sunday special

ధూమపానంతో దృష్టి దోషం!

Updated By ManamSun, 07/29/2018 - 03:29

imageపొగతాగే వాళ్లలో శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తులు, గొంతు, నోటి కేన్సర్లు, గుండె జబ్బులు వస్తాయని చాలా మందికి తెలుసు. అయితే శరీరంలోని మిగతా అవయవాలు కూడా ధూమపానం వల్ల ప్రభావితమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్లు తాగడం వల్ల కళ్లకీ, దృష్టికీ కూడా నష్టమనే విషయం చాలా మందికి తెలియదు. చూపు కోల్పోవడానికీ, శుక్లాలకూ పొగతాగడం నేరుగా కారణమవుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా ఇటు పొగ తాగేవాళ్లలోనూ, అటు పొగ పీల్చేవాళ్లలోనూ ఒక స్థాయిలో కంటి సమస్యలు తలెత్తుతున్నాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. పొగతాగే అలవాటున్న స్త్రీలు గర్భం దాల్చినట్లయితే నెలలు నిండకుండానే ప్రసవించడానికి ఆస్కారం ఎక్కువవుతుందనీ, అలా పుట్టిన పిల్లల్లో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనే వ్యాధి పెరిగే అవకాశం ఉంటుందనీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన చికిత్స చేయించకపోతే దీని వల్ల పిల్లలు చూపును కోల్పోయే ప్రమాదముంది. 

సిగరెట్ పొగలో తారు, పాలీసైక్లిక్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మల్‌డీహైడ్, భార లోహాల వంటి నాలుగు వేల క్రియాశీలక విషపూరిత పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాలు.. శుక్లాలు, డయాబెటిక్ రెటినోపతి, పొడి కన్ను, ఆప్టిక్ న్యూరోపతి వంటి వయసు సంబంధిత కంటి సమస్యల్ని పెంచుతాయి. అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధుల్లో అంధత్వం కలగడానికి వయసు సంబంధిత మాక్యులార్ డిజనరేషన్ (ఏఎండి) ప్రధాన కారణం. కేవలం ధూమపాన ప్రియుల్లో మాత్రమే కాదు, వాళ్లు పొగ తాగుతున్నప్పుడు దగ్గరగా ఉన్నవాళ్లలోనూ పొగ కారణంగా కళ్ల మంటలు, దురదలు వస్తాయి. పొగాకు వినియోగానికీ, అనేక ఆరోగ్య సమస్యలకీ నేరుగా సంబంధం ఉంది. ధూమపానాన్నీ, పొగాకు వినియోగాన్నీ విడనాడితే కేవలం వాళ్లకే కాకుండా, వాళ్లు ప్రేమించేవాళ్లకూ ప్రయోజకరమే.

కంటి చూపును రక్షించుకోవాలంటే..
- ధూమపానం విడిచిపెట్టాలి.
- ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
-  ప్రధానంగా ఆకుపచ్చ కూరలు, సి, ఇ విటమిన్లు, బేటా కెరోటీన్
   అధికంగా ఉండే పళ్లు తీసుకోవాలి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- బీపీ, కొలెస్టెరాల్ స్థాయిలు నార్మల్‌గా ఉండేట్లు చూసుకోవాలి.ఒక గుహ.. వెయ్యి చేయూతలు

Updated By ManamMon, 07/23/2018 - 06:37

ప్రమాదం సంభవించినప్పుడు భయం ఆవహిస్తుంది. కానీ ఆ భయాన్ని తోసిరాజంటూ దాన్ని అధిగమించే అవకాశం కోసం వెదకడమే సిసలైన గుండె ధైర్యం. అదిగో.. ఆ గుండె ధైర్యం వల్లే పదమూడు జీవితాలు పునర్జన్మించాయి. 
ఆ పన్నెండు మంది పిల్లలు సహా, వారి గురువు కూడా తిరిగి పుట్టారు. 
 

image

23 జూన్ 2018, శనివారం.. ఎడతెరపి లేని వర్షం. 
ఆ రోజే పీరాపట్ సోంపియాంగై అనే కుర్రాడికి 17వ పుట్టినరోజు. అతని ముద్దు పేరు ‘నైట్’. యవ్వనంలో అడుగుపెట్టే ముందు ప్రతి యువకునికి ఈ 17వ పుట్టిన రోజు అపురూపమైంది. ‘నైట్’ కుటుంబం కుర్రాడి పుట్టిన రోజు కోసం ప్రత్యేకమైన కేక్‌ను తయారు చేసింది. ఆత్మీయులందరూ రంగురంగుల బహుమతుల్ని తెచ్చారు. ఉదయమే నైట్ ఇంటి నుంచి బయలుదేరాడు. 

అతనొక ఫుట్‌బాల్ క్రీడాకారుడు. స్థానిక ఫుట్‌బాల్ క్లబ్ ‘మూపా’ (వైల్డ్‌బోర్స్)లో నైట్ కూడా సభ్యుడు. ఆ రోజు తన స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాడతను. మిత్రుడి పుట్టిన రోజున ఏదైనా సాహసం చేయాలని అనుకున్నారంతా. ప్రాక్టీస్ పూర్తవగానే నైట్ సహా పన్నెండు మంది పిల్లలు, తమ ఫుట్‌బాల్ కోచ్ ఎక్పోల్ చాంటావోంగ్ (25)తో కలిసి థామ్ లాంగ్ పర్వతప్రాంతంలోని ఒక కొండగుహ దగ్గరికి వెళ్లారు. అంతే..! నైట్ కుటుంబం అతని కోసం రాత్రంతా ఎదురు చూసింది. అతనితో పాటు వెళ్లిన పిల్లలు, కోచ్ కూడా తిరిగి ఇళ్ళకు చేరుకోలేదు. ఆ రోజు నుంచి దాదాపు రెండు వారాలకు పైగా ప్రపంచమంతా ఆ పిల్లల కోసం ఆతృతగా ఎదురు చూసింది.

imageథాయ్‌లాండ్‌లో పన్నెండు మంది పిల్లలు, వారి కోచ్ ప్రమాదవశాత్తు ఒక కొండగుహలో చిక్కుకుపోవడం ప్రపంచంలో అందరి హృదయాల్ని కలచి వేసింది. ప్రమాదాలు జరగని రోజు, జరగని చోటు ఈ భూమ్మీద దాదాపు ఉండనే ఉండదు. కానీ ఈ ప్రమాదం మాత్రం దేశపుటెల్లల్ని చెరిపేసి, ప్రతి ఒక్కరిలోని మాతృత్వాన్ని నిద్రలేపింది. పదమూడు మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడినప్పుడు ప్రపంచమంతా ‘హమ్మయ్య!’ అంటూ ఊపిరి తీసుకుంది. ఇంతటి సంచలనానికి వేదికైన థామ్‌లాంగ్ పర్వతగుహను ఒక స్మృతిచిహ్నంగా అభివృద్ధి చేస్తామని థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రకటించిందంటే, మానవీయ విలువల రీత్యా ఈ సంఘటన ఎంతటి స్పందనకు కేంద్రబిందువుగా మారిందో అర్థం చేసుకోవచ్చు. థామ్‌లాంగ్ కొండగుహలో పిల్లలు చిక్కుకుపోయిన తరువాత వారిని రక్షించడం దాదాపు అసాధ్యమనే మాటలే ఎక్కువగా వినిపించాయి. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గుండె నిబ్బరపు కథనం ఇది.

ఏం జరిగింది?
‘నైట్’ పుట్టినరోజునాడు పిల్లలంతా కలిసి, ఫుట్‌బాల్ ప్రాక్టీస్ పూర్తయిన తరువాత సైకిళ్ళ మీద, పంటపొలాల వెంట షికారుకెళ్లారు. వారితో పాటు కోచ్ చాంటావోంగ్ కూడా వెళ్లాడు. అలా సైకిళ్ళ మీద వెళుతూ, వెళుతూ కొండప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే మేఘావృతమైన ఆకాశం వర్షించడం మొదలు పెట్టింది. సన్నటి జల్లుల్లో తడుస్తూ అనుకున్న గమ్యానికి చేరాలన్న ఉత్సాహం మరింత బలపడింది. వారి గమ్యం థామ్‌లాంగ్ గుహ. థాయ్‌లాండ్‌లో సాహసికులందరికీ అదొక స్వప్నసీమ. 

తనలోని లోయల రహస్యాల్ని, శిఖరాల సందేశాల్ని ఆకాశానికి వినిపిస్తూ ఎదురుగా మాయ్‌సీ పర్వతం నిటారుగా imageనిలబడి ఉంది. పర్వతప్రాంతంలోని థామ్‌లాంగ్ గుహ దగ్గరికి రాగానే పిల్లలందరిలో కట్టలు తెంచుకున్న ఆనందం. సైకిళ్ళని, ఫుట్‌బాల్ షూలని, వెంట తెచ్చుకున్న అదనపు వస్తువుల్ని గుహ వాకిట్లోనే పడేసి, పొలోమని గుహలోకి ఒకటే పరుగు. గుహ లోపల ఎనిమిది కిలోమీటర్ల వరకు సజావుగా నడిచి వెళ్లిపోయారు. పోతూ పోతూ గుహ గోడల మీద కొత్తగా తమ టీమ్‌లోకి చేర్చుకోవాలనుకున్న ఫుట్‌బాల్ నేస్తాల పేర్లని చెక్కుకుంటూ వెళ్లారు. మసక చీకటి తెరలు జారుతున్నాయి. గుహలో చీకటి నెమ్మదిగా పేరుకుంటోంది. చేతుల్లో టార్చిలైట్లకి పని చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. గుహలో ఎక్కువ సేపు గడపాలని వాళ్ళు అనుకోలేదు, మహా అయితే ఒక్క గంట..! అలా అనుకున్న ఆ ఒక్క గంట.. రెండు వారాల వరకు తన పొడవైన చీకటి చేతుల్ని చాచి, వాళ్ళని కమ్మేసింది. నైట్ ఇంట్లో పుట్టినరోజు కేక్‌ను ఎవరూ ముట్టుకోలేదు. పిల్లవాడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.

‘వైల్డ్‌బోర్స్’కి ఏమైంది?
థాయ్‌లాండ్, మయన్మార్‌ను వేరుపరుస్తూ పది కిలోమీటర్ల వరకు పరచుకున్న పర్వతశ్రేణి అది. థాయ్‌లాండ్‌లోని నాలుగవ అతిపెద్ద గుహల సముదాయం థామ్‌లాంగ్. విశ్రమించిన ఒక స్త్రీ ఆకారంలో ఉండే ఈ పర్వతశ్రేణి పూర్తి పేరు థామ్‌లాంగ్ కున్‌నామ్ నాంగ్నన్. ఎన్నో థాయ్ జానపద కథలు ఈ ‘విశ్రమించిన మహిళ’ చుట్టూ అల్లుకుని ఉన్నాయి. ఎన్నెన్నో జలధారలు ఈ పర్వతసానువుల మీద మోకరిల్లుతుంటాయి. అందం ఎంత ప్రమాదకరమైందో చెప్పడానికి ఈ థామ్‌లాంగ్ గుహలే ఉదాహరణ. ఎందరెందరో ఇప్పటికే ఈ పర్వత గుహల్లో కనుమరుగయ్యారు, కన్నుమూశారు. ముఖ్యంగా వర్షాకాలం ఈ గుహలు మరింత ప్రమాదకరంగా మారతాయి. వర్షాకాలంలో గుహలో పదహారు అడుగుల మేరకు వరద నీరు ఉప్పొంగుతుంది. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే గుహలోకి వెళ్లడానికి వీలుగా ఉంటుంది. అలాంటిది ఈ పిల్లలు జూన్ నెలలో ‘సరదా’ పడ్డారు. 

‘‘గుహలో నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంది. ఆ నీరు చాలా మడ్డిగా ఉంది. గుహలో చిమ్మచీకటి అలముకుంది’’ అని స్థానిక గైడ్ జాషువా మోరిస్ చెప్పాడు. గుహలో నీటి చుక్క కనబడనంత వరకే ఎవరి ప్రాణాలకైనా హామీ. ఒక్కసారి వరదపోటు మొదలైందంటే, గజ ఈతగాళ్లకు కూడా ప్రాణాలు నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. ఈ గుహలోకి సాహస యాత్ర చేయాలన్న ఆలోచన చాలా రోజుల నుంచే ఉన్నట్టుంది ఈ పిల్లలకి. వాళ్ళ వాట్సాప్ మెసేజ్‌లలో దీని మీద చర్చ కూడా సాగినట్టు తెలుస్తోంది. పిల్లలు గుహలో చిక్కుకు పోయిన విషయం తెలిసిన వారి కుటుంబాలు గుహముఖం దగ్గరికి చేరుకున్నాయి. అక్కడ వాళ్ళకి తమ పిల్లల సైకిళ్ళు, ఫుట్‌బాల్ షూలు, సంచులు దొరికాయి. తమ కలలపంటల క్షేమం కోసం కళ్ళు కాయలు కాసేలా వాళ్ళు ఎదురు చూడడం ప్రారంభించారు. 

‘ధ్యానమే’ ప్రాణదాత?
గుహలో లోతుకు వెళ్ళే కొద్దీ పిల్లలు ప్రమాదంలో చిక్కుకున్న సంకేతాల్ని పసిగట్టారు. అప్పటికే కొద్దిరోజులుగా కొండమీద కురుస్తున్న వర్షపు నీరంతా ఏదో ఒక మార్గం గుండా కిందికి ప్రవహించాలి. ఆ మార్గమే థామ్‌లాంగ్ గుహ. గుహలో వరదపోటు అంతకంతకూ పెరుగుతోంది. బయటికి వెళ్లిపోతేనే మంచిదని వాళ్ళకి అనిపించింది. తక్షణం బయటికి వెళ్లడానికి ఉద్యుక్తులయ్యారు. కానీ ఆ తొందరలో వాళ్ళు దారితప్పి మరింత లోపలికి వెళ్లిపోయారు. చుట్టూ చీకటి, ఎముకలు కొరికే చలి, ‘కాలం’తో సంబంధం తెగిపోయింది. గుహలోపల ఒక రాతి మీద అందరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఉండిపోయారు. ఆ కౌగిలిలో జీవితేచ్ఛ తప్ప మరో ప్రాణస్పందన లేదు. భయం ఆవరించింది. అయినా బతికి తీరాలన్న పట్టుదల పెరుగుతూనే ఉంది. తాము కూర్చున్న రాయి పక్కన ఉన్న గుహ గోడలో ఐదు మీటర్ల లోతుకు రాళ్ళతోనే చెక్కారు. ఒక అరలా తయారైందది. అందులో దాక్కున్నారు. ఫుట్‌బాల్ కోచ్ ఎక్పోల్ నిజజీవితంలో ఒక బౌద్ధ సన్యాసి కూడా! పిల్లలకు అప్పటికప్పుడు ‘ధ్యానం’ (మెడిటేషన్)లోని మెళకువల్ని నేర్పించాడు. గుహలో ఉన్న కొద్దిపాటి ప్రాణవాయువును పొదుపుగా వాడుకోవడమెలాగో, మానసికంగా ధృఢంగా ఉండడమెలాగో వారికి నేర్పించాడతను. ఆహారం లేదు. గుహ గోడల నుంచి బొట్టుబొట్టుగా కారుతున్న నీటితో దాహం తీర్చుకున్నారు. చేతిలో టార్చిలైట్లు వారికి చీకటి నుంచి రక్షణనిచ్చాయి. గుహగోడల్లో సున్నపురాయి ఎక్కువగా ఉండడం వల్ల ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అవసరమైన గాలి కూడా లభించింది. తీరని కష్టంలో కూడా అనుకూలమైన పరిస్థితుల్ని గుర్తించడమంటే ఇదే. ఎవరైనా కాపాడకపోతారా అన్న ఆశే మినుకుమినుకుమంటోంది!

‘ఎవరైనా ఉన్నారా, కాపాడతారా?’
గుహ లోపల జీవన్మరణ పోరాటం జరుగుతుండగానే, గుహ బయట పిల్లల్ని రక్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ‘థాయ్ నేవీ సీల్స్’ అనే ఉన్నత థాయ్ పోలీసు బృందాలు, ఇతర రక్షక బృందాలు, స్థానిక స్వచ్ఛంద కార్యకర్తలు అవిశ్రాంతంగా పిల్లల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకానొక గుహలోపల పిల్లలు నడచి వెళ్లిన ఆనవాళ్ళు దొరికాయి. కానీ వాళ్ళు సజీవంగా ఉన్నారా, లేరా అన్నది తెలియలేదు. వాతావరణం తన కాఠిన్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. మెలికలు తిరిగిన గుహమార్గం గుండా వెళ్లి పిల్లల ఆచూకీని వెదకడం ప్రాణాలతో చెలగాటమాడడమే. పైగా పొంగుతున్న వరద.. గుహలోపలి వరద ఉధృతి థాయ్ గజ ఈతగాళ్ళకు కూడా పెనుసవాలే! ఏం చేయాలో ఎవరికీ తోచడం లేదు. నీటిని తోడడానికి పైపుల్ని, గుహని తొలిచేందుకు ఉలుల్ని, ఇంకా ఎన్నెన్నో ఉపకరణాల్ని పోగు చేసుకుని ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం శూన్యం! పిల్లల స్నేహితుల్లో ఒకరికి తన స్నేహితులంతా కలిసి గుహలో వెళ్లాలనుకున్న చోటు గురించి మాట్లాడుకోవడం జ్ఞాపకం వచ్చింది. ఆ చోటే, పట్టాయా బీచ్. గుహలోపల ఉన్న ఒక చిన్న ఇసుకమేట. పిల్లలు అక్కడ దొరుకుతారా?

ప్రార్థనల వెల్లువ
గుహలోపల చావును చావుదెబ్బ కొట్టేందుకు అన్ని దారుల అన్వేషణ సాగుతుండగా, గుహ బయట పిల్లల కుటుంబాలు వారి కోసం ప్రతి రోజూ పడిగాపులు కాశాయి. ఫుట్‌బాల్ కోచ్ చాంటావోంగ్ నాయనమ్మ తుమ్ కాంటావోంగ్ ప్రతిరోజూ గుహ ముంగిట కొవ్వొత్తులు వెలిగించి, పండ్లని, ఫలహారాల్నీ ఉంచి, చేతులు జోడించి ప్రార్థించేది. ‘‘పిల్లల్ని ప్రాణాలతో మాకు అప్పగించాలని నేను ఈ గుహను పాలిస్తున్న దైవశక్తుల్ని ప్రార్థిస్తున్నా’’ అంటూ ఆమె కన్నీటితో చెప్పింది. క్రమంగా ఆ పిల్లలు చదువుతున్న పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు గుహ ముందు గుమికూడి, సామూహిక ప్రార్థనలు చేయడం మొదలైంది. పిల్లల బంధువులకు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారికి స్థానికులు విరాళాలు పోగు చేసి, అన్నపానీయాల్ని అందించడం ప్రారంభించారు. 

అంతర్జాతీయ సాయం
image28 జూన్,
గురువారం నాడు థాయ్‌లాండ్ గుహలో చిక్కిన పిల్లల్ని రక్షించేందుకు గుహ ముందు అంతర్జాతీయ సాయం అడుగు పెట్టింది. అమెరికా, బెల్జియం, స్కాండినేవియా, చైనా, ఆస్ట్రేలియాలకు చెందిన వైమానిక, సైనిక నిపుణులు పిల్లల్ని కాపాడే బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. జూలై ఒకటో తేదీన.. అంటే, పిల్లలు తప్పిపోయిన వారం రోజులకు వాళ్ళని కాపాడే పనిలో ఒక ముందడుగు పడింది. గుహలోపల ఒక అతిపెద్ద బొరియలోకి రక్షక నిపుణులు ప్రవేశించగలిగారు. ఇద్దరు బ్రిటిష్ డైవర్లు జాన్ వొలాంథెన్, రిక్ స్టాంటన్‌లు వరదకు ఎదురొడ్డి గుహలోకి ప్రయాణించారు. సహాయక బృందాలకు మార్గదర్శకంగా నిలిచి, ఎట్టకేలకు పట్టాయా బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా చీకటిగానే ఉంది. కానీ గాలి చొరబడే ప్రాంతమది. ఎక్కడ అలాంటి అవకాశం కనిపించినా వాళ్ళిద్దరూ అక్కడి గాలిని వాసన చూసే వాళ్ళు. పిల్లల ఆచూకీని కనిపెట్టేందుకు అదొక మార్గం. పిల్లల కోసం అరిచే వాళ్ళు. అలా కొన్ని వందల మీటర్ల దూరం ముందుకు వెళ్లాక, వాళ్ళ ప్రయత్నం ఫలించింది. పిల్లల ఉనికిని కనిపెట్టారు. కానీ అప్పటికే వారి టార్చిలైట్లు మొరాయించడం మొదలెట్టాయి. పిల్లల్ని లెక్కించారు.. కోచ్ సహా పదమూడు మంది! వాళ్ళిద్దరూ పిల్లలతో కాసేపు గడిపారు. వాళ్ళకి ధైర్యం చెప్పారు. తమతో తెచ్చుకున్న లైట్లని వారికి ఇచ్చేశారు. తిరిగి మళ్ళీ వస్తామని, ఆహారాన్ని తెస్తామని మాట ఇచ్చారు. పిల్లలతో తాము గడిపిన క్షణాల్ని కెమెరాల్లో బంధించారు. 

ఫలించిన ‘డాక్టర్’ వ్యూహం
పిల్లల్ని విజయవంతంగా కాపాడడంలో ఆస్ట్రేలియన్ డాక్టర్ రిచర్డ్ హారిస్ చేసిన సూచన ప్రధాన పాత్ర పోషించింది.image పిల్లల ఉనికిని గుర్తించిన తరువాత పంపుల సహాయంతో నీటిని తోడడం మొదలుపెట్టారు. అయినప్పటికీ పిల్లల్ని బయటికి తీసుకురావాలంటే, వాళ్ళని నీటి మధ్య నుంచే తేవలసి ఉంటుంది. అందుకే మొదటి 1.7 కిలోమీటర్ల దూరం వరకు పిల్లల్ని గజ ఈతగాళ్ళే మోసుకు రావలసి ఉంటుంది. తరువాత ఒకటిన్నర కిలోమీటర్ల దూరాన్ని పిల్లల్ని కర్రల మీద మోసుకు రావచ్చునన్న పథకం సిద్ధమైంది. ఈలోగా థాయ్ సైన్యం పిల్లల్ని రక్షించేందుకు అవసరమైన వెట్‌సూట్లు, ఫుల్‌ఫేస్ స్క్యూబా మాస్క్‌లు, అండర్ వాటర్ లైట్లు తదితర వస్తువుల్ని సిద్ధం చేశారు. వీటిలో ఫుల్‌ఫేస్ స్క్యూబా మాస్కుల్ని అమర్చడం క్లిష్టతరమైన పని. ఎందుకంటే అవి చిన్నపిల్లలకు సరిపోయేవి కావు. అలాంటివి థాయ్‌లాండ్‌లో ఉండవు కూడా! గుహలో చిక్కుకున్న పిల్లల్లో అత్యంత పిన్నవయస్కుడైన చానిన్ విబూన్‌రంగ్యుయోంగ్‌కి పదకొండేళ్ళు.

 ఈ పిల్లవాడిని రక్షించడమే కష్టం. నిజానికి థాయ్ అధికారులు వర్షాలు తగ్గేంతవరకు పిల్లల్ని గుహలో ఉంచడం తప్ప మరో మార్గం లేదని భావించారు. కానీ చాలా మంది నిపుణులు ఈ ఆలోచనను తిరస్కరించారు. అప్పటి దాకా గుహలో ఆక్సిజన్ పరిమాణం ప్రాణాల్ని నిలబెట్టుకునేందుకు చాలదు. అంతేగాక జూలై 7న గుహలో పెద్దయెత్తున వరద తాకిడి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు తరువాత పిల్లల్ని రక్షించడం అన్న మాటే ఉండదు. ఇంత ప్రమాదంలోనూ పిల్లలు పిల్లలే! వాళ్ళకి ఈ సమస్యలేమీ తెలియవు. ‘‘నేను డైవింగ్ చేయబోతున్నాను..’’ అంటూ ఉత్సాహంగా కేకలు పెట్టారు. పిల్లలకు ఈ లోగా మానసిక ఆందోళనను తగ్గించే మందుల్ని సరఫరా చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఆస్ట్రేలియన్ డాక్టర్ రిచర్డ్ హారిస్ బలహీనంగా ఉన్న పిల్లల్ని మొదట తరలించాలని సూచించారు. ఎవర్ని ముందుగా తరలించాలో సూచిస్తూ కోచ్ ఎక్పోల్ ఒక జాబితా తయారు చేశారు. ముందుగా చానిన్ విబూన్‌రంగ్యుయోంగ్‌తో పాటు, మరో పిల్లవాణ్ణి తరలించారు. సహాయక చర్యల్లో ప్రధాన భూమిక నిర్వహించిన డానిష్ గజ ఈతగాడు క్లాస్ రాస్మూస్సేన్, థాయ్ గజ ఈతగాడు రూన్‌గ్రెట్ చాంగ్ వాన్యూన్‌లు పట్టాయా బీచ్‌కి చేరుకుని, మరో గజ ఈతగాని సహాయంతో పిల్లల్ని తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఆదివారం మధాహ్నం 2.30 గంటలకు ఒక గజ ఈతగాడు మొదటగా ఇద్దరు పిల్లల్ని పట్టాయా బీచ్‌కు చేర్చాడు. అక్కడి నుంచి ఏటవాలుగా, బురద మట్టితో కూడిన దారి వెంట కర్రల మీద వారిని గుహముఖ భాగానికి చేర్చే పని సవాలుగా మారింది. అయినా విజయం సాధించారు. సోమవారం అర్ధరాత్రికి పిల్లలందర్నీ విజయవంతంగా గుహ నుంచి బయటకు తీసుకు వచ్చారు. పిల్లలందర్నీ ఇలా బయటకు తెచ్చారో, లేదో.. గుహలో నీటి ప్రవాహ ఉధృతి కళ్ళముందే పెరిగి పోయింది. గుహ మొత్తం నీటిమయమై పోయింది. దీనికి దైవ సంబంధమైన కారణాన్ని ఎవరూ చెప్పక పోయినప్పటికీ, అందరి మనసులు ‘ధన్యవాదాల’తో నిండిపోయాయి. 

బలిదానం
imageఇంతటి అపాయకరమైన సందర్భంలో అందరి మనసుల్ని తేలిక పరుస్తూ, పిల్లలు సురక్షితంగా బయటికి వచ్చారు. కానీ వారిని రక్షించడం కోసం ఒకరు తన ప్రాణాల్ని బలిపెట్టక తప్పలేదు. ఆ వ్యక్తి థాయ్ మాజీ నేవీ సీల్ సార్జంట్ మేజర్ సమన్ గునన్ ఈ సహాయక చర్యల్లో ప్రాణాలు కోల్పోయి, విషాదాన్ని మిగిల్చారు. ముప్ఫై ఎనిమిదేళ్ళ గునన్ సైన్యం నుంచి పదవీ విరమణ చేసినప్పటికీ, పిల్లల్ని కాపాడేందుకు స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గుహలో తగినంత మోతాదులో ఆక్సిజన్‌ను నింపడానికి ఎయిర్ ట్యాంకుల్ని చేరవేస్తూ, పరుగెత్తి, పరుగెత్తి, శ్వాస అందక ఆయన కన్నుమూయడం అందరినీ కలచి వేసింది. గునన్ భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం సత్తాబ్ జిల్లాలోని సైనిక శిబిరానికి తరలించారు. అక్కడ ఆయనకు గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా థాయ్‌లాండ్ రాజు ఆదేశించారు.
 
పిల్లల్ని గుహ నుంచి నేరుగా
స్థానిక ఆసుపత్రికి తరలించి, వైద్యసహాయాన్ని అందించారు. వారిలో కొంతమందికి ఘనimage ఆహారాన్ని ఇవ్వకుండా, ద్రవాహారాన్నే ఇచ్చారు. కొందరు మాత్రం మొదటిరోజే బ్రెడ్, చాక్లెట్‌లు తిన్నారు. గుహలో చిక్కుకున్న పన్నెండు మంది పిల్లలు, వారి కోచ్‌ను సురక్షితంగా బయటకు తెచ్చే ఈ ఆపరేషన్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యిమందికి పైగా పాల్గొన్నారు. రష్యాలో జరుగుతున్న వరల్డ్‌కప్ ఫైనల్‌లో పాల్గొనాల్సిందిగా ‘ది వరల్డ్ సోకర్ ఫెడరేషన్’ పిల్లల్ని ఆహ్వానించింది. కానీ పిల్లలు ఇంకా తేరుకోలేదు. అందుకే ఈ వరల్డ్ కప్ ఫైనల్‌కి వాళ్ళని పంపడం లేదు. థాయ్ గుహలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా హాలీవుడ్ చిత్రాన్ని నిర్మించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పిల్లలందరూ ‘థాయ్ కేవ్‌బాయ్స్’గా ప్రసిద్ధులయ్యారు!అందరికీ ఆత్మబంధువు

Updated By ManamMon, 07/23/2018 - 06:25

imageపశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండల కేంద్రమైన తాళ్లపూడి గాంధీబొమ్మ వీధిలో మా ఇల్లు ఉంది. కరణంగారిల్లుగా ఊరిలో మా ఇంటికి గుర్తింపు ఉంది. అమ్మమ్మకి అమ్మ ఒకే ఒక్క కూతురవడం వల్ల అమ్మ దగ్గరే ఉండేది. ఆ విధంగా మా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ సర్వస్వం అయింది. అమ్మమ్మే మాకు జీవన విలువలు నేర్పింది.

imageఅయిదుగురు మనవలు, ఇద్దరు మనవరాళ్లు.. మొత్తం ఏడుగురు పిల్లల పెంపకంలో అమ్మకి అమ్మమ్మ ఎంతో సాయం చేసింది. ఇంటికి వచ్చే బంధువుల తాకిడి కూడా ఎక్కువగా ఉండేది. ఎప్పుడు లేచోదో తెలియదు గాని ఉదయం ఆరు గంటలకల్లా వేడినీళ్లు సిద్ధంగా ఉంచేది. ఏడు గంటలకల్లా వేడి వేడి టిఫిన్ సిద్ధం చేసేది. పూజలు, నైవేద్యాలు కూడా అయిపోయేవి. పండగలప్పుడు తలంటు స్నానాల హడావిడి చెప్పడానికి మాటలు చాలవు.

అమ్మమ్మ మనసు అమృతం అని చెప్పాలి. ఎందుకంటే రకరకాల వంటకాలు ఎంతో రుచిగా చేసేది. విసుగు విరామం లేకుండా రోజూ పదిహేను మందికి వంటలు వండేది. అప్పుడప్పుడు వచ్చే రెవెన్యూ అధికారులకు మా ఇంటి నుంచే భోజనం ఏర్పాటు అయ్యేది. బొబ్బట్లు, చక్కెర పొంగలి, సాంబారు, పెరుగావడ వంటి వంటకాల రుచిని అందరూ పదే పదే మెచ్చుకునేవారు. అమ్మమ్మ మరణించి ముప్పై యేళ్లు దాటినా ఆవిడ వంటల రుచిని చుట్టాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

మడి, ఆచార సాంప్రదాయాలకు అమ్మమ్మ ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, అంతకంటే మిన్నగా మానవతా విలువలు పాటించేది. కాలంతో వచ్చిన మార్పులని స్వాగతించేది. మా జీవన విధానంలో మార్పులకి అభ్యంతరం చెప్పేది కాదు. అదే సమయంలో తన వ్యక్తిత్వాన్నీ, ఆత్మాభిమానాన్నీ నిలబెట్టుకునేది. గౌరవంగా బ్రతకడం నేర్పింది. తలదించుకునేలా జీవించకూడదనే సిద్ధాంతం అమ్మమ్మది. ఆ విధంగానే మమ్మల్ని తీర్చిదిద్దింది. వేసవి సెలవుల్లో అందరూ అమ్మమ్మ ఊరు వెళ్తుంటే మాకు ఎక్కడకి వెళ్లాలో తెలిసేది కాదు. అమ్మమ్మకు అయిదుగురు అన్నదమ్ములున్నారు. అమ్మమ్మ వాళ్లింటికి తీసుకెళ్లేది. చాలా పెళ్లిళ్లకి అమ్మమ్మ వెళ్లేది. వచ్చేటప్పుడు ఆటవస్తువులు, స్వీట్లు తెచ్చేది.

తాళ్లపూడిలో పురాతన మదన గోపాలస్వామి ఆలయం, శివాలయంకు, గోదావరి స్నానాలకు అమ్మమ్మ తీసుకువెళ్లేది. ఆ విధంగా భక్తిభావాన్ని పెంచింది. ఉన్నంతలో నలుగురికి సాయం చెయ్యడం, అన్నం పెట్టడం, మంచిగా మాట్లాడడం.. అన్నీ అమ్మమ్మ నుంచి మాకు సంక్రమించాయి. గొప్పలు చెప్పుకోవడం, బిగ్గరగా అరవడం, తన పెద్దరికాన్ని ప్రదర్శించడం వంటివి అమ్మమ్మ ఏనాడూ చెయ్యలేదు. అందుకే అమ్మమ్మ అందరికీ ఆదర్శమూర్తిగా నిలిచింది. అమ్మమ్మ ఇంటి పేరు అవసరాల అవడం కూడా ఒక విశేషం. ఎందుకంటే ఆవిడ అవసరం లేకుండా ఆ రోజుల్లో ఏ కార్యక్రమమూ జరిగేది కాదు.

బంధువుల గృహాల్లో జరిగే వేడుకలకి పది రోజుల ముందుగా అమ్మమ్మను తీసుకువెళ్లి పర్యవేక్షణా స్థానం ఇచ్చేవారు. అనుకోకుండా వంట మనుషులు రాని సందర్భాలు ఏర్పడేవి. అప్పటికప్పుడు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో అమ్మమ్మ ఆత్మబంధువుగా మారేది. బంధువుల్లో కొంతమంది ఆడవారిని చైతన్యపరిచి తన నాయకత్వంలో వందమందికి వంట అద్భుతంగా చేసి కార్యక్రమం గట్టెక్కించేది.

శాంతంగా, నిర్మలంగా కనిపించే అమ్మమ్మ మితిమీరిన అల్లరి చేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వీపు విమానం మోత ఎక్కించేది. ఆవిడ కొట్టింది అంటే కచ్చితంగా తప్పు చేసినట్లే లెక్క. మాకు పంచడానికి అమ్మమ్మ దగ్గర ఆస్తులు ఏమీ లేవు. కానీ అంతకంటే గొప్పవైన మంచి మార్గదర్శకత్వం, వ్యక్తిత్వం, శీలసంపద, ఆత్మాభిమానం, సహనం, శాంతం, భక్తితత్వం, ప్రేమాభిమానాలు వంటి సుగుణ సంపదను మాకు అందించింది.

అమ్మమ్మ పెద్దగా చదువుకోకపోయినా జీవితానుభవం ఎక్కువ గడించింది. చుట్టుపక్కలవారితో మర్యాదగా, మంచిగా ప్రవర్తించడం వంటి ఎన్నో సుగుణాలు అమ్మమ్మ ద్వారా అలవడ్డాయని చెప్పవచ్చు. అందుకే ఆవిడ మాకు గొప్ప మార్గదర్శి, ఆదర్శమూర్తి. అమ్మమ్మకు వేరే ఊరు లేకపోయినా ఆమే మా బాల్యంలో గురువుగా నిలిచి క్రమశిక్షణ నేర్పి మాకు సర్వస్వం అయింది. అందరికీ సేవలు చేసి, తాను మాత్రం ఎవరిచేతా, ఎలాంటి సేవలూ చేయించుకోకూడదని భావించేది. అమ్మమ్మ కోరికను భగవంతుడు తీర్చాడు. సునాయాసంగా ప్రాణాలు విడిచింది. మా మనసుల్లో శాశ్వతంగా నిలిచింది.

- పరస రాధాకృష్ణ
సెల్: 9490832190నన్ను చావనివ్వండి

Updated By ManamTue, 03/27/2018 - 01:54

మా ఊళ్లో సూర్యనారాయణ రాజుగారంటే తెలియని వాళ్లు లేరు. ఆజానుబాహుడు అంటే ఏంటో మాకు తెలిసింది ఆయన్ని చూసిన తర్వాతే. ఆరడుగులకు పైన మూడు నాలుగు అంగుళాల పొడవుంటారు. అప్పట్లో ఆయన ఎర్రటి ఎన్‌ఫీల్డ్ బండి మీద వెళ్తుంటే.. ఆ బండి ఆయన ముందు ఎలక పిల్లలా కనిపించేది. వాళ్లబ్బాయి శ్రీనివాసరాజు మా క్లాస్‌మేట్.

imageఅలాంటి రాజుగారు వెంటిలేటర్ మీద ఉన్నట్లు మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ మోహన్ చెప్పడంతో శ్రీనుని పలకరిద్దామని ఊరు వెళ్లా. నరసాపురంలో అది పెద్ద ఆస్పత్రే. వైద్యులు బాగా నిపుణులు. నాకు తెలిసిన కొద్దిపాటి వైద్య పరిభాష ఉపయోగించి వాళ్లని సమస్య ఏంటని అడిగా. ‘పల్మనరీ ఎడిమా’ అని చెప్పారు. నయం కావడానికి ఎన్నాళ్లు పట్టొచ్చని అడిగితే.. ఏమీ చెప్పలేమన్నారు. రాజుగారు కాల్చిన సిగరెట్లు ఆయన ఊపిరితిత్తులను పూర్తిగా నాశనం చేశాయట. ‘మిగిలిన ఆర్గాన్లు కూడా సపోర్ట్ చేయాలి కదా, అప్పటివరకు వెంటిలేటర్ మీదే’ అని డాక్టర్లు చెప్పారు. బయటికొచ్చి శ్రీనుని కదిలిస్తే వాడు పూర్తి నిర్వేదంలో ఉన్నాడు. ‘‘ఇప్పటికే 15 రోజులైందిరా.. బెడ్ సోర్ కూడా వచ్చేలా ఉంది. నాన్నని ఇలా చూడటం కంటే ఆ డాక్టర్లకే చెప్పి ఏదైనా మందుంటే ఇచ్చి..’’ ఆ తర్వాత వాడి గొంతు పెగల్లేదు. 

మీరైనా చెప్పండి..
మాకు బాగా తెలిసిన ఒక లెక్చరర్ ఉండేవారు. కొడుకు పెళ్లికి కొద్ది రోజుల ముందు ఆయనకు కడుపులో బాగా నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్తే ఏం చెబుతారోనన్న అనుమానం.. కొత్త కోడలి గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని మరోవైపు ఆలోచన రావడంతో అసలు డాక్టర్ దగ్గరకే వెళ్లలేదు. కొడుకు పెళ్లి అయిన రెండు నెలలకే ఆయనకు కేన్సర్ బయటపడింది. ఏడాది తిరిగేలోపే అది బాగా ముదిరిపోయింది. ఎంత ట్రీట్‌మెంట్ చేసినా ప్రయోజనం లేదు. చివరి రోజుల్లో ఆయన నరకయాతనimage అనుభవించారు. విపరీతమైన నొప్పి, ఒళ్లంతా మంటలు.. దానికి ఏ మందులు వాడినా ప్రయోజనం లేకపోవడం.. అలాంటి సమయంలో ఆయనను పలకరించడానికి వెళ్లాను. ఒకసారి నాతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి ఆస్పత్రిలో అందరినీ బయటకు పంపేశారు. ‘‘సార్.. మీరైనా డాక్టర్లకి చెప్పండి.. నేనీ నరకం భరించలేకపోతున్నాను. ఏదైనా ఇంజెక్షన్ ఇస్తే హాయిగా వెళ్లిపోతాను. ఇక్కడి నుంచి నేను సజీవంగా ఇంటికి వెళ్లనని నాకూ తెలుసు, వాళ్లకూ తెలుసు. అదేదో నేను ఇంత నరకం అనుభవించకుండా ముందే ఇస్తే నాకూ ప్రశాంతంగా ఉంటుంది.. నాకు చేయలేక ఇబ్బంది పడే వాళ్లకూ కాస్త రిలీఫ్ దొరుకుతుంది.. ప్లీజ్.. డాక్టర్లని ఏదోలా ఒప్పించండి’’ అని చేతులు పట్టుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. నాకూ కళ్లమ్మట ధారలా నీళ్లు కారిపోయాయి గానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అక్కడి నుంచి వచ్చేశాను. డాక్టర్లు ఏమీ చేయాల్సిన అవసరం లేకుండానే మూడో రోజున ఆయన ప్రాణాలు వదిలేశారు. ఇలాంటి సందర్భాలలోనే సరిగ్గా కారుణ్య మరణం అన్న విషయం గుర్తుకొస్తుంది. కానీ మన దేశంలో ఉన్న చట్టాల కారణంగా అది సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. వాళ్లంతా కూడా కారుణ్య మరణం కోసం ఎదురు చూసేవారే.

కారుణ్య మరణం గురించి అప్పటివరకు పేపర్లలో చదవడమే తప్ప, నిజంగా అలా ఎవరైనా కోరుకుంటారని మొదటిసారి తెలిసింది నాకు రాజుగారిని చూసిన తర్వాతే. ఆయన దగ్గరకు వెళ్లినపుడల్లా.. కళ్ల వెంట నీళ్లు కారుస్తూ, ఏదో చెబుదామని అనుకుంటున్నట్లుగా కనిపించేవారు. మాట్లాడదామంటే.. వెంటిలేటర్ అడ్డు. అది తీస్తే ప్రాణం నిలబడటం కష్టం. నోరారా తినడానికి లేదు. లేచి బండి నడపడం సాధ్యమే కాదు. ఇంకా ఎందుకిలా బతకడం అనే ఆయనకూ అనిపిస్తున్నట్లుంది. 

సరిగ్గా అప్పుడే పాసివ్ యుథనేషియా (పరోక్ష కారుణ్య మరణం)ను ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్లు పేపర్లలో వచ్చింది. అందులో ప్రత్యక్షం, పరోక్షం కూడా ఉంటాయా అని అనుమానం తలెత్తింది. అవునట.. వెంటిలేటర్ లాంటి లైఫ్ సపోర్ట్ మిషన్ల ఆధారంగా మాత్రమే బతుకుతూ, అది కూడా జీవితం అత్యంత దుర్భరంగా ఉన్నవాళ్లకు ఆ మిషన్లు తీసేస్తే ప్రాణం పోతుందనుకుంటే అది పరోక్ష కారుణ్య మరణం అవుతుంది. కేవలం మిషన్ సపోర్ట్ ఉండబట్టి కొన ప్రాణం నిలబడుతుంది తప్ప శరీరంలో ఏ అవయవమూ సక్రమంగా పనిచేయదు. కళ్లు తెరిచి ఉన్నట్లుంటారు గానీ ఏమీ మాట్లాడలేరు. మనం చెప్పింది వాళ్లకు వినపడిందో లేదో.. అర్థమయ్యిందో లేదో కూడా తెలియదు. అలాంటప్పుడు బతికి ప్రయోజనం ఏంటన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. సరిగ్గా ఇలాంటి సందర్భాలలోనే గౌరవం లేని బతుకు బతకడం కంటే కనీసం గౌరవంగా చస్తేనైనా బాగుంటుందని అనిపిస్తుంది. సరిగ్గా సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయపడింది. ‘జీవించే హక్కు’ అంటే.. అందులో గౌరవంగా మరణించే హక్కు కూడా ఉంటుందని ‘కామన్ కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థ వాదించింది. నిజమే మరి.. రోగాల బారిన పడి, శరీరం సహకరించక నానా ఇబ్బందులు పడుతూ, మన పని మనం చేసుకోలేని పరిస్థితుల్లో బతకడం కంటే.. హాయిగా చావడమే మేలని అనిపిస్తుంది. బతికినన్నాళ్లూ రాజాలా బతకాలి, సమయం అయిపోయిందనుకున్నప్పుడు ప్రశాంతంగా తనువు చాలించాలి. అంతే తప్ప జీవచ్ఛవంలా ఆస్పత్రి మంచం మీద పడుకుని కట్టె మాత్రమే ఉందనుకుంటే ప్రయోజనం ఏంటి? కారుణ్య మరణం గురించి కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక చర్చలు జరుగుతున్నాయి. రకరకాల సందర్భాలలో కారుణ్యమరణాన్ని ప్రసాదించమని కోరుకునేవాళ్లు ఉంటారు. ఇలా కోరుకునేవారిలో నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్లు కొందరైతే.. దుర్భర పరిస్థితిలో ఉండేవాళ్లు మరికొందరు. సుప్రీంకోర్టు చెప్పిన వాటిలో రెండు ప్రధానాంశాలున్నాయి. ఒకటి పాసివ్ యుథనేషియా.. అంటే పరోక్ష కారుణ్య మరణం, మరోటి సజీవ వీలునామా. ఇందులో మనం అంతా బాగా ఉండగానే భవిష్యత్తులో ఏదైనా తీవ్ర అనారోగ్యం వస్తే.. అప్పుడు వెంటిలేటర్ మీద పెట్టి నెలల తరబడి ఉంచకుండా మన చావు మనల్ని చావనివ్వాలని ముందుగానే ఒక వీలునామా రాసుకోవడం. మన శరీరం మీద మనకు పూర్తి హక్కులు ఉంటాయని చెప్పడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందుకు కూడా సుప్రీంకోర్టు తన ఆమోదం తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఇలా బాగున్న సమయంలో వీలునామా రాసి ఉండకపోతే, ఆ తర్వాత వాళ్లు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బాగా దగ్గరి బంధువులు.. అంటే సొంత కొడుకులు, కూతుళ్లు గానీ తల్లిదండ్రులు గానీ సంబంధిత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి తమ వాళ్లను బలవంతంగా బతికించొద్దని కోరే అవకాశం కూడా ఉంటుందట. 

42 ఏళ్లు కోమాలోనే..
arunaఅరుణా షాన్ బాగ్.. ముంబైలోని కేఈఎం (కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్) ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేవారు. అదే ఆస్పత్రిలో ఒక డాక్టర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. మరి కొన్నాళ్లలో పెళ్లి ఉందనగా.. ఒకరోజు రాత్రి డ్యూటీ ముగించుకుని యూనిఫాం మార్చుకుంటున్న సమయంలో వార్డుబాయ్ ఆమెపై అత్యాచారం చేసి, అరవకుండా మెడకు ఒక చైన్ కట్టేశాడు. ఎనిమిది గంటల పాటు మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి 42 ఏళ్ల పాటు అదే ఆస్పత్రిలో కోమాలో ఉన్న ఆమెను ఆస్పత్రి సిబ్బంది, నర్సులు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆమెకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ పింకీ విరానీ అనే జర్నలిస్టు కోర్టును ఆశ్రయించినా.. అది సాధ్యం కాలేదు. చివరకు 42 ఏళ్ల తర్వాత అరుణ న్యుమోనియాతో మరణించారు. ఈ కేసు కారుణ్య మరణం గురించి దేశవ్యాప్త చర్చకు కారణమైంది. 
శ్రీకమల

శ్రుతిహాసన్‌కు మరణం ప్రసాదించండి..
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఒక కేసు వచ్చింది. న్యూరోఫైబ్రోమా అనే వ్యాధితో బాధపడుతున్న తమ కూతురు శ్రుతిహాసన్‌కు కారుణ్య మరణం ప్రసాదించాలని ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. తమ కూతురు పడుతున్న నరకయాతనను కన్న తల్లిదండ్రులుగా తాము చూడలేకపోతున్నామని వాళ్లు కోర్టుకు మొరపెట్టుకున్నారు. తెట్టు గ్రామానికి చెందిన చినరెడ్డెప్ప, సునీతలకు శ్రుతితో పాటు మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కూలి చేస్తే తప్ప పూటగడవని ఆ కుటుంబం తమ కూతురి చికిత్సకు రూ. 3 లక్షలకు పైగా ఖర్చుపెట్టింది. అయినా ఫలితం లేదు. తమ కూతురికి కారుణ్య మరణం ప్రసాదించమని కోరుతూ చిత్తూరు జిల్లా మదనపల్లి రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి కేవీ మహాలక్ష్మికి వాళ్లు అర్జీ పెట్టుకున్నారు.

డిప్రెషన్ కూడా కారణమే
కారుణ్య మరణం కోరుకునేవారిలో రకరకాల వాళ్లుంటారు. కేన్సర్‌తో తీవ్రంగా బాధపడేవారు, కేవలం వెంటిలేటర్ మీద ఉండి ఫ్లూయిడ్లతోనే బతికేవారు, టెర్మినల్ కేసులలో మాత్రమే పరోక్ష కారుణ్య మరణానికి అనుమతి ఉంటుంది. పరోక్ష కారుణ్య మరణం అంటే అప్పటివరకు అందిస్తున్న చికిత్స ఆపేసి, వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేసి, ఆక్సిజన్ కూడా తీసేస్తారు. ఆ తర్వాత రోగి పరిస్థితిని బట్టి కొన్ని గంటల నుంచి రోజుల్లోపు మరణం సంభవిస్తుంది. అదే ప్రత్యక్ష కారుణ్య మరణంలో అయితే.. ముందుగా పేషెంటు అనుమతి తీసుకుని.. మెడికల్ బోర్డుకు రిఫర్ చేస్తారు. ఆ వ్యాధికి చికిత్స లేదని, ఎంత చేసినా ప్రయోజనం లేదని వాళ్లంతా నిర్ధారించి.. రోగి కూడా బాధ భరించలేకపోతున్నానని చెబితే అప్పుడు ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రోగికి మరణాన్ని ప్రసాదిస్తారు. కానీ ఇది ప్రస్తుతం మన దేశంలో అమలులో లేదు. ఒక రకంగా ఇది చట్టపరమైన హత్యే అవుతుంది. నిజంగా తీవ్రమైన వ్యాధులతో బాధపడేవాళ్లు కొంతమంది ఇలా కారుణ్య మరణాన్ని కోరుకుంటే.. ఇంకా చాలామంది పరిస్థితులను ఎదుర్కోలేక కోరుకుంటారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఫ్రస్ట్రేషన్ కారణంగా వాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి మరణాన్ని కోరుకుంటారు. అలాంటి వారు కోర్టుకు వెళ్లినా సాధారణంగా కోర్టులు వాళ్లను మానసిక వైద్యుల వద్దకు చికిత్సకు పంపుతాయి తప్ప వారికి కారుణ్య మరణాన్ని ఆమోదించవు. కారుణ్య మరణం కోరుకునేవారి మానసిక స్థితిని ముందుగా అంచనా వేసిన తర్వాత మాత్రమే అప్పుడు వైద్యపరంగా కూడా అన్ని అవకాశాలూ పరిశీలించి, ఇక మార్గాంతరం లేదనుకుంటే అప్పుడు ఆలోచిస్తారు. 
image

 

 

 

 

డాక్టర్ వెంకట సురేష్
సైకియాట్రిస్టుఒంపుల కెంపులు!

Updated By ManamSat, 03/17/2018 - 08:01

imageరత్నాలు, వజ్రాల కోసం రాజ్యాలను కోల్పోయిన రాజులు చాలా మంది ఉన్నారు. సహజ కాంతిని నలుమూలలకూ ప్రసరింపజేసి, ఒంటిమీద ధరించగానే శరీరానికో ప్రత్యేక వెలుగునిచ్చే ఈ మేలిరకపు ఆభరణాలు వేల సంవత్సరాల నుంచే నానుడిలోకి, వాడుకలోకి వచ్చాయి. రాచరికపు ఆనవాళ్లగా మిగిలిపోయాయి. ఆభరణాల్లో ఇప్పటికీ వజ్రాలే అత్యంత మేలిమివని  చెప్పుకునేందుకు ఆధారాలు కనిపిస్తున్నా, రెండో స్థానం మాత్రం కెంపులదే. ఆడవారి నవ్వును కెంపులతో పోలుస్తారు. ప్రపంచ చరిత్రలో కెంపులదెప్పుడూ సమున్నతమైన స్థానమే. కెంపులను ఇంగ్లీషులో రూబీలంటారు. ఇవి రెండువేల ఐదొందల సంవత్సరాల క్రితమే పుట్టాయని చరిత్ర  చెబుతోంది. నవరత్నాల్లో నేనూ ఒకదాన్నంటూ ఎప్పటికీ వెలుగుతూనే ఉన్న కెంపులను ఎన్నో దేశాల మహారాజులు తమ కిరీటాల్లోనూ, ప్రియురాళ్లకు ప్రేమకానుకగా ఇచ్చే ఉంగరాల్లోనూ వాడేవారు. 

వీటి జన్మస్థలం చాలామందికి బర్మా (మయన్మార్) అని మాత్రమే తెలుసుగానీ శ్రీలంక, ఆఫ్రికాలు కూడా అని చాలా తక్కువ మందికి తెలుసు. బర్మాలో ఎక్కువగా దొరుకుతాయనీ, అయితే అవి అంత కాంతివంతంగా వుండవనీ ఓ వాదన కూడా ఉంది. స్వచ్ఛమైన కెంపులు శ్రీలంకలో మాత్రమే దొరుకుతాయని అంటారు. ఇక దక్షిణాసియాలో వీటి స్థావరాలు బాగా ఉన్నాయంటారు. సైబీరియన్ రూబీ, అమెరికన్ రూబీ, కేప్ రూబీ, మోంటానా రూబీ, రాక్ మౌంటెన్ రూబీలను అసలైన కెంపులుగా చెప్పుకోవాలి. కెంపుల్లో స్వచ్ఛమైన వాటిని గుర్తించేందుకు వాటి గూర్చి కొద్దిగా తెలుసుకుని ఉండడం మంచిది. పూర్తిగా ధరించే స్థాయికొచ్చిన కెంపులు గొప్ప కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. అందులోనూ నక్షత్రాకారపు కాంతిని ప్రసరింపచేయడంలో కెంపులకు మరేవీ సాటిరావు. నునుపైన వాటి ఉపరితలంపై మన చేయి తగిలితే మన వేళ్ల నీడ ఆ కాంతిలో స్పష్టంగా కన్పిస్తుంది. అందుకే ఎక్కువ నునుపుగా ఉండి కాంతినిచ్చే కెంపులే అసలైనవని తెలుసుకోవచ్చు.
   

కెంపు అనగానే చాలామంది ఎరుపురంగు కెంపునే గుర్తు పట్టేస్తారు. మిలమిలా మెరిసే ఈ ఎర్రటి కెంపులు బంగారంలో ఒదిగితేimage పాలూ నీళ్లలా కలిసి పోతాయనేది ప్రతీతి. ముదురు ఎరుపు రంగు కెంపులు స్వచ్ఛమైనవిగానే ఇప్పటికీ కీర్తిని పొందుతున్నాయి. భూ పొరల్లో జరిగే మార్పుల వల్ల ఈ కెంపుల రంగుల్లో తేడాలొస్తుంటాయి. నూరు డిగ్రీల కంటే ఎక్కువ మోతాదులో ఉష్ణోగ్రత చర్యలు జరిగితే ముదురు ఎరుపురంగుల కెంపులు ఏర్పడుతాయి. కాగా విపరీతమైన లావా లాంటి ఉష్ణోగ్రత చర్యలు ఏర్పడితే మాత్రం ఆకుపచ్చ కెంపులు ఏర్పడుతాయి. ఇలా నీలం, పింక్, ఆరెంజ్ రంగుల్లో కూడా కెంపులు వస్తున్నాయి. ఈ కెంపుల్లో కూడా క్యారెట్స్ ఆధారంగా ప్రమాణాల్ని చెప్పుకోవచ్చు. ఇంతవరకూ ప్రపంచంలో అత్యంత విలువైనదిగా, అందమైనదిగా చెప్పుకునే 162 క్యారెట్ల ఎడ్వర్డ్ కెంపు బ్రిటన్ మ్యూజియంలో ఉంది. దీని ఖరీదు కోట్లలోనే ఉంటుందని అంచనా. దీని తర్వాత 105 క్యారెట్ల కెంపు ప్యారిస్ మ్యూజియంలో అలరారుతోంది. చాలామంది ఇప్పుడు తిథి, నక్షత్రాల ఆధారంగా పగడం, గోమేధికం, పచ్చ, కెంపు వంటి ఆభరణాలను ధరిస్తున్నారు. ఇలా జన్మ నక్షత్రాలను బట్టి ధరించే ఆభరణాల్లో కెంపుది ఎప్పటికీ అగ్రస్థానమే. 
   

image1987 నుంచి సింథటిక్ కెంపులు కూడా తయారు చేయడం మొదలెట్టారు. కొన్ని రసాయనాలను కలిపి ఈ కెంపులను సృష్టిస్తారు. కానీ ఒరిజినల్ కెంపులకు ఎప్పటికీ ఇవి సాటిరావు. ఒరిజనల్ కెంపుల తయారీకి ఎన్నో జాగ్రత్తలుంటాయి. వంద టన్నుల ముడి పదార్ధాన్ని తీస్తే కనీసం రెండొందల యాభై గ్రాముల బరువుండే కెంపులు దొరకడం అతికష్టం. ఒక్కోసారి అవి కూడా లభించక పోవచ్చు. ఇలా ముడి పదార్ధంగా వచ్చిన కెంపురాయిని ప్రాసెసింగ్ యూనిట్లకు పంపిస్తారు. దాన్ని మొదట కొన్ని రసాయనాల్లో వేడి చేసి సున్నితంగా తీర్చిదిద్దుతారు. అలా తయారైన ఈ కెంపురాయి కటింగ్ మిషన్లకు వెళుతుంది. ఆకారాన్ని బట్టి, సైజునిబట్టి కటింగ్ చేసే పరికరాలుంటాయి. తరువాత కటింగ్ యూనిట్ల నుంచి ఫినిషింగ్ యూనిట్ల కెళతాయి. అక్కడే కెంపులు ఒక ఆకారానికి వస్తాయి. ఇలా వజ్రాలు, కెంపుల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. 
   

కెంపులను ప్రత్యేకంగా సంరక్షించుకునే పద్ధతులేమీ లేవు కానీ బంగారు నగలను భద్రపరచుకున్నట్లే కెంపులను కూడా భద్రపరచుకోవాలి. దాదాపుగా శుభ్రపరచడమూ బంగారంలాగానే. అయితే వీటిని కిందపడకుండా చూసుకోవడం మంచిది. స్త్రీలు మనసారా ప్రేమించే వాటిలో వజ్రం తర్వాత స్థానం కెంపులదే. మెరిసే ముదురు రంగు కెంపును నెక్లెస్‌లో అమర్చుకుంటే అందానికి ఆమే చిహ్నమనిపిస్తుంది. వేల సంవత్సరాలు గడిచినా కెంపుల ఒంపులు, మెరుపులూ ఇప్పటికీ తగ్గలేదు. అంతెందుకు కెంపుల వెలుగులు, సొగసులు మగువల మనసులకే తెలుసు! 
సువర్ణఈ ప్రశ్నకు బదులేదీ?

Updated By ManamSat, 03/17/2018 - 07:42

imageపూర్వం ఓ రాజుగారుండేవారు. ఆయనకు భోగ భాగ్యాలకేమీ కొదువ లేదు. అయితే, ఒక రోజున హఠాత్తుగా ఆయన మనసులో మూడు ప్రశ్నలు మెదిలాయి. అన్నిటి కంటే ముఖ్యైమెన సమయం ఏది? అందరి కన్నా ముఖ్యైమెన వ్యక్తి ఎవరు? చేయాల్సిన ముఖ్యైమెన పని ఏది?..

ఎంత ఆలోచించినా ఆయనకు ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు తట్టలేదు. ఆయునలో అసహనం, అసంతృప్తి పెరిగిపోయాయి. ఆయన తన మంత్రులందరినీ పిలిచి ఈ ప్రశ్నల్ని వాళ్ల ముందుంచి, సరైన సమాధానం చెప్పమన్నారు. మంత్రులు బాగా ఆలోచించి, మీరు రాజుగా పట్టాభిషేకం చేయించుకున్నప్పటి సమయమే ముఖ్యైవెున సమయం అని మొదటి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజ్యానికి మీరే రాజు కనుక మీరే ముఖ్యైమెన వ్యక్తి అని రెండో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక మూడో ప్రశ్నకు సమాధానంగా వారు, మీరు రాజ్య విస్తరణ చేపట్టండి. అంతకంటే ముఖ్యైమెన పని ఇంకొకటి లేదని చెప్పారు. మూడు ప్రశ్నలకూ సమాధానాలు వచ్చాయి. అయితే, ఈ సమాధానాలు రాజుగారికి ఏమాత్రం నచ్చలేదు. ఆయన పుర ప్రముఖుల్ని, పండితుల్ని, ఆధ్యాత్మికవేత్తలను పిలిచి ఈ ప్రశ్నలకు సమాధానాలు అడిగారు. సరైన సమాధానం చెప్పినవారికి బహుమతి ఉంటుందని కూడా దండోరా వేయించారు. కానీ, సమాధానం చెబుతానన్న ప్రతివారూ తన తృప్తి కోసం చెబుతున్నారు తప్ప తాను నిజంగా తృప్తి పడే సమాధానాలు చెప్పడం లేదని ఆయన అర్థం చేసుకున్నారు. రాజ్యం పొలివేురల్లో ఓ చిట్టడవిలో జప తపాలలో మునిగి ఉన్న ఓ సాధువు ఆధ్యాత్మికంగా తల పండిన వ్యక్తి అని, ఆయన దగ్గర సమాధానం దొరకవచ్చని ఓ మంత్రి సూచించాడు. దాంతో రాజుగారు ఒంటరిగానే ఆ సాధువు దగ్గరకు బయులుదేరారు. అడవిలో ఓ ఎత్తయిన కొండ మీద ఉన్న గుహలో ఆ సాధువు ధ్యాన ముద్రలో కనిపించాడు. ఆయన ధ్యానానికి భంగం కలిగించడం దేనికనే ఉద్దేశంతో రాజుగారు చాలా సేపు నిరీక్షించారు. ఆయన ఎంత సేపటికీ కళ్లు తెరవలేదు. చూసీ చూసీ రాజుగారు అక్కడే నిద్రపోయారు. పొద్దున్నే నిద్ర లేచి చూసే సరికి ఆ సాధువు గుహలో లేరు.

రాజుగారు  బయుటికి వచ్చి ఆ కొండ ఎక్కి అక్కడి నుంచి తన రాజ్యం వైపు చూశారు. రాజ్యంలోని ప్రజలందరి సంక్షేమం తన మీద ఆధారపడి ఉంది కదా అనిపించింది. తాను క్షేమంగా ఉండడం ఎంత అవసరమో అని అనుకున్నారు ఆయన. ఇంతలో ఆయన భుజాల మీద ఎవరో తట్టినట్టు అనిపించి వెనక్కు తిరిగి చూశారు. సాధువు చిరునవ్వుతో నిలబడి ఉన్నారు. ‘‘ఏం రాజా ఏం ఆలోచిస్తున్నావు?’’ అని అడిగారు. 

కొంత కాలం నుంచి తనను ఓ మూడు ప్రశ్నలు మనసును తొలిచేస్తున్నాయని రాజుగారు ఆ సాధువుకు చెప్పారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన సాధువును కోరారు. సాధువు సరే అన్నారు. రాజుగారు మొదటి ప్రశ్న వేశారు. ‘‘అన్నిటికన్నా ముఖ్యైమెన సమయం ఏది?’’

సాధువు తడుముకోకుండా సమాధానం చెప్పారు. ‘‘ఇప్పుడు! ఇప్పుడంటే వర్తమానం. భవిష్యత్తు ముఖ్యం కాదు, గడిచిపోయినimage కాలం ముఖ్యం కాదు. ఈ క్షణంలో నువ్వెలా ఉన్నావనేది, ఎంత ఆనందంగా, ఎంత బాధ్యతగా ఉన్నావనేది ముఖ్యం. గతించిన కాలాన్ని తీసుకు రాలేం. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో, మనం ఏం కాబోతున్నామో చెప్పలేం. అందుకని వర్తమానమే, ఈ క్షణమే ముఖ్యం’’ అని సాధువు వివరించి చెప్పారు. 
రాజుగారు తృప్తి పడ్డారు. ఆయన తన రెండో ప్రశ్న అడిగారు. ‘‘అందరికన్నా ముఖ్యైమెన వ్యక్తి ఎవరు?’’. సాధువు సమాధానం చెప్పారు. ‘‘మీరే!’’ అన్నారు. 
‘‘నేనా!’’ అంటూ రాజుగారు ఆశ్చర్యపోయారు. ‘‘అవును మీరే. మీకు మీరే ముఖ్యం. మరో వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తే ముఖ్యం. మీరతను చెప్పేది సావధానంగా వినాలి. మరో వ్యక్తి లేనంత వరకూ మీరే ముఖ్యం. ఈ రాజ్య ప్రజల సంక్షేమం మీ మీద ఆధారపడి ఉంది. అందువల్ల మీరే ముఖ్యం. మీ గురించే మీరు తెలుసుకోవాలి’’ అని సాధువు వివరించారు. 
ఇక మూడో ప్రశ్న. ‘‘చేయాల్సిన ముఖ్యైమెన పనేది?’’. సాధువు మళ్లీ సమాధానం చెప్పారు. ‘‘ప్రజల పట్ల దయ కలిగి ఉండడం. వారి సంరక్షణ బాధ్యత తీసుకోవడం. వారిని కన్నబిడ్డల్లా చూసుకోవడం’’.. అని సాధువు వివరించి చెప్పారు. 
రాజుగారు ఆ సమాధానాలు విని సంతృప్తి చెందారు. సాధువుకు నమస్కరించి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోతుంటే సాధువు మరో మాట కూడా అన్నారు. ‘‘ఈ మూడు ప్రశ్నలకూ సమాధానాలు ఒక్కోసారి వ్యక్తిని బట్టి మారుతుంటాయి. మొదటి సమాధానం మాత్రం అందరికీ అన్ని వేళలా వర్తిస్తుంది’’.. అని చెప్పారు. రాజుగారు సంతోషించారు.  
చేతనదీర్ఘాయువు రహస్యం

Updated By ManamSat, 03/17/2018 - 07:42

imageప్రపంచంలో కొంతమంది వందేళ్లు, నూట పదేళ్లు కూడా బతుకుతుండటం చూసి, మనమంతా వాళ్ల వయసులో సగానికి కానీ అంతకంటే తక్కువకు కానీ రాలిపోతున్నప్పుడు వాళ్లు అంత కాలం ఎలా బతుకుతున్నారనే సందేహం మనకు కలిగి తీరుతుంది. జీన్స్ అనేవాటిని బట్టి ఆయువు ఉంటుందని విజ్ఞానశాస్త్ర పరిశోధకులు చెబుతుంటారు. అయితే ఇంకా ఏయే విషయాలు ఆయుష్షును పెంచుతాయి? మనస్తత్వం, మేధకు సంబంధించిన దృక్పథం కూడా కొంతవరకూ పనిచేస్తాయి. సాధారణంగా కులాసాగా, ధైర్యంగా ఉండే ఆశావాది ఎక్కువ కాలం బతుకుతాడు. విచారం, భయం, నిరాశతో కుంగిపోయేవాడు ఎక్కువ కాలం జీవించలేడు. 

థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథులకు సంబంధించిన చికాకులు కానీ, అవకతవకలు కానీ.. మేధనూ, శరీరాన్నీ కూడా క్షీణింపజేస్తాయనే విషయం మనకు తెలిసిందే. పిట్యూటరీ గ్రంథులు దెబ్బతిన్నట్లయితే త్వరలోనే వార్థక్యం వస్తుంది. అందుచేత ఎండోక్రైన్ గ్రంథులకూ, మన విరోధియైన వృద్ధాప్యానికీ ఏదో దగ్గర సంబంధం ఉందనుకోవాలి. ఏమైనా మనకు ఉండే ఆర్థిక, సామాజిక సమస్యలు మనకెక్కువ కష్టాల్ని కలిగిస్తున్నాయని మనం నమ్మిననాడు సాధ్యమైనంత వరకు ఆ కష్టాల్ని దూరం చేసుకున్నట్లయితే జీవితం కొంతవరకు కులాసాగా ఉంటుంది. జీవితం ఆనందకరంగా ఉంటే ఆయువు కూడా అదే పెరుగుతుందని నమ్మాలి.ధ్యానంతో గుండె పదిలం!

Updated By ManamSat, 03/17/2018 - 07:42

imageధ్యానాన్ని సాధన చేసేవాళ్లలో గుండె జబ్బు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందా? అవుననే అంటున్నాయి పరిశోధనలు. ఈ పరిశోధనలు మన దేశంలో కాకుండా అమెరికాలో జరుగుతుండటం ఇక్కడ గమనార్హం. విపాసన, సావధాన ధ్యానం (మైండ్‌ఫుల్ మెడిటేషన్), జైన్ మెడిటేషన్, పారమార్థిక ధ్యానం (ట్రాన్సెండెంటల్ మెడిటేషన్) వంటి కూర్చొని చేసే సామాన్యమైన ధ్యానాల ప్రభావంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి సమీక్ష ఆధారంగా గుండె సమస్యల కారకాలు, గుండె జబ్బుపై అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒక శాస్త్రీయ ప్రకటన వెలువరించింది.

ఒత్తిడి, ఆందోళన, న్యూనత వంటి మానసిక రుగ్మతల్ని తగ్గించడానికీ, నాణ్యమైన నిద్రను కలిగించడానికీ, మొత్తంగా ఆరోగ్యంగా జీవించేందుకూ ధ్యానం ఉపకరిస్తుందనేది ఆ పరిశోధనల సారాంశం. గుండె సంబంధ వ్యాధులకు ప్రధాన కారకాల్లో ఒకటైన రక్తపోటును తగ్గించడానికి కూడా ధ్యానం సాయపడుతుంది. ధూమపానాన్ని వదిలేయడానికి తోడ్పడే ధ్యానం.. గుండెపోటు ప్రమాదాన్ని చాలావరకు తగ్గిస్తుంది. 

కాగా, గుండె జబ్బు ప్రమాదాన్ని నిలువరించడానికి అత్యుత్తమ ప్రమాణం గుండె ఆరోగ్య జీవనశైలిని అలవరచుకోవడమేనని ఆ ప్రకటన నొక్కి వక్కాణించింది. అంటే ధూమపానానికి దూరంగా ఉండటం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకర ఆహారం అనేవి ఈ జీవనశైలిలో భాగం. అలాగే అధిక రక్తపోటు, అధిక కొవ్వు, ఇతర గుండె సమస్యలకు మందులు తీసుకోవడం కూడా ముఖ్యమే. ఇవాళ ధ్యాన జ్ఞానం విరివిగా అందుబాటులో ఉంది కాబట్టి మెడిటేషన్‌ను సాధనచేసి మంచి ఫలితాలు అందుకోవడమే తరువాయి.పేగుబంధం తెగిపోయిన జాడ

Updated By ManamSat, 03/17/2018 - 07:38

imageఛత్ నీ యవ్వ ఏం ఊరది? ఊరు గురించి మాట్లాడుకోవడానికి ఏమున్నది? ఊరు ఊరి తీరున్నదా ఏమన్న. ఒకనాడు ఎట్లుండే?! ఇప్పుడెట్లయ్యింది! ఆ ఊరు గురించి తలుసుకుంటే సాలు కన్నీళ్లు ధార గట్టే బాధ కెలుకుతుంటది. అమ్మమ్మ ఊరంటే తియ్యని తీపి ముచ్చట్లు ఉండడానికి ఇప్పుడక్కడ బతుకు పుర్సత్‌గ లేదు. ఒక దోస్తు అడుగుతుండే ‘‘అన్నా మాది మీ అమ్మమ్మ ఊరు పక్కన్నే. ఎప్పుడొస్తరు’’ అని. ఏం చెప్పాలే. ఎప్పుడు పోతనో తెలియదు. ఈ ప్రశ్నకు లోలోపల ఒక అగ్ని పర్వతం బద్దలైంది.
ఎందుకంటే ఇప్పుడు అక్కడ అమ్మమ్మ లేదు. తాత లేడు. బండెడు బలగమున్నా, పలకరించే పరిస్థితి లేదు. అయినా ఆ ముసల్ది బతికున్నప్పుడు దాని విలువ తెలువలే. తాతకు తగ్గ జోడది. తాతకు రోషమెక్కువ. మా అమ్మమ్మకు ఓపికెక్కువ. అందుకే ఆ సంసార బండి కూలబడకుండా యేండ్ల కొద్ది నడిచింది. తాత పోయినంక, కొడుకులు తిండి పెట్టడానికి వంతులు పెట్టి తిప్పే బాధ వద్దనుకున్నదేమో, తాత చూపిన రోషంతోటే తనకో గుడిసె వేయించుకొని తన తిండి తానే వండుకున్నది. నాకిప్పటికీ గుర్తు. అలాంటి ఒంటరి సమయంలో నేను పోయినప్పుడు మీద పడి ఏడ్చిన జ్ఞాపకం. 

అవును దాని పేరు గ్యారవ్వ. నేను పెట్టుకున్న పేరు. అసలు పేరు నర్సవ్వ. నలుగురు బిడ్డెలకు.. అందరికి కొడుకులున్నరు. రోజూ ఎంబడే ఉండే కొడుకుల కొడుకులున్నరు.  అంతమంది ఉన్నా దానికెందుకో నా మీదనే పాణం. బిడ్డె కొడుకునని, తొల్సూరోన్నని ప్రేమతోటి గ్యారెలు చేసుకొని పట్టుకొచ్చేది. గ్యారెలు తెచ్చింది కాబట్టే దానిపేరు ‘గ్యారవ్వ’ అని పిలుచుకున్న. పూలదండల దారం పూలను కలిపినట్టు అందరిని కలిపి ఉంచింది అదే అని, అది సచ్చిపోయినంక ఎరుకయ్యింది.

‘ఏడు తరాలు’ రాసిన అలెక్స్ హేలీ తన మూలాలు వెతుక్కుంటూ పోయినట్టు నేను కూడా బయల్దేరిపోతే, నాకు ఎదురొచ్చి నిలబడేది ఈ ఊరే. మా గ్యారవ్వ ఊరు. పేరు కోనాపురం. ఊరనేమాట ఇనబడితే సాలు, ఎంటనే మనసుల మెరుస్తది. అన్ని ఊర్లకు ఉన్నట్టే ఈ ఊరుది కూడా బతికి చెడ్డతనమే. మా తాత యిల్లు ఎట్లా పడావు పడ్డదో, ఈ ఊరు కూడా అట్లనే ఖరాబయ్యింది. మా అమ్మను కన్నది, ఆ నాయినను కన్నది కాబట్టి నా బొడ్డు పేగు ఈ ఊరితోటే ముడిపడి ఉన్నది.

పసి పోరగానిగా ఉన్నప్పుడు ఊరికిపోతే బొచ్చెడు ముచ్చెట్లు చెప్పింది. చెర్లల్ల ఈతలు, ఈతపండ్ల వేటలు, బాయిల కాడ ఆటలు, కాల్చుకతిన్న కంకులు, జేబుల నింపుకున్న రేగ్గాయలు, చిమచింతకాయలు ఒకటేంది అనేకం పరిచయం చేసింది ఆ ఊరే. గొడ్డును కోసేకాడ పలుచటి తోలు తీసి, పగిలిన కుండ మూతకు కట్టి డప్పుచేసి ఇచ్చింది ఈ ఊరే. ఆ డప్పులు పగిలిపోతే, పోశవ్వతల్లి గుడెనుక చింతచెట్ల కింద పాత చాటల మీద దరువులేసి కొట్టి ఆడింది ఇక్కడే. రాతెండి బేషన్ బోర్లిచ్చి లయ కలుపుతూ దరువులు కొడుతూ, పండు వెన్నెల కింద అద్దుమరాత్తిరి దాకా పాటలు ఊట పారించి, సాయితగాళ్లను ఒక్కచోట చేర్చి ముచ్చట్లు చెప్పింది ఈ ఊరే. ఎన్ని నేర్పిందో ఈ ఊరు? ఈ ఊరికొచ్చిన ప్రతిసారీ బతుకు విలువను గురువు పాఠం చెప్పినట్టే ఇడమరిచి చెప్పింది.
ఎట్టితనం నుండి ఎడ్డితనం దాకా సాగిన జీవిత మలుపులకు, ఒక సజీవ సాక్షి ఈ ఊరే. నన్ను నమ్మురా నేను చూసుకుంటానని చెప్పి, మోసం చేసిన దొరల దాష్టీకానికి బలైపోయిన గుణపాఠం నేర్పింది ఈ ఊరే. ఒక్కపూట కూడా తిండికి లేక అల్లాడిన జీతగాళ్ల దీనగాథల బతుకునంతా కథగా నాయిన చెప్పింది ఈ ఊరు గురించే.

ఏందో ఊరు సూత్తాంటే సూత్తాంటెనే కట్టె సరుచుకు పోయింది. కంటె బొక్కలు తేలిన ముసల్ది అయిపోయింది. మనుషులు మనుషుల తీరు లేరు. ఎవ్వరి జీవితాలు నిలకడగా లేవు. దేనికోసమో పరుగులాట. ఎందుకోసమో వెతుకులాట. అరెకురం, ఎకురం భూములు కాళ్ల కింది నుండే కదిలిపోయినయి. అవసరాలకో, ఆపదలకో కొంచెం కొంచెంగా కరిగి పోయినయి. పనులు లేవు. పసులు లేవు. పచ్చి గుడంబ ఇచ్చే ఓదార్పులు ఒళ్లును కాదు ఇల్లును గుల్ల చేస్తుంటది. ఐదేళ్లకోసారి మా వాళ్లంతా లైన్లో నిలబడే ఓటర్లు తప్ప, సర్కారు, రాజకీయ పార్టీల దృష్టిలో మరేం కారు. గరీబీ హటావో అన్నోళ్లున్నరు. అంతా హైటెక్కు అన్నరు. దేశం ఎలిగిపోతుందన్నరు. ఇప్పుడు అంతా బంగారు తెలంగాణ అంటున్నరు. ఎందరు ఎన్ని అన్నా మా అమ్మమ్మ ఊరు మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యలేక పోయింది. సర్కారు బడి సతికిల బడ్డది. సీసీ రోడ్ల తీరు, సంక్షేమం మా వెలివాడను తాకకుండానే ఆగిపోయింది. మనిషెనుక మనిషి ఒక్కరొక్కరుగా మాయమైపోయారు. పండు ముసలోల్లు కాదు, పడుసు పోరగాళ్లు కూడా మటమటాన మాయమైపోయారు. పిట్టల లెక్క నేల రాలిపోయారు. యిండ్లు కళ తప్పినయి.

మా అమ్మమ్మ ఊరిలో మావాళ్లకు పెద్దగా ఆశలేం లేవు. ఆ పూటకు బతికుంటే చాలనుకోవడమే అక్కడ అతిపెద్ద ఆశ.  బంగ్లాలు, భవంతులు, బంగారాలు, పట్టుబట్టల మీద మోజు కాదు, ఆశ కూడా లేదు. ఈ పూట గడిస్తే, రేపటికి తెల్లారితే చాలుననుకునే తనం నాకిప్పుడు అడుగడుగునా కనిపిస్తున్నది. తెల్లారితే చాలుననుకొని బతికినోళ్ల బతుకులన్నీ తెల్లారిపోయిన విషాదానికి 
మౌనసాక్షి  ఆ ఊరే. ఔను.. ఈ ఊరే మమ్ముల కట్టుబట్టలతో పట్నం దారి పట్టించింది. అదే మంచిదైంది. లేకుంటే మా బతుకులు కూడా ఏమయ్యేటియో!!
     పసునూరి రవీందర్, 7702648825ఆట బొమ్మలు

Updated By ManamSun, 02/18/2018 - 02:01

kidsపిల్లల ఆరోగ్యం గురించి ఎన్నో రకాలుగా శ్రద్ధ తీసుకుంటాం. వారి ఆహారం, వేయించే దుస్తుల దగ్గర నుంచి శుభ్రత విష యంలో ప్రతిదీ ఆచితూచి వ్యవహ స్తాం. కాలుష్యం, వాతావరణ పరిస్థితులలో మార్పుల నుంచి వారిని కాపాడాలని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. ఇవి కాకుండా వారి నోటి శుభ్రత, పోషక ఆహార జాగ్రత్తలు తదితరాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు తల్లిదండ్రులు. మరి పిల్లల ఆటబొమ్మల సంగతి? పిల్లల ఆట వస్తువుల శుభ్రతపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లోహంతో లేదా చెక్కతో చేసిన బొమ్మలుంటాయి. అవి విరిగి చిన్న చిన్న ముక్కలైతే ప్రమాదమే కదా! ఇవికాకుండా ఇంకా ఎలాంటి బొమ్మలతో ఎలా వ్యవహరిం చాలో తెలుసుకుందాం...

 

ఆటలు ఆడటం వల్ల పొందే లాభాలు 
క్రీడల వల్ల పిల్లలకు ఏవైనా లాభాలున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వస్తుంది. క్రీడలు పిల్లల జీవితాలలో ప్రాధాన పాత్రplaying toys for kids పోషిస్తాయి. క్రీడల వల్ల ఎన్నో లాభాలున్నాయి. నిజానికి, పిల్లలకి ప్లేగ్రౌండ్‌కు అలవాటు చేయడం ఎంతో మంచిది. ఆరోగ్యకరంగా మీ పిల్లలు ఎదగాలని మీరనుకుంటే కచ్చితంగా మీ పిల్లలకు క్రీడలను అలవాటు చేయాలి. ఈ తరం పిల్లలు ఒబేసిటీతో బాధపడుతున్నారన్న విషయం తెలిసిందే. అటువంటి సమస్యలను అధిగమించాలంటే కచ్చితంగా పిల్లలకు క్రీడలలో పాల్గొనే అలవాటు చేయాలి. పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు స్పోర్ట్స్ ఉపయోగపడతాయి. తల్లితండ్రులుగా, పిల్లలకు స్పోర్ట్స్ వల్ల కలిగే ప్రయోజనాలని మీరు తప్పక తెలుసుకోవాలి. మీ పిల్లలని ఆటలకు దూరంగా ఉంచడమంటే వారిని అందమైన బాల్యం నుంచి దూరంగా ఉంచడమేనని అర్థం చేసుకోండి. ఈ రోజులలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా స్కూల్స్ లో అసలు ప్లే గ్రౌండ్స్ లేవు. ఇది చాలా విచారించదగ్గ విషయం. కళ్ళు తెరచుకుని మంచి తల్లిదండ్రులుగా పిల్లలకు ఆటల వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించి వారిని ఆ దిశగా ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం.

చదువులో కూడా చురుకుగా...
kidsపిల్లలలో మానసిక ఎదుగుదల తాజా సర్వే స్పోర్ట్స్ లో పాల్గొనే పిల్లలు చురుగ్గా ఉంటారు. వీరు, వివిధ అంశాలపై ఫోకస్‌ను మెయింటైన్ చేయగలుగుతారు. స్పోర్ట్స్‌లో పాల్గొనడం వీరికి ఈ లాభాన్ని తెచ్చిపెడుతుంది. పిల్లలు చురుగ్గా ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యం. అందువల్ల, పిల్లలని స్పోర్ట్స్ వైపు ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం. సోషల్ స్కిల్స్ సోషల్ స్కిల్స్ అనేవి ఎంతో ముఖ్యమైన అంశం. పిల్లలు స్పోర్ట్స్ లో పాల్గొనడం ద్వారా ఈ స్కిల్‌ను పెంపొందించుకుంటారు. మిగతా పిల్లల్ని కలిసి వారితో ఇంటరాక్ట్ అవడం ద్వారా ఈ స్కిల్స్‌ను పెంపొందించుకునే సౌలభ్యం ఉంటుంది. క్రీడలలో పాల్గొనే పిల్లలలో టీం వర్క్ సామర్థ్యాలు ఎక్కువ. ఒక టీం విజయం సాధించడానికి అవసరమయ్యే లక్షణాలు పిల్లలు పెంపొందించుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన నైపుణ్యం. 

పిల్లల పెరుగుదల
పిల్లలు పెరిగి పెద్దయిన తరువాత ఉద్యోగాలలో త్వరగా మంచి పొజిషన్‌కు చేరుకుంటారు. మెదడు చురుగ్గా ఉంటుంది తలలో ఉండేgrowing మెదడు అభివృద్ధి ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల చురుగ్గా ఉంటుంది. చురుగ్గా ఉండే ఆరోగ్యకరమైన మెదడు వల్ల పిల్లలు చక్కగా నేర్చుకుని త్వరగా ఎదుగుతారు. ఆరోగ్యకరమైన మెదడు సులభంగా గుర్తుంచుకుని జ్ఞప్తికి తెచ్చుకునే శక్తిని కలిగి ఉంటుంది. శారీరక ఎదుగుదల స్పోర్ట్స్‌లో చురుగ్గా పాల్గొనడం వల్ల పిల్లల కండరాల ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. అలాగే, ఎముకలు కూడా చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. అందువల్ల, తరచూ స్పోర్ట్స్ లో పాల్గొనమని పిల్లల్ని ప్రోత్సహించాలి. గుడ్ పోస్టర్ క్రీడలలో చురుగ్గా పాల్గొనడం వల్ల శరీర భాష కూడా అభివృద్ధి చెందుతుంది. 

పిల్లలి నిద్రలేపే మార్గాలు
kidత్వరగా పడుకుని త్వరగా లేవాలి! గాఢనిద్ర అనేది చాలా ముఖ్యమైన పని, ఇది మీ పిల్లల శారీరిక, మానసిక సామర్ధ్యాన్ని నిర్ణయిస్తుంది. దీనికోసం, మీరు మీ పిల్లలకు మంచి నిద్ర అలవాటును అనుసరించడానికి మీ బిడ్డకు శిక్షణ ఇవ్వాలి. మీ పిల్లలు ఉదయానే త్వరగా నిద్ర లేవడానికి పరోక్షంగా పనిచేసే అద్భుతమైన మార్గం. త్వరగా నిద్ర లేవడం వల్ల పిల్లల మనసు, శరీరం తాజాగా, ఉల్లాసంగా ఉంటారు. ఇది వారి ఆరోగ్యంపై గొప్పగా ప్రతిబింబించి, వారిని మంచి విజ్ఞానంతో, సంతోషంగా తయారుచేస్తుంది. కానీ, కొన్నిసార్లు వారు తగినంత విశ్రాంతి పొందే ముందు పిల్లలు లేస్తారు. ఒక తల్లిగా, మీ బిడ్డకు ఎంత నిద్ర అవసరమో మీరు తెలుసుకోవడం ముఖ్యం. ఇది బిడ్డ వయసును బట్టి మారుతూ ఉంటుంది. మీరు మంచి సలహా కోసం మీ పిల్లల డాక్టరుతో మాట్లాడండి. మంచి నిద్ర అనేది త్వరగా పిల్లల నిద్రలేవడానికి చేసే ఉత్తమమైన మార్గాలలో ఒకటి. మీ పిల్లలు రోజువారీ షెడ్యూల్‌కి కట్టుబడి ఉండేట్టు చూడండి, ఇది వారి జీవ గడియారం పనితీరు సరైన దారిలో వెళ్ళడానికి సహాయపడే ఉత్తమమైన మార్గం. మీ పిల్లల్ని త్వరగా నిద్రలేపడం ఎలా అని నిర్ణయం తీసుకున్న తరువాత ఒక ప్రణాళిక వేసుకుని షెడ్యూలును అనుసరించండి. స్కూల్ సమయం, కుటుంబ షెడ్యూల్, పిల్లల్లో సౌకర్య స్థాయి వంటి ఎన్నో వాస్తవాలను పరిగణలోనికి తీసుకోవడం అవసరం. త్వరగా ప్రణాళిక చేసుకోవడం వేసవి సెలవల నుండి తిరిగి స్కూలు ప్రారంభించే సమయం రావడం అనేది తల్లిదండ్రులకు అంత తేలికైన విషయం కాదు, పిల్లలకు ఖచ్చితంగా తేలిక కాదు. ప్రశాంతమైన ఉదయం పొందడానికి, మీరు ముందే ప్రణాలికను ప్రారంభించడం అవసరం. ఒక వారం ముందే మీ బిడ్డను సిద్ధం చేయాలి.  

పిల్లలకు బాదం పాలు ఇవ్వండి! 
కొంతమంది తల్లిదండ్రుల పిల్లల డైట్‌లో ఆల్మండ్ మిల్క్ చేరుస్తూ ఉంటారు. పిల్లల్లో లాక్టోజ్ తక్కువ అవుతుందని ఉద్దేశ్యంతో ఆల్మండ్ మిల్క్ ఇస్తారు. అలాగే కొంతమంది పిల్లలకు childrenఅనిమల్ మిల్క్ వల్ల అలర్జీ ఉన్నా.. ఆల్మండ్ మిల్క్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ఆల్మండ్ మిల్క్ పిల్లలకు మంచిదేనా అనేది ప్రతి ఒక్కరి అనుమానం. ఒకవేళ మీ పిల్లలు నట్ ఎలర్జీతో బాధపడుతుంటే ఆల్మండ్ మిల్క్ ఇవ్వకూడదు. కాబట్టి.. మీ పిల్లలకు ఆల్మండ్ మిల్క్ ఇవ్వడం మంచిదేనా, కాదా అన్నది డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. సాధారణంగా.. నట్ అలర్జీ వల్ల వాంతులు, డయేరియా, పొట్టలో నొప్పి, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, ర్యాషెస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీ పిల్లలకు నట్ ఎలర్జీ ఉందో లేదో తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే.. నట్ అలర్జీ వల్ల కొన్ని సార్లు చాలా ప్రమాదకర పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే పిల్లలకు కొంత ఫ్యాట్ అవసరం అవుతుంది. కాబట్టి వాళ్లు హెల్తీగా పెరగాలంటే.. డైట్‌లో ఫ్యాట్ చేర్చాలి. ఆల్మండ్ మిల్క్ పిల్లల పెరుగుదతలకు కావాల్సినన్ని పోషకాలు అందించడంలో సహాయపడదు. బాదాంలో చాలా పోషకాలు ఉంటాయి.. కానీ.. ఆల్మండ్ మిల్క్‌లో వాటర్ ఉండటం వల్ల.. ఆల్మండ్స్‌తో పోల్చితే.. దీనిలో తక్కువ పోషకాలుంటాయి. ఒకవేళ మీ పిల్లలకు ఆల్మండ్ మిల్క్ ఇవ్వాలని మీరు భావిస్తే.. ఒకటిన్నర ఏడాది దాటిన పిల్లల డైట్‌లో అదనంగా చేర్చాలి. అలాగే.. ఈ ఆల్మండ్ మిల్క్ ఇవ్వడానికి ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.  

క్రమశిక్షణతో పెంచండి
kidమీ బిడ్డకు తక్కువ శ్రద్ధ ఉందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దేనిమీదా దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారని మీరు భావిస్తున్నారా? ఇది ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల గురించి చెప్పేఒక సాధారణ ఫిర్యాదు లాంటిది. ఈ రోజుల్లో పిల్లలు ఒకే పని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. వాస్తవానికి దీనికి ప్రధాన కారణం వారి పని లోడ్ పెరుగుతుండటం లేదా వారు ఎక్కువ పనిని తట్టుకోలేకపోతున్నాయని చెప్పవచ్చు. ఇంకా పిల్లలు బాగా అలసిపోయిన మరియు బాగా ఒత్తిడికి గురవడం వలన వారు దేనిమీదా దృష్టి చేయక పోవడానికి కారణాలు కావచ్చు. మీరు వారి కోసం ఏమైనా చేస్తే లేదా వాటిని తినేలా చేయండి,ఒక్కొక్కసారి మీరు చేసింది తినాలనే ద్యాస వారికి ఉండకపోవచ్చు. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి? వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఆటని ప్రయత్నించండి ఇది మీకు కోపాన్ని తెప్పించవచ్చు! కానీ, ఒక మనిషిగా మీరు ఒత్తిడితో కూడిన సమస్యలను ఎదుర్కొంటూ, పిల్లవాడి ఒత్తిడి, పోటీ మరియు ఇతర పనిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందా? మీ పిల్లల పనిని సరైన సమయంలో పూర్తి చేయగల సామర్థ్యాన్ని అందించేలా మీరు వారికి సహాయపడాలి. మీరు వారి ఏకాగ్రతని పెంచడం మీదమాత్రం పని చేయాల్సిన అవసరం ఉంది,మిగిలిన అన్నింటినీ చూసుకోవడానికి మీ పిల్లల తెలివి సరిపోతుంది.

వారి శారీరక అవసరాల గురించి తెలుసుకోండి పెద్దలతో పోలిస్తే పిల్లలు కొంచెం భిన్నంగా వుంటారు. వారు వివిధ శరీరధర్మ అవసరాలను కలిగి వుంటారు, మరియు మీరు వారికి కావాల్సిన అవసరాలు అందేలా చూసుకోవాలి. వారి రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన ఆహారాన్ని మరియు తగినంత నిద్ర వారికి అందించేలా నిర్ధారించుకోండి.

నూలుతో చేసిన బొమ్మలు నూలు లేదా ఫర్‌తో చేసిన బొమ్మలు తొందరగా మురికి పట్టిపోkidsతాయి. ఇవి ఎలర్జీని కలిగించగలవు. ఇలాంటి ఆట బొమ్మలను శుభ్రపర్చడం కష్టమనుకుంటే వాడనప్పుడు ప్లాస్టిక్‌తో చుట్టేయడం మంచిది. కాస్తంత శ్రద్ధ తీసుకుంటే ఎంతో కాలంపాటు మన్నికగా ఉంటాయి. గట్టిగా ఉండే బొమ్మలను శుభ్రపర్చడం తేలిక. 

ఎలక్ట్రానిక్ బొమ్మలు ఎలక్ట్రానిక్ ఆట బొమ్మలను నీటితో శుభ్రం చేయలేం. ఇలాంటి వాటితో వ్యవహరించేటప్పుడు తయారీదారుల సూచనలు తప్పకుండా చూడాలి. వీటిని శుభ్రం చేసేందుకు మొదట బ్యాటరీలు తీసేయాలి. ఆ తర్వాత తుడిచే సొల్యూషన్‌లో కాగితం లేదా బట్ట ముంచి పైన తుడవాలి. కాస్త నీళ్లు పడినా బొమ్మ చెడిపోయే ప్రమాదముంది. ఏదైనా స్ప్రే తో ఆటబొమ్మలను తుడవచ్చు. 

kidప్లాస్టిక్ బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలను నీటితో శుభ్రం చేయవచ్చు. అయితే వాహన బొమ్మ అయితే లోపలి భాగాలు తుప్పు పట్టకుండా జాగ్రత్త పడాలి. కారు, బైక్ ప్లాస్టిక్ బొమ్మలుంటే జాగ్రత్తగా తుడవాలి. పై భాగంలో శుభ్రపరిస్తే మేలు. చెక్కతో చేసిన బొమ్మలకు ఇదే విధానం వర్తిస్తుంది. కావాలనుకుంటే సబ్బుతోనూ ప్లాస్టిక్ వస్తువులను కడిగేసేయొచ్చు. 

బట్టతో చేసినవి... బట్టతో చేసిన బొమ్మలైతే 3 లేదా 4 రోజులకోసారి వాషింగ్ మెషీన్‌లో వేయవచ్చు. ఏదైనా బొమ్మ చాలాకాలంపాటు వాడకపోతే దాన్ని పిల్లల కిచ్చే ముందు శుభ్రంగా కడిగి ఇవ్వడం మర్చిపోకండి.  వీటిని బయటే ఉపయోగిస్తాం కాబట్టి సులువుగా క్రిములు చేరే అవకాశం ఉంది.

బయట బొమ్మలు ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, క్రికెట్ బాల్, సైకిళ్లు లాంటి బయట ఉపయోగించే kiddyఆట వస్తువులను రోజు శుభ్రపర్చడం చాలా మేలు. 1. చేతితో కడగాలి. 2. సబ్బు, నీరు ఉపయోగించి కడగడం. 3. స్పాంజితో శుభ్రంగా తుడవడం 4. బ్లీచింగ్ ద్రావణంలో ఆటవస్తువులను ముంచడం ద్వారా... ఇలా ఆటవస్తువులను శుభ్రంగా చేసుకుంటే పిల్లలను అనారోగ్య బారిన పడకుండా జాగ్రత్తపడగలం.

Related News