, ‘దమ్ము చేయడం’, ఇంకా ఇలాంటి మరికొన్ని పదాలకి అర్థాల్ని ఆయా మూలరచయితల్ని అడిగి, తెలుసుకుని అనువాదించేదాన్ని. డాక్టర్ ఎన్.గోపి, కె.శివారెడ్డి వంటి గొప్పకవులు సహృదయంతో మా ఇంటికి వచ్చి, నాతోపాటు కూర్చుని, నా సందేహాలన్నింటినీ ఓపిగ్గా తీర్చేవారు. ఇక హిందీ పదాలకు అర్థాల కోసం ఢిల్లీలో ఉన్న నా మిత్రుల్ని, ప్రొఫెసర్లని, రచయితలని అడిగి తెలుసుకునే దాన్ని. ఒక్క పదానికైనా సరే, సరైన అర్థం దొరికే దాకా నా పని ముందుకు సాగదు. నేను ఇష్టంగా చేసిన అనువాదాలలో పెద్దింటి అశోక్ కుమార్ కథలు కూడా ఉన్నాయి. మొదటిసారి ఆయన కథల్ని అనువదించినప్పుడు దాదాపు పది, పదిహేను మాటలకి అర్థాలు తెలియలేదు. నాకు తెలంగాణ మాండలికంతో మొట్టమొదటిసారి పరిచయం కలిగింది అశోక్‌కుమార్ రచనల వల్లే. ఆయా పదాలన్నింటికీ అర్థాల్ని, అవసరమైన చోట వివరణల్ని ఆయన రాసి పంపించారు. అశోక్ కుమార్ కథల్ని ఇంతవరకు 25 దాకా అనువదించి ఉంటాను. ఇప్పుడు తెలంగాణ మాండలికం నాకు కొంతమేరకు పట్టుపడినట్టేనని అనుకుంటున్నాను. 

         mytry2నలభై ఏళ్ళకు పైగా అనువాదరంగంలో కృషి చేస్తున్నాను. దాదాపు 75 పుస్తకాలు ప్రచురితైమయ్యాయి. నేను తెలుగు-హిందీ భాషల్లో అనువాదాలు ఎక్కువగా చేశాను. ఆంగ్లం నుంచి తెలుగు లోకి చాలా పుస్తకాల్ని అనువదించాను. హిందీభాషలో ప్రాణం లేని వస్తువులకు కూడా స్త్రీలింగం, పుల్లింగం ఉంటాయి. ఇది తెలుగులో లేదు. మన భాషలో ప్రాణం లేని వస్తువులన్నీ నపుంసక లింగాలు.  కానీ క్రియాపదం వాడుకలో స్త్రీలింగంగానే ఉంటుంది- ఉదాహరణకు కుర్చీ, బల్ల, అన్నం, ఆకాశం మొదలైనవి. కానీ హిందీలో కుర్చీ, బల్ల స్త్రీలింగం; అన్నం, ఆకాశం పుల్లింగం. ఒకే అర్థమున్న పదానికి రెండు రూపాలుంటే, ఒకటి స్త్రీ, మరొకటి పుల్లింగం అయే ఉదాహరణలు కూడా ఉన్నాయి. (సాంస్) స్త్రీ, శ్వాస్ (పుం); ఛాయా (స్త్రీ), సాయా (పుం). హిందీలో జంతువులకు కూడా స్త్రీలింగం, పుల్లింగం వాడతారు. తెలుగులో కుక్క, పిల్లి, పశువు లాంటి వాటికి స్త్రీ లింగమే వాడతాం. అవి ఆడైనా, మగైనా తేడా ఉండదు. కానీ హిందీలో ‘కుత్తా ఆయా’, ‘కుతియా ఆయీ’ అనాలి. ప్రేమ్‌చంద్ రాసిన ‘కుత్తా’ అనే పెద్దకథలో ఆయన దానికి పుల్లింగం వాడినా, నేను స్త్రీలింగమే వాడాను- మనం ‘కుక్క వచ్చాడు’ అని అనం కదా. ఇలాంటి విషయాలలో అనువాదకులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. హిందీలో భాయీ, బహన్, మౌసీ లాంటి పదాలు వచ్చినపుడు అనువాదకులు సందర్భాన్ని బట్టి అనువదించాలి. భాయీ, బహన్ అంటే అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు ఏమైనా కావచ్చు. తెలుగులో ‘తాత’ అంటే తల్లికి తండ్రి లేదా తండ్రికి తండ్రి అవచ్చు కదా. కానీ హిందీలో ఈ బంధుత్వాలకు వేర్వేరు మాటలున్నాయి. తెలుగులో లేవు. ఈ మధ్య ఆంగ్లం నుంచి అనువాదం చేసేటపుడు కూడా ఇదే సమస్య ఎదురైంది. కథ దాదాపు పూర్తిగా చదివేదాకా గ్రాండ్‌మదర్ అంటే అమ్మమ్మో, నానమ్మో తెలియలేదు. 

            ఆంగ్లం నుంచి కూడా తెలుగులోకి 25 పుస్తకాల్ని అనువదించాను. హిందీ కన్నా ఆంగ్లం నుంచి అనువదించడం కష్టం. ముఖ్యంగా పేర్లు ఇంగ్లీష్ వాళ్ళవి కాకుండా రష్యన్, జర్మన్, ఆఫ్రికన్ అయినపుడు ఇంటర్నెట్ సాయంతో వాటి ఉచ్ఛారణను అనుసరించి తెలుగులోకి రాయవలసి వస్తుంది. మరో సమస్య సాంస్కృతిక పరమైంది. దానికి కూడా కొంత హోమ్‌వర్క్ చేయాల్సి వుంటుంది. వాళ్ళు తొడుక్కునే బట్టలు (ట్యూనిక్ వంటివి), తినే పదార్థాలు (సాసేజ్, బర్గర్ వంటివి), కొన్ని రకాల మొక్కలు, పువ్వులు (లైలాక్)కి తెలుగు పదాలు దొరకవు. అనువాదం అన్నది రెండువైపులా పదును ఉన్న కత్తిలాంటిది. ఇటు మూల భాషకి, అటు లక్ష్యభాషకి న్యాయం జరిగేలా పని సాగాలి.

ఆర్. శాంతసుందరి
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత

English Title
don't change meaning
Related News