Conditions Apply

మీ స్కోరెంత?

Updated By ManamSun, 09/02/2018 - 03:42
  • ఆస్తిపాస్తులతో పాటు ఇది కూడా.. చెప్పి తీరాలంటున్న అమ్మాయిలు

  • సిబిల్ స్కోరు ఆధారంగా అంచనా.. 800 పైన ఉంటేనే పెళ్లి ఖాయం

  • ఆర్థిక క్రమశిక్షణకు అదే కొలబద్ద.. సకాలంలో రుణాల తిరిగి చెల్లింపు

  • క్రెడిట్‌కార్డు బిల్లుల చెల్లింపే ముఖ్యం.. దాంతోనే గణనీయంగా సిబిల్ స్కోరు

imageరాజేశ్‌కు మూడేళ్ల క్రితం పెళ్లయింది. అది మాట్రిమోనీలో చూసి చేసుకున్న పెళ్లి. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. కొంతకాలం పాటు అంతా సజావుగానే సాగిపోయింది. ఏడాది తర్వాత ఉన్నట్టుండి ఇద్దరూ విడాకులు తీసేసుకున్నారు. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత రాజేశ్ వాళ్ల అమ్మ మళ్లీ సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈసారి అనుకోకుండా మంచి సంబంధం కుదిరింది. రమ్య కొన్నాళ్లు అమెరికాలో ఉద్యోగం చేసి, తిరిగి వచ్చేసింది. సంబంధం ఓకే అయిపోయింది.. ఎంగేజ్‌మెంట్ వద్దనుకుని ఊరికే ఇంట్లోనే తాంబూలాలు మార్చేసుకున్నారు. పెళ్లి కూడా చిన్న తిరుపతిలోనో.. అన్నవరంలోనో చేసుకుందామని డిసైడ్ అయ్యారు. రమ్య మధ్యమధ్యలో రాజేశ్‌తో మాట్లాడుతూ ఉంది. ఒకరోజు ఇద్దరూ డిన్నర్‌కు వెళ్లారు. అక్కడ మాటా మాటా కలిసిన తర్వాత.. కాసేపటికి రాజేశ్‌ను ఆమె ‘మీ స్కోర్ ఎంత’ అని అడిగింది. రాజేశ్ ఖంగుతిన్నాడు. ఏం స్కోర్ అని అడిగితే.. కాస్త సిగ్గుపడి, ‘కంగారు పడకండి.. నేనడిగింది మీ సిబిల్ స్కోర్ గురించి’ అని చెప్పింది రమ్య. కాస్త సర్దుకుని.. ఏమో పెద్దగా ఎప్పుడూ చెక్ చేసుకోలేదన్నాడు. అదేంటి, ‘మీకు హోంలోన్ లేదా’ అని అడిగింది. అవసరం రాలేదన్నాడు.

క్రెడిట్ కార్డు మాత్రం ఉందని, దాని పేమెంట్ కూడా తాను డేట్లు గుర్తుపెట్టుకోను కాబట్టి ఆటో పే మోడ్ పెట్టేశానని, అందువల్ల తన బ్యాంకు బ్యాలెన్సు లోంచి రెండు రోజుల ముందే కట్ అయిపోతుందని చెప్పాడు. వెంటనే ఆమె లోలోపలే లెక్కలు వేసుకుని.. అయితే సుమారు 820 ఉండొచ్చని చెప్పింది. లోలోపలే హమ్మయ్య.. పర్వాలేదులే అనుకుంది. ఎందుకలా అడిగావని అంటే, కనీసం 800+ స్కోరు లేకపోతే పెళ్లి చేసుకోకూడదని అనుకున్నట్లు తెలిపింది. అదేంటి.. సిబిల్ స్కోరుకు, పెళ్లికి సంబంధం ఏంటని అడిగితే దాన్ని బట్టే ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉందన్న విషయం తెలుస్తుందని వివరించింది. ఇంటి రుణాలు, ఏవైనా వస్తువులు కొన్నప్పుడు వాటి ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లుల లాంటివి సకాలంలో చెల్లిస్తుంటే సిబిల్ స్కోరు పెరుగుతుంది. అదే ఒకటి రెండు సార్లు డిఫాల్ట్ అయ్యామంటే అది కాస్తా ఢమాల్‌మని పడిపోతుంది. మనం చెల్లించాల్సిన రుణాలన్నీ సకాలంలో చెల్లిస్తున్నామా లేదా అన్నదానికి కొలబద్దే సిబిల్ స్కోరు. అది బాగుంటే మనం బాగున్నట్లు.. లేకపోతే లేనట్లు. సిబిల్ స్కోరు తగినంతగా లేకపోతే బ్యాంకులు మనకు రుణాలు కూడా మంజూరు చేయవు. పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మన సిబిల్ స్కోరు ఎంత ఉందో ఉచితంగానే చెప్పేందుకు చాలా సైట్లు ఉన్నాయి. వాటిలో ఒక్కసారి చూసుకుంటే చాలు.. మనం ఎంతవరకు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తన్నామో తెలిసిపోతుంది. రమ్య కూడా డైవర్సీనే. ఆమె మొదటిపెళ్లి ఫెయిలవ్వడానికి కారణం ఆర్థిక విషయాలే. తన మొదటి భర్త సుజిత్. అతడి  వద్ద నాలుగైదు బ్యాంకుల క్రెడిట్‌కార్డులు ఉన్నాయి. వాటిలో ఒకదానికి బిల్లు కట్టాలంటే మరో క్రెడిట్‌కార్డుతో కట్టేస్తాడు. ఇన్సూరెన్సు ప్రీమియంలు కూడా దాంతోనే వెళ్తాయి.

image


అలా అన్నింటి బిల్లులు కలిపి తడిసి మోపెడు చేసుకోవడం, అవి కట్టలేక రొటేషన్ పేరుతో తలకిందులు కావడం అతడికి అలవాటు. అన్నెందుకు, సరెండర్ చేసేసి ఒకటి గానీ రెండుగానీ ఉంచుకొమ్మని ర మ్య చాలాసార్లు చెప్పినా అతడు వినిపించుకోలేదు. చివరకు ఓసారి వాషింగ్ మిషన్ ఈఎంఐలలో కొందామని షోరూంకు వెళ్తే.. అక్కడ సుజిత్ పాన్ నెంబరు అడిగి, సిబిల్ స్కోరు 530 మాత్రమే ఉందని, అందువల్ల ఇవ్వడం కుదరదని మొహమ్మీదే చెప్పేశారు. అది రమ్యకు చాలా అవమానంగా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత దాని గురించే పెద్ద గొడవ అయ్యి, అది కాస్తా విడాకుల వరకు వెళ్లింది. అందుకే రెండోసారి పెళ్లి అనగానే రమ్య సిబిల్ స్కోరు గురించి అడిగింది. పెళ్లి చూపులప్పుడే అడుగుదామని అనుకున్నా, అప్పుడు తల్లి అడ్డుపడటంతో ఆగిపోయింది. పెళ్లికి ఎటూ ఇంకా సమయం ఉంది కాబట్టి, ఈలోపే ఒకసారి అడిగి తెలుసుకుంటే ఇబ్బంది ఉండదని.. అంతా బాగుంటే సరే, లేకపోతే విషయం చెప్పేద్దామని అనుకుంది. పనిలో పనిగా రాజేశ్ పాన్ నంబరు అడిగి తీసుకుని అప్పటికప్పుడే తన ఐప్యాడ్‌లో చెక్‌చేసి కాబోయే భర్తకు చూపించింది కూడా. 

పెళ్లి చేసుకోవడం అంటే జీవితాన్ని పంచుకోవడం. అందులోనే ఆస్తులు, అప్పులు.. అన్నీ ఉంటాయి. అప్పు చేయడం తప్పు కాదు గానీ, దాన్ని సకాలంలో తీర్చడం కూడా ముఖ్యం. అలా తీర్చినపుడే మన ఆర్థిక ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు ఎలాంటి చికాకులు లేకుండా జీవితాన్ని గడపచ్చు. లేదంటే తల పట్టుకుని కూర్చోవాల్సిందే. అందుకే సిబిల్ స్కోరు లాంటి వాటిని భార్యాభర్తలిద్దరూ ఎప్పటికప్పుడు చూసుకుంటే తమ ఆర్థిక ఆరోగ్యం బాగుంటుంది. ఈ విషయాన్ని గట్టిగా గుర్తించబట్టే రమ్య లాంటివాళ్లు సిబిల్ స్కోరు గురించి అంతలా పట్టుబడుతున్నారు.

అందులోనూ ఒకసారి దెబ్బతిని ఉన్నారు కాబట్టి మరోసారి ఆ కారణం వల్ల తామిద్దరి మధ్య గొడవలు రాకూడదని అనుకున్నారు. అందుకే మరీ అంతలా పట్టుబట్టి పాన్ నెంబరు అడిగి తీసుకుని సిబిల్ స్కోరు చెక్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు పెళ్లి చే సుకోవలంటే అబ్బాయి ఉద్యోగం ఏంటి, మంచిదేనా, మంచి కంపెనీలోనే చేస్తున్నారా, జీతం ఎంత, ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా, కారుందా.. ఇలాంటి విషయాలు మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఉద్యోగం వచ్చీ రాగానే బ్యాంకు అకౌంటు, దాంతోపాటే క్రెడిట్ కార్డులు వచ్చిపడుతున్నాయి. వాటిని సక్రమంగా వాడుకోగలిగితే పర్వాలేదు గానీ, ఏమాత్రం కాస్త క్రమశిక్షణ తప్పినా తలకు చుట్టుకుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే పెళ్లి కావల్సిన వాళ్లు సేఫ్. లేకపోతే.. ఇక అంతే!!కండిషన్స్ అప్లయ్

Updated By ManamTue, 08/28/2018 - 22:11

imageగ్లామర్‌తోపాటు చక్కని నటన కనబరచగల నటిగా పేరు తెచ్చుకున్న ఆండ్రియా ఇకపై తను చేయబోయే సినిమాల విషయంలో, క్యారెక్టర్ల విషయంలో ఓ కొత్త నిర్ణయం తీసుకుందట. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎన్నో గ్లామర్ పాత్రలు పోషించిన ఆండ్రియా ఇకపై గ్లామర్ పాత్రలు చేయబోనని చెప్తోంది. అంతేకాదు లిప్ లాక్ సీన్స్‌కి కూడా తాను దూరమంటోంది. సీనియర్ హీరోలతోపాటు యంగ్ హీరోల సరసన కూడా నటించిన ఆండ్రియా ఇటీవల ‘తరమణి’ చిత్రంలోని తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది.

అంతేకాదు ‘విశ్వరూపం- 2’ చిత్రంలో యాక్షన్ సీన్స్‌లో కూడా మెప్పించగలనని ప్రూవ్ చేసుకుంది. తాజాగా ‘వడ చెన్నై’ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చెయ్యాలని డిసైడ్ అయింది. నటిగా తన ఇమేజ్ పెంచుకోవడమే పనిగా పెట్టుకున్నానంటోంది ఆండ్రియా. అంతేకాదు తనతో సినిమాలు తియ్యాలనుకునే దర్శకనిర్మాతలకు కొన్ని కండిషన్స్ పెడుతోంది. లిప్‌లాక్ సన్నివేశాలు, పొగ తాగే సీన్స్ చేయనని స్పష్టంగా చెబుతోంది. మరి ఆండ్రియా పెట్టే కండిషన్స్‌కి ఒప్పుకొని దర్శకనిర్మాతలు ఆమెతో సినిమాలు చేస్తారా? లేక వెనక్కి వెళతారా? అనేది చూడాలి. 

Related News