mathanam

రైతన్నకు సబ్సిడీ పోటు

Updated By ManamSat, 11/17/2018 - 00:35

imageగత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రైతులు శాంతియుతంగా పాదయాత్రలు చేస్తూ, తా ము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వా ల దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్ 2 మహాత్మాగాంధీ పుట్టిన రోజు నాడు కూడా వేల మంది రైతులు, హరిద్వార్ నుంచి ఢిల్లీకి శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే వారి యాత్రను విఫలం చేయటానికి వారి మీద లాఠీఛార్జి చేయ్యటమే కాక బాష్ప వాయువు, నీటి కాన్లతో భయభ్రాంతులకు గురిచేశారు పోలీసులు. అహింసకు మారుపేై రెన మహాత్ముడి పుట్టిన రోజునాడు దేశానికి అన్నంపెట్టే రైతుకు ఎంత ప్రాధాన్యత లభి స్తుందో అర్థమౌతోంది. ఒకసారి మహాత్ముడు బెంగుళూరులోని జాతీయ పాడి పరిశోధనా సంస్థను సందర్శించినప్పుడు, సందర్శకుల పుస్తకంలో తన వివరాలు నమోదు చేస్తు తన వృత్తి వ్యవసాయం అని రాశారంటే మహా త్ముడి దృష్టిలో రైతులంటే ఎంత గౌరవమో అర్థం చేసుకోవచ్చు. కాని నేటి రాజకీయ నాయకులకు మాత్రం రైతులను హీనంగా చూడటం పరిపాటిగా మారిపోయింది.

జాతీయ నేర పరిశోధనా సంస్థ లెక్కల ప్రకారం గత మూడు సంవత్సరాలో రైతులు నిరసన ప్రదర్శనలు చెయ్యటంformer ఏడు రెట్లు పెరిగింది. 2014లో దేశవ్యాప్తంగా 687 నిరశన ప్రదర్శనలు జరిగితే 2015లో 2,683, 2016లో 4,837 నిరశన ప్రదర్శనలు జరి గాయి. దేశంలో ఏక్కడ ఏ మూల రైతులు ఆందోళన చేసినా, రెండు విషయాల్లో మాత్రం అందరి స్వరం ఒక్కటే. మొదటిది పంట రుణాలను మాఫీ చెయ్యటం రెండవది 50 శా తం అనా లాభముండేటట్లు మద్దతు ధర ప్ర భుత్వం ప్రకటించటం. కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలు ఈ రెండు విషయాల మీద హామీలు గుప్పిస్తున్నారు. కాని ఆచర ణలో మాత్రం నిధుల లేమి వల్ల వారిని ఆదు కోలేక పోతున్నామని ముసలి కన్నీరు కారుస్తున్నారు.

98 శాతం రైతులందరూ అప్పులతోనే వ్యవసాయం సాగిస్తున్నారనేది వాస్తవం. 94 శాతం మంది రైతులకు వస్తున్న ఆదాయం కన్నా వ్యవసాయ పెట్టుబడులే ఎక్కువగా వుంటున్నాయి. గత నాలుగు దశాబ్దాలుగా రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిం దనేది వాస్తవం. పెరిగిన వ్యవసాయ అవ సరాల ఖర్చులు, కరువు కాటకాలతో దిగుబ డి తగ్గిపోవటం, గిట్టుబాటు ధరలు లేకపోవ టం వంటి కారణాలతో వీరికి న్యాయంగా రావాల్సిన ఆదాయం కూడా రాలేదు. దేశం మొత్తం మీద రైతులందరి అప్పును లెక్క కడితే రూ.12.60 లక్షల కోట్లుగా తేలింది (పార్లమెంటు నివేదిక). ఈ రుణాన్ని మొత్తా న్ని ఒకేసారి మాఫీ చేసే ఉదార హృదయం ఏ ప్రభుత్వానికీ లేదు కాని రూ.13.16 లక్షల కోట్ల రూపాయల కార్పొరేటు సంస్థల అప్పు లను మాత్రం రద్దుచేసే గొప్ప మనసుంది. రైతులందరూ ఎప్పుడైతే రుణమాఫీ కోసం తమ స్వరాన్ని పెంచుతారో, అప్పుడు మా త్రం మనదేశ ఆర్థికవేత్తలకు, విధాన రూపకర్త లకు మనదేశ ద్రవ్యలోటు గుర్తుకొస్తుంది. కార్పొరేట్ సంస్థల రుణాలు మాఫీ చేసే సమయంలో వీరికి ఇవేవీ గుర్తుకురావు.

దీనికి ముఖ్య కారణం ఏమంటే, నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయాన్ని ఏనాడు ఈ దేశానికి ఆర్థిక వనరుగా పరిగ ణించకపోవటమే. రైతుల మీద వెచ్చించిన ప్రతిరూపాయీ బూడిదలో పోసిన పన్నీరే అని వీరందరి అభిప్రాయం. వీరందరూ ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు. దేశంలో అత్య ధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఏదన్నా వుందంటే అది వ్యవసాయ రంగం మాత్రమే.

దేశంలోని 23 రకాల పంటలకు గిట్టు బాటు ధరలు ప్రకటించలేనప్పుడు, ప్రభుత్వ మే ఈ పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవచ్చు. దేశంలోని పంటలన్నిటినీ కొ నుగోలు చెయ్యటానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమౌతాయి. కాని ఇక్కడ కూడా నిధు లు లేవనే పాతపాటే పాడుతున్నాయి ప్రభు త్వాలు. మరి పదేళ్ళుగా, ఆర్థిక మాంధ్యం (2008 - 2009) కారణంగా అప్పుల పాలైన పరిశ్రమలను ఆదుకోవటానికి ప్రతి ఏడాది రూ.1.86లక్షల కోట్లు ఆర్థిక సహాయం ఎలా చేయగలుగుతున్నారు. అసలు మద్దతు ధర ఏ ప్రతిపాదికన లెక్కగడుతున్నారో కూడా ప్రభుత్వాల దగ్గర లెక్కలు లేవు. కేవలం పంట పెట్టుబడి ఖర్చులు, పంట పండించ టానికి కావాలిసిన కార్మికుల వేతనాలు మాత్రమే లెక్కలోకి తీసుకుని మద్ధతు ధరలు లెక్కగడుతున్నారు. వ్యాపారులు ఏ కష్టం పడకుండానే లాభాలు వేసుకుని వస్తువులు అమ్ముతున్నప్పుడు పంట పండించిన రైతు లు తమ పంటను అమ్ముకునేటప్పుడు లాభా లు వేసుకోనక్కర్లేదా.

ఇటీవల అంతర్జాతీయ ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థలోని సభ్యదేశాల సహకారం తో భారతీయ ఆర్థిక విధానాల పరిశోధనా సంస్థ చేసిన ఒక సర్వేలో, మనదేశంలోని మార్కెటింగ్ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని స్పష్టం చేసింది. దీనికి ము ఖ్య కారణం ఎగుమతులపై నిషేధం విధించ టం, అత్యవసర ఆహార చట్టం ప్రకారం, ఎగుమతి ధరలను నియంత్రించటం అమ్మ పెట్టదు, అడుక్క తిననివ్వదు అనే చందంగా దేశీయంగా అమ్ముకుందాం అంటే మద్దతు ధర దొరకదు, విదేశాలకు ఎగుమతి చేద్దా మంటే చట్టాలతో అడ్డం పడుతోంది ప్రభు త్వం. ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రైతుల సమస్యలపై కూలంకుషంగా చర్చించి సమస్యలకు పరిష్కారాలు కనుగొనకపోతే మరిని నిరశన ఉద్యమాలు రానున్న కాలంలో జరుగుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.

- ఈదర శ్రీనివాసరెడ్డిచిక్కుల్లో ఆరోగ్యం చుక్కల్లో వైద్యం

Updated By ManamSat, 11/17/2018 - 00:35

imageమానవుల ప్రాథమిక అవసరాల్లో ఈనాడు ఔషధాల పాత్ర ఎంత ప్రధానంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పూ పప్పూ లేకపోయినా రోజు గడిచిపోతుంది కాని, మందుబిళ్ళ లేకుండా పూట గడిచే పరిస్థితి మాత్రం కానరావడం లేదు. రకరకాల వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారానికి సంబంధించి 47వ అధికరణ ఇస్తున్న రాజ్యాం గ హామీ భారతీయులకు చేదుమాత్రగానే మిగిలిపోయింది. పేదరికం కారణంగా పౌష్టికాహారం అందక ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. 

ప్రపంచం మొత్తంలో వివిధ రకాల వ్యాధులతో బాధపడు తున్నవారు మనదేశంలోనే ఎక్కువగా ఉన్నారు. దేశంలోని అత్యధిక శాతం మంది ప్రజలు తమ ఆదాయంలో 70 శాతం ఔషధాల కొనుగోలుకు, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ఖర్చులకే వినియోగిస్తున్నారు. తక్కువ ఆదాయ మార్గాలు కలి గిన మధ్య తరగతికి చెందిన 40 శాతానికి పైగా కుటుంబాలు కేవలం ఆరోగ్యపరమైన అవసరాలకే అప్పులు చేస్తున్నాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ సర్వే వెల్ల డించింది. దేశంలో  పేదరికం పెరగడానికి ప్రధాన కారణం వైద్య ఖర్చులే కావడం ఎంతైనా విచారించదగిన, సిగ్గు పడాల్సిన విషయం. వైద్య ఖర్చులు చాలామందిని దారి ద్య్ర రేఖ దిగువకు నెట్టేస్తున్నాయి. సాధారణ, మధ్య తరగతికి చెందిన ప్రజలు తమ కుటుంబంలో ఎవరో ఒకరోగికి వైద్యం చేయించి, ఉన్నదం తా పోగొట్టుకొని పేదల జాబితాలో చేరిన వారు అనేకమంది ఉన్నారు. దేశంలో వేలాదిమంది కేవలం వైద్య ఖర్చుల కా రణంగా బలవంతంగా పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే, రోగ నిర్ధారణకు(టెస్టులకు), ఔషధాల కొను గోలుకు, వైద్యశాల గదులకు(రూమ్ రెం ట్స్), డాక్టర్ ఫీజులకు అయ్యే ఖర్చు భరిం చలేక లక్షలాదిమంది ప్రజలు దారిద్య్రపు కోరల్లో చిక్కుకుపోతున్నారు. కేవలం మెడికల్ బిల్లుల కారణంగానే అనేకమంది దివాలా తీస్తున్నా రని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధికారులే వెల్లడించారు.
 

mathanam

ఈ దుస్థితికి ప్రధాన కారణం వ్యవస్థలోని లోపాలు. ఈ లోపాలే ప్రజలకు శాపాలుగా మారుతున్నాయి. ఔషధాల తయారీకి గాని, మార్కెటింగ్‌కు గాని ఒక స్పష్టమైన, నిర్దిష్ట  విధానమంటూ లేకుండా పోయింది. ఒక ఔషధాన్ని తయారు చేసేకంపెనీ దాన్ని ఎంతకైనా సొమ్ముచేసుకోవచ్చు. పదిరూపా యలు విలువచేసే మందును వంద రూపాయలకైనా అమ్ముకో వచ్చు. దీనిపై ఎలాంటి నియంత్రణ లేదు. ఈ కారణంగానే ఔషధ తయారీకంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నాయి. పట్టించుకునే వారు, ప్ర శ్నించే వారు ఎవరూ లేరు. ఆడింది ఆట, పాడింది పాటగా సదరు కంపెనీలు ఇష్టారాజ్యం చేస్తున్నాయి. వ్యవస్థలోని లోపా లను ఆసరాగా చేసుకొని ఎవరికి వారు అందిన వరకు దండు కుంటున్నారు. ఫలితంగా వినియోగదారులు అనివార్యంగా తీవ్రమైన నష్టాన్ని చవిచూడవలసి వస్తోంది. ప్రభుత్వం నుంచి గాని, సంబంధిత శాఖ నుంచి గాని ఎలాంటి అవరోధాలూ, నియంత్రణలూ లేకపోవడం ఉత్పత్తిదారులకు, వ్యాపారులకు, వైద్యులకు అద్భుత వరంగా పరిణమిస్తోంది. ఈ సువర్ణా వకాశాన్ని వారు చక్కగా వినియోగించుకుంటూ, వినియోగ దారుల ముక్కుపిండుతున్నారు.

         సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు మొదలు, గ్రామీణ వైద్యశాలల వరకు, చిన్నచిన్న రక్త పరీక్షా కేంద్రాలు మొదలు పెద్ద పెద్ద, రకరకాల పరీక్షలు, ఎక్స్‌రేలు, స్కానింగు లు తీసే డయాగ్నో స్టిక్ సెంటర్ల వరకు పచ్చి వ్యాపారమే రాజ్యమేలు తోంది తప్ప, మానవీయ కోణం ఏ కోశా నా కానరావ డం లేదు. వీటికి ఏ మాత్రం తీసిపో కుండా మెడికల్ షా పులు పోటీ పడుతు న్నాయి. ఈ మూడు విభా గాలూ రోగులను పీల్చిపిప్పి చేస్తున్నాయన్న ప్రజల ఆరోపణ సత్యదూరం ఎంతమాత్రం కాదు. అయితే ఇక్కడ అందరినీ ఒకే గాటన కట్టలేం. వైద్యుల్లో, ఔషధ వ్యాపారుల్లో, పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్న వారిలో సేవాభావం కలిగినవారు, ప్రమాణాలు పాటించేవారు, మానవీయ విలువలను గౌరవించేవారు చాలామంది ఉన్నా రు. కాని ఇలాంటివారి సంఖ్య తక్కువగా ఉంది. ‘రోగగ్రస్త’ సొమ్ముకోసం అర్రులు చాస్తున్నవారే అధికశాతం ఉన్నారు, ఇదే ఆవేదన కలిగించే విషయం.

ఒకవ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానకు వెళి తే, ముందుగా అక్కడి రిసెప్షన్ కౌంటర్‌లో వేలకువేలు డిపా జిట్ చేయాలి. కేసు తీవ్రతను బట్టి లక్షలు కూడా కట్టించుకుం టారు. తరువాత ‘పరీక్షలు’ మొదలవుతావు. పరీక్షల ద్వారానే రోగనిర్ధారణ జరుగుతుందన్న విషయంలో మరో అభిప్రాయా నికి తావు లేదు. కాని, అవసరమున్నా, లేకున్నా పదుల సం ఖ్యలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించి రోగిని ఆర్ధికంగానే కాకుండా, మానసికంగానూ గుల్లచేసే ధోరణి గత కొన్నేళ్ళుగా బాగా ప్రబలిపోయింది. ఇక దీని తరువాత అసలు ‘వైద్యం’ మొదలవుతుంది. ఇందులో డయాగ్నోస్టిక్ సెంటరుతో పాటు, మందుల షాపుదీ (అన్నీ కాదు) ప్రధానపాత్రే. కొందరు వైద్యు లు తక్కువ ధరకు లభిస్తున్న నాణ్యత కలిగిన మందులను సిఫారసు చేయకుండా, కమీషన్ల కక్కుర్తితో అంతగా నాణ్యత లేకపోయినా అధికధర- అంటే, యం.ఆర్.పి ఎక్కువగా ఉన్న, కమీషన్లను తెచ్చిపెట్టే నాసిరకం మందులనే సిఫారసు చేస్తుం టారు. ఇది రోగికి గోరుచుట్టుపై రోకటి పోటులా పెను భారం గా పరిణమిస్తోంది. చౌకధరకే నాణ్యమైన మందులు అంటూ ప్రవేశపెట్టిన జనెరిక్ ఔషధాలు ఎవరికి ప్రయోజనం చేకూర్చు తున్నాయో ప్రభుత్వమే చెప్పాలి.

ప్రస్తుతం సుగరు, బీపీ, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు మానవ సమాజంపై బలంగా దాడిచేస్తున్నాయి. దేశంలో ప్రతి నలుగురి లో ఒకరికి సుగరు, ప్రతి ముగ్గురిలో ఒకరికి బీపీ ఉన్నట్లు జాతీయ పౌష్టికాహార సంస్థ దేశవ్యాప్తంగా దాదాపు 1.72 లక్షల మందిపై సర్వేచేసి వెల్లడించింది. ఇందులో అన్నిటికన్నా ఎక్కు వగా కలవర పెడుతున్నది సుగర్ వ్యాధి. చిన్నాపెద్దా అనే తార తమ్యం లేకుండా అందరినీ చుట్టుముట్టి  పట్టిపీడిస్తున్న ఈ వ్యాధి మనదేశంలో శరవేగంతో విజృంభిస్తోంది. ఈ మహ మ్మారి నుంచి తమను తాము కాపాడుకోడానికి ఒక్కో రోగి ఏటా సగటున 10 వేలు కేవలం సుగర్ మందులకే ఖర్చు పెడుతున్నాడు. మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణం గా మృత్యువాత పడుతున్నవారి సంఖ్య పదేళ్ళలో 50 శాతం పెరిగింది. గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ డాటా ప్రకారం - 2005 కు ముందు మనదేశంలో మరణాలకు కారణమైన వ్యాధుల జాబితాలో మధుమేహం 11వ స్థానంలో ఉండగా, ఇప్పుడది ఏడవ స్థానానికి చేరుకుంది. చైనా తరువాత అత్యధికంగా సుగ ర్ వ్యాధిగ్రస్తులున్నదేశం మనదే. 6.51 కోట్ల వ్యాధిగ్రస్తులు మనదేశంలో ఉన్నారు. 2030 నాటికల్లా ఈ సంఖ్య 10.12 కోట్లకు చేరుకుంటుందన్న ’తీపి’ నిజం ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది.

ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోడానికి ఇండియన్ ఫార్మా స్యూటి కల్ అసోసియేషన్ 2016లో, తన 55వ జాతీయ వారోత్స వాల సందర్భంగా, అన్న నినాదాన్ని ఎంపిక చేసింది. 2017లోఅన్న నినాదాన్ని ఎంచుకుంది. ఈ సంవత్సరంనినాదాన్ని ఎంపికచేసింది. దీని కనుగుణంగా  వ్యాధుల నియంత్రణకు, ఆరోగ్య భారత నిర్మా ణ కల సాకారం చేయడానికి ఫార్మాసిస్టులు తమ పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రభు త్వాలు, ప్రజలు కూడా వారి సేవలను సమర్ధవంతంగా విని యోగించుకోగలిగితే ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. ‘ప్రివె న్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ’ అని మన పెద్దలు అన్న ఆణిముత్యం లాంటి మాటను వంట బట్టించుకొని, వ్యాధి సోకిన తరువాత తీరిగ్గా బాధపడేకంటే, అసలు అది రాకుం డా జాగ్రత్తపడడం తెలివైన పని. ఈ దిశగా ప్రజల్లో అవగా హన, చైతన్యం కలిగించగలిగితే అనేక వ్యాధుల నుంచి మానవ సమాజం రక్షణ పొందగలుగుతుంది.

- యండి.ఉస్మాన్ ఖాన్
సీనియర్ పాత్రికేయులు
 9912580645

 నేటి బాలలే రేపటి రోగులు!?

Updated By ManamWed, 11/14/2018 - 01:10

imageఅవును. రేపటి పౌరులుగా, ఆరోగ్య వంతమైన యువతగా దేశప్రగతికి కారణం కావలసిన నేటి బాల్యం రక రకాల అలవాట్లు, బలహీనతలు, రుగ్మతలతో సతమతమౌతోంది. ఎటు చూసినా విటమిన్ల లోపాలు, అపరిశుభ్ర కాలుష్యంతో విస్తరిస్తున్న వైరస్‌లు ఒకవైపు, నిర్లక్ష్యం, సమయా భావ జీవితంలో జంకు పదార్థాలు, నియమం తప్పిన భోజన విధానం ముఖ్య కారణాలుగా కనిపిస్తాయి.

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలలో పౌష్టికాహారలోపంతో చాలినంత ఆహారం లేక బాధ పడుతున్నారు. జపాన్ వంటి చిన్న దేశాలే అయినా ఆరోగ్యవంతమైన ఆహారం, అలవాట్లతో ప్రపంచంలోనే అధికశాతం దీర్ఘాయుష్మంతులతో ప్రత్యేక శ్రద్ధతో జీవిస్తూ ఇతర దేశాలకు మార్గదర్శకమౌతున్నాయి.

image

అయితే, మనదేశంలో వచ్చిన ముఖ్యమైన సమస్య విద్యార్ధులపై తీవ్రస్థాయిలో ఒత్తిడితో బాటు, చదువుకు ఇచ్చిన విలువ తినే సమయాలకు ఇవ్వకపోవటం ఎక్కువగా ప్రైవేటు పాఠ శాలల్లో కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో తగినంత సమయం కేటాయిస్తున్నా, విద్యార్ధులు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్ళలో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో మం చి నియమ నిబంధనలే పాటిస్తున్నా, అవి తక్కువ శాతంగా మాత్రమే వుంటున్నాయి.

చాలా స్కూళ్ళలో ఇళ్ళ నుంచి పిల్లలు బయలుదేరే సమయాన్ని బట్టి ఉదయం ఏడు, ఏడున్నరకల్లా తినలేక స్కూళ్ళకు చేరుతుంటారు. అయితే బడిలో వారికోసం ఇచ్చే షార్ట్ బ్రేక్ సమయం పదినిమిషాలే వుంటోంది. ఆ సమయంలో వాళ్ళు వాష్ రూంలకెళ్ళి చేతులు శుభ్రం చేసుకుని వచ్చే సరికే సరిపోతుండటంతో, ఇంకా టీచర్లు కూడా బెల్ మోగినా మరి కాస్త ఎక్కువ సమయం క్లాస్ తీసుకుంటే, తరువాత వచ్చే టీచర్లు బాక్స్‌లు మూసేయమని కోపగించుకోవటంతో ఉపాహారం తినలేకపోతున్న విద్యార్ధులు అధికం.
కొందరు ప్రిన్సిపాళ్ళు, టీచర్లు స్వయంగా ‘పిల్లలకు ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నం లాంటివి పెట్టకండి. లైట్‌గా వుండే ఏ బ్రెడ్డో, నూడిల్సో పెట్టి పంపండి. లేకుంటే సమయం సరిపోదు’ అంటూ పిల్లల ఆరోగ్యం కన్నా, వారు పాఠాలు వినటానికి సిద్ధంగా వుండటమే మిన్నని భావిస్తూ చెప్పటం విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.

మునుపు ఉదయం ఎనిమిదిన్నరకు మొదలయ్యే స్కూళ్ళు పన్నెండింటికి మధ్యాహ్న భోజనానికి వదిలితే, తిరిగి  ఒకటిన్నర నుంచి సాయంత్రం నాలుగింటి వరకు వుండేవి. ఇళ్ళ కెళ్ళి వచ్చే పని లేనందు వల్ల కనీసం ఇప్పుడు పన్నెండింటి నుంచీ ఒక గంటవరకైనా సమ యం కేటాయిస్తే వాళ్ళు తగినంత ఆహారం తినగలుగుతారు. అంతే కాకుండా ప్రతి పీరియడ్ లోనూ టీచర్ రాగానే వాళ్ళను ఓ గ్లాసుడు మంచినీళ్ళు తాగమని చెబితే సరైన మోతాదులో  నీళ్ళు కూడా తాగక చదువులోపడి అనేక ఆరోగ్య సమస్యల బారిన పడకుండా వుండ గలుగుతారు.

నిజానికి నర్సరీ నుంచీ ఐదవతరగతి వరకూ పరీక్షలు, గ్రేడులన్నవి, వారి లేత వ్రేళ్ళు వాచేలా హోంవర్కులు, యాక్టివిటీలు ఇవ్వకుంటే ఒత్తిడికి దూరమై వాళ్ళు మానసికంగా ఎదగ గలుగుతారు. అలాగే, ర్యాంకులే పరమావధని, డాక్టర్, ఇంజనీర్ కాకుంటే ఆ చదువే నిరర్ధకమని భావించకుండా పిల్లల్ని మార్కులుతెచ్చే యంత్రాల్లా భావించి ఏదో ఒక ఆహా రం ఆరోగ్యానికి మంచిదంటూ పిల్లల రుచిని పట్టించుకోకుండా వండి ఇచ్చేయటం పేరంట్స్ కి తగదు. ఏ పదార్ధమైనా కాస్త శ్రద్ధ పెట్టి వీలైనంత వరకు ఇంటి భోజనంలో ఆకుకూరలు, కూరగాయలతో, ఒక పండు, స్నాక్స్‌గా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవ్వగలిగితే మేలు. వారి అభి రుచిని బట్టి విద్యార్ధుల్ని ఆ రంగంలో ప్రోత్సహిస్తే వాళ్ళు ఉన్నతంగా ఎదిగే అవకాశం వుంటుంది. 

ముఖ్యంగా తగిన ఆహారంతో బాటూ స్కూళ్ళలో అయినా, ఇంటిదగ్గరైనా కాస్త ఎండ శరీరానికి తగిలేలా ఉదయం, సాయంత్రం పావు గంటైనా వుండనిస్తే శరీర ఎదుగు దలకు, తీసుకున్న ఆహారంలోని కాల్షియం వొంటికి అందించే విటమిన్ ‘డి’ అంది, ఈ రోజుల్లో చాలా మందిలో కొరవడ్తున్న ‘డి’ విటమిన్ డెఫిషియన్సీ వుండదు. దానివల్ల శారీరక, మానసిక వికాసం, రక్తహీనత లాంటి ఇబ్బందులు తొలగి ఉత్సాహవంతులైన, ఆరోగ్యంతో ఆలోచనలో పరిణతి కలిగిన వివేకవంతులైన పౌరులు తయారవుతారు.

ప్రభుత్వం కూడా కలుగ జేసుకుని అన్ని ప్రైవేటు స్కూళ్ళలో సైతం ఉపాహార సమయం అరగంటకు, మధ్యాహ్న భోజన సమయం కనీసం ముప్పావు గంటకు, పెంచితే నిదానం గాను, ఇప్పటికంటే మెరుగ్గాను ఆహారం తీసుకునే వీలుంటుంది. పాఠాలు చక్కగా బుర్రకెక్కి జ్ఞాపకం వుంటాయి. దానివల్ల వ్యాధినిరోధకశక్తి వచ్చి, తరగతుల్లో ఉత్తీర్ణతా శాతం కూడా మెరుగై మానసిక సమస్యలు తొలగి ఆరోగ్య భారతం మనదవుతుంది.

- డేగల అనితాసూరి
9247500819మాకొద్దీ ‘కంటిన్యూడ్ టెన్షన్’ స్కీం..

Updated By ManamTue, 11/13/2018 - 00:52

image‘కొండ నాలుకకి మం దేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్నట్లుంది, కాంట్రిబ్యూటరీ పెన్ష న్ స్కీంలోకి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి. ఉద్యోగ విరమణ తర్వాత, పాత పద్ధతి కన్నా ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాలు దీనిలో ఉంటా యని, ప్రభుత్వం ఉద్యోగుల మీద బలవంతంగా రుద్దింది. ఈ స్కీం పరిధిలోకి రావడం మూలాన సర్వీసులో ఉన్న ఉద్యోగి అకాల మరణం నుంచి, ఆరోగ్యంగా జీవించి సహజంగా మర ణించే వరకు, కారుణ్య నియామకం నుండి ఫ్యామిలీ పెన్షన్ వర కు ఉద్యోగికి న్యాయంగా అందాల్సిన అనేక రకాల ప్రయోజనాలు కోల్పోవాల్సి వచ్చింది.

2004లో వాజపేయి హయాంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసిన ఈ చట్టం, ఉద్యోగుల పాలిట శాపంలా మారింది. నాడు పార్ల మెంటులో చట్టం చేస్తూ, ‘సీపీఎస్ పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగి, పదవీ విరమణ తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో, మోయలేనంత డబ్బును అందుకుంటారు అని ఊహల్లో ముంచారు. దీనిపై అం తగా స్పష్టత లేకపోవడంతో వివిధ పార్టీలు, ఉద్యోగులు దీనిపై ఆసక్తి కనబరచారు. ఇదే సందర్భంలో కమ్యునిస్టు పార్టీల సభ్యు లు మాత్రం కొత్త పద్ధతిలో లోపాలను వేగంగా అర్థం చేసుకుని, రాబోయే కాలంలో ఇది ఉద్యోగుల్లో తీవ్ర అభద్రతని కల్గిస్తుం దని, కనుక వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కాని, వారికి మద్దతిచ్చే సభ్యులు చాలినంత లేకపోవటంతో బిల్లు పాస య్యింది. కేవలం కమ్యునిస్ట్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కొత్త పెన్షన్ స్కీమ్‌లో చేరలేదు. మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీంలో చేరడానికి మొగ్గు చూపి, తమ రాష్ట్ర ఉద్యోగులను దీని పరిధిలోకి తెస్తూ కేంద్రానికి లేఖలు పంపాయి. ఇదిలా ఉండగా పాత పెన్షన్ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇటీవల అధికారం లోకి వచ్చిన కొత్త ప్రభుత్వాలు దాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ ను అమలు చేసి ఉద్యోగుల పట్ల తమ కర్కశాన్ని చూపాయి.
 

image

2004 కంటే ముందు ఉద్యోగం సాధించిన వారికి ఆర్థిక భద్రత ఉంది. వారు సర్వీసులో ఉండి ప్రమాదవశాత్తు చనిపోతే, తక్షణమే ఉద్యోగి ఇంట్లో ఒక సభ్యునికి విద్యార్హతను బట్టి ఏదేని శాఖలో ఉద్యోగం ఇచ్చేవారు తద్వారా సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేవారు. అదే సమయంలో ఉద్యోగి చేసిన సేవలకు గుర్తిం పుగా గ్రాట్యుటీ అందించేవారు. ఇలా కాకుండా, ఉద్యోగి ఆరో గ్యంగా ఉండి పూర్తి సర్వీసు కాలం పనిచేసి సహజ మరణం పొం దితే, అతనికి గ్రాట్యుటీతో పాటుగా పెన్షన్ వర్తింపజేసేవారు. పెన్షన్‌ను మొదట ఆ ఉద్యోగికి, తర్వాత  భార్య/భర్తకి అందించి, వారు మరణించిన తర్వాత వారి సంతానంలో ఒకరికి వివాహం అయ్యే వరకు వర్తింప జేసేవారు. సర్వీసులో ఉన్నవారికి  అత్య వసర సమయాల్లో ఆదుకోవడానికి జీిపీఎఫ్ లోన్ ఇచ్చేవారు. కాని ఇది గతం.

2004 సెప్టెంబర్ 1 తర్వాత సీను మారింది. ఉద్యోగార్థులు పాత పద్ధతి లాగే (కొన్ని ఉద్యోగాలలో గతం కంటే కఠినంగా) కేంద్ర/రాష్ట్ర ప్రభు త్వాలు నిర్వహించే అర్హతా పరీక్షల కోసం ఎంతో కాలాన్ని, ధనాన్ని వెచ్చించి, ఎంతో మందితో పోటీపడి నెగ్గి ఉద్యో గం సాధిస్తున్నారు. వీరికి పాత పెన్షన్ పద్ధతిలోని ఉద్యోగికి అందే అకాల/సహజ మరణాంతరం/పదవీ విరమణ అనంతరం అందే ప్రయోజనాలు ఏవి అందకపోవడం విచారకరం. దీనికి కారణం పార్లమెంటులో చేసిన ఫెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ (్కఊఖఈఅ) బిల్లు చట్టంగా మార్చడం.దీనిలో  ప్రతినెల ఉద్యోగి జీతంలో 10శాతంతో పాటు, ప్రభుత్వం 10 శాతం కలిపి షేర్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టి దాని లాభ, నష్టాల మీదనే ఉద్యోగి పెన్షన్ ఆధారపడేలా చేశారు. షేర్ మార్కె ట్ అంతర్జాతీయ కారణాలతో ఎప్పుడు లాభనష్టాలకు గురవుతుం దో ఎవరికీ తెలియదు. దీనిలో లాభం మాట అటుంచి నెలనెలా పోగేసుకున్న డబ్బుకు కూడా భద్రత లేకుండాపోయింది. 2007లో ఉద్యోగంలో చేరి 2016లో పదవీ విరమణ చేసిన ఉద్యోగికి 650 పెన్షన్ అందుతుందంటే, నాటి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత మోసపూరితంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగి తో చేతనైనంత వరకు పని చేయించుకుని, తర్వాత నిరాదరణకి గురిచేయడం సీపిఎస్ ఉద్యోగులకు ఆగ్రహం తెప్పిస్తున్నది. వృద్ధా ప్యంలో పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, సొంతింటికలలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు, అనుకోని సమస్యలు ఇలా అనేకం  ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఇవన్ని ఒక ఎత్తైతే కొత్తస్కీం ఉద్యోగి సర్వీ సులో అకాల మరణం చెందితే వారి కుటుంబం ఉన్న ఫలంగా రోడ్డున పడుతుంది.

ఇలాంటి కుటుంబాలు నేడు తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 140 దాకా ఉన్నాయి. వారి పరిస్థితి ఘోరాతి ఘోరం. ఈ పరిస్థితుల దృష్ట్యా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కాస్త కంటిన్యూడ్ టెన్షన్ స్కీంగా మారింది. అందుకే కొత్త పెన్షన్ స్కీం ను వ్యతిరేకించే సంఘాలు, ముందు డెత్ కం రిటైర్మెంట్ గ్రాట్యు టీ, కారుణ్య నియామకాలు, ఫామిలీ పెన్షన్ వర్తింపజేయాలని చాలా కాలం క్రితమే ఉద్యమ బాట పట్టాయి. మరణించిన కుటుంబానికి ఎంత త్వరగా వీలైతే, అంత త్వరగా వర్తింపజేసి ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనేది వారి ఆశ. ఇప్పటికే ఎన్నో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద ఒత్తి డి తీసుకురావడానికి మాతృ సంఘాలతో పాటు అన్ని సంఘాల సమ్మేళనం అయిన టీఎస్ సీపిఎస్ సీఏలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాయి. కానీ, ప్రభుత్వాలలో చలనం లేదు. తెలంగాణ తొలి ప్రభుత్వం ఏర్పాటు అయిన కొత్తలో కూడా దీన్ని మార్చు కునే అవకాశం ఉండగా ప్రభుత్వం పాత పద్ధతిలోనే కొనసాగు తామని కేంద్రానికి లేఖ ఇవ్వడంతో ఆ అవకాశం కూడా చేజా రింది. శాసనసభలో విపక్ష సభ్యులు లేవనెత్తిన సీపిఎస్ సమస్యపై ఆర్థికమంత్రి గారు మాట్లాడుతూ, దీనిపైన సందేహాలు పెట్టుకోవ ద్దని పాత పెన్షన్ పద్ధతి కన్నా అధిక ఆర్ధిక ప్రయోజనాలు దీని ద్వారానే అందుతాయని వ్యాఖ్యానిం చారు. దీనిని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తూ, ఆందోళన వ్యక్తం చేసాయి. అంత ఎక్కువ ప్రయోజనాలు ఉంటే పాతపద్దతిలోని వారిని కూడా దీని పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదు? అనే ప్రశ్న ఈ సందర్భంగా ఆలోచించవలసిందే.

32 ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షా 20 వేల ఉద్యోగులు దీని పరిధిలో ఉండటం వలన వారి కుటుంబాలు సైతం తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. కాబట్టి రాబోయే ప్రభుత్వ మైనా, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో నం.653, 654, 655లను రద్దు చేస్తూ ఉద్యోగులను తిరిగి పాత పెన్షన్ పద్ధతి పరిధిలోకి తీసుకు వస్తూ, వారి కుటుంబాలకు భరో సా కల్పించాలి. పాత పెన్షన్ పరిధిలోని ఉద్యోగులు అందరూ సీపిఎస్ ఉద్యోగులకు మద్దతిచ్చి పరిష్కారం అయ్యేవరకు పోరా డాలి లేదంటే మెల్లిమెల్లిగా వారిని కూడా ఈ పెట్టుబడిదారీ అను కూల ప్రభుత్వాలు సీపిఎస్ పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తాయి. అంతే కాకుండా వారి పిల్లలు రేపు కొత్తగా సర్వీసులోకి వస్తే వారికి కూడా ఈ కొత్త పెన్షన్ అనే మహమ్మారి పట్టుకుంటు దనే విషయం మరువరాదు.

కావున అందరు కలిసికట్టుగా, ఉమ్మడి ప్రణాళికతో ఐక్య ఉద్యమాలు నిర్మించి సీపిఎస్ రద్దు తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితిని రాబోయే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి కలుగజేయాలి.’ పెన్షన్ అనేది భిక్ష కాదు, వృద్ధా ప్యంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వ కనీస బాధ్యత’ అని చాటిన సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. కావునా వివిధ సంఘాల్లో ఉన్న ఉద్యోగులు అందరూ ఎలాంటి బేషజాలకు పోకుండా, సీపిఎస్ రద్దు కోసం ఉమ్మడి కార్యచరణతో ముక్తకంఠంతో గళమెత్తాలి. అప్పుడే సీపిఎస్ రద్దుకై ప్రభుత్వాల్లో ఆలోచన మొదలవుతుంది. ఆ దిశగా ఉద్యోగులు సీపిఎస్ రద్దు కోసం పోరాటాన్ని  తీవ్ర తరం చేసి, పాత పెన్షన్ సాధించుకోవాలి. ఆ భద్రతతో ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించి, ఉన్న తమైన సమాజ నిర్మాణం కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తారని ఆశిద్దాం.

- రవికుమార్ సంగనమోని
7893903740ఫోన్ ‘టాప్’ఇంగ్

Updated By ManamTue, 11/13/2018 - 00:52

imageమీ చేతిలో ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ ఉందా.. అయితే ప్రపంచం చేతిలో మీరు ఉన్నట్లే... పెరుగుతున్న సెల్ ఫోన్ల సంఖ్యతో పాటు వాటి ద్వారా జరుగుతున్న ఆన్‌లైన్ నేరాల్లో 2012లో 30 శాతం పెరుగుదల నమోదైందని ప్రముఖ యాంటీ వైరస్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సెల్‌ఫోన్ల ఆధారంగా ఆర్థిక లావాదేవీలు పెరుగు తుండటంతో నేరాలు అదే స్థాయిలో వృద్ధి చెందుతున్నాయి. ఇవే కాక ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్న నేరాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సగటు మొబైల్ వినియోగదారుడ్ని వెంటాడుతున్న భయం ఫోన్ ట్యాపింగ్. దీని ద్వారా మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు దొంగలిస్తారు. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ రహస్య వివరాలను తెలుసుకొని మీ ఖాతాలకు కన్నం వేస్తారు. మీరే పంపించినట్లుగా అనుచిత సందేశాలను ఇతరులకు పంపిస్తారు. మీ పనిని మరింత సులభం చేస్తామంటూ ట్రాక్ వ్యూ లాంటి ట్యాపింగ్ యాప్స్ కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఆ ట్యాపింగ్ భూతం నుంచి తప్పించుకోవడం ఎలా.. మన మొబైల్ ట్యాపింగ్‌కు గురైం దని తెలుసుకోవడం ఎలా?

సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు కొంపలు ముంచేస్తాయని తెలుసుకోలేక ఎంతోమంది మోసపోతూనే ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కొన్ని ముఠాలు నిత్యం వల వేస్తూనే ఉన్నాయి. ఉద్యోగ ప్రకటనలు, వివాహ ప్రకటనలు, స్నేహాల పేరుతో కొన్ని ముఠాలు, బ్యాంకు ఖాతాదారుల ఓటీపీలను తెలుసుకుని మరికొన్ని ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయి. వ్యక్తుల వ్యక్తిగత గోప్యత, అంతర్జాలం ద్వారా ఇతరులకు తెలిసే అవకాశం ఉంది. ఆ వ్యక్తిపై అతని కంప్యూటర్‌ను వైరస్ ద్వారా లొంగ దీసుకుని అతని సమాచారాన్ని దొంగిలించడం జరుగుతోంది ఈ నేరాలానే హ్యాకింగ్, ట్యాపింగ్ అంటారు. అలాగే అంతర్జాలం ద్వారా నకిలీ సాఫ్ట్‌వేర్‌ని ప్రచారం చేయడం తద్వారా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కులను అతిక్రమిస్తున్నారు. అంతేకాక అశ్లీల చిత్రాలను, వీడియోలను సమాజంలోకి వెదజల్లడం తరహా సైబర్ నేరాలు చేయడం ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రస్తుత సమాజంలో కంప్యూటర్, మొబైల్ దాని అనుబంధ వస్తు సామాగ్రిని ఉపయోగించి అనేక రకాల నేరాలు జరగడం సహజంగా మారింది.

image


సైబర్ ప్రపంచం రెండు వైపులా పదునున్న కత్తిలాం టిది. సైబర్ నేరగాళ్లు సైబర్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేసి ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న సైబర్ నేరస్తులు నెట్టింట్లో ప్రవేశించి ప్రజల బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు. వారి సెల్‌ఫోన్ ప్రైవసీని దెబ్బతీస్తున్నారు. కంప్యూటర్ ముందు మీటలు నొక్కుతూ అంతరిక్షంలోని కృత్రిమ ఉపగ్రహాల వ్యవస్థను ఛిద్రం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో.. ఒక్క బటన్ నొక్కితే శత్రు దేశంలో అణ్వాయుధాలు రీప్రొగ్రామింగ్ జరిగి విధ్వంసం జరిగే ప్రమాద మూ ఉంది. కంప్యూటర్ వ్యవస్థలను విధ్వంసం చేసి అత్యంత సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తు న్నారు. సోషల్ నెట్ వర్కింగ్ పేరుతో ఆడవాళ్ల మీద లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్‌తో చెలరేగిపోతున్నారు. భవిష్యత్‌లో దేశాల మధ్య యుద్ధాలకు సైబర్ క్షేత్రాలే వేదికలవుతాయనడానికి ఇప్పటికే అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ నేరాల భవిష్యత్ ముఖచిత్రం ప్రపంచాన్ని భయపెడుతోంది. మరి అసలు మన ఫోన్ గోప్యంగా లేదని ఎలా గుర్తించాలి.

ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన శబ్దాలు లేదా ఝుమ్మని వినిపిస్తుంటే.. మీ ఫోన్ ట్యాపింగ్‌కు గురైం దని అనుమానించొచ్చు. కొన్ని సందర్భాల్లో నెట్‌వర్క్ సమ స్యల వల్ల కూడా ఇలాంటి ధ్వనులు రావచ్చు. సాధారణంగా ఫోన్ ఉపయోగించనప్పుడు ఎలాంటి శబ్దాలు రాకూడదు. అలాకాకుండా మామూలు సందర్భాల్లో కూడా బీప్ సౌండ్స్‌గానీ, క్లిక్ సౌండ్స్‌గానీ వస్తున్నట్లయితే ఫోన్‌ను ఎవరో ట్యాప్ చేసినట్లే. సాంకేతికంగా దీనిని మరింతగా నిర్ధారించుకోవడానికి సౌండ్ బ్యాండ్ విడ్త్ సెన్సార్ అనే పరికరం ఉంటుంది. దీనిని ట్యాపింగ్‌కు గురైన ఫోన్ దగ్గర పెట్టినట్లయితే అలారం మోగుతుంది. ఒకే నిమిషంలో ఎక్కువ సార్లు అలారం మోగినట్లయితే ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని నిర్ధారించుకోవచ్చు. ఫోన్ ఛార్జింగ్ బ్యాటరీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారిగా బ్యాటరీ లైఫ్ పడిపోయినట్లయితే కొంచెం ఆలోచించాల్సిందే. మనకు తెలియకుండానే బ్యాక్ గ్రౌండ్‌లో ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్ రన్ అవుతుండటం వల్ల కూడా ఇలా జరగొచ్చు. ఎంత సేపు ఛార్జింగ్ పెట్టాం? ఎక్కువగా ఫోన్ కాల్స్ ఏమైనా మాట్లాడామా? యాప్స్ ఏమైనా ఉప యోగించామా? నెట్ బ్రౌజ్ చేశామా? లాంటి అంశాలను బేరీజు వేసుకోవాలి. ఒకవేళ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే దానివల్లే బ్యాటరీ ఖర్చయిందని అర్థం. లేదంటే మన ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్లే లెక్క.

ూౌట్టౌ అంచనా ప్రకారం భారతదేశంలో ఏటా 42 లక్షల సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. ప్రతి పది మంది లో ఏడుగురు సైబర్ నేరాల బారిన పడుతున్నారు. నిమిషానికి 80 మంది ఈ-నేరాల వలలో చిక్కు కుంటున్నారు. వీటి వల్ల ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న నష్టం 11 వేల కోట్ల డాలర్లు. ఇది వ్యక్తిగత స్థాయిలో జరుగుతున్న నష్టం మాత్రమే. ఇక కావాలని ఎరవేసి డబ్బు లాగే స్పామ్ దాడుల లెక్కలు చూస్తే అవాక్కు కావాల్సిందే. ఈ విషయంలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. వైరస్ దాడుల్లో రెండో స్థానంలో ఉంది. అన్ని రకాల సైబర్ నేరాల్లో మూడో స్థానంలో ఉంది. యాపిల్, ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఏ అప్లి కేషన్ ఎంత మేర బ్యాటరీని వినియోగించుకుంటుందో తెలు సుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాటరీ సెట్టింగ్స్‌తో  బ్యాటరీ యూసేజ్ ఆప్షన్‌తో తెలుసుకోవచ్చు. లేదంటే బ్యాటరీ లైఫ్, కోకోనట్ బ్యాటరీ తదితర యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా బ్యాటరీ ఉపయోగించడం ప్రా రంభించిన తర్వాత దాని ఛార్జింగ్ నిల్వ సామర్థ్యం సంవత్సరం వరకు బాగానే ఉంటుంది.ఆ తర్వాత క్రమేపీ తగ్గిపోతుంది. అలాంటి సందర్భాల్లో బ్యాటరీని ఎక్కువగా వినియోగించే యాప్స్, జీపీఎస్, వైఫై ఆఫ్ చేయడంతో పాటు, డిస్‌ప్లే స్క్రీన్ బ్రైట్‌నెస్ వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అలా కా కుండా మీ మొబైల్ ఇంతకు మునుపటిలా సమర్థంగా పని చేయడం లేదా? స్విచ్చాఫ్ చేసిన వెంటనే షట్‌డౌన్ కావడం లేదా? స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ లైట్ ఇండికేటర్ వెలుగుతూనే ఉందా? అయతే మీ ఫోన్‌ను ఎవరో ట్యాప్ చేశారని అనుమానపడొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఫోన్‌ను ఒక్కసారి రీబూట్ చేయడం మంచిది. కొన్నిసార్లు కొత్తగా ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ వల్లగానీ, ఆప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా లోపాలున్నా సరే ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు.

మీ ప్రమేయం లేకుండానే ఫోన్ ఆన్, ఆఫ్ అవుతోందా? కొత్త యాప్స్ వాటంతట అవే ఇన్‌స్టాల్ అయిపోతున్నాయా? అయితే మీ ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లే.. మీ మొబైల్‌లో కొన్ని స్పై యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొరకబుచ్చుకుంటారు. తద్వారా మీ కాల్స్‌ను ట్యాప్ చేస్తారు. మీకు ఇలాంటి అనుమానం వచ్చినట్లయితే వెంటనే అలెర్ట్స్‌ను యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన మొబైల్ లో ఎలాంటి యాప్స్ ఇన్‌స్టాలైనా సంబంధిత ఈ మెయిల్ అకౌంట్‌కు అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది. మీ మొబైల్‌కు అపరిచత వ్యక్తుల నుంచి ఎన్‌కోడెడ్ మెసేజ్‌లు వస్తున్నట్లయితే.. కచ్చి తంగా జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే మొబైల్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఇదో నిదర్శనం. వీటి ద్వారా మాల్‌వేర్‌ను మన ఫోన్‌లోకి చొప్పించి ట్యాపింగ్‌కు పాల్పడతారు. మీరెప్పుడైనా గమనించారోలేదో.. మాట్లాడుతున్న ఫోన్‌ను టీవీ దగ్గర గానీ, రేడియో దగ్గర గానీ, ల్యాప్‌టాప్, కాన్ఫరెన్స్ ఫోన్ దగ్గర ఉంచినప్పుడు ఝుమ్మ్‌ని శబ్దం వినిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పడు ఇలాంటి శబ్దాలు రావు. ఫోన్ ఉపయోగించనప్పుడు కూడా ఇలాంటి శబ్దాలు వస్తున్నాయంటే మీ ఫోన్ ద్వారా అవతలి వ్యక్తులు మీరు మాట్లాడుకుంటున్నది వింటున్నట్లే లెక్క. ఇంతేకాక సాధారణంగా వస్తున్న ఫోన్ బిల్ కంటే ఒకేసారి ఎక్కువ బిల్ వచ్చిందా? వెంటనే ఆ లిస్ట్ తెప్పించుకొని చెక్ చేయండి. కాల్స్ కోసం ఎంత ఖర్చు చేశామో? డేటా కోసం ఎంత ఖర్చు చేశామో? పరిశీలించండి. కొందరు వ్యక్తులు మాల్‌వేర్స్‌ని మొబైల్‌లోకి చొప్పించి.. మన డేటా ప్లాన్‌ను తస్కరించి వారి రహస్య లావాదేవీలను జరుపుతారు. మనకు తెలియకుండా ఏదో యాప్ ను ఇన్‌స్టాల్ చేస్తే... అది ఎక్కువ డేటాను ఉపయోగించిన ప్పుడు కూడా ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు.

ఇవన్నీకి కారణం కూడా మీరే అది ఎలా అనుకుంటు న్నారా ..? సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల ఏదో ఒక సర్వే చేస్తున్నామని నమ్మబలుకుతుంటారు. ఈ-మెయిల్ ఐడీ, సెల్‌ఫోన్ నెంబరు రాసి డబ్బాలో వేస్తే... డ్రా తీసి బహుమతి ఇస్తామని కూడా ఆశపెడతారు. అలాంటి వారికి వివరాలిస్తే, ఇబ్బందే. వారి దగ్గర నుంచి ఈ వివరాలను సైబర్ నేరగాళ్లు కొనేసి తమ పని కానిస్తుంటారు. మేం ఫలానా బ్యాంకు నుంచి మెయిల్ చేస్తున్నాం. భద్రతా చర్యల్లో భాగంగా అందరి వివరాలూ తనిఖీ చేస్తున్నాం.మీ అకౌంట్ నెంబర్, పాస్‌వర్డ్ చెప్తే ఎవరూ టాంపర్ చేయకుండా చర్యలు తీసుకుంటాం. అంటూ వచ్చే ఈ-మెయిల్‌కు స్పందిస్తే ఖాతా ఖాళీ అయిపోయినట్లే. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రోజుకు ఇలా 98 లక్షల ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నట్లు తెలుస్తుంది... సాంకేతిక సమాచార అవకాశాలు పెరగడంతో అనేక విద్య, వాణిజ్య రంగాల అభివృద్ధికి దోహదపడుతుంది. అదే సమయంలో ఈ విజ్ఞానం పక్కదోవ పట్టి కొత్త రకమైన నేరాలు జరగడం మొదలైంది. వాటిని సైబర్ నేరాలుగా గుర్తిస్తున్నాము. సాధారణంగా మొబైల్, కంప్యూటర్‌ను ఉపయోగించి చేసే ఏ నేరమైనా సైబర్ క్రైం కిందకు వస్తుంది. సాంకేతిక సమాచార రంగంలో కంప్యూటర్‌ను అంతర్జాలాన్ని దుర్వినియోగం చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నా రు. ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసులు అనేకం నమోదు అవుతున్నాయి. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఈ నేరాలు దేశాల హద్దులు కూడా దాటుతుండడంతో చట్టాన్ని అమలు చేసే సంస్థలకు, దర్యాప్తు సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది. అంతర్జాలాన్ని వినియోగించి ఒకటి కాదు అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరాల కోసం కంప్యూటర్, మొబైల్ ఫోన్, స్కానర్, డిజిటల్ కెమెరాల వంటి అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను నేరస్తులు విరివిగా వినియోగిస్తున్నారు. ఫోర్జరీ, చిత్రాల రూపు మార్చడం, అసభ్యకరమైన అగౌరవకరమైన సమాచారాన్ని చేరవేయడం, మొబైల్ ఫోన్‌లలో బెదిరింపులు చేయడం,అనుమతి లేకుండా రహస్యంగా ఫొటోలను తీసి వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేయడం సైబర్ నేరాలలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సమాచార సంకే తిక చట్టాన్ని పార్లమెంట్ 2000 సంవత్సరంలో రూపొందిం చింది. ఆ చట్టం వల్ల ఎలక్ట్రానిక్స్ ఆధారిత సమాచార వ్యవస్థలో ఏకీకృత విధానాలను ప్రవేశపెట్టడం, దాని ద్వారా వాణిజ్యానికి సాంకేతిక సమాచార అభివృద్ధికి సంబంధాలను ఏర్పరచారు. ఈ చట్టంలో కొన్ని రకాల నేరాలను తీవ్రమైన సైబర్ నేరాలుగా గుర్తించి అందుకు నిర్దిష్టమైన కఠిన శిక్షలను రూపొందించారు. 

కంప్యూటర్‌ను వైరస్ ద్వారా అదుపులోకి తీసుకోవడం, నిర్దేశిత కార్యక్రమాన్ని రూపుమాపడం అనే నేరానికి మూడేళ్ల కఠినకారాగార శిక్ష పడుతుంది. అంతేకాక 2 లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. కం ప్యూటర్‌ను హ్యాక్ చేసి పౌరుల, ప్రభుత్వ ఆస్తుల విధ్వం సానికి పాల్పడితే ఈ తరహా శిక్షలు పడతాయి. అశ్లీల సమా చారం, చిత్రాలను నెట్ ద్వారా ప్రసారం చేయడం వంటి నేరాలకు కనీస జైలు శిక్ష, మొదటి సారి నేరం చేసిన వ్యక్తికి లక్ష జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి పాల్పడితే పదేళ్ల వరకూ జైలుశిక్ష 2 లక్షల జరిమానా విధిస్తారు. ఈ చట్టం ద్వారా పోలీసులు వారెంటు లేకుండా బహిరంగ ప్రదేశాలను తనిఖీ చేయవచ్చును. అను మానితులను అరెస్ట్ చేయవచ్చు.

చాలా మాల్‌వేర్స్ యాప్స్ ద్వారానే మొబైల్‌లోకి చొర బడతాయి. అందువల్ల యాప్‌స్టోర్ నుంచి గానీ, గూగుల్ ప్లేస్టోర్ నుంచి గానీ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా యాప్స్‌లో స్పైవేర్‌కి సంబంధించిన లక్షణాలు లేనప్పుడే వాటిని డౌన్‌లోడ్ చేయాలి. అయితే అధికారిక యాప్ స్టోర్ లేదా ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్ అన్నీ దాదాపు స్క్రీనింగ్ చేసినవే ఉంటాయి. కానీ, కొన్ని మాల్‌వేర్ యాప్స్ ప్లేస్టోర్ సెక్యూరిటీ కళ్లుగప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. ముఖ్యంగా గేమింగ్ యాప్స్‌తో చాలా జాగ్ర త్తగా ఉండాలి. వాటిని ఇన్‌స్టాల్ చేసినప్పుడు కాల్ హిస్టరీ, అడ్రస్‌బుక్, కాంటాక్ట్ లిస్ట్ కోసం పర్మిషన్ అడిగితే ఆలోచించుకోవాలి. మరికొన్ని చీటింగ్ యాప్స్ మనందరికీ తెలిసిన పేరుతో అదే లోగోతో కనిపిస్తాయి. అందువల్ల డౌన్‌లోడ్ చేసే ముందు ఆ యాప్ డెవలపర్ పేరును చెక్ చేసుకోవడం మంచిది. మీ ఫోన్‌ను మీ పిల్లలు కూడా ఉపయోగిస్తున్నట్ల యితే.. అనుచిత యాప్స్‌ని డౌన్‌లోడ్ చేయకుండా పేరెంటల్ యాక్సిస్ తీసుకోవడం ఉత్తమం. ఏది ఏమైనా మానవుని సౌకర్యం కోసం పెంచుకుంటున్న సాంకేతికతనే... ఇప్పుడు మానవాళి ప్రమాదానికి కూడా కారణం అవుతుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. తన మొబైల్ ఫోన్ అన్ లాక్ చేసేందుకు ఫింగర్ ప్రింట్ వాడే వినియోగదారుడు అవి ఎక్కడ కాపీ చేయబడతాయో అని గుర్తించలేక పోతున్నాడు. ఈ నేరాలను పూర్తిగా నివారించడము కష్టం కాబట్టి అప్ర మత్తంగా ఉండటమే ముఖ్యం అని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.

- అర్జున్ మహేంద్ర 
సీనియర్ జర్నలిస్ట్, సామాజిక విశ్లేషకులు 
9951574584స్వరాష్ట్ర కాందిశీకులు 

Updated By ManamMon, 11/12/2018 - 02:24

imageతెలంగాణ స్వరాష్ట్ర కాంక్చ నేరవేరి ఐదేండ్ల కాలం కావొస్తుంది. స్వరాష్ర్ట పాలకుల తీరు తెన్నులు అవగహన చేసుకునేందుకు ఎంతోకాలం పట్ట లేదు. పైగా ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉద్యమ నేత  అధికార పగ్గాలు చేపట్టాడు. దీంతో తెలంగాణ దిశ దశ మారుతుందనీ, తెలంగాణ ప్రజానీకానికి మార్గనిర్దేశనం చేస్తారని, మెరుగైన పాలన అందుతుందని ఉద్యమ శక్తులు, తెలంగాణ ప్రజలు భావించారు. కానీ ఆ మార్పేమి లేక పోగా అణచివేత, దోపిడీ, నియంతృత్వం తీవ్రమైంది. ప్రజాస్వామిక హక్కులపై దాడి కొనసాగుతున్నది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రశ్నించటాన్ని సహించలేకపోతున్నది. ప్రజలను కాందిశీకులుగా చూస్తున్న వైనం ప్రజల ముందున్నది. కుల, మత విభజనల ద్వారా ఓట్ల స్టంట్‌ను పాలకపార్టీలు తీసుకున్నాయి. విభజించి పాలించే సూత్రాన్ని ఒంటబట్టిం చుకున్నాయి. గత పాలకులు అనుసరించిన విధానాలనే టీఆర్‌ఎస్ కొన సాగించింది. ప్రజలు ఏమీ కోరుకున్నారంటే గత పాలకులు చేపట్టిన ఆర్ధిక విధానాల మూలంగా నష్టపోయామనీ, స్వరాష్ట్ర పాలకులైతే ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలు అమలు చేస్తారని ఆశించారు. వాటిని అమలు చేయక పోగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు.
 

image

నీళ్లు, నిధులు, నియమాకాలు పేరుతో ఉద్యమం నడిపి అధికారం చేపట్టాక వాటిని ఏ మేరకు అమలు జరిపారో తెలియంది కాదు. అవి అమలు జరిగి ఉంటే వాటి కోసం ఉద్యమించాల్సి వచ్చేదికాదు. నీళ్లివ్వలేక పోయారు. నిధులు నీళ్లలా ఖర్చుచేశారు. నియమాకాల ఊసు మరిచిపో యారు. వాటికోసం పోరాడిన వాళ్లంతా అంటరాని వాళ్లుగా మిగలగా ద్రోహులంతా అప్తమిత్రులయ్యారు. అధికారాన్ని అనుభవించారు. గతాను భవంలో తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసి ద్రోహనికి పాల్పడిన వారే మళ్లీ పరిపాలనలో భాగస్వాములయ్యారు. వారిలో ఏ మార్పు కనబడిందో పెద్దదొరకు కానీ, తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను బకరాలను చేశా రు. 1200 మంది అమరుల త్యాగాలను అవమానపర్చారు. తెలంగాణ నిజమైన ఉద్యమకారుల ఆవేదన ఎవరికి పట్టరాని ఆంశంగా మారింది. ఆ ఆంశమే నేడు మేనిఫెస్టోల పెట్టాల్సిరావడం జీర్ణంకానీ చేదు గుళికే. 

ముహుర్తాలు, జాతకాలు చూసి, మూఢత్వాన్ని నింపుకొని పాలన చేయడం దేనికి సంకేతం. అసెంబ్లీ భవనాన్ని మార్చాలనుకోవడం, పాత భవనాలకు వాస్తు లేదని, ప్రగతి భవన్ నిర్మించుకోవడం దాని కేంద్రం గానే పాలన చేయడం గడీల పాలన తప్ప మరొకటి కాదు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి మనువాద పాలన చేయడం ద్వారా బీజేపీ పాలన నము నానే టీఆర్‌ఎస్ అనుసరించింది.

మతఛాందస భావజాల వ్యాప్తికి కేసీఆర్ చేసింది ఎక్కువే. ఒక బాధ్య తగల పదవిలో ఉండి పాలకుడిగా నిలబెట్టాల్సిన లౌకికవాదానికి తూట్లు పొడిచారు. మతాన్ని రాజకీయాల్లోకి లాగారు. భక్తుడిగా గుళ్లూ గోపురాలు తిరిగారు. ప్రజాధనాన్ని వారి వ్యక్తిగత మొక్కులకు ఖర్చు చేశారు. ఓ వైపు హిందువులను ఆకరి్షస్తూ మరోవైపు సంక్షేమ పథాకాలు, అభివృద్ధి పేరుతో ముస్లింలను బుట్టలో వేసుకున్నారు. హిందూ ముస్లింల ఓట్లను రాబ ట్టేందుకు  చూపిన శ్రద్ధను ప్రజాసమస్యల పరిష్కారంపై పెట్టలేదు. సమ స్యలపై నీలదీసిన వారిపై, నిరసనలు వ్యక్తం చేసినోళ్లపై ఉక్కుపాదాన్ని మో పారు. కార్మికులపై, హక్కుల కార్యకర్తలతో పాటు రైతులకు బేడీలు వేసి అవమానపర్చారు. రైతుల ఆత్మహత్యలను నివారించలేకపోయారు. హైద రాబాద్‌లోని ధర్నా చౌక్‌ను సైతం ఎత్తేశారు. కేసీఆర్ నిజమైన ఉద్యమకా రుడైతే ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పూనుకుని ఉండేవారు కాదు.

ఉద్యమ కాలంలో ఇచ్చిన హమీలకు కాలం చెల్లిపోయిందనేది స్పష్ట మైంది. చెప్పినవి చేసినామని, చెప్పనివి కూడా చేసినామనే బూటకపు మాటలు పదేపదే వల్లిస్తున్న ఏలికలు వాస్తవాల్ని మరుగున పరుస్తున్నారు. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి నయవంచన చేశారు. తానే సీఎం పదవిలో కూర్చున్నప్పుడు వారి మాటలకు విశ్వాస నీయత లేకుండా పోయింది. దళితులకు మూడేకరాల భూపంపిణీ నాలు గేండ్లలో అమలకు నోచుకోలేదు. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఎకరాల పంపిణీ జరుగకపోవడం పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నది. పైగా దళితు లపై దాడులు, దౌర్జన్యాలు, కుల వివక్ష, కుల దురహంకార హత్యలకు తెలంగాణ వేదికగా మారింది. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ సాధన జరుగకపోగ ఆదివాసీ, గిరిజన బిడ్డలు హక్కుల కోసం, చట్టాల అమలు కోసం జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది. పోడు భూముల సమస్య తీవ్రమైంది. భూముల నుంచి వెళ్లగొట్టి పెట్టుబడిదారుల పంచన చేరేందుకు ఈ ప్రభు త్వం అత్యుత్సాన్ని ప్రదర్శించటం ద్వారా సాధించింది శూన్యమే.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం పేదల్లో ఎన్నో ఆశల్ని కలిగిం చింది. వాస్తవానికి ఇండ్ల స్కీం టీఆర్‌ఎస్‌కు ఓట్లు సాధించి పెట్టింది. అధి కారంలోకి వచ్చేందుకు దోహదపడింది. సమగ్ర సర్వేలో 25 లక్షల మంది ఇండ్లు లేని పేదలున్నారని గుర్తించినట్లు ప్రకటించారు. ఎడాదికి లక్ష ఇం డ్లు నిర్మిస్తామని చెప్పి 10 వేల ఇండ్లు కూడ నిర్మించి ఇవ్వలేదు. ఎర్రవెల్లి, నర్సాపూర్ గ్రామాల్లో మోడల్ ఇండ్లు తప్ప ఎక్కడ పేదలకు ఇండ్లివ్వ లేదు. కొన్ని చోట్ల ఇండ్ల నిర్మాణం చేపట్టినప్పటికి వాటిలో నాణ్యత లేదు. చివరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫ ల్యం చెందింది. ఇండ్లులేని నిరుపేదలను సంతృప్తి పర్చలేకపోయింది. ఇదేగాక కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయలేదు. నేటి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేని మండలాలు ఆనేకం ఉన్నాయి. కార్పొ రేట్ విద్యాలయాలకు కేసీఆర్ ప్రభుత్వం లాభాలు చేకూర్చి పెట్టింది.

ఇప్పుడు రాష్ట్రంలో సామాజిక ఆంశం కేంద్రంగా రాజకీయాలు  నడు స్తున్నాయి. కులాలకు అనేక తాయిలాలు ప్రకటించినప్పటికి రాజకీయ అవకాశాలు కల్పించటంలో పాలకపార్టిలు ఒకే తానులో ముక్కలమని చాటుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్ అత్యధిక సీట్లు ఆధిపత్య కులాలకే కేటాయించింది. ప్రధాన ప్రతిపక్షం మహకూటమి కూడా అదే రీతిలో సీట్లు కేటాయించనున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అసెం బ్లీలో అడుగుబెట్టని కులాలెన్నో ఉన్నాయి. బీఎల్‌ఎఫ్ బహుజనులకు రాజ్యాధికార లక్ష్యంగా సీట్లు కేటాయిస్తున్నది. బీజేపీతో పాటు ఇతర పార్టీ లు కూడా కులాన్ని కేంద్ర బిందువుగా చేసుకున్నాయి. అయితే టీఆర్‌ఎస్ కులాల్ని తమ వైపు తిప్పుకునేందుకు ముదిరాజ్‌లకు చేపపిల్లలు, గొల్ల కుర్మకులకు గొర్రెలు, బర్లు, వాహనాలు, రుణాలు, కులాల వారీగా భవ నాలు, సంక్షేమ పథకాలు పేరుతో చేసిన ఎత్తులు జిత్తులు చాలానే ఉన్నా యి. కానీ అవి అభివృద్ధికి ప్రతిపాదిక కావు. సామాజిక న్యాయం అసలే కాదు. ప్రజల జీవణ ప్రమాణాలను సంక్షేమ పెంచలేవు. రాజ్యాధి కారంలో అట్టడుగు వర్గాలకు అవకాశాలు దక్కాలి. అందుకు రాజకీయపార్టీలు సంసిద్ధంగా లేవన్నది నిజం.

- మామిండ్ల రమేష్ రాజాహిందూ ముస్లిం ఐక్యతా వారధి

Updated By ManamSun, 11/11/2018 - 00:28

imageదేశ స్వాతంత్య్రోద్యమ సాఫల్యంలో స్వతంత్ర భారత విద్యా, వైజ్ఞానిక, కళల వికాసానికి బహుముఖ ప్రజ్ఞతో విసుగు విరా మం లేకుండా శ్రమించిన గొప్ప దార్శనికుడు, పరిపాలకుడు, బహు భాషోకోవిదుడు, పోరాటకారుడు, కవి, రచయిత, జర్న లిస్టు, విద్యావేత్త, భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్. బాల్యం నుంచే సాహిత్యం, తత్వశాస్త్రం, సంస్కృతి, కళలు, మానవ విమోచనాల ఉద్యమ చరిత్రపై ప్రత్యేక అభిని వేశం ఏర్పరచుకొని భారతీయ విద్యావికాసాన్ని కొత్త పుంతలు తొక్కించిన  ఆధునిక  గొప్ప విద్యావేత్త, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, స్వతంత్ర భారత తొలి విద్యామంత్రి అయిన  ఆజాద్ పుట్టిన రోజైన నవంబరు 11న భారతదేశంలో జాతీ య విద్యా దినోత్సవంను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.

ఆయన అసలు పేరు ‘మొహియుద్దీన్ అహ్మద్’, ‘అబుల్ కలాం’ అనేది బిరుదు, ‘ఆజాద్’ కలం పేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ దంపతులకు 1888 నవంబరు 11న మ క్కాలో జన్మించాడు. ఇతను ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్య మాల్లో పాల్గొని 10 సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవిం చాడు. 11 సంవత్సరాల పాటు విద్యా మంత్రిగా పనిచేశాడు. 1958 ఫిబ్రవరి 22న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరణించాడు.

1921లో సహాయ నిరాకరణ, 1930లో శాసనోల్లంఘన, 1942లో క్విట్ ఇండియా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్రimage పోషిం చి, ఉద్యమక్రమంలో నాయకత్వ పెడ ధోరణులను, చీలికలను నివారించి, భిన్నమైన ఆకాంక్షలున్న ఉద్యమ శక్తులను ఏకతా టిపై నడిపించాడు. ఉద్యమ జీవితంలో 11 సంవత్సరాల జైలు జీవితాన్ని గడిపిన ఆజాద్ మాతృదేశ విముక్తిపోరులో చిరస్మర ణీయ పాత్రను పోషించి, దేశభక్తి, లౌకకవాదానికి ప్రతీకగా నిలిచారు. 1947-52 వరకు విద్యాశాఖమంత్రిగా, 1952-58 వరకు విద్యా, ప్రకృతి వనరుల, శాస్త్ర సాంకేతిక మంత్రిగా, 1956లో యునెస్కో అధ్యక్షునిగా పనిచేసిన ఆజాద్ అసమాన మైన రీతిలో విద్యాభివృద్ధికి కృషిచేశారు.

ఆయన దృష్టిలో విద్య అనగా బహుముఖ లక్ష్య ఫలప్రదా యని. ఉద్యోగమొక్కటే కాదు దేశభక్తి, దేశరక్షణ, ప్రేమ, కరుణ లు పెంపొందించేది, మానవత్వం నింపటం, విజ్ఞానం పెంపొ దించటం, సామాజిక అంశాల అవగాహన, స్పందనలు అం దించేది. అంతేకాక  ఒక జాతి గౌరవం విద్య, ఒక దేశ గౌర వం విద్య. దాని లక్ష్యం  ఉత్తమ పౌర సమాజ నిర్మాణం విద్య సమస్త సమస్యలకు పరిష్కారం, విద్య సమాజంలోని అసమా నతలను రూపుమాపేది, విద్యకు కులమతాలు లేవు అని ఆయ న ప్రగాడ విశ్వాసం. నాడు విద్య కొందరికే పరిమితం... కులాల పేరిట ధనిక పేద భేదాల పేరిట అడ్డుగోడలు ప్రగతికి ప్రతిబంధకాలు అని విప్లవించి ఆ గోడలను కూల్చి కేకలు, అరుపులు, రక్తం చిందని నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికారు. నాణ్యత లేని విద్య నాటు విద్య,  చేటు విద్య పరిపక్వత లేని విద్య పనికిరాని విద్య అని శ్లాఘించారు.

మౌలానా ఆజాద్ దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు. రాజ్యాంగ విలువలతో కూడిన లౌకిక విద్యను అన్ని స్థాయి ల్లోనూ అందరికీ సమానంగా అందించేందుకు బహుముఖ పథకాలు, ప్రణాళికలు రచించారు. కామన్ స్కూల్ సిస్టం, 10+2+3గా విద్యావిధాన చట్రాన్ని నిర్ధారించారు. బ్రిటిష్ పాలనలోని పరిమితులను అధిగమించి శాస్త్ర సాంకేతిక రంగా ల్లో సత్వర ప్రగతిని సాధించేందుకు వివిధ స్థాయిల్లో విద్యా రంగం పరిస్థితిని పరిశీలించి సరైన దిశానిర్దేశాలు చేయటానికి విశేష కృషిచేశారు. వలసపాలకుల అవసరాలకు తోడ్పడుతూ వచ్చిన విద్యావ్యవస్థను సమూలంగా మార్చడం కోసం, విద్య పునాదిని విప్లవకీకరించడం కోసం దేశీయవనరులు, అవసరా లకు అనువైన ప్రజాతంత్ర విద్యను రూపొందించడం కోసం మౌలానా నిపుణులతో కమిటీలను వేసి వారి సిఫారసులను అమలుచేశాడు. బి.జి.ఖేర్ కమిటీ (1947) సిఫారసుల మేరకు విద్యారంగానికి కేంద్రబడ్జెట్‌లో 10%, రాష్ట్ర బడ్జెట్‌లో 30% కేటాయింపులను అమలు చేయించారు. ఈరోజు విద్యా రంగా నికి  ఈ మాత్రం నిధులైనా అందుతున్నాయంటే, భారత దేశ దశను, దిశను మార్చగల శాస్త్రజ్ఞులు మన సమాజంలోంచి రాగాలిగారంటే అదంతా ఆ మహానుభావుడి చలవే. నళిని రం జన్ సర్కార్ కమిటీ (1947) సూచనల మేరకు శాస్త్ర సాంకేతిక రంగంలో స్వయం స్వావలంబన కోసం ప్రతిష్టాత్మక ఐఐటీల ను స్థాపించాడు. లక్ష్మణస్వామి మొదలియార్ (1952) కమిటీ సూచనలు స్వీకరించి పాఠశాల విద్యను గుణాత్మకంగా మార్పు చేసి, వృత్తివిద్యను, క్రీడావిద్యను ప్రవేశపెట్టాడు. విజ్ఞాన విహా రయాత్రలను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించాడు.

రాధాకృష్ణన్ (1948) కమిషన్ సిఫారసుల మేరకు యూజీ సీని ఏర్పాటుచేస్తూ ఉన్నత విద్యా సంస్థలను, విశ్వవిద్యాలయా లను స్థాపించాడు. ఇవి దేశ నాగరికతని అభివృద్ధి పథంలో నడపగల మేధోపరమైన మార్గదర్శకుల్ని గుర్తించి, శిక్షణ ఇచ్చి, వివిధ రంగాల నిర్వహణకు అవసరమైన నిపుణులను తయా రు చేయడంలో ప్రధానపాత్ర నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలను ప్రారంభిస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులకు స్నేహితుడుగా, మార్గదరర్శకుడిగా ఉంటూ జ్ఞాన ప్రసారాన్ని, వ్యక్తిత్వ నిర్మాణం చేయాలన్నాడు. అక్షరాస్యత పెంపు కోసం వయోజన విద్యను ప్రారంభించి, పరిశోధనాభి వృద్ధి కోసం కౌన్సిల్ అండ్ సైంటిఫిక్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్‌ను స్థాపించి దీని పరిధిలో దేశవ్యాప్తంగా 50కి పైగా పరిశోధనా సంస్థలను నెలకొల్పి ఆధునిక విద్యా భారత నిర్మాతగా చరిత్ర లో నిలిచాడు. బ్రిటిష్ ఇండియాలో తీవ్ర నిర్లక్ష్యానికి లోనైన భారతీయ సంస్కృతి, కళలు, సంగీతం, సాహిత్యాల వికాసానికి సాంస్కృతిక ఉద్యమ సేనానిగా పనిచేశాడు. 1948లో ప్రాథ మిక, ఉన్నత విద్యకు, 1952లో సెకండరీ విద్యకు ప్రత్యేక కమి షన్‌లు నియమించారు. తొలి ఐదేళ్ళ కాలంలోనే యుజిసి, ఐసి సిఆర్, ఎఐసిటియు, సిఐఎన్‌ఆర్, తదితర అత్యున్నత సంస్థల తోపాటు ఖరగ్‌పూర్‌లో ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యాసంస్థను, సంగీత, సాహిత్య, లలితకళా అకాడమీలను ఏర్పాటు చేశారు. స్వయంగా సాహితీవేత్త ఐన మౌలానా గుబార్-ఎ-ఖాఅర్, తర్జుమన్ ఉల్ ఖురాన్‌ల ‘ది డాన్ ఆఫ్ హోప్’తో పాటు స్వీయ చరిత్ర ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్’ను రాశాడు. దేశం గర్వించే విద్యాశాఖ మంత్రిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సుప్ర సిద్ధ రాజనీతిజ్ఞుడిగా, హిందూ, ముస్లిం సమైక్యతా సారథిగా మౌలానా ఆజాద్ స్వతంత్ర భారత నిర్మాతల్లో ప్రముఖులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయనకు మరణానంతరం 1992 లో ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించి గౌరవించారు.

ఆయన చనిపోయి 60 సంవత్సరాలు గడించింది. కానీ ఆయన తలపెట్టిన విద్యావిధానం ఇంకా అసమగ్రంగా, అనేక మందికి అందకుండా నిరాశా నిస్పృహలతో నిట్టూరుస్తోంది. జాతీయ సగటు అక్షరాస్యత 74 శాతంగానే ఉండిపోవటంతో ఏడు సంవత్సరాలు పైబడిన జనాభాలో 29 కోట్ల మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. ప్రపంచంలోని మొత్తం నిరక్షరా స్యుల్లో 35 శాతం మంది మన దేశంలోనే ఉండడం పాలకుల అసమర్థ పాలనకు నిలువెత్తు నిదర్శనం. కనీసం 14 ఏళ్ళ  వరకైనా బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించా లనే మౌలానా ఆకాంక్షకు అనుగుణంగా ఎట్టకేలకు విద్యా హక్కు చట్టం వచ్చినా పాలనా వైఫల్యాలతో అది కాగితాలకే పరిమితమయింది. పాఠశాల విద్యార్థులలో సగంమంది 10వ తరగతి కూడా చదవకుండా మధ్యలోనే మానేస్తుండడంతో పాఠశాల విద్యాస్థాయికి చేరుకోలేక పోతున్నారు. నిరక్షరాస్యు ల్లో, మధ్యలోనే బడి మానేస్తున్న వారిలో అధికులు దళితులు, గిరిజనులు, మైనార్టీలే. పాఠశాల విద్యను గట్టెక్కిన వారిలో కూ డా అందరూ పై చదువులకు పోవటం లేదు. 15-18 సంవ త్సరాల వయస్కుల్లో 25 శాతం మంది మాత్రమే కాలేజీల్లో చేరుతున్నట్లు నివేదికలు వెక్కిరిస్తున్నాయి. దేశ జనాభాల్లో గ్రా డ్యుయేట్లు 5 శాతంలోపే ఉన్నట్లు 2011 జనాభా లెక్కలు వెల్ల డిస్తున్నాయి. ఇక నాణ్యత విషయంలోనూ నాసికరమే. నిర్ణీత విద్యా ప్రమాణాలు లేకపోవడం అనేది పాఠశాలల స్థాయికే పరిమితం కాక అన్ని స్థాయిల్లోనూ అదే పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంజనీరింగ్ అర్హత కలిగిన వారిలో కేవలం 5 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలకు సరిపడిన సామర్థ్యం ఉంటున్నట్లు పారిశ్రామిక సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా యి. ప్రపంచంలోని అత్యున్నత ప్రమాణాలు గల 200 విశ్వ విద్యాలయాల్లో భారతదేశానికి చెందినవి ఒక్కటి కూడా లేదు. వివిధ దేశాల్లోని విద్యార్థుల స్థాయినీ బేరీజువేసే అంతర్జాతీయ సంస్థ (పిఐఎస్‌ఐ) జాబితా నుంచి భారతదేశం చాల ఏళ్ల క్రితమే తప్పుకున్నది. కేంద్ర బడ్జెట్‌లో విద్యకు నిధులను భారీ గా కోతకోయటం వల్ల ప్రభుత్వ విద్యాసంస్థలు మరింత దివాళా తీసే పరిస్థితి తయారైంది. ప్రైవేట్ విద్యావ్యాపారం విచ్చలవిడిగా విస్తరిస్తోంది. ప్రైవేట్ రంగంలోని విద్యావ కాశాలతో అనైక్యతా పరిణామాలు ప్రబలే అవకాశం ఉంది. కార్పొరేట్ కాలేజీల్లో సంపన్నులు, పై కులాల పిల్లలు చేరటం, ప్రభుత్వ పాఠశాలల్లో దళితులు, గిరిజనులు, బిసిల పిల్లలే మి గిలి పోవటం విద్యారంగంలో ఆధునిక అంటరానితనంగా తేలి పోతోంది. సామాజిక ఆర్ధిక వ్యవస్థను పునర్నిర్మించాలనే రా జ్యాంగ లక్ష్యాల వెలుగులో ఆజాద్ రూపాందించిన విద్యా వ్యవస్థ మార్గదర్శక సూత్రాలను పూర్తిస్థాయిలో అమలు చేయించకోవలసిన బాధ్యత పౌర సమాజం స్వీకరించాలి.

- కాళంరాజు వేణుగోపాల్
8106204412
(నేడు అబుల్ కలాం జయంతి)చైతన్య స్వరూపం ‘ఓటు’

Updated By ManamSat, 11/10/2018 - 01:15

imageరాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార పక్షం ఏకంగా 105 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసి ప్రచారంలో దూసుకుపోతోంది. మరోవైపు ప్రతిపక్షాలు మహాకూటమి పేరుతో బహిర్గత సమావేశాలు, రహస్య సమావేశాలు అంటూ గింజుకుంటున్నారు. అధికార, ప్ర తిపక్షాల మధ్య పోటీ విషయం పక్కకు పెట్టి ఒక్కసారి గతంలోకి తొంగిచూస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అ య్యేనాటికి రాష్ట్రం తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో ఉంది. ఉ ద్యమ పార్టీ నేత కేసీఆర్‌కు అభివృద్ధి ఎక్కడ నుండి మొదలు పెట్టాలో తెలియని పరిస్థితి. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్తు కొరత. తమ ఆకాంక్షలు నెరవేరి కొత్త రాష్ట్రం సిద్ధించడంతో ప్రజల్లో భారీ ఆశలు. కాళ్లకు బంధంలాగా విభజన సమస్యలు. మరోవైపు దశాబ్దాలుగా నలుగు తున్న ఫ్లోరైడ్ సమస్య. ఇలా చెప్పుకుంటూ పొతే ఒక ముళ్ళ కిరీటాన్ని ధరించి కేసీఆర్ పాలన పగ్గాలు చేపట్టా రని చెప్పవచ్చు. కానీ ప్రజల్లో టీఆర్‌ఎస్ పార్టీ ము ఖ్యంగా కేసీఆర్ పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టుకో వాల్సిన పరిస్థితి. ఉద్యమ నాయకుడిగా గమ్యాన్ని ము ద్దాడిన కేసీఆర్ మీద ప్రజలకు ఆ మాత్రం ఆకాంక్షలు ఉండటంలో తప్పులేదు. కానీ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అప్పు లేమీటో, ఆస్తు లేమిటో తెలియని ఆగమ్య గోచర పరిస్థితుల్లో సుపరిపాలనకు నడుంబింగించారు కేసీఆర్.

కాలచక్రం గిర్రున తిరిగింది. దాదాపు నాలుగున్న రేండ్ల పరిపాలనలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు కేసీఆర్.image తెలంగాణ రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిలో దేశాని కే స్ఫూర్తిని ఇచ్చేవిధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు కేసీఆర్. రాష్ట్ర ఏర్పాటు తరువాత పరిష్కరించాల్సిన అంశాలను, అభివృద్ధి చేయాల్సిన రంగాలను ఒక ప్రాధాన్యతా క్ర మంలో తీసుకొని ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ముందుకు కదిలారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఏర్పా టు ప్రభావం స్పష్టంగా తెలిసొచ్చేలా ముందుగా విద్యు త్ రంగాన్ని ఒక ఛాలెంజ్‌లా స్వీకరించారు. కారు చీకట్లలో మగ్గుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 6 నెలల కాలంలోనే విద్యుత్ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. దీనితో ప్రజలకు ప్రభుత్వం మీద భరోసా పెరిగింది. ఇక సంక్షేమం విషయానికి వస్తే ఆసరా పెన్షన్ల తో వృద్ధులను, వికలాంగులను, ఒంటరి మహిళలను, గీత కార్మికులను బీడీ కార్మికులను, వితంతువులకు ఇలా దాదాపు 40 లక్షల మందికి అండగా నిలబడ్డాడు. దాని తో గ్రామీణ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, కేసీఆర్ పాలన పట్ల అవగాహన ఏర్పడింది. ఇక కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. పల్లె, పట ణం అనే లేకుండా ప్రతి గడప ఈ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతోంది. 

అయితే ఇక్కడ కేసీఆర్ పాలనలో మనం రెండు ముఖ్యమయిన అంశాలు గమనించవలసి ఉంటుంది. అవి ఒకటి ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయాల్సిన సం దర్భం. మరోవైపు రాష్ట్ర పునర్నిర్మాణం. ఒకే సమయం లో ఈ రెండు కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత. ఇది నిజంగా పాలకుడికి ఒక ఛాలెంజ్ వంటిది. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన ప్రతి బంధకాలు బూచీగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా రాష్ట్ర పునర్నిర్మానానికి, భవిష్యత్ అవసరా లను దృష్టిలో ఉంచుకొని పక్కా ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించగలిగారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో రాష్ట్ర పున ర్నిర్మాణం మీద దృష్టి పెట్టారు. భూ రికార్డుల ప్రక్షాళన తో నూతనత్వాన్ని పరిపాలనకు అందివ్వగలిగారు. వ్యవసాయరంగంలో రైతుబంధు, రైతు భీమా, సకాలం లో ఎరువులు, రైతు సమన్వయ సమితులు, నిరంతర ఉచిత కరెంటుతో రైతాంగానికి పరిపూర్ణమయిన  న్యా యం చేసిన పాలకుడిగా నిలబడ్డారు. పారిశ్రామిక రంగంలో ఆకర్షణీయమయిన టీఎస్- ఐపాస్‌తో పెట్టుబ డులను ఆకర్షించి రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామం గా చేసిండు. ఏ ఒక్క రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా అన్ని రంగాలను ఏక కాలంలో సమతుల్యమయిన అభి వృద్ధి సాధించేలా చూడటం తెలంగాణ భవిష్యత్తు బా గుండాలన్న తపన కేసీఆర్‌లో ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 

ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని ముందు కు తీసుకువెళ్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకు లు అధికారమే లక్ష్యంగా కాలులో కట్టె పెట్టినట్లు ప్రభు త్వ విధానాలను చీటికీ మాటికీ విమర్శిస్తూ చెవిలో జోరీ గలా తయారయిన పరిస్థితి. దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రభు త్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని, పథకాన్ని కూడా తమకు అలవాటయిన అవినీతితో జతకట్టడం టీఆర్‌ఎస్ అధినేతకు చిరాకు పెట్టించింది. ఈ అభివృద్ధి ఇంకా జెట్ స్పీడుతో ముందుకు వెళ్లాలంటే ముందుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజల చేత సరయిన జవాబు చెప్పించా ల్సిందే అని నిర్ణయించుకొని ప్రజాతీర్పుకు ముందుకు రావడం జరిగింది. టీఆర్‌ఎస్ పాలన పట్ల నూటికి నూ రు శాతం ప్రజలు సంతృప్తితో ఉన్నారు అన్న కేసీఆర్  నమ్మకమే కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించేలా చేసింది. అప్పటికే అస్త్రసన్యాసం చేసిన ప్రతిపక్షాలు ఒక్కసారిగా కేసీఆర్ వ్యూహంతో పెడబొబ్బలు పెటాయి. సాధారంగా ఎన్నికలు అనగానే ఎగిరి గంతేయాల్సిన ప్ర తిపక్షాలు దానికి విరుద్ధంగా కేసీఆర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టు మెట్లు ఎక్కడం వారు ఎదుర్కొంటున్న అభ ద్రతా భావానికి సంకేతం. మరోవైపు ఎలాగూ తమకు బలం లేదని తెలిసి చీకటి రాజకీయాల్లో నిష్ణాతుడు అయిన చంద్రబాబుతో చేతులు కలిపి ఖాళీగా ఉన్న కోదండరాంతో కాంగ్రెస్ కూటమి కట్టింది. కానీ ప్రజల్లో ఈ కూటమి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకి స్తున్న చంద్రబాబుతో పొత్తుకు సిద్ధపడి కాంగ్రెస్ తన గొయ్యిని తానే తవ్వుకుంది. తెలంగాణ రాజకీయాలల్లో సరికొత్త మార్పును తీసుకు వస్తాను అంటూ ముందుకు వచ్చిన కోదండరాం కేవలం 3-4 సీట్ల కోసం గాంధీ భవన్ చుట్టూ తిరగాల్సిన అగత్యం ఏర్పడింది.

ఎవరు ఎన్ని రాజకీయాలు చేసిన 2018 ఎన్నికల్లో ప్రజలు మాత్రం తమ స్పష్టమయిన తీర్పును ఇవ్వబో తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును  రాజకీయంగా వాడుకున్న పార్టీలను పక్కన పెట్టి దశాబ్ద కాలానికి పైగా అలుపెరుగని పోరాటం చేసిన టీఆర్‌ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రా న్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్లి, భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి కోసం చేపట్టవలసిన కార్యక్రమాల మీద స్పష్టమయిన అవగాహన కలిగి ఉన్న కేసీఆర్ నా యకత్వాన్నే జనం కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజ లు వివేకవంతులు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లీ శక్తి ఒక్క టీఆర్ ఎస్ ప్రభుత్వానికే ఉంది అన్న విషయం వారికి తెలుసు. అందుకే మరోమారు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే పట్టం కట ్టబోతున్నారు. ఈ విషయం ఇప్పటికే జాతీయ మీడియా నిర్వహించిన పలు సర్వేల్లో తేటతెల్లం అయింది. అందు కే టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించినంతవరకు ఈ ఎన్నిక లు తెలంగాణ అభివృద్ధి ప్రస్థానములో ఒక మజిలీ మా త్రమే. టీఆర్‌ఎస్ పార్టీకి సరికొత్త బలాన్ని పుంజుకొని ముందుకు వెళ్ళడానికి ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్ పార్టీకి దోహదం చేస్తాయి. అది అవసరం కూడా. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది స్వయంపాలన కోసం అన్నది సుస్పష్టం. కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని పరాయి పార్టీల చేతుల్లో పెట్టి మళ్ళీ వారి దయా దాక్షిణ్యాల మీద ఆధా రపడటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. అందుకే ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ అభివృద్ధి పట్ల తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ, ఒక స్పష్టమయిన తీర్పును ఇవ్వబోతున్నారు. తెలంగాణ ప్రజల చైతన్యం మరోమారు ఓటు రూపంలో చాటబోతున్నారు.    

- సత్యప్రసాద్ పెద్దపెల్లి 
98485 91919బాల్యానికి ఏదీ భరోసా!

Updated By ManamFri, 11/09/2018 - 04:24

imageఇటీవల ఎన్.సి.ఇ.ఆర్.టి. దేశవ్యాప్తంగా సి.బి.ఎస్.ఇ. సిలబస్ అమలవుతున్న 18,000 పాఠశాలలలో ఒకటి, రెండవ తరగతి చదివే విద్యార్ధులకు హోంవర్కు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది. 3వ తరగతి వరకు కేవలం 3 సబ్జెక్టులు మాత్రమే బోధించాలని సూచించింది. అందుకు విరుద్దంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్.కె.జి నుంచే పిల్లల సామర్ధ్యానికి మించి హోంవర్క్ ఇస్తున్నారు. ఒకటి నుంచి మూడు వరకు అదనంగా మరో 5 సబ్జక్టులను కూడా విద్యార్ధులకు బోధిస్తున్నారు.

ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా వివిధ అంశాలపై వ్యాసరచన పోటీimageలు, ర్యాలీలు, చిత్రలేఖన పోటీలు నిర్వహించడం వంటి తదితర అంశాలతో కొంత బోధనకు ఆటంకం కలుగుతుండగా, మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో క్రమశిక్షణ పేరుతో ఇచ్చిన హోంవర్క్ చేయలేదని, తెలుగులో మాట్లాడుతున్నారని, బెల్టు పెట్టుకోలేదని, బూట్లు ధరించలేదని, టై లేదనే కారణాలతో పిల్లల్ని దండిస్తున్నారు, తీవ్రంగా దూషి స్తున్నారు. ప్రాథమిక విద్యకు సంబంధించి ఏ రెండు ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే రకమైన సిలబస్‌ని అమలు చేయడం లేదు. అధిక పుస్తకాల బరువుతో పిల్లలకు వెన్నునొప్పి, మెడనొప్పులొస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో తరగతి గదుల్లో ఏ జరు గుతుందోనని సి.సి. కెమెరాల ద్వారా ఆయా యాజమాన్యాలు క్షుణ్ణంగా పరిశీలి స్తున్నారే గానీ, క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని తీవ్రంగా దండించడం వల్ల వారి మనసులో ఎటువంటి మార్పులొస్తున్నాయోనని ఎవరూ గమనించడం లేదు.

image

గతంలో సర్వశిక్షా అభియాన్ వారు విద్యా విషయక కేలండర్స్‌ని పాఠశాలలకు జూన్‌లోనే పంపిణీ చేసేవారు. ఉపాధ్యాయులకు శిక్షణని వేసవి సెలవులలో ఇచ్చేవారు. చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ నివేదిక ప్రకారం 2015 ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు 1098 టోల్ ఫ్రీ నెంబరుకు దేశవ్యాప్తంగా 3.4 కోట్ల ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే వాటిలో 1.36 కోట్ల వరకు నిశ్శబ్ద ఫోన్‌కాల్స్  వున్నా యి.  పిల్లలు ఫోన్‌చేసి కొద్ది నిమిషాలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా వుంటు న్నారని ఫౌండేషన్ నివేదిక స్పష్టంచేస్తుంది. ఆశ్చర్యకర విషయమేమిటంటే ఇందులో 66,000 ఫోన్‌కాల్స్ మద్య, ఉన్నత తరగతి కుటుంబాల పిల్లల నుంచి వచ్చినవేనని ఫౌండేషన్ వెల్లడించింది. ఆ కుటుంబాల పిల్లలు తన తల్లి దండ్రులు వారి వారి వ్యక్తిగత వ్యవహారాలలో బిజీగా వుండటం వలన తమను సరిగ్గా పట్టించుకొనడం లేదని, తమకు గెడైన్స్ కావాలని చెప్తున్నారు.

image

 2017 -18 సంవత్సరానికి 53 లక్షల నిశ్శబ్ద ఫోన్‌కాల్స్ వున్నాయని ఫౌండేషన్ వెల్లడించింది.  మరొక వైపు తీవ్రమైన ఒత్తిడితో 14 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సులో వున్న పిల్లలు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేంద్రం ఈ ఏడాది జనవరిలో లోక్‌సభలో వెల్లడించింది. 2007-16 మధ్య కా లంలో 75,000 మంది విద్యార్ధులు దేశవ్యాప్తంగా వివిధ కారణాల వలన ఆత్మ హత్యలకు పాల్పడ్డారని వివిధ నివేదికలు చెప్తున్నాయి. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం గతంతో పోల్చుకుంటే యేటా ఆత్మహత్యల శాతం పెరుగు తోంది. 2014 నుంచి 2017 వరకు 26000 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకొన్నారు. ప్రతి 55 నిమిషా లకు ఒక విద్యార్థి ఆత్మ హత్య చేసుకుంటు న్నాడని నివేదికలు చెపుతున్నాయి.  ఇంజనీరింగ్, మెడిసనే గాకుండా ఇతరత్రా కోర్సులలో విద్యనభ్యసించిన వారికి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాల్సి ఉన్నది.
 
- యం. రాంప్రదీప్సన్నకారు రైతుకు మేలేది?

Updated By ManamFri, 11/09/2018 - 02:24

imageభారతీయ సమాజం అన్ని రంగాలలో దినదినాభివృద్ధి సాధి స్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ప్రత్యేకంగా వ్యవ సాయ రంగంలో సైతం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభి వృద్ధి చెందడం వలన నేడు పెంపుడు జంతువులు లేకుండా, మానవ స్వశక్తి నిర్మిత పనిముట్లను వాడకుండా, కేవలం యాంత్రీకరణతో, యంత్రాలనుపయోగించి వ్యవసాయం చేయ డం జరుగుతోంది. అలాగే పంట పొలాలకు వాడే విత్తనాలల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

గతంలో విత్తనాలను వ్యవసాయదారుడు తాను పండిం చిన పంటల నుండే తయారు చేసుకునేవాడు. కానీ నేడు పరిimage ణామ క్రమంలో భాగంగా అలాంటి పరిస్థితి లేదు. మార్కెట్ల ల్లో ఎన్నో ప్రైవేటు కంపెనీలు తయారు చేసిన అధిక దిగుబడి నిచ్చే, రోగ నిరోధక శక్తిని కలిగివుండే సంకరజాతి విత్తనాలు అధిక ధరలకు లభ్యమవుతున్నాయి. అలాగే బిందుసేద్యమని, స్ప్రింక్లర్లతో నీరుతడి పంటలు, వివిధ రకాల పండ్ల తోటలు, కూరగాయల పంటలు అమలులోకి వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నేటి వ్యవసాయం ఆహార పంటలకంటే, ఆహారే తర పంటలైన వాణిజ్య పంటలకే అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతోంది. నేడు కొన్ని కార్పొరేట్ సంస్థలు వందల ఎకరా లలో యాంత్రీకరణ సహాయంతో, అతి తక్కువ మానవ వన రులను ఉపయోగించి, శాస్త్ర, సాంకేతికాభివృద్ధిని ఉపయోగిం చి కూరగాయలు, పండ్లతోటలు, నూనె పంటలను పండించి, తమ స్వంతంగా మార్కెట్ చేసుకుంటున్న ఈ తరుణంలో సామాన్య రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారై వలస కూలీలుగా మారాల్సిన పరిస్థితి దాపురించి, వ్యాపారంగా మా రిందనడంలో ఎలాంటి వాస్తవం లేదు.

ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల మంది చిన్న రైతులు ఉంటే వారిలో దాదాపు 87 శాతం ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే వుంటున్నారు. 2 ఎకరాలకన్నా తక్కువ పొలం ఉండేవారిని సన్నకారు కమతం, 2 నుంచి 4 ఎకరాల మధ్య పొలం వున్న వారిని చిన్న కమతం అంటారు. చైనాలో 19 కోట్లు, ఇండోనే షియాలో 1.7 కోట్లు, బంగ్లాదేశ్‌లో 1.7 కోట్లు, చిన్న కమతాల సంఖ్య 9 కోట్ల పైగానే వున్నాయి. 2010-11 వ్యవసాయదారు ల గణన ప్రకారం 2 నుంచి 4 ఎకరాల చిన్నకారు కమతాల సంఖ్య 2.48 కోట్లు (మొత్తం కమతాల్లో ఇది 17.93 శాతం). ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల సన్నకారు కమతాల సంఖ్య 9.28 కోట్లు (మొత్తం కమతాల్లో 67.10 శాతం). దేశంలో మొ త్తం 13.83 కోట్ల వ్యవసాయ కమతాలుండగా వాటిలో 85.03 శాతం సన్నకారు, చిన్నకారు కామతాలే. భారతదేశంలో మొ త్తం 15.96 కోట్ల హెక్టార్ల సాగుభూమి వుండగా అందులో 7.11 కోట్ల హెక్టార్లు (44.55) సన్నకారు, చిన్నకారు రైతుల ఆధీనంలో ఉంది. ఇందులో 1 నుంచి 2 ఎకరాల మధ్య 3.52 కోట్ల హెక్టార్ల భూమి ఉంటే 2 నుంచి 3, 4 ఎకరాల మధ్య 3.59 కోట్ల హెక్టార్ల భూమి కలదు. దేశంలో 1960-61 ప్రకారం దాదాపు 62 శాతమున్న సన్న, చిన్నకారు కమతాలు నేడు 85.03 శాతానికి చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 61.96 లక్షల హెక్టార్లల్లో 55.54 లక్షల కమతాలు గలవు.

నాడు వ్యవసాయ దారుడంటే జోడెడ్లను కొమ్ము నాగలికి వెలుపట, దాపట కట్టి, దుక్కి దున్నడం, పెంపుడు జంతువుల ద్వారా, ఇతర వనరుల ద్వారా లభించే సహజ ఎరువును తన పొలంలో చల్లుకోవడం, విత్తనాలను సైతం తామే స్వతహాగా తయారు చేసుకోవడం, వ్యవసాయంలో భాగంగా నాగలి, కర్రు, తలుగు, తాళ్లు, పారా గుంటుక, గొర్రులా సహాయంతో ఇంటిల్లిపాది కలిసి వ్యవసాయం చేసేవారు. పంట పండాక త మ కుటుంబ సభ్యులంతా కలిసి కల్లం కట్టి ఎంతో ఆనందంగా ఉత్పత్తిని పొందేవారు. నాటి వ్యవసాయదారులంతా నేడు  హృదయ విదారకంగా వలస కూలీలుగా, దినసరి వేతన జీవులుగా పనిచేయడం జరుగుతోంది. నేడు వ్యవసాయదారుంటే పదుల ఎకరాలలో యంత్రాలతో వ్యవసాయం చేస్తూ సంకర జాతి విత్తనాలతో, కృత్రిమ రసాయనిక మందులు వాడుతూ, యాంత్రీకరణతో వ్యవసాయోత్పతులను పొందుతున్నారు. ఒ క్కమాటలో చెప్పాలంటే నేడు వ్యవసాయమనేది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. చల్లని కారులో తిరిగే ధనవం తులు, కార్పొరేటు సంస్థలే నేడు వ్యవసాయదారులుగా మారి నాటి వ్యవసాయదారులను కూలీలుగా మార్చుకొని, వందల ఎకరాలలో అధిక ఉత్పత్తులన్నిచ్చే, ఆధిక గిట్టుబాటు ధర పలికే వాణిజ్య పంటలను, వివిధ రకాల పండ్ల తోటలను, అన్నిరకాల కూరగాయలను పండిస్తూ, వాటిని మార్కెట్ చేసు కోవడానికి సైతం తామే పట్టణాలు, నగరాలలో పెద్దపెద్ద భవంతులలోని రంగురంగుల చల్లని గదులల్లో పెట్టి అధిక ధర లకు సామాన్య జనానికి అమ్ముకుంటున్నారు. అందుకే నేడు ఆహారోత్పత్తుల పెరుగుదలకు ఇదొక కారణమవుతున్నది. యాంత్రీకరణ వలన, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల వలన సన్న కారు, చిన్నకారు రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా భూస్వాములు వ్యవసాయం చేయించే వివిధ సంస్థలకు మాత్ర మే ప్రయోజనం చేకూరుతుంది. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వ్యవసాయ దారులకు ఈ యాంత్రీకరణ వలన లాభాల్ని చేకూర్చకపోగా నష్టాలను తెచ్చిపెట్టడం జరుగు తోంది. దేశంలో ఒకపక్క పంటల పెట్టుబడి ఖర్చులు భాగా పెరిగిపోయాయి. 6 నెలలు కష్టపడి పంట పండిస్తే, పం డించిన పంట ఉత్పతులకు సరైనా ధర ఉండదు. నేటి పంట లకు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి కారకాలను వాడాల్సినవసరం ఏర్పడుతుంది. సంకర జాతి విత్తనాలు, జన్యుమార్పిడి గల విత్తనాల ధరలు రైతుల పాలిట భారంగా మారాయి. వాణిజ్య పంటలు, నునే గింజల విత్తనోత్పత్తి పూర్తిగా ప్రైవేటు సంస్థలే నిర్వహిస్త ఉన్నాయి. చిన్నకారు రైతులు సైతం నేడు అధిక ధర లతో కూడిన విత్తనాలు వాడి వ్యవసాయం చేయాల్సిన పరి స్థితి నెలకొంది. అనుకోకుండా అతివృష్టి, అనావృష్టి వంటి విపత్తులు సంభవిస్తే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారి ఆత్మహత్యలు జరగడానికి దారి తీసి, వర్ణనాతీతంగా మారు తోంది. ఒకవేళ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పంట సక్ర మంగా పండినా వాటికీ సరైన గిట్టుబాటు ధర ఉండదు. ఏ ఒక్క రైతును కదిలించిన అతను వెల్లడించే ఆవేదన ‘చెబితే రామాయణమంత - రాస్తే మహాభారతమంత’ అన్నట్టుగా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

నేడు కొన్నిచోట్ల ప్రభుత్వాలే నేరుగా పంట ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్నాయి. కానీ దీనివల్ల సన్నకారు, చిన్నకారు రైతులకు ఒరిగే ఉపయోగమేమి లేకుండాపోయింది. ఎందు కంటే తాము పండించిన పంటలకు కావాల్సిన పెట్టుబడిని, పంట ఉత్పత్తిని వారికే అమ్మాలనే షరతులతో ముందుగానే మధ్యవర్తిత్వం వహించే దళారి వ్యక్తుల నుంచి తీసుకోవడం జరుగుతోంది. అందుకే, చిన్నకారు రైతులు వ్యాపారస్తులకు కూలీలుగా మారాల్సిన దయనీయ పరిస్థితి, ఒక్కొక్కసారి కూలీ సైతం మిగులక అప్పుల బారినపడి వడ్డీతో తలకు మించిన భారంగా తయారవుతుంది. అక్కడక్కడ ఎవరో ఒక రు ధైర్యం చేసి ప్రభుత్వ కొనుగోలు మార్కెట్‌కు తీసుకెళ్లినా ఎన్నో పరీక్షలు, ఆ ఖర్చు, ఈ ఖర్చు అని, 5 లేదా 6 రోజుల పాటు అక్కడేవుండి అమ్మాలనుకున్నా పాసుబుక్ అని, అకౌం టని ఎన్నోరకాల ఆంక్షలు విధించడంతో డబ్బు చేతికొచ్చేసరికి ‘అసలుకే ఎసరు’ అన్నట్లుగా తయారయ్యింది. రైతుల కష్టాల ను గతంలో యూపీఏ హయంలో మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళితే కమిటీలు వేసి కొన్ని సమస్యలను గుర్తించ డం జరిగింది. అవి:1. ప్రభుత్వ పెట్టుబడి, 2. మౌలిక సదుపాయాల కొరత, 3. మార్కెట్ ధర లేకపోవడం, 4. తగి నంత పరిజ్ఞానం లేకపోవడం.

ఈ విధంగా గుర్తించబడిన సమస్యలను రూపుమాపడా నికి ఎలాంటి చర్యలు చేపట్టిందో చిన్నకారు రైతులకు తెలి యని అయోమయ పరిస్థితి. భారతదేశానికి రైతే వెన్నెముక అని పెద్దగా గొప్పలు చెబుతారు. రైతుల పాలిట ఎన్నో సంక్షే మ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నామనీ ప్రకటనలు ఇచ్చు కుంటారు. ప్రభుత్వం దృష్టిలో రైతులంటే ఎవరో అని చిన్న కారు రైతులకు తెలియని పరిస్థితి. ఏది ఏమైతేనేమి చిన్నకారు రైతు వెన్నెముక విరగకుండా కాపాడాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వాల పైననే ఉన్నది. 

1. భూమిలేని నిరుపేదలను గుర్తించి అట్టివారికి కులాలకు అతీతంగా భూమినివ్వాలి. నీటి వసతి కల్పించాలి. 
2. సన్నకారు, చిన్నకారు రైతులకు వివిధ చెరువులు, కాలువలు తవ్వించి నీటి వసతి కల్పించాలి. వర్షపు నీటిని ఏ మాత్రం వృధాగా పోనివ్వకుండా కాపాడి వ్యవసాయ పంట లకు ఉపయోగించే విధంగా సక్రమ ఏర్పాటు చేయాలి.

3. ప్రభుత్వం రైతులకు చేపట్టే ఎలాంటి సంక్షేమ కార్యక్ర మమైనా ముందుగా బడుగు బలహీన వర్గాలకు, సన్నకారు, చిన్నకారు రైతులకు ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ఆ ఫలితాలను పారదర్శకంగా అందే విధంగా తగు యం త్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
4. వ్యవసాయ నేలలను తనిఖీలు చేసి, ఏ నేలలో ఏ రక మైన పంటలు పండుతాయో పరీక్షలు చేయించి, రైతులకు సూ చించి, దానికి కావాల్సిన విత్తనాలను, పెట్టుబడిని సబ్సిడీ రూపంలో అందించి పంటలకు తగిన సూచనలిచ్చే విధంగా వ్యవస్థను రూపొందించాలి.
5. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే పొలాల వద్దకు వచ్చి ఎలాంటి షరతులు లేకుండా గిట్టుబాటు ధర కేటాయించి కొనుగోలు చేయవలిసిన అవసరం ఉన్నది. 

6. అతివృష్టి, అనావృష్టి వలన పంటలు నాశనమైతే ప్రభు త్వమే ముందుకువచ్చి, వారికి చేయూతనిచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఏ ప్రభుత్వాలైనా వ్యవసాయాభివృద్ధికి ఎలాంటి పథకాలు చేపట్టినా అవి చిన్నకారు రైతుల మేలుకోరే విధంగా ఉండాల్సి న అవసరం వున్నది. ఆ పథక ప్రయోజనాలను ఎప్పటిక ప్పుడు బేరీజు వేసుకోవాలి. ఎందుకంటే దారిద్య్రరేఖకు దిగువ నున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులు పంటలు పండక ఆర్థికలేమితో, అప్పులపాలై అష్టకష్టాలు పడుతుంటారు. అందుకోసం వీరికొరకు ప్రవేశపెట్టినటువంటి పథకాలపై సం పూర్ణ అవగాహన కల్పించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. 

ప్రపంచపు వ్యవసాయాభివృద్ధిలో మనదేశ స్థానం చూసే దానికంటే ముందు చిన్నకారు రైతుల ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రవేశపెట్టే పథకాలు భూస్వాములకు, జమీందార్లకు, పెత్తందార్లకు, ఆర్థికంగా బలమైన వ్యవసాయదారులకు గాకుం డా చిన్నకారు, సన్నకారు కమతాలు కలిగిన రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

- పోలం సైదులు
9441930361

Related News