Into space in 16 minutes

16 నిమిషాల్లో అంతరిక్షంలోకి.. 

Updated By ManamTue, 08/28/2018 - 23:03
  • దేశ తొలి మానవ సహిత ఉపగ్రహం

  • అడుగుపెట్టనున్న ముగ్గురు భారతీయులు

  • 2022 నాటికి గగన్‌యాన్ ప్రారంభం

  • ప్రాజెక్టుపై ఇస్రో చైర్మన్ శివన్ ప్రజెంటేషన్ 

imageన్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో ఎన్నో విజయాలు సాధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. దేశ తొలి మానవ సహిత అంతరిక్ష ఉపగ్రహాన్ని శ్రీహరికోటలో ప్రయోగించిన తర్వాత కేవలం 16 నిమిషాల్లో అందులో ఉన్న ముగ్గురు భారతీయులు అంతరిక్షానికి చేరుకుంటారు. వారు అంతరిక్షంలో ఐదు నుంచి ఏడు రోజుల పాటు పరిశోధనలు చేయనున్నారు. తరువాత గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంపై ల్యాండ్ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన గడువు 2022 నాటికి ‘గగన్‌యాన్’ను ఇస్రో ప్రారంభించనుంది. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ కె.శివన్ ఈ విషయాలను వెల్లడించారు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ.. 2022 నాటికి గగన్‌యాన్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. మోదీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టు ఇస్రో చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర అంతరిక్ష, అణు ఇంధన శాఖ మంత్రి జితేందర్ సింగ్ పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి సమక్షంలో దేశ తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగంపై శివన్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ముగ్గురు భారతీయులు అంతరిక్షానికి వెళతారని తెలిపారు. శ్రీహరికోటలో ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత 16 నిమిషాల్లో అంతరిక్షంలోకి చేరుకుంటారని, అక్కడ భారత శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేస్తారని వెల్లడించారు. అంతరిక్షం నుంచి తిరుగు ప్రయాణానికి 36 నిమిషాలు సమయం పడుతుందని వెల్లడించారు. ల్యాండ్ అయ్యే సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ప్రత్నామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేసుంటామని శివన్ తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుకు 10 వేల కోట్ల రూపాయల లోపు వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. 2022లోగా 30 నెలల కాలవ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడించారు. మానవ సహిత ఉపగ్రహాన్ని ప్రయోగించిన నాలుగో దేశంగా భారత్ ఘనత సాధించనుందని తెలిపారు. మిత్ర దేశాల్లోని అంతరిక్ష సంస్థల సహకారాన్ని ఇస్రో తీసుకుంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.





Related News