sunday special

సమయం అమూల్యం మిత్రమా..

Updated By ManamSun, 09/02/2018 - 04:55

మీ అమూల్యమైన సమయాన్ని అనవసర విషయాలపై వృథా చేస్తున్నారా? అంతూ పొంతూ లేని పనులతో రోజంతా బిజీగా గడుపుతున్నారా? ‘ఇంకాస్త సమయముంటే ఇంకా బాగుండేది?’ అని సమయం కోసం పరితపిస్తున్నారా?.. ఈ ప్రశ్నలకు మీ సమాధానం ‘అవును’ అయితే, మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదని అర్థం. పెద్దగా ప్రయోజనం లేని పనులకు ప్రాధాన్యం ఇస్తూ, ముఖ్యమైన, ప్రయోజనకరమైన పనుల్ని అశ్రద్ధ చేస్తున్నారని అర్థం. అలాంటి అప్రాధాన్య పనులే మన అమూల్యమైన సమయూన్ని హరించి వేస్తుంటాయనే విషయంలో మేల్కోవాల్సిన సమయం వచ్చేసింది.
 

image

తరచూ ఈమెయిళ్లు చెక్ చేసుకోవడం, ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ సైట్లలో గడపడం, ఏదైనా మీటింగ్‌కు హాజరవడం.. ప్రయోజనకరమైన పనిగా ఆ క్షణం అనిపించవచ్చు. కానీ రాత్రి పడుకొనే ముందు ఆలోచించుకుంటే ఇలాంటి పనుల వల్ల మనం నిజంగా ఏం సాధించామో తెలుస్తుంది. మన సమయాన్ని హరించే అల్పమైన పనుల్ని పూర్తిగా మానేసి, లేదా తగ్గించుకొని, అందుబాటులో ఉన్న సమయాన్ని మన అభివృద్ధికి తోడ్పడే మంచి ఫలితాలనిచ్చే ముఖ్యమైన పనులకు కేటారుయించుకొనే వీలుంది. అది ఎలానో తెలుసుకుందాం. అయితే, అంతకంటే ముందు ఉపయోగంలేని పనులకు ఎక్కువ టైమ్ కేటారుయిస్తే ఏమవుతుందో తెలుసుకోవాలి కదా..!

వాయిదా వేసే తత్వం
ఒక పనిని ఆలస్యం చేయుడం లేదా రేపటికి వాయిదా వేయడం కచ్చితంగా విజయసాధకుల లక్షణం ఏమాత్రం కాదు. నిజం చెప్పాలంటే, మనందరం ఏదో ఒక సందర్భంలో పనుల్ని వారు వాయిదాలు వేసినవాళ్లమే. అంటే పనుల్ని వేగంగా పూర్తి చేయకుండా సాగతీసిన వాళ్లమేనన్న మాట. కొంతమంది ప్రతి పనినీ సాగతీస్తూ ఆలస్యం చేస్తుంటారు. అది వాళ్లకున్న సమస్యగానే పరిగణించాలి. ఇలాంటివాళ్లు మన సహోద్యోగుల్లో, స్నేహితుల్లో కచ్చితంగా ఉంటారు. వాళ్లు తమకు అప్పగించిన పని చేయకపోగా, ఆ పని ఎందుకు చేయలేకపోయామో చెప్పడానికి సాకులు, కారణాలు వెతుకుతుంటారు. 

imageతరచూ ఫేస్‌బుక్, వాట్సప్ చెక్ చేసుకోవడం అంటే మన మిగతా పనుల్ని వాయిదా వేస్తున్నట్లుగా అనిపించకపోవచ్చు. మనమే కాదు, అందరూ అలాగే భావిస్తుంటారు. ఆ పని చేస్తున్నప్పుడు చాలా ముఖ్యమైన పనిచేస్తున్న ఫీలింగ్‌తో ఉంటాం. నిజానికి, దాని వల్ల ప్రత్యేకించి మనకెలాంటి ప్రయోజనం ఉండదు. కొంతమంది సమాజాన్ని మార్చేయాలనే కసితో ఏవేవో పోస్టులు పెడుతుంటారు. దానికి అనుకూలంగా కొంతమందీ, వ్యతిరేకంగా కొంతమందీ స్పందిస్తుంటారు. ఆ వాదనకు అంతు ఉండదు. ఫలితం ఆ స్పందనలు చూడ్డానికీ, వాటికి జవాబివ్వడానికీ ఎంత సమయుం ఖర్చవుతుందో పట్టించుకోరు. అంతిమంగా ఆ చర్చ వల్ల సాధించేదేమీ కనిపించకపోగా, లేనిపోని స్పర్థలు పెంచుకున్నవాళ్లవుతారు. ఇలా మన దృష్టినీ, మన శక్తినీ అప్రధానమైన పనులపై పెట్టడం కూడా అసలైన పనుల్ని వాయిదా వేయడం లాంటిదేననే విషయం తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. నిజాయితీగా ఆలోచిస్తే, ముఖ్యమైన పెద్ద పనులు, ప్రాజెక్టులపై పనిచేయడం కంటే మెయిన్‌టెనెన్స్ పనులు మనకు చాలా ఈజీగా అనిపిస్తారుయి. అందుకే వాటినే ముందుగా చేయీలనుకుంటాం. దాని వల్ల ముఖ్యమైన పనిలోకి వెళ్లకుండా అందుబాటులో ఉన్న మన మెుత్తం సమయాన్ని సోషల్ సైట్‌లో గడపడమనే అప్రాధాన్య పనికే వెచ్చించేస్తాం.

ఇలా ఎందుకని?
మన మెదడులో భావోద్వేగాల్ని నియుంత్రించే నరాల వ్యవస్థ ఉంటుంది. సహజంగానే ఇది క్లిష్టమైన, ఛాలెంజింగ్‌గా అనిపించే పనుల నుంచి మనల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో తక్కువ ప్రభావం కలిగిన సులువైన పనులవైపు ఆకర్షించేలా చేస్తుంది. పైగా ఆ టైమ్‌లో అవే ఎంతో ప్రయోజనకరమైన పనుల్లాగా మనకనిపించేట్లు చేస్తుంది కూడా. గమనిస్తే, వాటిని చేస్తున్నప్పుడు మనం చాలా చురుగ్గా ఉన్నట్లు ఫీలవుతుంటాం. అయితే ఇలాంటి పనుల్లో ఎంత బిజీగా గడిపినా, వాటివల్ల ఇసుమంత ఉపయోగం కూడా ఉండదు.
సాధారణంగా ఆదివారం సాయుంత్రం కుటుంబంతోనో, స్నేహితులతోనో సరదాగా గడుపుతాం. ఇంటికొచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకోకుండా స్మార్ట్ ఫోన్‌తోనో, లాప్‌టాప్‌తోనో గడుపుతూ, సోషల్ మీడియూలో చక్కర్లు కొడుతూ రాత్రి చాలా ఆలస్యంగా పడుకుంటున్నాం. దానివల్ల సోమవారం ఉదయుం అలసటగా అనిపిస్తుంది. అయినా అలాగే ఆఫీసుకు వస్తాం. ఒక మంచి స్ర్టాంగ్ టీనో, కాఫీనో తాగి, మన డెస్క్ దగ్గరకు వెళ్లి, కంప్యూటర్‌కు లాగిన్ అయిన, మన పని ప్రారంభిస్తాం. మన పనుల్ని ప్రాముఖ్యాన్ని బట్టి ఒక క్రమంలో పెట్టుకోకుండా, సరైన ప్లానింగ్ లేకుండా ప్రారంభించడం వల్ల మిగతావాళ్లకు మల్లే మనం పని పూర్తిచేయులేకపోతాం.

చాలామంది తమకు తెలీకుండానే ఈ ఉచ్చులో పడుతుంటారు. దీని కారణంగా, ఎన్నో అప్రధానమైన పనుల్ని పూర్తిచేసి కానీ, ముఖ్యమైన పనుల్లోకి వెళ్లడం లేదు మనం. ఒక ఉదాహరణ చూద్దాం.. ఆఫీసుకు రాగానే మనం ఎన్నిసార్లు మన ఈమెయిల్స్ చెక్ చేస్తూ లేదా ఫేస్‌బుక్ కానీ, వాట్సప్ కానీ చూస్తూ, ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తూ గడిపివుంటాం? కచ్చితంగా చాలా సార్లే చేసుంటాం కదా! రోజువారీ పనిలోకి వెళ్లే ముందు ఇలాంటి తేలిక పనులకు కొంచెం సమయుం వెచ్చిస్తే మరింత ఉత్సాహంగా పని చేసుకోగలుగుతామని అనుకుంటాం. కానీ చాలా సందర్భాల్లో వీటి వల్ల ఒక గంట లేదా రెండు గంటల మన అమూల్యమైన సమయాన్ని కోల్పోవడం జరుగుతుంది తప్పితే నిజంగా మనం సాధించేదేమీ ఉండదు. చాలా సార్లు, ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేయడం, వాళ్ల కామెంట్స్ చెక్ చేయడం పూర్తఅవగానే బాస్ నుంచో, సహోద్యోగుల నుంచో మీటింగ్‌కు అటెండ్ అవమని పిలుపొస్తుంది. ఆ మీటింగ్ అయిపోవచ్చేటప్పటికి ఆ రోజు మనం చేయూల్సిన పనిని రేపటికి వాయిదా వేయూల్సి వస్తుంది. ఫలితంగా డెడ్‌లైన్ లోపు ఆ పని పూర్తి చేయడం తలకు మించిన భారంగా, ఒత్తిడిగా అనిపిస్తుంది. కేవలం ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులే కాదు, ఏ రంగంలోని వ్యక్తులకైనా ఇదే వర్తిస్తుంది.

ఉపయోగంలేని సమావేశాలు
సాధారణంగా ఒక సంస్థలో విషయాన్ని తెలియజేయడానికీ, చర్చించడానికీ, సమస్యల్ని పరిష్కరించడానికీ imageసమావేశాలు నిర్వహిస్తుంటారు. కానీ చాలా సందర్భాల్లో, ఈ సమావేశాల వల్ల మన సమయం, ఎదుటివాళ్ల సమయం వృథా అవుతుంటుంది. కొన్ని మీటింగ్స్ ముఖ్యమైనవైనా, సగటు ఉద్యోగి వాటిలో పాల్గొని విలువైన చాలా సమయాన్ని కోల్పోతుంటాడు. కార్యాలయ సిబ్బంది సగటున 37 శాతం సమయాన్ని సమావేశాల్లోనే గడుపుతారంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ.. ఇది అధ్యయనాలు చెబుతున్న నిజం! అంతేకాదు, సీనియర్ ఆఫీసర్లలో 28 శాతం మంది ఈ సమావేశాల వల్ల తమ సమయం వృథా అవుతున్నదని స్పష్టం చేస్తున్నారు. అదే సాధారణ ఉద్యోగులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ శాతం 50 దాటుతుందని అంచనా వేయవచ్చు. మంచి ఫలితాల్ని సమకూర్చే ప్రాజెక్టుల్లో పనిచేసేవాళ్లెవరూ ఇలాంటి అనుత్పాదక సమావేశాలు నిర్వహించరు. ఎందుకంటే ఈ సమావేశాలు మనం సమయంలోని అధిక భాగాన్ని మింగేస్తాయే తప్ప, వీటి వల్ల మనం చేసే పనులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.

అలా అయితే వెనకబడతాం
imageజీవితంలో ప్రతి అంశానికీ పరిణామాలు ఉంటాయి. మనం ఒక పనిని ఏవిధంగా నిర్వర్తిస్తున్నామనేది కూడా ఇందులో భాగమే. అనవసరమైన పనుల మీద ఎక్కువ సమయం వెచ్చిస్తే, గొప్ప ఫలితాల్ని చూడలేరు. పైగా దానివల్ల, మన ఉత్పాదకత ఎదుగూ బొదుగూ లేకుండా ఉన్నచోట ఉన్నట్లే నిలిచిపోతుంది. ఎవరైనా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయారంటే కారణం, వాళ్లు ఉపయోగం లేని పనులు చేయడానికి ఎక్కువ సమయం వెచ్చించడం వల్లే అనేది స్పష్టం. ఇక్కడ విచారకరమైన విషయమేమంటే, తక్కువ స్థాయి ప్రదర్శన కారణంగా మనం మన సహచరులు లేదా సహోద్యోగుల కంటే వెనకబడిపోతాం. మరైతే ఏం చేసి, ఈ సమస్యను పరిష్కరించుకోవాలి?

ఏం చెయ్యాలంటే..
మెుదటగా, మన ఉద్యోగం ఎలాంటిదైనా, ప్రయత్నిస్తే తప్పకుండా మన సమయాన్ని వృథాచేసే తక్కువ ప్రభావం కలిగిన పనుల నుంచి తప్పించుకోవాలి. అంటే మన వృత్తి నిర్వహణలో రకరకాల సహాయక పనులు ఎదురవుతుంటాయి. వాటిని వేరొకరికి అప్పగించవచ్చు, లేదంటే వాటిని పూర్తిగా మన బాధ్యతల నుంచి వదిలించుకోవచ్చు. ఇలాంటి అప్రధాన పనులకు ఎంత శ్రద్ధ పెడుతున్నామో, ఎంత సమయం వెచ్చిస్తున్నామో గ్రహించగలిగితే, ముఖ్యమైన పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి అవకాశాలు వాటంతట అవే ఎదురవుతాయి. అప్పుడు అసలైన ఉపయోగకర పనుల్ని చేయగలుగుతాం.

  1. మనం తగ్గించుకోడానికి లేదా వదిలించుకోడానికి వీలున్న స్వల్ప ప్రభావ పనులు:
  2. తక్కువ ఉపయోగం ఉండే, పదే పదే ఒకే అంశంపై నిర్వహించే సమావేశాలు.
  3. మన సమయూన్ని వృథా చేసే ఫోన్ కాల్స్, ఉత్పాదకతను తగ్గించే సోషల్ మీడియూ, వెబ్‌సైట్లు.
  4. మనలోని ప్రత్యేక నైపుణ్యాల్నీ, ప్రతిభనీ ప్రదర్శించేందుకు వీలవని పనులు, ప్రాజెక్టులు.
  5. మన సమయం ఎక్కువగా తినేస్తూ, అదే సమయంలో మన సహాయం అంతగా అవసరంలేని పనులు.

శాస్త్రీయంగా నిర్వహించిన మరో సర్వేలో, ఎక్కువమంది ప్రతి పదిహేను నిమిషాలకోసారి తమ ఈమెయిను తనిఖీ చేస్తారనీ, ఎనిమిది పని గంటల్లో మెుత్తంగా 32 సార్లు తనిఖీ చేస్తున్నారనీ వెల్లడైంది. అంటే రోజుకు 32 సార్లు మనం చేస్తున్న పని నుంచి దృష్టి మరలించినట్లే. 2017లో మనదేశంలోని వయోజనులు (పద్దెనిమిదేళ్లకు పైబడిన వాళ్లు) రోజుకు 3 గంటల 52 నిమిషాల సేపు ఉత్పాదకతకు సంబంధంలేని డిజిటల్ మీడియూలో సమయాన్ని వెచ్చించినట్లు ఇ-మార్కెటర్ సంస్థ అంచనా వేసింది.

ఉదాహరణకు ఈమెయిల్‌ను తీసుకుందాం..
కెనడాకు చెందిన కార్ల్‌టన్ యునివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఉద్యోగులు తమ పని గంటల్లో మూడింట ఒక వంతు సమన్ని ఈమెయిల్స్ చదవడం, వాటికి జవాబివ్వడంలో గడుపుతున్నారని తేలింది. అదే ఇంటి నుంచే పని చేసే రోజులో అయితే సగం సమయాన్ని ఇలా గడుపుతున్నారు. ఇంకో విషయమేమంటే, ఈ ఈమెయిల్స్‌లో 30 శాతం అత్యవసరంగా చూడాల్సినవి కావు, ముఖ్యమైనవీ కావు! ఆలోచించాల్సిన విషయమే. శాస్త్రీయుంగా నిర్వహించిన మరో సర్వేలో, ఎక్కువమంది ప్రతి పదిహేను నిమిషాలకోసారి తమ ఈమెయిల్‌ను తనిఖీ చేస్తారనీ, ఎనిమిది పని గంటల్లో మెుత్తంగా 32 సార్లు తనిఖీ చేస్తున్నారనీ వెల్లడైంది. అంటే రోజుకు 32 సార్లు మనం చేస్తున్న పని నుంచి దృష్టి మరలించినట్లే. 2017లో మనదేశంలోని వయోజనులు (పద్దెనిమిదేళ్లకు పైబడిన వాళ్లు) రోజుకు 3 గంటల 52 నిమిషాల సేపు ఉత్పాదకతకు సంబంధంలేని డిజిటల్ మీడియూలో సమయూన్ని వెచ్చించినట్లు ఇ-మార్కెటర్ సంస్థ అంచనా వేసింది. ఇలాంటి పరధ్యానాలు ఎక్కువయ్యే కొద్దీ పనిపై ఏకాగ్రత తగ్గుతుంది. అది ఉత్పాదకతపై చెడు ప్రభావం చూపిస్తుంది. మరైతే ఉత్పాదకతను తిరిగి దారిలోకి ఎలా తెచ్చుకోవాలి?

క్రమపద్ధతి పాటించాలి
మనం ఏ సమయంలో ఏం చేస్తున్నామో తెలిపే ఒక సమయ పట్టికను నిర్వహించుకోవాలి. వాటిలో ఉత్పాదకతతో నిమిత్తం లేని పనులపై రోజుకు ఎన్నిసార్లు దృష్టి పెడుతున్నామో గమనించి, రెండు రోజుల పాటు ఒక పద్ధతి ప్రకారం ఆ వివరాల్ని నమోదు చేయాలి. మనం వాటికి ఎంత సమయం కేటాయిస్తున్నాం లేదా దృష్టి పెడుతున్నామనే విషయం ఆధారంగా వాటిని ఒక క్రమ పద్ధతిలో పెడుతూ జాబితా సిద్ధం చేయాలి. ఉదాహరణకు.. ఈమెయిల్స్‌కు సమాధానాలు ఇవ్వడం, ఫేస్‌బుక్‌లో గడపడం, సమావేశాలకు హాజరవడం వంటివి. ప్రపంచంలోని ప్రతి ఉద్యోగి ఈమెయిల్స్, సోషల్ మీడియా వెల్లువలో మునిగి తేలేవాడే. అలాగే చాలా మీటింగ్‌లకు, ఈవెంట్లకు కూడా ఆహ్వానితుడిగా వెళ్లేవాడే. అయితే ఇంతకు ముందు చెప్పినట్లు వీటి నుంచి బయటపడాలి, లేదా, వాటిని తగ్గించుకోవాలి. మనం కచ్చితంగా అది చేయగలం. గట్టిగా తలచుకోవాలంతే!

పరిమితులు విధించుకోవాలి
అనవసర పనుల్ని తగ్గించుకొనే క్రమంలో వాటివల్ల మనం కోల్పోతున్న సమయాన్నీ, సామర్థ్యాన్నీ గుర్తించి, ఆ imageపనుల్ని ఎంత మేర తగ్గించుకోవచ్చో నిర్ణయించి, దానికనుగుణంగా పరిమితుల్ని విధించుకోవాలి. మనకు ఉపయోగపడే కొన్ని సహాయక పనులు అవసరానికి మించి ఎక్కువగా మన దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అంటే, కొత్త ఈమెయిళ్లకు స్పందించడానికీ, లేదా వాట్సాప్ సందేశాన్ని చూడ్డానికి మనకు ఒకట్రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు పట్టదు. కానీ వాటి కోసం మనం పదే పదే వాటిని తనిఖీ చేస్తుంటాం. దాని వల్ల అన్నిసార్లూ మన దృష్టి ముఖ్యమైన పనుల నుంచి అనవసర పనుల మీదకు వెళ్తున్నట్లే లెక్క. నిజానికి, ఫేస్‌బుక్‌లో మన సందేశానికి ఎవరైనా లైక్ కొట్టారో లేదో, కామెంట్ పెట్టారో లేదో అనే ఆలోచన వల్ల కలిగిన అనిశ్చితి కూడా మన దృష్టిని ప్రభావితం చేస్తుంది. అలాగే మనం మరింత ఉత్పాదకతతో పనిచేయడానికి ప్రయుత్నిస్తున్నప్పుడు, తరచూ వచ్చే ఈమెయిల్ అలెర్టులు కానీ, మెసేజ్ అలర్టులు కానీ మన పనికి విఘాతం కలిగిస్తాయి. ఇలాంటి పనుల వల్ల మన సమయం, మన ఉత్పాదకత ప్రభావితం కాకుండా ఉండటానికి రోజు మెుత్తంలో ఎన్ని సార్లు వాటిపై దృష్టి పెట్టొచ్చనేదానిపై కొన్ని పరిమితులు విధించుకోవాల్సిందే. మెుబైల్ ఫోన్‌లోని మెసెంజర్ నోటిఫికేషన్‌నూ, ఈమెయిల్ నోటిఫికేషన్నూ ఆఫ్ చేసి, కొన్ని నిర్దిష్ట సమయాల్లో మాత్రమే వాటిని తనిఖీ చేయాలి. ఉదయం ఓసారి, మధ్యాహ్నం ఓసారి, రాత్రి ఓసారి.. అంటే పూటకోసారి మాత్రమే వాటిని తనిఖీ చేయాలని గట్టి నిర్ణయం తీసుకోవాలి. 

మీటింగ్‌లకూ ఇదే నియుమం వర్తిస్తుంది. మనకొచ్చే ప్రతి సమావేశ ఆహ్వానాన్ని స్వీకరించి హాజరయ్యే బదులు, వారానికి హాజరయ్యే సమావేశాల సంఖ్యను పరిమితం చేసుకోవాలి. దీనివల్ల మనం పని చేసుకోడానికి సమయం లభించడమే కాకుండా, కొంత కాలానికి మన సహోద్యోగులు అనవసర సమావేశాలకు మనల్ని ఆహ్వానించడం తగ్గించేస్తారు!

మన చేతుల్లోనే ఉంది
imageదీన్నిబట్టి స్వల్ప ప్రభావం చూపే పనుల్లో మునిగి మన ఉత్పాదక స్థాయిల్ని దిగజార్చుకోవద్దని అర్థమవుతోంది. ప్రతి పని దినాన్నీ, వారాన్నీ, నెలనీ ఒక కచ్చితమైన ప్రణాళికతో ప్రారంభించాలి. మనం సాధించాలనుకుంటున్న అంశాలేమిటో తెలుసుకోవాలి. ఉపయోగంలేని పనుల్ని తగ్గించి లేదా వదిలేసి, ముందడగు వేసి లక్ష్యాలను సాధించాలి. ముఖ్యమైన పనులపై దృష్టి సారించడం వల్ల మన ఉత్పాదకతలో వచ్చిన పెనుమార్పు చూసి మనమే ఆశ్చర్యపోతాం. బాస్, సహచరులు మనల్ని కొత్తగా చూడ్డం మెుదలుపెడతారు. అతి స్వల్ప కాలంలోనే మనం ఇది సాధించడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఒక్కటి మాత్రం కచ్చితం. మన ఈ సరికొత్త పనితీరు తప్పకుండా, సరైన సమయంలో మనకు మంచి ప్రయోజనాల్ని అందిస్తుంది. జీతం పెరుగుదల రూపంలోనో, ప్రమోషన్ రూపంలోనో అది కనిపించవచ్చు. అంతకంటే ఎక్కువగా జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్ లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ క్షణమే ఈ కార్యాచరణలోకి దిగుదాం.. ఫలితాల్ని అందుకుందాం..!


 యువరాజునవుతాను...

Updated By ManamSun, 08/26/2018 - 05:06

imageరాఖీ పండుగ.. ఈ పేరు వినగానే నా ముఖం నిండు పున్నమి ఆకాశం అవుతుంది. ఎందుకంటే రాఖీ అనంగానే మా అక్క గుర్తొస్తుంది, చెల్లి నవ్వు వినిపిస్తుంది. ఈ రక్తసంబంధ దృశ్యం నా ఒక్కడికేం పరిమితం కాదు. ఇది హృదయాల సవ్వడి సందర్భం.. అనురాగాల సంగమ తీరం...

నేను కాంక్రీట్ జంగిల్‌లో ఎడారిని.. జానెడు పొట్ట మూపురాన్ని నడి వీపున మోసుకు తిరుగుతున్న ఒంటెని.. ఎప్పుడో ఒక విరామ శ్రమలో ఎండమావి వైపు ఆశగా చూస్తూ ఆకుపచ్చని నా పల్లె బతుకును కలగంటుంటాను. ఏడాదికోసారి అదిగో అటువంటి తథాస్తు రోజున నా ఆశ మొలుస్తుంది. అంతకు ముందే, నా దేహమంతా అనురాగ వాన కురుస్తుంది. అవును.. మా అక్క రెక్కలు కట్టుకొని వాలితే పల్లెలో మా రంగు ముగ్గు వాకిలి కనపడుతుంది. చిలుకల నవ్వుతో మా చెల్లి చేరితే మొన్నమొన్ననే నాటిన మా ఊరి వరి పొలాలు కళ్ళముందు కదలాడుతాయి.. ఊరి పొలం నుండి గోరటి వెంకన్న పల్లెపాట నాదాకా వినిపిస్తుంటుంది.. ఒక చేత్తో రాఖీ, మరో చేత్తో మిఠాయి, వాళ్ల నిండు గుండె దోసిళ్ళతో ప్రేమపూర్వక దీవెన.. వహ్.. ఇంతకన్నా పండుగేముంది..!

ఒకరి గుండె చెరువు నిండుతుంది, imageఇంకొకరి మనసు బావి పొంగుతుంది. ఇంకో చోట సంతోష జలపాతం దూకుతుంది. మా ఇల్లే కాదు, పట్నాలు నగరాల్లోని అన్నదమ్ముల ఇళ్ళ మత్తడి నుండి ఆప్యాయత నదీ ప్రవాహమవుతుంది. కాలంతో పోటీపడి నిమిషాలు గంటలను పనితో కొలుస్తుంటానని గడియారం తన నాడీ స్పందనతో ఏడాదంతా నా దండ చేతిపై సవ్వడి వినిపిస్తుంది. కానీ ఎందుకో.. రాఖీ సమీపిస్తుండగానే గడియారం మోము వాడిపోతుంది. రాఖీ పండుగ నాడు నా రక్త బిందువులు కట్టే కంకణాల మధ్య గడియారం బిక్కమొహమేస్తుంది.

నా చేతికి కట్టే రక్షాబంధనం కోసం అక్కచెల్లెళ్ళ లోకకల్యాణపు విశ్వశాంతి యాగక్రతువు అప్పటికి వారం రోజుల ముందే మొదలై ఉంటుంది. వాళ్ళ ఇల్లు, పిల్లలు, సంసారం, ఉద్యోగాలు, వృత్తి వ్యాపారాలు మెట్టినింటి గడపకు అప్పజెప్పే ప్రణాళికలో మునిగితేలి ఉంటారు...

చెల్లెలు కట్టే రాఖీ పొద్దుతిరుగుడు రెక్కల్లా ఉంటుంది. అక్క తెచ్చే రాఖీ ముద్దబంతిపువ్వులా ఉంటుంది...
నా చేతికి రాఖీ మొలిచాక పట్టాభిషేక యువరాజునవుతాను. నేను బహూకరించే కానుకతో వాళ్ళ మనసులో ఆనందం తాండవిస్తుంటుంది.. ఆ సంగీతం ఈ సోదరునికే వినిపిస్తుంది. వాళ్ళు నాతో ఉన్న ధైర్యంతో బాల్యాన పోగొట్టుకున్న రాజ్యాన్ని ఒక్కసారిగా గెలుచుకొస్తాను. జగజ్జేత అలెగ్జాండర్‌ను ‘‘అన్నా!’’ అనే పిలుపుతో కట్టిపడేసిన రోజు కదా.. అందుకే ఇంత బలమైన బాంధవ్యం.. అక్కా చెల్లి ఉన్నంతసేపు మా బాల్య స్మృతులు గుబాళిస్తుంటాయి. ఎప్పుడన్నా తోబుట్టువు రాఖీతో పలకరించకపోతే.. నా కళ్ళు కన్నీటి సంద్రాలవుతాయి. పోస్టులోనైనా అన్నా, తమ్ముడూ.. అన్న పిలుపు వినిపించకుంటే.. నా గుండె చెవులు వీధికి వేలాడుతుంటాయి.

రాఖీ అనే రెండక్షరాల రక్షరేఖ కోసం.. తోబుట్టువుల ఆశీర్వచనం కోసం చెల్లెళ్ళు, అక్కల వద్దకే నడిచే సోదరులు కూడా ఉంటారు. కులమతాలకతీతంగా కంటికి కనిపించని దేవుడి రూపాన్నే చూపుల్లో నిలుపుకొని కొండాకోన దాటి దర్శించుకునే మనకు.. కళ్ళముందు తిరుగాడే తోబుట్టువు దీవెన దైవశక్తి సమానమే.. ప్రహరీ అడ్డుగోడలు.. మందిర్, మసీదు, చర్చిలకే కానీ దేవుడికి కాదు. అలానే సోదరి ప్రేమకు ఆశీర్వాద దీవెనకు కులాలు అడ్డురావు. నీ ముంజేతిని ముందుకు చాపి ‘‘చూడు అన్నా చూడు.. తమ్ముడూ చూడు..’’ అంటూ ఒక మసీదు రాఖీ కడుతుంది, ఒక చర్చి దీవిస్తుంది. అందుకే.. లేనోడు ఉంటాడేమో కానీ అక్కచెల్లెళ్లు లేనోడెవడూ ఉండకూడదు.

- ప్రణయ్‌రాజ్ వంగరి

వారే నా బలం! నా ధైర్యం!
ఎల్లప్పుడూ ప్రవహించే నదీ ప్రవాహాల్లా అన్నా చెల్లెళ్ల మధ్య, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమలూ, అనురాగాలూ, imageఆప్యాయతలూ నిరంతరం నిస్వార్థంగా సాగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడూ వారి మధ్య అభిప్రాయభేదాలు, కోపతాపాలు పొడచూపినా మళ్లీ కొన్ని క్షణాలకే అవి మంచు కరిగినట్లు ఇట్టే కరిగిపోతాయి. మబ్బులు తొలగిన ఆకాశంలా వారి మనసులు నిర్మలమైపోతాయి.

ఒకే ప్రేగుతో పెనవేసుకున్న చెక్కుచెదరని అనుబంధాలు వారివి! నేను కూడా నా తోబుట్టువుల ప్రేమకు ఉక్కిరిబిక్కిరి అయినవాడినే. మధురమైన అనుభూతులకు లోనైనవాడినే. కమ్మని జ్ఞాపకాలను మదిలో దాచుకున్నవాడినే.

మా అమ్మానాన్నలకు మేము నల్గురం సంతానం. అక్క, నేను, చెల్లి, తమ్ముడు. మా అక్క అన్నపూర్ణ రైల్వే ఉద్యోగి భార్య. వారిది చోడవరం దగ్గర గజపతినగరం. చెల్లి దేవి. మా ఊరు కశింకోటలోనే మా మేనత్త కొడుక్కిచ్చి పెళ్లి చేశాం. బావ సింగపూర్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తమ్ముడు నూకేశ్వరరావు వ్యవసాయం చేస్తుంటాడు. నేను ఓ ప్రైవేట్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. 

నిజం చెప్పాలంటే ప్రేమను పంచడంలో నాకంటే ఎప్పుడూ వారే ఓ మెట్టు పైనుంటారు. ఎందుకో తెలీదు కానీ మా చెల్లికి నేనంటే ప్రత్యేక అభిమానం. ఎనలేని గౌరవం! మా బావ సింగపూర్‌లో ఉంటున్న కారణంగా, మా తమ్ముడు వ్యవసాయంలో తలమునకలవుతూ ఉండటం వల్ల ఏ ముఖ్యమైన పనైనా నాకే చెబుతూ ఉంటుంది. ఏ సంతోషమైనా, ఏ కష్టమైనా నాతోనే పంచుకుంటుంది. ఏ శుభకార్యానికైనా నన్నే ముందు నిల్చోబెడుతుంది. మా అందరికంటే తను ఆర్థికంగా కాస్త ఉన్నత స్థితిలో ఉన్నా ఏమాత్రం అహమూ, కల్మషమూ లేని మా ఇంటి మందారం మా చెల్లి! ఐదేళ్ల కిందట.. రాత్రి పది గంటల సమయంలో హఠాత్తుగా నాకు సీరియస్ అయింది. నా భార్య సత్య వెంటనే చెల్లికి ఫోన్‌చేసి విషయం చెప్పగానే ఆగమేఘాల మీద వచ్చి విలవిల్లాడిపోయింది. తమ్ముడు ఆటో తీసుకొచ్చాడు. నన్ను వెంటనే అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యం చేయించారు. నేను హాస్పిటల్లో ఉన్న మూడు రోజులూ సత్యతో పాటు చెల్లి, అక్క, తమ్ముడు చేసిన సపర్యలు ఎప్పటికీ మర్చిపోలేను. 

ఏడాదిన్నర క్రితం నాన్న చనిపోయాడు. నాన్న దినకర్మలకు తమ్ముడూ, నేనూ డబ్బులు ఖర్చు పెడుతుంటే చెల్లి నా చేతిలో కొంతడబ్బు పెట్టి ‘‘ఇబ్బందిపడకుండా ఖర్చు పెట్టండన్నయ్యా’’ అంది. ‘‘ఆడపిల్లవు నువ్వెందుకమ్మా డబ్బులివ్వడం, మేం ఖర్చుపెడతాంలే’’ అనంటే చెల్లి వినలేదు. ‘‘ఏం.. ఎందుకు ఇవ్వకూడదు? ఆడపిల్లను అయినంత మాత్రాన నా తండ్రిపై నాకు బాధ్యత ఉండదా ఏమిటి? అయినా మీరు మాత్రం ఉన్నవాళ్లేమిటి? ఫర్వాలేదు.. ఖర్చు పెట్టండి. చాలకపోతే అడగండి. అప్పులు మాత్రం చెయ్యొద్దు’’ అంటూ మెత్తగా నచ్చజెప్పింది.

రాఖీ పౌర్ణమి వచ్చిందంటే ఎక్కడున్నా, ఎన్ని పనులున్నా మానుకొని మరీ వస్తారు అక్కా, చెల్లి. అక్క నెమ్మదస్తురాలు. మాటలు మితం, ప్రేమ అమితం. అన్నదమ్ముల మీద గుండెల నిండా ప్రేమ నింపుకొని, ఆప్యాయంగా రాఖీ కట్టి ఆశీర్వదిస్తుంది. మేం కానుక రూపంలో సంతోషంగా ఇచ్చే డబ్బులు తీసుకొని, తిరిగి మా పిల్లలకే పంచేస్తుంది. ఇక చెల్లి డబ్బులివ్వబోతే అస్సలు తీసుకోదు. ‘‘నేను డబ్బులు కోసం రాఖీ కడుతున్నానేమిటీ? నా అన్నదమ్ములు చల్లగా ఉండాలని రక్ష కడుతున్నాను’’ అంటుంది. మేం బలవంతం చేస్తే చివరకు ‘‘అయితే గాజులకు ఓ యాభై ఇవ్వండి. చాలు’’ అంటూ అంతే తీసుకుంటుంది. మా అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల మమతానురాగాల గురించి నాలుగు ముక్కల్లో చెబితే అయిపోయేది కాదు. పూర్తిగా రాస్తే ఓ కావ్యమే అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే వారే నా బలం, నా ధైర్యం!

- బొడ్డేడ బలరామస్వామి

వాళ్ల కళ్లకి చిన్నవాళ్లమే!
రాఖీ పండుగ వస్తోందంటే, చాలా ఆనందంగా ఉంటుంది. ఈ పండుగ అంటే చిన్నతనం నుంచి భలే ఇష్టం. నిజానికి నా చిన్నప్పుడు ఈ పండుగ గురించి అంత తెలియదు. అప్పట్లో మా ప్రాంతాల్లో జరుపుకునేవారు కాదు. కొంతకాలానికి మేము హైదరాబాద్ వచ్చాం, నాన్నగారి ట్రాన్స్‌ఫర్ మూలంగా. అప్పుడు బాగా తెలిసింది ఈ పండుగ గురించి. అది చాలా గమ్మత్తుగా జరిగింది. మా పెద్దమ్మ వాళ్లు ఎప్పటినుంచో హైదరాబాద్‌లోనే ఉండేవారు. రక్తసంబంధం ఉన్నా అప్పటివరకూ పెద్దగా చనువు లేదు పెద్దమ్మ పిల్లలతో. మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కాస్త దగ్గరతనం మొదలయింది. పెద్దమ్మకి నలుగురు మగపిల్లలు. పెద్దవాళ్ళిద్దరూ ఇంజనీర్లు. పెద్దన్నకి పెళ్లి కూడా అయింది. తర్వాత వాళ్ళు నాకంటే కొంచెం పెద్దవాళ్ళు. ఒక అక్క కూడా ఉంది. తనకి పెళ్లయి అమెరికాలో ఉంటుంది. ఉన్న ఒక్క చెల్లెలు అమెరికాలో ఉండటం వల్ల మమ్మల్నే సొంత చెల్లాయిలుగా చూస్తారు. రాఖీ పండుగకి సంబంధించిన మొదటి అనుభవం ఇప్పటికీ మర్చిపోలేనిది. అప్పుడు నేను ఇంటర్, చెల్లెలు పదో తరగతి చదువుతున్నాం. గమ్మత్తు ఏమిటంటే మా పెద్దమ్మ మా ఇద్దర్నీ వాళ్ళింటికి రమ్మనమని చిన్నన్నయ్యతో కబురు పంపించింది. దగ్గర్లోనే ఉన్న వాళ్ళింటికి ఇద్దరమూ వెళ్లాం. మా పెద్దమ్మ ఒక పళ్లెంలో రాఖీలు, కుంకుమ భరిణ, కొన్ని అక్షింతలు ఇచ్చి, మా ఇద్దర్నీ అన్నయ్యల చేతికి కట్టమంది. అంతే! ఇద్దరం హుషారుగా కట్టేశాం. కానుకలు ఇస్తారని మాత్రం తెలుసు. ఆ రోజు నుంచి ఇప్పటివరకూ మా ఆత్మీయబంధం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. అన్నయ్యల పిల్లల పెళ్లిళ్లయి మనవలు కూడా వచ్చేశారు. అయినప్పటికీ వాళ్ళ కళ్ళకి మేమెప్పుడూ చిన్నవాళ్ళమే. వాళ్ళ అభిమానం, ప్రేమ ఎప్పటికీ మరవలేనిది. అందుకే సొంత అన్నయ్యలు, తమ్ముళ్లు లేరనే భావనే లేదు మాకు. రాఖీ.. మాకెప్పటికీ ఇష్టమైన పండుగ.

- మణి వడ్లమానిమూడో కన్ను

Updated By ManamSun, 08/19/2018 - 07:30

ఒకప్పుడు కెమెరా అంటే ఒక త్రిపాది (ట్రైపాడ్) మీద అమర్చిన పెద్ద డబ్బా, దాని వెనక పెద్ద వస్త్రం ముసుగులో మనకు అసలే కనిపించని ఫొటోగ్రాఫర్.. ‘‘రెడీ’’ అని ఒక్కసారి ఒక మూత తీసి, మూసేసేవారు. దాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో మాత్రమే ప్రింట్ వేసి ఇచ్చేవారు. అది మాత్రమే కెమెరా అనుకునే రోజుల నుంచి, మన పని మనం చేసుకుపోతుంటే పైనుంచి డ్రోన్‌కు అమర్చిన అత్యాధునిక కెమెరా టకటకా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ వెళ్లిపోయే రోజులకు వచ్చాం. అంతేనా, ఎక్కడో అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలు కూడా తమ కెమెరా కళ్లతో భూమ్మీద ఏముందో చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫొటోగ్రఫీ వల్లే సాధ్యమయ్యాయి. 

నా మొదటి అనుభవం..
imageనా చిన్నతనంలో శ్రీకాకుళంలో ఉండే రోజుల్లో నాన్నగారి కొలీగ్ దగ్గర ఓ కెమెరా ఉండేది. అందులో ఫొటోలు తీస్తే సరిగా మన అరచెయ్యి అంత ప్రింట్ మాత్రమే వచ్చేది. దాంతో వాళ్ల పిల్లలు, మేము అంతా ఫొటోలు తీయించుకునే వాళ్లం. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను కొన్న మొట్టమొదటి కెమెరా.. యాషికా ఎంఎఫ్ 2. అందులో రీల్ వేసుకుని ఫొటోలు తీసుకోవాల్సి వచ్చేది. ఒక రీల్‌లో 36 ఫొటోలు వచ్చేవి. అప్పటికి ఎన్ని అయ్యాయో జాగ్రత్తగా చూసుకుంటూ మొత్తం అయిన తర్వాత కూడా ఇంకా ఒకటి రెండు వస్తాయేుమోనని ప్రయత్నం చేయడం ఇప్పటికీ గుర్తే. పెద్దక్క పెళ్లి ఫొటోలు కూడా దాంతోనే తీశా. పాప పుట్టిన తర్వాత దానికి ఆ కెవెురాతో తీసిన లెక్కలేనన్ని ఫొటోలన్నీ ప్రింట్లు వేయించి, మూడు ఆల్బంలు నింపిన తర్వాత ఇంకా పెద్ద బ్యాగు నిండా కుప్ప పోశాం. ఆ తర్వాత డిజిటల్ కెమెరా యుగం రావడం, వెంటవెంటనే రెండు పాకెట్ డిజిటల్ కెవెురాలు, మరో కావ్‌ుకార్డర్ (ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డర్) నా చేతుల్లోకి రావడం చకచకా జరిగిపోయాయి. అయినా ఇప్పటికీ బీరువాలో భద్రంగా దాచుకున్న నా యాషికా కెవెురాను అప్పుడప్పుడు తీసి.. ఓసారి దాని వ్యూఫైండర్‌లోంచి చూసి రీల్ లేకపోయినా క్లిక్‌మనిపించి గుండెల నిండా ఊపిరి తీసుకోవడం.. అదో మధురానుభూతి.

మాయల మరాఠీ
ఫొటోగ్రఫీ గురించి చెప్పాలంటే రవికాంత్ నగాయిచ్ పేరు ప్రస్తావనకు తేకుండా ఉండలేం. బాబూ భాయ్ మిస్త్రీ దగ్గర శిష్యరికం చేసి సినిమా కెవెురాతో వండర్లు సృష్టించిన మాయావి.. రవికాంత్ నగాయిచ్. నందమూరి తారక imageరామారావు నాటి బొంబాయిలో మంచి కెవెురామన్ ఎవరు దొరుకుతారా అని అన్వేషిస్తూ.. రవికాంత్‌ను పట్టుకున్నారు. తన ‘సీతారామ కల్యాణం’ సినిమాకు ఆయునను తీసుకొచ్చారు. అప్పటినుంచి తిరుగులేని పనితనంతో దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు రవికాంత్ నగాయిచ్ ఒక పెద్దదిక్కుగా ఉండిపోయారు. తెలుగు సినిమా పరిశ్రమ ఇంకా పెద్దగా ఎదగని సమయంలోనే ఆయన తన కెమెరా ట్రిక్కులతో అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసేవారు. కేవలం సినిమా ట్రిక్స్ తీయుడానికి మద్రాసులో ఒక ఫ్లోర్ ఏర్పాటుచేసుకున్నారు. విఠలాచార్య సినిమాలకు ప్రాణం పోసింది రవికాంతే. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో పుట్టి, అక్కడ మిస్త్రీ శిష్యరికం చేసి, ఎన్టీ రామారావు పుణ్యమాని తెలుగునేల మీద అడుగుపెట్టి ఇక్కడ ఎస్.వెంకటరత్నం, వి.ఎస్.ఆర్.స్వామి, వాల్మీకి కృష్ణారావు లాంటి అనేకమంది శిష్య ప్రశిష్యులను తయారుచేశారు.

ఆమె ప్రాణం.. కెమెరా
ఫొటోలు.. పర్యటన.. ఈ రెండు విషయాల గురించి లోతుగా చెప్పాలంటే ఒక్క పేరు చెబితే చాలు. ఆ పేరే జయతీ లోహితాక్షన్. ఆమె నిత్య పథికురాలు. తన కెమెరా కళ్లతో అడవులు, గ్రామాలు, మానవజీవితంలోని దార్శనికతను రికార్డు చేస్తుంటారు. ఫొటోగ్రఫీ అభివ్యక్తిగా, ప్రయాణమే అభిమతంగా జయతి తనదైన జీవనపథాన్ని ఎంచుకుని, ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా గిరిజనం గుండె చప్పుడును ఆమె పట్టుకున్నంతగా ఎవరూ పట్టుకోలేదంటే అతిశయోక్తి కాదు. కెమెరా తగిలించుకుని.. కాళ్లకు బలపాలు కట్టుకుని వెళ్లిపోతారా అన్నట్లుగా ఆమె పయనం సాగుతుంటుంది. ఎంతలా జీవనచిత్రాలను బంధించినా ఇంకా గుర్తించాల్సింది ఏదో చాలా ఉందన్నట్లుగా ఆమె అన్వేషణ కొనసాగుతుంది. నులక మంచం మీద పగటి కునుకు తీసే వృద్ధుడు.. నూలుచీరల ఉయ్యాలలో నిదురించే పసిపాప.. పొయ్యివద్ద వదిలిపోయిన స్టీలు గ్లాసు.. వీటిలో ఏవీ జయతీ లోహితాక్షన్ కెమెరా కంటిని దాటి పోలేవు. బెదురుచూపుల పిల్లవాడిని సముదాయిస్తూ తల్లి నవ్వే చిరునవ్వులు ఆమె చిత్రాల్లో భద్రంగా కనిపిస్తాయి. 

మళ్లీ ఫొటో రీల్ వైపు..
డిజిటల్ కెవెురాల రాకతో ఫొటోగ్రఫీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిజానికి యువతను ఫొటోగ్రఫీవైపు imageమళ్లేలా చేసి ఒక హాబీలా, వృత్తిలా చేపట్టేలా చేసింది డిజిటల్ కెవెురాలే. పాయింట్ అండ్ షూట్, స్మార్ట్‌ఫోన్, డీఎస్‌ఎల్‌ఆర్‌లు అందుబాటులోకి రావడంతో సామాన్యులు కూడా తమ కలను సాకారం చేసుకునేలా ఈ కళాపోషణను మొదలుపెట్టారు. స్మార్ట్‌ఫోన్ స్పెషల్ ఫీచర్‌గా అత్యంత మెరుగైన కెమెరాను అందించేందుకు ఈ సంస్థలు పెద్ద మొత్తంలో పరిశోధనపై వెచ్చిస్తున్నాయి. ‘‘నిజానికి డిజిటల్ రెవల్యూషన్ రాకముందు అంతా ఫిల్మ్ మయమే. కొన్ని రకాల రసాయనాలతో ఎక్స్‌పోజ్, డెవలప్ చేయగా ఫొటో ప్రత్యక్షమయ్యేది. ఇదంతా జరిగేందుకు చాలా సమయం పట్టేది. దీంతో అప్పటికప్పుడు ఫొటో ప్రివ్యూ చూసుకునే అవకాశం అస్సలుండేది కాదు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 36 షాట్స్ ఎక్స్‌పోజ్ చేసి, డెవలప్ చేసి, ల్యాబ్‌లో ప్రింట్ అయ్యాక మాత్రమే తాము తీసిన ఫొటోలు ఎలా ఉన్నాయో తెలిసేది. ఇప్పుడు ఈ డార్క్‌రూమ్ టెక్నాలజీ కనుమరుగై డిజిటల్ కెమరాల ప్రవేశంతో ఫొటో క్లిక్‌మనగానే ఇన్‌స్టంట్‌గా ఫీడ్‌బ్యాక్ తీసుకుని, రెప్పపాటులో ప్రింట్ కూడా తీసుకోవచ్చు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఫొటోలు తీసే ఛాన్స్ ఈ డిజిటల్ మార్గంలోనే లభిస్తుంది కనుక కమర్షియల్ ఫొటోగ్రాఫర్‌లు ఫిల్మ్‌కి గుడ్‌బై చెప్పక తప్పలేదు’’ అని చెప్పారు శివ కరణం. ఆయన ఇంటెల్లి ప్లాట్‌ఫామ్స్ ఇంక్, న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్ నిపుణునిగా పని చేస్తున్నారు. ఆయన ప్రవృత్తి ఫొటోగ్రఫీ. ఫిల్మ్‌కు పని లేకపోవడంతో ‘ఫిల్మ్ ఇండస్ట్రీ’ కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని చావుదెబ్బ తినాల్సి వచ్చింది. కెమెరా తయారీదారులైన యాషికా, నికాన్, కెనాన్, పెంటాక్స్ వంటి కంపెనీలు ఫిల్మ్ కెమెరాల ఉత్పత్తి నిలిపివేశారు. ఆగ్ఫా, కొడాక్ వంటి ఫిల్మ్ తయారీ సంస్థలు దివాళా తీసి, ఫిల్మ్ రోల్ బిజినెస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఇక అలనాటి ఫిల్మ్ రోల్, కెమెరాలకు ఫొటోగ్రాఫర్‌లు సమాధి కట్టాల్సివచ్చింది.

పిక్చర్ పర్‌ఫెక్ట్ లేదే!
కానీ ఆలస్యంగా వీరంతా గ్రహించిన సత్యం ఏమిటంటే ఎక్కువ సంఖ్యలో కోరుకున్నట్టు ఫొటోలు క్షణాల్లో తీయగలిగే సాంకేతికతతో పోలిస్తే ఇందులో నాణ్యత లేదనే విషయాన్ని ఎట్టకేలకు నిపుణులు గుర్తించగలిగారు. ‘‘ఫొటోగ్రఫీ అంటేనే వెలుగునీడల కాంబినేషన్. అలాంటిది సరైన కాంతి, కళాభిరుచి, ఆలోచనలు, విషయం, వస్తువు లేకపోవడాన్ని డిజిటల్ ఫోటోగ్రఫీలో ఉన్న లోపాలుగా గుర్తించారు. అంటే పిక్చర్ పర్‌ఫెక్ట్ కాదన్నమాట. డిజిటల్ మేకప్‌లతో హంగులు జోడిస్తే అది పర్‌ఫెక్ట్ పిక్చర్ కాదుకదా. వెరసి ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’.. పాత ఎప్పుడూ కొత్తే అనే బాట పట్టక తప్పలేదు’’ అని చెబుతారు శివ. కొందరు ఔత్సాహికులు మళ్లీ ఫిల్మ్ వాడటం మొదలుపెట్టి, రివ్యూలు రాసి, అవగాహన కల్పించడం మొదలుపెట్టడంతో సమీప భవిష్యత్‌లో రీల్‌కు పట్టం కట్టక తప్పేలా లేదు. కళాఖండం లాంటి ఫొటో కావాలంటే ఇదొక్కటే మార్గంగా మారింది. ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ ఫొటోగ్రఫీల్లో ఇప్పుడు ఫిల్మ్ రోల్ వాడకం విస్తృతమైంది. ఫొటోగ్రఫీని ప్రాణంగా ప్రేమించేవారిలో అత్యధికుల కోసం ఫిల్మ్ మళ్లీ మార్కెట్లోకి పునరాగమనం చేస్తోందనీ, ఇందులో భాగంగా ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఇవి పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయనీ శివ తెలిపారు. ముఖ్యంగా ఫొటోగ్రఫీని క్రమశిక్షణగా నేర్చుకునే కొత్త తరంవారు ఫిల్మ్‌తోనే ఓనమాలు దిద్దుతున్నారు.

ఫోరంలు కూడా..
డిజిటల్ కెమెరాను కాదని పాతవిధానంలో ఫిల్మ్‌ను లోడ్ చేసి క్లిక్‌మనిపించే కల్ట్.. ఫిల్మ్ ఫొటోగ్రఫీ ఫోరంలు, గ్రూపులుగా ఏకమవుతూ ఈ కళకు మళ్లీ జీవం పోస్తున్నారు. డిజిటల్, రోల్ మధ్య ఉన్న నాణ్యత, తేడాను వివరించేందుకు ఎగ్జిబిషన్స్ సైతం నిర్వహిస్తున్నారు. ఫిల్మ్ తయారీదారులకు ఇది మళ్లీ ఉపాధి కల్పిస్తోంది. దీనికి నిలువెత్తు ఉదాహరణ ఇటీవల కొడాక్ సంస్థ చేసిన కీలకమైన ప్రకటన.. ఫిల్మ్ ఉత్పత్తిని తిరిగి మొదలుపెడుతూ, రోల్‌ను అందుబాటులోకి తెస్తామంది. కానీ ఇదిప్పుడు కాస్త ఖరీైదెన వ్యవహారమే. ‘‘కొందరు కేవలం ఫిల్మ్ కెమెరాతోనే ఫొటోలు తీయించుకుని తమవి ఫాబ్రికేటెడ్ ఫొటోలు కావని చెబుతున్నారు. హ్యాష్‌ట్యాగ్ ఉద్యమంతో ఇప్పుడు రీల్ ఫొటోగ్రఫీకి ఊపిరిలూదుతూ ఇంటర్‌నెట్‌లో అవగాహన పెంపొందిస్తున్నారు. ప్రస్తుతానికి ఫిల్మ్ ప్రాసెసింగ్ చేస్తున్న ల్యాబ్‌ల సంఖ్య నామమాత్రంగా ఉన్నా, అతి త్వరలో పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రావడం ఖాయం’’ అని శివ తేల్చి చెప్పారు. డిజిటల్ ఫొటోగ్రఫీ స్థానాన్ని ఫిల్మ్ ఫొటోగ్రఫీ భర్తీ చేయకపోయినా అద్భుతమైన ఛాయాచిత్రాలను తీసేందుకు అత్యుత్తమ మాధ్యమంగా, తిరుగులేని సాధనంగా ఫిల్మ్ పొటోగ్రఫీ నిలవనుంది.
l [email protected]
 

image

 కాంట్రవర్సీ ‘షో’!

Updated By ManamSun, 08/12/2018 - 02:32

imageసాహసమే పెట్టుబడిగా సాగుతున్న టీవీ రియాల్టీ షోల సంఖ్య మనదేశంలో ఒక్కసారిగా పెరుగుతోంది. ఓ వైపు వీక్షకాదరణ లభిస్తుండడం, మరో వైపు ఇందులో పాల్గొన్నవారికి మంచి పాపులారిటీ వస్తుండడంతో అడ్వెంచరస్ రియాల్టీ షోలపై నిర్మాతలు దృష్టి పెడుతున్నారు. ఈ తరహా షోలకు యాంకరింగ్ చేయడమంటే కత్తి మీద సాము. అయినా కూడా రొటీన్ సినీ లైఫ్ నుంచి రిలీఫ్ కోసం ఇలాంటి బాధ్యతలను చేపట్టేందుకు సెలబ్రిటీలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు.

గొడవలే ప్రధానం
image
సాధారణంగా వివాదాలు లేని, రాని రియాల్టీ షో అంటూ ఏదీ ఉండదు. ఏ షో అయినా వివాదాల పుట్టగానే మారుతున్న ప్రస్తుత తరుణంలో తెరమీద లేదా తెరవెనుక ఇలాంటి అడ్వెంచరస్ రియాల్టీ షోలు కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అఫైర్లు ఇందులో భాగంగా మారాయి. బిగ్‌బాస్, రోడీస్, ఇండియన్ ఐడల్,  ఇండియాస్ గాట్ ట్యాలెంట్, కౌన్ బనేగా కరోడ్‌పతి, సారేగామా, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్, మాస్టర్ షెఫ్.. ఇలా మనదేశంలో టాప్ టెన్ రియాల్టీ షోల్లో వివాదాలు వస్తూ పోతూ ఉంటాయి. ‘కామెడీ నైట్స్’ వంటి షోల్లో అయితే ఏకంగా చెప్పులతో కొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో షో చేసేవారి మధ్య గొడవలు తారస్థాయికి చేరి షో ఆగిపోయింది కూడా. ఇక ‘ఇండియన్ ఐడల్’లో దక్షిణాది పార్టిసిపెంట్స్ లేకపోతే ఈ రియాల్టీ షోకు రేటింగ్స్ చాలా తక్కువ వస్తాయన్న కారణంతో మన దక్షిణాది రాష్ట్రాల వారికి ఇటీవల కాలంలో విపరీతంగా ప్రాధాన్యం ఇస్తూ ఆఖరుకి విన్నర్స్ లేదా రన్నర్స్‌గా ప్రకటిస్తున్నారన్న ఆరోపణలు బలంగానే ఉన్నాయి. ‘బిగ్ బాస్’ పార్టిసిపెంట్స్ మధ్య ప్రేమలు, వివాదాలు చినికి చినికి గాలివానలా మారి బాహాటంగానే పంచాయితీలు జరుగుతూ వస్తున్నాయి. ఇక మాస్టర్ షెఫ్ పోటీల్లో పార్టిసిపెంట్స్‌ను ఇష్టానుసారం తిట్టే షెఫ్‌లు సృష్టించే భయానక వాతావరణంతో సాగిన ‘హెల్స్ కిచెన్’ ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రామ్‌సే గార్డన్‌ను ఈ షో ద్వారా అసహ్యించుకునే వారు ఎంతమంది ఉన్నారో ఇష్టపడి షో చూసేవారు అంతేమంది ఉన్నారు.

బాలు కూడా..
‘పాడుతా తీయగా’ వంటి రియాల్టీ షోల్లో ఎస్పీ బాలసుబ్రమణ్యం చక్కగా పాడిన వారిని అభినందిస్తూనే మరో వైపు పాడటంలో ఉన్న తప్పులను ఎత్తిచూపే విధానం కూడా మొద ట్లో బాగా విమర్శలపాలైంది. ఇక ‘నేటి సింగర్లు ఇలా.. మా కాలంలో అలా’ అంటూ బాలు చెప్పే ఉదాహరణలు ప్రోగ్రామ్‌కు హాజరైన జడ్జిలను కూడా పలు సందర్భాల్లో బాధించడంతో కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టేలా చేస్తోంది. 

నానిపై సెటైర్లు
తెలుగు ‘బిగ్ బాస్ 2’కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో నానిపై నెట్‌లో నడుస్తున్న సెటైర్లు, ట్రాలింగ్‌లు అన్నీ ఇన్నీ కావు. ఇక షోలో పాల్గొన్న తేజస్వి, భానుశ్రీల వివాదాలు షోను కాస్త అన్‌పాపులర్ చేసినా వివాదాలు లేని రియాల్టీ షోలు సాధ్యం కావని మరోమారు తేల్చిచెప్పాయి. ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో నటుడు కౌశల్ ఫ్యాన్స్ నానితో సహా ఇతర పార్టిసిపెంట్స్‌పై నిత్యం ఇంటర్నెట్ వేదికగా చేస్తున్న వివాదాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఆఖరుకి ఈ షోను నడిపిస్తోంది కౌశల్ ఆర్మీనే అనేలా సాగుతోంది సరికొత్త వివాదం.
- భార్గవి కరణం
 

image

 లైట్ తీస్కోకు భయ్యా..!

Updated By ManamSun, 08/12/2018 - 02:05

imageభారతదేశంలో బిట్ కాయిన్, మోనెరో వంటి డిజిటల్ కరెన్సీలకు సంబంధించిన సైబర్ బెదిరింపుల అవగాహన బొత్తిగా లేదు. కానీ అంతర్జాలంలో సంచరించే వాళ్లలో 77 శాతం మందికి డిజిటల్ కరెన్సీ అనేది ఉందని తెలుసు. అయినా కూడా సైబర్ బెదిరింపుల విషయంలో వాళ్లు లైట్ తీసుకుంటున్నారు. తమ వ్యక్తిగత, స్మార్ట్ హోమ్ పరికరాలకు 
హాని కలిగించే క్రిప్టోమైనింగ్ మాల్‌వేర్ గురించి చాలా మంది వినియోగదారులు పట్టించుకోవట్లేదు. వినియోగదారులపై దృష్టిపెట్టే సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘అవస్త్’ విడుదల చేసిన ఓ నివేదిక ఈ విషయూన్ని వెల్లడించింది. క్రిప్టో కరెన్సీతో తమకెలాంటి సంబంధం లేదు కాబట్టి, క్రిప్టోమైనింగ్ మాల్‌వేర్ తమ వస్తువులకు హాని కలిగించే అవకాశమే లేదని చాలా మంది నమ్ముతున్నారు. 
ఇది పొరపాటు.

వాస్తవమేమంటే, క్రిప్టోమైనింగ్ మాల్‌వేర్ లేదా క్రిప్టోకరెన్సీ మైనింగ్ మాల్‌వేర్ అనేది మన కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్‌ని చదివేసి, ఆ పరికరంలోని డాటానంతా తన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి మాల్‌వేర్ భాగాల్ని డెవలప్ చేస్తుంది. వినియోగదారుడి అనుమతితో నిమిత్తం లేకుండానే క్రిప్టోకరెన్సీ మైనింగ్ కోసం ఆ మాల్‌వేర్‌ను ఉపయోగిస్తుంది. ఈ హానికర క్రిప్టోమైనింగ్ విషయంలో మనవాళ్లు ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారని అవస్త్ నివేదిక తెలిపింది. దాని ప్రకారం క్రిప్టోకరెన్సీలను మైనింగ్ చేసే మాల్‌వేర్ లేదా మాల్‌వేర్ సోకిన వెబ్‌సైట్ల గురించి 66 శాతం మంది వినియోగదారులు వినివున్నారు కానీ, ఆ మాల్‌వేర్‌పై వాళ్లకు సమగ్ర అవగాహన లేదు.

అక్రమ క్రిప్టోమైనర్స్
ఒక అధ్యయనం ప్రకారం 2018లో ఇప్పటివరకూ రాన్సమ్‌వేర్ ఆధారిత దాడుల కంటే క్రిప్టోమైనర్ ఆధారిత దాడులేimage ప్రమాదకరంగా మారాయి. తొలి త్రైమాసికంలో మెుత్తం 30 కోట్ల మాల్‌వేర్ ఘటనలు చోటు చేసుకోగా, వాటిలో క్రిప్టోమైనర్ ఘటనలు 2.89 కోట్లు! అంటే దాదాపు 10 శాతం. జనవరి నుంచి మార్చి వరకు ఈ ఘటనలు క్రమేణా పెరుగుతూ వచ్చాయిు. అదే సమయంలో రాన్సమ్‌వేర్ ఘటనల్లో తగ్గుదల కనిపించింది. రాన్సమ్‌వేర్ దాడి జరిగినప్పుడు సిస్టమ్‌లోని వనరులన్నీ కరప్ట్ అయినట్లు స్క్రీన్ మీదే తెలిసిపోతుంది. సిస్టమ్‌ను ఆన్ చేయగానే అందులోని ఫైల్స్ అన్నీ ఎన్‌క్రిప్ట్ అయ్యూయనే విషయం స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. ఆ సమస్యకు పరిష్కారంగా డబ్బును డిమాండ్ చేస్తుంది. అయిుతే క్రిప్టోమైనర్ మాల్‌వేర్ అలా చేయదు. మనం ఏదైనా సైట్‌ను సర్ఫింగ్ చేస్తున్నప్పుడే, మనకు తెలీకుండానే ఒక క్రిప్టోమైనర్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయిుపోతుంది. దాని ద్వారా ఆ కంప్యూటర్‌లోని వనరులన్నింటినీ తన స్వాధీనంలోకి తెచ్చుకొని, క్రిప్టోకరెన్సీ కోసం మైనింగ్ చేస్తుంది. మనకు విషయం తెలిసేసరికే చాలా నష్టపోతామన్న మాట!

సైబర్ నేరగాళ్లు రాన్సమ్‌వేర్ కంటే క్రిప్టోమైనర్స్ మీద ఎందుకు ఇంటరెస్ట్ చూపుతున్నట్లు? రాన్సమ్‌వేర్ ద్వారా తాము అనుకున్న ఫలితాల్ని నేరగాళ్లు సాధించలేక పోతున్నారు. 2017లో రాన్సమ్‌వేర్ దాడులు ఉధృతమవడంతో కంపెనీలు యూంటీ-రాన్సమ్‌వేర్ ప్రమాణాలు తీసుకోవడం మెుదలుపెట్టాయి. వీటిని అధిగమించడం రాన్సమ్‌వేర్‌కు కష్టమవుతూ వస్తోంది. అదొక కారణమైతే, ప్రధాన కారణం మాత్రం, క్రిప్టోకరెన్సీల విలువ చాలా ఎకువ కావడం! రాన్సమ్‌వేర్ డిమాండ్లకు మనం తలొగ్గవచ్చు, తలొగ్గకపోవచ్చు కానీ, క్రిప్టోమైనర్లకు డిజిటల్ కరెన్సీని కంటిన్యూగా సమర్పించుకోక తప్పదు. 

‘మోనెరో’ మహిమ
imageప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ నేరగాళ్లు ఇవాళ ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. ఎందుకంటే వాళ్లు హాయిగా నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు వచ్చిపడుతోంది. డిజిటల్ కరెన్సీ విషయూనికొస్తే, సైబర్ నేరగాళ్లు బిట్‌కాయిన్ కంటే కూడా ‘మోనెరో’నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కారణం, బిట్‌కాయిన్ ట్రాన్‌సాక్షన్స్‌ను ట్రాక్ చేయవచ్చు, దాని వాలెట్లను బ్లాక్ చేయవచ్చు లేదంటే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టొచ్చు. కానీ ఒక నిర్దిష్ట వ్యక్తికి సంబంధించి మోనెరోను ట్రాక్ చేయలేం, బ్లాక్ చేయలేం, ట్రేస్ చేయలేం. అంతే కాకుండా, బిట్‌కాయిన్ బ్లాక్స్‌ను సగటున పది నిమిషాలకోసారి మాత్రమే ఉత్పత్తి చేసే వీలుంటే, మోనెరో బ్లాక్స్‌ను పతి రెండు నిమిషాలకోసారి ఉత్పత్తి చేయెుచ్చు. కాబట్టి దాడి చేయడానికి మరిన్ని ఎక్కువ అవకాశాల్ని మోనెరో కల్పిస్తోందన్న మాట! మోనెరో రాకతో సైబర్ నేరగాళ్లకు గన్‌పౌడర్ దొరికినట్టయింది. విండోస్ సర్వర్స్.. ల్యాప్‌టాప్స్.. ఆండ్రాయిడ్ వస్తువులు.. ఆఖరుకి ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఎండ్‌పాయింట్స్.. ఎవైనా కానివ్వండి, యథేచ్ఛగా అక్రమ మోనెరో మైనర్స్‌ను ఇన్‌స్టాల్ చేస్తూ ఎలాంటి అనుమానాలకూ అవకాశం ఇవ్వకుండా ప్రపంచవ్యాప్తంగా వాటిని ఆక్రమించేస్తున్నారు సైబర్ గజదొంగలు. వీటి ద్వారా ప్రతి నిమిషం, రేయింబవళ్లు డబ్బు దొంగిలించేస్తున్నారు. ఈ నేరగాళ్లలో ఎక్కువ మంది రష్యా, చైనా దేశాలకు చెందిన ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్స్‌గా గుర్తించారు. అయితే బిట్‌కాయిన్ తర్వాత బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌తో నడుస్తోన్న అతి పెద్ద వ్యవస్థ ఎథీరియమ్. స్విట్జర్లాండ్‌లో ప్రారంభమైన ఈ నెట్‌వర్క్‌ను గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఆయన కొడుకు కూడా మైనింగ్ చేస్తున్నారు! ఎథర్ అనేది క్రిప్టోకరెన్సీ కాదు, క్రిప్టో ఫ్యూయెల్, క్రిప్టో సామగ్రి (కమొడిటీ). అందువల్ల కరెన్సీకి ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుతున్నారు. బిట్‌కాయిన్ కంటే తక్కువ ధరకే ఎథీరియమ్ దొరుకుతుండటం వల్ల కూడా దీనికి పాపులారిటీ పెరుగుతోంది.

దేన్నీ వదలట్లేదు
సాధారణంగా మనం ఏదైనా సైట్ ఓపెన్ చేస్తే యూడ్స్ ప్రత్యక్షమై, మనం చూడాలనుకుంటున్న సమాచారాన్ని సరిగా చూడనివ్వకుండా డిస్టర్బ్ చేస్తుంటాయి. యూడ్స్‌లేని ఆన్‌లైన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు వినియోగదారుల్లో సగం మంది క్రిప్టోమైనింగ్‌ను ఎంచుకుంటున్నారు. అవస్త్ ఏప్రిల్‌లో నిర్వహించిన ఒక పోలింగ్‌లో పాల్గొన్నవాళ్లలో 19 శాతం మందికి క్రిప్టోకాయిన్స్‌ ఉన్నాయి. లేదంటే వాటిలో పెట్టుబడి పెట్టారు. క్రిప్టోకాయిన్స్‌లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో 37 శాతం మంది ఉన్నట్లు తేలింది. 

‘‘సైబర్, వ్యక్తిగత భద్రతకు క్రిప్టోజాకింగ్ అనేది అంతకంతకూ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ఇళ్లల్లోని పర్సనల్image కంప్యూటర్స్ నుంచి పెద్ద పెద్ద డాటా సెంటర్ల దాకా ప్రతిదాన్నీ సైబర్ నేరగాళ్లు క్రిప్టోమైనింగ్‌కు గురిచేస్తున్నారు’’ అని తరుణ్ కౌరా చెప్పారు. ఆయన ఎంటర్‌ప్రైజ్ సెక్యూరిటీ ప్రొడక్ట్స్ మేనేజ్‌మెంట్ (ఏషియూ పెసిఫక్ అండ్ జపాన్)కు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2017 చివరి త్రైమాసికంలో ఎండ్‌పాయింట్ కంప్యూటర్స్‌లో కాయిన్‌మైనర్స్ ఘటనలు నమ్మశక్యం కాని రీతిలో 8,500 శాతం పెరిగాయని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ అమ్మకాలు, మైక్రో ఏటీఎంలు, ఎలక్ట్రానిక్ వాలెట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, స్మార్ట్ ఫోన్లు, యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్, సిమ్‌కార్డులు, వైర్‌లెస్ యూక్సెస్ రూటర్లు, ఆధార్‌తో అనుసంధానించిన పేమెంట్ సిస్టమ్‌లు వంటివాటికి భద్రత కల్పించేందుకు భారత కంప్యూటర్ ఎముర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టి-ఇన్) 21 సూచనలను విడుదల చేసింది. సైబర్ నేరాల్ని, బెదిరింపుల్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు అనేక చట్టపర, విధాన, సంస్థాగత చర్యలు తీసుకుంటున్నట్లు హోమ్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ‘‘సైబర్ నేరాలపై పరస్పర సమాచార మార్పిడికై పదిహేను దేశాలతో భారత్ ద్వైపాక్షిక సహకారం కోసం కృషి చేస్తోంది. తాజా సైబర్ బెదిరింపుల్ని అరికట్టడానికి సీఈఆర్‌టీ-ఇన్ సైతం క్రమం తప్పకుండా హెచ్చరికలు జారీ చేస్తోంది’’ అని ఓ అధికారి చెప్పారు.

అయితే దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాతే సైబర్ నేరాలు మరింత పెరిగాయని నిపుణులు అంటున్నారు. ‘‘నోట్ల రద్దు అనంతరం సైబర్ నేరాల్ని అడ్డుకోవడానికి చట్టంలో కొత్తగా నిబంధనలేవీ పొందుపరచలేదు. ఇవాళ సైబర్ నేరాలపై భారతీయ సమాచార సాంకేతిక చట్టం మృదువుగా వ్యవహరిస్తోంది. సైబర్ టెర్రరిజం, చైల్డ్ పోర్నోగ్రఫీని మినహాయిస్తే, ఇతర అన్ని సైబర్ నేరాలకు బెయిల్ లభిస్తోంది. దానర్థం నేరానికి పాల్పడ్డ వ్యక్తి బయటకు వచ్చి, సాక్ష్యాన్ని తుడిచేయడానికి ఆస్కారం కల్పిస్తున్నట్లే’’ అంటారు పవన్ దుగ్గల్. ఆయన సుప్రీంకోర్టులో సైబర్ చట్ట నిపుణుడు. 

imageసైబర్ బెదిరింపులనే సమస్య ఆర్థిక నేరాలతోనే ముడిపడి లేదు. అది టెర్రరిజాన్ని కూడా వ్యాప్తి చేస్తోంది. ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటూ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న కనీసం 20 ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సంబంధిత కేసుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పరిశోధిస్తోంది. ‘‘ప్రజల్ని తీవ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నవాళ్లు మనదేశంలో లేరు. వాళ్లు దేశంలో ఇప్పటికే ఉనికిలో ఉన్న మాడ్యూల్స్‌ను ఆపరేట్ చేస్తుంటారు. త్వరగా ప్రభావితమయ్యే యువతను గుర్తించి తమ పనుల్లోకి దించే టాస్క్‌లను వాళ్లకు అప్పగిస్తుంటారు’’ అని ఒక సీనియర్ ఎన్‌ఐఏ అధికారి తెలిపారు.

బ్యాంకుల సైబర్ భద్రత నిమిత్తం భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొన్ని మార్గదర్శకాల్ని విధించగా, హోమ్ మంత్రిత్వశాఖ సైతం వివిధ డ్రైవ్‌లను ప్రారంభించింది. ‘‘సైబర్ భద్రత విషయంలో ఐదేళ్ల కాలానికి సాంకేతిక సామర్థ్యాన్ని మెరుగు పర్చేందుకు రూ. 100 కోట్లతో ఒక ప్రత్యేక పరిశోధన, అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశారు. ‘సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్’ అనే కేంద్ర సెక్టార్ ప్రాజెక్ట్ కింద సైబర్ నేరాల్ని అరికట్టేందుకు అవసరమైన మౌలిక సదుపాయూల్నీ, సామర్థ్యాన్నీ కల్పించేందుకు మెుత్తం రూ. 195.83 కోట్ల అంచనా వ్యయూన్ని ఆమోదించాం.’’ అని కేంద్ర దేశీయ వ్యవహారాల సహాయమంత్రి హంసరాజ్ అహిర్ తెలియజేశారు.

బ్లాక్‌చెయిన్ నేరాలు
2017తో పోలిస్తే ఈ ఏడాది బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంబంధిత సైబర్ నేరాలు 629 శాతం పెరిగాయని సైబర్ భద్రతా సంస్థ మెకాఫీ విడుదల చేసిన ఓ నివేదిక తెలిపింది. హానికర మైనర్స్, క్రిప్టోజాకింగ్ సంఖ్యలో వృద్ధి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 2017 చివరి త్రైమాసికంలో 4 లక్షలున్న ఈ కేటగిరి సైబర్ క్రైమ్ శాంపిల్స్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2.9 మిలియన్లకు మించి పెరిగాయి. దీనికి కారణం ఫైనాన్స్, రిటైల్, హెల్త్‌కేర్, ఆటోమోటివ్ వంటి అన్ని రకాల రంగాలు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తుండటం. రికార్డుల్ని బ్లాక్స్ రూపంలో నిల్వచేసి, క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తూ ఒకదానికొకటి అనుసంధానం చేయడమే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ. దీన్ని క్రిప్టోకరెన్సీలకు విస్తృతంగా వినియోగిస్తున్నారు. అందుకే సైబర్ క్రిమినల్స్ వీటిని తరచూ లక్ష్యంగా చేసుకుంటున్నారు.

నేరగాళ్లకు నిరంతర ఆదాయం
అప్పుడప్పుడూ సిస్టమ్ పర్ఫార్మెన్స్ నెమ్మదించడం, ఎలక్ర్టిక్ బిల్లులు ఎక్కువగా రావడం వంటివి మినహాయిస్తే, మన సిస్టమ్ హ్యాక్‌కు గురైన విషయమే మనకు తెలీదు. రాన్సమ్‌వేర్ నోట్స్ ఉండవు. పాస్‌వర్డ్ లేదా క్రెడిట్ కార్డ్ నంబర్లను దొంగిలించిన ఫైల్స్ ఉండవు. మీ సిస్టమ్‌లో ఎక్కడ సమస్య ఉందో మంచి టెక్నీషియన్ కూడా కనిపెట్టలేడు. రాన్సమ్‌వేర్ ప్రొటెక్షన్‌ను సైబర్ సెక్యూరిటీ కంపెనీలు అందిస్తుండటంతో, దాని స్థానాన్ని అక్రమ క్రిప్టోమైనింగ్ చాలా వేగంగా రీప్లేస్ చేస్తోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అక్రమ క్రిప్టోమైనింగ్ విషయంలో ప్రతి నోడ్ స్వతంత్రంగా పనిచేస్తుంది. క్రిమినల్స్ చేయూల్సిందల్లా పలు మైనర్స్‌ను ఇన్‌స్టాల్ చేయడమే. ఇది చాలా సులువైన పని. ఇవాళ మిలియన్ల సంఖ్యలో సిస్టమ్స్ క్రిప్టోమైనింగ్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యూయని గుర్తించారు. అంటే ఏడాదికి 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయూన్ని ఈ సిస్టమ్స్ నేరగాళ్లకు అందిస్తున్నాయి. తొలిసారి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యూక, తక్కువ ఎఫర్ట్‌తోటే ఇది సాధ్యమవుతుంది. మరింత ముఖ్యమైన విషయం క్రిప్టోమైనింగ్‌కు గురైన విషయం తెలుసుకొనే అవకాశం చాలా తక్కువ కావడంతో, వీటి ద్వారా నిరంతరం నేరగాళ్లకు ఆదాయం లభిస్తుంటుంది. ‘‘మన స్మార్ట్ డివైస్‌లో రహస్యంగా మాల్‌వేర్ రన్ అవుతూ ఉండొచ్చు - మనం క్రిప్టో కరెన్సీ వినియోగదారులమా, కాదా అనేది అప్రస్తుతం. అక్రమ క్రిప్టోమైనర్‌తో మన వ్యక్తిగత సమాచారం మెుత్తం చౌర్యానికి గురయ్యే అవకాశం ఉంది’’ అంటారు ‘అవస్త్’లో సెక్యూరిటీ రీసెర్చర్‌గా పనిచేస్తున్న మార్టిన్ హ్రాన్. క్రిప్టోమైనర్ల దాడిని అడ్డుకోవడానికి సైబర్ సెక్యూరిటీ సంస్థలు ప్రభావవవతమైన టెక్నిక్స్‌ను డెవలప్ చేయగలిగితే, సైబర్ నేరగాళ్లు తిరిగి రాన్సమ్‌వేర్‌కు మళ్లే అవకాశం ఉంది.

ప్రపంచంలో మూడో స్థానంలో..
సైబర్ బెదిరింపుల విషయంలో ప్రపంచంలోనే ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో ఉందంటే.. మనవాళ్లు ఇంకెంత మాత్రమూ ఉపేక్షించకూడదని అర్థమవుతోంది. 2017లో ప్రపంచంలోని బెదిరింపుల్లో 5.09 శాతం భారతీయులు ఎదుర్కొన్నవే. ‘ఇంటర్నెట్ సెక్యూరిటీ థ్రెట్ రిపోర్ట్’ ప్రకారం 26.61 శాతంతో అమెరికా, 10.95 శాతంతో చైనా.. మనదేశానికంటే ముందున్నారు. మాల్‌వేర్, స్పామ్, ఫిషింగ్, బాట్స్, నెట్‌వర్క్ ఎటాక్స్, వెబ్ ఎటాక్స్, రాన్సమ్‌వేర్, క్రిప్టోమైనర్స్ అనే ఎనిమిది అంశాలపై ఈ గ్లోబల్ థ్రెట్ ర్యాంకింగ్‌ను నిర్ధారించారు. మనదేశం.. స్పామ్, బాట్స్ విషయంలో రెండో స్థానంలో, నెట్‌వర్క్ దాడుల్లో మూడో స్థానంలో, రాన్సమ్‌వేర్ విషయంలో నాలుగో స్థానంలో నిలుస్తోంది. దేశంలో కొత్తగా అక్రమ కాయిన్‌మైనింగ్ పెరుగుతోందని ఈ రిపోర్ట్ వెల్లడించింది.

పోనీ స్టీలర్
కొమొడో సైబర్‌సెక్యూరిటీ థ్రెట్ రీసెర్చి ల్యాబ్స్ జరిపిన అధ్యయనంలో ఇంకో విషయం కూడా వెల్లడైంది. దాని ప్రకారం ‘పోనీ స్టీలర్’ వంటి అధునాతన, ప్రమాదకర పాస్‌వర్డ్ దొంగలు బాగా పెరిగారు. పోనీ స్టీలర్ అనేది చాలా హెచ్చు స్థాయిలో డాటాను దొంగిలిస్తుంది. అది 36 క్రిప్టోకరెన్సీ వాలెట్లను లక్ష్యంగా చేసుకోగలదు. ఇది తమ సమాచారాన్ని దొంగిలిస్తోందనే విషయం బాధితులకు తెలీదు! యూంటీ వైరస్‌లకు చిక్కకుండా కొత్త కొత్త మాల్‌వేర్‌లను సైబర్ దొంగలు సృష్టిస్తున్నారు. ఈ ఏడాదే 241 దేశాల డొమైన్ కోడ్‌లతో ఉన్న 18 మాల్‌వేర్ రకాలను కొమెుడో కనిపెట్టింది!

మూల్యం చెల్లించుకుంటున్నాం
దేశంలో సగటు డాటా ఉల్లంఘటనలు 2017-18 ఆర్థిక సంవత్సరానికి 7.9 శాతం మేర పెరిగి, రూ. 11.9 కోట్ల మూల్యాన్ని సమర్పించుకున్నాయి. 42 శాతం ఉల్లంఘనలకు వైరస్, క్రిమినల్ దాడులే మూల కారణం. ఏడాదిలో 219 రోజుల్లో సైబర్ దాడులు జరిగాయి. గడచిన ఐదేళ్ల కాలంలో ఈ డాటా ఉల్లంఘనలు దాదాపు రెట్టింపయ్యాయి. 2013లో 9 మిలియన్ల రికార్డులు మాయమవగా, 2016 నాటికి 16 మిలియన్ల రికార్డులు కనిపించకుండా పోయాయి. 1 మిలియన్ రికార్డులు కోల్పోవడం వల్ల్ల సగటున జరిగే నష్టం 4 కోట్ల మిలియన్ డాలర్లు! 50 మిలియన్ రికార్డులు మాయమయ్యాయంటే, దానికి మనం చెల్లించిన మూల్యం 35 కోట్ల డాలర్లు! వీటిలో అత్యధిక శాతం వైరస్‌లు, క్రిమినల్ ఎటాక్‌ల వల్ల జరిగినవే.సినిమాపై చెరగని మచ్చలు

Updated By ManamSun, 07/29/2018 - 04:25

ఒకవైపు వాణిజ్యపరంగా ఎల్లలు దాటిన తెలుగు సినిమా పశ్చిమాన కూడా తన జెండాను రెపరెపలాడిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో బాలీవుడ్‌పై టాలీవుడ్ పైచేయి సాధిస్తోంది. మరోవైపు ఒకదాని తర్వాత ఒకటిగా పడుతున్న మచ్చలు దేశీయంగా తెలుగు సినిమా ఖ్యాతిని మసకబారుస్తున్నాయి. మొన్నటికి మొన్న డ్రగ్స్ వ్యవహారం.. నిన్నటికి నిన్న క్యాస్టింగ్ కౌచ్ దుమారం.. ఇప్పుడు అమెరికాలో జరిగిన సెక్స్ రాకెట్ ఉదంతం.. తెలుగు చిత్రసీమను ఉక్కిరిబిక్కిరి చేశాయి, ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఈ రోజు ఇది బయటకు వచ్చింది, రేపు ఇంకే విషయం వెలుగులోకి వస్తుందోనని సినీ జనాలు గుండెలుగ్గబట్టుకొని చూస్తున్నారు. సరిగ్గా ఏడాది వ్యవధిలో చోటు చేసుకున్న మూడు భిన్న స్కాండల్స్ టాలీవుడ్‌ను డిఫెన్స్‌లో పడేశాయి. ఎవరో కొద్దిమంది చేస్తున్న పనులకు మొత్తం పరిశ్రమనే వేలెత్తి చూపడం కరెక్టేనా?.. అనే ప్రశ్న వస్తున్నా, గ్లామర్ వరల్డ్ కావడమే దానిపై ఫోకస్‌కు కారణమని విశ్లేషకులు అంటున్నారు.
 

image

షాక్ 1: డ్రగ్స్ అండ్ టాలీవుడ్
ఈ మధ్య కాలంలో అటు సినీ వర్గాల్నీ, ఇటు సినీ ప్రియుల్నీ షాక్ చేసిన అతి పెద్ద కుదుపు డ్రగ్ కేసులు. డ్రగ్ పెడ్లర్స్‌గా పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన కెల్విన్ అండ్ గ్యాంగ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారంటూ పన్నెండు మంది టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బయటకు రావడం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాన్నీ, దేశీయంగా దిగ్భ్రమనూ కలిగించింది. 2017 జూలైలో చోటు చేసుకున్న ఈ ఘటనలు తెలుగు సినిమా ప్రతిష్ఠకు మచ్చగా నిలిచాయి. ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ విచారించిన imageవాళ్లలో రవితేజ, పూరి జగన్నాథ్, ఛార్మి వంటి పేరుపొందిన వాళ్లతో పాటు నవదీప్, తరుణ్, తనీశ్, నందు వంటి హీరోలు, ఐటమ్ సాంగ్స్‌కు పేరుపొందిన ముమైత్‌ఖాన్, నటుడు సుబ్బరాజు, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు వంటి వాళ్లు ఉండటం హాట్ టాపిక్ అయింది. మీడియా అటెన్షన్ మొత్తం అటువైపే పడటంతో, దానికి మించిన విషయం మరోటి లేనంతగా రచ్చరచ్చ అయింది. దీనిపై ఎవరికి తోచినట్లు వాళ్లు కథనాలు రాశారు, కథలు అల్లారు. సెలబ్రిటీలను అకున్ సభర్వాల్ గంటల తరబడి విచారించడం, కొందరి నుంచి రక్త నమూనాలను సైతం సేకరించడం అనేది అప్పట్లో జాతీయ స్థాయిలో సెన్సేషనల్ న్యూస్. విచారణ పూర్తయింది. త్వరలోనే దోషుల్ని తేల్చేస్తామన్నారు సభర్వాల్. డ్రగ్స్ ఉచ్చు ఏయే సెలబ్రిటీల మెడకు చుట్టుకుంటుందోనని అందరూ గుండెలు ఉగ్గబట్టుకొని చూశారు.

నెల, రెండు నెలలు.. ఏకంగా సంవత్సరం గడిచింది. ఇప్పటి వరకూ ఈ కేసు పురోగతి గురించిన సమాచారం లేదు. ఇంత కాలమైనా సెలబ్రిటీల్లో ఒక్కరు కూడా డ్రగ్స్ కేసులో దోషులుగా ఉన్నట్లు తేలలేదు. ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.. ఏ ఆధారాలతో చిత్రరంగంలో పేరు ప్రఖ్యాతులున్నవాళ్లను డ్రగ్స్ వ్యవహారంలో విచారించారు? ఆ వ్యవహారానికి ఎందుకంత ప్రచారం కల్పించారు? కెల్విన్ గ్యాంగ్ వద్ద లభ్యమైన పేర్ల ఆధారంగానే సెలబ్రిటీలను విచారించవచ్చా? అంతకు మించిన బలమైన ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదా? సినీ సెలబ్రిటీలను ఈ వ్యవహారంలోకి లాగడమంటే దానికి ఎక్కడలేని ప్రచారం వస్తుందనే విషయం కానీ, గట్టి ఆధారాలు లేకుండా వారిని విచారించడం వల్ల సమాజానికి ఎలాంటి సూచనలు వెళ్తాయనే విషయం కానీ ప్రభుత్వానికి తెలీకుండా ఉంటుందా?

నిజానికి ఈ పన్నెండు మంది సెలబ్రిటీల పేర్లే కాకుండా కొంతమంది రాజకీయ ప్రముఖులు, సినీరంగానికే చెందిన ఘన చరిత్ర కలిగిన ప్రముఖుల పిల్లల పేర్లు కూడా కెల్విన్ లిస్టులో ఉన్నాయనీ, ముందుగానే విషయం లీకవడంతో వాళ్లు తమ పేర్లు బయటకు పొక్కకుండా మేనేజ్ చేశారనీ, ఎలాంటి పెద్దతలకాయలు లేనివాళ్లే తెరపైకి వచ్చారనీ ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి కేసు ఏకపక్షంగా మారింది. ఇప్పుడైతే ఆ కేసు వ్యవహారం బుట్టదాఖలైనట్లే కనిపిస్తోంది.

షాక్ 2: క్యాస్టింగ్ కౌచ్
హాలీవుడ్‌లో పేరుపొందిన సీనియర్ ప్రొడ్యూసర్ హార్వే వీన్స్ తమను లైంగికంగా వేధించాడని అక్కడి పలువురుimage తారలు బాహాటంగా ప్రకటించడంతో క్యాస్టింగ్ కౌచ్ దుమారం పెద్ద ఎత్తున చెలరేగింది. ఐశ్వర్యారాయ్ సైతం హార్వే నుంచి త్రుటిలో తప్పించుకున్న వైనం కూడా వెలుగు చూసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘మీటూ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో అనేకమంది తమ అనుభవాలను షేర్ చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఉదంతం చర్చనీయాంశమైంది. ఆ గొడవ సద్దుమణుగుతున్న దశలో శ్రీరెడ్డి అనే ఎవరికీ పెద్దగా తెలీని తార పేల్చిన క్యాస్టింగ్ కౌచ్ బాంబు టాలీవుడ్‌ను అతలాకుతలం చేసేసింది. మహామహులనుకున్నవాళ్లే ఆమె దెబ్బకు బెంబేలెత్తారు.

జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలున్న నిర్మాణ సంస్థ సురేశ్ పొడ్రక్షన్స్ అధినేత డి. సురేశ్‌బాబు చిన్న కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్‌తో అతి సన్నిహితంగా ఉన్న ఫొటోలను మీడియా ముఖంగా శ్రీరెడ్డి బహిర్గతం చేయడంతో కేవలం చిత్రసీమే కాకుండా తెలుగు ప్రజానీకమంతా దిగ్భ్రాంతికి గురైంది. సినిమాల్లో అవకాశాలిస్తామని చాలామంది తనను వాడుకొని, వదిలేశారంటూ శ్రీరెడ్డి ఆరోపించారు. హీరోయిన్లు కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులైన స్త్రీలు కానీ సినిమాల్లో అవకాశం రావాలంటే తమ శరీరాన్ని పణంగా పెట్టాల్సిందేనని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తనకు సభ్యత్వం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందనీ ఆమె ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ ఫిల్మ్‌చాంబర్ సమీపంలో రోడ్డుపైనే ఆమె చేసిన అర్ధనగ్న ప్రదర్శన సమస్యను మరింత వేడెక్కించింది. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ప్రత్యక్షంగా పేర్లు ప్రస్తావించకుండా హీరో నాని, డైరెక్టర్ కొరటాల శివ, రైటర్ కోన వెంకట్‌లను ఉద్దేశించి శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేశారు. రకుల్‌ప్రీత్ సైతం క్యాస్టింగ్ కౌచ్ ద్వారానే హీరోయిన్ అవకాశాలు పొందిందని ప్రకటించిన ఆమె, ఆ తర్వాత రకుల్‌కు సారీ చెప్పారు. శ్రీరెడ్డి ఆరోపణలపై మొదట మౌనంగా ఉండిపోయిన నాని, కొరటాల, కోన.. ఆరోపణల దాడి అంతకంతకూ ఎక్కువవుతుండటంతో పెదవి విప్పారు. ఆమెతో తమకు ఏమాత్రం సంబంధం లేదనీ, తమ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించిన ఆమెపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామనీ చెప్పారు. నాని అయితే శ్రీరెడ్డికి నోటీసులు కూడా పంపారు.

శ్రీరెడ్డికి మద్దతు
క్యాస్టింగ్ కౌచ్‌కు సంబంధించి శ్రీరెడ్డికి పెద్ద తలకాయలెవరూ మద్దతు తెలపలేదు కానీ, కొంతమంది మహిళా సహాయimage ఆర్టిస్టులు ఆమెవైపు నిలిచారు. సినిమా అవకాశాల విషయంలో తాము ఎదుర్కొన్న అనుభవాలను టీవీ చానళ్ల ద్వారా పంచుకున్నారు. మెగా కుటుంబానికి దగ్గరైన ఓ కో డైరెక్టర్ తమను లైంగికంగా వేధించాడనీ, అతనికి పదహారేళ్ల అమ్మాయిలే కావాలంటూ ఆరోపించడం కలకలం రేపింది. ఈ సమయంలోనే శ్రీరెడ్డితో డైరెక్టర్ తేజ నేరుగా మాట్లాడి, ఆమెకు తన రెండు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారు. సీనియర్ సహాయ నటి అపూర్వ సైతం శ్రీరెడ్డికి మద్దతు ప్రకటించారు. అయితే టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదని కరాటే కల్యాణి వంటి మరో సహాయ నటి స్పష్టం చేశారు. రకుల్, మమతా మోహన్‌దాస్ వంటి తారలు తమకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురవలేదని చెప్పగా, మరో హీరోయిన్ రాధికా ఆప్టే తనను ఓ టాలీవుడ్ హీరో ఇబ్బంది పెట్టగా, అతడికి తను గట్టిగా బుద్ధిచెప్పానని ప్రకటించి సంచలనం సృష్టించారు. బాలీవుడ్‌లో సీనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ అయిన సరోజ్‌ఖాన్ అయితే క్యాస్టింగ్ కౌచ్‌లో తప్పేమీ లేదన్నట్లు మాట్లాడటం వివాదాల్ని సృష్టించింది.

ఇండస్ట్రీలో ఎవరూ బలవంతపెట్టరనీ, ఇష్టం ఉన్నవాళ్లే అందుకు సిద్ధపడుతున్నారనీ ఆమె చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేయడం నటీనటుల సంఘమైన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)కు తలనొప్పిగా మారింది. నడిరోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన వంటి చర్య ద్వారా సినీ ఇండస్ట్రీ పరువును శ్రీరెడ్డి మంటగలుపుతోందన్న ‘మా’.. మొదట ఆమెకు సభ్యత్వం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. కానీ శ్రీరెడ్డి ఆరోపణలకు గురవుతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం, వాళ్లలో పేరుపొందిన సినీ కుటుంబాల వాళ్లూ ఉండటంతో ఆమెకు సభ్యత్వం ఇస్తున్నామని ప్రకటించింది ‘మా’. దీంతో దాని ద్వంద్వ వ్యవహారశైలిపై విమర్శలు రేగాయి. 

శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించిన పవన్‌కల్యాణ్.. ఆమె ఆరోపణలు చేయడం కాకుండా నేరుగా ఆధారాలతో పోలీసులకు imageఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. దీంతో ఆమె పవన్‌తో పాటు, ఆయన తల్లినీ కూడా దూషించారు. దీనిపై దుమారం చెలరేగడంతో, ఆమెతో అలా మాట్లాడించింది తానేననీ, పవన్‌ను దూషిస్తే ఈ వ్యవహారంపై మరింతగా అటెన్షన్ పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఆమెకు సలహా ఇచ్చానంటూ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ తెరపైకి వచ్చారు. దీంతో ఈ వ్యవహారంలో ఫిల్మ్‌చాంబర్ ఏం చేస్తోందని ప్రశ్నిస్తూ పవన్‌కల్యాణ్ చాంబర్ కార్యాలయానికి వచ్చి హడావిడి చేశారు. తెలుగుదేశం పార్టీవాళ్లే తనను టార్గెట్ చేసి, వెనుక ఉండి శ్రీరెడ్డి చేత అలా మాట్లాడించారని ఆయన ఆరోపిస్తే, వైసీపీ పార్టీ నాయకులే తనను అలా చేయమన్నారని శ్రీరెడ్డి జరిపిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇలా ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు కూడా పులుముకుంది.

శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ సమస్య భవిష్యత్తులో మళ్లీ తలెత్తకుండా దీనిని డీల్ చేయడానికి ‘క్యాష్’ (కమిటీ ఎగనెస్ట్ సెక్సువల్ హెరాస్‌మెంట్)ను ఏర్పాటు చేయనున్నట్లు సినీ పెద్దలు ప్రకటించారు. ఇందులో సినిమావాళ్లతో పాటు, బయటి నుంచి కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారన్నారు. కానీ ఇంతవరకు ఈ ‘క్యాష్’ విషయం ఎంతవరకొచ్చిందో వెల్లడి కాలేదు. 

షాక్ 3: అమెరికాలో సెక్స్ రాకెట్
డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కథలింకా పూర్తిగా సద్దుమణగనే లేదు. జనం వాటిని తలచుకోవడం పూర్తిగా మాననే లేదు.. imageఅంతలోనే వచ్చిపడింది మరో ఉపద్రవం. అదీ సెక్స్ రాకెట్ రూపంలో! గతంలో ‘హోటల్‌లో వ్యభిచరిస్తూ పట్టుబడిన సినీతార’, ‘అపార్ట్‌మెంట్‌లో తారల హైటెక్ వ్యభిచారం’ అనే వార్తలు అప్పుడప్పుడూ కనిపించడం మనకు తెలుసు. కొన్నాళ్ల కిత్రం తొలి తెలుగు చిత్రంతోటే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న వర్థమాన తార హెదరాబాద్‌లోని పార్క్ హ్యాత్ అనే ఫైవ్‌స్టార్ హోటల్‌లో వ్యభిచరిస్తూ పట్టుబడిందన్న వార్త పతాక శీర్షికలకు ఎక్కడమూ మనకు తెలుసు. కానీ ఇది వాటన్నింటికంటే మించిన సెక్స్ రాకెట్. తెలుగు సినీ, టీవీ తారల ప్రమేయమున్న ఈ సెక్స్ రాకెట్‌కు అమెరికా వేదికవడంతో సహజంగానే ఈ ఉదంతం దేశం దృష్టిని ఆకర్షించింది. కృష్ణ మోదుగుముడి అనే దళారీ, అతని భార్య కలిసి ఏదో ఒక కార్యక్రమంలో అమెరికాకు వచ్చే తెలుగు తారలతో వ్యభిచారం చేయిస్తున్న వ్యవహారాన్ని అక్కడి పోలీసులు ఛేదించి, వెలుగులోకి తెచ్చారు. వాళ్లు ఒక తార విషయంలో లాగిన తీగతో డొంక కదిలింది. కృష్ణ నివాసంలో తనిఖీలు చేయడంతో విస్తుపోయే సెక్స్ రాకెట్ బయటపడింది. అమెరికన్ పోలీసులు పేర్లు వెల్లడి చేయలేదు కానీ, ఈ రాకెట్‌లో కొంతమంది తెలుగు తారలున్నారని స్పష్టం చేశారు. ఈ ఉదంతంపై జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో వచ్చిన కథనాలు తెలుగు చిత్ర పరిశ్రమ ఒక మురికి కూపమనే భావనను కలిగించాయి. అతి కొద్దిమంది చేసిన తప్పులకు మొత్తం పరిశ్రమను నిందించడం న్యాయమా?.. అనేవాళ్ల ఆవేదనను పట్టించుకున్నవాళ్లు లేరు.

అసలు అమెరికాలో సినీ తారలు, యాంకర్లు వ్యభిచరించడమేమిటనేది అందర్నీ ఆశ్చర్యానికి లోను చేసిన విషయం.image కృష్ణ, అతని భార్య విటులతో కేవలం వెయ్యి, రెండు వేల డాలర్లకే డీల్ కుదుర్చుకొని తారలను వాళ్ల వద్దకు పంపిస్తున్నారనే విషయం మరింత ఆందోళన కలిగించింది. మన ప్రాంతాన్ని విడిచి అమెరికాలో నివాసముంటున్న వాళ్లు సంఘాలుగా ఏర్పడి, అప్పుడప్పుడూ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ, అతిథులుగా సినీ తారలను, యాంకర్లను పిలవడం మామూలే. ఒకటికి మించి తెలుగు సంఘాలు ఏర్పడి, వాటి మధ్య నెలకొన్న పోటీ కారణంగా కార్యక్రమాల్ని ఘనంగా చేశామని చెప్పుకోడానికి తారల్ని పిలవడం ఆనవాయితీ కావడంతో, తారలకూ ఇది ఆటవిడుపుగానూ, లాభదాయకంగానూ తయారైంది. సాధారణంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పిలిచినప్పుడు తారలు షూటింగ్‌లతో బిజీగా ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఖాళీగా ఏ తారలున్నారనే విషయం తెలుసుకోడానికి దళారీలు అవసరమయ్యారు. అమెరికా వెళ్లే తారలకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం దగ్గర్నుంచి, అమెరికాలో ఉండేందుకు వసతులు ఏర్పాటు చేయడం వరకూ చూసుకునే దళారీలు పుట్టుకొచ్చారు. ఈ సందర్భంలో తెలుగు తారలతో గడపడానికి ఆసక్తిచూపే అమెరికాలోని డబ్బున్న కొంతమంది తెలుగువాళ్లకు ఇది బాగా పనికొచ్చింది. దళారీలకు కావాల్సింది డబ్బు. దానితో ఇక్కడి తారలతో అక్కడ సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ వస్తున్నారనేది తాజాగా బయటపడిన భయంకర నిజం.

imageఅలా అని ప్రవాసాంధ్రుల కార్యక్రమాలకు వెళ్లే తారలందరినీ ఒకే గాటన కట్టడం తప్పు. ఇటీవలే తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి, పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఒక హీరోయిన్‌ను ఇలాంటి పనులు చేయడానికి సంప్రదించినప్పుడు, ఆమె దాన్ని తిరస్కరించడమే కాకుండా, పోలీసులను ఆశ్రయించారు. దాంతో ఈ భాగోతం బయటపడింది. తనతోనూ ఇలాంటి పని చేయించడానికి కృష్ణ మోదుగుమూడి ఫోన్‌లో సంప్రదించాడనీ, తాను తిరస్కరించడంతో సరిపెట్టకుండా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాననీ ఒక పేరుపొందిన యాంకర్ వెల్లడించారు. తమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తారలతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారనే విషయం తెలియడంతో అక్కడి తెలుగువాళ్లలో చాలామంది దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో తమకు అతిథులుగా వచ్చే తారల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని వాళ్లు భావిస్తున్నారు.

సాఫ్ట్ టార్గెట్!
యాజమాన్యం కారణంగా ఒక కార్మికుడు ఇబ్బందులు ఎదుర్కొంటే, అతడిని కాపాడ్డానికి కార్మిక సంఘం రంగంలోకి దిగుతుంది. ఒక రాజకీయ నాయకుడు సమస్యల్లో చిక్కుకుంటే, అతడిని పార్టీ కాపాడుకుంటుంది. మరి సినిమా వ్యక్తి కష్టాల్లో పడితే? ఆదుకోవడానికి ఎవరూ రారనేది సాధారణాభిప్రాయం. సినీ రంగమనేది సాఫ్ట్ టార్గెట్‌గా మారిపోతోందని చాలా కాలం నుంచే సినిమావాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో కానీ, క్యాస్టింగ్ కౌచ్ విషయంలో కానీ, ఇప్పుడు సెక్స్ రాకెట్ ఉదంతంలో కానీ.. సినిమా రంగాన్నంతా బోనులో నిలబెట్టినట్లు సమాజం వ్యవహరిస్తోందని వాళ్లు వాపోతున్నారు. ఇండస్ట్రీలోని వ్యక్తుల మధ్య ఐకమత్యం లోపించడంతో, ఒక్క గొంతుకగా మారలేక పోతున్నారు, నినదించలేక పోతున్నారు. సినిమావాళ్లు నోరు మెదపలేక పోవడం వల్లే డ్రగ్స్ కేసు రచ్చకెక్కిందనేది విశ్లేషకుల అభిప్రాయం. శ్రీరెడ్డి ఉదంతంలోనూ చిత్రసీమ ఒక్కతీరుగా వ్యవహరించలేక పోయింది. ఇప్పుడు సెక్స్ రాకెట్ వ్యవహారంపైనా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది. ఇలా దేనికీ పట్టనట్లు ఉన్నంత కాలం టాలీవుడ్ సాఫ్ట్ టార్గెట్ అవుతూనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఇకనుంచైనా తన తీరును టాలీవుడ్ మార్చుకుంటుందా, సమస్యలను ఎదుర్కొనే విషయంలో ఒక్కతాటిపై నిలుస్తుందా?

కోలీవుడ్ కూడా..
పరిస్థితి అదుపు తప్పుతున్నదని భావించిన సినీ పెద్దలు టీవీ చానళ్లతో చేసిన సంప్రదింపుల ఫలితంగా శ్రీరెడ్డి వ్యవహారం కొద్ది రోజుల పాటు సద్దుమణిగినట్లు కనిపించింది. పేరున్న చానళ్లన్నీ ఆమెను దూరం పెట్టేశాయి. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఏవో రాయడం మినహా ఆమెపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. అంతలోనే ఆమె మరో బాంబు పేల్చారు. తమిళ చిత్రసీమకు చెందిన ప్రముఖ దర్శకులు ఎ.ఆర్. మురుగదాస్, లారెన్స్, సి. సుందర్ (ఖుష్బూ భర్త), నటుడు శ్రీకాంత్ (శ్రీరామ్) వంటి వాళ్లు తనకు అవకాశాలిస్తామని చెప్పి వాడుకొని వదిలేశారని ఆమె ఆరోపించడం కలకలం రేపింది. దీనిపై స్పందించాలని మరో సీనియర్ డైరెక్టర్ టి. రాజేందర్ డిమాండ్ చేయడంతో సి. సుందర్ స్పందించారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన శ్రీరెడ్డిపై లీగల్‌గా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. హీరో కార్తి స్పందిస్తూ, శ్రీరెడ్డి ఆధారాలతో న్యాయపోరాటం చేస్తే బావుంటుందని సూచించారు. ఈ వ్యవహారంపై హీరో విశాల్ తనను బెదిరించారని ఆరోపించిన శ్రీరెడ్డి, ఆ తర్వాత విశాల్‌కు క్షమాపణలు చెప్పారు. కోలీవుడ్‌లో ఈ రగడ ఇంకా నడుస్తూనే ఉంది.


 అసలు సిసలు బిగ్‌బాస్

Updated By ManamSun, 07/29/2018 - 04:05

imageసినిమా ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరో ఎవరు? నంబర్ వన్ హీరోయిన్ ఎవరు?.. అనేవి సహజంగా ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో నయా ట్రెండ్ వచ్చి చేరింది. అదే ‘బుల్లితెర రారాజు ఎవరు?’ అనే ప్రశ్న. చాలా కష్టమైన ప్రశ్న కదూ! సినిమాలైతే అభిమానుల సంఖ్య, బ్లాక్‌బస్టర్ హిట్స్, కలెక్షన్స్, రెమ్యూనరేషన్ వగైరాలను పరిగణనలోకి తీసుకుంటారు. అదే టీవీలో అయితే ఇదంతా ఉండదు. సింపుల్.. జనాల నోటి మాట.. రేటింగ్స్! ఇవి చాలు వారం రోజుల్లో టీవీని ఏలే సత్తా ఉన్న హీరో ఎవరో తేల్చేందుకు. టీవీ తెరపైకి వచ్చేందుకు పెద్ద ీహ రోలు సాధారణంగా జంకుతారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అలా కాదు. తన ఫ్యాన్స్‌కు పండగ తెస్తారు! అంతే కాదు.. ప్రోగ్రామ్‌ను అమాంతంగా పరిగెత్తిచ్చి, ఎంటర్‌టైన్‌మెంట్‌లో ముంచేస్తారు. గెస్టులు, పార్టిసిపెంట్లు, యాంకర్లు, వీక్షకులు అందరినీ ప్రోగ్రామ్‌లో ఇన్వాల్వ్ అయ్యేలా చేసే సత్తా ప్రస్తుత హీరోల్లో ఒక్క తారక్‌కే ఉందని మరోసారి ‘ఢీ 10’ గ్రాండ్ ఫినాలే తేల్చేసింది.

‘ఢీ 10’ పైనే చూపు
ఓ వైపు వీకెండ్ మాటీవీలో నాని ప్రయోక్తగా వ్యవహరిస్తోన్న ‘బిగ్ బాస్’ టెలికాస్ట్ అవుతుంటే మరోవైపు ‘ఢీ 10’image ఫైనల్స్ అదరగొట్టాయంటే అదంతా తారక్ క్రెడిట్! ఈ రియాల్టీ షోలో తారక్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ‘బిగ్ బాస్’ తొలి సీజన్ ప్రెజెంటర్‌గా బుల్లితెరపై అందరికీ మరింత చేరువైన యంగ్ టైగర్, ‘ఢీ’ ఫైనల్స్‌తో మరోసారి తనకు తిరుగులేదని చాటుకున్నారు.  వీకెండ్ ‘బిగ్‌బాస్ 2’ బాగా అలరించిందా? లేక ‘ఢీ 10’  గ్రాండ్ ఫినాలేతో ఎంజాయ్ చేశారా?.. అనడిగితే, ‘‘తారక్ ‘స్వింగ్ జరా..’ సాంగ్ డ్యాన్స్ చూసి ఫిదా అయ్యాం’’ అన్నవారే అత్యధికులంటే మ్యాటర్ ఏంటో అర్థమైపోతుంది.

హైజాక్ చేసిన యంగ్ టైగర్
మరోవైపు తారక్ ఫ్యాన్స్ ఏకంగా పూనకం వచ్చేసినట్టు నెట్‌లో పోస్టులతో ఒకటే సందడి చేశారు. ఇంకా చేస్తూనే imageఉన్నారు. ‘‘సింహాల మధ్య అదిరిపోయిన సింగమలై ఎంట్రీ’’ అంటూనే.. సుడిగాలి సుధీర్‌తో తారక్ ఫన్నీగా మాట్లాడి నవ్వించిన విధానం, అక్సాఖాన్‌తో మాట్లాడి, ఆడి పాడిన తీరు ‘వావ్..’ అనిపించేసిందంటూ చిన్నా పెద్దా అందరూ తారక్‌ను అభినందిస్తున్నారు. 2010లోనూ ‘ఢీ 2’ ఫైనల్స్‌కు చీఫ్ గె స్ట్‌గా వచ్చిన తారక్ మరోసారి ఎంట్రీ ఇచ్చి టీవీ ఇండస్ట్రీలో తనకు తానే పోటీ అని చాటుకున్నట్టు షోలో హంగామా సాగింది.  పార్టిసిపెంట్లతో ముచ్చటించిన స్టార్ హీరో మాటలు ఎంత ముచ్చటగా ఉన్నాయో అనుకుంటూ లివింగ్ రూమ్‌లోని టీవీసెట్లకు ప్రేక్షకులు అతుక్కుపోయారు. వినోదం పంచుతూ, తన మాటలతో ఆకట్టుకున్న యంగ్ టైగర్ తన కరిష్మాతో ప్రైమ్‌టైమ్‌ను భలేగా హైజాక్ చేసేశాడే!.. అనుకుంటూ సగటు ప్రేక్షకుడు తేరుకునేలోగా ప్రోగ్రాం అయిపోయింది. ఎన్టీఆర్ సత్తాను బుల్లితెరపై రుచి చూసిన ప్రేక్షకులు తమకు తెలీయకుండానే ఇతర ఏ హీరో టీవీ షోల్లో కనిపించినా ‘‘తారక్ అయితే.. తారక్‌తో పోల్చితే.. ‘బిగ్ బాస్’ సీజన్ 1లో ఫలానా సందర్భంలో జూనియర్ ఇలా అన్నాడు.. అలా అన్నాడు’’ అంటూ పోల్చి చూడటం చాలా సహజంగా మారింది. అంటే టీవీ తెరపై ‘బిగ్ బాస్’గా తారక్ ఎస్టాబ్లిష్ అయ్యారు. అందుకే ఏ హీరో ప్రెజెంటేషన్, యాంకరింగ్‌నైనా తనతో కంపేర్ చేసి మార్కులు వేసేలా తారక్ బెంచ్‌మార్క్‌ను సెట్ చేశారన్న మాట!

భార్గవి కరణంకంటి నిండా.. నిద్ర!

Updated By ManamSun, 07/29/2018 - 03:46

image‘కంటి నిండా నిద్రపోవాలి.. కడుపునిండా తినాలి’ అంటారు. కొత్త టెక్నాలజీ పుణ్యం కొంత, ఉద్యోగాలలో ఒత్తిడి మరికొంత కలిపి ఈ రెండూ కష్టమే అవుతున్నాయి. మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్, కాదంటే ఐప్యాడ్ పట్టుకుని నిద్రపోయే ముందు గంట.. గంటన్నర పాటు చూస్తూ కూర్చుంటే దాన్నుంచి వచ్చే నీలిరంగు కాంతి మన నిద్రను మొత్తం పాడు చెయ్యడమే కాదు.. కళ్లను కూడా దెబ్బ తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
image

పాత రోజుల్లో అయితే సాయంత్రం 5-6 గంటలకల్లా ఇళ్లకు చేరుకునేవారు. రాత్రి 7.30 లోపు అన్నం తినేసి, కాసేపు ఇంటిల్లిపాదీ కూర్చుని కబుర్లు చెప్పుకుని, పిల్లలు స్కూలుకు సంబంధించిన హోమ్‌వర్క్ పూర్తి చేసి 9.30 గంటల లోపు నిద్రపోయేవారు. పొద్దున్నే 5-6 గంటల లోపు నిద్ర లేచేవారు. దానివల్ల కావల్సినంత ఆరోగ్యం కూడా ఉండేది. రాత్రిపూట తిన్న తర్వాత ఒకటి రెండు గంటల విశ్రాంతి ఉండటం, ఆ తర్వాత  నిద్రపోవడం మంచిదని ఇప్పుడు కొత్త డైటీషియన్లు కూడా చెబుతున్నారు. ఎర్లీ డిన్నర్ చేస్తే చాలావరకు వ్యాధులు నివారించవచ్చని అంటున్నారు. దానికితోడు.. రాత్రి 10 గంటల లోపు నిద్రకు ఉపక్రమించి, ఆ తర్వాత అసలు ఎలాంటి గాడ్జెట్ల వైపు చూడకుండా ఉంటే హాయిగా కంటినిండా కావల్సినంత నిద్ర దొరుకుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ, గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి.. నిజంగా మీరు అలా కంటినిండా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఆఫీసుల నుంచి వచ్చేసరికే కొంతమందికి 8, మరికొందరికి 10 దాటుతుంది. ఆ తర్వాత కాస్త ఫ్రెషప్ అయ్యి, ఫోన్లు మాట్లాడుకుంటూ తినేసి, మంచం మీద నడుం వాల్చడం.. అప్పుడు వాట్సాప్ మెసేజిలు, ఫేస్‌బుక్ చాటింగులు, ఈ రెండూ కాదంటే యూట్యూబ్‌లో తాము మిస్సయిన రియాల్టీ షోల ఎపిసోడ్లు... దాదాపు రెండు మూడు గంటల పాటు ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే పక్కమీదకు వెళ్తున్నారు.   

నీలికాంతితో ప్రమాదం
ప్రధానంగా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఈ-రీడర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే నీలిరంగు imageకాంతి వల్ల మనకు వచ్చే నిద్ర పాడవ్వడమే కాక, నిద్రపట్టిన తర్వాత కూడా అది చాలావరకు కలత నిద్రగానే ఉంటుంది తప్ప పూర్తిగా నిద్రపోవడం దాదాపు ఉండదట. సాధారణంగా చీకటి పడిందంటే విశ్రాంతి తీసుకోవాలని ప్రకృతి సహజంగానే చెబుతుంది మన శరీరం. కానీ, మనం మాత్రం సూర్యుడు పడమటి కొండల్లో వాలిన తర్వాత కూడా కృత్రిమ కాంతిని ముఖం మీద వేసుకుంటూ గంటల తరబడి అవిశ్రాంతంగా గడిపేస్తున్నాం. దానివల్ల నిద్ర సరిగా పట్టకపోవడం, పొద్దున లేచిన తర్వాత కూడా అలసట, బడలికగా ఉండటం మనం అనుభవిస్తున్నాం. దీన్నుంచి బయటపడేందుకు, కంటినిండా సుఖంగా నిద్రపోయేందుకు చాలా మార్గాలున్నాయి. వాటిని అవలంబించేవాళ్లు తక్కువే గానీ.. అమలు చేస్తే మాత్రం బోలెడన్ని ఉపయోగాలుంటాయి. 

నీలిరంగు కాంతి కళ్ల మీద పడుతుంటే, ఇంకా నిద్రపోయే సమయం ఆసన్నం కాలేదని మెదడు మన శరీరానికి చెబుతుందని నిపుణులు వివరిస్తున్నారు. కంటిలోపల సుమారు 30 వేల కణాలుంటాయని, అవన్నీ నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యానికి స్పందిస్తాయని డాక్టర్ మైఖేల్ జె. బ్రూస్ చెబుతున్నారు. నీలిరంగు దాదాపు 460 నానోమీటర్ శ్రేణి వరకు వెళ్తుందని, ఈ రకం కాంతి కణాలను ఢీకొని, మెదడులో సుప్రాచియాస్మాటిక్ కేంద్రకం వద్దకు వెళ్లి, అక్కడి నుంచి మెలటోనిన్ ఉత్పత్తిని ఆపేయిస్తుందని ఆయన వివరించారు. మెలటోనిన్ అనేది మనం నిద్రపోడానికి కావల్సిన అత్యంత ముఖ్యమైన పదార్థం. 

మన శరీరంలో ఒక రకమైన గడియారం పనిచేస్తుంటుంది. దాన్నే బాడీ క్లాక్ అంటారు. సాధారణంగా మనం రాత్రి నిద్రపోయే ముందు పొద్దున్నే నాలుగు గంటలకు లేచి ఫ్లైట్ అందుకోవాల్సి ఉంటుందని అనుకుంటే, మనం అలారం పెట్టుకున్నా కూడా ఐదు నిమిషాల తక్కువ నాలుగు గంటలకు అలారం మోగకముందే ఠక్కుమని మెలకువ వస్తుంది. అదీ బాడీక్లాక్ మహిమ. కానీ, నీలికాంతి మన శరీరంలో ఉండే బాడీక్లాక్ పనితీరును కూడా స్తంభింపజేస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి నిద్ర సరిగా పట్టనపుడు ఎవరైనా వైద్యుల వద్దకు వెళ్తే, వారి నిద్ర సమయాలను సరిగా ఫిక్స్ చేసేందుకు బ్లూలైట్ థెరపీనే ఉపయోగిస్తారు. దాని ద్వారా వారు సరిగ్గా ఫలానా సమయానికి ప్రతిరోజూ పడుకునేలా శిక్షణ ఇస్తారు. ఆ సమయానికి వారికి సమీపంలో ఎక్కడా కాంతి.. ముఖ్యంగా నీలిరంగు కాంతి అన్నది లేకుండా చూస్తారు. దానివల్ల మెదడు నిద్రపోవాలన్న సంకేతాలను పంపడంతో పాటు.. నిద్రపోయేందుకు శరీరాన్ని కూడా సిద్ధం చేస్తుంది.

ఈ-రీడర్‌ను పక్కన పెట్టాలి 
గడిచిన 50 ఏళ్లలో క్రమంగా నిద్రపోయే సమయం, నిద్ర నాణ్యత రెండూ తగ్గిపోయాయని హార్వర్డ్ మెడికల్ స్కూలుకు చెందిన పరిశోధకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇలా నిద్రపోయే సమయం, నాణ్యత తగ్గడం వల్ల సాధారణ ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటోందట. సాయంత్రం పూట కాంతిని ఎక్కువగా వెదజల్లే ఈ-రీడర్లను ఉపయోగించడం వల్ల నిద్ర మీద చాలా దుష్ప్రభావం పడుతుందని, తర్వాతి రోజు ఉదయం అప్రమత్తత కూడా తగ్గుతుందని వివరించారు. అదే సాధారణంగా ఉండే ముద్రించిన పుస్తకాలు చదివితే అంత ఎక్కువ ప్రభావం ఉండదట. మోయడానికి వీలుగా ఉండటం, ఎక్కువ బరువు, స్థలం అవసరం లేకుండానే కావల్సినన్ని పుస్తకాలను అందులో లోడ్ చేసుకుని చదువుకునే వీలుండటం వ ల్ల చాలామంది ఈ-రీడర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, ఒకే సమయం పాటు పుస్తకం చదివినవారు, ఈ-రీడర్ చదివిన వారిని చూస్తే నడుం వాల్చిన తర్వాత నిద్ర పట్టడానికి ఈ- రీడర్ చదివేవాళ్లకు పది నిమిషాల సమయం ఎక్కువ పట్టడంతో పాటు, నిద్రపోయిన తర్వాత కూడా లోపల కనుగుడ్లు అటూ ఇటూ వేగంగా తిరుగుతుండ టాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. అంతేకాదు, ఈ-రీడర్లలో చదివిన వాళ్లు సాయంత్రం అయ్యేసరికి బాగా అలసటగా ఉందని చెప్పడం, ఉదయం కూడా అది కొనసాగడం లాంటి లక్షణాలు కనిపించాయి. 

తగినంత నిద్ర లేకపోతే చాలా దుష్ప్రభావాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుండెపోటు, ఊబకాయం, మధుమేహం, కొన్ని రకాల కేన్సర్లు కూడా నిద్రలేమి వల్ల వస్తాయట. ఎక్కువ కాలం పాటు రాత్రి షిఫ్టులలో ఉద్యోగాలు చేసేవారికి లేదా తీవ్రంగా నిద్రలేమితో బాధపడేవారికి ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇవే కాదు.. సరిగా నిద్రపోకపోతే మూడ్ పాడవ్వడం, ఆందోళన, డిప్రెషన్ ఎక్కువై.. చివరకు డ్రైవింగ్‌లో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువే అవుతాయట. 

మెలటోనిన్ తగ్గిపోతోంది
ఎక్కువ కాలం పాటు నీలిరంగు కాంతి కళ్ల మీద పడుతుంటే కాటరాక్ట్ త్వరగా రావడంతో పాటు చివరకు అంధత్వం కూడా సంభవించే ప్రమాదం ఉందని లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్తమాలజీకి చెందిన ప్రొఫెసర్ జాన్ మార్షల్ వివరించారు. సాధారణంగా వయసుతో పాటు మాత్రమే వచ్చే కాటరాక్ట్ (కంటిలో శుక్లాలు) నీలికాంతిని ఎక్కువగా చూసేవాళ్లకు 5 నుంచి 10 సంవత్సరాలు ముందుగా వస్తాయని ఆయన అన్నారు. 460 నానోమీటర్ల తరంగదైర్ఘ్యంతో వచ్చే నీలికాంతి మెలటోనిన్ ఉత్పత్తిని పూర్తిగా ఆపేస్తుందని ఆయన చెప్పారు. సాధారణంగా మొబైల్, ఐప్యాడ్ లాంటి వాటి స్క్రీన్ల వైపు చూసినపుడు దాని నుంచి వచ్చే బహుళరంగులతో కూడిన ఇమేజి మన రెటీనా మీద పడుతుందని, అది ఫేడ్ అవ్వడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుందని వివరించారు. గదిలో వేసుకునే లైట్లు, ఎల్‌ఈడీ బల్బులు కూడా దాదాపు ఇలాంటి ప్రభావాన్నే కలిగిస్తాయట. పడుకోడానికి ముందు ఎక్కువ సేపు లైట్లు వేసుకుని ఉంటే మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతుందని, 99% మందిలో ఇది కనిపించిందని అన్నారు. ట్యూబ్ లైట్ల వల్ల అయితే ఇలాంటి ప్రభావం ఉండదని, కానీ ఎల్‌ఈడీలతో మాత్రం ఇబ్బంది ఎక్కువని ప్రొఫెసర్ మార్షల్ చెప్పారు. 

చేయకూడనివి ఇవే..
ట్యూబ్‌లైట్లు, టీవీ స్క్రీన్లు చేసే చేటు కంటే ఎల్‌ఈడీ బల్బులుimage, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు చేసే కీడు ఎక్కువ. అందువల్ల కావాలంటే టీవీ చూడచ్చు గానీ ఇవి చూడకూడదని అంటున్నారు. అంతేకాదు, ఇలాంటి కాంతి కంటికి ఎంత దగ్గర నుంచి పడితే అంత చేటు చేస్తుంది. అందుకే దగ్గర నుంచి ఫోన్, ట్యాబ్ చూడటం కంటే దూరం నుంచి టీవీలు చూడటం మంచిదని చెబుతున్నారు.

ఉదయాన్నే ఏం చేయాలి..
మన బాడీక్లాక్ సరిగ్గా పనిచేయాలంటే రాత్రి ఒకవేళ నిద్ర సరిగా పట్టినా, పట్టకపోయినా ఉదయం లేచిన తర్వాత పావుగంట సేపు సూర్యకాంతి మన మీద పడేలా చూసుకోవాలి. ప్రతిరోజూ ఉదయాన్నే బయటకు వెళ్లి పావుగంట పాటు సూర్య నమస్కారాల లాంటివి చేస్తే శరీరానికి వ్యాయామంతో పాటు జీవక్రియలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. కంటికి కూడా ఉదయపు సూర్యకాంతి తగలడం చాలా మంచిదని యోగా బోధకులు చెబుతున్నారు. శరీరంలో ప్రతి ఒక్కరికీ అంతర్గతంగా ఉండే బాడీక్లాక్‌ను రీసెట్ చేయడానికి పావుగంట సేపు ఉదయపు సూర్యకాంతిని మించిన ఔషధం లేద ని డాక్టర్ బ్రూస్ చెప్పారు.
 
తప్పనిసరైతే.. 
ఒకవేళ ఫోన్లు చూడటం తప్పనిసరైతే అప్పుడు కొన్ని ప్రత్యేకమైన అద్దాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటికి రంగు అద్దాలుంటాయి. అవి నీలిరంగు కాంతిని నేరుగా కళ్లకు తగలకుండా ఫిల్టర్ చేస్తాయి. మనకు కళ్లజోడు ఉంటే ఆ పవర్ ఉన్న అద్దాలకు కూడా ఇలాంటి కోటింగ్ వేయించుకోవచ్చు. గాస్ గ్లాసులు అనే మరో రకం లెన్సుల మీద అనేక లేయర్లుగా కోటింగ్ ఉంటుంది. అది 440 నానోమీటర్ల కాంతిని కూడా ఫిల్టర్ చేస్తుంది. ఇవి పెట్టుకుని చూస్తే కళ్లమీద అంత ప్రభావం ఉండదని, దానివల్ల నిద్ర కూడా సరిగానే పడుతుందని చెబుతున్నారు. 
- రఘురామ కామేశ్వరరావు పువ్వాడధూమపానంతో దృష్టి దోషం!

Updated By ManamSun, 07/29/2018 - 03:29

imageపొగతాగే వాళ్లలో శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తులు, గొంతు, నోటి కేన్సర్లు, గుండె జబ్బులు వస్తాయని చాలా మందికి తెలుసు. అయితే శరీరంలోని మిగతా అవయవాలు కూడా ధూమపానం వల్ల ప్రభావితమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్లు తాగడం వల్ల కళ్లకీ, దృష్టికీ కూడా నష్టమనే విషయం చాలా మందికి తెలియదు. చూపు కోల్పోవడానికీ, శుక్లాలకూ పొగతాగడం నేరుగా కారణమవుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా ఇటు పొగ తాగేవాళ్లలోనూ, అటు పొగ పీల్చేవాళ్లలోనూ ఒక స్థాయిలో కంటి సమస్యలు తలెత్తుతున్నాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. పొగతాగే అలవాటున్న స్త్రీలు గర్భం దాల్చినట్లయితే నెలలు నిండకుండానే ప్రసవించడానికి ఆస్కారం ఎక్కువవుతుందనీ, అలా పుట్టిన పిల్లల్లో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనే వ్యాధి పెరిగే అవకాశం ఉంటుందనీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన చికిత్స చేయించకపోతే దీని వల్ల పిల్లలు చూపును కోల్పోయే ప్రమాదముంది. 

సిగరెట్ పొగలో తారు, పాలీసైక్లిక్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మల్‌డీహైడ్, భార లోహాల వంటి నాలుగు వేల క్రియాశీలక విషపూరిత పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాలు.. శుక్లాలు, డయాబెటిక్ రెటినోపతి, పొడి కన్ను, ఆప్టిక్ న్యూరోపతి వంటి వయసు సంబంధిత కంటి సమస్యల్ని పెంచుతాయి. అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధుల్లో అంధత్వం కలగడానికి వయసు సంబంధిత మాక్యులార్ డిజనరేషన్ (ఏఎండి) ప్రధాన కారణం. కేవలం ధూమపాన ప్రియుల్లో మాత్రమే కాదు, వాళ్లు పొగ తాగుతున్నప్పుడు దగ్గరగా ఉన్నవాళ్లలోనూ పొగ కారణంగా కళ్ల మంటలు, దురదలు వస్తాయి. పొగాకు వినియోగానికీ, అనేక ఆరోగ్య సమస్యలకీ నేరుగా సంబంధం ఉంది. ధూమపానాన్నీ, పొగాకు వినియోగాన్నీ విడనాడితే కేవలం వాళ్లకే కాకుండా, వాళ్లు ప్రేమించేవాళ్లకూ ప్రయోజకరమే.

కంటి చూపును రక్షించుకోవాలంటే..
- ధూమపానం విడిచిపెట్టాలి.
- ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
-  ప్రధానంగా ఆకుపచ్చ కూరలు, సి, ఇ విటమిన్లు, బేటా కెరోటీన్
   అధికంగా ఉండే పళ్లు తీసుకోవాలి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- బీపీ, కొలెస్టెరాల్ స్థాయిలు నార్మల్‌గా ఉండేట్లు చూసుకోవాలి.ఒక గుహ.. వెయ్యి చేయూతలు

Updated By ManamMon, 07/23/2018 - 06:37

ప్రమాదం సంభవించినప్పుడు భయం ఆవహిస్తుంది. కానీ ఆ భయాన్ని తోసిరాజంటూ దాన్ని అధిగమించే అవకాశం కోసం వెదకడమే సిసలైన గుండె ధైర్యం. అదిగో.. ఆ గుండె ధైర్యం వల్లే పదమూడు జీవితాలు పునర్జన్మించాయి. 
ఆ పన్నెండు మంది పిల్లలు సహా, వారి గురువు కూడా తిరిగి పుట్టారు. 
 

image

23 జూన్ 2018, శనివారం.. ఎడతెరపి లేని వర్షం. 
ఆ రోజే పీరాపట్ సోంపియాంగై అనే కుర్రాడికి 17వ పుట్టినరోజు. అతని ముద్దు పేరు ‘నైట్’. యవ్వనంలో అడుగుపెట్టే ముందు ప్రతి యువకునికి ఈ 17వ పుట్టిన రోజు అపురూపమైంది. ‘నైట్’ కుటుంబం కుర్రాడి పుట్టిన రోజు కోసం ప్రత్యేకమైన కేక్‌ను తయారు చేసింది. ఆత్మీయులందరూ రంగురంగుల బహుమతుల్ని తెచ్చారు. ఉదయమే నైట్ ఇంటి నుంచి బయలుదేరాడు. 

అతనొక ఫుట్‌బాల్ క్రీడాకారుడు. స్థానిక ఫుట్‌బాల్ క్లబ్ ‘మూపా’ (వైల్డ్‌బోర్స్)లో నైట్ కూడా సభ్యుడు. ఆ రోజు తన స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాడతను. మిత్రుడి పుట్టిన రోజున ఏదైనా సాహసం చేయాలని అనుకున్నారంతా. ప్రాక్టీస్ పూర్తవగానే నైట్ సహా పన్నెండు మంది పిల్లలు, తమ ఫుట్‌బాల్ కోచ్ ఎక్పోల్ చాంటావోంగ్ (25)తో కలిసి థామ్ లాంగ్ పర్వతప్రాంతంలోని ఒక కొండగుహ దగ్గరికి వెళ్లారు. అంతే..! నైట్ కుటుంబం అతని కోసం రాత్రంతా ఎదురు చూసింది. అతనితో పాటు వెళ్లిన పిల్లలు, కోచ్ కూడా తిరిగి ఇళ్ళకు చేరుకోలేదు. ఆ రోజు నుంచి దాదాపు రెండు వారాలకు పైగా ప్రపంచమంతా ఆ పిల్లల కోసం ఆతృతగా ఎదురు చూసింది.

imageథాయ్‌లాండ్‌లో పన్నెండు మంది పిల్లలు, వారి కోచ్ ప్రమాదవశాత్తు ఒక కొండగుహలో చిక్కుకుపోవడం ప్రపంచంలో అందరి హృదయాల్ని కలచి వేసింది. ప్రమాదాలు జరగని రోజు, జరగని చోటు ఈ భూమ్మీద దాదాపు ఉండనే ఉండదు. కానీ ఈ ప్రమాదం మాత్రం దేశపుటెల్లల్ని చెరిపేసి, ప్రతి ఒక్కరిలోని మాతృత్వాన్ని నిద్రలేపింది. పదమూడు మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడినప్పుడు ప్రపంచమంతా ‘హమ్మయ్య!’ అంటూ ఊపిరి తీసుకుంది. ఇంతటి సంచలనానికి వేదికైన థామ్‌లాంగ్ పర్వతగుహను ఒక స్మృతిచిహ్నంగా అభివృద్ధి చేస్తామని థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రకటించిందంటే, మానవీయ విలువల రీత్యా ఈ సంఘటన ఎంతటి స్పందనకు కేంద్రబిందువుగా మారిందో అర్థం చేసుకోవచ్చు. థామ్‌లాంగ్ కొండగుహలో పిల్లలు చిక్కుకుపోయిన తరువాత వారిని రక్షించడం దాదాపు అసాధ్యమనే మాటలే ఎక్కువగా వినిపించాయి. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గుండె నిబ్బరపు కథనం ఇది.

ఏం జరిగింది?
‘నైట్’ పుట్టినరోజునాడు పిల్లలంతా కలిసి, ఫుట్‌బాల్ ప్రాక్టీస్ పూర్తయిన తరువాత సైకిళ్ళ మీద, పంటపొలాల వెంట షికారుకెళ్లారు. వారితో పాటు కోచ్ చాంటావోంగ్ కూడా వెళ్లాడు. అలా సైకిళ్ళ మీద వెళుతూ, వెళుతూ కొండప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే మేఘావృతమైన ఆకాశం వర్షించడం మొదలు పెట్టింది. సన్నటి జల్లుల్లో తడుస్తూ అనుకున్న గమ్యానికి చేరాలన్న ఉత్సాహం మరింత బలపడింది. వారి గమ్యం థామ్‌లాంగ్ గుహ. థాయ్‌లాండ్‌లో సాహసికులందరికీ అదొక స్వప్నసీమ. 

తనలోని లోయల రహస్యాల్ని, శిఖరాల సందేశాల్ని ఆకాశానికి వినిపిస్తూ ఎదురుగా మాయ్‌సీ పర్వతం నిటారుగా imageనిలబడి ఉంది. పర్వతప్రాంతంలోని థామ్‌లాంగ్ గుహ దగ్గరికి రాగానే పిల్లలందరిలో కట్టలు తెంచుకున్న ఆనందం. సైకిళ్ళని, ఫుట్‌బాల్ షూలని, వెంట తెచ్చుకున్న అదనపు వస్తువుల్ని గుహ వాకిట్లోనే పడేసి, పొలోమని గుహలోకి ఒకటే పరుగు. గుహ లోపల ఎనిమిది కిలోమీటర్ల వరకు సజావుగా నడిచి వెళ్లిపోయారు. పోతూ పోతూ గుహ గోడల మీద కొత్తగా తమ టీమ్‌లోకి చేర్చుకోవాలనుకున్న ఫుట్‌బాల్ నేస్తాల పేర్లని చెక్కుకుంటూ వెళ్లారు. మసక చీకటి తెరలు జారుతున్నాయి. గుహలో చీకటి నెమ్మదిగా పేరుకుంటోంది. చేతుల్లో టార్చిలైట్లకి పని చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. గుహలో ఎక్కువ సేపు గడపాలని వాళ్ళు అనుకోలేదు, మహా అయితే ఒక్క గంట..! అలా అనుకున్న ఆ ఒక్క గంట.. రెండు వారాల వరకు తన పొడవైన చీకటి చేతుల్ని చాచి, వాళ్ళని కమ్మేసింది. నైట్ ఇంట్లో పుట్టినరోజు కేక్‌ను ఎవరూ ముట్టుకోలేదు. పిల్లవాడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.

‘వైల్డ్‌బోర్స్’కి ఏమైంది?
థాయ్‌లాండ్, మయన్మార్‌ను వేరుపరుస్తూ పది కిలోమీటర్ల వరకు పరచుకున్న పర్వతశ్రేణి అది. థాయ్‌లాండ్‌లోని నాలుగవ అతిపెద్ద గుహల సముదాయం థామ్‌లాంగ్. విశ్రమించిన ఒక స్త్రీ ఆకారంలో ఉండే ఈ పర్వతశ్రేణి పూర్తి పేరు థామ్‌లాంగ్ కున్‌నామ్ నాంగ్నన్. ఎన్నో థాయ్ జానపద కథలు ఈ ‘విశ్రమించిన మహిళ’ చుట్టూ అల్లుకుని ఉన్నాయి. ఎన్నెన్నో జలధారలు ఈ పర్వతసానువుల మీద మోకరిల్లుతుంటాయి. అందం ఎంత ప్రమాదకరమైందో చెప్పడానికి ఈ థామ్‌లాంగ్ గుహలే ఉదాహరణ. ఎందరెందరో ఇప్పటికే ఈ పర్వత గుహల్లో కనుమరుగయ్యారు, కన్నుమూశారు. ముఖ్యంగా వర్షాకాలం ఈ గుహలు మరింత ప్రమాదకరంగా మారతాయి. వర్షాకాలంలో గుహలో పదహారు అడుగుల మేరకు వరద నీరు ఉప్పొంగుతుంది. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే గుహలోకి వెళ్లడానికి వీలుగా ఉంటుంది. అలాంటిది ఈ పిల్లలు జూన్ నెలలో ‘సరదా’ పడ్డారు. 

‘‘గుహలో నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంది. ఆ నీరు చాలా మడ్డిగా ఉంది. గుహలో చిమ్మచీకటి అలముకుంది’’ అని స్థానిక గైడ్ జాషువా మోరిస్ చెప్పాడు. గుహలో నీటి చుక్క కనబడనంత వరకే ఎవరి ప్రాణాలకైనా హామీ. ఒక్కసారి వరదపోటు మొదలైందంటే, గజ ఈతగాళ్లకు కూడా ప్రాణాలు నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. ఈ గుహలోకి సాహస యాత్ర చేయాలన్న ఆలోచన చాలా రోజుల నుంచే ఉన్నట్టుంది ఈ పిల్లలకి. వాళ్ళ వాట్సాప్ మెసేజ్‌లలో దీని మీద చర్చ కూడా సాగినట్టు తెలుస్తోంది. పిల్లలు గుహలో చిక్కుకు పోయిన విషయం తెలిసిన వారి కుటుంబాలు గుహముఖం దగ్గరికి చేరుకున్నాయి. అక్కడ వాళ్ళకి తమ పిల్లల సైకిళ్ళు, ఫుట్‌బాల్ షూలు, సంచులు దొరికాయి. తమ కలలపంటల క్షేమం కోసం కళ్ళు కాయలు కాసేలా వాళ్ళు ఎదురు చూడడం ప్రారంభించారు. 

‘ధ్యానమే’ ప్రాణదాత?
గుహలో లోతుకు వెళ్ళే కొద్దీ పిల్లలు ప్రమాదంలో చిక్కుకున్న సంకేతాల్ని పసిగట్టారు. అప్పటికే కొద్దిరోజులుగా కొండమీద కురుస్తున్న వర్షపు నీరంతా ఏదో ఒక మార్గం గుండా కిందికి ప్రవహించాలి. ఆ మార్గమే థామ్‌లాంగ్ గుహ. గుహలో వరదపోటు అంతకంతకూ పెరుగుతోంది. బయటికి వెళ్లిపోతేనే మంచిదని వాళ్ళకి అనిపించింది. తక్షణం బయటికి వెళ్లడానికి ఉద్యుక్తులయ్యారు. కానీ ఆ తొందరలో వాళ్ళు దారితప్పి మరింత లోపలికి వెళ్లిపోయారు. చుట్టూ చీకటి, ఎముకలు కొరికే చలి, ‘కాలం’తో సంబంధం తెగిపోయింది. గుహలోపల ఒక రాతి మీద అందరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఉండిపోయారు. ఆ కౌగిలిలో జీవితేచ్ఛ తప్ప మరో ప్రాణస్పందన లేదు. భయం ఆవరించింది. అయినా బతికి తీరాలన్న పట్టుదల పెరుగుతూనే ఉంది. తాము కూర్చున్న రాయి పక్కన ఉన్న గుహ గోడలో ఐదు మీటర్ల లోతుకు రాళ్ళతోనే చెక్కారు. ఒక అరలా తయారైందది. అందులో దాక్కున్నారు. ఫుట్‌బాల్ కోచ్ ఎక్పోల్ నిజజీవితంలో ఒక బౌద్ధ సన్యాసి కూడా! పిల్లలకు అప్పటికప్పుడు ‘ధ్యానం’ (మెడిటేషన్)లోని మెళకువల్ని నేర్పించాడు. గుహలో ఉన్న కొద్దిపాటి ప్రాణవాయువును పొదుపుగా వాడుకోవడమెలాగో, మానసికంగా ధృఢంగా ఉండడమెలాగో వారికి నేర్పించాడతను. ఆహారం లేదు. గుహ గోడల నుంచి బొట్టుబొట్టుగా కారుతున్న నీటితో దాహం తీర్చుకున్నారు. చేతిలో టార్చిలైట్లు వారికి చీకటి నుంచి రక్షణనిచ్చాయి. గుహగోడల్లో సున్నపురాయి ఎక్కువగా ఉండడం వల్ల ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అవసరమైన గాలి కూడా లభించింది. తీరని కష్టంలో కూడా అనుకూలమైన పరిస్థితుల్ని గుర్తించడమంటే ఇదే. ఎవరైనా కాపాడకపోతారా అన్న ఆశే మినుకుమినుకుమంటోంది!

‘ఎవరైనా ఉన్నారా, కాపాడతారా?’
గుహ లోపల జీవన్మరణ పోరాటం జరుగుతుండగానే, గుహ బయట పిల్లల్ని రక్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ‘థాయ్ నేవీ సీల్స్’ అనే ఉన్నత థాయ్ పోలీసు బృందాలు, ఇతర రక్షక బృందాలు, స్థానిక స్వచ్ఛంద కార్యకర్తలు అవిశ్రాంతంగా పిల్లల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకానొక గుహలోపల పిల్లలు నడచి వెళ్లిన ఆనవాళ్ళు దొరికాయి. కానీ వాళ్ళు సజీవంగా ఉన్నారా, లేరా అన్నది తెలియలేదు. వాతావరణం తన కాఠిన్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. మెలికలు తిరిగిన గుహమార్గం గుండా వెళ్లి పిల్లల ఆచూకీని వెదకడం ప్రాణాలతో చెలగాటమాడడమే. పైగా పొంగుతున్న వరద.. గుహలోపలి వరద ఉధృతి థాయ్ గజ ఈతగాళ్ళకు కూడా పెనుసవాలే! ఏం చేయాలో ఎవరికీ తోచడం లేదు. నీటిని తోడడానికి పైపుల్ని, గుహని తొలిచేందుకు ఉలుల్ని, ఇంకా ఎన్నెన్నో ఉపకరణాల్ని పోగు చేసుకుని ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం శూన్యం! పిల్లల స్నేహితుల్లో ఒకరికి తన స్నేహితులంతా కలిసి గుహలో వెళ్లాలనుకున్న చోటు గురించి మాట్లాడుకోవడం జ్ఞాపకం వచ్చింది. ఆ చోటే, పట్టాయా బీచ్. గుహలోపల ఉన్న ఒక చిన్న ఇసుకమేట. పిల్లలు అక్కడ దొరుకుతారా?

ప్రార్థనల వెల్లువ
గుహలోపల చావును చావుదెబ్బ కొట్టేందుకు అన్ని దారుల అన్వేషణ సాగుతుండగా, గుహ బయట పిల్లల కుటుంబాలు వారి కోసం ప్రతి రోజూ పడిగాపులు కాశాయి. ఫుట్‌బాల్ కోచ్ చాంటావోంగ్ నాయనమ్మ తుమ్ కాంటావోంగ్ ప్రతిరోజూ గుహ ముంగిట కొవ్వొత్తులు వెలిగించి, పండ్లని, ఫలహారాల్నీ ఉంచి, చేతులు జోడించి ప్రార్థించేది. ‘‘పిల్లల్ని ప్రాణాలతో మాకు అప్పగించాలని నేను ఈ గుహను పాలిస్తున్న దైవశక్తుల్ని ప్రార్థిస్తున్నా’’ అంటూ ఆమె కన్నీటితో చెప్పింది. క్రమంగా ఆ పిల్లలు చదువుతున్న పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు గుహ ముందు గుమికూడి, సామూహిక ప్రార్థనలు చేయడం మొదలైంది. పిల్లల బంధువులకు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారికి స్థానికులు విరాళాలు పోగు చేసి, అన్నపానీయాల్ని అందించడం ప్రారంభించారు. 

అంతర్జాతీయ సాయం
image28 జూన్,
గురువారం నాడు థాయ్‌లాండ్ గుహలో చిక్కిన పిల్లల్ని రక్షించేందుకు గుహ ముందు అంతర్జాతీయ సాయం అడుగు పెట్టింది. అమెరికా, బెల్జియం, స్కాండినేవియా, చైనా, ఆస్ట్రేలియాలకు చెందిన వైమానిక, సైనిక నిపుణులు పిల్లల్ని కాపాడే బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. జూలై ఒకటో తేదీన.. అంటే, పిల్లలు తప్పిపోయిన వారం రోజులకు వాళ్ళని కాపాడే పనిలో ఒక ముందడుగు పడింది. గుహలోపల ఒక అతిపెద్ద బొరియలోకి రక్షక నిపుణులు ప్రవేశించగలిగారు. ఇద్దరు బ్రిటిష్ డైవర్లు జాన్ వొలాంథెన్, రిక్ స్టాంటన్‌లు వరదకు ఎదురొడ్డి గుహలోకి ప్రయాణించారు. సహాయక బృందాలకు మార్గదర్శకంగా నిలిచి, ఎట్టకేలకు పట్టాయా బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా చీకటిగానే ఉంది. కానీ గాలి చొరబడే ప్రాంతమది. ఎక్కడ అలాంటి అవకాశం కనిపించినా వాళ్ళిద్దరూ అక్కడి గాలిని వాసన చూసే వాళ్ళు. పిల్లల ఆచూకీని కనిపెట్టేందుకు అదొక మార్గం. పిల్లల కోసం అరిచే వాళ్ళు. అలా కొన్ని వందల మీటర్ల దూరం ముందుకు వెళ్లాక, వాళ్ళ ప్రయత్నం ఫలించింది. పిల్లల ఉనికిని కనిపెట్టారు. కానీ అప్పటికే వారి టార్చిలైట్లు మొరాయించడం మొదలెట్టాయి. పిల్లల్ని లెక్కించారు.. కోచ్ సహా పదమూడు మంది! వాళ్ళిద్దరూ పిల్లలతో కాసేపు గడిపారు. వాళ్ళకి ధైర్యం చెప్పారు. తమతో తెచ్చుకున్న లైట్లని వారికి ఇచ్చేశారు. తిరిగి మళ్ళీ వస్తామని, ఆహారాన్ని తెస్తామని మాట ఇచ్చారు. పిల్లలతో తాము గడిపిన క్షణాల్ని కెమెరాల్లో బంధించారు. 

ఫలించిన ‘డాక్టర్’ వ్యూహం
పిల్లల్ని విజయవంతంగా కాపాడడంలో ఆస్ట్రేలియన్ డాక్టర్ రిచర్డ్ హారిస్ చేసిన సూచన ప్రధాన పాత్ర పోషించింది.image పిల్లల ఉనికిని గుర్తించిన తరువాత పంపుల సహాయంతో నీటిని తోడడం మొదలుపెట్టారు. అయినప్పటికీ పిల్లల్ని బయటికి తీసుకురావాలంటే, వాళ్ళని నీటి మధ్య నుంచే తేవలసి ఉంటుంది. అందుకే మొదటి 1.7 కిలోమీటర్ల దూరం వరకు పిల్లల్ని గజ ఈతగాళ్ళే మోసుకు రావలసి ఉంటుంది. తరువాత ఒకటిన్నర కిలోమీటర్ల దూరాన్ని పిల్లల్ని కర్రల మీద మోసుకు రావచ్చునన్న పథకం సిద్ధమైంది. ఈలోగా థాయ్ సైన్యం పిల్లల్ని రక్షించేందుకు అవసరమైన వెట్‌సూట్లు, ఫుల్‌ఫేస్ స్క్యూబా మాస్క్‌లు, అండర్ వాటర్ లైట్లు తదితర వస్తువుల్ని సిద్ధం చేశారు. వీటిలో ఫుల్‌ఫేస్ స్క్యూబా మాస్కుల్ని అమర్చడం క్లిష్టతరమైన పని. ఎందుకంటే అవి చిన్నపిల్లలకు సరిపోయేవి కావు. అలాంటివి థాయ్‌లాండ్‌లో ఉండవు కూడా! గుహలో చిక్కుకున్న పిల్లల్లో అత్యంత పిన్నవయస్కుడైన చానిన్ విబూన్‌రంగ్యుయోంగ్‌కి పదకొండేళ్ళు.

 ఈ పిల్లవాడిని రక్షించడమే కష్టం. నిజానికి థాయ్ అధికారులు వర్షాలు తగ్గేంతవరకు పిల్లల్ని గుహలో ఉంచడం తప్ప మరో మార్గం లేదని భావించారు. కానీ చాలా మంది నిపుణులు ఈ ఆలోచనను తిరస్కరించారు. అప్పటి దాకా గుహలో ఆక్సిజన్ పరిమాణం ప్రాణాల్ని నిలబెట్టుకునేందుకు చాలదు. అంతేగాక జూలై 7న గుహలో పెద్దయెత్తున వరద తాకిడి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు తరువాత పిల్లల్ని రక్షించడం అన్న మాటే ఉండదు. ఇంత ప్రమాదంలోనూ పిల్లలు పిల్లలే! వాళ్ళకి ఈ సమస్యలేమీ తెలియవు. ‘‘నేను డైవింగ్ చేయబోతున్నాను..’’ అంటూ ఉత్సాహంగా కేకలు పెట్టారు. పిల్లలకు ఈ లోగా మానసిక ఆందోళనను తగ్గించే మందుల్ని సరఫరా చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఆస్ట్రేలియన్ డాక్టర్ రిచర్డ్ హారిస్ బలహీనంగా ఉన్న పిల్లల్ని మొదట తరలించాలని సూచించారు. ఎవర్ని ముందుగా తరలించాలో సూచిస్తూ కోచ్ ఎక్పోల్ ఒక జాబితా తయారు చేశారు. ముందుగా చానిన్ విబూన్‌రంగ్యుయోంగ్‌తో పాటు, మరో పిల్లవాణ్ణి తరలించారు. సహాయక చర్యల్లో ప్రధాన భూమిక నిర్వహించిన డానిష్ గజ ఈతగాడు క్లాస్ రాస్మూస్సేన్, థాయ్ గజ ఈతగాడు రూన్‌గ్రెట్ చాంగ్ వాన్యూన్‌లు పట్టాయా బీచ్‌కి చేరుకుని, మరో గజ ఈతగాని సహాయంతో పిల్లల్ని తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఆదివారం మధాహ్నం 2.30 గంటలకు ఒక గజ ఈతగాడు మొదటగా ఇద్దరు పిల్లల్ని పట్టాయా బీచ్‌కు చేర్చాడు. అక్కడి నుంచి ఏటవాలుగా, బురద మట్టితో కూడిన దారి వెంట కర్రల మీద వారిని గుహముఖ భాగానికి చేర్చే పని సవాలుగా మారింది. అయినా విజయం సాధించారు. సోమవారం అర్ధరాత్రికి పిల్లలందర్నీ విజయవంతంగా గుహ నుంచి బయటకు తీసుకు వచ్చారు. పిల్లలందర్నీ ఇలా బయటకు తెచ్చారో, లేదో.. గుహలో నీటి ప్రవాహ ఉధృతి కళ్ళముందే పెరిగి పోయింది. గుహ మొత్తం నీటిమయమై పోయింది. దీనికి దైవ సంబంధమైన కారణాన్ని ఎవరూ చెప్పక పోయినప్పటికీ, అందరి మనసులు ‘ధన్యవాదాల’తో నిండిపోయాయి. 

బలిదానం
imageఇంతటి అపాయకరమైన సందర్భంలో అందరి మనసుల్ని తేలిక పరుస్తూ, పిల్లలు సురక్షితంగా బయటికి వచ్చారు. కానీ వారిని రక్షించడం కోసం ఒకరు తన ప్రాణాల్ని బలిపెట్టక తప్పలేదు. ఆ వ్యక్తి థాయ్ మాజీ నేవీ సీల్ సార్జంట్ మేజర్ సమన్ గునన్ ఈ సహాయక చర్యల్లో ప్రాణాలు కోల్పోయి, విషాదాన్ని మిగిల్చారు. ముప్ఫై ఎనిమిదేళ్ళ గునన్ సైన్యం నుంచి పదవీ విరమణ చేసినప్పటికీ, పిల్లల్ని కాపాడేందుకు స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గుహలో తగినంత మోతాదులో ఆక్సిజన్‌ను నింపడానికి ఎయిర్ ట్యాంకుల్ని చేరవేస్తూ, పరుగెత్తి, పరుగెత్తి, శ్వాస అందక ఆయన కన్నుమూయడం అందరినీ కలచి వేసింది. గునన్ భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం సత్తాబ్ జిల్లాలోని సైనిక శిబిరానికి తరలించారు. అక్కడ ఆయనకు గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా థాయ్‌లాండ్ రాజు ఆదేశించారు.
 
పిల్లల్ని గుహ నుంచి నేరుగా
స్థానిక ఆసుపత్రికి తరలించి, వైద్యసహాయాన్ని అందించారు. వారిలో కొంతమందికి ఘనimage ఆహారాన్ని ఇవ్వకుండా, ద్రవాహారాన్నే ఇచ్చారు. కొందరు మాత్రం మొదటిరోజే బ్రెడ్, చాక్లెట్‌లు తిన్నారు. గుహలో చిక్కుకున్న పన్నెండు మంది పిల్లలు, వారి కోచ్‌ను సురక్షితంగా బయటకు తెచ్చే ఈ ఆపరేషన్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యిమందికి పైగా పాల్గొన్నారు. రష్యాలో జరుగుతున్న వరల్డ్‌కప్ ఫైనల్‌లో పాల్గొనాల్సిందిగా ‘ది వరల్డ్ సోకర్ ఫెడరేషన్’ పిల్లల్ని ఆహ్వానించింది. కానీ పిల్లలు ఇంకా తేరుకోలేదు. అందుకే ఈ వరల్డ్ కప్ ఫైనల్‌కి వాళ్ళని పంపడం లేదు. థాయ్ గుహలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా హాలీవుడ్ చిత్రాన్ని నిర్మించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పిల్లలందరూ ‘థాయ్ కేవ్‌బాయ్స్’గా ప్రసిద్ధులయ్యారు!

Related News