mobile-adhar

మొబైల్‌తో ఆధార్ లింక్ మేం చెప్పలేదే?

Updated By ManamThu, 04/26/2018 - 23:01
  • వినియోగదారులెవరో ధ్రువీకరణ తప్పనిసరి అన్నాం?

  • అంతేగానీ.. ఆధార్‌తో లింక్ చేయాలని అనలేదుగా..

  • కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

mobile-adharన్యూఢిల్లీ: మొబైల్ నంబర్లతో ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు  ప్రశ్నించింది. మొబైల్ ఫోన్ వినియోగదారులెవరో ధ్రువీకరించడం తప్పనిసరి అని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఒక సాధనంగా ఉపయోగించుకుందని వ్యాఖ్యానించింది. ‘‘మొబైల్ నంబరుతో ఆధార్‌ను అనుసంధానించాలన్న ఆదేశాలు సుప్రీంకోర్టు ఇవ్వలేదు. కానీ మీరు దాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకున్నారు.’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఎ.కె.సిక్రి, జస్టిస్ ఎ.ఎం.ఖాన్‌విల్కర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆధార్‌తో మొబైల్ నంబరును అనుసంధానించాలన్న నిర్ణయాన్ని ట్రాయ్ సిఫార్సు ఆధారంగా తీసుకున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది కోర్టుకు చెప్పారు. టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ఆధార్‌ను సిమ్‌తో అనుసంధానించడానికి ప్రభుత్వానికి చట్టపరమైన ప్రాతిపదిక ఉందని పేర్కొన్నారు. దేశ భద్రత దృష్ట్యా చూసినా ఈ చర్య సబబే అన్నారు. వాస్తవానికి టెలికం కంపెనీల వద్ద ఆధార్‌కన్నా ఎక్కువగా పౌరుల వివరాలున్నాయని, ఆధార్ డేటా వారికి లెక్కే కాదని చెప్పారు. భారత విశిష్ట ప్రాధికార సంస్థ వద్ద కన్నా వోడా ఫోన్ వద్దే ఎక్కువగా పౌరుల వివరాలున్నాయని, వాటి ఆధారంగా టార్గెటెడ్ ప్రకటనలు ఇప్పటికే ఇస్తోందని చెప్పారు. ఇప్పుడు ఆధార్ పథకాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఈ పథకాన్ని పర్యవేక్షించిన సాధికార మంత్రుల బృందంలో గతంలో సభ్యుడిగా ఉన్నారని రాకేశ్ ద్వివేది కోర్టుకు చెప్పారు. 





Related News