friendshipday special

ఒక్క నేస్తం చాలు

Updated By ManamSun, 08/05/2018 - 09:08

స్నేహం ఒక నిరంతర ప్రక్రియ. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు నిరంతరం తెలుసుకొనే, కలిసి ఉన్న క్షణాల్ని అమితంగా ఆస్వాదించే ఒక భావన. ఈ లోకంలో అందరికంటే అసలైన సంపన్నులెవరంటే డబ్బున్నవాళ్లు కాదు, మంచి స్నేహితులు ఉన్నవాళ్లే! కలుసుకున్న ప్రతిసారీ స్నేహితుడిచ్చే కావలింత ఎంత బాగుంటుంది! ఎప్పుడైనా సరే స్నేహితుడిగా నీకు నేను తోడు అని చెప్పే ఆ కావలింత ఎంత భరోసానిస్తుంది!!

image


స్నేహితులంటే తమ మధ్య వైరుధ్యాల్ని కూడా ఆస్వాదించేవాళ్లు. ఒకరిలా ఇంకొకరు మారకుండానే ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించేవాళ్లు. తమకి తాము ఎంత విలువనిస్తారో, ఎదుటివాళ్లకూ అంత విలువనిచ్చేవాళ్లు. ఆనందాన్నైనా, బాధనైనా పంచుకోడానికి మనకు మొదట గుర్తొచ్చేది స్నేహితుడే.  స్నేహితుడు ఎల్లవేళలా మనతో ఉండటం కుదరకపోవచ్చు. కానీ అవసరమైనప్పుడల్లా వస్తాడు. నీవైపు నిలబడతాడు. నిన్ను నిలబెడతాడు.  కాలం గడిచే కొద్దీ చిక్కనవుతుండటం స్నేహంలోని గొప్పతనం. స్నేహితుడు ఉన్నవాడెవ్వడూ ఒంటరి కాడు. స్నేహం అంటే మన పెదవుల మీది చిరునవ్వు. స్నేహం అంటే వానలో ఉల్లాసంగా చేసే నాట్యం.
 
ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా సరికొత్త స్నేహితుల్ని సృష్టిస్తుండవచ్చు. ేస్నేహాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తుండవచ్చు. అదొక నెగటివ్ కోణం. కానీ పాజిటివ్ కోణం కూడా ఉంది. ముగిసిపోయాయనుకున్న స్నేహాలు సోషల్ మీడియా ద్వారానే తిరిగి విరుస్తున్నాయి. ఎప్పుడో తప్పిపోయిన స్నేహితులు మళ్లీ కలుస్తున్నారు. స్నేహబంధాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆగస్ట్ మొదటి ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు రచయితలు స్నేహానుభవాలనూ, స్నేహానుభూతులునూ పంచుకుంటున్నారు. వాళ్ల హృదయాల్లో స్నేహానికి ఉన్న స్థానమేమిటో చెబుతున్నారు. పదండి.. స్నేహ పరిమళాల్ని ఆస్వాదించేందుకు, స్నేహ వర్షంలో తడిసేందుకు...

స్నేహం మన శ్వాస
imageఇప్పటి దాకా నడిచిన దారిలో ఎన్ని స్నేహ సుమాలు విరిసినా ప్రతి స్నేహం దేనికదే ప్రత్యేకం. ఇప్పుడు ఎంతమంది స్నేహితులైనా ఉండనీ.. స్నేహం అనగానే చిన్నప్పటి స్నేహాలే ముందు గుర్తొస్తాయి. అలాంటి చిన్నప్పటి స్నేహాల్లో మొదటి స్నేహం అక్క మాధవితో.

చిన్నప్పుడు చేమంతుల దారుల్లో నడుస్తూ స్కూల్‌కి వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కుక్క అరుస్తూ వెంటబడింది. అప్పుడు తనకి అయిదేళ్లు, నాకు నాలుగేళ్లు అనుకుంటా. నన్ను ఎలా ఎత్తుకొని పరిగెత్తిందో తెలీదు. తను నన్ను గుండెలకి హత్తుకోవడం నా మొదటి జ్ఞాపకం. నన్ను కాపాడినా తనకి మాత్రం గాయాలు తప్పలేదు. నెత్తురోడుతున్న కాళ్లతో నన్ను మాత్రం వదలకుండా ఇంటికి పరిగెత్తింది. ఇప్పటికి తన చేయి పట్టుకొని నడుస్తుంటే అదే జ్ఞాపకం వస్తుంది.

చిన్నప్పుడు వర్షంలో ఆడుకున్న ఆటలూ మధ్యాహ్నం వడగళ్లు ఏరుకుని జాగ్రత్తగా గిన్నెలో దాచుకొని నిద్రపోయిimage లేచి చూశాక నీరయిపోయి ఏడుస్తుంటే, అప్పటికి తనూ చిన్నదైనా ఆరిందాలా ఓదార్చేది. మళ్లీ రేపే వడగళ్ల వాన పడుతుందని భరోసా ఇచ్చేది. అదిగో ఆ భరోసాతో సంవత్సరం ఎదురు చూసినా కష్టం అనిపించేది కాదు. 

ఇద్దరి మధ్యా సంవత్సరం మాత్రమే తేడా ఉండటం వల్ల నాకూ, తనకూ కామన్ స్నేహితులు ఉండేవాళ్లు. చిన్నప్పటి ఆటల దగ్గర్నుంచి పెద్దయ్యాక తన స్నేహం ఇచ్చిన శక్తి ఎప్పటికీ ప్రత్యేకమే. అలాగని మా మధ్య ఎప్పుడూ పొరపొచ్చాలు రాలేదని కాదు. చాలా సార్లు వచ్చేవి. అయినా కూడా నేను గాయపడిన ప్రతిసారీ తన కళ్లల్లో సముద్రం ఊరడం మాత్రం మా స్నేహానికి కొలమానం.

మా ఆసక్తుల మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయి. అయినా నాకిష్టమైన పారిజాతం పూవు పూస్తే తాను పండుగ చేసుకొనేది. అడవి సంపెంగ మొక్కని ఇంట్లో తెచ్చి పెట్టుకొని, మొగ్గ తొడగట్లేదని నేను ఎదురు చూస్తుంటే బెంగ పడేది. నాకు చదువుతో పాటు లిటరేచర్ మీదా, ముగ్గులు వేసుకోవడం, పూసలతో బొమ్మలు అల్లడం.. ఇలా అన్నీ ఇండోర్ వ్యాపకాలు. తను చదువుతో పాటు అన్ని ఆటలూ ఆడేది. తను చాలా ధైర్యంగా అందరితో పోటీ పడుతున్నట్లు ఉండేది. నేను చాలా సిగ్గరిగా తన వెనుక దాక్కునే ఉండేదాన్ని. తన ధైర్యం నాకు ఇప్పటికీ చాలా అమేజింగ్. కెరియర్‌లో కూడా ఆ ధైర్యంతోనే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కొని టాప్ పొజిషన్‌లోకి వెళ్లింది. ఇన్ని వ్యత్యాసాలున్నా, మా స్నేహం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. రక్తం పంచుకుని పుట్టిన సోదరి కన్నా ఒక స్నేహితురాలిగానే తను ఎక్కువ. స్నేహం అనగానే మేం ఇద్దరం కలిసి చెప్పుకున్న గంటల గంటల కబుర్లు గుర్తొస్తాయి. చేసిన అల్లరి పనులూ.. అసలు ప్రతీ జ్ఞాపకం, నా జీవితంలో ఎదురైన ప్రతీ స్నేహం తనతో కలిపి ముడి వేసినదే. అందుకే, స్నేహం అనగానే అక్క మాధవి గుర్తొస్తుంది.

వీటన్నింటికీ మించి స్నేహం అంటే ఖలీల్ జిబ్రాన్ కవిత గుర్తొస్తుంది!
‘‘నీ అవసరాలకు సమాధానమే నీ మిత్రుడు’’ అంటాడు ఖలీల్. ఎంత లోతైన భావన ఇది. నిజమే! స్నేహం అంటే మన అవసరాలకు సమాధానమే కాదు, స్నేహం మన అవసరం కూడా. స్నేహం ఆక్సిజన్ లాంటిది. అది లేకుండా మనగలగడం చాలా కష్టం! అందుకే స్నేహం విలువ తెలీని వాళ్లు ఉంటారేమో కానీ, స్నేహం తెలీని వాళ్లు బహుశా ఉండరేమో. స్నేహం అంటే ఒకరికొకరుగా బ్రతకడమే కాదు, ఎదుటి వారి స్వేచ్ఛని గౌరవించడం కూడా. ఒక వ్యక్తితో స్నేహం చేసినప్పుడు.. యథాతథంగా వాళ్ల జీవితాన్ని ఇష్టపడాలి. తన ఆలోచనలూ, తన అభిప్రాయాలూ.. వీటిని గౌరవించకపోతే ఇంక స్నేహం ఎక్కడిది? చాలా గాయాలకి కారణం ఈ గౌరవం లేకపోవడమే.

స్నేహం అంటే మనకి నీడ కాదు. స్నేహం మన శ్వాస. స్నేహమంటే మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా మీ గుండె చెప్తున్నది తను అర్థం చేసుకోవాలి. మీ కేరింతల వెనుక దాచిన దుఃఖాన్ని తనూ, తన నవ్వులో దాగున్న శూన్యాన్ని మీరూ.. పట్టుకోగలగాలి.

అందుకే ఖలీల్ జిబ్రాన్ అంటాడు..
‘‘ఆత్మని మరింత విస్తృతపరిచేందుకు తప్పించి స్నేహానికి మరొక ఉద్దేశాన్ని తలపెట్టవద్దు.. తన మర్మాలను వెల్లడి చేయడానికి మించి మరేదో పట్టుకుందామని స్నేహం కోరుకుంటే అది స్నేహం కాదు, అది విసిరిన వల అవుతుంది.. మీ మిత్రునికి మీలో అత్యుత్తమమైనవి కేటాయించండి.. సమయాన్ని వృథాగా గడిపేందుకు స్నేహం వద్దు.. మీ సమయాన్ని సజీవంగా ఉంచేందుకు స్నేహాన్ని కోరుకోండి!’’
స్నేహమంటే ఒక జీవితంలో ఇమడని, రెండు జీవితాలు ఒక్కటై చేసుకునే అనంతమైన మదుపు.
హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే!!
    
కాకి ఎంగిలే అస్సల్ దోస్తానా

‘‘మరచిపోని ఓ స్నేహమా..మరపురాని నా ప్రాణమా..యద సవ్వడి వింటే..బ్రతుకు పువ్వుల పంటే..నీ తోడే లేకుంటే గుండె ఆగిపోయెనా

imageనీ తోడే లేకుంటే గొంతు మూగబోయెనా’’ అంటూ బీకామ్ చదివే రోజుల్లో కామ్‌గా ఉండలేక రాసుకున్న పాట. తెల్లారితే నయా సాల్. న్యూ ఇయర్ అని ఫ్రెండ్స్ పాడమంటే, మళ్లీ పాత పాటలెందుకనే ఆలోచన నాది. ఏది ఏమైనా కొత్త పాట రాయాల్సిందే. అప్పటికీ స్నేహం మీద పాటంటే ప్రజావాగ్గేయకారుడు జయరాజన్న రాసిన ‘స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల’ మాత్రమే. 

పాటంటే కొత్తగా చెప్పాలి. కొత్త బాణీ కావాలి. ఫ్రెండ్స్‌ని మెస్మరైజ్ చెయ్యాలి. ఏవేవో ఆలోచనలు. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడం కోసం మందు, విందుల్లో యూత్ అంతా బిజీ. నేను మాత్రం బుద్ధిమంతుల సంఘం జాతీయ అధ్యక్షునిలా పదిహేనేళ్ల క్రితం ఓ రాత్రి పాట రాయడానికి కూర్చున్న జ్ఞాపకం. విద్యార్థి ఉద్యమాల్లో పాటను ఫిరంగిలా పేల్చడమే తెలుసు నాకు. పువ్వులు, పక్షులు కాదు. అసలు ప్రకృతికి సంబంధించిన చింతన అనేదే లేని వయసు. పోరు పాటలకు ఒక విరామం కావాలని నేనేమీ అనుకోలేదు. కాకుంటే రెగ్యులర్ ‘రెడ్’ బాణీ కాకుండా కొత్త స్టైలేదో ట్రై చేసిన. రాత్రంతా పాడుతూ రాస్తూ.. రాస్తూ పాడుతూ పొద్దుటికల్లా పాట కొత్తగా రెక్కలు తొడుక్కుని, భూమిని చీల్చుకొని బయటికొచ్చిన మొక్కలా నవ్వింది.

న్యూ ఇయర్.. న్యూ సాంగ్. ‘‘చలో షురూ’’ అన్నరు ఫ్రెండ్స్. ‘‘చెట్టుకొమ్మపై పక్షుల జంటలా, జీవితానికిimage వెలుగునీడలా.. నా ఊపిరికి ప్రాణం నీవు, నా గుండెకు జీవం నీవు’’ అంటూ తనువు, మనసు పులకించేలా సాగుతున్న పాటలో లీనమైన నేను, నా ఫ్రెండ్స్. ‘‘తొలకరి చినుకులా, వానజల్లులా, మెరుపుతీగలా, తుదకు వరదలా, కడకు గోదారమ్మలా..’’ సాగే చరణం వరద పరవళ్ల దృశ్యం. అచ్చంగా ఒక సినిమా స్టైల్ పాట. పాట ముగిసే ముక్తాయింపులో చినుకులా మొదలై నదిలా పరుగెత్తి సంద్రమైన రూపు. మొత్తంగా ఒక కొత్త ఉషోదయాన్ని బొమ్మ కట్టింది పాట. ప్రతి ఫ్రెండ్‌షిప్ డేకు నాకూ, నా ఫ్రెండ్స్‌కూ ఈ పాట గుర్తుకొస్తది. కూనిరాగంగానైనా వెంటాడుతూనే ఉంటది. నిజానికి ఇది నా పాట గొప్పతనం కాదు. ఫ్రెండ్‌షిప్ గొప్పతనం. ఈ పాటను పాడుకుంటూ వారి వారి ఫ్రెండ్స్‌ని గుర్తు తెచ్చుకున్నతనాల్ని చూశాను. కాలం సినిమా రీల్‌లా గిర్రున తిరిగింది.

కాలాన్ని బట్టే మనుషులు, విలువలు ఉంటాయని నమ్మేవారిలో నేనూ ఒకణ్ణి. అయితే కాలాతీతంగా స్నేహానికి విలువ ఇచ్చే వారి వల్లే ఫ్రెండ్‌షిప్ అనేది ‘ఎక్స్‌పైరీ’ లేని శక్తిగా నిలువగలుగుతున్నది. మానవ సంబంధాలన్నీ మార్కెట్ సంబంధాల దశను దాటి, స్మార్ట్‌ఫోన్ రిలేషన్స్‌గా మారి ఫేస్‌బుక్, వాట్సాప్‌లు తప్ప మరేమీ లేని శూన్య ప్రపంచం మనది. ఇలాంటి సంధికాలంలో ‘వాటీజ్ ఫ్రెండ్‌షిప్’ అని మళ్లీ మళ్లీ వెతుక్కొని నిర్వచించుకోక తప్పదు. గ్లోబలైజేషన్ రెండో దశలో ఇంకా బంధాలు అనుబంధాలు మిగిలే ఉంటాయా? ఏమో వెతుక్కోవాలి. మనిషి జిందగీలో దోస్తానాను మించిన బంధం మరొకటి లేదు. ఏ సంబంధం లేకపోయినా, ఫ్రెండ్స్‌గా మారడానికి అనేక కారణాలు ఉంటాయి. చాలా ఏండ్ల పాటు కలిసి ఉన్నా, స్నేహితులు కాలేనివారు కొందరైతే, కేవలం కొన్ని నిమిషాల్లోనే విడదీయరాని బంధంగా నిలిచిపోయే వారు మరికొందరు. మనలో ఉన్నదేదో వారిలో కూడా ఉండడం వల్ల కావచ్చు. తక్కువ టైమ్‌లో మంచి మిత్రులమైపోతం. అప్పుడు అనిపిస్తది ఫ్రెండ్‌షిప్ బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ అని. మన ఇంట్లోవాళ్లు మనకోసం ఆలోచించడం, కష్టమొస్తే అల్లాడడం కామన్. కానీ, ఏ సంబంధం లేకుండా కేవలం ఫ్రెండ్ అనే కన్సర్న్‌తో మన గురించి ఆలోచించడం, మనం బాగుండాలని కోరుకోవడం, అందుకోసం ఎంతకైనా తెగించి, ఏదైనా త్యాగం చేసే మంచి స్నేహితులు ఉండడం నిజంగా సంతోషకరం.

ఇవాళ సోషల్ మీడియాలో మనకు ఎందరో పరిచయం అవుతుంటారు. కానీ, వారందరిని నిజమైన స్నేహితులుగా భావించలేం. మొహమాటానికి లైక్ కొట్టేవాళ్లు, ఏదో ఆశించి ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెట్టి భజన చేసేవారు.. మన అభిరుచులకు, ఆలోచనలకు సరిపోయేవాళ్లు కాదు. అందుకే ఫేస్‌బుక్‌లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారన్నది లెక్కకాదు. నీకు కష్టమొస్తే కన్నీరు పెట్టేవాళ్లు, నీ ఎదుగుదలకు గర్వపడేవాళ్లు, సంతోషపడేవాళ్లు, లోకం నిన్ను అపార్థం చేసుకున్నా సరే నిన్ను అర్థం చేసుకునేవాళ్లు ఉండడం చాలా గొప్ప విషయం.

నా జీవితంలో ఎంతోమంది మంచి మిత్రులను సంపాదించుకున్నాను. వారందరూ నా శ్రేయోభిలాషులు. అందులో రకరకాల దశల్లో స్నేహితులైనవాళ్లు ఉన్నారు. చిన్ననాటి నుంచి స్కూల్లో స్నేహితులై ఇప్పటివరకు కలిసి నడుస్తున్నవాళ్లు ఉన్నారు. అలాగే మధ్యలో జతై, ఫెవికాల్ బంధంలా అతుక్కుపోయినవారు ఉన్నారు. ఇక సామాజిక జీవితంలో విద్యార్థి ఉద్యమాల నుంచి, వామపక్ష పోరాటాల నుంచి, తెలంగాణ, బహుజన ఉద్యమాల వరకు అనేకమంది తమ హృదయ గవాక్షాలు తెరుచుకొని నన్ను ఆహ్వానించారు. తమ హృదయాల్లో కొంత స్థానం కల్పించారు. వారిని నేనెప్పుడూ మరిచిపోలేను.

ఇక సాహిత్యం అందించిన స్నేహితులైతే లెక్కే లేదు. వరంగల్‌లో మా శివనగర్ బస్తీ నుంచి విదేశాల వరకూ ఎంతోమంది స్నేహితులను అందించింది సాహిత్యం. వారందరిని కలుసుకున్నప్పుడు, కలుసుకోలేని పరిస్థితుల్లో కనీసం ఫోన్లలోనైనా ఆత్మీయంగా మనసారా మాట్లాడుకోవడం సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్నా, ఇంత మహానగరంలో చాలా దగ్గరి ఆత్మీయ మిత్రులను కలుసుకోలేకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తది.

మూడున్నర దశాబ్దాల ఈ జీవితంలో చిన్ననాటి ఫ్రెండ్స్‌ని మించిన మంచి ఫ్రెండ్స్ లేరనిపిస్తున్నది ఇప్పుడు. మనుషులు ఎదుగుతున్న కొద్దీ వారి వారి ఆలోచనల్లో, ఆశయాల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రకరకాల భావజాలాలతో స్నేహాన్ని సంకుచితంగా మార్చేవాళ్లు ఉంటారు. కానీ క్లాస్‌రూమ్‌లో మనతో పాటు బెంచీమీద కూర్చున్నవాడు ఏ కల్మషం లేకుండా నిన్ను స్నేహితునిగా స్వీకరించి చాక్లెట్టో, బిస్కెట్టో పంచి ఇచ్చే స్నేహం చాలా గొప్పది. అట్లా ఐదో క్లాసు వరకు కలిసి చదువుకున్న అఫ్సర్‌గాడు, వేరే స్కూల్‌కి వెళ్తాడని తెలిసి నేను మూడు రోజులు అన్నం తినకుండా ఏడ్చిన జ్ఞాపకం. నాకు తోడబుట్టిన చెల్లెళ్లు లేరని తెలిసి మరో స్నేహితుడు వాళ్ల ఇంటికి తీసుకెళ్లి వాళ్ల సిస్టర్స్‌తో రాఖీ కట్టించిన జ్ఞాపకం. ఆకలికి నేను ఆగలేనని తెలిసి వాడు తినకుండా నాకు పెట్టిన జ్ఞాపకం. పరీక్ష ఫీజులే కాదు, ఖర్చులకు కూడా డబ్బులు సర్దిన మంచి మనసున్న స్నేహితుల జ్ఞాపకం. ‘నువ్ మా అందరి కంటే గొప్పోడివి కావాల్రా’ అని ఒక కంట నన్ను కనిపెట్టిన జ్ఞాపకం. అలాంటి దిల్‌దార్ సోపతిలందరికీ ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు.

మనిషికీ, కాలానికీ మధ్యవర్తి
imageపనుందిరా పోవాలంటూ చేతులొదిలేస్తూ దగ్గరయ్యే వాళ్లంతా స్నేహితులే. సందర్భాలే వెతుక్కొని నిర్వచించుకోనక్కర్లేకుండా ఉండే ఆత్మబంధువులెలా ఉంటారో తెలుసుకోవాలనుకుంటే స్నేహమే దిక్కు. ఒక్కసారి ఎవరినన్నా ప్రాణ స్నేహితుడెవరని అడిగి చూడండి, లేదా మీ ప్రాణ స్నేహితుడెవరో చెప్పి చూడండి. ఆ క్షణం ఉద్వేగంతో నిండి వచ్చిన సమాధానాల్లో తొంభై తొమ్మిది శాతం మనుషులు కళ్లు తడైనవారుంటారు. వాళ్ల ఉనికి మీలో ఎలా ఉంటుందంటే.. ఒంటరిగా సాగుతున్న పంటకాలవ దగ్గర, మామిడి కొమ్మమీద ముడుచుక్కూర్చుని సుర్రుమని చీమిడి పీల్చుతూ, ఏకాంతాన్ని ఎరగా వేసి ఎట్టకేలకు పట్టుకున్న చేపపిల్లని గుదిగుచ్చి గుట్టుగా ఇంటికి తెచ్చాక, అది ఒక్కటీ వండలేక మీ అమ్మ పారేయమని పంపినపుడు, ఇంకొక్కడ్ని తోడుపెట్టుకుని ఊరవతల దాకా పోయి, కుదురుగా కూర్చుని కాల్చుకుతింటుంటే.. ఆ వెచ్చని పచ్చి చేపా, పడిచచ్చిపోయే ఆ రుచీ మెదళ్లోకెక్కించిన వాడొకడుంటాడు. ‘పంచుకోవడం’ స్నేహమని తెలిపే వయస్సది.

పీచు మిఠాయ్, పిప్పరమెంటు, జాంకాయ, జొన్నపొత్తూ పంచుకోవడంలోని పరమానందం నాకు మాత్రమే తెలుసనే imageమహా గర్వం మూటగట్టుకొని, టింగు టింగున గంట మోగ్గానే చెంగుచెంగున గంతులేస్తూ బడి నుండి ఒడి దాకా పరిగెత్తడం పూర్తయ్యాక, చెప్పా పెట్టకుండా పక్కూరి కాలేజ్ అడ్మిషన్‌తోనో, మనం ఎదగడం భారమైన కుటుంబానికి ఉపాధి దిక్కైన ఊరితోనో బాల్యం జరిగిపోతుంది. కొత్త ముఖంతో కొందరి ముందు ఏడ్వడం రాదు, నవ్వడం చేతకాదు. అలవాటయ్యే దాకా మొహమాటాలు, అప్పుడప్పుడూ మనస్పర్థలూ ఉంటున్నపుడు తప్పు కూడా ఒప్పయ్యే తెలియనితనంలో నీ పాట పాడే వాడొకడుంటాడు. ‘భరోసా బతుకు’ స్నేహమని చెప్పే వయస్సది.

కొన్ని ప్రదేశాలెప్పుడూ మనతోనే ఉంటాయి. మనం పుట్టి పెరిగిన ప్రదేశాలూ, లేక విహారానికి వెళ్లొచ్చినవీ, ఎటైనా వెళుతూ చూసొచ్చినవీ ఆ జాబితాలో ఉండొచ్చు గాక.. వాటితో పాటు వినాయక నిమజ్జనం రోజు చేజారి పడిపోబోతుంటే పట్టుకున్న చెయ్యి మూలాన, ఆహ్వానించబడిన అద్దిల్లొకటి గుర్తుండిపోతుంది. అందులో భార్య పుట్టింటికి వెళ్లాక, అతనూ నువ్వూ మాడ్చుకుని తిన్న వడియాలు గుర్తుండిపోతాయి. ఎన్ని ఫైవ్ స్టార్ రెస్టారెంట్లతో పోల్చుకున్నాక కూడా నీ నోట్లో నీళ్లూరనపుడు తడి నోటితో నువ్వేసిన గుటకకి కారణమై ఒకడుంటాడు. ‘జీవన విధానమే జీవితమ’ని తెలిపే వయస్సది. 

పొద్దున్నే వాకింకెళ్లినపుడు ఆ లాస్ట్‌కి పోతే స్కై కిందకొస్తదనీ, మా డాడీ దాన్ని బైక్ మీద పట్టుకొస్తాడనీ అనే పిల్లాడిలోని అమాయకత్వాన్ని ఫోన్‌లో టైమ్ చూసుకుంటూ దాటిపోతున్నపుడు, వాడెదురొస్తే పిల్లలెప్పుడొస్తారని అడుగుతాడనీ, అందుకు అబద్ధం చెప్పలేక ఎదురొచ్చిన నీ వయసు ముసలాడికి ముఖం దాటేసినపుడు, నిన్ను చూసీ చూడనట్టు వెళ్లిపోవడానికి ఇష్టం లేకున్నా వెనుతిరిగే వాడొకడుంటాడు. అప్పుడు ‘మెరుస్తున్న కళ్ల కంటిచెమ్మే కాలమ’ని తెలిపే వయస్సది.

పచ్చి చేపా, అద్దిల్లూ, వడియాలూ, వాకింగ్.. ఇలా రూపం మార్చుకుంటూ మనిషికీ, కాలానికీ మధ్యవర్తిలా మారే వయసే స్నేహం.

Related News