manam maithri

తర‘గతి-గమ్యం’

Updated By ManamSat, 09/08/2018 - 05:31

ఈ భూమ్మీద మన ఉనికి ప్రతి క్షణం ‘నేర్చుకోవడానికి’ ఉద్దేశించిందే! జీవితానికి మించిన గురువు లేడు. ఆ గురువుకు కూడా అక్షరాభ్యాసం చేయించేది ‘తరగతి గది’. మనిషి సమాజంతో కలిసి చేసే ప్రయాణానికి తొలి అడుగు కూడా తరగతి గదితోనే మొదలవుతుంది. అలాగే పిల్లవాడు అడిగే ప్రతి ప్రశ్న విలువైందే, అయితే ఆ ప్రశ్నకు వెంటనే జవాబివ్వాలన్న తాపత్రయం ముఖ్యం కాదు, ఆ ప్రశ్న దానికదే ఎంతో విలువైందన్న స్పృహను కలిగి ఉండడమే ప్రధానం. ఆ ప్రశ్నను అర్థం చేసుకోవాలి. ఆ ప్రశ్నను మొగ్గలోనే చిదిమేయకుండా కాపాడుకోవాలి. నేర్చుకోవడమే వేడుకైన ‘బాల్యం’ ఒక నిరంతర అధ్యయనశీలి. ఆ అధ్యయనాన్ని కొనసాగనివ్వాలి. బొమ్మల్ని పగలగొట్టి, తిరిగి అతికిస్తూ జీవితపాఠాల్ని నేర్చుకునే బాల్యానికి తరగతి గది ఒక చుక్కాని. అలాంటి ‘తరగతి’ని గురించిన విశేషాలతో ఇవాల్టి ‘మైత్రి’ మిమ్మల్ని పలకరిస్తోంది. 
 

image


తెలంగాణ చదువులకు కొత్త ఊతం
ఎప్పటికీ కలుసుకోని పట్టాల మీద నడుస్తూ, ఎన్నెన్నో దూరాల్ని అలాగ్గా, చులాగ్గా కలిపేసే రైలు భారతీయుల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. రైలు అనే మాట వినగానే ప్రయాణం గుర్తుకు వస్తుంది. రైలంటే పెద్దలకే కాదు, పిల్లలకి కూడా చాలా ఇష్టం. రైలు ప్రయాణం పిల్లల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇదిగో, ఈ విషయాన్ని కనిపెట్టి మరీ ఒక చిత్రకారుడు ఆ బడిపిల్లలకి అపురూపమైన కానుకనిచ్చాడు. ఏకంగా బడినే రైలు బండిగా చిత్రించేశాడు. ఇప్పుడా ఊళ్ళో పిల్లలు బడికి వెళ్ళడం లేదు, ఉత్సాహంగా ‘బండెక్కుతున్నారు’. రంగులు వెలిసి, పగుళ్ళు వారిన గోడలతో నిస్సారంగా ఉసూరుమని పించే ఆ ‘బడి’ ఇప్పుడు ఆ పిల్లల పాలిట ‘చికుబుకు రైలైంది’! అందరికీ ఇప్పుడు ఆ బడి ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’ అయింది. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలంలోని పిల్లలకు రైలంటే ఏమిటో తెలియదు. వాళ్ళు తమ జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక రైలును చూశారు. అది కూడా తమ గ్రామంలో, తాము చదువుకుంటున్న బళ్ళోనే వాళ్ళు ఆ రైలును చూశా రు. టీచర్లు కూర్చునే స్టాఫ్ రూమ్‌ను ఇంజన్‌గాను, తరగతి గదుల్ని రైలుబోగీ లుగాను చిత్రించారు స్థానిక చిత్రకారుడు నరోజు చందు. తరగతిగదిలో చదువుకుంటున్న పిల్లలు గది ద్వారం దగ్గర నిలబడితే, అచ్చం రైలు బోగీ ద్వారం దగ్గర నిలబ డినట్టే ఉంటుంది. వాళ్ళు కిటికీల దగ్గర కూర్చుంటే అచ్చం రైలుబోగీలో కూర్చుని ప్రయాణిస్తున్నట్టే ఉంటుంది. బడి వరండా రైల్వేస్టేషన్‌లా ఉంటుంది.

సిరిసిల్ల రాజన్న జిల్లాలోని దాదాపు 15 పాఠశాలల రూపురేఖల్ని తన సృజనాత్మక శక్తితో పూర్తిగా మార్చేశారు నరోజు చంద్రు. తన నియోజక వర్గ మైన ఈ జిల్లాలోని వీరనపల్లిని సందర్శించిన కె.టి.రామారావు జిల్లా లోని పాఠశాలల పరిస్థితిని మెరుగు పరచాలని భావిం చారు. దాంతో అధికారులు వెంటనే పాఠశాలల సుందరీ కరణ పనుల్ని చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా వాళ్ళు చందును సంప్రదించారు. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడం, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల పట్ల విద్యార్థులు ఆకర్షితులవుతుండడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలంటే, పాఠశాలల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం తలెత్తింది. మంత్రి ఆదేశాలతో పాఠశాలల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేం దుకు ప్రయత్నాల్ని ప్రారంభించిన అధికారులకు చందు సృజనాత్మకత తోడైంది. ప్రాంతాన్ని బట్టి, ఇతర పరిస్థితుల్ని బట్టి ఏ పాఠశాలను ఏ విధంగా తీర్చిదిద్దితే, ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయన్నది ప్రధానాంశమైంది. ఈ కోణంలో ఆలోచించిన చందు ఒక్కోపాఠశాలను ఒక్కో విలక్షణ మైన రీతిలో తీర్చిదిద్దారు. ఉదాహరణకు ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపురం ప్రాథమిక పాఠశాలను ‘గోల్కండ’ కోటలాగా తీర్చిదిద్దారు. ఇంతవరకు బడికి వెళ్ళా లంటేనే ఉసూరుమనే పిల్లలు ఈ కొత్త ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’ లోకి వెళ్ళి, కిటికీల దగ్గర కూర్చుని, బయటనున్న వారికి చేతు లూపుతూ ‘టాటా’లు చెబుతున్నారంటే, చందు సృజనాత్మకతతో కూడిన ఈ విలక్షణమైన ప్రయోగం ఎంతటి సత్ఫలితాల్ని ఇచ్చిందో ఇట్టే తెలిసి పోతోంది. ‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి నేను ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను. ఒక్కో బడిని పెయింట్ చేయడానికి నాకు పదిహేను రోజులు పట్టింది’ అని చెప్పారు చందు. గంభీరరావు మండలం, రాజంపేట, ఎల్లారెడ్డిపేట మండలం, చికోడ్, ముస్తాబాద్ మండ లం, రామన్నపేట, హరిదాస్‌నగర్, పదిరా, నారాయ ణ్‌పూర్, వీరనపల్లిల్లోని పాఠశాలలకు చందు ఇలా తన కుంచె ప్రతిభతో కొత్త రూపాన్నిచ్చారు.  

‘రైలు బొమ్మని వేసిన తరువాత దాదాపు గ్రామంలోని పిల్లలందరూ ఈ బడికి హాజరు కావడం మొదలైంది. బడికి వస్తే, రైలెక్కినట్టుగా ఉందని చాలామంది పిల్లలు నాకు చెప్పారు. రైలును ఇంతవరకు చూడని గ్రామీణులైన ఈ పిల్లలకు రైల్వేస్టేషన్‌ను చూడడం ఒక కొత్త అనుభూతని స్తోంది’ అంటూ చందు వివరించారు. ‘మేము ఒక్కో బడికి రెండు, మూడు లక్షల రూపాయలకంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. మేము ఆరుగురం ఒక బృందంగా పని చేశాం. బళ్ళని ఇలా తీర్చిదిద్దడం వల్ల పిల్లలకు కూడా కొత్త విషయాల్ని నేర్చుకునే ఆస్కారం ఏర్పడింది’ అని ఆయన అన్నారు. వెంకటాపురం పాఠశాలను గోల్కొండకోటలాగా తీర్చిదిద్దడంతో గ్రామస్తులు కూడా బడిని చూడడానికి వస్తున్నారు. పిల్లల హాజరు కూడా గణనీయంగా పెరిగిందని పాఠశాల హెడ్‌మాస్టర్ పి.దేవయ్య చెప్పారు. వీరనపల్లిలోని ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’లో పిల్లలు ఇప్పుడు ‘ఛుక్‌ఛుక్ రైలు వస్తోంది..., దూరం దూరం జరగండి’ అని పాడుకుంటూ, బడికి మరింత దగ్గరవుతున్నారు. గ్రామాల్లోని పిల్లలకి చదువు పట్ల ఆసక్తిని కల్పించడానికి చేసిన ఈ ప్రయత్నం సత్ఫలితాన్నిచ్చింది. తెలంగాణలోని మిగతా ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఇది స్ఫూర్తిదాయకంగా మారుతోంది.మేమున్నాం

Updated By ManamSat, 08/25/2018 - 00:46

imageకులాలుగా, మతాలుగా, జాతులుగా, ప్రాంతాలుగా, దేశాలుగా మనం విడివిడిగా విడిపోయిన శకలాలం. కానీ సాటి మనిషికి కష్టమొచ్చిందంటే మాత్రం మనమందరం ఒకే దేహమవుతాం, ఒకే అశ్రునదీప్రవాహమవుతాం, ఒకే గుండెచప్పుడై ప్రతిస్పందిస్తాం. కేరళ కష్టాన్ని ప్రపంచం తన కష్టంగా పలవరిస్తోంది. ఒక రాష్ట్రప్రజల కష్టాన్ని యావద్భారతదేశం తన భుజాలకెత్తుకుని ఓదారుస్తోంది. వరద బీభత్సంతో గాయపడిన కేరళ ప్రజల పట్ల సోషల్ మీడియా సహానుభూతితో స్పందిస్తున్న వైనం బహుదా ప్రశంనీయం. 

కేరళలో అనూహ్యంగా ముంచుకొచ్చిన వరదముప్పు 210 మంది ప్రాణాల్ని బలిగొనడంతో పాటు, దాదాపు పది లక్షల మందిని నిరాశ్ర యుల్ని చేసేసింది. భారత జాతీయ విపత్తు నివారణ బలగాలు పెద్దయెత్తున రక్షణ చర్యల్ని చేపట్టి, దాదాపు పది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేశాయి. భారతీయ సైన్యం, నావికా దళాలు కూడా ఈ విపత్కర పరిస్థితిలో యుద్ధప్రాతిపదికన రక్షణ, సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. అయితే ఇలాంటి విపత్తుల్లో ఇతరుల్ని రక్షించడం భారతీయ సైనికులకు, నావికాదళాలకు కొత్తేమీ కాదు. కానీ వాళ్ళని కూడా ఆశ్చర్యంలో ముంచేసిన ఒక కొత్త అనుభవం మన భారతీయ సైనికులకు, నావికాదళాలకు కేరళ వరదల్లో ఎదురైంది. సైన్యం ఊహించని విధంగా సామాజిక మాధ్యమాల్ని ఆసరా చేసుకుని సాధారణ ప్రజలు వారికి సహాయాన్ని అందించారు. వేలాది మంది భారతీయ పౌరులు తమ స్మార్ట్‌ఫోన్ల సహాయంతో సోషల్ వెబ్‌సైట్స్ ద్వారా కేరళ వరద బాధితుల రక్షణ కోసం సహాయ చర్యల్ని ఉధృతం చేశారు. 

ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా ఆపన్న హస్తాన్ని అందించిన వారిలో పేరెన్నికగన్న స్వచ్ఛంద సంస్థలు కూడా imageఉన్నాయి. భారతదేశంలో యాభై సంవత్సరాలుగా సామాజిక సేవల్ని అందిస్తున్న ‘వరల్డ్ విజన్’ సంస్థ తన వెబ్‌సైట్ ద్వారా కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాల్ని ఆహ్వానించింది. ‘‘చాలామంది బాధితులు కట్టుబట్టలతో తమ ఇల్లూవాకి లిని వదిలి వచ్చేశారు. కొంత మంది పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అలాంటి వారిని గుర్తించి, వారికి అత్యవసరమైన ఆహారం, బట్టలు, దుప్పట్లు, దోమల నివారణ మందులు, టూత్‌బ్రష్‌లు, పేస్టు, సబ్బులు వంటి వస్తువులతో మేం వారి కోసం ప్రత్యేక కిట్లు రూపొంది స్తున్నాం. విరాళాల్ని ఈ కిట్ల తయారీ కోసం ఉపయోగిస్తాం’ అని వరల్డ్ విజన్ సంస్థ జాతీయ అధ్యక్షుడు చెరి యన్ థామస్ చెప్పారు. ఈ సంస్థతో పాటు మరో నాలుగు స్వచ్ఛంద సంస్థలు కూడా అమెజాన్ డాట్‌ఇన్ ద్వారా విరాళాల్ని ఆహ్వానిస్తున్నాయి. కేరళలో వరదలు బీభత్సం సృష్టిం చిన తొలిరోజు నుంచి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు కార్యక్షేత్రంలో దిగి, సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకు వరల్డ్ విజన్ పదివేల సహాయ కిట్లు తయారు చేసి, బాధితులకు అందించింది. 

కొందరు సాధారణ పౌరులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ స్వంత ఆదాయం నుంచి చేతనైనంత మొత్తాన్ని వరద బాధి తుల సహాయం కోసం వెచ్చిస్తున్నారు. వరదలు పొంచి ఉన్నాయన్న సమాచారం అందగానే కేరళ ప్రభుత్వం అప్రమ త్తమైంది. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ నిపుణులు కేరళ ప్రభుత్వ ఐటి శాఖతో కలిసి పని చేయడం ప్రారంభిం చారు. వారు ‘కేరళ రెస్క్యూ డాట్ ఇన్’ వెబ్‌సైట్‌ని రూపొందించారు. రాష్ట్రంలో వరద తాకిడికి గురైన అనేక జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పని చేయడం కోసం స్వచ్ఛంద కార్యకర్తలు ఈ వెబ్‌సైట్ ద్వారా సంబంధిత అధికారుల్ని సంప్రదించే వీలు కలిగింది. 

imageజాన్ బిన్నీ కరువిల్లా అనే ట్రావెల్ బ్లాగర్ కొచ్చిన్‌లోని ఎర్నాకులంలో రోజుకు 14 గంటలపాటు నిర్విరామంగా పనిచేసే జిల్లా అత్యవసర విభాగంతో సమన్వయం కుదుర్చుకున్నాడు. మొదటగా కరువిల్లా ‘వాట్సాప్’ను ఉపయోగించుకుని సహా య చర్యల్ని ముమ్మరం చేయాలని నిర్ణయించు కున్నాడు. వందలాది మంది సభ్యులతో కూడిన ఐదు వాట్సాప్ గ్రూపుల్లో కరువిల్లా చేరాడు. ఈ గ్రూపులన్నీ కేరళ వరదబాధితుల సహాయ, రక్షణ చర్యల్ని ప్రతి క్షణం పర్యవేక్షిస్తున్నాయి. ఈ గ్రూపుల సభ్యులకు ఆయన తన ఫోన్‌నెంబరును ఇచ్చాడు. పోలీసులు, సైన్యం, నావికాదళాలతో తాను సమ న్వయచర్యల్ని పర్యవేక్షిం చగలనని, ఏదైనా అత్యవసర సమాచారం ఉంటే తనను సంప్రదించాలని కరువిల్లా వాట్సాప్ గ్రూపు సభ్యుల్ని కోరాడు. దాంతో వరదనీటిలో చిక్కుకు పోయిన వాళ్ళు, అత్యవసర వైద్య సహాయం అవసరమైన వాళ్ళు కరువిల్లాకు ఫోన్లు చేయ డం మొదలైంది. రోజుకు మూడు వందల మంది సహాయాన్ని కోరుతూ ఫోన్లు చేసే వారు.  కేరళలోని బార్టన్ హిల్స్‌కు చెందిన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశా లకు చెందిన విద్యార్థులు ‘ఇన్‌స్పైర్’పేరిట ఒక కేంద్రాన్ని నెలకొల్పారు. కరువిల్లా ఈ కేంద్రంతో కూడా కలిసి పనిచేస్తున్నారు. ఈ విద్యార్థులు 1.5 వోల్ట్ బ్యాటరీలు, కేబుళ్ళ సహాయంతో సెల్‌ఫోన్లని ఛార్జింగ్ చేసే 300 పవర్‌బ్యాంక్స్‌ని నెలకొల్పారు. ‘విద్యుత్ సౌకర్యం లేని చోట ఈ పవర్‌బ్యాంక్స్ నిమిషాల వ్యవధిలో 20 శాతం ఫోన్ ఛార్జింగ్‌ను చేయగలవు. వరదనీటిలో చిక్కుకున్న వారికి బబుల్ రేపర్ కాగితంలో ఈ పవర్ బ్యాంక్స్‌ని హెలికాప్టర్ల ద్వారా పంపిణీ చేస్తారు. దీంతో అత్యవసర సహాయం అవసరమైన బాధితులు సంబం ధిత అధికారులకు ఫోన్ చేసి, సహాయాన్ని పొందే వీలు కలుగుతుంది’ అని కరువిల్లా వివరించారు.
 
మరికొందరు సోషల్ మీడియా ద్వారా వరదల అనం తర పరిణామాల గురించి ప్రజల్లో అవగాహనను పెంచే ప్రయత్నం imageచేశారు. ఆనంద్ అప్పుకుట్టన్ అనే 38 ఏళ్ళ కమ్యూనికేషన్ డిజైనర్ కేరళలోని కొట్టాయంలో జన్మించాడు. ఆయన ఇప్పుడు చెన్నైలో నివసిస్తూ ఇన్‌ఫోగ్రాఫిక్స్, యాప్స్ వంటివి డిజైన్ చేస్తున్నారు. విపత్తు నివారణకు సంబంధించిన నిపుణులు కొందరు ఆనంద్‌ను సంప్రదించి, కేరళ వరద బాధితుల కోసం కొన్ని కరపత్రాల్ని డిజైన్ చేయాలని కోరారు. ‘సహాయం చేయాలంటూ అభ్యర్థించిన వ్యక్తుల్ని నేను వ్యక్తిగతంగా కలవలేదు. కానీ ఆర్థిక సహాయం కాకుండా, నా ప్రతిభతో ఈ విపత్కర సందర్భంలో బాధితులకు ఏదైనా సహాయం చేసి తీరాలన్న నా ఆకాంక్షను వాళ్ళు నెరవేర్చారు’ అని ఆనంద్ చెప్పారు. వెంటనే ‘కేరళ డిజైనర్స్ కొల్లాబరేటివ్స్’ పేరిట ఒక కేంద్రాన్ని నెలకొల్పి, వరదల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై కరపత్రాల్ని రూపొందించారు ఆనంద్. ‘ఒకవేళ మీ కారు వరదనీటిలో చిక్కుకుపోతే, కారులో పాములు, బల్లులు, ఇతర జీవులు ఏవైనా చిక్కుకు పోయాయేమో గమనించాలి. అలా చిక్కుకుని, కారులోనే మరణించిన జంతువుల కళేబరాల్ని మంచినీట బావులకు 24 అడుగుల దూరంలో, నాలుగు అడుగుల లోతు గొయ్యి తీసి పాతిపెట్టాలి. ఇలా చేయడం వల్ల అంటురోగాలు ప్రబలకుండా జాగ్రత్త పడవచ్చు. అలా పాతిపెట్టిన తరువాత దాన్ని సున్నపుపొడితో కప్పాలి...’ వంటి జాగ్రత్తల్ని వివరించే కరపత్రాల్ని ఆనంద రూపొందించాడు.  

మనం మనుషులమైనందుకు నిజంగా గర్వించే సందర్భాలు ఇంత విషాదకరమైనవే కావడం మాత్రం ఒకింత బాధాకరమైన విషయమే! అయినప్పటికీ..., మనం ఇంకా మానుషత్వపు ఆత్మీయతనే శ్వాసిస్తున్నం దుకు గర్విస్తూ, సామాజిక మాధ్యమాల ద్వారా కేరళను ఆదుకొన్న వారికి తలవంచి అభివాదం చేద్దాం. 

మానవీయ స్పర్శ
imageఅతనొక పంజాబీ జర్నలిస్టు, మరొకతను వరదల నుంచి ప్రాణాలతో బయట పడిన వ్యక్తి. ప్రాణాలతో బయట పడిన ఆ అజ్ఞాత వ్యక్తి పేరేమిటో తెలియదు. ఈ జర్నలిస్టు పేరు కూడా మనకు తెలియదు. వాళ్ళిద్దరికీ కూడా ఎదుటి వ్యక్తి పేరేమిటో తెలియదు. పేరు తెలియని బాధితుణ్ణి ఇదిగో ఇలా అక్కున చేర్చుకుని, ఓదార్చి, మరో సురక్షితమైన ప్రాంతానికి చేర్చాడు ఆ జర్నలిస్టు. మానవ త్వాన్ని పరిమళిస్తున్న ఈ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ‘ఇదే నేను గర్వించే నా భారతదేశం. అద్భు తమైన నా దేశం ఇదే...’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇంతకీ ఈ ఆనంద్ మహీంద్రా ఎవరో తెలుసా? భారత దేశంలో కార్లతయారీ రంగ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ కంపెనీకి ఛైర్మన్. ఆయన పోస్ట్ చేసిన మానవీయ స్పర్శను చాటుతున్న ఈ ఛాయాచిత్రం సోషల్ మీడియాలో అందరి హృదయాల్ని ఆకట్టుకుంది. 

‘ఆశ్రయానికి’ సేవ
కేరళను ఆగస్టు 8వ తారీఖు నుంచి ముంచెత్తుతున్న వర్షాలు లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయుల్ని చేశాయి. సర్వస్వాన్ని నీటి పాలు చేసుకుని, ప్రాణాలు అరచేత పట్టుకుని, దొరికిన చోట తలదాచుకున్నారు ప్రజలు. ఆపదలో చిక్కిన సాటి మనుషుల కోసం కొందరు తమ ఇంటి తలుపుల్ని తెరిచారు. మరికొందరు తమకు చేతనైన సాయం చేశారు. బాధితులు పెద్ద సంఖ్యలో పాఠశాలల వంటి ప్రదేశాల్లో రోజుల తరబడి తలదాచుకున్నారు. వానలు కాస్త తెరిపిన పడిన తరువాత కూలిన తమ ఇళ్ళను వెదుక్కుంటూ వారంతా పునరావాస కేందాల్ని వదిలి తమతమ నివాస ప్రదేశాలకు ప్రయాణమయ్యారు. ఏళ్ళకు ఏళ్ళు శ్రమించి ఇటుక, ఇటుక కూర్చి కట్టుకున్న ఇళ్ళు నేలమట్టమయ్యాయి. బాధితులకు తమ జీవితాల్ని పునఃప్రారంభించడానికి చాలాకాలమే పట్టవచ్చు. కానీ కూనన్‌మావు జిల్లాలోని కొంగొర్‌పిల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం పొందిన బాధితులు తమ కృతజ్ఞతను విలక్షణంగా చాటుకున్నారు. ఇళ్ళకు వెనుదిరిగి వెళ్ళేముందు వారంతా తమకు ఆశ్రయమిచ్చిన ఆ పాఠశాలను అద్దంలా శుభ్రపరిచి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ పాఠశాలలోని నాలుగో అంతస్తులో దాదాపు 1200 మంది నాలుగు రోజుల పాటు ఆశ్రయం పొందారు. వాళ్ళు శుభ్రం చేసిన పాఠశాల ఫోటోతో సహా ఈ విలక్షణమైన కృతజ్ఞతను సోషల్ మీడియా ప్రపంచానికి తెలియజెప్పింది. ‘ఈ ప్రదేశం నాకు నాలుగు రోజుల పాటు ఆశ్రమియచ్చింది. అలాంటి చోటును అపరిశుభ్రంగా ఎలా వదిలి వెళ్ళగలం, అందుకే శుభ్రం చేశాం’ అంటూ అక్కడ ఆశ్రయం పొందిన ఒక వ్యక్తి చెప్పిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆపదలో కూడా ‘కృతజ్ఞత’ మాట మరువని ఈ మలయాళీల్ని మెచ్చుకోకుండా ఉండడం ఎవరికి సాధ్యం?!మనసుకు ముంజేతి అద్దం..కరచాలనం

Updated By ManamSat, 08/18/2018 - 01:51

imageమనిషి ఎన్ని భాషలు మాట్లాడినా, ఆ భాషలన్నింటికీ మూలం అతని శరీరం పలికించే హావభావాలే! మనిషి మాటను కనిపెట్టడానికి పూర్వమే అతని దేహం సంభాషణను మొదలుపెట్టేసింది. అందుకే మనిషి తాను కనిపెట్టిన భాషతో ఎన్ని మారువేషాలు వేసినా, శరీరం మాత్రం అతని మనసులోని నిజాన్ని పిసరంత కల్తీ లేకుండా బయట పెట్టేస్తుంది. ఆధునిక ప్రపంచం మానవదేహభాషకు ఉన్న ఈ సామర్థ్యాన్ని చక్కగా అర్థం చేసుకుంది. బాడీలాంగ్వేజ్ అన్నది ఇవాళ వ్యక్తిత్వ వికాసంలో ఒక ప్రధాన భాగమైంది. పాశ్చాత్యదేశాల్లో ఉద్యోగాల్లోకి తీసుకునే ముందుగానే ఈ బాడీలాంగ్వేజ్‌ను పరిశీలించి మరీ తమకు కావలసిన అభ్యర్థిని ఎంచుకుంటున్నారు. వ్యక్తులు చెప్పే మాటలు అన్నివేళలా వారి మనోభావాలకు ప్రతీకలు కావన్నది నిజం. ఎదుటివారి మనోభావా ల్ని ఉన్నదున్నట్టుగా చదవగలిగితే, వారి అవసరాలకు అనుగుణంగా ప్రతిస్పందించగలిగితే వారి నుంచి మనం ఆశించిన ప్రయోజనాన్ని పొందడం నల్లేరు మీద నడకే అవుతుంది. సమాజంలో కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం, వారితో సానుకూల సంబంధాల్ని ఏర్పరచుకోవడం అన్నది జీవితాన్ని విజయం వైపుగా నడిపి స్తుందన్నది మనకు తెలిసిన విషయమే. ఎవరైనా కొత్తవ్యక్తిని కలిసినప్పుడు వారిని అభినందిస్తూ, చేయిచాచి ‘కరచాలనం’ చేయ డం ఆధునిక సమాజంలో ఒక ఆనవాయితీ. కానీ కరచాలనం అనేది వ్యక్తుల తొలి కలయికలోనే ఎదుటి వారి మనస్తత్వాన్ని మనకు తెలిసేలా చేస్తుందంటే ఒకింత ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు దేహభాష వ్యాకరణం ప్రకారం ‘కరచాలనం’లో ఇమిడి ఉండే కొన్ని రహస్యాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. 

చేయి, చేయి కలిపి పరస్పరం అభినందనలు తెలుపుకునే సంప్రదాయానికి మూలాలు ప్రాచీన చరిత్రలోనే ఉన్నాయి. ప్రాచీన తెగల వారు స్నేహపూర్వక వాతావరణంలో కలుసుకున్నపుడు తమ చేతుల్ని ముందుకు చాచి, అరచేతులు కనిపించేలా ప్రదర్శించే వాళ్ళు. తద్వారా తమ వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని, తాము ఆయుధాల్ని దాచి పెట్టలేదని పరస్పరం భరోసా ఇచ్చుకునే వాళ్ళన్నమాట. ప్రాచీన రోమన్లు మణికట్టు కింద ఒక చిన్నపాటి కత్తిని దాచి ఉంచుకుని సంచరించే వారు. అందుకే స్వీయరక్షణ కోసం రోమన్లు ఎదుటి వ్యక్తి చేతి మణికట్టును పట్టుకుని ఎలాంటి మారణాయుధం లేదని నిర్ధారించుకునే వారు. ఈ సంప్రదాయమే నేటి ‘కరచాలనానికి’ మాతృక. అయితే పందొమ్మిదో శతాబ్ద కాలానికి కరచాలనానికి అర్థం మారిపోయింది. సమాన స్థాయికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర ఒప్పందానికి కరచాలనాన్ని ఒక ప్రతీక భావించడం ప్రారంభమైంది. 

ఎవరు ముందు?
కరచాలనం చేసే ముందు అవతలి వ్యక్తి దానిని స్వీకరించేం దుకు సుముఖంగా ఉన్నాడా, లేడా అన్న విషయాన్ని నిర్థారించుకోవాలి. అవతలి వ్యక్తి కరచాలనానికి చేతిని చాపే వరకు వేచి చూడాలి. ఒకవేళ అతని నుంచి ఎలాంటి ప్రతిస్పం దన లభించక పోతే చిన్నగా తల ఊపడం ద్వారా మాత్రమే అభివందనం చేయాలి. తొలిసారిగా మీరు ఎవరినైనా కలిశారనుకుందాం. మీరిద్దరూ పరస్పరం కరచాలనం ద్వారా అభినందించుకున్నారు. ఆ కరచాలనం మూడు ప్రాథమిక దృక్పథాల్ని ప్రతిబింబిస్తుంది. ‘ఇతను నాపై ఆధిక్యతను ప్రదర్శిస్తు న్నాడు. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి’, ‘ఈ వ్యక్తిపై నేను ఆధిక్యతను ప్రదర్శించవచ్చు. నా కోరిక ను ఇతను నెరవేరుస్తాడు’, ‘ఈ వ్యక్తితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’... మనకు తెలియకుండానే ఈ ఆలోచనలు ఒకరి నుంచి మరొకరికి పరస్పరం వినిమయం అవుతాయి. ఇద్దరి కలయిక తాలూకు తుది ఫలితాలపై ఈ ఆలోచనలు తక్షణ ఫలితాన్ని చూపుతాయి. మన అరచేతిని కిందికి చూపుతూ కరచాలనం చేయడం ద్వారా ఎదుటి వ్యక్తి మీద మన నియంత్రణను ప్రదర్శించవచ్చు. పురుషులతో కరచాలనం చేయవలసి వచ్చినపుడు స్త్రీలు సుతిమెత్తగా కరచాలనం చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి మీ స్త్రీత్వపు చిహ్నాల్ని అతిగా ప్రదర్శించినట్టవుతుంది. వాణిజ్య, ఉద్యోగరంగాల్లో స్త్రీలు బలంగా కరచాలనం చేయడమే మంచిది. ఇలా బలంగా కరచాలనం చేసే స్త్రీలు తమ శక్తిమంతమైన వ్యక్తిత్వాన్ని కరచాలనం ద్వారా ప్రదర్శిస్తారు. 

బలహీనమైన కరచాలనం
అరచేతిని పైకి చూపుతూ కరచాలనం చేయడమన్నది మన వ్యక్తిత్వంలోని బలహీనతను సూచిస్తుంది. ఇలాimage అరచేతిని పైకి చూపుతూ చేతిని అందించడం వల్ల ఎదుటి వ్యక్తిది ‘పైచేయి’ అవడా నికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఎదుటి వ్యక్తి అధికారాన్ని మీరు అంగీకరించినప్పుడు ఇలాంటి బలహీనమైన కరచాలనం మేలు చేస్తుంది. అయితే చిత్రకారులు, సర్జన్లు, సంగీతకారులు కూడా ఇలాగే బలహీనమైన కరచాలనాన్నే ఇస్తారు. అంతమాత్రం చేత వాళ్ళను బలహీనులుగా అంచనా వేయకూడదు. వాళ్ళు తమ చేతుల్ని కాపాడుకునేందుకే అరచేతిని పైకి చూపుతూ కరచాలనం చేస్తారు. ఇలాంటి వ్యక్తుల విషయంలో వారి కరచాలనంతోపాటు, వారి ముఖ కవళికల్ని కూడా చదవాలి. అప్పుడు అవతలి వ్యక్తి మనస్తత్వాన్ని కొంతమేరకైనా అర్థం చేసుకోవడానికి వీలవు తుంది. 

సమానత్వం
తామే అధికులమని భావించే ఇద్దరు వ్యక్తులు పరస్పరం కరచాలనం చేసుకుంటే, అక్కడ అధికారం కోసం సంఘర్షణ తలెత్తుంది. ఇద్దరూ ఎవరికి వారే అవతలి వ్యక్తి అరచేతిని లొంగుబాటును సూచించేలా పైకి తిప్పడానికి ప్రయత్నిస్తారు. తత్ఫలితంగా ఇద్దరి చేతులూ సమాంతరంగా కలుస్తాయి. అది వారి మధ్య సమానత్వానికి, పరస్పర గౌరవానికి చిహ్నంగా మారుతుంది. 

సామరస్యాన్ని సాధించడమెలా?
కరచాలనం ద్వారా సామరస్యాన్ని సాధించాల నుకుంటే ప్రధానంగా రెండు విషయాలపై దృష్టిని నిలపాలి. తొలుత మీ అరచేయి, ఎదుటి వ్యక్తి అరచేతికి సమాంతరంగా ఉండేలా చూసుకోండి. మీ ఇద్దరిలో ఏ ఒక్కరూ అధికులుగా కానీ, అథములుగా కానీ కాకుండా పరస్పరం సమానులుగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. ఎదుటి వ్యక్తి మీ చేతిని ఎంత బలాన్ని ఉపయోగించి నొక్కుతున్నాడో గమనించి, అంతే బలాన్ని ఉపయోగిస్తూ ప్రతిస్పందించండి. 

డబుల్ హ్యాండర్
imageప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన సంకేతమిది. నేరుగా కళ్ళలోకి చూస్తూ, ఆత్మీయంగా నవ్వుతూ ఎదుటి వారి పేరును ఉచ్ఛరిస్తూ, వారి ఆరోగ్యాన్ని గురించి వాకబు చేస్తూ మీ రెండు చేతులను ఉపయోగించి కరచాలనం చేయడమన్నది మంచి ఫలితాన్నిస్తుంది. కరచాలనానికి తొలుత ఉద్యుక్తుడైన వ్యక్తి ఈ డబుల్ హ్యాండర్ ద్వారా మరింత ఎక్కువగా ఎదుటి వారితో భౌతిక సంబంధాన్ని పెంచుకుంటారు. దీనివల్ల అతను కరచాలనాన్ని స్వీకరించే వ్యక్తి మీద నియంత్రణను సాధిస్తూ అతని కుడిచేతిని అదుపులోకి తీసుకుంటాడు. డబుల్ హ్యాండర్‌ను ఉపయోగించే వ్యక్తి తాను మరింత నమ్మదగిన నిజాయి తీపరుడినన్న భావనను కలిగిస్తాడు. అయితే అప్పుడే తొలిసారిగా కలుసుకున్న వ్యక్తుల మీద డబుల్ హ్యాండర్‌ను ప్రయోగిస్తే, వాళ్ళు మీ ఉద్దేశాలను శంకించే ప్రమా దముంది. డబుల్‌హ్యాండర్ అనే కరచాలనం కౌగిలికి సంక్షిప్తరూపం. పటిష్టమైన ఆత్మీయానురాగాలున్న సందర్భంలోనే డబుల్‌హ్యాండర్‌ను వాడడం మంచిది. 

కరచాలనమన్నది ఒక పలకరింపు కోసం, ఒక నిష్క్రమణ కోసం, ఒక ఒప్పందం కుదిరినందుకు సంకేతంగా వాడడం కోసం ఉద్దేశితమైంది. కాబట్టి అదెప్పుడూ స్నేహపూర్వకంగా, సానుకూలం గా, ఆత్మీయంగా ఉండేలా చూసుకోండి.

Related News