History traces are eroding

చరిత్ర ఆనవాళ్లు చెరిగిపోతున్నాయి

Updated By ManamThu, 09/06/2018 - 22:35

imageశిల్పాలపై పరిశోధన గురించి అనేది మాటలు కాదు. పురావస్తు శాఖ వారికి ఫలానా శతాబ్దపు ఆనవాళ్ళు భూమిలో లభ్యమయ్యాయి. అని తెలిసినప్పుడు ఒకింత ఉత్సాహం కలుగుతుంది. మన పురాతన కట్టడాలను, ప్రదేశాలు చూసినప్పుడు అబ్బా ఏమి శిల్ప కళా నైపుణ్యం అనుకుని అబ్బుర పడక మానము. అటువంటి వాటిని పరిశోధన చేసి కొత్త విషయాలను తెలుసుకుంటున్న వైద్యురాలు వరంగల్‌కు చెందిన హిందోళ గుడిబోయిన. వృత్తిరిత్యా వైద్యురాైలెన ఈమె. అభిరుచి కాస్త భిన్నమే. అసలు అటుగా ఎలా వెళ్ళిందో మనం మిసిమి అడిగి తెలుసుకుంటుంది. మీరూ రండి. 

చిన్నతనం నుండీ పెద్దవాళ్ళు పూర్వీకులనాటి చరిత్ర గురించి, వారి వస్త్రధారణ గురించి, వారి వైభవం గురించి చెప్పినప్పుడు, పుస్తకాల్లో చదివినపుడు మనలో తెలియకుండానే ఓ రకైమెన ఆతృత మొదలవుతుంది.వాటి గురించి ఎలా అయినా తెలుసుకోవాలనిపిస్తుంది. నాలోనూ అలా మొదైలెందే పురాతన కట్టడాలు, పురావస్తు చరిత్ర ఇలాంటి అంశాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి. చాలా మందిలో ఉండే తపనే అయినా నాలో ఆపాళ్ళు కాస్త ఎక్కువగా ఉండేది. నాకు ఉన్న ఆసక్తిని మావాళ్ళు ప్రోత్సహించారు. అటు చదువుని కొనసాగిస్తూనే మరోపక్క పురావస్తు అంశాలను ప్రదేశాలను రిసెచ్ చేయడం మొదలుపెట్టాను. 
 

image


డాక్టర్ వృత్తి కొనసాగిస్తూనే, పరిశోధనలకు వీలు ఏలా చిక్కుతుంది.
దంతైవెద్యురాలిగా చాలా బిజీగా ఉండే నేను మిగతా పనులన్నీ వీకెండ్ లోనే చేసుకుంటాను. అందులోనూ ఎక్కువ వీలుగా ఉండే దగ్గరి ప్రదేశాలను ఎన్నుకుని అటు వెళుతుంటాను. నిజమే ఇందులో ఒకటి వృత్తి మరొకటి నా అభిరుచి రెండిటినీ సరిసమానంగా నడిపించడం, వాటికి న్యాయం చేయడం కాస్త కష్టమే. అయినా నా పరిశోధనలు మానలేదు. చిన్నతనంలో అమ్మనాన్నలు డాక్టర్స్ కావడం వల్ల చాలా బిజీగా ఉండేవారు. అందుకు మా మావయ్య సూర్యనారాయణగారు నన్ను అన్ని చోట్లకీ తిప్పేవారు. అలా నేను చూసిన మొదటి కట్టడం గోల్కొండ కోట అక్కడికి ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటానో లెక్కలేదు. ఆ తరువాత చూసింది సాలార్ జంగ్ మ్యూజియం, కుతుబ్ షాహీ టూబ్స్ చిన్నతనంలో నాకు తప్పకుండా వెళ్ళి వాటిగురించి తెలుసుకోవాలి, చూడాలి అనిపించిన ప్రదేశాలవి. ఆతరువాత నేను చూసిన ప్రదేశం అజంతా ఎల్లోరా గుహలు. ఈ అన్వేషణ అనేది నాలో నాకే తెలియకుండా బలపడిపోతూ వచ్చింది. అందులోంచి దీనివెనుక ఇంకా ఏదో దాగుంది. చరిత్రకారులు మనకు చెప్పని మరో కోణమేదో చెప్పాలి అనే తపన పుట్టింది. 

ఆర్కియాలజీ వైపు వెళ్ళకుండా డాక్టర్ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు మరి...
అమ్మానాన్న ఇద్దరిదీ వైద్య వృత్తి. పుట్టింది వరంగల్ జిల్లా. వృత్తి రిత్యా ఎక్కడ ఉన్నా రిటైర్ అయ్యాకా మళ్ళీ తిరిగి వరంగల్ లోనే సెటిల్ అయ్యాం. నా తల్లితండ్రుల ఇద్దరిదీ బీద కుటుంబాలనుండీ వచ్చినవారే కావడంతో నాకు ఆ కష్టం తెలీనీయలేదు. డాక్టర్ వృత్తి అంటే చాలా ఒత్తిడికి గురికావలసి ఉంటుంది. అలాగే పని వేళలు కూడా సరిగా ఉండవు అనేది వారి వాదన.  చిన్నతనం నుండీ ప్రతి విషయానికీ చాలా ప్రశ్నలు నన్ను చుట్టు ముట్టేవి. వాటికి జవాబులు వెతుకులాడుతూ ఉండేదాన్ని. డాక్టర్ కావడానికి కూడా నాకు తగ్గ బలైమెన కారణాలు నాకున్నాయ్. ఈ వెతుకులాట అనేది నాతోపాటు పెరుగుతూ వచ్చిందనే చెప్పాలి. 
 

image


పూర్తిగా సమయాన్ని కేటాయిస్తూ పరిశోధనలు మొదలు పెట్టింది ఎప్పుడు?
రెండేళ్ళ నుండీ పూర్తిగా ఇన్వాల్ అయ్యాను. అలా అని డాక్టర్ వృత్తిని వదిలికాదు. ఉదయం 11 నుండీ 2 వరకూ హాస్పటల్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6గంటలకే తెరిచేది,  కనుక ఈ మధ్య సమయాన్ని విశ్రాంతికి వెచ్చించకుండా వరంగల్ చుట్టుపక్కల దగ్గరలోని ప్రదేశాలకు వెళతాను. ఇక వరంగల్ చుట్టూ చాలా పురాతన కట్టడాలు ఉన్నాయి. కొన్నిటిని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మరికొన్నిటిని ప్రజలే నిర్లష్యం చేస్తున్నారు. ఓ పురాతన కట్టడంగానీ శిల్పంగానీ పాడైందంటే దాని పూర్తి భాద్యత ప్రభుత్వానిదే  కాదు, ప్రజలకూ ఉంది. కానీ వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు అనుకుంటారు అంతే. అలా పాడుబడి శిథిలైవెుపోతున్న ప్రదేశాలు వరంగల్ చుట్టూ చాలా ఉన్నాయి. సెలవు రోజులప్పుడు కాస్త దూరంలో ఉన్న ప్రదేశాలకు వెళుతుంటాను. ఓ శిల్పం గురించిగానీ మరే ఇతర వాటిగురించి చెప్పాలన్నా, డాక్యమెంట్ చేయాలంటే దానికి ఫోటోగ్రఫీ కూడా చాలా అవసరం. అది కూడా నేర్చుకున్నాను.
 
ఇప్పటి వరకూ అంతుచిక్కని, మీ ఆలోచనల్లో ఓ ప్రశ్నగా మిగిలిన ప్రదేశం ?
ఉందండి. ఇప్పుడు కాకతీయులకు కాకతీయ అనే పేరు ఏలా వచ్చింది అనేది ఓ మిస్టరీ. మనకి రాజుల గురించిగానీ, రాజ్యాంగాల గురించిగానీ వివరాలు తెలిసేది శాసనాల ద్వారా. ఇంకొక  మార్గం రచనల ద్వారా. ఇవే మనకున్న మార్గాలు. కొందరు ఏమంటారంటే  పూర్వం కాకతీ అనే దేవతను ఆరాధించేవారు అందుకు కాకతీయ అనే పేరు వచ్చింది అంటారు. మరికొందరు గుమ్మడి తీగను కాకతీ అని పిలుస్తారు, అందులోంచి కాకతీయ అనే పేరు వచ్చింది అంటారు. దీనిమీద కూడా చాలా పరిశోధించాను. వరంగల్ జిల్లాలో ఎక్కడా  ఒక్క గుడి లో కూడా ఆ దేవత గురించి లేదు. ఆమె దుర్గా దేవి స్వరూపమే అని అనుకున్నా ఆ అంశ తీసుకున్న ఆధారాలు కూడా లేవు. ఎక్కడో  చిన్న లింక్ మిస్ అవుతున్నాం. 

ఇలాంటిదే మిమ్మల్ని ఆలోచనలో పడేసిన మరో శిల్పం...
చాలానే ఉన్నాయ్. మనకు కొన్ని శిల్పాలు చూస్తుంటే ఈ శిల్పికి ఇంత తెలుసా అనిపిస్తుంది. అప్పటి శిల్పి అనేవాడు ఎంతో జ్ఞానం కలిగి ఉండేవాడు. అతడికి శిల్పశాస్త్రం, మానతార మీద ఎంతో పట్టు ఉండేది. వీటి ఆధారంగా ఓ శిల్పాన్ని చెక్కేందుకు ఎటువంటి శిలను ఎంచుకోవాలి, ఏ కొలతలు ఆధారంగా శిల్పం తయారుచేయాలి. అనే వాటిని అనుసరిస్తూ శిల్పి తన పనితనాన్ని చూపాలి. అందులో మరో అంశం. కాకతీయుల శిల్ప రీతి ఉంది కదా అది ముఖ్యంగా చాళుక్యులది. వారి రీతినే కాకతీయులు కొనసాగించారు. కానీ దీనంతటికీ కాకతీయుల శిల్ప రీతిగా పేరు పొందింది. కళ్యాణీ చాళుక్యుల నుండీ వచ్చిన ఈ కళ నెమ్మదిగా కాకతీయ కళగా రూపు దిద్దుకుంది. ఈ విషయంగా ఇంకా రీసెచ్ చేస్తున్నాను.

ఈ శిల్పాల అన్వేషణలో మీకు కలిగే సందేహాలను, సలహాలను ఎవరి దగ్గర నివృత్తి చేసుకుంటారు.
ఎక్కువ నాకు కలిగే సందేహాలను పుస్తకాల ద్వారానే నివృత్తి చేసుకుంటాను. హెరిక్లేజన్ కల్చర్ గ్రూప్ ఆఫ్ ఇండియా అని ఫేస్ బుక్ పేజ్‌లో పోస్ట్ చేస్తుంటాను. అలానే దేనిమీైదెనా ప్రభావం అనేది ఉండకూడదు. మత పరైమెన, ప్రాంత పరైవెునవి. కానీ ఈ చరిత్ర పునాదులపై చాలా వరకూ జైన దేవాలయాలను, హిందూ దేవాలయాలుగా మార్చేశారు. అటువంటివి వరంగల్ జిల్లాలో చాలానే ఉన్నాయి.

వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ బిల్డ్గింగ్ కాంప్లెక్స్‌లో ఉండే  మ్యూజియమ్ ముందు భాగంలో ఎక్కడినుండీ తీసుకువచ్చారో గానీ జైన ప్రతిమను అమ్మవారిగా మార్చి ప్రతిష్టించేసారు. అలాగే పద్మాక్షి టెంపుల్ వరంగల్ కూడా ఆకోవలోకే  వస్తుంది. ఆ చుట్టుపక్కల ఏ శిల్పాైలైనా జైన సాంప్రదాయంలోనే ఉంటాయి. ఎవరు అధికారంలో ఉన్నా ఉదాహరణకు ముస్లిములు ఉంటే దర్గాలు గాను, హిందు రాజులు అధికారంలో ఉంటే దేవాలయాలుగానూ మార్చేసారు. దీనివలన ఏమౌతుంది. వాస్తవాలు మరుగున పడిపోయి. కల్పితాలు మాత్రమే చరిత్రగా, సాక్షాలుగా మిగులుతున్నాయి. ఇలా వరంగల్ ప్రాంతానికే పరిమితమై ఉండకుండా మొత్తం మన శిల్ప సంపద ఉన్న ప్రదేశాలన్నీ చూసి పరిశోదిస్తే ఇంకా అంతుచిక్కని అంశాలెన్నో తెలిసే అవకాశం లేకపోలేదు.

Related News