Pranasatruvulu

ప్రాణ‘శత్రువులు’

Updated By ManamWed, 09/05/2018 - 02:26

ఆత్మహత్యలకు బాసటగా క్రిమిసంహారకాలు.. 18 ప్రమాదకర కీటకనాశినులపై నిషేధం
imageజీవితమనే పుస్తకం నుంచి ఒక్క పేజీని కూడా మనం చింపలేం. కానీ ఆ పుస్తకాన్ని ఒక్కోసారి ఏకమొత్తంగా మంటల్లో పడేస్తుంటాం, దాన్నే ఆత్మహత్య అని పిలుస్తుంటాం. నిస్సహాయత వల్ల లేదా కోపం వల్ల మనం ఎవరినైనా చంపేస్తే అది నేరమవుతుంది. కానీ అదే పని మనకు మనం చేసుకుంటే మహాపరాధమవుతుంది. ఎవరినీ ఏమీ చేయలేని, ఏ పరిస్థితినీ మార్చలేని అసమర్థతకు లోకువగా కనిపించేది సొంత ప్రాణమే కదా?! ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలేయడం ఒక్కో సందర్భంలో మనల్ని యోధులుగా నిలబెడుతుంది. చాలా సందర్భాల్లో అది మనల్ని పిరికి వాళ్ళుగా తేల్చి పారేస్తుంది. ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్ - 2018’ ప్రకారం మన దేశంలో ఒక్క 2015 వ సంవత్సరంలోనే 1,33,623మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా 30 నుంచి 45 ఏళ్ళ మధ్య వయస్కులే. మనదేశంలో రైతుల ఆత్మహత్యలకు కొదవే లేదు. పంటలు పండించాల్సిన పొలాల్లో ఈ రైతులు క్రిమిసంహారక మందుల్ని తాగి ప్రాణాలు విడవడం మనకు కొత్తకాదు. మనదేశంలో ఆత్మహత్య లకు ప్రధాన సాధనంగా మారుతున్నదేమిటో తెలుసా..., క్రిమిసంహారక మందులు. పంటలకు తెగుళ్ళ నుంచి విముక్తి కల్పించడానికి ఉద్దేశించిన ఈ క్రిమినాశినులు చాలామందికి ప్రాణాల నుంచి విముక్తిని ప్రసాది స్తున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం క్షణకమైన భావోద్వేగానికి సంబంధించిన ప్రక్రియ. ఆ క్షణంలో వారికి అందుకు అనువైన పరిస్థితులు అందుబాటులో లేకపోతే, వారు తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు పెరుగుతాయి. అయితే మనదేశంలో ప్రతి చిన్న గ్రామంలో కూడా అందుబాటులో ఉండే క్రిమి సంహారక మందులు ఆత్మహత్యా యత్నాల్ని సఫలీకృతం చేయడానికి ఇతోధికంగా తోడ్పడు తున్నాయి. ఈ సమస్య మన భారతదేశానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇది శ్రీలంక, బంగ్లా దేశ్, దక్షిణ కొరియా, నేపాల్ వంటి దేశాల్ని కూడా పట్టి పల్లారుస్తున్న సమస్య. అందుకే కొన్ని అత్యంత ప్రమాదకరమైన క్రిమిసంహారకాల్ని ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం తప్పనిసరైంది. మనదేశం కూడా ఈ దిశగా తొలి అడుగు వేసింది. 

ఏటా 8 లక్షల మంది
క్రిమిసంహారక మందులు, తుపాకులు వంటి ఆయుధాల అందుబాటును తగ్గించడం ద్వారా ప్రపంచంలో ఆత్మహత్యల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెబుతోం ది. ప్రపంచంలో ఆత్మహత్యలకు పాల్పడే వారికి క్రిమిసంహారక మందులు తొలి ఆయుధంగా ఉపయోగపడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లో ఆత్మహత్యల నివారణకు సంబంధించిన తొలి అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎనిమిది లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తేలింది. ఇలా ఆత్మహత్యలకు పాల్పడే వారు క్రిమిసంహారక మందుల ద్వారా విషాన్ని స్వీకరించడం, నిప్పంటించుకోవడం, లేదా తుపాకీతో కాల్చుకోవడం, ఉరివేసుకోవడం ద్వారా ప్రాణాల్ని తీసుకుంటున్నట్టు అధ్యయనం చెబుతోంది. ప్రతి దేశంలోను జాతీయ ఆత్మహత్యల నివార ణ వ్యూహాల్ని అమలు పరచడం కూడా ఆత్మహత్యల నివారణకు మంచి తరుణోపాయమని ఆ అధ్యయనం పేర్కొంది. 

18 క్రిమిసంహారకాలపై నిషేధం
imageవ్యవసాయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్న ప్రమాదకరం క్రిమిసంహారకాల్ని నిషేధించడం ద్వారా శ్రీలంకలో ఆత్మహత్యల నివారణ విజయవంతమైంది. ఈ సత్యాన్ని గుర్తించిన మనదేశం కూడా ఈ దిశగా ఒక ముందడుగు వేసింది. భారత ప్రభుత్వం గత ఆగస్టు 8న అత్యంత ప్రమాదకరమైన 18 క్రిమి సంహారకాల వినియోగం మీద నిషేధాన్ని విధించింది. వీటిలో 12 క్రిమిసంహారకాల వినియోగంపై నిషేధం తక్షణం అమల్లోకి వచ్చింది. మిగిలిన వాటిపై రెండేళ్ళ వ్యవధి లో నిషేధాన్ని వర్తింప జేసే అవకాశం ఉంది. ప్రమాదకర కీటకనా శినులపై నిషేధాన్ని విధించా లంటూ ప్రజా ఉద్యమ కార్యకర్తలు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. తత్ఫలితంగా 2015లో నియమితమైన అనుపమ్ వర్మ కమిటీ సమర్పించిన నివేదిక ఈ 18 క్రిమిసంహారకాల్ని నిషేధించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు ఫలితంగానే ప్రభుత్వం ఇప్పుడు దేశంలో 18 రకాల క్రిమిసంహారకాల వినియోగం మీద నిషేధాన్ని విధించింది. 

ఆత్మహత్యాయత్నాల్లో ఎక్కువగా అందుబా టులో ఉండే క్రిమిసంహారకాలే ప్రాణనష్టానికి కారణమవుతున్నాయి. శ్రీలంకలో 1995 నుంచి అనుసరిస్తున్న క్రిమిసంహా రకాల నియంత్రణ విధానాలు ప్రపంచమే అబ్బురపడేంతగా సత్ఫలితాలనిచ్చాయి. ఈ విధానాల ఫలితంగా ఆ దేశంలో 70 శాతం వరకు ఆత్మహత్యల్ని నివారించడం సాధ్యమైంది. అంటే 93 వేల మందిని ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడారన్న మాట. శ్రీలంకలో 1990ల్లో ఏటా లక్షమందిలో 57 మంది ఆత్మహత్యలకు పాల్పడేవారు. కానీ క్రిమిసంహారకాల లభ్యతను నియంత్రించిన తరువాత ఏటా లక్షమందిలో 17 మంది మాత్రమే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయం లో క్రిమిసంహారకాల వినియోగానికి సంబంధించి నియంత్రణా విధానాల్ని రూపొందించడం అంత సులభమైన పనేమీ కాదు. ఇది దేశ స్థూల వ్యవసాయోత్పత్తి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. అయితే శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణ కొరియాల్లో అమలులోకి తెచ్చిన క్రిమిసంహారక నియంత్రణా విధానాల వల్ల ఆయా దేశాల స్థూల వ్యవసాయోత్పత్తి తగ్గిన దాఖలాలు కనిపించలేదు. 

మనదేశంలో 18 క్రిమిసంహారకాల్ని వ్యవసాయంలో వినియోగించడంపై నిషేధం విధించడమన్నది స్వాగతించాల్సిన పరిణా మం. మిథైల్ పారథియోన్, ఫోరేట్, ఫాస్ఫామిడాన్, డైక్లోర్వోస్ వంటి క్రిమిసంహారకాలు మనదేశంలో వేలాది ఆత్మహత్యలకు కారణమ వుతున్నాయి. భారత్‌లో ఏటా 90వేల మంది వ్యవసాయంలో ఉపయోగించే క్రిమిసంహారకాల్ని తాగడం వల్లే ప్రాణాల్ని కోల్పోతు న్నారు. మార్కెట్‌లో ఈ క్రిమిసంహారకాలు అందుబాటులో ఉండడమే దీనికి ప్రధాన కారణం. కొంతమంది ఇలాంటి విషపదార్థాల్ని వాడినప్పటికీ ప్రాణాల్ని కోల్పో కుండా రక్షించడం సాధ్యమవుతోంది. అయితే క్రిమిసంహారకాల్ని తాగిన వ్యక్తికి చికిత్స చేయించాలంటే, అందుకు పెద్దమొత్తంలో డబ్బు అవసరమవుతోంది. క్రిమిసంహార కాల విషం కుటుంబాల్ని,  సమాజాన్ని ఛిద్రం చేస్తోంది. అయితే ప్రభుత్వం వీటిపై నిషేధాన్ని విధించడమన్నది సమర్థవంతమైన క్రిమిసంహారక నియంత్రణా విధానాల రూపకల్పన లో తొలి అడుగు మాత్రమే. ఈ దిశగా ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయవలసి ఉంది. క్రిమిసంహారకాల నిషేధం కోసం అనుపమ్ వర్మ కమిటీ సిఫార్సు చేసిన వాటిలో మోనోక్రోటోఫాస్, కార్బొఫ్యూరాన్, డైమిథియోట్, క్వినాల్ ఫాస్ వంటి 27 కీటకనాశినులు ఉన్నాయి. ఇవి ఆగ్నేయాసియాలో వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నాయి. ఇవి అత్యంత ప్రమాదకరమైన క్రిమిసంహారకాలు (హెచ్‌హెచ్‌పి). వీటిని ఉపయోగించడం, దాచడం వంటివి ఎంతో జాగ్రత్తతో చేయాల్సిన పనులు. అయితే గ్రామీణ భారతదేశంలోని పేదరైతులు వీటి పట్ల తగిన అవగాహనను కలిగి ఉండరు. అందుకే వ్యవసాయంలో వీటి వినియోగంపై నియంత్రణను విధించాల్సిన అవసరం తలెత్తింది. మనదేశంలో ఒక్క 2015లోనే ప్రతిగంటకూ 15 మంది ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అదేవిధంగా 2010లో 187,000 మంది కేవలం పురుగుమందులు తాగి మరణించారు. పురుగుమందును తాగి ఆత్మహత్యకు పాల్పడడమన్నది మనదేశంలో పరిపాటిగా మారింది. గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ ప్రయోజనాల కోసం శక్తిమంతమైన, అత్యంత ప్రమాదకరమైన పురుగు మందుల్ని వాడుతుంటారు. ఇలాం టి పురుగు మందుల్ని ‘హెచ్‌హెచ్‌పి’ అంటారు. వ్యవసాయరంగంతో సంబంధం లేని వ్యక్తులు కూడా ఆత్మహత్య చేసుకోదల చినపుడు పురుగు మందుల్నే ఆశ్రయిస్తు న్నారు. రైతులతో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా ఇలాంటి పురుగు మందులు అందుబాటులోకి రాకుండా అడ్డుకోగలిగితే ప్రాణనష్టం నుంచి కొంతైనా వారిని కాపాడుకోవచ్చు. అంతేగాక రైతులు వ్యవసాయ పనుల్లో భాగంగా ఈ ప్రమాదకర పురుగు మందుల్ని అజాగ్రత్తగా ఉపయోగించ డం వల్ల కూడా మరణాల బారిన పడుతున్నారు. ప్రజల ప్రాణాల్ని రక్షించడం ప్రభుత్వ కర్తవ్యం కనుక ఇలాంటి పురుగు మందుల్ని వ్యవసాయంలో కూడా ఉపయోగించకుండా నిషేధించడం వల్ల సమాజానికి మేలు జరుగుతుంది.
 
దేశంలో క్రిమిసంహారకాల్ని ఉపయోగించి ఆత్మహత్యాయత్నాలు జరిగితే, ‘సూసైడ్ ప్రివెన్షన్ ఇండి యా ఫౌండేషన్’ వారి సహాయాన్ని పొందవచ్చు. వారు మీకు దగ్గర్లోని ఆసుపత్రి, చికిత్స తదితర వివరాల ను అందించి మీకు సహకరిస్తారు. ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎస్‌పిఐఎఫ్ డాట్ ఇన్’ వెబ్‌సైట్‌ను దర్శిస్తే మీ పరిచయస్తులెవరైనా ఆత్మహత్యా యత్నంలో ప్రాణాపాయ స్థితిలో చిక్కినపుడు, వారిని రక్షించే అవకాశం లభిస్తుంది. 
- కల్కి
 

Related News