parliament

ఎన్నికల్లో నేరస్తులు పోటీపై కీలక తీర్పు

Updated By ManamTue, 09/25/2018 - 12:09
  • ఛార్జిషీట్ ఆధారంగా అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించలేం

  • పార్లమెంట్ కఠిన చట్టాలు చేయాలి

  • రాజకీయ అవినీతి ఆర్థిక ఉగ్రవాదంతో సమానం

Supreme court says lawmakers facing criminal charges can contest elections

న్యూఢిల్లీ : ఎన్నికల్లో నేరస్తులు పోటీ చేయడంపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పునిచ్చింది. క్రిమినల్‌ విచారణ ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులు దోషులుగా తేలక ముందే వారిపై అనర్హత వేటు వేయలేమని స్పష్టం చేసింది. కాగా నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులను ఎన్నికల్లో పోటీకి నిషేధం లేదా అనర్హత వేటు అనే అంశంపై దాఖలైన వ్యాజ్యంపై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది.

ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు నమోదైతే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ  పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు భాజపా నేత అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.  

కేవలం అభియోగాలు నమోదైతే వారిపై అనర్హత వేటు వేయలేమని...క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నది పార్లమెంట్‌కే వదిలేస్తున్నామని, దీనిపై పార్లమెంట్‌ ఓ చట్టం తీసుకురావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై జోక్యం చేసుకునే అర్హత సుప్రీంకోర్టుకు లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు.  రాజకీయ అవినీతి ఆర్థిక ఉగ్రవాదంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు.



ఫిరాయింపుదార్లపై కఠినం

Updated By ManamTue, 09/04/2018 - 22:36
  • ఎన్నికల వివాదాలకు కోర్టులు.. ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి

  • పార్టీ ఫిరాయిస్తే రాజీనామా.. దానిని రాజ్యాంగబద్ధం చేయాలి

  • అన్ని కులాలవారికీ ‘కోటా’ అందాలి.. దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు

  • పార్టీలు, సభ్యులు ఆలోచించాలి.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • ఈ నెల 11తో పదవిలో ఏడాది.. ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ

venkaiahన్యూఢిల్లీ: పార్లమెంట్‌లోని ఎగువసభ అయిన రాజ్యసభ గౌరవాన్ని పునరుద్ధరించడమే ప్రస్తుతం తనముందున్న ప్రధాన కర్తవ్యమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సభలో తప్పుగా వ్యవహరించినవారిపై చర్యలకు సంబంధించి నిబంధనల్లో మార్పులు  తేవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత కఠినతరం చేయాల్సి ఉందన్నారు. ఈ నెల 11తో ఉప రాష్ట్రపతి పదవి చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆయన మంగళవారం పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ ఫిరాయించినవారిపై సదరు పార్టీ అభ్యర్థులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఆ వివాదాన్ని మూడు నెలల్లోగా పరిష్కరించేలా ఎన్నికల అధికారికి అధికారం ఇవ్వాల్సి ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంబంధ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులను నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని వీడిన అభ్యర్థులు చట్టసభల్లో తమ సభ్యత్వాన్ని కూడా వదులుకోవాల్సి ఉందన్నారు. చట్టసభకు కూడా రాజీనామా చేయడం కనీస నైతిక బాధ్యత అని, కానీ దీనిని కొందరు పాటిస్తున్నారని, కొందరు పాటించడం లేదని అన్నారు. కాబట్టి ఈ బాధ్యతను రాజ్యాంగబద్ధం చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న ఫిరాయింపు వ్యతిరేక చట్టంలో సంబంధిత చట్టసభ సభ్యుడిపై చర్యలకు ఎలాంటి కాలపరిమితి లేదు. అలాగే.. పార్టీ సభ్యుల్లో రెండింట మూడో వంతు మంది పార్టీ ఫిరాయిస్తే.. వారిపై చర్యలకు ఎలాంటి అధికారం లేదు. ఈ నేపథ్యంలో ఇలా పార్టీని ఫిరాయించిన వారి సంరక్షణకు సంబంధించి చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉందన్నారు. అయితే ఇది ఏకాభిప్రాయ సాధనద్వారానే చేపట్టాలన్నారు. రాజ్యసభ నిబంధనల సవరణకు సంబంధించి నియమించిన కమిటీ ఇప్పటికే ప్రాథమిక నివేదిక సమర్పించిందని, తుది నివేదిక వచ్చే నెలలో సమర్పిస్తుందన్నారు.
venkaiah

పార్టీ ఫిరాయింపుదార్లపై చర్యలకు ఎలాంటి కాలపరిమితి లేకపోవడంతో కొన్నిసార్లు వారిపై చర్యలకు ఐదేళ్లు కూడా పడుతోందని అన్నారు.  ఇది సమంజసం కాదని, అయితే ఈ నిబంధనను అన్ని పార్టీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాయన్నారు. ఫిరాయింపు నిరోధక చట్టంలో లోపాలను సరిచేయాల్సిన ఉందన్నారు. శాసన మండళ్ల ఏర్పాటు పైనా పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉందని, ఇవి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నికకాని వారికి పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయనే అపవాదు ఉందన్నారు. అయితే మండళ్లపై తనకంటూ ప్రత్యేక అభిప్రాయం లేదన్నారు. క్రమశిక్షణ ఉండటం అందరికీ ముఖ్యమని అన్నారు. చైనా విధానాలను తాను అంగీకరించనని, కానీ క్రమశిక్షనే వారిని ఈ స్థాయికి తెచ్చిందని గుర్తించుకోవాలన్నారు.  క్రమశిక్షణ అంటే సానుకూల జీవన విధానం అని, అది అన్నింటా ఉపయోగపడుతుందన్నారు. అది ఒక్క పార్లమెంట్ వ్యవహారాలకే పరిమితం కాదన్నారు. చట్టసభల్లో అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం లభించాల్సి ఉందన్నారు. రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గంలోని కొన్ని కులాల వారికే అధిక ప్రయోజనాలు అందుతున్నాయనే భావన మిగతా కులాలలో ఉందన్నారు. ‘‘రిజర్వేషన్లు కొనసాగాల్సిందే. వాటిని ముట్టుకోకూడదు. అయితే అన్ని కులాలవారికి కోటా ఫలితాలు అందాలి. అన్ని సామాజిక వర్గాలు, అందులోని వర్గాలు, ఉప వర్గాల వారికి దామాషా పద్ధతిలో రిజర్వేషన్ సౌకర్యం కలగాలి. దీనిని ప్రజలే కోరుకుంటున్నారు. ఈ అంశంపై రాజకీయపార్టీలు, చట్టసభ సభ్యులు ఆలోచన చేయాలి’’ అని వెంకయ్యనాయుడు సూచించారు. తన హయాంలో రెండు ముఖ్యమైన ఘటనలు జరిగాయని, ఒకటి శరద్‌యాదవ్ సభ్యత్వం రద్దు, రెండోది చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానానికి అనుమతించకపోవడమని పేర్కొన్నారు. ఈ రెండింటిపై నిర్ణయాలపై తనకు సంతృప్తి కలిగిందన్నారు. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 60 ప్రాంతాలను సందర్శించానని, 313 కార్యక్రమాల్లో పాల్గొన్నానని, మొత్తం 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో పర్యటించానని, 56 వర్సిటీలో, 21 సాంకేతిక పరిశోధన కేంద్రాల్లో ప్రసంగించానని, ‘‘భారత్ అనుసంధానం’’ కార్యక్రమంలోనే భాగంగా పర్యటించనన్నారు.



లోక్‌సభ నిరవధిక వాయిదా

Updated By ManamFri, 08/10/2018 - 16:39
rajya sabha

న్యూఢిల్లీ : లోక్‌సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గత నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అంతకు ముందు సభలో ఆర్బిట్రేషన్ బిల్లు ఆమోదం పొందింది. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ సమావేశాల్లో ఆమోదం పొందిన బిల్లులను సభ్యులకు చదవి వినిపించారు. అలాగే జీరో అవర్‌లో జరిగన చర్చలను గుర్తు చేశారు.

అనంతరం సభను నిరవధిక వాయిదా వేశారు. కాగా శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే రాఫెల్ డీల్‌పై పార్లమెంటరీ కమిటీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. మరోవైపు రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ వాయిదా పడింది. బిల్లుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ సమావేశాల్లో బిల్లు చర్చకు రావడం లేదని స్పీకర్ ప్రకటన చేశారు.



టీఆర్‌ఎస్ ఓటెవరికి?

Updated By ManamWed, 08/08/2018 - 01:14
  • అధికార అభ్యర్థికా... విపక్ష కూటమికా?

  • రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కేసీఆర్ మద్దతు కీలకం

  • తమకు మద్దతివ్వాలని కేసీఆర్‌కు ఫోన్ చేసిన నితీష్‌కుమార్..

  •  ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో బీజేపీకే మద్దతిచ్చే అవకాశం

parliamentహైదరాబాద్: లోక్‌సభలో ఎన్డీయేకి వ్యతిరేకంగా టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కొద్దిరోజులకే మరో కీలక ఎన్నిక రాజ్యసభలో జరుగనుంది. టీడీపీ అవిశ్వాసానికి మద్దతి వ్వని తెలంగాణ ఎంపీలు ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎటువైపు మొగ్గుచూపుతారో అన్నది చర్చనీయాంశమైంది. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి కావాల్సిన, రావాల్సిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మద్దతు గురించి కూడా చర్చించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, మంగళవారం సీఎం కేసీఆర్‌కు బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్‌కుమార్ ఫోన్ చేసి, డిప్యూటీ చైర్మన్ రేసులో తమ పార్టీ అభ్యర్థికే మద్దతు తెలపాలని కేసీఆర్‌ను కోరడంతో ఇప్పుడు ఈ అంశం మరింత ఆసక్తిక రంగా మారింది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అధికార, విపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని బీజేపీ, ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కమలదళానికి ఇవ్వొద్దన్న పట్టుదలతో కాంగ్రెస్, తదితర విపక్షాలు ఉన్నట్టు సమాచారం. దీనితో ఈ ఎన్నిక ఇరుపక్షాలకు చాలా కీలకంగా మారనుంది. అయితే 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో 122 మంది సభ్యుల మద్దతు ఉంటేనే డిప్యూటీ చైర్మన్ పదవి దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమికి 83 మంది సభ్యుల మద్దతుండగా, కాంగ్రెస్‌కు 54 మంది ఎంపీలున్నారు. ప్రత్యేకంగా కేసీఆర్‌కు ఫోన్ చేసి మద్దతు కోరిన జేడీయూకు ఆరుగురు ఎంపీలున్నారు. దీంతో తెలం గాణ సీఎం ఎవరికి మద్దతు తెలుపుతారో అనే అంశం ఇపుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రాజ్యస భ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో తెలంగాణ ఎంపీల పాత్ర కీలకం కావడంతో బీజేపీ వర్గాలు, కాంగ్రెస్ వర్గాలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా తమ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ హరివంశ్ నారాయణ్ సింగ్‌కు మద్దతు ఇవాల్సిందిగా జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ సీఎం కేసీఆర్‌ను కోరారు.

ఈ విషయం గురించి మాట్లాడానికి మంగళవారం నితీష్ కుమార్ ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి మాట్లాడారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో మద్దతు ఇచ్చే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే, ఇటీవల కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఓటింగ్‌కు టీఆర్‌ఎస్, బీజేడీలు దూరంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అటు బీజేపీకి, ఇటు విపక్ష కూటమికి తటస్థంగా ఉన్న టీఆర్‌ఎస్, బీజేడీ, వైసీపీల నిర్ణయం కీలకం కానుంది. సీఎం కేసీఆర్, నవీన్‌పట్నాయక్, జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుం టున్నారన్నది ఇప్పు డు ఇరు కూటముల్లో ఉత్కంఠ రేపుతోంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో మాత్రం ఒక అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థుల కు నాడు టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది. తర్వాతి పరిణామాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు చేసి తర్వాత విరమించుకున్నట్లు చర్చ జరుగుతోంది. దీనికితోడు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమయంలో హైకోర్టు విభజన, కొత్త జోనల్ విధానా నికి ఓకే చెప్పారని, దీంతోపాటు రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నిక విషయం కూడా ప్రస్తావన కు వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ బీజేపీ అభ్యర్థికి మద్ధతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు, ఇటీవల కేంద్రంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి దూరంగా ఉండడం ద్వారా ఒక విధంగా వారి నిర్ణ యానికి వ్యతిరేకంగా తెలంగాణ  ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని చెబుతు న్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో కూడా ఎన్డీఏ అభ్యర్థికే  మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదని ముఖ్య నేతలు భావిస్తు న్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ బీజేపీకే మద్ధతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులతో పాటు, పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు.



ఓబీసీల హక్కులకు రక్షణ

Updated By ManamTue, 08/07/2018 - 00:21
  • వెనుకబడిన కులాల చేర్పులు, మార్పులపై అధికారం

  • 123వ రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఓకే

  • అకృత్యాలపై ఫిర్యాదుకు అవకాశం.. బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

  • మోదీ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.. కేంద్ర మంత్రి తావర్ చంద్ గెహ్లాట్

parliamentన్యూఢిల్లీ: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ వర్గాల(ఓబీసీ)కు మంచిరోజులు రాబోతున్నాయి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్(ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ హోదా దక్కింది. ఈ మేరకు సోమవారం 123వ రాజ్యాంగ సవరణ బిల్లు-2017(ఓబీసీ బిల్లు) కు రాజ్యసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ నెల 2న ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఉభయ సభలు బిల్లును ఆమోదించడంతో రాజ్యాంగ హోదా దక్కింది. బిల్లు ఆమోదంతో.. ఓబీసీ హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించి సంపూర్ణ అధికారాలు ఎన్‌సీబీసీకి దఖలు పడనున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 70 కోట్ల మంది ఓబీసీలకు రక్షణ ఏర్పడనుంది. బీసీల జాబితాలో కొత్త కులాలను చేర్చడం, తొలగించే అభ్యర్థనలను పరిశీలించడం, దీనిపై కేంద్రానికి సూచనలిచ్చే అధికారం కమిషన్ లభిస్తుంది. ఈ సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఓబీసీల అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్‌సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించేందుకు మోదీ తీవ్రంగా కృషి చేశారని ప్రశంసించారు. ఎన్‌సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించడంతో ఈ కులాల్లో ఉన్న 80 శాతం మందికి దీని తాలూకు ఫలాలు అందుతాయని చెప్పారు. తమపై జరిగే అకృత్యాలకు వ్యతిరేకంగా ఓబీసీలు పోరాడే అవకాశం లభిస్తుందని, సత్వర న్యాయం జరిగేందుకు ఉపకరిస్తుందని తెలిపారు. ఈ బిల్లుతో ఓబీసీలకు న్యాయం జరుగుతుందని, ఇది ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణావసరమని పేర్కొన్నారు. విపక్షాల ప్రశ్నలకు బదులిస్తూ.. ఎన్‌సీబీసీలో మహిళలకు కూడా స్థానం ఉంటుందన్నారు.  ఈ కమిషన్ రాష్ట్రాలపై అధికారం చెలాయించబోదని, రాష్ట్రాలకు వేర్వేరుగా బీసీ కమిషన్లు ఉంటాయని, ఎన్‌సీబీసీ కేంద్రం పరిధిలోకి మాత్రమే వస్తుందని అన్నారు. ఓబీసీలకు సంబంధించి కులాల జాబితా కేంద్రానికి ప్రత్యేకంగా ఉందని, ఓబీసీ జాబితాలో ఏ కులాలు ఉండాలో? చేర్చాలో అనే అంశంపై మాత్రమే సిఫారసు చేసే అధికారాలు మాత్రమే ఉంటాయన్నారు. 1980 నుంచి ఓబీసీ కమిషన్‌కు  రాజ్యాంగ హోదా కల్పించాలనే డిమాండ్ ఉందన్నారు.  సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా వివిధ పక్షాల నేతలు పలు డిమాండ్లు చేశారు. కుల ఆధారిత జన గణనలో వెల్లడైన అంశాలను ప్రజల ముందు పెట్టాలని, వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా..
ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్లకు రాజ్యాంగబద్ధత ఉంది, కానీ బీసీ కమిషన్‌కు లేదు. తమకు ఎక్కడైనా అన్యాయం జరిగినా, నిబంధనల ఉల్లంఘన జరిగినా దళితులు, గిరిజనులు ఆయా కమిషన్లకు ఫిర్యాదు చేసుకుంటారు. ఆ కమిషన్ బాధితుల పక్షాన నిలుస్తుంది. అన్యాయం చేసిన వారికి సమన్లు జారీ చేస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇతరులు ఎవరైనా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తుంది. అయితే, బీసీ కమిషన్‌కు ఇటువంటి అధికారాలు లేవు. జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ అనేది ఒకటి ఉన్నా.. అది కోరల్లేని పాము వంటిది. వాస్తవానికి, ఇంద్రా సహాణీ కేసు ఆధారంగా 1993లో కేంద్రం బీసీ చట్టం తీసుకుచ్చి కేవలం బీసీ కులాల గుర్తింపు, వాటిని జాబితాలో చేర్చే అధికారం మాత్రమే ఇచ్చింది. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో  బీసీ కమిషన్‌కు కూడా రాజ్యాంగ హోదా కల్పించాలని వివిధ రాష్ట్రాల బీసీ నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. దాంతో, బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధతపై కదలిక వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడంతో బిల్లు రూపకల్పన జరిగింది.



పార్లమెంటులో ‘అసోం’ రగడ

Updated By ManamWed, 08/01/2018 - 00:26
  • ఎన్‌ఆర్‌సీ ముసాయిదాపై కేంద్రం రాజకీయం.. స్వదేశంలోనే పౌరులను శరణార్థులను చేస్తోంది

  • హిందూ-ముస్లిం కాదు మానవ హక్కుల అంశం.. ఓటుబ్యాంకుగా వాడుకుంటోంది: ప్రతిపక్షాలు

  • 1985లోనే రాజీవ్ ఎన్‌ఆర్‌సీ తరహా చర్యలు.. గత ప్రభుత్వాలు చేయలేనిది మేం చేస్తున్నాం

  • ఎవరిని కాపాడాలనుకుంటున్నారు?: అమిత్ షా.. విపక్షాల అభ్యంతరం.. ఉభయ సభల్లో నిరసన

parliamentన్యూఢిల్లీ: అసోం ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ముసాయిదా అంశంపై పార్లమెంటు అట్టుడికింది. ఆ రాష్ట్రంలో 40 లక్షల మందికి పౌరసత్వం దక్కకపోవడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంగళవారం ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తా యి. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, స్వదేశంలోనే పౌరులను శరణార్థులుగా మారుస్తోందని ప్రతి పక్షాలు మండిపడ్డారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ మాట్లాడుతూ.. ‘‘నిజమైన భారతీయులను దేశం నుంచి పంపరాదు. ఎన్‌ఆర్‌సీని రాజకీయం చేయరాదు. దీన్ని ఓటు బ్యాంకుగా ఉపయోగిం చుకుంటున్నారు. ఇది హిందూ-ముస్లిం అంశం కాదు మానవ హక్కులకు సంబంధించినది’’ అని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా జోక్యం చేసుకుంటూ.. 1985లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఎన్‌ఆ ర్‌సీ తరహా చర్యలు తీసుకున్నారని చెప్పారు. మీరు ఎవరి ని కాపాడాలనుకుంటున్నారు? బంగ్లాదేశీ చొరబాటు దారులను కాపా డేందుకు ప్రయత్నిస్తున్నారా అంటూ అమిత్ షా మండిపడ్డారు. 1985లో ఎన్‌ఆర్‌సీ తరహాలోనే అసోం ఒప్పందంపై రాజీవ్ గాంధీ సంతకం చేశారని పేర్కొన్నారు. దానిని అమలు చేసేందుకు గత ప్రభుత్వాలు ధైర్యం చేయలేకపోయాయని, వారు చేయలేని పనిని తమ ప్రభుత్వం చేస్తోందని అమిత్ షా అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం దేశ పౌరులను స్వదేశంలోనే శరణార్థులను చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. పోడియం చుట్టుముట్టిన విపక్ష సభ్యులు ఎన్డీయే సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసన విరమించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులను కోరినా ఫలితం లేకపోయింది. దీంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. ఎన్‌ఆర్‌సీ ముసాయిదాపై చర్చించాలని కోరుతూ లోక్‌సభలో టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు నోటీసులు ఇచ్చాయి. ఉద్దేశపూర్వకంగానే 40లక్షలమందికి పౌరసత్వాన్ని తిరస్కరించారని విపక్ష సభ్యులు ఆరోపించారు. ఎన్డీయే విధానాలతో స్వదేశంలోనే భారతీయులు శరణార్థులుగా మారిపోయారని మండిపడ్డారు. అంతకుముందు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ఆందోళన చేశాయి. ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ, ఆప్, బీఎస్పీ, జేడీ (ఎస్) ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. 

పౌర యుద్ధానికి దారితీస్తుంది: మమత
అసోం ఎన్‌ఆర్‌సీ ముసాయిదాపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పౌర యుద్ధానికి, రక్తపాతానికి దారితీస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలను విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఈ పరిస్థితిని సహించరానిదని, దేశంలో పౌరయుద్ధం, రక్తపాతం జరిగే ప్రమాదముందని మమత ఆందోళన వ్యక్తం చేశారు. అసోంలో 40 లక్షల మందికి పౌరసత్వం దక్కకపోవడంపై మమత స్పందిస్తూ.. వారు అసోంలో ఎలా నివసిస్తారు? భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, నివాసగృహాలు, పాఠశాల విషయం ఏంటి? అని ప్రశ్నించారు. 

ఇదేం పెద్ద సమస్య కాదు: త్రిపుర సీఎం
అసోం ఎన్‌ఆర్‌సీ ము సాయిదాపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. బీజేపీ పాలిన ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్థిస్తున్నారు. ఈ విషయం పెద్ద సమస్య కాదని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ అన్నారు. ‘‘త్రిపురలో ఎన్‌ఆర్‌సీ డిమాండ్ లేదు. త్రిపురలో ప్రతి విషయం పద్ధతిగా ఉంటుంది. నాకు తెలిసి అసోంలో కూడా ఇదేం పెద్ద విషయం కాదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  సర్బానంద సోనో వాల్‌కు ఈ వ్యవహారాన్ని చక్కబెట్టగల సామర్థ్యం ఉంది. శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసి కల్లోలం రేపాలని కొందరు యత్నిస్తున్నారు’’ అని విప్లవ్ అన్నారు.



సభా రభస

Updated By ManamWed, 07/25/2018 - 01:07
  • హోదాపై దద్దరిల్లిన రాజ్యసభ

  • విభజన హామీలు నెరవేర్చండి

  • స్వల్పచర్చలో సభ్యుల డిమాండ్

PARLIAMENTన్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిం చే అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. హోదా పై మంగళవారం జరిగిన స్వల్ప కాలిక చర్చలో టీడీపీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల నేతలు కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కూడా అదేస్థాయిలో దీటుగా సమాధానమి చ్చింది. రాజ్యసభలో మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైన చర్చ దాదాపు సాయంత్రం ఆరు గంటల వరకు కొన సాగింది. మొదట టీడీపీ పార్లమెంటరీ నేత సుజనా చౌదరి చర్చను  ప్రారంభిస్తూ.. కేంద్రం విభజన హామీలను విస్మరించిందని, దాంతో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలో పడిందని మండిపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేవారు. ఏపీపై కేంద్ర వైఖరి సామూహిక దాడుల తరహాలోనే ఉందని, సహకార స్ఫూర్తిని కేంద్రం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. 

సానుభూతితో వ్యవహరించాలి: ఆజాద్
కొత్తగా ఏర్పడిన ఏపీ పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు గులాంనబీ అజాద్ అన్నారు. ఏపీతో తనకు ఎంతో అనుబంధం ఉందని, రాష్ట్రానికి చెందిన అనేక అంశాలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. తెలంగాణకున్న అవకాశాలు ఏపీకి లేవని, ప్రత్యేక తెలంగాణ కోరుకోవడం ఎంత సమంజసమో.. ఏపీ ప్రజలు హోదా కోరుకోవడం అంతే సమంజసమని ఆజాద్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని కేంద్రం అన్నదని, ప్యాకేజీ కింద రూ. 16 వేల కోట్లు ఇస్తామని చెప్పి కేవలం రూ. 400 కోట్లే ఇచ్చిందని అజాద్ ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి కనీసం రూ. 10 వేల కోట్లు అవసరముండగా కేవలం రూ.1500 కోట్లే కేంద్రం ఇచ్చిందన్నారు. పసిబిడ్డ లాంటి ఏపీకి కేంద్రం చేయూతనివ్వాలని కోరారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: మన్మోహన్‌సింగ్
ఏపీ అభివృద్ధికి పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు ప్రధాని హోదాలో తాను హామీ ఇచ్చానని అన్నారు. తమ తర్వాత వచ్చిన ప్రభుత్వం హోదా హామీని అమలు చేయలేదని, నాడు పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు.

ఏపీకి ప్రత్యేకహోదానే సంజీవని: విజయసాయి
ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవని అని వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం సబబు కాదని, అందుకోసం గత నాలుగేళ్లుగా వైసీపీ పోరాడుతోందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని అని టీడీపీ నమ్మడం లేదని, వైసీపీ, కమ్యూనిస్ట్ పార్టీ, జనసేన పార్టీ నమ్ముతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు జీవన్మరణ సమస్య అని తెలిపారు. హోదా రాకపోవడానికి మొదటి ముద్దాయి బీజేపీ అని, రెండో ముద్దాయి టీడీపీ అని, మూడో ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాతి ప్రభుత్వాలు గౌరవించాలని, ఈ కారణంగానే విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ప్యాకేజీని అంగీకరించారుగా?: జీవీఎల్
ఏపీకి హోదా విషయంలో కేంద్రం ప్రభుత్వంపై కొన్ని పార్టీలు దుష్రపచారం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే హోదా అంశాన్ని ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. ప్యాకేజీని అంగీకరించిన తర్వాత హోదా మాట ప్రస్తావన ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. బీజేపీ వల్లే ఏపీకి పెద్ద ఎత్తున నిధులు, ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు. ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తూ ఏపీ అసెంబ్లీ కూడా తీర్మానం చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రెవెన్యూలోటు కింద ఏపీ ఈ ఐదేళ్లలో  రూ.22,130 కోట్లు అందుకుంటోందని జీవీఎల్ చెప్పారు. ఇక్కడ కేవలం యూటర్న్‌లు తీసుకోవడమే కాదని, చాలా టర్న్‌లు ఉన్నాయన్నారు. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 12 వేల ఎకరాలు సేకరించాల్సి ఉండగా, 2 వేల ఎకరాలే సేకరించారని అన్నారు. ఏపీకి మోదీ అందించిన వరం పోలవరం అని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని ఏపీ ప్రభుత్వానికి పబ్లిసిటీపైనే ఆసక్తి ఉందని చెప్పారు. బీమా పథకంపై కూడా ఏపీ ప్రభుత్వం ప్రజల్లో తప్పుగా ప్రచారం చేస్తోందన్నారు. అది చంద్రన్న బీమా కాదు మోదీ బీమా అని పేర్కొన్నారు. జీవీఎల్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు కాసేపు అడ్డుతగిలడంతో సభలో గందరగోళం ఏర్పడింది.

హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం చెప్పిందా?: సీఎం రమేశ్
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రులు అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం చెప్పిందా? అని కేంద్రాన్ని నిలదీశారు. ఇలా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం సిఫారసు చేసినట్లుగా రుజువు చేస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ప్రముఖ విద్యాసంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని, మరి ఏపీ విద్యార్థులు ఎక్కడికి వెళ్లి చదువుకోవాలని నిలదీశారు. ఏపీలో బీజేపీకి ఓట్లు , సీట్లు లేవు కనుకే ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. టీడీపీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు యత్నిస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబునాయడు 29 సార్లు ఢిల్లీకి వచ్చి మంత్రులను కలిశారని, కానీ ఒక్కపైసా విదల్చలేదన్నారు. కానీ ఇప్పుడేమో తాము యూటర్న్ తీసుకున్నామని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రధాని ఒక్కసారికంటే ఎక్కువగా ఎప్పుడైనా వచ్చారా? అని నిలదీశారు. హోదా ఇవ్వాలంటే అది ఉండాలి, ఇది ఉండాలని సాకులు చెబుతున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు.. ప్రధాని తిరుపతికి వచ్చినప్పుడు ఆ విషయం తెలియదా? అని ప్రశ్నించారు.

హామీలు నెరవేర్చాల్సిందే: కేకే
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిందేనని టీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు అన్నారు. విభజన చట్టంలో ఏపీ, తెలంగాణకు ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చాల్సిందేనన్నారు. విభజన హామీల అమలు విషయంలో తెలంగాణ కూడా నష్టపోయిందన్నారు. కాగా, విభజనతో నష్టపోయిన  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఆయన సభకు గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని బీజేడీ ఎంపీ ప్రసన్న ఆచార్య కోరారు. అన్నాడీఎంకే ఎంపీ నవనీత కృష్ణన్ మాట్లాడుతూ.. ఏపీపై కేంద్రం వివక్ష చూపడం సరికాదన్నారు. నష్టపోయిన ఏపీని కేంద్రం న్యాయం చేయాలని కోరారు.



ఇక చాలు.. మీ గోల ఆపండి!: వెంకయ్య

Updated By ManamMon, 07/23/2018 - 17:38

RS Chairman Venkaiah Naidu Issues A Warning To All The Parliamentarian

  • రాజ్యసభలో గందరగోళం

  • వెల్‌లోకి టీడీపీ.. వైసీపీ ఎంపీలు

  • ఒకరి తర్వాత ఒకరుగా నేతలు

  • ప్రత్యేక హోదాపై చర్చకు పట్టు

  • మంగళవారం ఇస్తానన్న వెంకయ్య

  • వెల్‌లోనే కొనసాగిన నిరసనలు

  • కాసేపు ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేత

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, అలాగే విభజన హామీల గురించి కూడా చర్చించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం, వైసీపీ ఎంపీలు రాజ్యసభలో ఆందోళన చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి మరీ నిరసనలు తెలపడం, నినాదాలు చేయడంతో మధ్యాహ్నానికి ముందే సభను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీలు వైఎస్ చౌదరి, సీఎం రమేశ్ తమ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. వాళ్ల నోటీసులను స్వల్పకాలిక చర్చగా మార్చామని, మంగళవారం వాటిపై చర్చిస్తామని చైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పారు. టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. ఏపీ సమస్యలపై స్వల్పకాలిక చర్చకు వారు పట్టుబట్టారు. ఆందోళన విరమించి సభ సజావుగా సాగేలా సహకరించాలని వెంకయ్య కోరారు. "మీ గోల ఎవరూ వినడం లేదు. చూడడం లేదు. ఇంకా ఎందుకు అరుస్తారు" టీడీపీ, వైసీపీ ఎంపీలపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకయ్య అన్న మాటలు తెలుగు ఎంపీలు ఒకింత అవాక్కయ్యారు. మన తెలుగు ఉపరాష్ట్రపతి అయ్యిండి మన సమస్యలను పట్టించుకోవట్లేదు.. చెబుతుంటే వినట్లేదని ఎంపీలు ఒకింత అసంతృప్తికి గురయ్యారు.

ఈ అంశంపై.. ఇప్పటికే బీఏసీ సమావేశంలో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ఆ తర్వాత వరికి కనీస మద్దతుధరపై అన్నాడీఎంకే సభ్యుడు విజిల సత్యనాథ్, ప్రభుత్వ నిఘా సంస్థలను ప్రభుత్వం రాజకీయ ప్రతీకారాలకు వాడుకుంటోందన్న అంశంపై కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఇచ్చిన ఇచ్చిన నోటీసులను జీరో అవర్‌లో చర్చకు చేపట్టారు. ఆయన ఆ విషయం చెప్పగానే టీడీపీ సభ్యులు పలువురు వెల్‌లోకి దూసుకె ళ్లారు. ఈ అంశాలపై పూర్తిస్థాయి చర్చ చేపట్టాలని వారు డిమాండు చేయగా, వెంకయ్యనాయుడు మాత్రం రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చకు అనుమతించారు.

దాంతో టీడీపీ, మరోవైపు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి కూడా వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఈ దశలో ఇతర సభ్యులకు అన్యాయం చేయద్దని, తాను 15 జీరో అవర్ నోటీసులను అనుమతించినందున వాటిపై చర్చించాలని చైర్మన్ చెప్పారు. సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లాలని సూచించినా, టీడీపీ.. వైసీపీ ఎంపీలు పట్టించుకోలేదు. దాంతో సభా కార్యకలాపాలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యుల నిరసనతో 20 నిమిషాలపాటు ప్రత్యక్షప్రసారం నిలిపివేశారు.



లైవ్‌లో ఎంత కామెడీ మిస్సయ్యా..!: కేటీఆర్

Updated By ManamSat, 07/21/2018 - 20:15

 major drama live in Loksabha

హైదరాబాద్: అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం నాడు పార్లమెంట్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించడం.. ప్రసంగం ముగించే ముందు సడన్‌గా ఎవరూ ఊహించని రీతిలో ప్రధాని నరేంద్ర మోదీ సీటులో కూర్చోనుండగా ఆయన దగ్గరకెళ్లి షేక్ హ్యాండిచ్చి.. హగ్ చేసుకోవడం.. ప్రసంగం ముగిసిన తర్వాత సీటులో కూర్చోని.. "ఎలా ఇచ్చాను ట్విస్ట్.." అన్నట్లుగా సహచరులను చూసి రాహుల్ కన్నుగీటడం ఈ పరిణామాలను చూసిన అటు కాంగ్రెస్‌తో పాటు.. ఇటు బీజేపీ ఇతర పార్టీల ఎంపీలు కంగుతిన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. రాహుల్ వ్యాఖ్యలకు కౌంటరివ్వడం.. యాక్షన్ చేస్తున్నట్లుగా చేయి అటు ఇటూ తిప్పడం.. వేళ్లు చూపించడం.. మధ్య మధ్యలో చప్పట్లు కొట్టినట్లు ఆయన చూపడం ఇవన్నీ పార్లమెంట్‌లో జరగడంతో లైవ్ చూసిన జనాలు కాసింత ఆశ్చర్యానికి లోనవ్వడమే కాక తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడమని.. పార్లమెంట్‌కు పంపిస్తే.. మీరు మా ఉద్ధరించేదేంటి..? మీ వల్ల మాకు ఒరిగేదేది నవ్వులు.. హగ్‌లు.. కన్నుకొట్టాడాలా..?అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అంతే కాదు రాహుల్ కన్నుగీటడాన్ని నటి ప్రియ ప్రకాష్ వారియర్‌తో పోలుస్తూ.. ఎవర్ని చూసి ఎవరు కన్నుగొట్టడం నేర్చుకున్నారబ్బా..? అని ట్రోల్స్ ఓ రేంజ్‌లో వచ్చాయి. 

ట్విట్టర్ వేదికగా ఈ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్ నవ్వులు పూయించారు. "కౌగిలింత, కన్నుకొట్టడం వంటి డ్రామాను లైవ్‌లో చూడటం మిస్ అయ్యాను" అని కేటీఆర్ సరదాగా ట్వీట్ చేశారు. రాహుల్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ మాట్లాడిన ప్రసంగాన్ని కూడా మిస్ అయ్యానని మంత్రి ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. అయితే ఈ ట్వీట్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 



శభాష్.. సిక్కోలు సింగం.. ఇరగదీశావ్!

Updated By ManamFri, 07/20/2018 - 21:00

Young MP Kinjarapu Rammohan Naidu Excellent Speech In Parliament Over No Confidence Motion

న్యూఢిల్లీ: ఏపీకి కేంద్రం న్యాయం చేసిందని.. అన్ని విధాలా ఆదుకుంటుందని చెబుతూనే టీడీపీపై బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ యువ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు దిమ్మదిరిగే కౌంటరిచ్చారు.హరిబాబు వైజాగ్ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యాడు.. కానీ ఢిల్లీ మాటలు మాట్లాడుతున్నారని ఈ విషయాలన్నీ తెలుగు ప్రజలు చూస్తున్నారని చెప్పుకొచ్చారాయన. హరిబాబు వ్యాఖ్యలను యువ ఎంపీ, సిక్కోలు సింగం రామ్మోహన్ తీవ్రంగా ఖండించారు. 

రామ్మోహన్ మాటల్లోనే.. 
"
విశాఖ రైల్వేజోన్ విషయంలో కేంద్రం మోసం చేసింది. విశాఖలో భూమలు, పోర్టులు ఉన్నా రైల్వేజోన్ ఎందుకు ఇవ్వడం లేదు..?. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని రాజ్యసభలో అన్నారు. హోదా ప్రకటనకు జైట్లీ కూడా సమర్థించారు. హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలని బీజేపీ డిమాండ్ చేసింది. నాటి ప్రకటనను ఇప్పటి ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. హోదా వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి.

ఏపీకి కేంద్రం ఇచ్చిన కొద్దిపాటి నిధుల గురించే చెబుతున్నారు.. ఇవ్వాల్సిన నిధులపై ఎందుకు మాట్లాడరు..? విభజన చట్టంపై హోం మంత్రి, ప్రధాని మంత్రి ఎప్పుడైనా సమీక్ష జరిపారా.? హామీల అమలుపై కేంద్రం అన్నీ అబద్ధాలే చెబుతున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పినవన్నీ అసత్యాలే. ఏపీకి ఇప్పటి వరకూ కేవలం 5శాతం మాత్రమే నిధులు ఇచ్చారు.. ఇలా ఇచ్చుకుంటూపోతే మరో ఇరవై ఏళ్లు పడుతుంది. ఓ ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని మరో ప్రధాని ఎందుకు అమలు చేయడం లేదు..?" కేంద్రంపై వరుస ప్రశ్నల వర్షం కురిపించారు.

రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నంత సేపు టీడీపీ ఎంపీలతో పాటు మిగిలిన పార్టీలు ఎంపీలు ప్రసంగాన్ని వింటూ తథేకంగా ఆయన వైపే చూడసాగారు. అనంతరం మాట్లాడిన ఆప్‌కు చెందిన ఎంపీ కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని ఏ రాష్ట్రానికీ కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆయన పార్లమెంట్ వేదికగా దుమ్మెత్తిపోశారు.

కాగా.. శుక్రవారం ఉదయం అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌‌ కేంద్రంపై గళమెత్తగా.. సాయంత్రం యువ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు హరిబాబును మొదలుకుని కేంద్ర మంత్రులు.. కేంద్ర ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. మొత్తానికి చూస్తే ఈ ఇద్దరు ఎంపీలే శుక్రవారం రోజు పార్లమెంట్ సమావేశాల్లో హైలైట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉత్తరాది ఎంపీలకు ఏ మాత్రం తీసిపోకుండా.. ఎక్కడా తడపడకుండా హిందీలో ప్రసంగించి.. ఏపీ ప్రజల గళాన్ని పార్లమెంట్ వేదికగా వినిపించి.. రామ్మోహన్ నాయుడు ‘శభాష్.. సిక్కోలు సింగం’ అని అనిపించుకున్నారు.





Related News