Director B Jaya dies of heart attack

సినీ వినీలాకాశంలో ‘జయ’కేతనం

Updated By ManamFri, 08/31/2018 - 23:50

సినిమా అంటే గ్లామర్.. ఇక్కడ మహిళలు పెద్దగా రాణించలేరు. అని చాలా మంది అంటుంటే.. మనలో చాలా మంది వినే ఉంటాం. అయితే అది ఒకప్పుడు ఇప్పుడు ఎంతో మంది మహిళలు సినిమా రంగంలోని వివిధ డిపార్ట్‌మెంట్స్‌లో తమదైన శైళిలో రాణిస్తున్నారు. ముఖ్యంగా సాంకేతిక విభాగంలో కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని పిలవబడే దర్శకత్వ శాఖలో రాణించిన మహిళలు కొందరు నేటి తరానికి ఆదర్శ ప్రాయంగా నిలిచి మార్గదర్శకులైయ్యారు. వారిలో విజయనిర్మల, జీవిత రాజశేఖర్, జయ.బి వంటి వారు ఉన్నారు. విజయనిర్మలను ఆదర్శంగా తీసుకున్న జయ 2003లో ‘చంటిగాడు’ సినిమాతో దర్శకురాలిగా మారారు. ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్‌లీ, వైశాఖం చిత్రాలతో దర్శకురాలిగా రాణించారు. 
image
అదే స్పెషల్...

జర్నలిజంపై ఆసక్తితో జర్నలిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన జయ.బి ఎం.ఎ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన జయ తర్వాత ఎం.ఎ సైకాలజీ కూడా పూర్తి చేశారు. చెన్నై యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ జర్నలిజంను కంప్లీట్ చేశారు. తెలుగు పత్రికల్లో సినీ జర్నలిస్ట్‌గా మొదైలెన ఆమె తర్వాత ఆంగ్ల పత్రికల్లో జర్నలిస్ట్‌గా పనిచేశారు. ఇలా రెండు విభిన్న భాషల్లో జర్నలిస్టులుగా రాణించిన వారిలో జయ ఒకరు. అదే ఆమె స్పెషాలిటీ. తెలుగు, ఆంగ్లంతో పాటు తమిళం, హిందీ భాషలపై ఆమెకు మంచి పట్టు ఉంది. ఆమె రాసిన పలు కథలు అప్పట్లో పలు వార్తా పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. ఈమె రచించిన ‘ఆనందో బ్రహ్మ’ అనే షార్ట్ స్టోరీకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ రావడం విశేషం. 

పని విషయంలో మహా స్ట్రిట్..
ఇప్పటిలా ఒకప్పుడు మీడియా పరిమితంగానే ఉండేది. అలాంటి తరుణంలో షూటింగ్ స్పాట్స్‌లకు వెళ్లే సినిమా వార్తలను సేకరించాల్సి ఉండేది. అయితే పూర్తి చేయాల్సిన పని విషయంలో ఆమె ఎక్కడా వెనక్కి తగ్గేవారు కారు. మగవారితో పోటీ పడి వార్తలను సేకరించి రాసేవారు. ఓ వార ప్రతికను ప్రారంభించిన తర్వాత పాతికేళ్ల పాటు చిన్న బ్రేక్ లేకుండా పత్రిక ప్రజలను మెప్పించిందంటే దాని వెనుక ఆమె కష్టమేంటో అర్థం చేసుకోవచ్చు. దర్శకురాలిగా మారిన తర్వాత కూడా పని విషయంలో ఆమె ముక్కు సూటిగా వ్యవహరించేవారు. ఏదైనా పనిని పూర్తి చేయాలంటే దాన్ని అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేసేవారు. పని విషయంలో ఆలసత్వం వహించడం ఆమెకు నచ్చదు. కానీ సినిమా షూటింగ్ పూర్తి అవగానే చాలా సరదాగా ఉండేవారు. దర్శకత్వ శాఖలో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్‌ని, ఇతర సాంకేతిక నిపుణులను చక్కగా ఆదరించేవారు. పని వ్యవహారంలో పడిపోయి ఎవరైనా తినకుండా ఉంటారేమో అని భావించి.. అది తన పనిగా భావించి తన ఇంటి నుండి వారికి బోజనం పంపేవారు. 

చిరంజీవి అంటే ప్రత్యేకాభిమానం...
ఇండస్ట్రీలో అందరి హీరోలతో బావుండే జయకు చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. హుషారుగా అందరితో పోటీ పడుతూ ఎంతో స్పిరిట్‌తో పనిచేసే జయ అంటే చిరంజీవి ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించేవారు. అందుకు జయ అడగ్గానే లంకేశ్వరుడు సినిమా కోసం స్పెషల్ ఫోటో షూట్‌ను చేసిచ్చారు చిరంజీవి. జయ దర్శకురాలిగా మారిన తర్వాత ఆమెపై అభిమానంతో గుండమ్మగారి మనవడు సినిమాకు ప్రత్యేక అతిథిగా విచ్చేసి యూనిట్‌ను అభినందించారు. ఓసారి చిరంజీవి గురించి జయ రాసిన అర్టికల్‌కు ఆమె చిరంజీవి అదృష్ట రేఖ సురేఖ అనే టైటిల్ పెట్టారు. దాన్ని చూసిన చిరంజీవి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. 
 

image


సినిమా చేస్తానన్న నాగ్...
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే నాగార్జున.. మంచి కథతో వస్తే జయతో సినిమా చేస్తానని అన్నారు. అదేంటి మేడమ్ మీరు నాగార్జునతో సినిమా ఎప్పుడు చేస్తారు అని ఎవరైనా అడిగితే ‘‘నాగార్జున వంటి పెద్ద హీరోతో సినిమా అంటే మంచి కథ ఉంటే తప్ప చేయకూడదని.. మంచి కథ దొరకగానే ఆయన్ను కలిసి సినిమా చేస్తా’ అనేవారు. 

కొత్తదనాన్ని పరిచయం చేయడంలో ఆసక్తి...
కొత్త ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ జయ ఆసక్తి చూపేవారు. జయ భర్త, ప్రముఖ సినీ పి.ఆర్.ఒ బి.ఎ.రాజుకి కూడా కొత్త వారిని ఎంకరేజ్ చేస్తే బావుంటుందనే ఆలోచన ఉండటంతో.. భార్యను ఎంకరేజ్ చేసేవారు. ఆయన నిర్మాణంలో జయ దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో చంటిగాడు చిత్రంలో బాలాదిత్య, సుహాసిని, ప్రేమికులు చిత్రంతో కామ్నాజెఠ్మలాని, లవ్‌లీతో హీరోయిన్ శాన్వి, వైశాఖం చిత్రంతో హీరో హరీశ్‌ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాగే గేయ రచయిత రాంపైడిశెట్టిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు జయ. అంతే కాకుండా డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించిన వారిలో కూడా జయ ముందున్నారు. ఆమె చంటిగాడు సినిమాలో డిజిల్ టెక్నాలజీతో చేసిన సాంగ్ చూసి అప్పట్లో ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు భవిష్యత్ అంతా డిజిటల్ టెక్నాలజీతోనే సినిమా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు అదే నిజైమెంది. అలాంటి టెక్నాలజీని ముందుగానే జయ తన సినిమాలో ఉపయోగించారు. అలాగే డైరెక్టర్ శంకర్ ఇప్పుడు తన సినిమాల్లో ఉపయో గిస్తున్న గింబల్ కెమెరాను జయ వైశాఖం సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేయించి ఉపయోగించారు.

 అలాగే తన సినిమాల్లో కొత్త లొకేషన్స్‌ను చూపించడానికి ఆసక్తిని కనపరిచేవారు. లవ్‌లీ సినిమాను టర్కీలో షూట్ చేశారు. ఆ సమయంలో మంచు తుఫానుతో యూనిట్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురైనా.. ఆమె పట్టుదలగా సినిమా షెడ్యూల్‌ను పూర్తి చేయించారు. అలాగే వైశాఖం సినిమాలో ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఎవరు చిత్రీకరించని కజికిస్థాన్ దేశంలో పాటలను చిత్రీకరించి అందరి మెప్పు పొందారు. ఇలా కొత్తదనాన్ని అందివ్వడానికి జయ ఎప్పుడూ ఆసక్తిని చూపుతుండేవారు. అలాగే అందరికీ రెమ్యునరేషన్స్‌ను ఆన్‌టైమ్‌లో అందేలా నిర్మాతతో మాట్లాడి ఆమె చొరవ తీసుకునేవారు. 

అతిథులను అడిగే మొదటి ప్రశ్న...
ఎదుటి వ్యక్తి ఆకలి తీర్చితే భగవంతుడికి సేవ చేసినట్లే అని నమ్మే వ్యక్తుల్లో జయ ఒకరు.  వెజ్, నాన్‌వెజ్ వంటకాలను ఆసక్తి వండటానికి ఆసక్తి కనపరిచే జయ ఎదుటి వ్యక్తి ఆకలి తీర్చడానికి ప్రాముఖ్యతనిచ్చేవారు. ఇంటికి వచ్చే అతిథులను జయ అడిగే మొదటి ప్రశ్న తిన్నారా? అనే. ఎవరైనా ఆకలితో తన ఇంటి నుండి బయటకు పంపడం ఆమెకు ఇష్టం ఉండదు. సెట్‌లో కూడా ఆరిస్టులు, సాంకేతిక నిపుణులు సహా కడుపు నిండా భోజనం తిన్న తర్వాతే షాట్‌కు రెడీ చేసేవారు.

ప్రముఖుల సంతాపాలు
జయ నాకు మంచి మిత్రురాలు.. సోదర సమానురాలు. ఈరోజు ఆవిడ మన మధ్య లేదని తెలిసి షాకయ్యాను. చెన్నైలో ఉన్నప్పటి నుండి బి.ఎ.రాజు, జయతో మంచి సంబంధాలున్నాయి. జయ బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయితగా, డైరెక్టర్‌గా రాణించారు. అన్ని శాఖలపై మంచి పట్టున్న వ్యక్తి. జయలాంటి వ్యక్తి లేకపోవడం తీరని లోటు. మహిళా దర్శకురాలిగా ఎంతో పేరు సంపాదిచుకున్నారు. ఏదేమైనా కర్మ జరగక మానదు. సోదరి జయ ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను - చిరంజీవి

image

జయ డైరెక్టర్ కాక ముందు.. మంచి జర్నలిస్ట్‌గా సుపరిచితురాలే. ధైర్యవంతురాలు. తను ఇంటర్వ్యూలు చక్కగా చేసేది. దర్శకురాలిగా మారిన తనను చూసి హ్యాపీగా ఫీలయ్యాను. తను ఈరోజు హఠాత్తుగా మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను  - వెంకటేష్

జయగారిది, నాది పుట్టినరోజులు ఒకటే. నేనంటే ఆవిడకు ఎంతో ఇష్టం. నా సినిమా ఫైనల్ అయితే ఫోన్ చేసి అభినందిస్తుంటారు. జర్నలిస్ట్, కాలమిస్ట్, కార్టూనిస్ట్‌గా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆవిడ మనల్ని విడిచిపెట్టి పోవడం బాధగా ఉంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి - సుకుమార్

జయగారు యంగ్ ఏజ్‌లోనే మనల్ని వదిలిపెట్టి వెళ్లారు. చాలా మంది మహిళలకు ఆమె ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. మహిళా దర్శకురాలిగా తన ముద్ర వేశారు. తనతో వర్క్ చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఆమె ఎప్పటికీ మనకు గుర్తుండి పోతుంది   - సుధీర్‌బాబు

లవ్‌లీ సినిమాతో జయగారితో ట్రావెల్ అయ్యాను. నాకు హీరోగా మంచి హిట్ ఇచ్చారు. ఆమె మరణవార్త పెద్ద షాకింగ్. మా శ్రేయోభిలాషి. మా కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆవిడ ఫ్యామిలీకి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను - ఆది

 చాలా బాధగా ఉంది. ఆవిడ కుటుంబానికి దేవుడు ధైర్యానివ్వాలి. లేడీ డైరెక్టర్‌గా ఆమె ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. ఆమె ఆత్మ శాంతించాలి - మంచు మనోజ్

జర్నలిస్ట్‌గా జయగారు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి తెలుసు. చాలా ధైర్యవంతురాలు. మంచి వ్యక్తి, నాకు మంచి స్నేహితురాలు. మా ఫ్యామిలీ ఆమెను చాలా మిస్ అవుతున్నాం - జీవితా రాజశేఖర్

నవలా రచయితగా..కార్టూనిస్టుగా, రైటర్‌గా, డైరెక్టర్‌గా జయగారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విజయనిర్మలగారి తర్వాత ఎవరు అంటే జయగారి పేరు చెప్పే రేంజ్‌కు ఎదిగారు. ఆనందో బ్రహ్మా అనే గొప్ప నవలను రాసి కేంద్ర సాహిత్య అవార్డును సంపాదించుకున్న గొప్ప వ్యక్తి. మంచి మానవీయ వ్యక్తి. అందరి పట్ల ఆదరణ చూపేవారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి - ఆర్.నారాయణమూర్తి
 

Related News