VAT On Fuel

ఏపీలో పెట్రోల్‌పై రూ.2 వ్యాట్ తగ్గింపు

Updated By ManamMon, 09/10/2018 - 15:45
  • పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ ప్రజలకు స్వల్ప ఊరట

  • రూ.2 వ్యాట్ తగ్గిస్తూ చంద్రబాబు ప్రకటన

Andhra pradesh cut VAT  by Rs2 on petrol, diesel

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెట్రల్, డీజిల్ ధరలపై స్వల్ప ఊరట లభించింది. పెట్రోల్ ధరలపై ఏపీ ప్రభుత్వం రూ.2 వ్యాట్ తగ్గించింది. ఈ నిర్ణయంతో ఏపీ ఖజానాపై దాదాపు రూ.1120 కోట్ల భారం పడనుంది. కాగా పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం ప్రస్తుతం వ్యాట్ రూ.4 వసూలు చేస్తోంది.చమురు ధరల పెంపుపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఖండిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. తగ్గిన ధరలు రేపటి (మంగళవారం) నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. 

‘గడిచిన నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత చమురు సంస్థలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అదుపులేకుండా పెంచడం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ రోజు ప్రతిపక్షాల బంద్‌కు ప్రజలనుంచి వచ్చిన విశేష స్పందనే ఇందుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, బాధ్యతారహిత విధానాలతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అన్ని వర్గాలకు భరించలేని భారంగా మారాయి. 

ప్రజలను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ధరలను తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలను గత నాలుగున్నరేళ్లుగా తీసుకోకపోవడం గర్హనీయం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్‌కు సంఘీభావంగా తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్నాయి. ప్రజల ఆవేదనల్లో పాలు పంచుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరలు పెరగడం వల్ల రాష్ట్రాల వ్యాట్‌ రేట్లు పెంచడం వల్ల డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించడంసాధ్యం కాదని పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉద్ఘాటించారు. ఈ ప్రకటన వాస్తవానికి దూరంగాను, ప్రజల్ని మభ్యపెట్టేదిగా ఉంది. బాధ్యతా రహితమైన ఈ ప్రకటనను ఖండిస్తున్నాం.’

‘2014లో క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 105.5 డాలర్లు ఉండగా నేడు కేవలం 72.23 డాలర్లుగా ఉంది. 2014లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 49.60పైసలు ఉంటే నేడు 86.71పైసలకు పెరిగింది. డీజిల్‌ ధర 2014లో రూ.60.98పైసలు ఉంటే.. నేడు రూ. 79.98లుగా ఉన్నది. గతంలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా కేంద్రం తగ్గించకుండా అదనపు పన్నులు, సెస్‌ల పేరుతో దోచుకుంది.

ఇప్పుడు మాత్రం ముడిచమురు ధరలు పెరిగాయన్న నెపంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నారు. ఒక విధానమేమీ లేకుండా నిరంకుశంగా కేంద్రం వ్యవహరిండచాన్ని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 2014 జూన్‌లో డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం లీటర్‌పై రూ. 3.50 పైసలు ఉండగా.. 2017 సెప్టెంబర్‌ నాటికి లీటర్‌పై రూ.17.33 పైసలకు పెంచారు. 

2014లో లీటర్‌ పెట్రోల్‌ ధరపై 9.48 పైసలు ఉన్న కేంద్ర ఎక్సైజ్‌ సుంకాన్ని 2018 నాటికి లీటర్‌కు రూ.19.48 పైసలు పెంచారు. ఇదే కాకుండా మౌలిక సదుపాయాల సెస్‌ పేరుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.7, డీజిల్‌పై రూ.8లు అదనపు భారాన్ని వినియోదారులనుంచి వసూలు చేస్తున్నారు.

ఒకవైపు వినియోగదారులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సెస్‌ల రూపంలో వారిపై అదనపు భారాన్ని మోపుతోంది. గత నాలుగున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.10లక్షల కోట్లు పైచీలుకు నిధులు ఎక్సైజ్‌డ్యూటీ ద్వారా సమకూరుతున్నప్పటికీ సామాన్య జనంపై భారం తగ్గించడానికి కేంద్రం చొరవ చూపకపోవడం దుర్మార్గం. కేంద్రం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకుండా పోతోంది’ అని విమర్శించారు.

 రాష్ట్రాలూ వ్యాట్‌ను తగ్గించాలి

Updated By ManamWed, 10/04/2017 - 15:14
  • అలా అయితేనే వాహనదారులకు లబ్ధి.. పెట్రోల్/డీజిల్ ధరలపై కేంద్రం వినతి

  • రాష్ట్రాలకు పెట్రోలియం మంత్రి లేఖలు.. ఎక్సైజ్ సుంకంపై రూ.2 తగ్గించిన కేంద్రం

  • కేంద్రంపై రూ.26 వేల కోట్ల భారం

న్యూఢిల్లీ, అక్టోబరు 4: పెట్రోల్/డీజిల్ రోజువారీ సమీక్ష ఎప్పటినుంచైతో ప్రారంభమైందో గానీ, అప్పటి నుంచి ధరల పెరుగుదలే తప్ప.. తగ్గుదల అనేదే లేదు. అలాఅలా పైసా..పైసా పెరుగుతూ తెలియకుండానే పెట్రోల్‌పై ఏకంగా 8 రూపాయలు, డీజిల్‌పై సుమారు 6 రూపాయలు వడ్డించేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో స్పందించిన కేంద్రం.. మంగళవారం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 2 రూపాయలు తగ్గించింది. తాను తగ్గించడమే కాదు, వినియోగదారులకు లబ్ధి చేకూరాలంటే రాష్ట్రాలు కూడా స్పందించాలని కోరింది. పలు రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్‌నూ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. వ్యాట్‌ను తగ్గిస్తేనే ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలు అగ్గువకు వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ (ఫైనాన్స్) ఏకే శర్మ చెప్పారు. కాగా, ఎక్సైజ్ సుంకం తగ్గాక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.72.40గా ఉంది. మంగళవారం వరకు ఆ ధర రూ.75.06గా ఉంది. ఇక, హైదరాబాద్‌లో మంగళవారందాకా రూ.64.25గా ఉన్న డీజిల్ ధర బుధవారానికి రూ.61.81కి దిగి వచ్చింది. అయితే, వాహనదారులకు మరింత లబ్ధి చేకూరాలంటే మాత్రం రాష్ట్రాలు కూడా స్పందించి వ్యాట్‌ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్రాలు ప్రస్తుతం లీటర్ పెట్రోల్/డీజిల్‌పై 25 నుంచి 49 శాతం దాకా వ్యాట్ లేదంటే అమ్మకపు పన్నును విధిస్తున్నాయి. దానిని తగ్గించాలని కోరుతూ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. రాష్ట్రాలకు లేఖలు రాయబోతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. 

26 వేల కోట్ల భారం
మరోవైపు ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో కేంద్రంపై మిగిలిన ఆర్థిక సంవత్సరానికిగానూ సుమారు రూ.13 వేల కోట్ల భారం పడనుంది. మొత్తం ఆర్థిక సంవత్సరంగా చూస్తే కేంద్రంపై పడే మొత్తం భారం రూ.26 వేల కోట్లు. ఇక, నిన్నటిదాకా పెట్రోల్‌పై విధిస్తున్న రూ.21.48 ఎక్సైజ్ సుంకం.. 2 రూపాయల తగ్గింపుతో రూ.19.48కి దిగివచ్చింది. అదేవిధంగా డీజిల్‌పై వసూలు చేస్తున్న రూ.17.33 ఎక్సైజ్ సుంకం కాస్తా.. రూ.15.33కి తగ్గింది. మరోవైపు 2014 నుంచి 2016 దాకా అంతర్జాతీయ విపణిలో పెట్రోల్ ధరలు పడిపోతున్నా 9 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా సుంకాన్ని 2 రూపాయలు తగ్గించింది. 

Related News