ArcelorMittal

ఎస్సార్ స్టీల్ రుణ దాతలకు అల్టిమేటం

Updated By ManamWed, 09/12/2018 - 22:33

arcelormittalముంబై: చితికిపోయిన ఎస్సార్ స్టీల్ స్వాధీనానికి తాను సమర్పించిన మూడవ బిడ్‌ను ఆమోదించవలసిందని లేదా మాజీ గ్రూప్ సంస్థలు ఉత్తమ్ గాల్వా, కె.ఎస్.ఎస్ పెట్రాన్‌లకు చెందిన రుణాలను తీర్చేందుకు ఎల్.ఎన్. మిత్తల్ సంస్థ ఇవ్వజూపిన రూ. 7,000 కోట్లను కోల్పోయేందుకు సిద్ధపడవలసిందని ఎస్సార్ స్టీల్ రుణ దాతలకు ఆర్సిలార్ మిత్తల్  అల్టిమేటం జారీ చేసింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ రూలింగ్‌కు వ్యతిరేకంగా ఆర్సిలార్ మిత్తల్ చేసుకున్న అభ్యర్థనపై వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు బుధవారంనాడు అంగీకరించినప్పటికీ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఎస్సార్ స్టీల్‌కు బిడ్ చేసే అర్ఙత సంపాదించడానికి ఉత్తమ్ గాల్వా, కె.ఎస్.ఎస్ పెట్రాన్‌లు ఎగవేసిన రుణాలను మూడు రోజుల లోపల చెల్లించవలసిందని ఆర్సిలార్ మిత్తల్‌ను  అప్పిలేట్ ట్రైబ్యునల్ గత శుక్రవారంనాడు ఆదేశించింది. అయితే, బకాయిలు తీర్చడానికి బదులుగా ఆర్సిలార్ మిత్తల్ సోమవారం తన బిడ్‌ను సవరించింది. అంటే, సవరించిన ఆఫర్‌ను ఆమోదించి, తనను విజేతగా ప్రకటించవలసిందని లేదా సుప్రీం కోర్టులో ఘర్షణకు సిద్ధపడవలసిందని రుణ దాతలకు చెప్పకనే చెప్పింది. సుప్రీం కోర్టులో తగవు తేల్చుకునేందుకు ఆర్సిలార్ మిత్తల్ మొగ్గు చూపితే,  ఉత్తమ్  గాల్వా, కె.పి.ఎస్ పెట్రాన్‌లు తమకివ్వాల్సిన రూ. 7000 కోట్లను తిరిగి పొందే అవకాశాన్ని రుణ దాతలు చేజార్చుకున్నట్లు అవుతుంది. అప్పు తీర్చాల్సిందిగా అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాన్ని ఆర్సిలార్ మిత్తల్ సవాల్ చేస్తోంది.  ఆ రెండు కంపెనీల నుంచి తాను ఇది వరకే నిష్క్రమించానని, వాటి బకాయిలకు తనకు సంబంధం లేదని చెబుతోంది. సుప్రీం కోర్టు కనుక దాని వైఖరినే సమర్థిస్తే, రుణ పరిష్కారానికి దొరికిన అవకాశాన్ని రుణ దాతలు కోల్పోయినట్లు అవుతుంది. 

ఇంతకుముందు ఇవ్వజూపిన రూ. 33,000 కోట్ల మొత్తాన్ని సవరించి రూ. 42,000 కోట్లు ఇచ్చేందుకు ఆర్సిలార్ మిత్తల్ సోమవారం సిద్ధపడింది. గ్రూప్ కంపెనీల బకాయిలను చెల్లించేందుకు అనుసరించవలసిన పద్ధతిని సూచించవలసిందిగా రుణ దాతల కమిటీని కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎ.ఎం. ఖాన్విల్కర్, డి.వై. చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం కంపెనీ అభ్యర్థనపై వాదనలు వినేందుకు అంగీకరించింది. 


సుమారు రూ. 7,000 కోట్ల మేరకు ఉన్న బకాయిలు చెల్లించేందుకు అప్పిలేట్ ట్రైబ్యునల్ విధించిన గడువు మంగళవారంతో ముగిసింది.  కానీ, రుణ దాతలు ఇప్పుడు తదుపరి చర్య తీసుకునే ముందు సుప్రీం కోర్టు నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఎస్సార్ స్టీల్ స్వాధీనానికి వీటీబీ బ్యాంక్ అండ ఉన్న నుమెటల్‌కు కూడా ఈ వాదనలతో ప్రమేయం ఉంది. ఎందుకంటే, అది గత శుక్రవారంనాడు ఈ అంశంపై కేవియట్ దాఖలు చేసింది. ఈ విషయంలో రుణ దాతల కమిటీకి, రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు కూడా నోటీసులు జారీ కానున్నాయి. నుమెటల్ వాదనలు వినకుండా ఈ కేసులో ఉత్తర్వు జారీ చేయవద్దని కోర్టును కోరుతూ అది కేవియట్ వేసింది. చితికిపోయిన ఆస్తికి వీలైనంత ఉత్తమ ధరను రాబట్టుకునేందుకు బిడ్డర్లతో చర్చలు జరిపే అధికారాన్ని రుణ దాతల కమిటీకి ఇస్తున్నట్లు అప్పిలేట్ ట్రైబ్యునల్ శుక్రవారం ప్రకటించింది. దివాలా తీసిన ఎస్సార్ స్టీల్ నుంచి రూ. 49,000 కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు ఎస్బీఐ నేతృత్వంలో ఫినాన్షియల్ రుణ దాతలు ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగుల ద్వారా ప్రయత్నిస్తున్నారు.ఉక్కు రంగంపై ఆర్సిలార్ ఆశాభావం

Updated By ManamFri, 05/11/2018 - 21:37

ArcelorMittalబ్రస్సెల్స్: ప్రపంచంలోని అతి పెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థ ఆర్సిలార్‌మిత్తల్ 2018 సంవత్సరానికి సంబంధించి దృక్పథం మెరుగుపడినట్లు పేర్కొంది. ఉక్కు ధరలు వేగంగా పుంజుకోవడం, ఇనుప ఖనిజ ఎగుమతులు పెరగడం కంపెనీ మొదటి త్రైమాసికంలో ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆదాయాలు నమోదు చేయడానికి సహాయపడ్డాయని తెలిపింది. స్వీయ అవకాశాలపై గ్రూప్ ఎలాంటి నిర్దిష్టమైన అంచనాలను వెల్లడించలేదు. మొత్తం నిల్వ ఉన్న సరుకులో మార్పులను పరిగణనలోకి తీసుకుని 2018లో ప్రపంచంలో ఉక్కు వినిమయం 1.5 శాతం నుంచి 2.5 శాతం మధ్య వృద్ధి చెందగలదని పునరుద్ఘాటించింది. డిమాండ్ ముఖ్యంగా అవెురికా, యూరప్, బ్రెజిల్‌లలో పటిష్టంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఉక్కు ధర, దాని ముడి సరుకుల ధరలో విస్తృతి ఆరోగ్యకరమైన ధోరణేనని ఆర్సిలార్‌మిత్తల్ పేర్కొంది. ‘‘రోజులు గడుస్తున్న కొద్దీ, 2018 సంవత్సరానికి సంబంధించిన దృక్కోణం పటిష్టమవుతోంది. డిమాండ్ వృద్ధి చెందడం, సరఫరా వైపు సంస్కరణల సమ్మేళనం ఉత్పాదక సామర్థ్యాన్ని అత్యధికంగా వినియోగించుకునేందుకు పురికొల్పుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉక్కు విస్తృతిలు ఆరోగ్యకరంగా ఉన్నాయి’’ అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ లక్ష్మీ మిత్తల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

మొదటి త్రైమాసిక కోర్ ప్రాఫిట్ (వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయం) సంఖ్యను విశ్లేషకులు అత్యంత సన్నిహితంగా పరిశీలిస్తూంటారు. అది గత ఏడాది ఇదే కాలంలోకన్నా 13 శాతం వృద్ధిచెంది 2.51 బిలియన్ డాలర్లుగా ఉంది. అది సగటున 2.33 బిలియన్ డాలర్లుగా ఉండగలదని భావించారు. ఆర్సిలార్‌మిత్తల్ అంతకన్నా ఎక్కువే నమోదు చేసింది. సగటు ఉక్కు అమ్మకం ధర 2017 మొదటి త్రైమాసికంలోకన్నా 18.2 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఆర్సిలార్‌మిత్తల్ తెలిపింది. ఎగుమతులు 1.4 శాతం పెరిగాయంది. గనుల నుంచి ఏటా అది 5 కోట్ల టన్నులకు పైగానే ఇనుప ఖనిజాన్ని తవ్వితీస్తోంది. ఇనుప ఖనిజ ధరలు 13.1 శాతం తగ్గగా, ఇనుప ఖనిజ ఎగుమతులు 5.5 శాతం పెరిగాయి. అవెురికా, యూరోపియన్ యూనియన్‌లలోకి చౌక దిగుమతులకు వ్యతిరేకంగా వర్తక రంగం తీసుకుంటున్న చర్యలను ఈ సంస్థ బాహాటంగా సమర్థిస్తోంది. ఆ రెండు చోట్ల ఈ సంస్థ కార్యకలాపాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ‘‘వివిధ ప్రాంతాలలో అసమంజస వర్తక దిగుమతులకు ఒక సమగ్ర పరిష్కారాన్ని ఇప్పటికీ కనుగొనవలసి ఉంది’’ అని యూరోపియన్ యూనియన్, అవెురికా చర్యలపై ఆర్సిలార్‌మిత్తల్ స్థూలంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచింది. అవెురికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతులపై 25 సుంకాన్ని విధిస్తూ గత మార్చి 23న నిర్ణయం తీసుకున్నారు. ఇ.యు ఉక్కు వంటి వాటికి కొన్ని తాత్కాలిక మినహాయింపులు ఇచ్చారు. 

Related News