gabbar singh

స‌మ్మర్‌లో మెగా (బ్ర‌ద‌ర్) సెంటిమెంట్‌

Updated By ManamMon, 04/30/2018 - 22:29

megaబాక్సాఫీస్ స‌క్సెస్ ఫార్ములాల్లో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ కూడా ఒక‌టి. అన్న‌ద‌మ్ముల అనుబంధం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాల్లో భావోద్వేగాలు స‌రిగ్గా పండితే చాలు.. ఆ సినిమా క‌చ్చితంగా విజ‌య‌తీరాల‌కు చేరుతుంది. ఈ విష‌యాన్ని మ‌రోసారి నిరూపించిన చిత్రం 'రంగ‌స్థ‌లం'. త‌ను ప్రాణంగా ప్రేమించే అన్నయ్య త‌న క‌ళ్ళ‌ముందే చ‌నిపోతే.. అత‌ని హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకోవ‌డంతో పాటు త‌న‌ ఆశయాన్ని ఓ స్త్రీతో (రంగ‌మ్మ‌త్త‌) నెర‌వేర్చిన ఓ తమ్ముడి కథే ఈ చిత్రం. రామ్‌చ‌ర‌ణ్‌లోని న‌టుడ్ని కొత్త కోణంలో ఆవిష్క‌రించిన ఈ సినిమా.. ఈ వేస‌వి ఆరంభంలో విడుద‌లై అత‌ని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఒక్క‌ చ‌ర‌ణ్ అనే కాదు.. మెగా ఫ్యామిలీకి చెందిన అగ్ర క‌థానాయ‌కులంద‌రికీ 'బ్ర‌ద‌ర్ సెంటిమెంట్' ఉన్న సినిమాలు భ‌లేగా క‌లిసొచ్చాయి. ముఖ్యంగా ప‌రాజ‌యాల్లో ఉన్న‌ప్పుడో లేదంటే స‌రైన విజ‌యం కోసం ఎదురుచూస్తున్న‌ప్పుడో మెగా ఫ్యామిలీకి ఈ బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ సినిమాలు అచ్చొచ్చాయి. మ‌రో విష‌య‌మేమిటంటే.. వేస‌విని టార్గెట్‌గా చేసుకుని వ‌చ్చిన ఈ త‌ర‌హా చిత్రాలైతే.. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. కాస్త ఆ వివ‌రాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఏమిటో నిరూపించిన చిత్రాల్లో ‘గ్యాంగ్ లీడర్’ది ప్ర‌త్యేక స్థానం. బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో.. అన్నయ్యల క్షేమం కోసం ఆరాటపడే తమ్ముడి పాత్ర‌లో చిరు న‌ట‌న అభిమానుల్ని ఫిదా చేసింది. 'రాజా విక్ర‌మార్క‌', 'స్టూవ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్' వంటి వ‌రుస ప‌రాజ‌యాల త‌రువాత.. ఈ సినిమా విజ‌యం చిరుకి నూత‌న ఉత్తేజాన్నిచ్చింది. 1991 వేస‌వికి విడుద‌లైన ఈ సినిమా ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి ముందు, త‌రువాత కూడా కొన్ని బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ ఉన్న చిత్రాల్లో (‘ఊరికిచ్చిన మాట’, ‘ఆలయశిఖరం’, ‘మగధీరుడు’, ‘అన్నయ్య’) చిరు సంద‌డి చేశారు.

ఇక పవన్ కల్యాణ్ విష‌యానికి వ‌స్తే.. 'పులి', 'తీన్ మార్‌', 'పంజా' వంటి మూడు ప‌రాజ‌యాల త‌రువాత విజ‌యాన్ని అందించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. చెడు దారిలో వెళ్తున్న త‌మ్ముడ్ని మార్చి.. ప్రయోజకుడిని చేసే అన్న‌గా ఇందులో సంద‌డి చేశారు ప‌వ‌న్‌. 2012 వేస‌వికి విడుద‌లైన ఈ సినిమా.. ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కంటే ముందు.. ‘తమ్ముడు’ (1999) చిత్రం కోసం అన్న‌య్య ల‌క్ష్యాన్ని నెర‌వేర్చే త‌మ్ముడిగా సంద‌డి చేసి విజ‌యాన్ని అందుకున్నారు ప‌వ‌న్‌.

మ‌రో మెగా హీరో అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే.. అత‌ని కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ హిట్‌గా నిలిచిన ‘రేసుగుర్రం’ కూడా బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో కూడిన చిత్ర‌మే. 'ఇద్ద‌ర‌మ్మాయిల‌తో' వంటి బిలో యావ‌రేజ్‌ త‌రువాత బ‌న్నీ హీరోగా న‌టించిన ఈ సినిమా.. 2014 వేస‌వికి విడుద‌లై ఆ ఏడాదిలో భారీ విజ‌యం సాధించింది.

మొత్తానికి.. చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌.. ఇలా మెగా ఫ్యామిలీలోని అగ్ర క‌థానాయ‌కులంద‌రికి 'బ్ర‌ద‌ర్ - స‌మ్మ‌ర్ సెంటిమెంట్' బాగా వ‌ర్క‌వుట్ అయింద‌నే చెప్పాలి.                  - మ‌ల్లిక్ పైడిప‌వ‌న్ రెస్పెక్ట్‌ .. ప్రభాస్ సింప్లిసిటీ న‌చ్చాయి

Updated By ManamSun, 04/08/2018 - 19:04

i.andrewసినిమా అనేది దృశ్య ప్రధాన మాధ్యమం. అలాంటి దృశ్యాలను ఒడిసిపట్టేది కెమెరాలోనే. అందుకే.. సినిమాకి సంబంధించినంత వరకు కెమెరామెన్‌లకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. కేవలం దృశ్యాన్ని కంటికింపుగా ఆవిష్కరించడం మాత్రమే కాదు.. దర్శకుడి ఆలోచనలను యథాతథంగా తెరపైకి తీసుకురావడం కూడా ఛాయాగ్రాహకుడి బాధ్యతే. ఈ బాధ్యతలను తనదైన శైలిలోనే నిర్వహిస్తూ.. ప్రతిభావంతుడైన ఛాయాగ్రాహకుడిగా దూసుకుపోతున్నారు 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్‌', 'కందిరీగ‌', 'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే', 'మ‌సాలా' చిత్రాల‌ సినిమాటోగ్రాఫర్ ఐ.ఆండ్రూ. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మొదలుపెట్టి సినిమాటోగ్రాఫర్ అయ్యేవరకు.. ఆండ్రూ జీవితంలోని ప్రతి క్షణం కెమెరా వశమే. కన్నడనాట పుట్టిపెరిగి.. తమిళనాట సినిమాటోగ్రఫీకి సంబంధించిన మెళకువలు నేర్చుకుని.. తెలుగునాట ఛాయాగ్రాహకుడిగా స్థిరపడిన ఆండ్రూ.. తెలుగు సినిమాతో తన ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతుందంటున్నారు. అంతేగాకుండా.. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ అయిన ఎ.కరుణాకరన్‌తో కలిసి పదేళ్ళుగా ప్రయాణం చేస్తున్నా.. ప్రేమకథలు మాత్రం తన కప్ ఆఫ్ టీ కాదంటున్నారు ఆండ్రూ. ఒకవైపు కరుణాకరన్, సాయిధరమ్ తేజ్ సినిమాకి సంబంధించిన చిత్రీకరణతో బిజీగా ఉంటూనే.. మరోవైపు షాట్ గ్యాప్‌లో ‘మనం’తో ప్రత్యేకంగా సంభాషించారు. ఆండ్రూ అంతరంగాలకి అక్షర రూపం ఇది..

హాయ్ ఆండ్రూ గారూ.. ఎలా ఉన్నారు?

బావున్నానండీ..

ఛాయాగ్రాహకుడిగా మీరేంటో మాకు తెలుసు.. అంతకుముందు మీకు సంబంధించిన విషయాలను చెబుతారా?

నేను పుట్టి పెరిగింది అంతా బెంగళూరులోనే. నాన్న తమిళయన్. అమ్మ కన్నడిగ. వాళ్ళది లవ్ మ్యారేజ్. నాన్న ఇరుదయరాజ్.. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్. చిన్నప్పట్నుంచీ ఆయన యాక్టివిటీస్ చూసి చూసి నాక్కూడా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఆసక్తి పెరిగింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.

i.andrew1995లో జాతీయ స్థాయిలో బెస్ట్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా అవార్డు తీసుకున్నాను. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ, బర్డ్ ఫొటోగ్రఫీకి సంబంధించి.. హాంగ్‌కాంగ్, బెల్జియం, ఆస్ట్రేలియా.. ఇలా పలు దేశాల తరపున అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నాను.

వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో మంచి స్థాయికి చేరుకున్న మీకు.. సినిమాల మీద ఆసక్తి ఎలా మళ్ళింది?

సినిమాల మీద ఆసక్తి.. మధ్యలో రాలేదండి. చిన్నప్పట్నుంచీ నాకు సినిమాలంటే పిచ్చి. దీనికి కూడా నాన్నగారే కారణం. ఆయన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ మాత్రమే కాదు.. మంచి డ్రామా ఆర్టిస్ట్ కూడా. ఆయన నాటకాలు చూస్తూ పెరగడం వల్ల సినిమాలపై కూడా దృష్టిపడింది. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో ఓ స్థాయికి చేరుకున్నప్పటికీ.. అందులో రిస్క్ ఎక్కువ. అందుకే.. సినిమాలంటే చిన్నప్పట్నుంచి ఉన్న ఇష్టం కారణంగా.. ఈ వైపుగా అడుగులు వేయాలనుకున్నాను. దానికితోడు తమిళ సినిమాలు ఎక్కువగా చూస్తుండడం వల్ల.. పి.సి.శ్రీరామ్, సంతోష్ శివన్, రాజీవ్ మీనన్ వంటి హేమాహేమీల కెమెరా పనితనం నా మీద ఎంతో ప్రభావం చూపించింది. వారిలో ఏ ఒక్కరి దగ్గరో సహాయకుడిగా చేసే అవకాశం రాకపోదా.. అనుకుంటూ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫ్స్‌తో చెన్నైకి చేరుకున్నాను. ఆ ప్రాసెస్‌లో 3, 4 నెలల తరువాత మొదట పి.సి.శ్రీరామ్ గారిని కలుసుకునే అవకాశం దక్కింది. నా పనితనం నచ్చి.. అసిస్టెంట్‌గా ఛాన్స్ ఇచ్చారు. ‘కాదల‌ర్ దిన‌మ్‌’ (ప్రేమ దేశం), ‘అలైపాయుదే’ (సఖి), ‘ముగవరి’, ‘ముగమ్’ వంటి చిత్రాలతో పాటు.. దాదాపు 250 యాడ్స్ కోసం శ్రీరామ్ గారి దగ్గర 5 ఏళ్ళ పాటు సహాయకుడిగా పనిచేశాను. ఆ తరువాత.. పూర్తిస్థాయి ఛాయాగ్రాహకుడిగా చేయాలనుకుంటున్న విషయం ఆయనతో చెప్పాను. ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించారు.

i.andrewఅయితే.. తొలి అడుగుల్లో ఓ ఆంగ్ల చిత్రం కోసం సెకండ్ యూనిట్ కెమెరామేన్‌గా పనిచేశా. భారతదేశంలో చిత్రీకరించిన ఆ సినిమానే.. ‘బోక్షు - ది మిత్’. అందులో ఇర్ఫాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటించారు. దానికంటే ముందు.. ‘లగాన్’ ఆర్టిస్ట్‌లతో (ఆమిర్ ఖాన్ తప్ప.. గ్రేసీసింగ్‌తో సహా పలువురు నటీనటులు) రూపొందించిన ఓ హిందీ చిత్రానికి పనిచేశా. హాలీవుడ్ స్థాయిలో రూపొందిన ఈ సినిమా.. కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఈ గ్యాప్‌లో పలు యాడ్స్ చేశాను. ఇక 2008లో వచ్చిన తమిళ చిత్రం ‘సక్కరకట్టి’.. ఛాయాగ్రాహకుడిగా నా మొదటి సినిమా. ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించిన ఈ చిత్రం ద్వారా భాగ్యరాజ్ తనయుడు శంతను భాగ్యరాజ్ హీరోగా పరిచయమయ్యారు. అలాగే కలైపులి ఎస్‌. థాను కుమారుడు కలా ప్రభు దర్శకత్వం వహించిన తొలి చిత్రమది. ఈ సినిమా రిలీజ్ కాకముందే.. దర్శకుడు ఎ.కరుణాకరన్‌తో పరిచయమయ్యింది. అదే.. నా కెరీర్‌ను కీలక మలుపు తిప్పిన సంఘటనగా చెప్పుకోవచ్చు. అలా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ కోసం తొలిసారిగా ఆయనతో కలిసి పనిచేశాను. ఆ తరువాత ‘డార్లింగ్’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘చిన్నదానా నీ కోసం’ చేశాను. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌తో చేస్తున్న సినిమా వరకు ఆ అనుబంధం కొనసాగుతోంది.

కరుణాకరన్ ఇప్పటివరకు పది సినిమాలు చేస్తే.. వాటిలో సగభాగం మీ కాంబినేషన్‌లో రూపొందినవే. అలాంటి మీ మధ్య ఎప్పుడైనా క్రియేటివ్ క్లాషెస్ వచ్చిన సందర్భాలున్నాయా?

i.andrewలేవండీ. ఆయనకు ఏం కావాలో నాకు బాగా తెలుసు. నా నుంచి ఎలాంటి అవుట్‌పుట్ రాబట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు. పని విషయంలో తను చాలా క్లారిటీతో ఉంటారు.. కాబట్టి నాకు ఏ రోజూ సమస్య రాలేదు. నాకు పని విషయంలో ఫ్రీడమ్ ఇస్తే.. ఐ కెన్ క్రియేట్ మ్యాజిక్. ఆ విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకే మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. నాకు ఎక్కడైనా అవుట్‌పుట్ సరిగ్గా రావడం లేదనిపిస్తే.. ఆ విషయాన్ని ఆయనతో చెప్పేస్తాను. ఇలా కాకుండా.. ఇలా చేస్తే బాగుంటుందని చెబుతాను. అది ఆయనకు కరెక్ట్ అనిపిస్తే.. మరో మాట చెప్పరు.

నెగెటివ్ ఫిల్మ్‌తో మీ ప్రయాణం మొదలైంది. ఇప్పుడంతా డిజిటల్ ఫిల్మ్ యుగం. ఈ రెండింటిలో మీకు ఏది కంఫర్ట్?

నెగెటివ్ ఫిల్మ్ హోమ్ ఫుడ్ అయితే.. డిజిటల్ ఫిల్మ్ ఫాస్ట్ ఫుడ్ లాంటింది. అయితే నెగెటివ్ ఫిల్మ్ విషయంలో అన్నీ కరెక్ట్‌గా చేస్తేనే.. అవుట్‌పుట్ కరెక్ట్‌గా వస్తుంది. అదే డిజిటల్ ఫిల్మ్‌తో అయితే పని చాలా సులభం. అందుకే.. (నెగెటివ్) ఫిల్మ్ టైమ్‌లో పదిమంది కెమెరామెన్స్ ఉంటే.. ఇప్పుడు 1000 మంది కెమెరామెన్స్ కనిపిస్తుంటారు. డిజిటల్‌తో ఎవరైనా చేయొచ్చు. అయితే క్వాలిటీ వర్క్ రావాలంటే.. ఫిల్మ్ గురించి అవగాహన ఉంటేనే సాధ్యం. ఫిల్మ్‌లో రీడింగ్, కీ లైట్.. ఇలా ప్రతిది జాగ్రత్తగా చూసుకుంటేనే మంచి అవుట్‌పుట్ వస్తుంది. ఫిల్మ్ క్వాలిటీతో సినిమా రావాలంటే.. మీకు ఆ వైపు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. డిజిటల్ వర్క్ ఈజీ కావడంతో.. ఇప్పుడు చాలా మంది కెమెరామెన్స్ వస్తున్నారు.. పోతున్నారు. అయితే.. ఫిల్మ్‌లో ఎవరైతే కెరీర్ స్టార్ట్ చేశారో.. వాళ్ళే ఇప్పటికీ లాంగ్‌ర‌న్‌తో ట్రావెల్ చేస్తున్నారు. పి.సి.శ్రీరామ్, సంతోష్ శివన్, రవి కె.చంద్రన్, రాజీవ్ మీనన్, ఛోటా కె.నాయుడు, సమీర్, నేను.. ఇలా ఎంతో మందిమి ఎక్కువ కాలం ట్రావెల్ అవుతున్నామంటే.. అది ఫిల్మ్ మీద మాకున్న అవగాహన కారణంగానే చెప్పుకోవాలి. అందుకే.. కొత్తగా వచ్చే వారిలో ఇలా లాంగ్ రన్ ట్రావెల్ చేసే అవకాశం ఉండట్లేదు.

అంతేకాదు.. ఫిల్మ్ టైమ్‌లో దర్శకులుగా అడుగులు పెట్టిన రాజమౌళి, పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్, ఎ.కరుణాకరన్ లాంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ కాలం డైరెక్టర్స్‌గా ట్రావెల్ చేస్తున్నారు. రాజమౌళిగారి విషయం తీసుకుంటే... ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవడం వల్ల తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్ళగలిగారాయన.

టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. అప్‌డేట్ అవడంలో మీరు ఎలా ఉంటారు?

i.andrewనిజమే.. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ప్రతి మూడు నెలలకి ఓ కొత్త మార్పు చోటుచేసుకుంటూనే ఉంది. అందుకే.. మనం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయితేనే.. డిఫరెంట్ సినిమాలు చేయగలము. అప్‌డేట్ కాకపోతే మాత్రం చాలా కష్టం. నా వరకు.. నేను ఎక్కువగా ఫారిన్ సినిమాలు బాగా చూస్తుంటాను. వాటి నుంచి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంటాను. అవకాశం దొరికితే.. ప్రతి రోజూ సినిమాలు చూస్తుంటాను. అది నాకు అప్‌డేట్ అవడానికి బాగా దోహదపడుతుంటుంది.

ఇప్పుడున్న వారిలో ఎవరి వర్క్ బాగా నచ్చుతుంది?

అందరూ బాగా చేస్తున్నారు. అయితే మా గురువుగారు (పి.సి.శ్రీరామ్) నాకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఈ వయసులో కూడా.. ఆయన ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యే తీరు నాకు బాగా నచ్చుతుంది. హి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియా. అలాగే ‘పద్మావత్’ సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఛటర్జీ గారి వర్క్ కూడా బాగా నచ్చుతుంది. రత్నవేలు, సెంథిల్.. ఇలా అందరూ బాగా చేస్తున్నారండి.

వర్క్ పరంగా మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన సినిమా?

‘గుండెజారి గల్లంతయ్యిందే’. ఎందుకంటే.. ఆ సినిమాని కేవలం 48 - 50 రోజుల్లో పూర్తిచేయాల్సివచ్చింది. తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేయడం అనేది ఎప్పుడూ కష్టమైన విషయమే. దానికి తోడు ఆ సినిమాకి కొత్త దర్శకుడు (విజయ్‌కుమార్ కొండా). అయితే.. నా పనితనం, క్వాలిటీ తెలిసే.. ఆ టీమ్ నన్ను అప్రోచ్ అయ్యింది. స్క్రీన్‌పై కూడా ఆ క్వాలిటీకి మంచి మార్కులు పడ్డాయి.

బడ్జెట్, ఎక్స్‌పీరియన్స్.. వర్క్ పై ప్రభావం చూపిస్తుందా?

i.andrewతప్పకుండా.. రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తీసే సినిమాకి ఏం కెమెరా ఇవ్వాలో ఎలాంటి లైట్ ఇవ్వాలో.. అంతే ఇస్తారు. అదే రూ.100 కోట్ల బడ్జెట్ అంటే.. దానికి తగ్గట్టే కెమెరా, లైట్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు 5 లైట్స్ ఇస్తే అందులో ఎలా చేయాలో అలానే చేస్తా. అదే 10 లైట్స్ ఇస్తే దానికి తగ్గట్టే చేస్తా. ఎక్స్‌పీరియన్స్ విషయానికి వస్తే.. 100 లైట్స్ ఇచ్చినా ఎక్స్‌పీరియన్స్ లేకపోతే.. డీల్ చేయలేరు. ఒక లైట్ ఉన్నా.. ఎక్స్‌పీరియన్స్‌తో క్వాలిటీ అవుట్ పుట్ తీసుకురావచ్చు.

దాదాపు 20 సినిమాల ఎక్స్‌పీరియన్స్ మీది. కెమెరా వర్క్ పరంగా ఎక్స్‌పరిమెంట్స్ చేసిన సందర్భాలున్నాయా?

ఇప్పటివరకైతే ఎక్స్‌పరిమెంట్ చేయలేదు. ఆయా సినిమాలకు ఏం కావాలో.. సబ్జెక్ట్ డిమాండ్ మేరకు అదే ఇచ్చాను. ఎక్స్‌పరిమెంట‌ల్‌ మూవీ వస్తే డెఫినెట్‌గా చేస్తాను.

ఛాయాగ్రాహకులు దర్శకులుగానూ మారుతున్నారు. మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయా?

i.andrewఉన్నాయండి. నా కెరీర్‌లో ఎక్కువగా ప్రేమకథా చిత్రాలు చేసినా.. నా టార్గెట్ మాత్రం లవ్‌స్టోరీస్ కాదు. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్‌తో కమర్షియల్ మూవీస్ చేయాలని ఉంది. మరో 5,6 సినిమాలు చేశాక.. దర్శకత్వం వైపు అడుగులు వేద్దామనుకుంటున్నాను. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టాను. తప్పకుండా డైరెక్షన్ చేస్తా. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. పి.సి.శ్రీరామ్ దగ్గర పనిచేసిన వాళ్ళంతా డైరెక్టర్స్ అయిపోతుంటారండి. కె.వి.ఆనంద్, జీవా.. ఇలా ఎంతోమంది అయ్యారు. ఎందుకంటే.. ఆయన దగ్గర వర్క్ చేసే వాళ్ళు.. కెమెరా వర్క్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. డైరెక్షన్, ఆర్ట్ డైరెక్షన్.. ఇలా ప్రతి విభాగంలోనూ పని చేయాల్సి వస్తుంటుంది. అందుకే.. ఆయన స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు తప్పకుండా డైరెక్టర్స్ అవుతుంటారు. నేను అందుకు మినహాయింపు కాదు.

దర్శకుడిగా మీ మొదటి ప్రయత్నాన్ని ఏ భాషలో చేస్తారు?

తెలుగులోనే. నేను పుట్టిపెరిగింది బెంగళూరులో.. పని నేర్చుకుంది చెన్నైలో.. అయితే స్థిరపడింది మాత్రం తెలుగులోనే. నా ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడే కాదు.. చివరి వరకూ నా ప్రయాణం తెలుగు సినిమా వైపుగానే సాగుతుంది. మధ్యలో వేరే భాష సినిమాలు చేసినా.. నా దృష్ట్టంతా ఇటువైపే. కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో యశ్.. మీరు కన్నడ వాళ్ళు కదా.. ఒక సినిమా అయినా కన్నడంలో చేయండి అని అడిగితే ‘శాంతు స్ట్రయిట్ ఫార్వర్డ్’ చేశా. ఆ తరువాత అక్కడ నుంచి అవకాశాలు వచ్చినా.. అటువైపు మొగ్గు చూపలేదు. ఎందుకంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్లకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే.. దక్షిణాది నుంచే కాదు ఉత్తరాది నుంచి కూడా ఇక్కడికి మంచి మంచి టెక్నీషియన్స్ వస్తుంటారు.

తెలుగు బాగా మాట్లాడుతున్నారే..

దేశభాషలందు తెలుగు లెస్స అంటారు కదండీ. మొదట్నుంచీ ఈ భాషపై మక్కువ ఎక్కువ. దానికితోడు.. పదేళ్ళుగా ఇక్కడే ఉంటుండడం వల్ల భాష బాగానే వచ్చేసింది.

‘బాహుబలి’తో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. హాలీవుడ్ స్థాయిలో క్వాలిటీ ఉందన్నారు. మీ వరకు అలాంటి సినిమాలు రాలేదా?

‘బాహుబలి’.. తెలుగు సినిమా స్థాయిని పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమాకి సెంథిల్ ఎక్సట్రార్డినరీ వర్క్ ఇచ్చారు. ఇక నా విషయానికి వస్తే.. కెరీర్ ప్రారంభంలోనే ‘ది వైట్ ల్యాండ్’ కోసం ఆ స్థాయి వర్క్ ఇవ్వగలిగే అవకాశం దొరికింది. దురదృష్టవశాత్తు.. ఆ సినిమా రిలీజ్ కాలేదు. భవిష్యత్‌లో అలాంటి సినిమాలు వస్తే తప్పకుండా చేస్తాను.

స్వతహాగా మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం?

సైకలాజికల్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం. ‘సా’, ‘హాస్టల్’, ‘భాగమతి’.. ఇలాంటి థ్రిల్లర్స్ చేయడం అంటే.. ఓ కెమెరామెన్‌గా నాకు ఎంతో ఇష్టం. అయితే.. ఇప్పటివరకు అలాంటి అవకాశం రాలేదు. వస్తే మాత్రం తప్పకుండా చేస్తా. ఇలాంటి సబ్జెక్ట్స్‌తో.. వి కెన్ మేక్‌ వండర్స్. అలాగే నేను కెమెరామేన్‌గా చేసిన ‘కందిరీగ’లాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు కూడా ఇష్టమే.

మీ ఫ్యామిలీ గురించి చెప్పండి?

నా సతీమణి రమ్య.. హౌస్ వైఫ్. మాది అరేంజ్డ్ మ్యారేజ్‌. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకరికి ఎనిమిదేళ్ళు. మరొకరికి ఆరేళ్ళు.

ఫ్యామిలీ, వర్క్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు?

ఇంటికెళ్ళాక సినిమా మరిచిపోతా. షూటింగ్‌లో ఉంటే.. ఇంటి నుంచి ఫోన్ వచ్చినా అటెండ్ చేయను. షాట్ గ్యాప్‌లోనే మా వాళ్ళతో మాట్లాడతాను. జాగ్రత్తగా డీల్ చేయగలిగితే.. రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చు.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్?

ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. మరో రెండు వారాల్లో డిటైల్స్ చెపుతా.

pawanపవన్.. చాలా రెస్పెక్ట్ ఇస్తారు

pawanటెక్నీషియన్స్‌కు పవన్ కల్యాణ్ చాలా ఇంపార్టెన్స్, రెస్పెక్ట్ ఇస్తారు. ‘గబ్బర్ సింగ్’ సినిమా కోసం ‘దిల్‌సే’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ పాటలకు నేను కెమెరామేన్‌గా చేశా. ఫారిన్‌లో షూట్ చేశారీ పాటలను. ఆ టైంలో నా దగ్గర జాకెట్ లేదు. ఇది గమనించి.. నాలాగే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి జాకెట్స్, బ్లాంకెట్స్ అందేలా చేశారు పవన్. ప్రతి ఒక్కర్నీ ఆయన ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ సినిమా కోసం.. తక్కువ సమయంలోనే మంచి క్వాలిటీ వర్క్ ఇవ్వడం పవన్‌కు నచ్చింది. అందుకే. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం మరోసారి అవకాశమిచ్చారు. సెకండ్ యూనిట్‌లో.. మూడు ఫారిన్ పాటలతో పాటు మరో మెలోడీ సాంగ్, ఫైట్స్, కొన్ని సీన్స్ చేశాను. ఆ తరువాత కూడా తన సినిమాకి పనిచేసే అవకాశమొచ్చింది. అయితే అప్పటికే కన్నడ సినిమాకి అడ్వాన్స్ తీసుకోవడంతో.. చేయడం కుదరలేదు.

సింప్లిసిటీ.. ప్రభాస్

i.andrewప్రభాస్‌తో ‘డార్లింగ్’ చేశాను. ఇద్దరి పుట్టినతేది ఒకటే (అక్టోబర్ 23). ఆ సినిమా షూటింగ్ టైంలోనే మా పుట్టిన రోజు వచ్చింది. టీమ్ వాళ్ళు.. ఆయనకు పెద్ద కేక్, నాకు చిన్న కేక్ అరేంజ్ చేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభాస్.. అది చూసి ‘చిన్నకేక్ ఎవరికి?’, ‘పెద్ద కేక్ ఎవరికి?’ అని అడిగారు. విషయం తెలిసి.. ‘డార్లింగ్ నువ్వు ఇక్కడికి వచ్చేయ్.. నేను అక్కడికి వస్తాను’ అని చెప్పి.. ప్లేస్ ఛేంజ్ అయ్యే వరకు ఒప్పుకోలేదు. ఆయనలో ఎప్పుడూ తానో పెద్ద స్టార్ అనే ఫీలింగ్ కనిపించలేదు. ఎప్పుడూ ‘డార్లింగ్ డార్లింగ్’ అని పిలుస్తుంటారు. అంత సింప్లిసిటీ మరెవరిలోనూ చూడలేదు.                                                                                                                                                                                                                                        -మ‌ల్లిక్ పైడిర‌వితేజ‌తో మ‌రోసారి..

Updated By ManamSun, 10/15/2017 - 12:16

'ఆంజ‌నేయులు' చిత్రంతో నిర్మాత‌గా మారారు హాస్య‌న‌టుడు బండ్ల గ‌ణేష్‌. ఆ సినిమా త‌రువాత 'తీన్ మార్‌', 'గ‌బ్బ‌ర్‌సింగ్‌', 'బాద్‌షా', 'ఇద్ద‌ర‌మ్మాయిల‌తో', 'నీ జ‌త‌గా నేనుండాలి', 'గోవిందుడు అంద‌రివాడేలే', 'టెంప‌ర్' చిత్రాల‌ను నిర్మించారాయ‌న‌. వీటిలో 'గ‌బ్బ‌ర్‌సింగ్‌', 'బాద్‌షా', 'టెంప‌ర్' చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ అయ్యాయి. కాగా, గ‌త కొంత‌కాలంగా బిజినెస్ వ్య‌వ‌హారాల‌తో సినిమాల‌కు దూర‌మైన గ‌ణేష్‌.. అతి త్వ‌ర‌లో మ‌రో సినిమాని నిర్మించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. నిర్మాత‌గా త‌న తొలి చిత్రం 'ఆంజ‌నేయులు'లో కథానాయ‌కుడిగా న‌టించిన ర‌వితేజ‌నే ఈ సినిమాలోనూ హీరోగా న‌టించ‌నున్నాడు. ఇదివ‌ర‌కు గ‌ణేష్ నిర్మాణంలో ప‌నిచేసిన ద‌ర్శ‌కుడే ఈ చిత్రానికి కూడా ద‌ర్శ‌క‌త్వం వహించ‌నున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెలువ‌డ‌తాయి.

Related News