symbol of sacrifices Bakried

త్యాగాల పర్వం బక్రీద్

Updated By ManamTue, 08/21/2018 - 00:02

imageదైవభక్తికి మహోన్నత నిదర్శనం బక్రీద్. త్యాగాలను స్మరించుకునే పర్వం. దైవప్రవక్త అయిన హజ్రత్ ఇబ్రహీం దైవాజ్ఞ మేరకు తన ఒక్కగానొక్క చిన్నారి తనయుని అల్లాహ్‌కు సమర్పించేందుకు సిద్ధం అయిన రోజు. ఇబ్రహీం త్యాగాన్ని ఆదర్శంగా తీసుకుని ముస్లిం సోదరులంతా బక్రీద్ పండుగ జరుపుకుంటారు. పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాలో లక్షలాది మంది హజ్ యాత్రికులు కొలువై దేవా నీ సన్నిధికి చేరామంటూ నినదించే పవిత్రరోజు ఇది.

ముస్లిం సోదరులు జిల్ హజ్ మాసం పదోరోజున బక్రీద్ పండుగ జరుపుకుంటారు. చరిత్రలో ఈరోజుకు లక్షలాదిమందిimage హజ్ యాత్రికులతో కళకళలాడుతుంది. లబ్బైక్ (దేవా నీ సన్నిధిలో హాజరయ్యాను) అనే నినాదాలు సర్వత్ర మిన్నంటుతూ ఉంటాయి. అల్లాహ్ ఆదేశాలను, ముహమ్మద్ ప్రవక్త సంప్రదాయాలను పాటించడంలో భక్తులు నిమగ్నమై ఉంటారు. నేల ఈనినట్లు కనిపించే ఆ జనవాహినిలో దైవగృహ ప్రదక్షిణ (తవాఫ్) చేసేవారు కొందరైతే, సఫా, మర్వా అనే కొండల మధ్య పరుగులు (సయీ) తీసేవారు మరికొందరు ఉంటారు. 

హజ్, ఖుర్బానీలకు మూలం
అదొక అపురూప సుందర దృశ్యం. ఎంతో రమణీయమైన అద్భుత సన్నివేశం. ప్రభుస్తోత్రంతో తన్మయత్వం చెందే ఆధ్యాత్మిక కేంద్రబింబం. ఆ అనుపమాన, అపూర్వ హజ్ దృశ్యాన్ని గురించి ఊహిస్తేనే హృదయం పులకించి పోతుంది. ఒకప్పుడు ఆ ప్రాంతం ఎలాంటి జనసందోహం లేని నిర్జీవ ఎడారి ప్రాంతం. కాని ఈనాడు విశ్వప్రభువు అనుగ్రహంతో నిత్యనూతనంగా కళకళలాడుతూ, ప్రపంచ ముస్లింలందరికీ ప్రధాన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. పుణ్యక్షేత్రమైన మక్కాలో జరిగే హజ్ ఆరాధనకు, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ఈదు అల్ అజ్ అధా పండుగకు అవినాభావ సంబంధం ఉంది. ఈ పండుగకు హజ్, ఖుర్బానీలకు  మూలకారణం హజ్రత్ ఇబ్రహీం అలైహిసల్సామ్.

కలను నిజం చేసిన త్యాగశీలి
ఇబ్రహీం (అస) గొప్ప దైవప్రవక్త. ఇబ్రహీంకు ఖలీలుల్లాహ్ అంటే అల్లాహ్ మిత్రుడు అన్న బిరుదు కూడా ఉంది. ఇబ్రహీం తన జీవితం ద్వారా దైవప్రసన్నతకు మించిన కార్యం మరొకటి లేదని నిరూపించారు. కలలో కనిపించింది కూడా కరుణామయుని ఆజ్ఞే అని తలపోసేవారు. వెంటనే దానిని ఆచరించేవారు ఒకనాడు ఆయన ఓ కలగన్నారు. నిజానికి ఆ కల ఓ పరీక్ష. మానవజాతి చరిత్ర కనీవినీ ఎరుగని పరీక్ష అది. దైవాదేశపాలనలో ఎలాంటి ప్రేమానురాగాలకు తావులేదని చాటిచెప్పిన అసాధారణ పరీక్ష అది. ఒకరోజు హజ్రత్ ఇబ్రహీం కన్నకొడుకుకు బలిదానం చేస్తున్నట్లు కలగన్నారు. దీన్ని దైవాజ్ఞగా తలచిన ఆయన ఈ విషయమై కొడుకును సంప్రదించారు. వృద్ధదశలో లేకలేక కలిగిన ఏకైక సంతానాన్ని దైవాదేశం మేరకు చేతులారా బలిచేయవలసి రావడం తండ్రికి పరీక్ష అయితే దైవప్రీతి కోసం ఎంతో భవిష్యత్తు కలిగిన నిండు జీవితాన్ని త్యాగం చేయాల్సి రావడం తనయునికీ పరీక్షే. అయినా ఆ తండ్రికి తగ్గ తనయుడు దైవకారుణ్య కొలనులో విరబూసిన చిరుమొగ్గ. ఏమాత్రం వెనుకాముందు ఆలోచించకుండా నాన్నగారూ! దైవాదేశాన్ని వెంటనే నెరవేర్చండి. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. దైవచిత్తమైతే మీరు నన్ను సహనవంతునిగా చూస్తారు అన్నాడు. దీంతో ఇబ్రహీం తన ప్రాణం కంటే కూడా మిన్న అయిన కన్నకొడుకు గొంతు కొయ్యడానికి కుత్తుకపై కత్తిపెట్టి ఉద్యుక్తులయ్యారు. చిరుమొగ్గ ఇస్మాయిల్ కూడా దైవమార్గంలో తన చిన్నిప్రాణాన్ని ధారపోయడానికి సిద్ధమై, కోయడానికి వీలుగా నేలపై పడుకున్నాడు.

ఈవిధంగా తండ్రీకొడుకులిద్దరూ దైవాజ్ఞ ముందు తలవంచిన అపూర్వ ఘట్టానికి సృష్టి యావత్తు అచ్చెరువొందింది. వాయువు స్తంభించింది. సృష్టిలోని అణువణువు అవాక్కయింది. అంతటా నిశ్శబ్దం అవరించింది. అప్పుడు దిక్కులు పిక్కటిల్లేలా దైవవాణి ప్రతిధ్వనించింది. నా ప్రియప్రవక్తా ఇబ్రహీం! నువ్వు నీ స్వప్న ఉదంతాన్ని నిజం చేసి చూపించావు. నా ఆజ్ఞాపాలనలో మీరు మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను మీతో ప్రసన్నుడనయ్యాను. నా ఈ పరీక్షలో మీరు అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అల్లాహ్ స్వర్గం నుంచి ఒక పొట్టేలును దైవదూత ద్వారా పంపించారు. ప్రవక్త ఇబ్రహీం ఆ పొట్టేలును బలిచేశారు. ఈ త్యాగాన్ని స్మరించుకోవడానికే ముస్లింలు ప్రతియేటా పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను ఈదుల్ అజ్హా అని, బక్రీద్ అని, ఈదె ఖుర్బాన్ అని త్యాగోత్సవం అని వ్యవహరిస్తారు. 
- ముహమ్మద్ లియాఖత్ ఉద్దీన్

Related News