Hopeful

ఆశాభావం

Updated By ManamWed, 04/25/2018 - 01:13

మానవీయంగా అసాధ్యమైన అంశాలు, తార్కికంగా సాధ్యమైనవిగా చిత్రీక రించే అసంబద్ధత అంతర్జాతీయ సమాజంలో ప్రబలంగా ఆవరించింది. అలాంటి వాటిలో భారత-చైనా ద్వైపాక్షిక సంబంధాలు కూడా ఒకటి. అయితే మానవీయంగా అసాధ్యమైన విషయాలను తార్కికంగా కాక, కొన్ని నిర్థిష్ట పరిస్థితుల్లో, నిర్థిష్ట సాధనాల సహకారంతో ద్వారా మాత్రమే సుసాధ్యం చేయ గలం. ఉనికిలో ఉన్న అసమాన భౌగోళిక రాజకీయార్థిక సంబంధాల పరిధి లోనే భారత-చైనా దేశాధ్యక్షుల చొరవ ద్వారా దైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలని మీడియా సహా పలువురు అమాయకంగా ఆశిస్తుండడం కద్దు. భారత్, చైనాలు ఏకమైతే అమెరికా తదితర పెట్టుబడిదారీ దేశాల ఆధి పత్యాన్ని నిలువరించవచ్చన్నది నిజమే. అయితే సాధ్యాసాధ్యాలు మాత్రం ఇరుదేశాల పాలకులపై ఆధారపడి ఉండదు. ఉదాహరణకు అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చర్చలకు సంసిద్ధత ప్రకటించగానే ఇరుదేశాల మధ్య దాదాపు ఒప్పందం కుదిరిన స్థాయిలో కొందరు అమాయకంగా ఊహాగానాలు చేస్తున్నారు. గతంలో ఆ దేశాధినేతలు చర్చలకు ఉపక్రమించిన విఫల చారిత్రక సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రతిఫలనంగా రూపుదిద్దుకున్న భౌగోళిక రాజకీయ ఆధిపత్య పోటీపై ఆధారపడిన వస్తుగత నియమాలకు అనుగుణంగా మాత్రమే అంతర్జాతీయ దౌత్యపరమైన సంబంధాలలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి దౌత్యపరమైన ఉపరితల విన్యాసంగా నేడు భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ఈ నెల 27 నుంచి రెండురోజుల పాటు జరుగనున్న అనియత సమావేశం విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇరు నాయకుల భేటీ కోసం కొన్ని వారాలుగా దౌత్యవేత్తల స్థాయి మంతనాలు జోరుగా సాగాయి. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరా జ్ చైనా పర్యటన సందర్భంగా జరిగిన ఉన్నతస్థాయి చర్చల అనంతరం ఈ సమావేశం ఖరారైంది. ఇరుదేశాల మధ్య ‘సన్నిహిత అభివృద్ధి భాగస్వా మ్యాన్ని’ బలోపేతం చేసేందుకు ఇరు దేశాధినేతల మధ్య జరిగే చర్చలు దోహదం చేస్తాయని సుష్మా ప్రకటించారు. ఈ నెల 24 తేదీన (మంగళవారం) జరిగిన ‘షాంఘై సహకార సంస్థ’(ఎస్‌సిఓ) సదస్సులో సుష్మా పాల్గొనడం కూడా భారత-చైనా సంబంధాలు మెరుగు పడుతున్నాయనడానికి సంకేతంగా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. 

భారత్-చైనాల మధ్య 75 రోజుల పాటు సాగిన డొక్లాం ప్రతిష్టంభన అనంతరం గత డిసెంబర్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ భారత్‌లో పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లోని ఉద్రిక్తతలు కొంత సడలిపోనారంభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించడం ఇది నాలుగోసారి అయినా, ఉభయ దేశాల చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల అభివృద్ధి చెందిన దేశాలు, ముఖ్యంగా అమెరికా, ప్రపంచీకరణ స్వస్తి చెప్పి, ఆర్థిక ఆత్మరక్షణ విధానాలను అనుసరిస్తుండడం, అందులో భాగంగా అమెరికా-చైనాలు పరస్పరం వాణిజ్య ఆంక్షలు విధించుకోవడం వంటి చర్యలు భారత్‌పై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ప్రత్యామ్నాయ అంతర్జాతీయ వాణిజ్య భాగస్వామ్య అవసరం ఇరు దేశాలకు ఏర్పడిన నేపథ్యంలో మోదీ-జిన్‌ల భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఈ భేటీ అంతర్జాతీయ రంగంలో బలాబలాలను మార్చి వేస్తుందని, ఆసి యా శతాబ్దాన్ని ఆవిష్కరిస్తుందని దౌత్యవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. 1980వ దశకం చివరలో భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమణిగిన తర్వాత రాజీవ్ గాంధీ చైనా పర్యటనతో ఇరు దేశాల మధ్య మైత్రి బంధం బలపడటం భారత్‌కు లాభించింది. అదే తీరులో డొక్లాం సైనిక ఉద్రిక్తతల తర్వాత మోదీ పర్యటన మరోసారి చరిత్ర సృష్టించనుందని భావిస్తున్నారు. దక్షిణాసియా దేశాలు సహా, భారత్ చుట్టూతా ఉన్న శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, చివరికి మాల్దీవులన్నిటిలో చైనా ఆధిపత్యం భారత్ పాత్రను కుదించివేసింది.  

భౌగోళిక రాజకీయ సమీకరణాలు మారిన సందర్భంలో నేడు అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ రష్యా, ఈయూ దేశాల దన్నుతో చైనా ఒక సామ్రా జ్యవాద శక్తిగా అవతరించింది. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు, 2008 నుంచి ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో బలహీనపడిన ఆర్థిక వ్యవస్థ కొనుగోలు కోసం ‘ఆసియా లక్ష్యం’తో కూడిన భౌగోళిక రాజకీయ వ్యూహాన్ని అమెరికా రూపొందించుకుంది. దాంతో ఈయూ దేశాలతో నామమాత్రపు సంబంధా లను కొనసాగిస్తూ చైనాకు పోటీగా భారత్‌ను వినియోగించుకొని తన ప్రయోజ నాలను నెరవేర్చుకోవాలని అమెరికా చూస్తోంది. ఆఫ్ఘానిస్థాన్ ఆర్థిక, పాలనా పరమైన వ్యవహరాల్లో జోక్యానికి ప్రోత్సహించడమే కాక, దక్షిణాసియా దేశాల రాజకీయార్థిక వ్యవహారాల్లో తన వ్యూహానికి అనుగుణంగా భారత్‌ను ఒక ప్రాంతీయ శక్తిగా నిలిపేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. భౌగోళిక రాజ కీయాధిపత్యం కోసం తీవ్ర పోటీ ప్రపంచ ఆర్థిక సమీకరణాల ప్రాతిపదికన కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల దౌత్యపరమైన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ప్రశ్నార్థకమే. భారత్ చైనాల మధ్య ఆర్థిక లావాదేవీలు వేగంగా పెంపొందుతున్న నేపథ్యంలో గత ఏడాది ద్వైపాక్షిక వాణిజ్యం జరిగి 8400 కోట్ల డాలర్లకు చేరింది. కల్లోలిత ప్రపంచ పరిస్థితుల కారణంగా తమ మధ్య నెలకొన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దు వివాదం, ఉగ్రవాదంపై బీజింగ్ వైఖరి, టిబెట్ సమస్య, నదీ జలాలను చైనా తరలించడం తదతర అనేక సమస్యలపై ఇరు దేశాలు ఒక అంగీకారానికి రావల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మోదీ-జిన్‌పింగ్ చర్చలు ఒక్క అడుగు వేయగలిగినా హర్షణీయమే.

Related News