janasena

ఇకపై ‘కొణిదెల’ కాదు ‘తెలుగు’

Updated By ManamFri, 11/16/2018 - 12:44

Pawan Kalyanఅమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఇంటి పేరు మార్చుకున్నారు. ఇకపై తన ఇంటి పేరు ‘తెలుగు’ అని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. తనను ఓ కులానికో,  కుటుంబానికో పరిమితం చేయడం సరికాదని అన్నారు. తాను తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తినని పేర్కొన్నారు.

ఇక అడ్డదారిలో సీఎం అయిన చంద్రబాబులా తాను మాటలు మార్చబోనని పవన్ అన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లో అపారమైన చమురు నిల్వలు ఉన్నందునే తాను ఉచితంగా వంట గ్యాస్‌ను సరఫరా చేస్తానని చెప్పానని అన్నారు. తన ప్రభుత్వం వస్తే, దివ్యాంగులు పింఛన్ కోసం బయటకు రావాల్సిన అవసరం లేదని, అధికారులే ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తారని చెప్పారు. ప్రజలు తమ ఓటును అమ్ముకోకుండా, బాధ్యతతో నేతలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.సీపోర్టు లైసెన్సు రద్దు  

Updated By ManamThu, 11/15/2018 - 23:31
 • అధికారంలోకి రాగానే చేస్తాం : పవన్ 

pavanకాకినాడ : జనసేన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సీపోర్టు లైసెన్సును రద్దు చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. కాకినాడ సీపోర్టు అక్రమాలని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. కాకినాడ జీ కన్వెన్షన్ హాల్లో జరిగిన విలేకర్ల సమావేశంలో సీపోర్టు అక్రమాలపై ఓ డాక్యుమెంటరీని మీడియా ముందు ఉంచారు.  అనంతరం  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ సీపోర్ట్‌లో దోపిడీ ఎలా జరుగుతోంది.. పర్యావరణ విధ్వంసం ఎలా జరుగుతోంది అనే అంశాలని వివరిస్తామని పవన్ పేర్కొన్నారు. ఈ అక్రమ వ్యవహారాలకు కారకుడైన కేవీరావు అనే వ్యక్తిని దేశానికి రప్పించి, ప్రజలకి సమాధానం చెప్పించాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు.  ఈ విషయంలో జగన్మోహన్‌రెడ్డి మౌనంగా ఉన్నా, ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నా, లోకేష్ మౌనంగా ఉన్నా ఈ దోపిడీలో ఖచ్చితంగా మీ పాత్ర ఉందని విశ్వసించాల్సి వస్తుందని  పవన్ కళ్యాణ్ విమర్శించారు. దీన్ని జనసేన తరపున తీవ్రంగా పరిగణిస్తున్నామని పవన్ అన్నారు. కేవీరావు గురించి అమెరికాలో తనకు తెలిసిన సెనేటర్స్‌ను సంప్రదిస్తానని  పవన్ తెలిపారు.  జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఇన్ని రకాల అక్రమాలకి పాల్పడుతున్న కాకినాడ సీపోర్టు లైసెన్సుని ఖచ్చితంగా రద్దు చేస్తామని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  ప్రకటించారు. కాకినాడ సీపోర్టు యజమాని మెలోడి వెంకటేశ్వరరావు అనేవారని, విశాఖలో చిన్నపాటి థియేుటర్ యజమాని అని, ఇతని సంపద ఒక్కసారిగా వేల కోట్లకి ఎలా పెరిగిపోయిందని ప్రశ్నించారు. వెంకటేశ్వరరావుకి కాలిఫోర్నియాలో ద్రాక్ష తోటలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అన్నారు. ప్రకృతిని కాపాడేవారే లేరని, అందరూ అడ్డంగా దోచేస్తున్నారని, మాట్లాడితే మేం వేయించిన రోడ్లు, మేం కట్టించిన మరుగుదొడ్లు అంటారని, 500 మంది ఒక్క మరుగుదొడ్డి వాడుకుంటారా? ఒకసారి లోకేష్‌ని తీసుకువెళ్లాలి లోపలికి... ఎలా ఉంటుందో తెలుస్తుంది అని  పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీ ఓట్ల కోసం రాలేదని, మార్పు కోసం వచ్చామని మార్పు తీసుకువస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ ఎస్‌ఈజెడ్ విషయంలో కూడా జవాబుదారీతనం లేని, పరిశ్రమలు స్థాపించని సెజ్‌లను రద్దు చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.చంద్రబాబుది రోజుకో మాట

Updated By ManamWed, 11/14/2018 - 23:27
 • బీజేపీతో దోస్తీ అంటారు.. వద్దంటారు

 • హోదా కావాలంటారు.. మళ్లీ వద్దంటారు

 • ఇన్ని రంగులు మార్చే వ్యక్తి అవసరమా

 • మాట మార్చని నాయకుడు కావాలి

 • ఉన్నత ఆశయాలతో వచ్చా: పవన్ కల్యాణ్

 • జనసేనలో చేరిన అశోక్ బాబు, దొమ్మేటి

janasenaకాకినాడ: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతారు. కాసేపు బీజేపీతో దోస్తి అంటారు. ఇంకాసేపటికి వద్దంటారు. హోదా కావాలి అంటారు. వద్దంటారు. ఇదేమైనా ఊసరవెల్లి సినిమానా? ఇన్ని రంగులు మార్చే వ్యక్తి అవసరమా. మాట మార్చని నాయకుడు దేశానికి కావాలి. మడమ తిప్పనివాడు దేశ రాజకీయాల్లోకి రావాలి. హైదరాబాద్‌లో ఆంధ్రులను దోపిడిదారులుగా చిత్రించారు. ఇవన్నీ పాలకులు చేసిన పొరపాట్లు. ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలతో విసిగిపోయాం. ఓ కులం కోసమో, మతం కోసమో చేసే రాజకీయాలు వద్దు. ఒకసారి ఆంధ్ర-తెలంగాణ అంటూ తెలుగు ప్రజల్ని విడగొట్టారు. ఇప్పుడు మళ్లీ ఆంధ్రుల్ని కులాల పేరుతో విడగొడతారా?’’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉన్నత ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చానని, మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు వచ్చానని, సెల్ఫీలకు పరిమితం చేయవద్దని జనసేన  పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి పేర్కొన్నారు. ఓ వ్యక్తిపై ఇష్టమంటే ఆయన ఆశయాలు పాటించాలి కానీ, ఫొటో తీయించుకుంటేనే ఇష్టమంటే ఎలా అని ప్రశ్నించారు. బుధవారం కాకినాడ జి.కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఇద్దరు మాజీ శాసన సభ్యులతో పాటు పెద్ద ఎత్తున మాజీ సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. తుని, తాళ్లరేవు మాజీ శాసనసభ్యులు రాజా అశోక్‌బాబు, దొమ్మేటి వెంకటేశ్వర్లు, ఇతర నాయకులకు పవన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

ఫొటోలతో మార్పు రాదు..
‘‘నాపై అపారమైన నమ్మకంతో పార్టీలో చేరిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. అందర్నీ హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. అంతా ఫోటోలు కావాలి, సెల్ఫీలు కావాలి అని అడుగుతున్నారు. నా సమయం అంతా ఫొటోలు తీయించుకోవడానికే కేటాయిస్తే, ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయంపై ఎక్కడ పోరాటం చేయగలను. నేను రాజకీయాల్లోకి ఫొటోలు తీయించుకోవడానికి రాలేదు. మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు వచ్చా. నేను మీ వాడిని, మీ ఇంట్లో వాడిని, మీకు అండగా ఉండే వాడిని. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఫోటోలతో మార్పు వస్తుందా? పోరాటాల వల్ల మార్పు వస్తుందా? పోరాటమే టీడీపీని ఓడిస్తుంది. జనసేనని గెలిపిస్తుంది. మీ అందరి పోరాటమే పవన్ కల్యాణ్‌ని ముఖ్యమంత్రిని చేస్తుంది’’ అని అన్నారు.

కుల రాజకీయాల్ని ఆపాలి
‘‘కులాలతో విసిగిపోయాం. నీచపు రాజకీయ వ్యవస్థతో విసిగిపోయాం. ఓ సరికొత్త రాజకీయ వ్యవస్థ తీసుకురావడానికే రాజకీయాల్లోకి వచ్చా. కుల రాజకీయాల్ని ఆపాలి. ఓ వైపు కులాల ఐక్యత గురించి మాట్లాడుతుంటే.. మరోవైపు కులాల మధ్య చిచ్చుపెడతారు. రెల్లి కులస్తుల ఇళ్లకి వెళ్తే వారు అడుగుతున్నారు.. అన్నా ఈ కులాల్ని తీసేయన్నా చచ్చిపోతున్నాం అని. అంతా రాజకీయ ప్రయోజనాల కోసం కులాల్ని వాడుకునే వారే. ముస్లిం సోదరులతో మాట్లాడినప్పుడు చెప్పా.. వారిలోనూ హిందూ దేవుళ్లని తిట్టే వారి మాట బయటకు వినబడుతుంది. బ్యాలెన్డ్స్‌గా మాట్లాడేవారు మాత్రం బయటికి రావడం లేదు’’ అని పవన్ అన్నారు. 

ఎన్టీఆర్‌కు దండలు వేయడం మానండి
‘‘ముఖ్యమంత్రికి చెబుతున్నా.. స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని కాంగ్రెస్‌కి తాకట్టు పెట్టిన మీరు ఎన్టీ రామారావు విగ్రహానికి దండలు వేయడం మానండి. ఆయన విగ్రహానికి ముసుగేసి కప్పేయండి. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిన మీకు ఎన్టీఆర్ మాట ఎత్తే హక్కు లేదు. విలువలు పాటించని మీరు ప్రజల్ని ఏం కాపాడుతారు. ఎప్పటికయినా సత్యమే గెలుస్తుంది’’ అని పవన్ అన్నారు.జనసేనానిలకు పవన్ విన్నపం

Updated By ManamMon, 11/12/2018 - 09:06

Pawan Kalyanహైదరాబాద్: కార్తీకమాసంలో వనభోజనాలు చేసే జనసేన నాయకులకులందరికీ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ విన్నపం చేశారు. కార్తీక మాసం వనభోజనాలు వ్యక్తిగతంగా జరుపుకోండి కానీ.. తన పేరు మీద గానీ, జనసేన పార్టీ పేరు మీద గానీ జరపొద్దని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా మహిళలందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలిపారు పవన్ కల్యాణ్. కాగా కార్తీక మాసంలో చాలామంది వనభోజనాలు చేసేందుకు వెళ్లే విషయం తెలిసిందే.

 జనసేనలోకి పసుపులేటి బాలరాజు..

Updated By ManamSat, 11/10/2018 - 13:26

pasupuleti balaraju joins Janasena partyవిజయవాడ : కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీమంత్రి పసుపులేటి బాలరాజు శనివారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్... ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం ఇచ్చి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.  బాలరాజు మాట్లాడుతూ...‘పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం, ఆశయాలు నచ్చి జనసేనలో చేరాను. 

నా వంతుగా పార్టీ బలోపేతం చేయడానికి, పవన్‌కు మద్దతుగా ఉంటాను. కాంగ్రెస్ పార్టీలో మండల అధ్యక్షుడుగా నా రాజకీయ ప్రయాణం సాగింది. ఈ సందర్భంగా అనేక ఒడిదుడుకులు చవిచూశాను. సామాజిక న్యాయం కోసం...అణగారిన వర్గాల కోసం పవన్ చేస్తున్న పోరాటానికి పూర్తి సహకారం ఉంటుంది.’ అని అన్నారు.

కాగా బాలరాజు శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారికంగా పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి రాజీనామా లేఖ కూడా సమర్పించారు. 1985లో మండల అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించిన బాలరాజు.. తర్వాత ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు.
 అలా అయితే జగన్ ఓడిపోయేవాళ్లు కాదు..

Updated By ManamTue, 11/06/2018 - 16:26
 • త‌రం మారుతోంది.. ఆలోచ‌నా విధానం మార్చుకోండి

 • నా బ‌లం చూసి మీ బ‌లం అనుకోకండి

 • ప‌ని చేస్తేనే ఓట్లు ప‌డ‌తాయి 

 • ​​​​​​​నాయ‌కుల‌కు జ‌న‌సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

JanaSena Chief PawanKalyan Meeting with Kakinada SEZ Sufferers

కాకినాడ : న‌మ్మిన సిద్ధాంతం కోసం చ‌చ్చిపోవ‌డానికి తాను సిద్ధంగా ఉన్ననని అయితే, జనసేన పార్టీలో కొంతమంది నాయ‌కులు అలా లేర‌ని జ‌న‌సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ‌ప‌ట్నంలోని అంబేద్క‌ర్ భ‌వ‌న్‌లో ప‌డుకుంటే మీ కోసం చ‌చ్చిపోతాం అన్న నాయ‌కుడు ఒక్క‌రూ తన చుట్టు లేరని, తనతో ఉన్న‌ది జ‌న‌ సైనికులేన‌ని అన్నారు. అలాంటి నాయ‌కులు తన బ‌లాన్ని చూసి మీ బ‌లం అనుకుంటే త‌ప్పు చేసిన వాళ్లు అవుతార‌ని హెచ్చ‌రించారు. జ‌న‌సేన పార్టీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఇష్ట‌ప‌డే కోట్లాది మంది అభిమానుల‌ద‌ని అన్నారు.  

మంగ‌ళ‌వారం కాకినాడ‌లోని జీ క‌న్వెన్ష‌న్ ఫంక్ష‌న్ హాల్లో పెద్దాపురం కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా పవన్ మాట్లాడుతూ..  ‘ఒక పార్టీ దెబ్బ తిన్నాక  సామాన్యుడు ఎవ‌డూ పార్టీ పెట్ట‌లేడు. అలాంటి ప‌రిస్థితుల్లో అదే కుటుంబం నుంచి ఒక‌డు వ‌చ్చి మంది మార్బ‌లం, అండ‌దండ‌లు లేకుండా వేల‌ కోట్ల‌కు పెరిగిపోయిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ఎదుర్కొవ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు అంటే ఎంత నిబ‌ద్ధ‌త ఉండాలో ఊహించ‌గ‌ల‌రా..? ఇంటి నుంచి చొక్క‌, పంచెతో బ‌య‌ట‌కు వ‌చ్చానంటే మ‌ళ్లీ ఇంటికి వెళ్తానో లేదో తెలియ‌దు అంత నిబ‌ద్ధ‌తో ప‌ని చేస్తాను.  నేను చేయ‌ని త‌ప్పుల‌కు 9 నెల‌లు న‌న్ను టీవీల్లో బూతులు తిడితే భ‌రించాను. 

భ‌యంతో కాదు స‌హ‌నం అనే గుణంతో భ‌రించాను. కొద్దిమంది నాయ‌కులు ఒక్క మాట కూడా ప‌డ‌లేరు. వాళ్ల‌కు ఎందుకింత అహంభావం, ఈగో, ఏం సాధించార‌ని. ఇన్ని కోట్లాది మంది ప్రేమ‌ను సంపాదించాలంటే భ‌గ‌వంతుడు నాకు ఎన్ని ప‌రీక్ష‌లు పెట్టుంటాడు, ఎంత‌ క‌ష్టం ప‌డుంటాను.  నియోజ‌క‌వ‌ర్గానికి 100 ఓట్లు కూడా తెప్పించుకోని నాయ‌కులు జ‌న‌సైనికుల‌ను ఎందుకు ఇబ్బందిపెడ‌తారు. వ్య‌వ‌స్థ మారుతోంది, స‌మాజం మారుతోంది, యువ‌త మారుతోంది... మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు. గతంలో కులాలు, వ‌ర్గాల‌తో రాజ‌కీయం చేయ‌డం కుద‌ర‌దు. వేల‌కోట్లే రాజ‌కీయాల‌కు అవ‌స‌ర‌మైతే తెలుగుదేశం పార్టీకి జ‌న‌సేన అవ‌స‌రం ఉండేది కాదు. జగన్ మోహన్  రెడ్డి ఓడిపోయి ఉండేవారు కాదు.  

పాతత‌రం ఆలోచ‌నల్లో కూరుకు పోయినవాళ్లు దాని నుంచి బ‌య‌ట‌కు రండి. ఎన్టీఆర్ స‌మ‌యంలో అలా జ‌రిగింది, ఇలా జ‌రిగింది అని చెప్పొద్దు. ఎన్టీఆర్ వ‌చ్చి 30 ఏళ్లు దాటింది. ఆ శ‌కం ముగిసింది.  ప్ర‌తి మూడు ద‌శాబ్ధాల‌కు ఒక కొత్త ఆలోచ‌నతో కూడిన‌ రాజ‌కీయ విధానం వ‌స్తుంది. దానిని దృష్టిలో పెట్టుకుని నాయ‌కులు మార‌క‌పోతే వాళ్లే న‌ష్ట‌పోతారు. ఒకసారి నాయ‌క‌త్వం మార‌డం ప్రారంభం అయితే వ‌ర‌ద‌లా మారిపోతుంది. మార్పు అనే ల‌క్ష్యం త‌ప్ప నాకు ఓట‌మి భ‌యాలు లేవు. నీరు ప‌ల్లం వైపే వ‌స్తుంది. ఓట్లు ఆశ‌యం ఉన్న వైపే వ‌స్తాయి.  ప‌నిచేయ‌కుండా ప్ర‌భుత్వాన్ని స్థాపిద్దాం, నాయ‌కులుగా ఎదుగుదాం అంటే జ‌ర‌గ‌దు. నాయ‌క‌త్వానికి ముఖ్యంగా కావాల్సింది.

సామ‌ర‌స్య‌పూర్వ‌క ధోర‌ణి. జ‌గ్గంపేట, పెద్దాపురం స‌భ‌ల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి బాగా ఖ‌ర్చు చేశారు.. కాద‌న‌డం లేదు. కానీ అంత పెద్ద ఫ్లెక్సీలు అడ్డంగా ఉండ‌టం వ‌ల్ల అభిమానులు, కార్య‌క‌ర్త‌లు న‌న్ను చూడ‌లేక‌పోతున్నారు. వాళ్లను చూడ‌నివ్వండి. ప్ర‌జాస్వామ్యం అంటే తెల్ల‌బ‌ట్ట‌లు వేసుకుని అంద‌రిని ప‌ల‌క‌రించ‌డం కాదు.  అవ‌స‌ర‌మైన చోట‌ త‌ట్ట‌పార ప‌ట్టుకుని రంగంలోకి దిగాలి. మ‌నం పెద్ద కులం అని చెప్పుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాం కానీ మ‌నం ప‌డుకుండిపోయాక మ‌నం ప‌డేసే చెత్త‌ను రాత్రులు తొల‌గిస్తూ ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుతున్నారు కాబ‌ట్టే రెల్లి కులాన్ని స్వీక‌రించా.  రాజ‌కీయాల్లో పేరుకుపోయిన చెత్త‌ను తొల‌గించ‌డానికి మ‌నం అంద‌రం కూడా రెల్లి కులాన్ని స్వీక‌రించాలి.

జ‌న‌సైనికులు ప‌ట్ల పార్టీలో పైస్థాయి నాయ‌కులు అంద‌రూ నిబ‌ద్ధ‌త‌గా ఉన్నాం. మ‌ధ్య‌లో ఉండి అనుసంధానం చేయాల్సిన నాయ‌కులు ఎంత బ‌ల‌ప‌డ‌తారు అనేది వారి విలువ‌లు, సమర్థత బ‌ట్టి ఉంటుంది. పార్టీలో నాయ‌కులు లేర‌ని బేలప‌డిపోకండి. ఫ్రెంచ్, ఈజిప్ట్ విప్ల‌వాల‌ను న‌డిపింది చిన్న చిన్న గ్రూపులే అని గుర్తుంచుకోండి. నేను చిత్త‌శుద్దిగా ఉన్నా.. మీరు చిత్త‌శుద్ధిగా ఉన్నారు.. మ‌న మ‌ధ్య‌లో ఎవ‌రున్నా మారాల్సిందే’ అని చెప్పారు.మా పోరాటాన్ని సినిమాతో పోలుస్తారా: లోకేశ్

Updated By ManamSat, 11/03/2018 - 11:57

Nara Lokeshఅమరావతి: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై విమర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేస్తే.. దాన్ని ఫ్లాప్‌షో అనడం బాధాకరమని అన్నారు. ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో చేస్తున్న పోరాటాన్ని సినిమాతో పోల్చడం సరికాదని లోకేశ్ పేర్కొన్నారు. కాగా టీడీపీ, కాంగ్రెస్ కలవడాన్ని విమర్శించిన పవన్.. అది ఒక ట్రైలర్ లాంటిది మాత్రమేనని, ఆ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.కరవుపై కలసి పోరాడుదాం

Updated By ManamFri, 11/02/2018 - 00:25
 • జనసేన నేత నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో దుర్భర పరిస్థితుల్లో రైతులు

 • రాష్ట్రవ్యాప్త ఉద్యమం అత్యవసరం.. సీపీఐ, సీపీఎం నేతలు రావుకృష్ణ, మధు

imageవిజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న కరవుపై ప్రభుత్వం తక్షణం స్పందించేలా చేపట్టనున్న ఆందోళనలకి కమ్యూనిస్టులతో జనసేన పార్టీ కలసి వస్తుందని జనసేన నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఆదేశాలతో  కరవు పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత సంబంధించిన రోడ్ మ్యాప్‌కి రూపకల్పన చేద్దామని ఆయన తెలిపారు. గురువారం విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్రకార్యాలయంలో సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీ నాయకులు సమావేశమయ్యారు.

భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. రాయలసీమ ప్రాంతంలో నెలకొన్న కరవు పరిస్థితులు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తిత్లీ తుపాను కారణంగా సంభవించిన నష్టంపై చర్చించారు. ఈ సందర్భంగా తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో  పవన్‌కళ్యాణ్ జరిపిన పర్యటన వివరాలను మనోహర్ కమ్యూనిస్టు పార్టీల నేతలకు వివరించారు. శుక్రవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో అధినేతపవన్‌కళ్యాణ్ పోరాట యాత్ర మొదలవుతుందని తెలిపారు. అనంతరం రాయలసీమలో పర్యటిస్తారని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు జనసేన పార్టీ తరుపున తక్షణ సాయంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, మందులు, కొవ్వొత్తులు, ఆహార పదార్థాలు పంపిణీ చేసినట్టు మనోహర్ తెలిపారు.

రాయలసీమలో నెలకొన్న కరవు పరిస్థితులని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రావుకృష్ణ వివరించారు. కరవు తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీరందుతుందన్న ఆశతో ఉన్న సీమ ప్రజలు, అది అందకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారని వెల్లడించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నెలకొన్న కరవు పరిస్థితులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వివరించారు. రెండు జిల్లాలు ఎన్నడూ లేని విధంగా కరవు కోరల్లో చిక్కుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలోలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో దళితులకి తీవ్ర అన్యాయం జరుగుతోందని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో జనసేన పార్టీ తరపున పార్టీ రాజకీయ వ్యవహారాల కన్వీనర్ మాదాసు గంగాధరం, రాజకీయ కార్యదర్శి  పి.హరిప్రసాద్, రాజు రవితేజ, సీపీఐ నాయకులు ఓబులేసు,హరనాథ్‌రెడ్డి, సీపీఎం నుంచి జె.శ్రీనివాస్, వైవీరావు పాల్గొన్నారు. 

జనసేన పార్టీలో చేరిన గుంటూరు నేతలు
గుంటూరు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు గురువారం జనసేన పార్టీలో చేరారు. గురువారం విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన పుట్టు లక్ష్మీస్వరాజ్యం, రమేష్, కళ్యాణ్, షేక్ సయ్యద్ తదితరులు జనసేన నేత నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. అందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మనోహర్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. జనసేనకు పవన్ తల్లి విరాళం

Updated By ManamTue, 10/30/2018 - 17:00
Pawan Kalyan

హైదరబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆయన మాతృమూర్తి అంజనా దేవీ కలిశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి తన తరఫున విరాళాన్ని ఇచ్చారు అంజనా దేవి. ఈ నేపథ్యంలో తన తల్లి పాదాలను మొక్కిన పవన్, ఆమె దగ్గర నుంచి ఆశీస్సులను తీసుకున్నారు. అనంతరం తన తల్లితో కాసేపు ముచ్చటించిన పవన్.. దగ్గరుండి ఆమెను ఇంటికి పంపారు.జగన్‌పై దాడి అమానుషం: పవన్

Updated By ManamThu, 10/25/2018 - 15:27
Pawan kalyan condemns attacks on jagan mohan reddy

హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఆయనపై జరిగిన హత్యాయత్నం అమానుషమని అన్నారు.‘ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగరాదని జనసేన విశ్వసిస్తుంది. ఈ హత్యాయత్నాన్ని  ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. 

ప్రతిపక్ష నేతపై జరిగిన ఈ దాడిని తీవ్రమైనదిగా జనసేన భావిస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. గాయం నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి కుట్రదారులను శిక్షించాలి.’ అని జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

Related News