Sorry

సారీ.. ఓ సారి!

Updated By ManamSun, 09/09/2018 - 00:16

Sorryఅది పుణె నగరం.. కొన్ని రోజుల క్రితం రాత్రికి రాత్రే ఒక్కసారిగా నగరమంతా ‘శివ్‌డే.. అయామ్ సారీ’ అన్న హోర్డింగులు వెలిశాయి. ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో ఎవరికీ అర్థం కాలేదు. భారీ హోర్డింగులు, వినైల్ పోస్టర్లు, లాలీపాప్‌లు, కటౌట్లు, బ్యానర్లు... ఇలా ప్రతిచోటా తెల్లటి బోర్డు, దానిమీద నల్లటి అక్షరాలతో ‘శివ్‌డే.. అయామ్ సారీ’! విషయం ఏమిటంటే పుణె నగరానికి చెందిన ఓ ఆగర్భ శ్రీమంతుడి కొడుకు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తిట్టుకునేవరకు వెళ్లింది. తప్పు తనదే అని తెలుసుకున్న ఆ కుర్రాడు.. తన ప్రేయసికి సారీ చెప్పాలనుకున్నాడు. ఆమె ఫోన్ ఎత్తితే ఒట్టు. ఏం చేయాలని ఓ స్నేహితుడి సాయం అడిగితే.. అతడీ సలహా చెప్పాడట! అంతే, పుణె నగర వ్యాప్తంగా దాదాపు 300కు పైగా హోర్డింగులు, పోస్టర్లు పెట్టించేశాడు. రోడ్డు మీద వెళ్లేవాళ్లందరూ ఇవి చూస్తూ ఎందుకా అని ఆశ్చర్యపోయారు. అయితే దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవుతోందని గుర్తించిన పోలీసులు.. కొన్ని గంటల్లోనే ఆ యువకుడిని పట్టుకుని న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. ఇక విదేశాల్లో అయితే తాము సారీ చెప్పాలనుకున్న వారు తిరిగే వీధులగుండా పెద్దఎత్తున సారీ ఉన్న కటౌట్లు కట్టి కడుపుబ్బ నవ్వించి, మళ్లీ మచ్చిక చేసుకోవడం ట్రెండ్‌గా మారింది. ఎప్పటికప్పుడు ఈ ఆకతాయిలను పోలీసులు హెచ్చరిస్తున్నా ఇది ఓ కల్ట్‌గా మారిపోయింది. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే? పతనం అంచున ఉన్న సంబంధాలను పునరుద్ధరించుకోవలాంటే? వీటన్నింటికీ బ్రహ్మాస్త్రంలా పనిచేసే ఏకైక ఆయుధం రెండు అక్షరాల పదం ‘సారీ’.  అవతలి వాళ్లను క్షమించాలని కోరాలంటే.. విశాల హృదయం ఉండాలి. చేసిన తప్పు ఒప్పుకొనే ధైర్యం కావాలి. ఇవి రెండూ ఉన్నప్పుడు మన నోటివెంట మనస్ఫూర్తిగా వెలువడే ‘సారీ’తో మళ్లీ సత్సంబంధాలు కొనసాగుతాయనే తారకమంత్రం జీవితకాలం గుర్తుంచుకుంటే చాలు. 

మొహమాటం వీడి..
సారీ చెప్పే సందర్భాలు మన  నిత్యజీవితంలో చాలా ఎదురవుతుంటాయి. బంధాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి, తమ తప్పును తెలుసుకుని సరిదిద్దుకునేందుకు అహాన్ని పక్కనపెడితే చాలు. నోటివెంట ఆయాచితంగా క్షమించమనే పదం వస్తుంది. స్నేహ బంధమైనా, ప్రేమ బంధమైనా, రక్త సంబంధమైనా వీగిపోకూడదంటే ఓవరాలింగ్ చేసేలా సహకరించే ఈ సారీకున్న బలం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు నలుగురి ఎదుట సారీచెబితే దాదాపు అన్నీ సర్దుకునేవి. కానీ ఇప్పుడు కాలం మారింది.. ఆధునిక నాగరికత పేరుతో ప్రతి సందర్భానికి గ్రీటింగులు, గిఫ్టులు వచ్చేశాయి. ఈ కోవలోకి సారీ కూడా వచ్చి చేరింది.

సారీ ఇలా కూడా!
వ్యక్తిగతంగా కలిసి సారీ చెప్పేవారు కొందరైతే, కాల్ చేసి చెప్పేవారు మరికొందరు.. సెల్‌ఫోన్‌లో టెక్ట్స్ మెసేజ్, వాయిస్ మెసేజ్, వీడియో మెసేజెస్‌తో సారీ చెప్పేవారు చాలామంది ఉన్నారు. కానీ ఓ గ్రీటింగ్ కార్డ్, గిఫ్ట్ పంపి సారీ చెప్పడం లేటెస్ట్ కల్చర్‌గా మారింది. మనవల్ల బాధపడ్డ వారి అభిరుచికి తగిన వస్తువును ఎంపిక చేసుకుని వారికి సున్నితంగా సారీ చెప్పడం కొత్త సంస్కారం అన్నమాట. చెప్పుకునేందుకు భలేగా ఉన్నా, దీనికి ఖర్చుమాత్రం తడిసి మోపెడవుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్‌లో ఇబ్బడిముబ్బడిగా ‘అపాలజీ గిఫ్టు’లు వచ్చిచేరుతున్నాయి. ఇంతకీ ఇందులో ఏముంటాయంటే.. ఖరీదైన పెన్ను మొదలు డైమండ్ పెండెంట్ వరకూ అపాలజీ గిఫ్టులుగా చలామణి అయ్యే వస్తువులుంటాయి. కాఫీ మగ్గులు, బ్రాస్లెట్లు, మ్యూజిక్ డీవీడీలు, గిఫ్టు కూపన్లు, వెకేషన్ వోచర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఆకర్షణీయమైన బహుమతులు ఉన్నాయి. ఇవి బడ్జెట్‌లో కూడా దొరికే వెసులుబాటు ఉంది.

మనసు ప్రశాంతం
చేసిన తప్పును నిర్భయంగా ఒప్పుకొని క్షమించమంటే మనసు చాలా తేలికై, ప్రశాంతంగా అనిపిస్తుంది. బీపీ తగ్గి, హ్యాపీగా, హుషారుగా, షరా మామూలుగా ఉండేలా చేసే అతీతశక్తి ఈ సారీకి ఉంది. కానీ సారీ చెప్పాల్సిన పనులకు దూరంగా ఉంటే మరీ మంచింది. ‘టు ఎర్ ఈ హ్యూమన్’ కనుక మానవులు తప్పులు చేయక మానరు, చేసిన తప్పులు ఎంచి, లెక్కించి, సారీ చెప్పక తప్పదు. చేసిన తప్పు అంగీకరించి, క్ష మాపణలు చెప్పలేకపోయారో జరగాల్సిన నష్టమంతా జరిగి, కొంప కొల్లేరవుతుంది.

Sorryచంద్రబాబు సారీ చెప్పాలి: ఉమ్మారెడ్డి

Updated By ManamThu, 08/09/2018 - 13:18

Sorry From CM Chandrababu

గుంటూరు: గడిచిన నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న వంచన, మోసం, దగాకు వ్యతిరేకంగా వైసీపీ ‘వంచనపై గర్జన దీక్ష’కు దిగింది. ఈ దీక్షకు గుంటూరు వేదికైంది. ఈ దీక్షా కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు తన అసమర్థతను ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైసీపీ ఎంపీలందరూ రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేసిన సంగతిని ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి గుర్తుచేశారు.

" చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేని అసమర్థుడు. రాష్ట్రానికి చంద్రబాబు, మోదీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి, నరేంద్ర మోదీ ప్రధాని అయినా ఏపీకి హోదా రాలేదు. చంద్రబాబు తన అసమర్థతను ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎంపీలందరూ రాజీనామా చేద్దామంటే టీడీపీ ఒప్పుకోలేదు. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌ రెడ్డి నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వైసీపీ ఎంపీలందరూ రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. హోదా కోసం ఇప్పుడు చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారు. చంద్రబాబు యూటర్న్‌పై పీడీ కేసు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు, విద్యార్థులు,డ్వాక్రామహిళలు సహా అన్ని వర్గాలను చంద్రబాబు వంచించారు" అని ఉమ్మారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Related News