tirumala

ఇవాళ్టితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు

Updated By ManamFri, 09/21/2018 - 09:59

Tirumalaతిరుమల: గత వారం రోజులుగా తిరుమలలో వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉదయం స్నామా, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు, చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించిన అర్చకులు, చక్రస్నానాన్ని పూర్తి చేశారు. రాత్రి 8 గంటలకు జరిగే ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 

కాగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి తిరుమలలో అన్ని రకాల ఆర్జిత సేవలూ రద్దు కాగా.. రేపటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టైమ్ స్లాట్ టోకెన్లను నేటి నుంచి జారీ చేయనున్నామని టీటీడీ అధికారులు ప్రకటించారు. కమనీయం 

Updated By ManamThu, 09/20/2018 - 01:03
 • సూర్య, చంద్రప్రభ వాహనాలపై గోవిందుడు 

 • యోగ ముద్రలో బద్రీ నారాయణుడి దర్శనం

 • చంద్రప్రభపై సర్వజగదర్శకుడు విహారం 

 • వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 

TIRUMALAతిరుపతి: తిరుమలలో జరుగుతున్న శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు బుధవారం ఉదయం సూర్య ప్రభవాహనంలోను, రాత్రి చంద్రప్రభ వాహనంలోను మలయప్ప స్వామి కనువిందు చేశారు. చంద్రప్రభ వాహనంపై రాత్రి శ్రీవారు దర్శనమిచ్చి, తన చల్లని కిరణాలతో భక్తులను అమృత స్వరూపులను చేశారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వాసానికి అధిపతిగా చంద్రప్రభ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వ కళా సమాహారాత్మకుడైన ఆది నారాయణుడు తన కళల నుంచి 16 కళలు చంద్రునిపై ప్రసరింపచేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం, పాపహరం అవుతుందని భక్తుల నమ్మకం. అదే విధంగా ఉదయం సూర్యప్రభ వాహనంపై బద్రీ నారాయణుడి అవతారంలో యోగ ముద్రలో తిరుమాడ వీధుల్లో విహరించారు. సూర్య నారాయణుడు దివ్వకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ, భక్తులను ఆరోగ్య వంతులను చేస్తూ, సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషదీపతి అయిన  చంద్రుడు కూడా సూర్య కిరణాలతోనే ప్రకాశిస్తాడు. వాహన సేవ ముందు అనేక మంది కళాకారులు స్వామి వారికి స్వాగతం పలకగా, గజరాజులు ఠీవిగా నడుస్తూ వచ్చాయి. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తించాయి. మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వాములతో పాటు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్.శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు సుధా నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

నేడు రథోత్సవం 
గురువారం ఉదయం రథోత్సవం వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. తెలవారుజామున మూడు గంటల నుంచి 3.50 గంటల మధ్య స్వామి కర్కాటక లగ్నంలో రథారోహణం చేస్తారు. ఉదయం 7.30 గంటల నుంచి ఆలయ మాడవీధుల్లో తిరుగుతారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను జేఈఓ శ్రీనివాసరాజు చేపడుతున్నారు.మహిళకు లైంగిక వేధింపులు.. సీఐ సస్పెన్షన్

Updated By ManamWed, 09/19/2018 - 10:46

CIతిరుమల: తనకు న్యాయం చేయాలంటూ స్టేషన్‌కు వెళ్లిన ఓ యువతిపై కన్నేశాడు ఓ సీఐ. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని చూశాడు ఆ కామాంధుడు. ఓ బిడ్డకు తల్లని కూడా కనికరం లేకుండా, పాపను వదిలి తన వద్దకు రావాలంటూ నిత్యం ఫోన్ కాల్స్ చేసి విసిగించసాగాడు. తనను కలవాలంటూ బలవంతం చేశాడు. 

అయితే ఈ వేధింపులను భరించలేకపోయిన ఆ యువతి.. మహిళా సంఘాల సాయంతో డీజీపీ శ్రీనివాస్‌ను ఆశ్రయించింది. దీంతో అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి వారు ప్రణాళిక వేశారు. ప్రస్తుతం తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఆ సీఐ విధులు నిర్వహిస్తుండగా., తన అవసరం కోసం ఆమెకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. అక్కడ అతడిని పట్టించాలని ఆ యువతి చూసినప్పటికీ.. విషయం ముందే తెలుసుకున్న సీఐ అక్కడి నుంచి ఉడాయించాడు. ఇక దీనిపై స్పందించిన డీఐజీ శ్రీనివాస్, తేజోమూర్తిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తేజోమూర్తిపైన శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. అతనిపై చర్యలు తీసుకుంటామని బాధితురాలు హామీ ఇచ్చారు.వైభవోపేతంగా.. గరుడోత్సవం

Updated By ManamTue, 09/18/2018 - 06:28
 • గరుడ వాహనంపై ఊరేగిన మలయుప్ప

TIRUMALAతిరుపతి: ఇల వైకుంఠం తిరుమలలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో సోమవారం రాత్రి ‘గరుడ వాహనా గోవిందా’.. అనే నామస్మరణ మార్మోగింది. రాత్రి ఏడు గంటలకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడవాహన సేవ జరిగింది. పరవుపవిత్రమైన గరుడవాహనంపై శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసేందుకు భక్తులు లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. రెండు లక్షల మందికి పైగా తిరుమల మాడ వీధుల్లో శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో దాదాపు 40 శాతం మంది నడిచి తిరుమలకు చేరకున్న వారే. తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు వాళ్ల స్వగ్రామాల నుంచి నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. 

గరుడవాహనం ప్రాధాన్యం ఇదీ...
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ వాహనసేవ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంలో విహరిస్తుండగా వెంకటేశ్వరుని దర్శించుకోవడం వల్ల సకలపాపాలు తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. గరుడ సేవకు శ్రీవిల్లిపుత్తూరు నుంచి ప్రత్యేకంగా పూలమాలలు వస్తాయి. దీంతోపాటు చెన్నై నుంచి ప్రత్యేకంగా గొడుగులు కూడా తిరుమలకు చేరుకుంటాయి. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడినని తెలియజెబుతారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదిష్టుడైన గరుడిని దర్శిస్తే సర్వపాపాలు తొలుగుతాయని భక్తకోటికి తెలియజెబుతారు. గరుడవాహన సేవలో స్వామివారిని స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. రెండు మీటర్ల నిలువెత్తు ఉండే సహస్రనామ కాసులహారం, లక్ష్మీహారం, మకర మణికంఠ హారాలను ఈ సందర్భంగా స్వామికి ధరింపజేస్తారు. రామానుజాచార్యుల ఆగమనం తరువాతే తిరుమల ఆలయాన్ని వైష్ణవ ఆలయంగా గుర్తించినట్లు చరిత్ర చెబుతోంది. విష్ణువుకు ప్రీతిపాత్రుడు గరుడుడు కాబట్టి, ఆ తర్వాతే ఆలయంలో గరుడాళ్వారు మండపం కూడా నిర్మించారట. అంతటి ప్రాశస్త్యం ఉన్న గరుడవాహన సేవకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వస్తారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చెందిన స్థానికులు పెద్ద ఎత్తున గరుడ వాహనాన్ని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఉదయం స్వామివారు మోహినీరూపంలో శృంగార రసాధిదేవత గా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే శ్రీకృష్ణుడు అలంకృతుడై మరో తిరుచ్చిపై భక్తులకు అభయమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా, భక్తుల కోలాటాలు, వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ ఊరేగింపు అత్యంత  రమణీయంగా జరిగింది. ఈ కార్యక్రమాలలో ట్రస్టుబోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు మేడా రామకృష్ణారెడ్డి, సుధానారాయణ మూర్తి, పొట్లూరి రమేష్ బాబు, రాఘవేంద్ర రావు, ఎన్.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.మోహినీ అవతారంలో జగన్మోహనుడు

Updated By ManamMon, 09/17/2018 - 16:20
lord venkateswara in mohini avataram

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన సోమవారం ఉదయం శ్రీహరి మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చాడు. పక్కనే శ్రీకృష్ణుడు అలంకృతుడై మరో తిరుచ్చిపై భక్తులకు అభయమిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ ఊరేగింపు అత్యంత రమణీయంగా జరిగింది.

ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు చాటి చెబుతున్నారు.  రాత్రి 7 నుంచి 12 గంటల వరకు గరుడవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

Srivari Brahmotsavam 2018 – MOHINI AVATARAMజగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్పస్వామివారు సోమవారం రాత్రి గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఇదేరోజు తిరుమలలో శ్రీవారు శ్రీవిల్లిపుత్తూరు నుండి విచ్చేసిన ప్రత్యేక మాలలు, చెన్నై నుండి వచ్చిన అలంకృత ఛత్రాలు స్వామివారి గరుడవాహన సేవకు మరింత శోభను చేకూర్చుతాయి. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటి నమ్మకం.

Srivari Brahmotsavam 2018 – MOHINI AVATARAMఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధి శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు మేడా రామకృష్ణారెడ్డి, శ్రీమతి సుధా నారాయణమూర్తి,  పొట్లూరి రమేష్ బాబు, ప్రత్యేక ఆహ్వానితులు  రాఘవేంద్రరావు, ఎన్.కృష్ణ, ఆలయ డెప్యూటి ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్  రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 కల్పవృక్ష వాహనంపై గోవిందుడు

Updated By ManamSun, 09/16/2018 - 22:22
 • బకాసుర వధ అలంకారంలో దర్శనం

 • రాత్రి సర్వభూపాల వాహనం అభయం

 • నేడు గరుడ సేవకు ఏర్పాట్లు పూర్తి 

 • వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

TIRUMALAతిరుపతి: తిరుమల వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేతుడై కల్పవృక్ష వాహనంలో నాలుగు మాడవీధుల్లో విహరించారు. బకాసుర వధ అలంకారంలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు, భక్త జన బృందాలు, చెక్క భజనలు, జీయంగార్ల  గోష్టితో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారు వాహన సేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు ఇచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. క్షీరసాగర మధనంలో ఎన్నో విలువైన వస్తువులు ఉద్భవించాయి. అందులో కల్పవృక్షం ఒకటి కాగా,  ఆ చెట్టు చాటున ఉన్న వారికి ఆకలిదప్పులు ఉండవు. పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది. సాధారణంగా వృక్షాలు ఆ చెట్టులో కాసిన ఫలాలను మాత్రమే అందిస్తుంది. అయితే కల్పవృక్షంలో కోరిన ఫలాలన్ని ప్రసాదిస్తుంది. ఆ వాహనంలో ఊరేగిన స్వామి వారిని దర్శించుకున్నట్లయితే, భక్తులకు కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకం ఉంది. రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. రాజులు, దిక్పాలకులు మిళితమైన సర్వభూపాలవాహనంలో స్వామి వారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణాన యముడు, నైరుతిలో నిర్నతి, పశ్చిమాన వరుణుడు, వాయవ్యంలో వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లు తున్నారు. వీరందరూ స్వామి వారిని తమ భుజ స్కందాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. ఆదివారం శ్రీవల్లిపుత్తూరు నుంచి స్వామి వారి కోసం ప్రత్యేకంగా పూలమాలలు వచ్చాయి. ప్రతి బ్రహ్మోత్సవాలకు తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరు నుంచి మాలలు రావడం పరిపాటి. గోదాదేవి ఆలంకరించిన మాలలను గరుడసేవ రోజున స్వామి వారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మాలలను పెద్ద జీయర్ మఠం నుంచి తిరుమాడవీధుల్లో ప్రదర్శనగా శ్రీవారి ఆలయానికి తీసుకుని వెళ్లారు.

నేడు గరుడసేవకు ఏర్పాట్లు పూర్తి
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి కీలకమైన ఘట్టంగా గరుడ సేవ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ జేఈఓ శ్రీనివాస రాజు తెలిపారు. ఆయన ఆదివారం తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగు మాడవీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీలలో రెండు లక్షల మంది తిలకించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్యాలరీల్లో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు, తాగునీరు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గరుడ సేవకు స్వామి వారికి అలంకరించేందుకు ప్రత్యేకంగా చెన్నై నుంచి గొడుగులు తిరుమలకు చేరుకున్నాయి. హిందూ దర్మార్థ సమితి ట్రస్టీ ఆర్‌ఆర్ గోపాల్‌జీ గొడుగులను టీటీడీ అధికారులకు అందించారు. గొడుగులను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా అందుకున్నారు. నాలుగు మాడ వీధుల్లో వీటిని ఊరేగించిన తరువాత ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు 

Updated By ManamThu, 09/13/2018 - 03:11
 • ఈ నెల 22 వరకు తిరుమల శ్రీవారి ఉత్సవాలు 

 • నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు

 • వైభవంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

 • నాలుగు మాడవీధుల్లో ఊరేగిన విష్వక్సేనుడు 

TIRUMALAతిరుపతి: తిరుమల శ్రీవారి  బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా బుధవారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆలయం నుంచి విష్వక్సేనుడు తిరువీధులకు చేరుకుని, నాలుగు మాడ వీధుల్లోను ఊరేగారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామి వారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. విత్తనాలను నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. అంకురార్పణ  జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానపెడుతారు. బ్రహ్మ పీఠాన్ని ఏర్పాటు చేసి, ఆ తరువాత బ్రహ్మ, గరుడ, శేష,  సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ దేవతలను ఆహ్వానిస్తారు. ప్రతిరోజు ఈ పాలికల్లో నీరు పోస్తారు. ఈ కార్యక్రమం వేద మంత్రోఛ్చారణ, మంగళ వాద్యాల మధ్య జరుగుతుంది. అక్కడ నుంచి ఆయన మాడవీధుల్లోని వసంత మంటపం వద్ద నుంచి పుట్టమన్ను తీసుకుని వచ్చారు. గురువారం ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను ఈ నెల 22వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి రానున్నారు. ఆయన సాయంత్రం ఆరు గంటలకు తిరుమలకు చేరుకుని, స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనవాయితీగా వస్తున్న కార్యక్రమం. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 1.00 గంటలకే తిరుమలకు చేరుకోనున్నట్లు జిల్లా కలెక్టరు ప్రద్యుమ్న తెలిపారు. సాయంత్రం 6.00 గంటల వరకు సమయం ఉండటంతో ఆయన జిల్లాకు సంబంధించిన ప్రగతిపై సమీక్ష చేసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా కరువు పరిస్థితి, స్పోర్ట్స్ సిటీ, శ్రీకాళహస్తి మాస్టర్ ప్లాన్,  సీజనల్ వ్యాధులకు సంబంధించిన అంశాలపై సమీక్షించనున్నారు.

భారీ బందోబస్తు
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల, తిరుపతిలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన సిబ్బందికి తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి సూచనలు ఇచ్చారు. క్రమశిక్షణ ముఖ్యమని, ఎక్కడా హద్దు మీరరాదని సూచించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారని, రాష్ట్రం నుంచే కాకుండా, దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారని తెలిపారు. పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నామని కాకుండా, దేవ దేవునికి సేవ చేస్తున్నామనే భావంతో పనిచేయాలని సూచించారు.రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు 

Updated By ManamTue, 09/11/2018 - 23:20
 • పట్టువస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి 

 • 13 నుంచి 21 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు

 • అక్టోబరు 10 నుంచి 18 వరకు నవరాత్రి ఉత్సవాలు 

 • ఉత్సవాలకు సర్వం సిద్ధం: ఈవో అనిల్ సింఘాల్ 

EO-PRESS-MEETతిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈనెల 13వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, అదే రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు. ఆగమ పండితులు సూచనల మేరకు వాహన సేవలను గంట ముందుగా ప్రారంభిస్తామని, గరుడ వాహనాన్ని రాత్రి ఏడు గంటల నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు, వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల, దాతలకు సంబంధించిన ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు చెప్పారు.  భక్తుల కోసం ఏడు లక్షల లడ్డూలను సిద్ధం చేసినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంతో పాటు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించామన్నారు.   విద్యుదలంకరణలు, పెయింటింగ్, బ్యారికేడ్లకు తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్లు తెలిపారు. రూ.26 కోట్లతో అదనపు మరుగుదొడ్లు నిర్మించామని,  వాహనాలను తిలకించేందుకు మాడవీధుల్లో 19, భక్తులు రద్దీ ఉండే ప్రాంతాల్లో 12, మొత్తం 31 డిజిటల్ స్క్రీన్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు.  గరుడసేవ రోజున గ్యాలరీల్లో ఉండే రెండు లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాలు, మూడు లక్షల మజ్జిగ ప్యాకెట్లు, ఆరు లక్షల తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. బ్రహ్మోత్సవాల్లో కాటేజీ దాతలకు మాత్రమే గదులు కేటాయిస్తామని తెలిపారు.  అయితే ఈనెల 15 నుంచి 17 వరకు, అక్టోబరు 12 నుంచి 14 వరకు కాటేజీ దాతలకు గదులు కేటాయింపులు ఉండవని తెలిపారు. ఆలయ మాడ వీధులు,  కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుధ్యం కోసం 800 మందిని నియమించామని తెలిపారు. ఇంకా 11 ప్రథమ చికిత్సా కేంద్రాలు, 12 అంబులెన్సులు అందుబాటులో ఉంచామన్నారు. అన్ని సేవలను ఎస్‌విబిసి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామన్నారు. వాహనాల సేవలకు ముందు స్థానిక కళాకారులతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇంకా తిరుమలలోని ఆస్థాన మండపం,  నాదనీరాజనం వేదికలతో పాటు, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, శిల్పారామంలలో ఆధ్యాత్మిక,ధార్మిక ఉపన్యాసాలు, సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల జేఈవో కెఎస్ శ్రీనివాస రాజు మాట్లాడుతూ గరుడ సేవ సందర్భంగా ఈ నెల 16, 17 తేదీల్లో దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశామని, అదే విధంగా 17న సర్వదర్శనం టోకెన్లు, రూ.300లు ప్రత్యేక ప్రవేశ టోకెన్లు రద్దు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఇన్‌చార్జి సీవీఎస్‌వో శివకుమార్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవ శోభ

Updated By ManamMon, 09/10/2018 - 00:11
 • వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల

 • భారీ స్థాయిలో విద్యుదలంకరణలు.. రూ.9 కోట్లతో ఇంజినీరింగ్ పనులు

 • స్వామికి పరదాలు సిద్ధంచేసిన మణి.. న భూతో.. అన్నట్లుగా ఉత్సవాలు

tirumaతిరుపతి: తిరుమల బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఈనెల 13 నుంచి జరగనున్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుపతి, తిరుమల నగరాలను టీటీడీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. తిరుమలలో ప్రత్యేకాలంకరణలపై దృష్టి సారించారు. అలంకరణలు, పెయింటిం గుల పనులను టీటీడీ ఇంజినీరింగ్ విభాగం తొమ్మిది కోట్ల రూపాయలతో చేపడుతోంది. తిరుపతి నుంచి భక్తులు బస్సులు, రైళ్లు దిగిన ప్రాంతాల నుంచి తిరుమల వెళ్లే మార్గాల్లో విద్యుత్తు దీపాలంకరణలు చేస్తోంది. భక్తుడు తిరుపతికి రాగానే ఇల వైకుంఠంలో అడుగుపెట్టిన అనుభూతి కలిగించేలా చర్యలు తీసుకుంటోంది. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ‘నభూతో న భవిష్యతి’ అన్న చందాన ప్రతి సంవత్సరం జరుగుతాయి. వేంకటేశ్వరుడు శ్రవణం నక్షత్రం రోజున ఆవిర్భవించిన రోజును పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు ఏనాటి నుంచో జరుగుతున్నాయి. బ్రహ్మదేవుడు నిర్వహించినందువల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందిన ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాల సమయంలో  వైకుంఠం నుంచి దేవతలు అందరూ తిరుమాడ వీధుల్లో తిరుగుతూ ఉంటారని అంటారు.  అందుకే తిరుమల, తిరుపతిలలో అన్ని మార్గాలను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి, తిరుమలలో దేవతామూర్తుల ప్రతిమలను లైటింగ్‌తో అలంకరిస్తున్నారు. వేంకటేశ్వర స్వామితో సహా మహావిష్ణువు దశావతారాలను వివిధ ప్రాంతాలలో విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. పెయింటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ధర్మప్రచార మండళ్ల సహకారంతో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నారు. పుస్తకప్రసాదం పంపిణీ, సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న సంస్థలకు ఆర్థికసాయం తదితర కార్యక్రమాలను చేపడుతున్నారు. కలియుగంలో శ్రీవారి కృపాకటాక్షాలు పొందేందుకు హరినామ సంకీర్తన ఒక్కటే మార్గమని,  దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులలను ఆహ్వానించి, తిరుమలలో ప్రధాన కల్యాణకట్ట వద్ద 24 గంటల పాటు భజన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీంతో పాటు తిరుమల, తిరుపతిలలోని ఆడిటోరియాలు, ఇతర వేదికలపై  వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వేదికలను కూడా ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.  

స్వామివారి పరదాలు సిద్ధం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఉపయోగించే పరదాలను తిరుపతికి చెందిన మణి సిద్ధం చేశారు. వంశపారంపర్యంగా ఈ పరదాలను మణి శ్రీవారికి అందజేస్తున్నారు. మణి పరదాలను తీసుకుని, తిరుమలకు కాలినడకన కుటుంబ సమేతంగా వెళ్లి ఈ పరదాలను శ్రీవారికి అందజేస్తారు. సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులకు పరదాలను ఆయన అందించనున్నారు.నన్ను తొలగించి గుట్టుగా 30లక్షలు అకౌంట్లో వేశారు: రమణ దీక్షితులు 

Updated By ManamWed, 08/29/2018 - 10:52

Ramana Deekshituluతిరుపతి: టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా తన బ్యాంకు ఖాతాలోకి టీటీడీ అధికారులు రూ.30 లక్షలు డిపాజిట్ చేశారని రమణ దీక్షితులు ఆరోపించారు. ఆ తరువాత ఇవే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం తాను అసలు దరఖాస్తే చేయలేదని రమణ దీక్షితులు స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా టీటీడీలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టినందుకే కక్షపూరితంగా బాధ్యతల నుంచి తనను తొలగించారన్నారు.

ఇక తన నియామకం వంశపారంపర్య హక్కుల కింద జరిగిందనీ, సర్వీస్ రూల్స్ ప్రకారం కాదని.. అందువల్లే గత 30 ఏళ్ల పాటు తనకు ఎలాంటి అలవెన్సులు, ఇతర సదుపాయాలు కల్పించలేదని రమణదీక్షితులు వెల్లడించారు. తనతో పాటు బలవంతంగా తొలగించిన అర్చకుల బ్యాంకు ఖాతాల్లోనూ ఇలాగే డబ్బును డిపాజిట్ చేశారని పేర్కొన్నారు. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, రసీదులు లేకుండా దరఖాస్తు చేయకుండా అధికారులు ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో వేశారనీ, టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పడానికి ఇదే సాక్ష్యమని రమణ దీక్షితులు అన్నారు.

Related News