special

రెడీ టు ఫైర్

Updated By ManamWed, 09/19/2018 - 00:50

‘నేను జీవించి ఉండగానే ఈ అపవాదు నుంచి బయటపడాలని  నా పిల్లలు చెప్పారు. లేకుంటే వంశం మొత్తం జీవితాంతం ఈ కళంకాన్ని మోయాల్సి వస్తుందని, అది తమకు ఇష్టం లేదని వాళ్ళన్నారు. అందుకే ఇంతకాలం జీవించి ఉన్నాను. పోరాడడానికే జీవించి ఉండడమన్నది నాకు అవసరమై పోయింది. ఇది నా దేశానికి వ్యతిరేకంగా జరిగిన ఒక కుట్ర కథ..., ఇది నా కథ!’    - నంబి నారాయణన్


దేశానికి వ్యతిరేకంగా గూఢచర్యం చేశారన్న అభియోగం ఒక్కటి చాలు, ఒక వ్యక్తి సామాజిక, సాంస్కృతిక, నైతిక, ఆర్థిక, కౌటుంబిక పునాదులన్నీ కదిలిపోతాయి. ఒక వ్యక్తి జీవితాన్ని మట్టిపాలు చేయడంతో పాటు, గూఢచర్యం అన్న పదం ఒక దేశ ఖగోళ శాస్త్ర పరిశోధనకు ఉపయోగపడాల్సిన మేధస్సును కూడా వ్యర్థం చేసేసింది. దేశానికి సంబంధించిన రాకెట్ పరిశోధనల తాలూకు రహస్యాల్ని పాకిస్తాన్‌కు అందిస్తున్నారన్న అభియోగం మీద ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను 1994 నుంచి వేధించి, హింసిం చి, నరకం చూపించారు కేరళ పోలీసులు. ఇన్నేళ్ళపాటు కొనసాగిన అసత్య ఆరోపణల ఫలితంగా ఈ దేశం ఒక శాస్త్రవేత్త సేవల్ని కోల్పోయింది. ఒక శాస్త్రవేత్త తన ఆశయానికి దూరమయ్యాడు. ఒక ప్రతిష్ఠాత్మక ఖగోళ పరిశోధనా సంస్థ తన పరువును పోగొట్టు కుంది. ఒక కుటుంబం అవమానంతో కుంగిపోయింది. ఈ అసత్య గూఢచర్యం కేసులో సుప్రీంకోర్టు గత శుక్రవారం వెలువరించిన తీర్పు నిజాయితీకే తుది విజయ మన్న విశ్వాసానికి సాక్ష్యం. 

image


భారీ ఉపగ్రహాల్ని కూడా మోసుకెళ్ళగలిగే రాకెట్లను తయారు చేసే శాస్త్ర సాంకేతికతను రాకెట్ రంగంలో క్రయోజెనిక్స్ అంటారు. నంబి నారాయణన్ (76) భారత ఖగోళ పరిశోధనా కేంద్రం ‘ఇస్రో’కు చెందిన క్రయోజెనిక్ సైంటిస్టు. ఆయనతోపాటు ఇస్రోలో నే పని చేస్తున్న మరో సైంటిస్టు శశికుమార్, మాల్దీవులకు చెందిన మరియం రషీదా, ఆమె స్నేహితురాలు ఫౌజియా హసన్, వ్యాపార వేత్త శర్మ, రష్యన్ వ్యోమ పరిశోధనా సంస్థ ప్రతినిధి చంద్రశేఖ ర్‌లపై కేరళ పోలీసులు గూఢచర్యం కేసును నమోదు చేసి, అరెస్టు లు చేశారు. 

ఆద్యంతం అసత్యారోపణలతో నిండిపోయిన ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ‘వీరిని అనవసరంగా అరెస్టు చేశారం టూ’, ఇందుకు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవా లని తీర్పునిచ్చింది. ఈ దిశగా ఒక కమిటీని నియమించాలని ఆదేశించింది. 

ఇన్నేళ్ళుగా తన మీద సాగిన ఈ గూఢచర్యం కేసు గురించిన నిజానిజాలన్నింటినీ ప్రపంచానికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో నంబి నారాయణన్ ‘రెడీ టు ఫైర్ : హౌ ఇండి యా అండ్ ఐ సర్‌వైవ్డ్ ది ఇస్రో స్పై కేస్’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ స్వీయగాథలోని కొన్ని భాగాలకు సంక్షిప్త అనువాదాన్ని ‘ముద్ర’ ఇక్కడ మీ కోసం ప్రచురిస్తోంది. 
ఏదో ఒక ముస్లిం పేరు చెప్పు చాలు!

‘సత్య, ధర్మ అనే పేర్లతో ఎవరో కొందరు వ్యక్తులు నా మీద మొదటి పోలీసు విచారణ జరిపారు. నా వెనుక చిన్న కోటు, లాగూ తొడుక్కున్న ఇద్దరు నిలుచున్నారు. వాళ్ళిద్దరూ నా మెడను విరగ్గొట్టడానికే నా వెనుక నిలుచున్నారన్న నిజాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఎక్కువ సేపు పట్టలేదు. 

గదిలో ఉన్న వాళ్ళలో ఒక సీనియర్ అధికారి ‘మీరు గొప్ప శాస్త్రవేత్త. మీరు జాతి సొత్తు. అలాగే మీరు మంచి మెళుకువలు తెలిసిన వ్యక్తి. సరే, ఇదంతా ఎందుకు చేశారు?’ అని నన్ను ప్రశ్నించాడు. 

‘నేనేం చేశాను?!’
‘గూఢచర్యం’
‘గూఢచర్యమేమిటి?’

అతను తన గొంతును సవరించుకుని ‘మిస్టర్ నంబి..., సారీ, డాక్టర్ నంబి...’ అంటూ నన్ను సంబోధించాడు. 
‘నేను డాక్టర్‌ని కాదు, మిస్టర్ చాలు...’ అన్నాను
‘సరే, మీరు డాక్టర్ అంతటి వారే! అయితే, మీరు ఎందుకు ఈ నేరానికి పాల్పడ్డారో చెప్పండి’ అన్నాడు వ్యంగ్యంగా.
‘మీరు దయచేసి అర్థం చేసుకోండి..., నేను ఏ నేరమూ చేయలేదు. మీకేం కావాలో చెప్పండి’
‘పిచ్చిగా మాట్లాడకు, ఒప్పుకుంటే సంతోషంగా బతుకుతావు లేదంటే, నీ చేత ఎలా ఒప్పించాలో మాకు తెలుసు’
బెదిరింపులకు అది మొదటి సూచన.

‘నేను చేసిన నేరమేంటి?’
‘నీక తెలీదా?’ అతను ఒకసారి లేచి, మళ్ళీ కూర్చున్నాడు. ‘నువ్వు దేశ రహస్యాల్ని, రాకెట్ సాంకేతికతను పాకిస్తాన్‌కు అమ్మేశావనడానికి మా దగ్గర ఆధారాలున్నాయి. ఇప్పుడు మేము ఆ మాటను నీ నోటి వెంట వినాలనుకుంటున్నాం. ఇదంతా ఎలా చేశావో చెప్పు. ఎంత లంచం తీసుకున్నావో చెప్పు’
అదే సమయంలో మరో ముగ్గురు గదిలోకి వచ్చారు. వారిలో ఒకడు బూడిద రంగు సఫారీ సూట్‌ను ధరించి ఉన్నాడు. ఒక బక్కపలుచని వ్యక్తి ‘ఈయన ఇండియన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో అతి పెద్ద అధికారి’ అని పరిచయం చేశాడు. 

ఉన్నట్టుండి ఆ బక్కపలుచని వ్యక్తి కోపం గా, ‘ఒరే, లం...కొడకా నీ మీద ఎంత తీవ్ర మైన ఆరోపణలున్నాయో నీకు తెలుస్తోందా? అంటూ అరిచాడు. నేను అతనికి వ్యతిరేకంగా జవాబివ్వగానే, అతను తన దగ్గరున్న ఫైలు నుంచి కొన్ని కాగితాల్ని బయటికి తీసి, నా మీద నమోదైన ఆరోపణల్ని చదివాడు. ఇది అఫిషియల్ సీక్రెట్ యాక్ట్ కింద నమోదైన నేరం. దీనికి పధ్నాలుగేళ్ళు జైలుశిక్ష పడుతుం ది. తరువాత ఆయన తనతో వచ్చిన ఆ ‘పెద్దమనిషి’కేసి వేలు చూపెడుతూ, ‘ఇంత పెద్ద మనిషి నీ నోటి నుంచి ఆ మాటను విన డానికే ఇంత దూరం వచ్చారు. ఈయన నేరుగా దేశంలో అత్యున్నత పదవిలో వ్యక్తికి ఈ సమా చారాన్ని చెబుతారు. ఆయన త్వరలోనే ఢిల్లీకి వస్తారు. కాబట్టి నువ్వు ఎంత త్వరగా ఒప్పు కుంటే అంత మంచిది’ అని అన్నాడు. ఆ పెద్ద మనిషి నిజంగా ఐబికి అధినేత కాదు, ఆయన ఐబి జాయింట్ డైరెక్టర్ ఎం.కె.ధర్ అని నాకు తెలుసు. 
నేను నింపాదిగా, ‘నేను మీకు చెప్పేదేం లేదు. నేను నిరపరాధిని. ఇదం తా ఏవో అపార్థాల వల్ల జరుగుతోంది’ అని జవాబిచ్చాను. కాదు...మాకంతా తెలుసు. నువ్వు మరియం రషీదాని ఎప్పుడు కలుసుకున్నావో చెప్పు’
‘నేను ఆమెను కలవలేదు’ ‘అబద్ధాలాడడానికి నీకు ఎంత ధైర్యం? ఆమె మాకు అంతా చెప్పింది. మా సహనం నశించక ముందే నిజం చెప్పు. అంతటినీ ఒప్పుకో, లేదా నువ్వు అంతమై పోతావు’ ‘దయచేసి నన్ను నమ్మండి’ అని అన్నాను. నా కంఠస్వరం నిజాన్ని ప్రతిధ్వనిస్తోంది. ‘నేను మీరు చెబుతున్నట్టుగా ఆ మాల్దీవుల ఆడవాళ్ళను ఎన్నడూ కలవలేదు. వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నేను వాళ్ళని కలిశానని వాళ్ళు ఎలా చెప్పగలరు?’ ‘నువ్వు ఇలాగే బొంకుతూ ఉంటే, నేను ఫౌజియాను ఇక్కడికి తీసుకొస్తా, దాని చెప్పుతో నిన్ను కొట్టిస్తాను. అది నిన్ను కొడుతుండగా ఫోటోలు తీసి, న్యూస్‌పేపర్లకి ఇస్తాను’ ఆ ఐబి పెద్దమనిషి, అతనితో వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయారు. నన్ను విచారిస్తున్న ప్రధాన అధికారి మళ్ళీ తన పనిని కొనసాగిం చాడు. అప్పటికి రాత్రి అవుతోంది. ఒక అబ్బాయి నాకోసం అన్నం, సాంబారు తీసుకొచ్చాడు. నేను ఆ ఆహారాన్ని ముట్టలేదు. అప్పు డు గదిలో ఉన్న ఇద్దరు వెళ్ళిపోయారు. మరో ఇద్దరు వచ్చారు. 

‘ఎందుకు ఈ నేరానికి పాల్పడ్డావో చెప్పు’ అంటూ వాళ్ళు కూడా పాత పాటే పాడసాగారు. 
‘నువ్వు వికాస్ ఇంజన్, క్రయోజెనిక్ ఇంజన్లను పాకి స్తాన్‌కు అమ్మేశావు’ అని అన్నాడు వారిలో ఒకడు. 
‘మీకు రాకెట్ సైన్స్ అంటే తెలియదు. మీరు చెబుతున్న డ్రాయింగ్‌లు లేనే లేవు. ఏ డ్రాయింగ్‌లు ఇస్రో నుంచి బయటకు వెళ్ళలేదు. ఒక వేళ అలాంటి డ్రాయింగులు ఉన్నా, మాతో కలిసి ఏళ్ళూ పూళ్ళూ పని చేయ కుండా కేవలం డ్రాయింగ్‌ల సహాయంతో ఎవ్వరూ ఇంజన్లను తయారు చేయలేరు. ఇంత వరకు భారతదేశానికి క్రయోజెనిక్ ఇంజన్ లేనే లేదు. ఆ విషయం మీకు తెలుసా? అలాంటి ఇంజన్‌ను తయారు చేయడానికే మేమింకా నానా ప్రయత్నాలు చేస్తున్నాం’

పాకిస్తాన్ న్యూక్లియర్ సైంటిస్టు మొహమ్మద్ అస్లామ్‌తో నాకు సంబంధాల్ని అంటగట్టే ప్రయత్నం చేశారు. ఒక న్యూక్లియర్ సైంటిస్టు తో కలిసి, రాకెట్ పరిజ్ఞానం గురించి మాట్లాడడం కుదరదన్నా ను. ముఫ్ఫై గంటల పాటు అన్న పానీయాలు లేకుండా, నిలబడే ఉన్నాను. ‘నేను నిర్దోషినని మీరు ఒప్పుకునేంత వరకు ఇలాగే ఉంటాను’ అని వాళ్ళని బెదిరిం చాను. ‘కనీసం ఒక్క ముస్లిం పేరైనా చెప్పు...’ అంటూ వాళ్ళు నన్ను నానా హింసలు పెట్టారు. నేను నిజాన్ని మాత్రమే నమ్ము కున్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు. భారతీయ నిఘా సంస్థ ‘రా’ అధికారులు కూడా నాతో వాళ్ళు కోరుకున్న దాన్ని చెప్పించలేక పోయారు. నాలో ఆత్మవిశ్వాసం బలపడింది. కానీ నేను పనిచేస్తున్న సంస్థ ఇస్రో మాత్రం నాపై వచ్చిన ఈ అపవాదును ఖండించక పోవడం నన్ను బాధపెట్టింది. విక్రమ్ సారాభాయికే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటే, ఆయనేం చేసే వాడో?!

అవిశ్రాంత  పోరాటం
imageకేరళలోని తిరువనంతపురంలో హోటల్ సామ్రాట్‌లోని 205 వ నెంబరు గదిలోకి 20 అక్టోబరు 1994న ఒక పోలీసు అధికారి సుడిగాలిలా దూసుకొచ్చాడు. గదిలో ఆయనకి ఒక డైరీ దొరికింది. ఆ డైరీ మాల్దీవులకు చెందిన మరి యం రషీదా అనే మహిళకు చెందింది.  ఆ డైరీ, ఆ రోజు జరిగిన సంఘటనలు భారత దేశపు ఖగోళ పరిశోధనల బాటలో అతి పెద్ద అగాథాన్ని ఏర్పరిచాయి. ఒక శాస్త్రవేత్త సేవల్ని దేశానికి దూరం చేశాయి. ఇరవై నాలుగేళ్ళ జీవితాన్ని అతనికి నరకప్రాయం చేశాయి. భారత ఖగోళ విజయయాత్రకు సారథి అయిన ‘ఇస్రో’ ప్రతి ష్ఠను పరీక్షకు నిలిపాయి. చివరికి ఇన్నాళ్ళకు గ్రహణం వీడింది. ఆ శాస్త్రవేత్త నిర పరాధి అని తేలిపోయింది. 
అవాస్తవాల వెంట పరుగెత్తి, ఇంతటి అనరా ్థనికి కారకులైన వారి మీద చర్య తీసుకోవాలంటూ, ఆ శాస్త్రవేత్తకు యాభైలక్ష ల రూపాయల నష్టపరిహా రాన్ని చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది! కానీ ఈ పరిహారం జరిగిన నష్టాన్ని ఎన్నటికీ పూడ్చలేదు.

ఆ నాటి ఆ ఘటన ఇస్రోకి చెందిన క్రయోజెనిక్ ప్రాజెక్టు అధినేత, ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను పదవీ చ్యుతుణ్ణి చేసింది. దేశానికి వ్యతిరేకంగా గూఢచర్యానికి పాల్ప డి, పాకిస్తాన్‌కు దేశ రహస్యాల్ని చేరవేశారన్న అభియోగాన్ని మోపి పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. భారతదేశానికి చెందిన మూడువందల కోట్ల రూపాయల క్రయోజెనిక్ ప్రాజెక్టు తాలూకు రహస్య పత్రాల్ని అక్రమంగా అమ్ముకున్నారంటూ నారాయణన్‌తో పాటు మరో ఐదుగురి మీద అభియోగాన్ని మోపారు. ఇస్రో శాస్త్రవేత్తల్ని ఇద్దరు మహిళలు లైంగిక ప్రలోభా నికి గురిచేసి, ఈ అక్రమానికి పురికొల్పారని పోలీసులు వాదిం చారు.  దాంతో నారాయణన్ తనకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా 2015లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నారాయణన్ అవిశ్రాంతంగా చేసిన ఈ న్యాయపోరాటంలో గత శుక్రవారం ఆయనకు విజయం లభించింది.

పోలీసుల్ని వదిలి పెట్టను!
తనను దారుణంగా హింసించారంటున్న మరియం రషీదా

‘విదేశీ వ్యక్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాల విభాగంపై పోలీసు అధికారి ఇన్‌స్పెక్టర్ విజయన్ పెత్తనం చెలాయించే వాడు. అతని లైంగిక వాంఛను తీర్చక పోవడంతో నన్ను తప్పు డు కేసులో ఇరికించాడు. నా వీసా గడువును పొడిగించాలని నేను అతణ్ణి సంబంధిత కార్యాలయంలో కలిశాను. నేను దేశాన్ని విడిచి వెళ్ళడానికి టిక్కెట్లు కూడా తీసుకున్నాను. దురదృష్టవశాత్తు అప్పుడు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విజయన్ నా పాస్‌పోర్టును, టిక్కెట్లను తీసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత అతను నేను ఉంటున్న హోటల్ గదికి వచ్చి, నా స్నేహితురాలు ఫౌజియాను గది వెలుపల వేచి ఉండ మన్నాడు. ఆమె వెళ్ళిపోగానే, అతను నా దగ్గరికి వచ్చి, నా భుజం చుట్టూ చేతులు వేసి, కౌగిలించుకునేందుకు ప్రయత్నిం చాడు. నేను ఆగ్రహించి, అతనిని దూరంగా నెట్టేసి, గదిలోంచి వెళ్ళిపోవాలంటూ కేకలు పెట్టాను...’ అంటూ మాల్దీవులకు చెందిన మరియం రషీదా వాపోయింది.

image


ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ మీద నమోదైన గూఢచర్యం కేసులో ఈమె కూడా ఒక నిందితురాలు. రషీదా అక్టోబరు 1994 నుంచి ఏప్రిల్ 1998 వరకు మూడేళ్ళ పాటు కేరళ జైళ్ళలో గడిపింది. ‘జైలు జీవితం దుర్భరమైంది. ‘ై‘పోలీసు కస్టడీలో నన్ను దారుణంగా హింసించారు. జైల్లో నంబినారాయణన్ పేరు చెప్పాలంటూ నన్ను నానా విధాలుగా హింసించారు. ఆ పోలీసు అధికారులకు వ్యతిరేకంగా నా తరఫున మా న్యాయవాది త్వరలో కేసును నమోదు చేస్తారు’ అని రషీదా హెచ్చరించింది. రషీదా స్నేహితురాలు ఫౌజియా హసన్‌ను కూడా గూఢచర్యం కేసులో అరెస్టు చేశారు. కానీ సాక్ష్యాధారాలతో నిరూపించలేక పోవడం వల్ల ఆమెను, రషీదాను విడిచి పెట్టాలని కోర్టు ఆదేశించింది.విచ్చుకునే టీ 

Updated By ManamThu, 09/06/2018 - 01:38

imageమనసంతా అదోలా ఉంది.. బయటికి వెళ్లాలని లేదు.. ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఇలాంటి సందర్భాలకు విరుగుడుగా మీ మనసును ఆకట్టుకునేలా చేసే శక్తి ఒక కప్పు స్పెషల్ టీకు మాత్రమే ఉంది.  కాసిన్ని నీళ్లు బాగా మరిగించి, టీ కప్పులు పోసి, అందులోకి టీ బ్యాగ్ ముద్దను వేస్తే సరి..అది చూస్తుండగానే పువ్వులా విచ్చుకుని మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక ఈ అరోమా మీ మనసును తేలిక చేస్తుంది.  ఘుమఘుమలాడే ఈ చాయ్‌ను తాగితే ఫ్రెష్‌గా ఫీల్ అవుతారు. 
 

image


ఖరీదైన గిఫ్టు
మీకు నచ్చే పూలతో తయారయ్యే ఈ పుష్పాల తేనీరు చాలా ఖరీదైన గిఫ్టుగా మారింది.  మీకు నచ్చినవారికి దీన్ని ఇచ్చి ఆశ్చర్యపరచవచ్చు. 

imageఅమెజాన్‌తో పాటు అన్ని ప్రముఖ స్టోర్స్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.  ఫ్లవరింగ్ టీ, టీ ఫ్లవర్స్, ఫ్లవర్ టీ బాల్, బ్లూమింగ్ టీ పేరుతో మార్కెట్‌లో సందడి చేస్తున్న తేయాకు సాచెట్లు హెర్బల్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ వంటి వివిధ రుచుల్లో ఉంటాయి.  ఆరోగ్యానికి మంచిది కనుక దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది.  ఖరీదైన దీన్ని కొనేబదులు సొంతంగా ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. 

నవాబీ చాయ్‌గా పేరుగాంచిన పలు టీ వెరైటీలు ఎప్పటినుంచో మన సంప్రదాయంలో భాగంగా ఉండగా ఆర్గానిక్ పేరుతో ఇప్పుడివి మార్కెట్లోకి వచ్చిచేరాయి.

ఇలా చేసి చూడండి
ఒరిజినల్ వెనీలా (కెమికల్ ఎస్సెన్స్ కాదు)ను కొని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటే దాన్ని టీలో కలిపితే వెనీలా టీ రెడీ. ఇకimage పసుపు, మసాలాలు, తులసి, నిమ్మ, అల్లం వంటి వాటితో చేసే టీలు మనం నిత్యం సేవిస్తూనే ఉంటాం. వీటికి భిన్నంగా ఉండాలంటే చేమంతి, మందారం, గులాబీ, మల్లె ఇలా మీకు నచ్చిన పూల రెక్కలను తీసుకుని టీ డికాషిన్‌లో వేసి మరిగించండి. లేదంటే సర్వ్ చేసేముందు టీ పై ఈ పూల రెక్కలు వేసి తాగితే వచ్చే రుచి కమ్మగా ఉంటుంది. మల్లె వంటి వి సీజన్‌లోనే లభిస్తాయి కనుక మంచి సువాసన ఉన్న మల్లె రెక్కలను ఎండబెట్టి, వాటిని టీ పొడితో కలిపి డిప్ బ్యాగ్‌లా ప్యాక్ చేస్తే సరిపోతుంది. వర్షాకాలం, చలికాలం ఇవి మీకు ఆయుర్వేద ఔషధాల్లా పనిచేసి సరికొత్త జోష్ నింపుతాయి.  ఆరోగ్యానికి, అందానికి దివ్యౌషధమైన పూల టీలు సేవించడం మంచి వ్యసనం.ఆన్ డిమాండ్

Updated By ManamWed, 09/05/2018 - 02:40

మొబైల్ ఫోన్‌లో టీవీ చూసే వారి సంఖ్య 2020 నాటికి 50 శాతం imageపెరగనుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చానళ్లు తమ ప్రసారాలు స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేట్టు ఉండేలా రూపొందిస్తున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒక వీక్షకుడు తప్పకుండా సెల్‌ఫోన్‌లోనే టీవీ చూస్తుంటాడు కనుక ‘వ ర్చువల్ రియాల్టీ’ (వీఆర్) యూజర్స్ కోసం ప్రత్యేక యాప్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి వీఆర్ యూజర్స్‌ను ‘ఆన్ డిమాండ్ వ్యూయింగ్’ కింద లెక్కకడతారు. అంటే టీవీ ప్రోగ్రాములు చూసే విధానం సమూలంగా మారనుందన్నమాట.
 
ఇక ముందు ఆన్ డిమాండ్ వ్యూయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని టీవీ రియాల్టీ షోలు, సీరియళ్లు వంటివి తయారుimage చేయాలి. లేదంటే రేటింగులు హుళక్కే. ఉదాహరణకు తెలుగులో ‘బిగ్‌బాస్’ రియాల్టీ షో ఉంది. ప్రస్తుతం ఈ షోను టీవీలో, హాట్‌స్టార్‌లో చూస్తున్నవారు కోట్లలో ఉన్నారు. కానీ యాప్‌లో వీటిని ఎవరైనా చూస్తున్నారంటే.. ఎపిసోడ్ బాగుందని టాక్ వస్తేనే చూస్తున్నారు, లేదంటే అస్సలు దీని జోలికే పోరు. కాబట్టి ‘ఆన్ డిమాండ్’ను చానల్ క్రియేటివ్ హెడ్‌లు (ఎంటర్‌టైన్‌మెంట్ చానల్ హెడ్) చాలా సీరియస్‌గా తీసుకోక తప్పదు. చూడచ క్కని, క్రి యేటివ్, ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాములు కాకుండా చెత్తా చెదారాన్ని ప్రసారం చేస్తే మొబైల్ వీక్షకులు వీటివంక తలెత్తి కూడా చూడరు. ఈ మేరకు ఎరిక్‌సన్ కన్జ్యూమర్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను ఇప్పుడిప్పుడే తెలుగు చానళ్లు అర్థంచేసుకుని, వంటబట్టించుకునే పనిలో పడ్డాయి. 

మధ్యతర‘గతే’!
imageయువత మాత్రమే కాకుండా మధ్యవయస్కులు, పెద్దవారు సైతం ఆనందంగా తీరిక సమయంలో తమకు నచ్చిన టీవీ ప్రోగ్రాములు ఫోన్‌లో ప్లే చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మధ్యతరగతివారు వీరిలో అత్యధికంగా ఉండడంతో వీరి మైండ్‌సెట్‌ను స్టడీ చేస్తూ, మిడిల్ క్లాస్ వీక్షకులకు తగ్గట్టుగా ప్రోగ్రామ్స్ రీడిజైన్ చేయాల్సిన పరిస్థితిని వీఆర్ సృష్టించింది. మధ్యతరగతిని ఆకట్టుకున్న చానలే ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్‌గా రాణిస్తుంది. దీంతో క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే మంచిరోజులు రావడం ఖాయమని భావించవచ్చు. ఆన్ డిమాండ్‌ను డిక్టేట్ చేసేది సోషల్ మీడియా కనుక ఏదైనా ప్రోగ్రాంపై మంచి టాక్ వస్తేనే ఆ ప్రోగ్రాం హిట్ అయినట్టు. అప్పుడే ఆన్ డిమాండ్ వినియోగదారులు దాన్ని చూస్తారు కనుక మీకు నచ్చిన కార్యక్రమాలు భవిష్యత్‌లో మరిన్ని తయారవుతాయి. ఆన్ డిమాండ్‌లో పోటీ తట్టుకుని నిలబడేందుకు దేశవిదేశాలకు చెందిన అత్యుత్తమ సీరియళ్లు, సినిమాలు, రియాల్టీ షోలు కూడా పాతవైనా, కొత్తవైనా ప్రసారం చేసేందుకు హక్కుల కోసం ఇప్పటికే చానళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీవీల ముందు గంటల తరబడి వృథా చేసుకోకుండా లీజర్ దొరికినప్పుడు వీలైనన్ని ఎపిసోడ్స్ చూసేయడం, ప్రయాణాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా కాలేజ్ నుంచి ఇంటికి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో మొబైల్‌లో టీవీ చూసేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం సర్వసాధారణమైన ఈరోజుల్లో టీవీ కూడా ఫోన్‌లోనే చూడటం డైలీ రొటీన్ వ్యసనంగా మారిపోయింది. ఇక ఐప్యాడ్, నోట్ ప్యాడ్ వంటి గ్యాడ్జెట్లు అందరి చేతుల్లోకి వచ్చి చేరుతున్నప్పుడు టీవీల్లోకంటే దీంట్లో చూడటం బెటర్ అనేలా పరిస్థితి తయారయింది. అందుకే చానళ్లు రూటు మార్చే పనిలో పడ్డాయి.
భార్గవి కరణంసినీ ప్రపంచ సాహసరత్నం

Updated By ManamThu, 08/30/2018 - 06:10
 • రాజకీయ చైతన్య రథసారథ్యం 

 • సినిమా రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటు..

 • రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కుదిపేసిన వార్త.. 

 • సినీ, రాజకీయ రంగాల్లో పెను విషాదాన్ని నింపేసిన అకాల మరణం...

 • మరో నాలుగు రోజుల్లో పుట్టినరోజు వేడుక జరుపుకోవాల్సిన మనిషి..

 • ఇంటి నుంచి బయల్దేరిన కొన్ని గంటల్లోనే మృత్యువు ఒడిలోకి..

 • స్నేహితుడి కుమారుడి వివాహానికి వెళుతూ ప్రమాదానికి గురైన నందమూరి హరికృష్ణ.

నందమూరి హరికృష్ణ ఇకలేరు
నల్గొండలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ (61) దుర్మరణం పాలయ్యారు. నందమూరి తారకరామారావు, బసవతారకం నాలుగో సంతానంగా హరికృష్ణ సెప్టెంబరు 2, 1956న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. తండ్రి నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న హరికృష్ణ బాలనటుడిగా 1967లో ‘శ్రీకృష్ణావతారం’ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘తల్లా పెళ్లామా’, ‘రామ్ రహీమ్’ చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. ఎన్.టి.రామారావు దర్శకత్వంలో రూపొందిన ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలో అర్జునుడుగా నటించి మెప్పించారు. ఆ తర్వాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్న హరికృష్ణ 1998లో ‘శ్రీరాములయ్య’ చిత్రంతో మరోసారి తెరపైకి వచ్చారు. ఈ చిత్రంలో విప్లవ నాయకుడు సత్యం పాత్రకు జీవం పోశారు. ఆ తర్వాత ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘శివరామరాజు’ చిత్రాల విజయంలో కీలక పాత్ర పోషించారు. ‘సీతయ్య’ చిత్రంలో ఎవ్వరి మాటా వినని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఆ తర్వాత ‘టైగర్ హరిశ్చంద్రప్రసాద్’ చిత్రంలో రైతు సమస్యలపై పోరాడే పాత్రలో వ్యక్తిగా రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సినిమా తర్వాత ‘స్వామి’, ‘శ్రావణమాసం’ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. ‘శ్రావణమాసం’ చిత్రం తర్వాత ఆయన ఏ సినిమాలోనూ నటించలేదు.
 

image


చైతన్య రథసారధిగా..
నందమూరి హరికృష్ణతోపాటు ఆయన కుటుంబసభ్యులకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ రాజకీ యాల్లోకి వచ్చిన కొత్తలో ఆయ న చైతన్యరథాన్ని హరికృష్ణ స్వయంగా నడిపారు. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో హరికృష్ణ చైతన్యరథం నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తండ్రి ఎన్టీఆర్‌ను సినిమా షూటింగ్‌లకు తానే స్వయంగా కారు నడుపుతూ తీసుకెళ్లేవారు. ఇంట్లో పలువురు డ్రైవర్లు ఉన్నా.. స్వయంగా వాహనం నడపడానికే ఆయన ఇష్టపడేవారు. డ్రైవింగ్‌లో ఆయన నిష్ణాతుడు అని పేరు ఉంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్లాక.. ‘అన్న తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. మళ్లీ తెలుగుదేశంలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నప్పటికీ కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
 
పుత్రోత్సాహం
imageనందమూరి హరికృష్ణ తనయులు కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. కల్యాణ్‌రామ్ హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా ఎన్నో విజయ వంతమైన సినిమాల్లో నటించి తాతకు తగ్గ మనవడిగా మంచి పేరు తెచ్చుకుంటు న్నారు. హరి కృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు.
 
నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు
నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడు తున్నాయి. 2009లో తెలుగు దేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని హైదరా బాద్ తిరిగి వస్తున్న ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటడ్డారు. 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మృతి చెందారు. నల్గొండ జిల్లాలోనే ఈ మూడు ప్రమాదాలు జరగడం గమనార్హం. మునగాల మండలం ఆకుపాముల వద్ద జానకిరామ్ ప్రమాదానికి గురవగా, సూర్యాపేట సమీపంలోని మోతె గ్రామం వద్ద ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. ఈరోజు నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ప్రాణాలు విడిచారు. ఇలా నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడడం అందరినీ కలచివేస్తోంది. 
అభిమానులకు హరికృష్ణ చివరి లేఖ!

imageమరో నాలుగు రోజుల్లో అంటే సెప్టెంబర్ 2న నందమూరి హరికృష్ణ పుట్టినరోజు. ప్రతి ఏడాది నందమూరి అభిమానులు హరికృష్ణ పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మన రాష్త్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్త్రంలో భారీ వర్షాల కారణంగా ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అభిమానులకు హరికృష్ణ ఓ లేఖ రాశారు. దాన్ని యధాతథంగా అందిస్తున్నాం.

‘‘సెప్టెంబరు 2 నా అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్త్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్త్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్చాలు, దండలు తీసుకురావద్దని, వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను. 
- ఇట్లు 
మీ నందమూరి హరికృష్ణ’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

తండ్రి అడుగు జాడల్లో..
1962లో జాతీయ రక్షణ ఫండ్ యాక్టివిటీ సమయంలో తనimage తండ్రి ఎన్టీఆర్ ముందు నడుస్తున్న హరికృష్ణ ఫోటోను దర్శకుడు క్రిష్ అందరికీ షేర్ చేశారు. బాల్యం నుంచే ఆయన ప్రజల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. తన తండ్రి అడుగుజాడల్లో నడిచి, మంచి వ్యక్తిగా ఖ్యాతిగడించారు. ‘మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథసారథ్యం. చిన్నతనంలోనే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం. నందమూరి హరికృష్ణ 1962 జాతీయ రక్షణ ఫండ్ యాక్టివిటీ సమయంలో ఎన్టీఆర్‌గారి కంటే ముందు నడిచారు’ అని ట్వీట్ చేశారు.

యన్.టి.ఆర్ బయోపిక్‌లో హరికృష్ణ
నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ‘యన్.టి.ఆర్’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ... ఎన్.టి.రామారావు పాత్రను పోషిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం క్రిష్.. ఎన్టీఆర్, ఆయన కుటుంబ సభ్యుల జీవితాల గురించి పరిశోధనలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ప్రచార రథ సారథిగా ఆయన వెంటే ఉండి తండ్రికి ఎంతో సేవ చేశారు హరికృష్ణ. ఇప్పుడు ఆ పాత్రను కూడా ‘యన్.టి.ఆర్’ చూపించనున్నారు. ఆ పాత్రను కల్యాణ్‌రామ్ పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పాత్రను ఎవరు పోషిస్తారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. నీ.. స్నేహం !

Updated By ManamSun, 08/05/2018 - 03:17
 • ‘మన’లాంటి వాళ్లతోనే బంధం

 • స్నేహాన్ని ప్రేరేపించే ‘కెమిస్ట్రీ’.. సులువుగా కలిసిపోయే తత్వం

 • శత్రువు శత్రువుతో మరింత దగ్గర.. మనసు మాట విని తీరాల్సిందే

 • మెదడు మాట కూడా కావాల్సిందే.. స్నేహబంధం వెనుకా ఉందో సైన్స్

‘స్నేహ బంధమూ.. ఎంత మధురమూ’.. ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ ‘స్నేహాని కన్న మిన్న.. లోకాన లేదురా’.. లాంటి వాటి దగ్గర నుంచి ‘ట్రెండు మారినా.. ఫ్రెండు మారడూ’ వరకు టాలీవుడ్ సినిమాలన్నీ స్నేహం చుట్టూనే తిరుగుతున్నాయి. మరి మీ స్నేహం ఎవరితో బాగుంటుంది? అసలు మీకున్న మంచి స్నేహితులు ఎవరు.. వాళ్లు ఎలా ఫ్రెండయ్యారు.. ఇవన్నీ చూస్తే స్నేహం వెనక కూడా ఓ సైన్సుందని తెలుస్తుంది. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా.. ఇదేంటో చూద్దాం. ఒకే రంగంలో పనిచేసేవాళ్లు.. చిన్నతనంలో కలిసి చదువుకున్న వాళ్లు.. ఒకే ప్రాంతంలో నివసించేవాళ్లు.. ఇలా రకరకాల వ్యక్తుల మధ్య స్నేహం సులభంగా చిగురిస్తుంది. మీకున్న పది మంది స్నేహితుల పేర్లు చెప్పమంటే వెంటనే టకటకా వచ్చేస్తాయి. కానీ వాళ్లే కాదు.. ఒకోసారి శత్రువుల శత్రువులు కూడా మనకు మంచి స్నేహితులుగా మారిపోతారు. రోజూ మనకు కొన్ని వందల మందితో మాటలు కలుస్తున్నా, వాళ్లలో అతి కొద్ది మందిని మాత్రమే స్నేహితులుగా అంగీకరించగలం. అందుకు ప్రధాన కారణం.. మెదడులో స్నేహాన్ని ప్రేరేపించే కేంద్రం! అవును.. మనసు చెబితేనే స్నేహం కుదురుతుందని మనం అనుకుంటాం కదూ, కానీ నిజానికి మెదడు చెబితేనే స్నేహం విషయంలో కూడా అడుగు ముందుకు పడుతుందట. చూడ్డానికి కొంతవరకు మనలాగే ఉండేవాళ్లు, దాదాపుగా మనలాంటి ఆలోచనలే కలిగి ఉండేవాళ్లతో పాటు.. మనకంటే కాస్త ఎక్కువ కష్టాల్లో ఉండేవాళ్లు కూడా మనకు స్నేహితులయ్యే అవకాశం ఉంటుందట.

image


గోదావరి ప్రాంతానికి చెందిన రాఘవ, కృష్ణా జిల్లాకు చెందిన చంద్రారెడ్డి ఒకే రోజు ఒకే సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లారు. దానికి కొద్ది రోజుల ముందే చంద్రారెడ్డి తండ్రి చనిపోయారు. ఇంటర్వ్యూ సందర్భంగా కలిసినప్పుడు తనకంటే ఒడ్డు, పొడుగు ఎక్కువున్న చంద్రారెడ్డి చిన్నపిల్లాడిలా కళ్లనీళ్లు పెట్టుకుంటూ చెబితే రాఘవ మనసు కదిలింది. ఏమీ పర్వాలేదు.. మీకు తప్పనిసరిగా ఈ ఉద్యోగం వస్తుందని ఊరికే ధైర్యం చెప్పాడు. అనుకోకుండా ఇద్దరికీ అదే సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ రోజు తనకు ధైర్యం చెప్పి అండగా నిలబడ్డాడన్న కృతజ్ఞతతో చంద్రారెడ్డి.. తనతోనే కష్టం పంచుకోగలిగాడంటే తామిద్దరి మధ్య ఏదో బంధం ఉందన్న ఆలోచనతో రాఘవ ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. దాదాపు పాతికేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఇది.

ఇలా.. మనలాగే ఆలోచించే వ్యక్తులతో చాలా తక్కువ సమయంలో స్నేహం కుదురుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది ఎలా గుర్తుపట్టగలం అంటే.. అవతలివాళ్లను చూసినపుడు వాళ్ల హావభావాలు, ప్రవర్తనకు అనుగుణంగా మెదడులో కొన్ని రసాయనాలు స్రవిస్తాయని, అవి వాళ్లతో స్నేహం చేయాల్సిందిగా ప్రేరేపిస్తాయని మిషిగన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు వివరించారు. వాళ్లతో గడుపుతుంటే.. అచ్చం మనతో మనం ఉన్నట్లే ఉంటుందని, అందుకే త్వరగా స్నేహం కుదురుతుందని చెప్పారు. ఇందులో మరో విచిత్రమైన విషయం కూడా ఉంది. పాతకాలంలో చెప్పినట్లుగా ‘శత్రువు శత్రువు మిత్రుడే’ అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ నిజమని నిగ్గుతేల్చారు. మనకు ఎవరైనా ఒకరు బద్ధ శత్రువు ఉండి, వాళ్లకు మరో శత్రువు ఉంటే వాళ్లు మనకు వెంటనే మిత్రులు అయిపోతారట. ఈ విషయం కూడా యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌కు చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలలో మరోసారి రుజువైంది. రాజకీయాల నుంచి నిత్య జీవితం వరకు అన్నింటిలోనూ ఇది నూటికి నూరుశాతం నిజమని స్పష్టం చేస్తున్నారు. సొంత మనుషులను ప్రేమిస్తూ, వేరేవాళ్లను ఎందుకు ద్వేషిస్తామన్న అంశంపై యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా పరిశోధ నలు చేసినపుడు ఇదే విషయం తేలింది. వేరే దేశాలకు చెందినవాళ్లను ద్వేషించే తీరును ‘జెనోఫోబియా’ అంటారు. అదే సమయంలో ఆ దేశాన్ని ద్వేషించే మరో దేశానికి చెందినవాళ్లను మాత్రం అక్కున చేర్చుకుంటామని.. అదే స్నేహానికి కొత్తగా వస్తున్న నిర్వచనమని వివరిస్తున్నారు.
 
చాలా సున్నితం బాస్..
స్నేహం చాలా సున్నితంగా ఉంటుందని కొన్ని వందలమంది మీద పరిశోధనలు చేసిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఏడాదికి రెండుసార్లు, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ప్రతి 7.2 నెలలకు ఒకసారి తమ చుట్టూ ఉన్నవారిలో ఎవరో ఒకరితో గాఢమైన స్నేహబంధం ఏర్పడుతుందట. అదే సమయంలో కొంతమంది ప్రవర్తన వల్ల మనసు తీవ్రంగా గాయపడుతుందని, అలా జరిగినప్పుడు 40% మందికి ఆ గాయం త్వరగా మానదని చెప్పారు. అవతలి వాళ్లు తమ ప్రవర్తన పట్ల క్షమాపణలు చెప్పినా కూడా మళ్లీ వాళ్లతో కలవడానికి మనసు ఒప్పుకోదని, అందుకే స్నేహబంధం విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. ప్రేమలో భాగస్వాములు సారీ చెప్పినా వెంటనే కలిసిపోతారు గానీ, స్నేహంలో మాత్రం ఒక్కసారి తేడా వస్తే ఇక వాళ్లను జీవితాంతం క్షమించే పరిస్థితి ఉండబోదని, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. 

వయసు చూడని స్నేహం
మనకు తెలిసినంతవరకు సమవయస్కులు మాత్రమే స్నేహితులు అవుతారు. కానీ, కొన్ని కొన్ని సంద ర్భాలలో మాత్రం మనకంటే చాలా పెద్ద వయసు, చిన్నవయసులో ఉన్నవారితో కూడా స్నేహం ఏర్పడుతుంది. మీరు.. మీరు అని సంబోధించుకుంటూనే అవతలి వారిపట్ల స్నేహభావంతో ఉంటాం. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. అభిరుచులు ఒకేలా ఉన్నప్పుడు వయసులో ఎంత తేడా ఉందన్నదాంతో సంబంధం లేకుండానే ఇద్దరి మధ్య స్నేహబంధం చిగురిస్తుంది. చెన్నై నగరంలో ఉండే మంగళా కందూర్ వయసు 82 ఏళ్లు. కానీ ఆమె ఫేస్‌బుక్ స్నేహితుల జాబితాలో చూస్తే 20 ఏళ్ల వారి నుంచి రకరకాల ఏజ్‌గ్రూపుల వాళ్లుంటారు. వాళ్లందరితో ఆమె ఫోన్‌లో కూడా తరచు టచ్‌లో ఉంటారు. ఎప్పుడో.. ఏదైనా సందర్భంలో ఆమెకు ఉండే స్నేహితుల మధ్య చిన్న మాట కలిసినా కూడా.. వాళ్లంతా మంగళను తమ ఫ్రెండుగానే చెప్పుకొంటారు తప్ప పొరపాటున కూడా బామ్మగారు అనరు. అలా స్నేహం వయసు కూడా చూడదని రుజువవుతోంది.స్నేహితుల తీపి జ్ఞాపకాలతో ఒత్తిడి మాయం

Updated By ManamSun, 08/05/2018 - 01:36

ప్రపంచంలో ఎక్కడైనా లభించేది స్నేహం ఒక్కటే. హైటెక్ యుగంలో  మనిషి సమస్యలతో సతమవుతూ బాధపడుతున్నాడు. కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు. కళ్ళ ముందు అంతా అంధకారం అగుపిస్తోంది. అంతలోనే ఓ ఆత్మీయ పిలుపు నేనున్నానంటూ చెవులకు వినిపించింది. ఆ చేతి స్పర్శ భుజంపై మెల్లిగా తాకినట్లవ్వగానే మరింత బాద, కన్నీల్లు కట్టలు తెంచుకుంటూ రావడం, ఆ వెంటనే ఒకే ఒక్క ఆలింగనంతో, ప్రేమతో, ఆప్యాయతో స్నేహి తుడు మాట్లాడే ఆ నాలుగు మాటలతో.. బాధ సగం తగ్గిపోతుంది. ఆ స్నేహితుడు అందించిన మనోదైర్ఘ్యం ముందు సమస్య చాలా చిన్నదిగా అయిపోయింది. నా కు నేనుగా ఆ సమస్యను పరిష్కారం చేసుకోగలిగాను. అదే అర మరికలు లేని స్నేహం. 
 

image

చిన్ననాటి తీపి జ్ఞాపకాలను మరువలేము
పాఠశాలలో చదివే రోజులలో లంచ్ బెల్ మోగ గానే ఒక ఆనందం. పరుగెత్తుకుంటూ వెళ్తూ టాప్‌ల దగ్గరకు వెళ్తున్నాం. నాతో పాటు వస్తున్న మిత్రుడు కిం ద పడగానే అందరం పరుగెత్తుకుంటూ వచ్చి అతడిని లేపుతూ అతని మోకాళ్ళకు అంటుకున్న ఇసుక రాళ్లను తీసివేస్తూ అతను ఏడుస్తూ ఉంటే మా అందరికీ దెబ్బ తాకినంతగా బాధపడుతూ, ఏం కాదూ ఇలాంటి దెబ్బ లు నాక్కూడా తాకాయని అతనికి ఇస్తున్న ఆ మనో ధైర్యం, నా కోసం నన్ను ఓదార్చుట కోసం వచ్చిన నా పాఠశాల మిత్రుల ఆదరణ, అప్యాయతల ముందు ఆ  నొప్పి మాయమైపోయింది. ఒక మిత్రుడు పరుగెత్తుకుం టూ వచ్చి గాయమైన చోట నల్లాలంతో కట్టుకడుతూ ఉంటే ఆ స్నేహితుడు చూపించిన ప్రేమను ఇప్పటికీ మరువలేను. ఆ బాల్యంలో చేసిన ఆనందం కోసం చేసిన అల్లరి, పెనవేసుకున్న అనుబంధం ఇప్పటికీ మరువలేకున్నా అదే స్నేహ బంధం.

లక్ష్యం వైపుగా పరుగులు తీయమని దిశానిర్దేశనం చేసేవాడే ఆప్తమిత్రుడు. కాలచక్రంలో జీవితం ఎటు పోతుందో ఎవరికీ తెలియదు. ‘ఏం చేయాలనుకుంటున్నావురా?’ అని నాన్న రోజూ తిడుతున్నాడు. భవిష్య త్తు కోసం జీవితంలో సెట్ కావాలిరా’ అని అమ్మ మెల్లగా మందలిస్తుంది. బంధువులు, ఆత్మీయులు ‘నె క్స్ట్ ఏం చేస్తావ్?’ అని అడుగుతూ ఉంటారు. ఆ క్షణం లో ఓ చేయి.. ఆ వ్యక్తిని పట్టుకుని.. ఇదీ దారి... పయ నించు,  కష్టపడు, ఇష్టపడు.. సాధించు లక్ష్యం వైపుగా పరుగులు తీయమంటూ దిశానిర్దేశం చేసేవాడే ఆప్తమిత్రుడు.

మధురమైనదీ స్నేహం మానసిక సమస్యలను పారిపోయేలా చేసేది స్నేహం
‘కలసిమెలసి ఉండగలగడం, ఒకరి కోసం ఒకరు పోరాడగలగడం, అవసరమైనప్పుడు తీరిక లేదనో, అలసిపోయాననో అనకుండా, ఆపదలో ఆదుకోవడం, స్నేహమంటే పాత పరిచయం కాదు. ఎప్పుడూ వీడని అనుబంధం. అన్నిటికన్నా అందమైనదీ, అపురూపమైనదీ, అద్భుతమైనదీ, అత్యున్నతమైనదీ స్నేహమే. స్నేహం మనసుకు సంబంధించిన విషయం. అనుభూతులకు నెలవు. అనుభవాలకు కొలువు. ఈ సృష్టి ఉన్నంతకాలం నిలిచేది ఒక్క స్నేహమే... కుదిరితే కప్పు కాఫీ, లేదంటే కబుర్లు చెప్పుకుని సరదాగా గడుపుతారు. నీ వెంట నేనున్నా అనే భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు. నిజమైన మిత్రుడు ఓటమిలో ఓదార్చేవాడు మన గెలుపును తనదిగా భావించి ఆనందాన్ని పంచుకునేవాడు సమస్యల్లో ఓ కౌన్సెలర్‌గా ఉండేవాడు ఏం చేయాలో తోచని స్థితిలో నీకండగా ఉన్నాననే ధైర్యాన్నిచ్చేవాడు.

బాల్యదశ నుంచి యవ్వన దశలో ఎదిగే క్రమంలో కలిగే మానసిక ఒత్తిళ్లకు స్నేహం అవసరం మరింత పెరుగుతుంది. యవ్వన దశలో శారీరకంగా కలిగే మా ర్పులు, హార్మోన్స్‌లలో కలిగే మార్పులతో, మానసి కంగా తలెత్తే ఎమోషన్స్‌ను పంచుకోవడానికి మిత్రుల సహకారం చాలా అవసరమై ఉంటుంది. స్నేహితులు ఒకరి నుంచి మరొకరు ఎన్నో విషయాలను నేర్చు కుంటారు. ఒకరికొకరు ఆదర్శంగా నిలిచి మానసిక వికాసానికి దోహదం చేస్తారు. స్నేహం ఒక గొప్ప వ రం. స్నేహం ఒక్క గొప్ప బాధ్యత. కష్టసుఖాల్లో నీకు నేను ఉన్నా అని చెప్పే ఒకే ఒక్క గొప్ప బంధం.

వయస్సుతో సంబంధం లేదు. కులంతో పని లేదు. స్నేహానికి కావాల్సింది రెండు కల్మషం లేని మన సులు. తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులకు కూడా చెప్పుకోలేని విషయాల్ని ఫ్రెండ్‌తో పంచు కుంటాం. ఏ సమయంలోనైనా, ఎలాంటి సందర్భంలోై నెనా, కష్టమైనా, సుఖమైనా.. అన్నింటిని పంచుకునేది స్నేహితుడితోనే. మాటామాట కలిస్తే చాలు ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అవుతుంది. కొన్ని ఫ్రెండ్‌షిప్‌లు జీవితాంతం ఉంటాయి. విజయం నీ సొంతమైతే సంతోషంతో గెం తులేసేది తను... బాధ నీదైతే కన్నీళ్లు కార్చేది అతడు... కష్టాల్లో వెన్ను తట్టేది... కవ్వింపుగా వెక్కిరించేదీ ఆ హితుడే... ఎక్కడో పుట్టి.. ఎప్పుడో కలిసినా మట్టిలో కలిసేవరకు నీ వెంట ఉండేదీ ఆ స్నేహితుడే... స్నేహా నిది వరసకందని బంధుత్వం... హృదయంతో జతకట్టే అనుబంధం... జీవితమనే పూదోటలో స్నేహమనే పరిమళాల సుమాలు విరబూయాల్సిందే... ఆ సార్థకత చేకూరాలంటే దోస్తులు ఉం డాల్సిందే. మనం పనిచేసే ఆఫీసుల్లో మనపై అధికారులతో, సహోద్యోగులతో స్నే హం పెంచుకోవాలి. మన జీవిత కాలచక్రంలో  సగం జీవితం ఆఫీసుల్లోనే గడిపేస్తాం. ఒక్కోసారి ఇంట్లో  స మస్యలు తలెత్తినా, కార్యాలయంలో సమస్యలు తలె త్తినా మనకు చటుక్కునా ఆదుకోనే వారు మన సహోద్యోగులే. జీవితంలో సంతోషం వెల్లివిరియాలంటే సహోద్యోగి స్నేహితుడు కావడం అత్యవసరం.

జీవితంలో మిత్రులనూ, శత్రువులనూ గుర్తించ డం నేర్చుకోవాలి. లేదంటే.. సమస్యల్లో చిక్కుకోవా ల్సిందే. కొందరు పైకి గంభీరంగా కనిపించినా అవస రానికి ఆదుకుంటారు. ఇంకొందరు వెన్నంటే ఉంటారు, రాసుకు పూసుకు తిరుగుతారు. కానీ అవసరం వస్తే.. తప్పించుకు తిరుగుతారు. మరికొందరు.. ఆత్మీయ స్నేహితుల మధ్య చిచ్చుపెట్టి, వారిని విడదీయాలని చూస్తుంటారు. అందుకే స్నేహితులు తమ మధ్య అపా ర్థాలు రాకుండా చూసుకుంటూనే శత్రువుల వల్ల అన ర్థాలు కలగకుండా జాగ్రత్త పడాలి.

- డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి, 
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ 
9703935321, 
(నేడు మైత్రీ దినోత్సవం)వు‘మెన్’ అందాల పోటీలు

Updated By ManamThu, 08/02/2018 - 02:27

imageఅందాల పోటీల్లో అందగత్తెలు ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తున్నట్టు అబ్బాయిలే తమ వేషధారణ మార్చుకుని అందాల పోటీల్లో పాల్గొంటారు.  క్యాన్సర్ బాధితులకు నిధులు సమకూర్చేందుకు ప్రారంభమైన ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. హైహీల్స్, బికినీలు, మేకప్స్‌తో వీరు చేసే సందడికి ఇప్పుడు 6 ఏళ్లు.  కామెడీ, మ్యూజికల్ టాలెంట్, స్కేట్ బోర్డింగ్, స్విమ్‌సూట్ వంటి కేటెగెరీల్లో పోటీలు చాలా సీరియస్‌గా సాగుతూ అందరినీ నవ్విస్తాయి.

 ఇలా వచ్చిన డబ్బును క్యాన్సర్ పీడితుల మెడికల్ బిల్లులు చెల్లించేందుకు డొనేట్ చేస్తారు. నవ్వులు పూయిస్తూనే మరోవైపు మనలోని బాధ్యతను గుర్తుచేసే ఈ ఈవెంట్‌కు ఇటీవలికాలంలో స్పందన బాగా పెరుగుతోంది.  నెట్‌లో వైరల్ కూడా అవుతున్న వీడియోలు వీరికి కాసులపంట కురిపిస్తోంది.
imageరెప్పవాల్చని ప్రపంచం

Updated By ManamWed, 07/25/2018 - 02:11
image

అమ్మ జోలపాటతో మొదలైన కమ్మని నిద్ర ఇప్పుడెక్కడ దాక్కుంది? ప్రపంచం నిద్రకు దూరమై అనారోగ్యాలకు దగ్గరవుతోంది. మీ నిద్ర ఎంత నాణ్యమైంది? ఒక గంట ఆలస్యంగా నిద్రిస్తే కొంపలేమీ అంటుకు పోవు అనే ధోరణి ఎంతవరకు సరైంది? విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్న నవీన ప్రపంచంలో టీవీ తెరలు, కంప్యూటర్ తెరలు, స్మార్ట్‌ఫోన్ తెరలు మీ కళ్ళతో ఎంతగా చెలగాటమాడుతున్నాయో తెలుసా? నిద్రని మీకు శాశ్వత శత్రువుని చేసిన చీకటి నేరం ఈ విద్యుత్ కాంతులదే! .

‘నిద్రే ఉత్తమమైన ధ్యానం’ అని అంటారు దలైలామా. కానీ మనలో మూడువంతుల మందికి ప్రతిరాత్రీ కాళరాత్రే అవుతుంది.ఇలా నిద్రపట్టక పోవడమన్నది రుగ్మత కాకపోయినప్పటికీ, ఇలాంటి వాళ్ళు గాఢనిద్రను కోరుకున్నా, కళ్ళు మూతలు పడని ‘ఇన్‌సామ్నియా’ (నిద్రలేమి) స్థితిలో రాత్రంతా కొట్టుమిట్టాడుతుంటారు. ఇన్‌సామ్నియాకి, మానసిక కుంగు బాటుకు మధ్య దగ్గరి సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది.

అనాది ‘నిద్రలేమి’
imageనిద్రకు దూరం కావడమన్నది మనకు ఒక జీవనశైలిగా మారిపోయిం దంటే అతిశయోక్తి కాదు. ఫ్లడ్‌లైట్ల వెలుగు ల్లో రాత్రికి, పగలుకి తేడా లేకుండా వెలిగి పోయే మన ప్రపంచంలో నిద్ర మానవ ఆరోగ్యం మీద ఎంతటి గాఢమై న ప్రభావాన్ని కలిగి ఉంటుందో మనం తెలుసుకుని తీరాలి. నిద్ర కేవలం విశ్రాంతికి సంబంధించిన విషయం కాదు. అచేత నంగా నిద్రావస్థలో ఉన్న మన దేహంలో కనుపాపలు మాత్రం రెప్పల కింద అటూ ఇటూ కదు లుతుంటాయి. చెవి మధ్య భాగం లోని చిన్న కండరాలు నిశ్శబ్దంలో కూడా ఏదో వింటున్నట్టుగా కదులుతుంటాయి. 

మన మెదడులో జరిగే విద్యుత్‌చర్య గురించి తెలు సుకోవడానికి 1924లో జర్మన్ మనస్తత్త్వ శాస్త్రవేత్త హాన్స్ బెర్గర్ ‘ఎలక్ట్రోయెన్స్‌ఫాలోగ్రాఫ్’  (ఇఇజి) అనే సాంకేతికతను కనిపెట్టారు. దీని సహాయంతో మనిషి మెదడులో జరిగే విద్యుత్ చర్యల్ని పసిగట్టవచ్చు. ఈ సాంకేతిక ఆవిష్కరణ అనంతరకాలంలో నిద్రకు సంబంధించిన శాస్త్రీయ పరిశోధ నలకు నాంది పలికింది. అయితే కొన్ని దశాబ్దాల క్రితం కనుగొన్న ఇమే జింగ్ సాధనాల ద్వారా మెదడులోని అంతర్గత చర్యల గురించి తెలుసుకోవడం కొంతమేరకు సాధ్యమవుతోంది. 

మన శరీరంలోని కణాల్లోని పరమాణువులు ఏవిధంగా సూర్యునితో సంబంధాన్ని కలిగి ఉన్నాయో, మన దేహంలోని సర్‌కేడియన్ రిథమ్ సూర్య కిరణాలకు ఏవిధంగా ప్రభావితం చెందుతున్న విషయం మీద పరిశోధనలు చేసినందుకు వైద్యరంగానికి చెందిన 2017 నాటి నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత ్తలకు బహూకరించారు. ఈ సర్‌కేడియన్ రిథమ్ ఇబ్బందులకు గురైనప్పుడే మధుమేహం, హృద్రోగాలు, డిమెన్షియా వంటి రుగ్మతలు తలెత్తుతాయని తాజా పరిశోధనలో తేలింది.
 
మన దేహంలోని జీవగడియారం సక్రమంగా పనిచేయాలంటే మన కళ్ళ మీద పడుతున్న కాంతి కూడా సక్రమమైనదై imageఉండాలి. ఈ కాంతి మన సర్‌కేడియన్ రిథమ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. మన కళ్ళ మీద ప్రతిఫలనం చెందుతున్న కాంతిలో నీలితరంగాలు పగటి పూట మనల్ని చురుగ్గా ఉండేలా చేస్తాయని బోస్టన్‌కు చెందిన మహిళల ఆసుపత్రి, బ్రిగామ్‌లోని స్టీవెన్ లాక్లీల్యాబ్ జరిపిన ఒక పరిశోధనలో వెల్లడైంది. అలాగే రాత్రిపూట ఎర్రటి కాంతి మన మెదడు మీద తక్కువ ప్రభావాన్ని చూపి, మన దేహంలోని జీవగడియారాన్ని సవరిస్తుంది. 

మన దైనందిన జీవనశైలికి, సౌరవలయానికి మధ్య సంయమనం లోపించడం వల్ల ‘ప్రస్తుతం మనం నిద్రలేమితో బాధపడే ప్రపంచంలో జీవిస్తున్నాం’ అని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన ‘సెంటర్ ఫర్ స్లీప్ అండ్ కాగ్నిషన్’ డైరెక్టర్ రాబర్ట్ స్టిక్‌గోల్డ్ అంటున్నారు. మన దైనందిన జీవితంలో మనం రాత్రీ, పగలు తేడా లేకుండా విద్యుద్దీపాలు, టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల తో గడిపేయడం వల్ల కొని తెచ్చుకున్న ప్రమాదమే ఇది. నిద్రకు సంబంధించిన సమకాలీన వైద్యపరి శోధనలు నిద్రలోని పలుదశల్ని ఇలా వివరిస్తున్నాయి. 

మొదటి దశ
మనం నిద్రకు ఉపక్రమించిన వెంటనే మన మెదడు ఏఏ జ్ఞాపకాల్ని నిక్షిప్తం చేసుకోవాలో, వేటిని తుడిచి పెట్టేయాలో imageనిర్ణయించే పని మొదలు పెడుతుంది. మనం నిద్రకు ఉపక్రమించినప్పుడు మన దేహంలోని జీవగడియారం తాలూకు సర్‌కేడియన్ రిథమ్ దివారాత్రాల ప్రవాహానికి అనుగుణంగా స్పందిస్తే, మన మెదడు చివరి భాగంలోని పీనల్ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్‌ను (ఇది రాత్రి సమయం అనే సందేశాన్ని మెదడుకు అందించే హార్మోన్, ఇది మన జీవగడియారాన్ని నియంత్రిస్తుంది) ఎక్కువగా ఉత్పత్తి చేస్తే, మన మెదడులోని కోట్లాది న్యూరాన్లు తమ కదలికల వేగాన్ని తగ్గిస్తాయి. ఇక మీరు వెంటనే నిద్రలోకి జారుకుం టారు. మెదడు అనే మహాప్రపంచంలో 86 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. పగటి పూట వీటి మధ్య విద్యుత్, రసాయన సంకేతాల చేరవేత ముమ్మరంగా జరుగుతుంటుంది. మనం మెలుకువగా ఉన్నప్పుడు మెదడులో న్యూరాన్లు చురుగ్గా విద్యుత్, రసాయన సంకేతాల్ని విడుదల చేయడం, స్వీకరించడం చేస్తుంటాయి. ఈ న్యూరాన్ల పరస్పర అనుసంధాన ప్రక్రియ ‘ఎలక్ట్రోయెన్స్‌ఫాలోగ్రాఫ్’  (ఇఇజి)లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మెదడు విశ్రమించినపుడు ఈ ఇఇజి రేఖలు వలయాకారంలో కనిపిస్తాయి. అంటే మెదడు ఇక విశ్రమించిందని అర్థం. దాంతో మన ఇంద్రియగ్రాహకాలు కూడా మూతపడతాయి, మనం నిద్రలోకి జారుకుంటాం. 

నిద్రకు ఉపక్రమించిన తరువాత మొదటి దశ కేవలం ఐదు నిమిషాల పాటే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఐదునిమిషాల తరువాత మెదడు లోతుల నుంచి వరుసక్రమంలో విద్యుత్ కాంతులు మన సెరిబ్రల్ కార్టెక్స్‌ను తాకుతాయి. ఈ విద్యుత్ కాంతుల్ని ‘స్పిండిల్స్’ అంటారు. బూడిదవర్ణంలో మెదడును ఆవరించి ఉన్న వెలుపలి భాగమే సెరిబ్రల్ కార్టెక్స్. ఇది భాషకు, జ్ఞానానికి కేంద్రంగా ఉంటుంది. ఇలా అరనిమిషం పాటు విద్యుత్ కాంతులు వెల్లువెత్తడమన్నది మనం మన నిద్రలో రెండవ దశలోకి ప్రవేశించామని చెబుతాయి. 

రెండవ దశ
మనం నిద్రించేటపుడు మన మెదడు పూర్తిగా విశ్రమిస్తుందని భావించే వారు. కానీ అది సరికాదు. నిద్రలో మన మెదడు మనం మేలుకున్నప్పటి కంటే భిన్నమైన పనులకు ఉపక్రమిస్తుంది. ఆరోజు లభించిన జ్ఞాపకాల్లో అవసరమైన వాటిని నిక్షిప్తం చేస్తుంది. ఇది జ్ఞాపక శక్తికి సంబంధించిన ప్రక్రియ. మనం మెలుకువగా ఉన్నపుడు చేయలేని కొన్ని పనుల్ని మన మెదడు నిద్రలో పూర్తి చేస్తుంది. అందుకే సమస్యల పరిష్కారంలో నిద్ర చురు కైన పాత్ర పోషిస్తుంది. ఎంత చక్కగా నిద్రిస్తే, అంతగా మనం మన సమస్యల్ని చురుగ్గా పరిష్కరించుకో గలమన్నమాట. మెలుకువగా ఉన్న మెదడు బాహ్య ప్రకంపనల్ని గ్రహించడానికి ఉద్దేశించింది. నిద్రిస్తున్నప్పటి మెదడు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించ డానికి ఉద్దేశించింది. మన నిద్రలోని మొదటి తొంభై నిమి షాల నిద్రావలయంలో ఈ రెండవ దశ యాభై నిమిషాల పాటు ఉంటుంది. ప్రతి కొన్ని క్షణాలకు ఒకసారి స్పిండిల్స్ మన సెరిబ్రల్ కార్టెక్స్‌ను తాకుతుంటాయి. కానీ ఈ ప్రక్రియ కొంతసేపటికి మందగిస్తుంది. అప్పుడు మన గుండె కొట్టుకునే వేగం కొంత తగ్గుతుంది. శరీరంలో వేడిమి కూడా తగ్గుతుంది. ఇక మనం మన గాఢనిద్రలోకి అంటే నిద్రలోని మూడు, నాలుగు దశల్లోకి ప్రయాణిస్తామన్న మాట. 

మూడు, నాలుగు దశలు
ఈ మూడు, నాలుగు దశలు మన నిద్రలో చాలా ముఖ్యమైన భాగం. శరీరానికి ఆహారం ఎంత అవసరమో, నిద్రకు ఈ మూడు, నాలుగు దశలు అంత అవసరం. ప్రతి జంతువు ఏదో ఒక దశకు సంబంధించిన నిద్రావస్థను కలిగి ఉంటుంది. కొన్ని రకాల గబ్బిలాలు 15 గంటల పాటు నిద్రిస్తాయి. సోమరిగా కొమ్మలను అంటిపెట్టుకున్న మరికొన్ని జాతులకు చెందిన గబ్బిలాలు 20 గంటలు నిద్రిస్తాయి. డాల్ఫిన్ల మెదడులో ఒక భాగం నిద్రిస్తుంటే, మరొక భాగం మెలుకువగా ఉంటుంది. అందుకే అవి నిరంతరాయంగా ఈదులాడుతుంటాయి. నిద్ర అంటే మెదడుకు సంబంధించిన ప్రక్రియ అనుకుంటాం కదా, కానీ మెదడే లేని జెల్లీ ఫిష్ కూడా నిద్రపోతుంది. భూమ్మీద ఏ జీవి అయినా, దాని పరిమాణంతో నిమిత్తం లేకుండా రోజల్లా అంటే 24 గంటల పర్యంతమూ మేలుకుని ఉండడమన్నది అసాధ్యం. మొత్తం నిద్ర సమయంలో సగానికి కన్నా తక్కువగా మూడో దశలోను, సగానికి కన్నా ఎక్కువగా నాలుగవ దశలోను ఇఇజిలో డెల్టా తరంగాలు కనిపిస్తాయి. ఇది గాఢ నిద్రా సమయం. ఈ సమయంలో మెదడులో జీవితపర్యంతం ఎముకలకు, కండరాలకు అవసరమైన పోషక హార్మోన్ విడుదల అవుతుంది. 

మానవ దేహంలో వ్యాధి నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు సక్రమంగా ఉండాలన్నా నిద్ర అత్యంత అవసరం. చాలినంత నిద్ర లేకపోతే మనం మానసికంగా చురుగ్గా ఉండలేం, గాయాల నుంచి తొందరగాimage కోలుకోలేం. మనం మేలుకుని ఉన్నపుడు మెదడులోని న్యూరాన్లు ఒకదానితో ఒకటి గట్టిగా ముడిపడి ఉంటాయి. నిద్రపోతున్నపుడు అవి తమ సాంద్రతను 60 శాతం కోల్పోవడం వల్ల వాటి మధ్య ఖాళీలు ఏర్పడతాయి. ఈ ఖాళీల మధ్యే కణజాలపు వ్యర్థాలు పేరుకుంటాయి. దీన్నే బీటా అమిలాయిడ్ ద్రవం అంటారు. ఇది న్యూరాన్ల మధ్య పేరుకు పోవడం వల్ల వాటి మధ్య పరస్పర అనుసంధానం మందగిస్తుంది. దాంతో అల్జీమర్స్, డిమెన్షియా వంటి మతిమరుపునకు సంబంధించిన జబ్బులు తలెత్తుతాయి. నిద్రలో మాత్రమే వెన్నెముక ద్రవం విడుదలై, ఈ బీటా అమిలాయిడ్‌ను ఒక డిటర్జెంట్‌లాగా శుభ్రం చేసేస్తుంది. అందుకే గాఢనిద్ర డిమెన్షియాను దూరం చేస్తుందని వైద్యులు చెబుతారు. 

మెలుకువ
నిద్రలో చివరి దశ అయిన నాలుగవ దశలో మనం కేవలం ముఫ్ఫై నిమిషాలు మాత్రమే ఉంటాం. తరువాత మెదడు మేలుకోవడం మొదలు పెడుతుంది. మనం మళ్ళీ మూడవ, రెండవ, మొదటి దశలకు వెనక్కు ప్రయాణించి, నిద్ర నుంచి మేలుకుంటాం. మనం మేలుకుని ఉన్నప్పుడే, మెదడులో మనం నిద్రించడానికి అవసరమైన పదార్థాలు జనిస్తాయి. దీనిని ‘స్లీప్ ప్రెజర్’ అని పిలుస్తారు. రెండవ ప్రక్రియ కాంతికి సంబంధించింది. మన దేహంలోని జీవగడియారాన్ని మన కళ్ళ మీద పడే కాంతి ముందుకు లేదా వెనుకకు తిప్పగలదు. మన కంటికి చేరే కాంతిలో మిట్టమధ్యాహ్నపు నీలికిరణాలు మనల్ని చురుగ్గా ఉండేలా చేస్తాయి. అలాంటి నీలి కిరణాల్నే మన కంప్యూటర్లు విడుదల చేస్తాయి. దాంతో మన జీవగడియారపు పనితీరు గందరగోళానికి గురవుతుంది. దీని ప్రభావం రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. దీనికి స్లీప్ ప్రెజర్ కూడా తోడైతే, రాత్రల్లా మెదడు చిత్రవిచిత్రమైన పగటి జ్ఞాపకాల మధ్య కొట్టుమిట్టాడుతుంటుంది.

 కృత్రిమ కాంతి విపత్తు
నిద్ర మీద మానవాళి తన పోరాటాన్ని కృత్రిమకాంతిని సృష్టించడంతోనే మొదలుపెట్టింది. వెలుగులు విరజిమ్మే బల్బుల్ని కనిపెట్టడం ద్వారా నిద్రను మనిషి శాశ్వత శత్రువును చేసుకున్నాడు. ఎల్‌ఇడి లైట్ల వెలుగులో కాంతిమంతంగా వెలిగి పోయే మహానగరా లన్నీ నీలిరంగు కాంతినే విరజిమ్ముతు న్నాయి. ఈ నీలిరంగు కాంతి కిరణాలే నిద్రలేమికి ప్రధాన కారణం. మాన వ సాంకేతిక ప్రగతి రాత్రిపూట ఆకాశం మీద ఎలాంటి ప్రభావా న్ని చూపిందో తెలియజేస్తూ అంతర్జాతీయ ఖగోళ సంస్థ నాసా కొన్ని ఉపగ్రహచిత్రాల్ని రూపొందించింది. ఈ చిత్రా ల్లో సహజంగా కాంతిని స్వీక రించే నిప్పు, మేఘాలు, మంచు వంటి వాటిని నాసా మినహాయించింది. దీంతో మనిషి తాను రూపొందించిన కృత్రిమ విద్యుత్ సౌకర్యాలతో రాత్రిని నిరంతరాయంగా ‘వెలిగించేస్తున్న’ వైనం తేటతెల్లమైంది. ఆధునిక మానవ జీవనశైలి మనిషి దేహంలోని సహజమైన ‘మేల్కొలుపు’ మీటను పదేపదే నొక్కుతోంది. 

రాపిడ్ ఐ మూవ్‌మెంట్
తీవ్ర మానసికాందోళనకు గురైన స్థితిలో మనం స్వప్నిస్తున్నాం, మనం గాల్లో తేలుతున్నాం, రెక్కలు విరిగి నేల మీదికి కూలుతున్నాం. ఇదంతా మనకు జ్ఞాపకం ఉన్నా, లేకున్నా... మనం మన మానసిక ఉద్వేగాల్ని, జ్ఞాపకాల్ని మనకు తెలియకుండానే నియంత్రించుకుంటున్నా మన్నమాట. నిద్రకు సంబంధించిన నాలుగు దశల్ని కనిపెట్టిన తరువాత, 1953లో షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన యూగెన్ ఆర్సెనెస్కీ, నథానియెల్ కీట్మన్‌లు నిద్రలోని ‘రాపిడ్ ఐ మూవ్‌మెంట్’ (కనుపాపల కదలికలు)ను కనుగొన్నారు. దీన్ని క్లుప్తంగా ఆర్‌ఇఎం అని పిలుస్తారు. సాధారణంగా ఒక ఆరోగ్యమైన నిద్రావలయం నాలుగోదశ నిద్రలోకి జారిపోవడంతో మొదలై, అటు నుంచి మేలుకోవడంలోకి తిరిగి అన్ని దశల్నీ వెనక్కు దాటడంతో పాటు మరో 20 నిమిషాల ఆర్‌ఇఎంతో పూర్తి అవుతుందని వైద్యపరిశోధనల్లో వెల్లడైంది. నిద్రలోని మొదటి నాలుగు దశల్ని ‘నాన్ ఆర్‌ఇఎం’ అని అంటారు.

 మన నిద్రలోని 80 శాతం నిజానికి నిద్రకి సంబంధించింది కాదు. నిద్రించే సమయంలోని 20 నిమిషాల పాటు కొనసాగే ఆర్‌ఇఎంలోనే కణజాల వ్యవస్థలోని పోషకాల సంశ్లేషణ చురుగ్గా ఉంటుంది. ఇది శారీరక జీవక్రియల్ని చక్కగా కాపాడుతుంది. ఆర్‌ఇఎం స్లీప్ అనేదే మన దేహంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. ఆర్‌ఇఎం స్లీప్‌లోకి జారిన ప్రతిసారీ మనందరం ఇంచుమించు మానసిక రోగుల్లాగానే ప్రవర్తి స్తాం. మనకు సంబంధం లేని పరిసరాల్ని, వ్యక్తుల్ని స్వప్ని స్తాం. ఆ స్వప్నాన్ని ఆ క్షణంలో పూర్తిగా నిజమని నమ్మేస్తాం. ఆర్‌ఇఎం స్లీప్ అనేది మనలోని సృజనాత్మక తను, మేధస్సును, స్వేచ్ఛా కాంక్షను ద్విగుణీకృతం చేస్తుందని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. 

నిద్ర అంటే అచేతనావస్థ కానేకాదు. మన చేతనావస్థకు అది తొలిపాదు. ఆరోగ్యకరం గా జీవించి ఉండడానికి మనం కొన్ని గంటల పాటు అచేతనంగా ఉండాల్సిన అవసరాన్ని తీర్చే అద్భుత వరం నిద్ర! అనేకానేక సామాజిక, ఆర్థిక అవలక్షణా ల్ని ఇకనైనా తోసిరాజని కాసింత గాఢనిద్రకు తలుప ులు తెరుద్దాం!

సర్‌కేడియన్ క్లాక్: 
imageమన శరీరంలోనే ఒక అంతర్గత జీవగడియారం ఉంటుంది. అది 24 గంటల్లో మనం ఎప్పుడు తినాలి, ఎప్పుడు నిద్రించాలి, ఎప్పుడు మేల్కొనాలి, తదితర అంశాల్ని నిర్ణయిస్తుంది. శారీరక సమయపాలనకు సంబంధించిన ఈ గడియారాన్నే ‘సర్‌కేడియన్ క్లాక్’ అంటారు. సూర్యకాంతి, ఉష్ణోగ్రత, వాతావరణం వంటి బాహ్య కారణాలు దీన్ని ప్రభావితం చేస్తుంటాయి.‘సర్‌కా’ అనే లాటిన్ పదం నుంచి సర్‌కేడియన్ అనే పదం పుట్టింది. సర్‌కా అంటే లాటిన్‌లో పరిసరాలు అని అర్థం. అలాగే ‘డియమ్’ అంటే రోజు అని అర్థం. 24 గంటల వ్యవధిలో మన జీవనక్రియల్ని నిర్దేశించే శారీరక డోలనాల్ని ‘సర్‌కేడియన్‌రిథమ్’ అంటారు. దీనిని నియంత్రించే పరమాణు వ్యవస్థలపై పరిశోధన జరిపినందుకగాను జెఫ్రీ సి. హాల్, మైఖేల్ రోస్బాష్, మైఖేల్ డబ్ల్యు యంగ్‌లకు వైద్యశాస్త్రంలో 2017 నోబెల్ బహుమతి లభించింది. 
 

image

 ఆనాటి నవ్వులు ఏవమ్మా..?

Updated By ManamSun, 07/22/2018 - 01:06

హాస్యం అంటే హాయిగా నవ్వుకునేలా ఉండాలి. అలాంటి హాస్యం అన్నివిధాలా ఆరోగ్యకరం. తెలుగు వారు హాస్య ప్రియులు. హాస్యాన్ని ఆస్వాదించాలంటే తెలుగువారి తర్వాతే ఎవరైనా అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు జంధ్యాల, రేలంగి నరసింహారావు, వంశీ, ఎస్.వి.కృష్ణారెడ్డి, ఇ.వి.వి.సత్యనారాయణ వంటి దర్శకులు హాస్యానికి కొత్త అర్థాన్ని చెప్పారు. ఎవరి శైలిలో వారు పూర్తి స్థాయి కామెడీ సినిమాలు రూపొందించారు. చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్, నరేష్ వంటి హీరోలు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. కానీ, ఇప్పుడు జనరేషన్ మారింది. దర్శకనిర్మాతల అభిరుచుల్లోనూ మార్పులు వచ్చాయి. క్రమంగా కామెడీ సినిమాలు మరుగున పడిపోయాయి. చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ పూర్తి స్థాయి కామెడీ సినిమాలు చేసే హీరోగా ఇప్పటి తరానికి పరిచయమయ్యారు. ప్రస్తుతం ఫుల్ ప్లెడ్జ్‌డ్ కామెడీ సినిమాలు అడపా దడపా వస్తున్నా ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో అలరించలేకపోతున్నాయి. 
 

image

నవ్వు నాలుగు విధాలా చేటు అన్నది పాతతరం మాట.. నవ్వు అన్నివిధాలా గ్రేటు అనేది అధునాతన ఆలోచన. మనిషి జీవితంలో నవ్వు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. నవరసాల్లో హాస్యాన్ని ఆస్వాదించినంతగా మరో రసాన్ని మనిషి ఆస్వాదించలేడు. సినిమా అనేది ప్రేక్షకులకు అందుబాటులోకి రానంత వరకు ఇతర మాధ్యమాల ద్వారా వీలైనంత వినోదాన్ని పొందేవారు. సినిమా ప్రధాన వినోద సాధనంగా మారిన తర్వాత ప్రేక్షకులకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునే అవసరం లేకుండా పోయింది. పౌరాణికం, జానపదం, భక్తిరసం, కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథా చిత్రాలు... ఇలా అన్నిరకాల సినిమాలు ప్రేక్షకులను అలరిం చాయి. మొదట మనం చెప్పుకున్నట్టు హాస్యం మనిషి జీవితంలో ప్రధాన పాత్ర పోషించేదే అయినా సినిమాల పరంగా ప్రత్యేకంగా హాస్య చిత్రాలు అనేవి ఒకప్పుడు వచ్చేవి కాదు. హాస్యాన్ని అందించేందుకు ప్రత్యేకంగా పాత్రలను సృష్టించి వాటి ద్వారా ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేసేవారు. సాంఘిక చిత్రాల్లో కమెడియన్స్ లేకుండా, కామెడీ లేకుండా సినిమా అనేది ఉండేది కాదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు హాస్యమే ప్రధానంగా సినిమాలు రూపొందించడం మొదలు పెట్టారు. వారిలో మొదటిగా చెప్పుకోవాల్సింది జంధ్యాల గురించి. రచయితగా కెరీర్‌ని ప్రారంభించిన జంధ్యాల కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఆయన రూపొందించిన సినిమాలు కథాబలం ఉన్నవే అయినప్పటికీ హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కథ ఏదైనా ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా సినిమాలు రూపొందించేవారు. అలా తనకంటూ ప్రత్యేకంగా అభిమానుల్ని కూడా సంపాదించుకున్నారు జంధ్యాల. కామెడీ సినిమాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న మరో దర్శకుడు రేలంగి నరసింహారావు. జంధ్యాల, రేలంగి నరసింహారావు ఒకే సంవత్సరం దర్శకులుగా మారారు. రేలంగి దర్శకత్వం వహించిన 70 సినిమాల్లో ఎక్కువ శాతం హాస్య ప్రధాన సినిమాలే ఉండడం విశేషం. వీరిద్దరి తర్వాత  కామెడీకి పెద్ద పీట వేసిన దర్శకుడు వంశీ. జంధ్యాల, రేలంగి నరసింహా రావు వంటి దర్శకులు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా వంశీ సినిమాలు రూపొందించేవారు. అతని సినిమాల్లోని పాత్రలు నిజ జీవితంలో మనకు నిత్యం తారసపడేవిగా ఉండేవి. వీరి తర్వాత హాస్య ప్రధానమైన సినిమాలు రూపొందించడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ. పైన పేర్కొన్న దర్శకుల మార్కు ఎక్కడా కనిపించకుండా తనదైన శైలిలో హాస్యాన్ని అందించేవారు. ఇ.వి.వి. హాస్య చిత్రాలే కాకుండా మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎలుగెత్తి చాటే సినిమాలు కూడా రూపొందించారు. అయితే ఇ.వి.వి. అంటే అందరికీ గుర్తొచ్చేవి హాస్య చిత్రాలు మాత్రమే. ఇ.వి.వి. తర్వాత పూర్తి స్థాయి కామెడీ సినిమాలు తీసేందుకు చాలా మంది దర్శకులు ప్రయత్నించినప్పటికీ ఎవరూ సక్సెస్ అవ్వలేకపోయారు. మరో పక్క ఎస్.వి.కృష్ణారెడ్డి కూడా ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలు చేశారు. ఆయన సినిమాల్లో సెంటిమెంట్ పాలు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ అదే స్థాయిలో హాస్యాన్ని కూడా పండించే ప్రయత్నం చేసేవారు. 

గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒకే తరహా సినిమాలు రూపొందించేందుకు మన దర్శకులు ప్రయత్నిస్తున్నారు. యాక్షన్ సినిమాలు, సెంటిమెంట్ సినిమాలు, ప్రేమకథా చిత్రాలు, మాస్ మసాలా సినిమాలు.. ఇలా చూసిన సినిమాలనే మళ్ళీ మళ్ళీ చూడాల్సిన పరిస్థితి తెలుగు ప్రేక్షకులకు ఏర్పడింది. ప్రస్తుతం మనకు అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే సినిమాలు, కళ్ళు చెదిరే విజువల్స్‌తో సినిమాలు చేస్తున్నారు. ఓ మాదిరి బడ్జెట్ నుంచి భారీ బడ్జెట్ వరకు ఈ తరహా సినిమాలు రూపొందుతున్నాయి. అయితే ఎవరూ హాస్యం ప్రధానంగా ఉండే సినిమాలు తీసే సాహసం చెయ్యడం లేదు. ఎందుకంటే అన్నింటి కంటే కష్టమైన పని నవ్వించడమే. ఒకవేళ అలాంటి సాహసం చేసినా హాస్యం పండించకపోగా అభాసుపాలవు తున్నారు. ఆరోగ్యకరమైన హాస్యం స్థానంలో వెకిలి చేష్టలతో కూడిన హాస్యం వచ్చి చేరింది. హాస్యం అంటే ద్వందార్థాలతో ఒకరినొకరు హేళన చేసుకునే ప్రక్రియగా మారిపోయింది. ఒకప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా సినిమా చూసి ఆనందించేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. 

పాతతరంలో టాప్ హీరోలు సైతం కామెడీ సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపించేవారు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు మొదలుకొని చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి హీరోలు కూడా మాస్, సెంటిమెంట్, యాక్షన్ సినిమాలు చేస్తూనే కామెడీ సినిమాలు చేసేందుకు ముందుకొచ్చేవారు. అంతకుముందు రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, నరేష్ వంటి హీరోలు కామెడీ సినిమాలు చెయ్యడం ద్వారా స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. ఇప్పటి హీరోలు అలాంటి సినిమాలు చెయ్యాలన్నా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే సత్తా ఉన్న దర్శకులు అందుబాటులో లేరు. జంధ్యాల, రేలంగి నరసింహారావు, వంశీ, ఇ.వి.వి.సత్యనారాయణ వంటి దర్శకులు చేసిన హాస్య ప్రధానమైన సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరైనా సాహసం చేసి కామెడీ సినిమా చేసినా చేతులు కాల్చుకోవాల్సి వస్తుందే తప్ప ప్రయోజనం మాత్రం శూన్యం.
తెలుగు వారు హాస్య ప్రియులు. హాస్యాన్ని ఆస్వాదించడంలో తెలుగు వారు ఎప్పుడూ ముందుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి తగ్గట్టుగానే అప్పట్లో మన దర్శకులు సహజ సిద్ధమైన కామెడీతో ప్రేక్షకుల్ని అలరించారు. సినిమా అనగానే ఎప్పుడూ చూడని క్యారెక్టర్స్ కాకుండా నిత్య జీవితంలో మనకు తారసపడే వ్యక్తుల విచిత్రమైన మేనరిజమ్స్‌తో ఎక్కడా అశ్లీలం లేకుండా సినిమాలు తీసేందుకు ఆనాటి దర్శకులు ప్రయత్నించేవారు. దర్శకుడికి, హీరోకి మధ్య అవగాహన కూడా మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి దోహదపడేవి. రేలంగి నరసింహారావు 70 సినిమాలు చేస్తే అందులో 35 సినిమాలు రాజేంద్రప్రసాద్‌తోనే చేశారంటే ఆ హీరోకి, దర్శకుడికి మధ్య ఎలాంటి అండర్‌స్టాండింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఆరోగ్యకరమైన కామెడీని తెలుగు వారు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆస్వాదిస్తారు. ఈమధ్యకాలంలో కూడా కొన్ని హాస్య ప్రధాన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టేవిగా వచ్చాయి. ప్రేక్షకులు కూడా ఆ సినిమాలను సాదరంగా ఆహ్వానించారు, ఆదరించారు. దీన్ని బట్టి ఏ సినిమానైనా భారీ బడ్జెట్‌తో తియ్యనవసరం లేదు, పెద్ద పెద్ద సెట్లు వెయ్యక్కర్లేదు.. పాటల కోసం విదేశాలకు ఎగిరి వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచి కథ, కథనాలతోపాటు రెండు గంటల సేపు హాయిగా నవ్వుకునేలా ఉంటే చాలు. ఆ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది సుస్పష్టం. 

ఆ క్రియేషన్ ఇప్పుడు లేదేమో అనిపిస్తోంది 
imageపౌరాణికాన్ని రామారావుగారు, సోషల్‌ని నాగేశ్వరరావుగారు హీరో రేంజ్‌కి ఎలా తీసుకెళ్ళారో కామెడీని కమర్షియల్ హీరో రేంజ్‌కి తీసుకెళ్ళినవాడు రాజేంద్రప్రసాద్. అలా చెయ్యగలిగానంటే మెయిన్ కారణం రచన. ఆ తర్వాత దర్శకులు. జంధ్యాలగారు, వంశీగారు, రేలంగి నరసింహారావుగారి నుంచి ఇ.వి.వి. వరకు ఆ కామెడీని ఒక రేంజ్‌కి తీసుకెళ్ళారు. ఒక రొమాన్స్ హీరో అయినప్పుడు, ఒక యాక్షన్ హీరో అయినప్పుడు కామెడీ హీరో ఎందుకు కాదు. నువ్వు ఏమిటో, నీ ప్రత్యేకత ఏమిటో నిరూపించుకోలేకపోతే నువ్వు ఇండస్ట్రీలో నిలబడలేవు అని నాకు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో గోల్డ్ మెడల్ వచ్చినపుడు ఎన్.టి.రామారావుగారు చెప్తే నాకు ఆరోజు కనిపించింది కామెడీ.
అలా హీరోనే కామెడీ అనే రేంజ్‌కి నా సినిమాలు వెళ్లాయి. లేడీస్ టైలర్ హీరోనే కామెడీ, అప్పుల అప్పారావు హీరోనే కామెడీ, ఏప్రిల్ 1 విడుదల హీరోనే కామెడీ. అంటే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని నవ్వించే బాధ్యత హీరో తీసుకుంటాడు. అహనాపెళ్ళంట వంటి సినిమాలు ఈరోజుకీ టీవీల్లో వేస్తున్నారంటే సినిమా అంతా హీరో చేసిన కామెడీ వల్ల. ఆ విధంగా నేను ఒక గోల్డెన్ పీరియడ్ చూశాను. అలాంటి కామెడీ సినిమాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు అంటే.. ఆ క్రియేషన్ ఇప్పుడు లేదేమోనని నా మనసుకు అనిపిస్తోంది. ఎందుకంటే నేను హీరోగా చేసిన సినిమాల్లోని క్యారెక్టర్స్ అన్నీ రెగ్యులర్ హీరో చేసేవి కావు. మన లైఫ్ నుంచి వచ్చినవే. మనం నిత్యం చూస్తున్న క్యారెక్టర్సే. నేను చేసిన 252 సినిమాల్లో.. నిన్నటి మహానటి వరకు అన్నీ మనకు పరిచయం వున్న క్యారెక్టర్సే చేశాను. నిజమైన క్యారెక్టర్‌తో సినిమాలు తీస్తే అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా కాకుండా ఒక వీక్‌నెస్ మీద కామెడీ చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. నాకు తెలిసి స్టాండర్డ్స్‌కి దిగువన వుండే క్యారెక్టర్స్‌తో కామెడీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే అది ఆరోగ్యకరమైన కామెడీ అనిపించుకోవడం లేదు. 
- నటుడు రాజేంద్రప్రసాద్

దర్శకనిర్మాతల దృక్పథం మారాలి 
నేను, జంధ్యాలగారు ఒకే సంవత్సరం దర్శకులుగా మారాం. పూర్తి స్థాయి కామెడీ సినిమాలు తీశాం. మా తరం కంటే ముందు పూర్తి హాస్య చిత్రాలు ఎక్కువగా రాలేదనే చెప్పాలి. కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ మాలాగా ప్రతి క్యారెక్టర్‌నిimage కామెడీగా చూపించలేదు. నేను, జంధ్యాలగారు తీసిన సినిమాల్లో ప్రతి క్యారెక్టర్‌తోనూ నవ్వించే ప్రయత్నం చేశాం. ఒక్కో క్యారెక్టర్‌కి ఒక్కో తరహా మేనరిజమ్స్ పెట్టేవాళ్ళం. అలా పూర్తి స్థాయి కామెడీ సినిమాలు చెయ్యగలిగాం. తర్వాత తర్వాత పూర్తి స్థాయి కామెడీ సినిమాలు రాకపోవడానికి కారణం ఆ సినిమాలకు ప్రత్యేకంగా హీరోలు లేకుండా పోవడం. రాజేంద్రప్రసాద్‌గారు, చంద్రమోహన్‌గారు, నరేష్‌గారు ఆ తరహా సినిమాలు చేసేవారు. వారి తర్వాత మళ్ళీ అల్లరి నరేష్ వచ్చేవరకు చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో ఫుల్ ప్లెడ్జ్‌డ్ కామెడీ సినిమాలు రాలేదు. 

ఈ గ్యాప్‌లో ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. అదేమిటంటే పెద్ద పెద్ద హీరోలు కూడా కామెడీ చెయ్యడం. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్‌కల్యాణ్ వంటి హీరోల క్యారెక్టర్లను కామెడీగా మలిచారు దర్శకులు. కానీ, అవి ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలు కాదు. దానివల్ల ఫుల్‌లెంగ్త్ కామెడీ సినిమాలు మరుగున పడిపోయాయి. అలాంటి సినిమాలు తియ్యాలంటే నిర్మాతకి, దర్శకుడికి అభిరుచి ఉండాలి. అభిరుచి ఉంటేనే ఫుల్‌లెంగ్త్ కామెడీ సినిమాలు తియ్యగలరు. అయితే కొంతమంది నిర్మాతలకు అభిరుచి ఉన్నా స్టార్ డామినేషన్ పెరిగిపోయింది. దర్శకనిర్మాతల్లో కళాతృష్ణ తగ్గిపోయింది. సినిమాని బిజినెస్‌పరంగానే ఆలోచించారు. డబ్బే ప్రధానం అనుకున్నారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టి దాన్నే కామెడీ అని చెప్పడం మొదలుపెట్టారు. ఆరోజుల్లో మేం తీసిన సినిమాల్లో కూడా అంతర్లీనంగా శృంగారం ఉండేది. అయితే అది గిలిగింతలు పెట్టేదిగా ఉండేది తప్ప జుగుప్స కలిగించేదిగా ఉండేది కాదు. ఇప్పుడు సినిమాల్లో కంటే టి.వి. షోల్లోనే మరీ బూతు చూపించేస్తున్నారు. టీవీల్లో ఫ్యామిలీ ఆడియన్స్ అలాంటి కామెడీ చూస్తున్నారు కాబట్టి సినిమాల్లో పెడితే తప్పేంటి అనే ధోరణి దర్శకనిర్మాతల్లో పెరిగిపోయింది.

 అయితే ఇప్పుడు కూడా భలే భలే మగాడివోయ్, పెళ్లిచూపులు, సమ్మోహనం వంటి సినిమాలు పూర్తి స్థాయిలో ప్రేక్షకుల్ని నవ్వించేవిగా రూపొందుతున్నాయి. అయితే వాటి సంఖ్య తక్కువ. మంచి కామెడీతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. అలా తియ్యాలంటే దర్శక నిర్మాతల దృక్పథం మారాలి. అలాగే ఆర్టిస్టుల ఆలోచన కూడా మారాలి. తాము చేస్తున్న సన్నివేశంలో బూతు అనేది ఉందంటే దానికి అభ్యంతరం చెప్పాలి. అప్పుడే ఆరోగ్యకరమైన కామెడీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. 
- దర్శకులు రేలంగి నరసింహారావు

అందుకే పాత కామెడీ సినిమాలు మళ్లీ మళ్లీ చూస్తున్నారు  
నేను హాస్యనటిగా ఎన్నో సినిమాలు చేశాను. నేను చేసిన పాత్రల ద్వారా చాలా మంచి పేరు వచ్చింది. జంధ్యాలగారు, రేలంగి నరసింహారావుగారు వంటి దర్శకులతో, రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, నరేష్ వంటి ఆర్టిస్టులతోimage ఆరోగ్యకరమైన వాతావరణంలో సినిమాలు చేసేవాళ్ళం. ఆరోజుల్లో రైటర్స్ అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చెయ్యడం వల్ల మంచి మంచి క్యారెక్టర్స్ చెయ్యగలిగాం. అలా చాలా కామెడీ సినిమాలు చేశాం. రేలంగి నరసింహారావుగారు, జంధ్యాల లాంటి దర్శకులు కామెడీ సబ్జెక్ట్‌తోనే సినిమాలు తీసేవారు. ఇ.వి.వి.సత్యనారాయణగారు కూడా చాలా మంచి కామెడీ సినిమాలు చేశారు. ఇప్పుడలాంటి సినిమాలు రాకపోవడానికి కారణం ఫుల్ ప్లెడ్జ్‌డ్‌గా కామెడీ కథలు రాసేవారు, తీసేవారు లేకపోవడం. ఇప్పుడు యూత్ సినిమాలు, లవ్‌స్టోరీలు ఎక్కువగా తీస్తున్నారు. జనరేషన్ మారుతున్న కొద్దీ సినిమాల తీరు కూడా మారుతోంది. పూర్తి స్థాయి కామెడీ సినిమాలు ఇప్పుడు రావడం లేదు కాబట్టే పాత కామెడీ సినిమాలను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. మళ్ళీ కామెడీ సినిమాలు రావాలంటే దర్శకుల్లో, నిర్మాతల్లో మార్పు రావాలి. అలాంటి సినిమాలు తియ్యాలన్న ఆలోచన కలగాలి. 
- నటి శ్రీలక్ష్మికేరళ కళ కలరియపట్టు

Updated By ManamThu, 05/24/2018 - 22:30

imageభారతీయ అతి ప్రాచీన యుద్ధకళ కలరిపయట్టు. విదేశీయులంతా కరాటే, కుంగ్ ఫూ, సమురాయ్ లను గొప్ప కళలుగా చెప్పుకుంటారు ,. కానీ వీటన్నింటినీ మించిన కళ, ఎంత పరాక్రమవంతులైనా సామాన్య సైనికుని ముందు తలవంచేలా నిలబెట్ట గలిగిన కళ కలరిపయుట్టు. యుద్ధ చాతుర్యానికి గల శక్తిని ఇనుమడింపచేసిన కళ కలరిపయుట్టు. ‘కలరి‘ అంటే పాఠశాల, ‘పయట్టు‘ అంటే యుద్ధం అని అర్థం. ప్రపంచంలోని అతి ప్రాచీన మార్షల్ ఆర్ట్‌గా ఈ కళకు గుర్తింపు ఉంది.

పరశురాముడిని ఈ విద్యకు ఆద్యునిగా భావిస్తారు. ఈ విద్యను నేర్పే గురువులను నాయర్ లేదా ఇలావార్ అంటారు. కలరి వనికర్ అనే తెలుగువారు ఈ విద్యను నేర్పుతారు. దీంట్లో మల్లయుద్ధం, కత్తిసాము, గధా యుద్ధం, ఉరుమి, కర్రసాము ముఖ్యైవెునవి. ఆయుధాలు లేకుండా, కత్తి డోలుతోను, బరువైన వస్తువులతోనూ, కొరడా లాంటి ఆయుధాలతోనూ, కర్రలతోనూ శిక్షణ ఇస్తారు. ఇందులో యోగ విద్య ముఖ్య పాత్ర వహిస్తుంది. 

ఈ కళ ప్రాముఖ్యతను తెలంగాణ యువతకు తెలియజెప్పేలా సాంస్కృతిక శాఖ వారు ఈ రంగంలో ప్రోత్సాహకర కార్యక్రమాలను చేపట్టారు.  నగరం నడిబొడ్డున గల రవీంద్రభారతిలో ఆరుబయట వేదికలు కలరిపయట్టు  కసరత్తులు ఆసక్తికరమైన  అభ్యాసాలతో  నవతరం నడకను మారుస్తున్నాయి. 

57 వ యేట అడుగుపెట్టిన రవీంద్రభారతిలో సకల కళారూపాలకు తావు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం  తొలిసారిగా దాదాపు ఎకరం జాగాలో యువతకు ఉల్లాసకరమైన విన్యాసాల క్రీడను ఆరంభించింది. వేలమంది కళాకారులకు పుట్టినిల్లయిన తెలంగాణ గడ్డ పై ఈ తరం యువతలో కొత్త స్ఫూర్తిని నింపేందుకు నూతన వేదికలను ఆవిష్కరిస్తోంది. వేదికలపై ప్రదర్శనలకు సమాయత్తమవుతున్న నవయువతలో శారీరక సౌష్టవంతో పాటు చురుకైన కదలికలతో పొంగులెత్తే ఉత్సాహం పంచటంకోసం  కేరళకు చెందిన కలరిపయట్టు  విద్వాంసులను ఆహ్వానించి ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించింది.  కేరళలోని కాలికట్ పరిసరాలలో  పేరుమోసిన ఎడక్కాడ్  సివియన్ కలరి కి చెందిన గురువు టి. సుధాకరన్ తో పాటు ఆయన శిష్యులతో శిక్షణ కు అవకాశం అందుబాటులోకి తెచ్చింది. ఒక మాసం పాటు గురుకుల శిక్షణకు ఉచితంగా విద్య నేర్చుకునే అవకాశం దక్కింది. కళలపై ఆసక్తిగల యువతి యువకులు కలరిపయట్టు శిబిరం నిర్వహణ సమాచారం తెలియగానే తమకు ముందస్తు అవకాశం కల్పించమని దరఖాస్తులతో నిర్వాహకులను ముంచెత్తారు. శిక్షణలో పాల్గొన్న యువతి యువకులు మొదటి రెండురోజులలోనే తమ శరీరం ఆకారంలో వచ్చిన మార్పులతో మరింత శ్రద్ధ పెట్టారు. ఈ విన్యాసాలతో పోరాటపటిమ, శరీర ధారుడ్యం పెరగటంతో  ఇంకా ఇలాంటి శిబిరాలు కావాలి అంటున్నారు.  

మైమ్ మధు....
మూకాభినయంలో నిష్ణాతుడిగా అంతర్జాతీయ ఖ్యాతి తో తెలంగాణ వన్నెపెంచిన వరంగల్  మధు తొలిసారిగా కలరిపయట్టును హైదరాబాదీయుల ముందుకుతెచ్చారు. ఆ శిబిరం కోసం ఆయన పడిన శ్రమ సాధించిన ఫలితాలపై ఆయన మాటల్లోనే..

నాకున్న అనుభవంతో పలురకాల శిక్షణ శిబిరాలను నిర్వహించాను. అలానే హైదరాబాద్‌కు ఈ కళను తీసుకురావాలంటే, ఈ నగరం లో మంచి చోటుకోసం వెతికేకన్న రవీంద్రభారతి ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ జాగా ను వినియోగించుకుందామని తలపెట్టాను. జెసిబి తెచ్చి చదును పని మొదలు పెట్టంగానే శిబిరం వివరాలు తెలసి వందలమంది తరగని ఆసక్తితో దరఖాస్తు చేసుకున్నారు. ఎండలకు కూడా  వెరవకుండా తర తరాల సంప్రదాయకళను మన యువత అందుకొంది. 7 వతేదీనుంచి 26 దాకా సెలవనేదే లేకుండా సాధన తో  60 మంది యువతియువకులు కలరిపయ్యట్టు లో మెలకువలను  ఆకళింపుచేసుకున్నారు. మామూలుగా లక్షల ఖర్చు తప్పని ఈ శిక్షణ కు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించటంతో అందరికీ ఉచితంగా ఈ యుద్ధ విన్యాసక్రీడ అందివచ్చింది.అందరూ సద్వినియోగం చేసుకున్నారు. ప్రదర్శన కళలకు మన శరీరం సన్నద్ధతకు గల అవినాభావ సంబంధం యువతకు అనుభవంలోకి వచ్చింది. ఎవరిని పలుకరించినా ఇంకా సాధన చేయాలని ఉందనే అంటున్నారు."

27 వ తేదీ సాయంత్రం రవీంద్రభారతి లో 57  ఏళ్లలో సాధ్యంకాని అద్భుత వ్యాయామ విన్యాసాలు తెలంగాణ బిడ్డలు ప్రదర్శించనున్నారు. వచ్చి తిలకించండి. ఇందుకు సంబంధించిన వివరాలకు, కేరళ గురువులు, నేను అందుబాటు లో ఉంటాము 98492 79733 కి ఫోన్ చేస్తే చాలు వివరంగా చెబుతాము.
 - జి.ఎల్.ఎన్.మూర్తి

Related News