sorry to people

సారీ.. ఓ సారి!

Updated By ManamSun, 09/09/2018 - 00:16

Sorryఅది పుణె నగరం.. కొన్ని రోజుల క్రితం రాత్రికి రాత్రే ఒక్కసారిగా నగరమంతా ‘శివ్‌డే.. అయామ్ సారీ’ అన్న హోర్డింగులు వెలిశాయి. ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో ఎవరికీ అర్థం కాలేదు. భారీ హోర్డింగులు, వినైల్ పోస్టర్లు, లాలీపాప్‌లు, కటౌట్లు, బ్యానర్లు... ఇలా ప్రతిచోటా తెల్లటి బోర్డు, దానిమీద నల్లటి అక్షరాలతో ‘శివ్‌డే.. అయామ్ సారీ’! విషయం ఏమిటంటే పుణె నగరానికి చెందిన ఓ ఆగర్భ శ్రీమంతుడి కొడుకు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తిట్టుకునేవరకు వెళ్లింది. తప్పు తనదే అని తెలుసుకున్న ఆ కుర్రాడు.. తన ప్రేయసికి సారీ చెప్పాలనుకున్నాడు. ఆమె ఫోన్ ఎత్తితే ఒట్టు. ఏం చేయాలని ఓ స్నేహితుడి సాయం అడిగితే.. అతడీ సలహా చెప్పాడట! అంతే, పుణె నగర వ్యాప్తంగా దాదాపు 300కు పైగా హోర్డింగులు, పోస్టర్లు పెట్టించేశాడు. రోడ్డు మీద వెళ్లేవాళ్లందరూ ఇవి చూస్తూ ఎందుకా అని ఆశ్చర్యపోయారు. అయితే దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవుతోందని గుర్తించిన పోలీసులు.. కొన్ని గంటల్లోనే ఆ యువకుడిని పట్టుకుని న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. ఇక విదేశాల్లో అయితే తాము సారీ చెప్పాలనుకున్న వారు తిరిగే వీధులగుండా పెద్దఎత్తున సారీ ఉన్న కటౌట్లు కట్టి కడుపుబ్బ నవ్వించి, మళ్లీ మచ్చిక చేసుకోవడం ట్రెండ్‌గా మారింది. ఎప్పటికప్పుడు ఈ ఆకతాయిలను పోలీసులు హెచ్చరిస్తున్నా ఇది ఓ కల్ట్‌గా మారిపోయింది. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే? పతనం అంచున ఉన్న సంబంధాలను పునరుద్ధరించుకోవలాంటే? వీటన్నింటికీ బ్రహ్మాస్త్రంలా పనిచేసే ఏకైక ఆయుధం రెండు అక్షరాల పదం ‘సారీ’.  అవతలి వాళ్లను క్షమించాలని కోరాలంటే.. విశాల హృదయం ఉండాలి. చేసిన తప్పు ఒప్పుకొనే ధైర్యం కావాలి. ఇవి రెండూ ఉన్నప్పుడు మన నోటివెంట మనస్ఫూర్తిగా వెలువడే ‘సారీ’తో మళ్లీ సత్సంబంధాలు కొనసాగుతాయనే తారకమంత్రం జీవితకాలం గుర్తుంచుకుంటే చాలు. 

మొహమాటం వీడి..
సారీ చెప్పే సందర్భాలు మన  నిత్యజీవితంలో చాలా ఎదురవుతుంటాయి. బంధాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి, తమ తప్పును తెలుసుకుని సరిదిద్దుకునేందుకు అహాన్ని పక్కనపెడితే చాలు. నోటివెంట ఆయాచితంగా క్షమించమనే పదం వస్తుంది. స్నేహ బంధమైనా, ప్రేమ బంధమైనా, రక్త సంబంధమైనా వీగిపోకూడదంటే ఓవరాలింగ్ చేసేలా సహకరించే ఈ సారీకున్న బలం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు నలుగురి ఎదుట సారీచెబితే దాదాపు అన్నీ సర్దుకునేవి. కానీ ఇప్పుడు కాలం మారింది.. ఆధునిక నాగరికత పేరుతో ప్రతి సందర్భానికి గ్రీటింగులు, గిఫ్టులు వచ్చేశాయి. ఈ కోవలోకి సారీ కూడా వచ్చి చేరింది.

సారీ ఇలా కూడా!
వ్యక్తిగతంగా కలిసి సారీ చెప్పేవారు కొందరైతే, కాల్ చేసి చెప్పేవారు మరికొందరు.. సెల్‌ఫోన్‌లో టెక్ట్స్ మెసేజ్, వాయిస్ మెసేజ్, వీడియో మెసేజెస్‌తో సారీ చెప్పేవారు చాలామంది ఉన్నారు. కానీ ఓ గ్రీటింగ్ కార్డ్, గిఫ్ట్ పంపి సారీ చెప్పడం లేటెస్ట్ కల్చర్‌గా మారింది. మనవల్ల బాధపడ్డ వారి అభిరుచికి తగిన వస్తువును ఎంపిక చేసుకుని వారికి సున్నితంగా సారీ చెప్పడం కొత్త సంస్కారం అన్నమాట. చెప్పుకునేందుకు భలేగా ఉన్నా, దీనికి ఖర్చుమాత్రం తడిసి మోపెడవుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్‌లో ఇబ్బడిముబ్బడిగా ‘అపాలజీ గిఫ్టు’లు వచ్చిచేరుతున్నాయి. ఇంతకీ ఇందులో ఏముంటాయంటే.. ఖరీదైన పెన్ను మొదలు డైమండ్ పెండెంట్ వరకూ అపాలజీ గిఫ్టులుగా చలామణి అయ్యే వస్తువులుంటాయి. కాఫీ మగ్గులు, బ్రాస్లెట్లు, మ్యూజిక్ డీవీడీలు, గిఫ్టు కూపన్లు, వెకేషన్ వోచర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఆకర్షణీయమైన బహుమతులు ఉన్నాయి. ఇవి బడ్జెట్‌లో కూడా దొరికే వెసులుబాటు ఉంది.

మనసు ప్రశాంతం
చేసిన తప్పును నిర్భయంగా ఒప్పుకొని క్షమించమంటే మనసు చాలా తేలికై, ప్రశాంతంగా అనిపిస్తుంది. బీపీ తగ్గి, హ్యాపీగా, హుషారుగా, షరా మామూలుగా ఉండేలా చేసే అతీతశక్తి ఈ సారీకి ఉంది. కానీ సారీ చెప్పాల్సిన పనులకు దూరంగా ఉంటే మరీ మంచింది. ‘టు ఎర్ ఈ హ్యూమన్’ కనుక మానవులు తప్పులు చేయక మానరు, చేసిన తప్పులు ఎంచి, లెక్కించి, సారీ చెప్పక తప్పదు. చేసిన తప్పు అంగీకరించి, క్ష మాపణలు చెప్పలేకపోయారో జరగాల్సిన నష్టమంతా జరిగి, కొంప కొల్లేరవుతుంది.

Sorryక్రికెట్‌కు వార్నర్ గుడ్‌ బై

Updated By ManamSun, 04/01/2018 - 02:12
  • వార్నర్ సంచలన నిర్ణయం.. 

  • మీడియా ముందు కన్నీరు మున్నీరు

warnerసిడ్నీ: క్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాది  పాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్  సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఆస్ట్రేలియా తరఫున క్రికెట్  ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. శనివారం మరోసారి మీడియా ముందుకు వచ్చిన వార్నర్ తన చేసిన తప్పునకు  శిక్షగా ఈ నిర్ణయం  తీసుకున్నట్టు కన్నీళ్లతో ప్రకటించాడు. ‘నా ప్రవర్తన సరిగా లేదు. నేను తప్పు చేశాను. అందుకు పరిహారంగా ఇకపై ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగాలనుకోవడం లేదు. ఇప్పటికే  క్రికెట్ ఆస్ట్రేలియాకు నా రాజీనామా లేఖను అందజేశాను. నా కుటుంబంతో చర్చించి పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకునే దిశగా కూడా  ఆలోచిస్తున్నాను. నా ప్రవర్తనను సరి చేసుకునేందుకు నిపుణుల  సహాయం తీసుకుంటానని మీడియా సమావేశంలో వార్నర్ ప్రకటించాడు.బాల్ టాంపరింగ్ వివాదం అనంతరం స్టీవ్‌స్మిత్‌తో ఏమైనా విబేధాలు వచ్చాయా? అన్న ప్రశ్నకు గాను ‘మేమిద్దం సహచరులం. ఇద్దరం కలిసే పెరిగాం. ఎన్నో ఏళ్లగా క్రికెట్ ఆడుతున్నాం. ఏడాది పాటు నిషేధంతో క్రికెట్ దూరమవ్వడం అనేది ఎంతో బాధను కలిగిస్తోంది. నాతో పాటు స్టీవ్ స్మిత్, కామెరూన్‌కు కూడా’ అని వార్నర్ భావోద్వేగానికి గురయ్యాడు.

అసలు సూత్రధారి ఎవరు.....
 మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు వార్నర్ మౌనంగా ఉండటంతో ఈ ఎపిసోడ్ మొత్తానికి ‘అసలు సూత్రధారి’ ఎవరన్న దానిపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది.  అసలు బాల్ ట్యాంపరింగ్ ఆలోచన ఎవరిది? సాండ్ పేపర్‌ను తెచ్చిందెవరు? ప్రధాన సూత్రధారి ఎవరు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? గతంలో ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారా? ట్యాంపరింగ్ పాల్పడటాకి గల కారణాలు ఏంటి?’ ఇలాంటి ప్రశ్నల సమయంలో వార్నర్ సైలెంట్‌గా ఉన్నాడు. దీంతో ఓ జర్నలిస్ట్ ‘మీరు సమాధానాలు చెప్పనప్పుడు అసలు ఈ సమావేశం ఎందుకు?’ అని గట్టిగా నిలదీశాడు. అయినా అదేం పట్టన్నట్లు తాను తప్పు చేశాను అంటూ పదే పదే చెబుతూ వార్నర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

సరైన సమయంలో స్పందిస్తా.. 
ఇక మీడియా సమావేశం అనంతరం తన ట్విట్టర్‌లో వార్నర్ స్పందించాడు. ‘మీడియా సమావేశంలో సమాధానాలు ఇవ్వలేకపోయా. క్రికెట్ ఆస్ట్రేలియాకు ఓ పద్ధతి ఉంటుంది. ప్రస్తుతం సీఏ దర్యాప్తు కొనసాగుతోంది. సీఏ ఆదేశాల ప్రకారం నేను మౌనంగా ఉన్నా. అందుకే మీడియా సమావేశంలో స్పందించలేకపోయా. క్షమాపణలు.  సీఏ నుంచి క్లియరెన్స్ వచ్చాక సరైన సమయంలో, సరైన వేదికపై ఆ ప్రశ్నలకు సమాధానమిస్తా’ అని ట్వీట్లు చేశాడు.  కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించగా... బాన్‌క్రాప్ట్‌పై 9 నెలల పాటు నిషేధం విధించింది. దీంతో పాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. ఈ వివాదానికి సూత్రధారి అయిన డేవిడ్ వార్నర్ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌కు ఒకింత ఊరటనిచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ రెండేళ్ల కాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని పేర్కొంది.

వార్నర్ స్థానంలో అలెక్స్ హేల్స్
హైదరాబాద్: ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ స్థానంలో ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ అలెక్స్ హేల్స్‌ను సన్‌రైజర్స్ హైదరా బాద్ ఎంపిక చేసుకుంది. రిజిస్టర్డ్  అండ్ అవేలబుల్ ప్లేయర్ పూల్(ఆర్‌ఏపీపీ) నుంచి ఐపీఎల్ వేలం  సందర్భంగా అతని కనీస ధర రూ.కోటి వెచ్చించి సన్‌రైజర్స్  తీసుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. వార్నర్ తరహాలోనే  ఓపెనింగ్‌లో చెలరేగి ఆడటంలో హేల్స్ ఎక్స్‌పర్ట్. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ హిట్టర్ వైపే హైదరాబాద్ యాజమాన్యం మొగ్గుచూపింది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు హేల్స్  కావడం విశేషం. ఐసీసీ టీ20 టాప్-10 ర్యాంకింగ్స్ జాబితాలో ఇంగ్లీష్ ప్లేయర్ హేల్స్ కొనసాగుతున్నాడు. బాల్ టాంపరింగ్ వివాదంలో డేవిడ్ వార్నర్‌పై నిషేధం పడటంతో అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. హేల్స్ కన్నా ముందు శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరాను తీసుకోవాలని సన్‌రైజర్స్ భావించింది. అంతర్జాతీయ క్రికెట్లో 52 టీ20లు ఆడిన హేల్స్ 1456 పరుగులు చేశాడు.  ఇందులో ఒక సెంచరీ, 7 అర్ధశతకాలున్నాయి. టి20ల్లో హేల్స్ అత్యధిక స్కోరు 116 పరుగులు.

‘క్రికెట్ అభిమానులకు నన్ను ప్రోత్సహించిన వారిని ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నాను. ఓ తప్పు కారణంగా జట్టులో స్థానం కోల్పోయాను. నా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. నాపై మీ గౌరవాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాను.

Related News