'Siksha'na

‘శిక్ష’ణ 

Updated By ManamSat, 09/08/2018 - 00:06

imageపిల్లల్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి తరగతి గదిలో ‘బడితె’ను ఉపయోగించే రోజులు వెళ్ళిపోయాయి. ‘దండం దశగుణ భవేత్’ అనే మాటకు కాలం చెల్లిపోయింది. గురువు ఆగ్రహం విద్యార్థి జీవితానికి దారిదీపమయ్యే రోజులు పోయి, పిల్లల మీద అమానుషమైన హింసకు పాల్పడే వ్యక్తిత్వలోపాలే విజృంభిస్తున్న రోజులు వచ్చాయి. దాంతో సహజంగానే బడిలో ‘దండన’కు అర్థం మారిపోయింది. అయితే దండన దీవెనగా లభించే రోజుల్లో ‘శిక్షణ’లో శిక్షలన్నీ ఆప్యాయతానురాగాల స్పర్శనే కలిగి ఉండేవి. అమ్మా,నాన్నల తరువాత మన చిన్ననాటి జ్ఞాపకాల్లో సజీవంగా ఉండిపోయి, మన మాటల్లో, మన చేతల్లో మనకు తెలియకుండానే అనుక్షణం మనల్ని నడిపించేదెవరో తెలుసా.., మన తొలి టీచర్. మొదటి పలక, బలపం, మనం దిద్దిన మొదటి అక్షరం, మన మొదటి గోడకుర్చీ, మన మొదటి గుంజీలు... నిజంగా ఎంత తీయని జ్ఞాపకాలు. అమ్మ చేతి గోరుముద్దలాగా, నాన్న చిటికెన వేలిని పట్టుకుని వేసిన తొలి అడుగులాగా, టీచర్ గుంజీలు తీయించడం, ఒకటికి వందసార్లు రాసిందే రాయించడం, మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం కూడా ఒక తీయటి జ్ఞాపకమే. మన పిల్లచేష్టల్ని జీవితాంతం సజీవం చేసే సంజీవని లాంటిదే ఆ జ్ఞాపకం! మనం మళ్ళీ చిన్నపిల్లలమైపోతే తప్పకుండా ఇలాంటి ముద్దు ముద్దు ‘శిక్ష’ణనే కోరుకుంటాం కదూ! ఇదిగో ఇక్కడ అలాంటి తీయటి శిక్షల గురించి మరొక్కసారి మాట్లాడుకుందాం.

యోగ నిద్ర
బళ్ళో హిస్టరీ టీచర్ పాఠం చెబుతుంటాడు. మనం వింటూ ఉంటాం. గజనీ మహమ్మదు దండయాత్ర చేస్తూనే ఉంటాడు. మన టీచరు అనర్గళంగా పాఠం చెబుతూనే ఉంటాడు. అప్పుడు చూడాలి ముందు వరసలో కూర్చున్న మీ ముఖాన్ని! ఒళ్లంతా చెవులు, కళ్ళూ చేసుకుని పాఠం వింటున్నట్టు నటిస్తూనే ఉంటారు మీరు. మీ అభిమాన హీరోలందరూ ఆ క్షణంలో మీ నటన ముందు దిగదుడుపే! కానీ పాపం, ఎంత సేపని మీరు మాత్రం నటించగలరు, ఒక పావుగంట తరువాత మీరు కళ్ళు తెరుచుకునే నిద్ర పోతుంటారు. మరో పావుగంట తరువాత కళ్ళు అలసిపోతాయి, రెప్పలు వాలి పోతాయి. ఇక అప్పుడు మీ నెత్తి మీద ఠపీమని ఒక మొట్టికాయ పడుతుంది. నషాళం దిమ్మదిరిగి పోతుంది. కళ్ళవెంట నీళ్ళు ఉబుకుతాయి. ‘లేరా.., మోకాళ్ళ మీద నిలబడు...’ టీచరు ఆజ్ఞతో మీ యోగనిద్రకు తిలోదకాలివ్వక తప్పదు కదా! ఇది జీవితంలో ప్రతిఒక్కరికీ ఒక్కసారైనా అనుభవంలోకి వచ్చే ఉంటుంది కదూ!

గ్రౌండ్ చుట్టూ ప్రదక్షిణ
గంట మోగింది, మైదానంలోకి వచ్చి నిలబడాలి. మీ ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ పిల్లల్ని గ్రూపులు గ్రూపులుగా నిలబెడుతున్నారు. మీ గ్రూపు బ్యాడ్మింటన్ ఆడాలి. ఇవాళ్రేపు ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు క్రీడల్లో రాణించడం కూడా ఒక అర్హతగా మారుతోంది కదూ! మీక్కూడా ఆటలంటే చాలా ఇష్టం. అయితే మీ పిటి టీచర్ చండామార్కుల వారి వారసుడు. దూర్వాస మహాముని దగ్గర శిష్యరికం చేసినట్టు ఆయనకు కోపం ముక్కు మీదే ఉంటుంది. ఆ రోజు మీకు బద్దకంగా ఉంది. బాడ్మింటన్‌కు వెళ్ళాలని అనిపించడం లేదు. కాదు, కూడదంటే టీచర్ ఊరుకోడు. ఏదో మొక్కుబడిగా మీరు గేమ్‌లో ఆడడం మొదలెడతారు. మీరు దారి తప్పిన విషయం మీ దూర్వాసునికి వెంటనే అర్థమై పోతుంది. దగ్గరికి పిలిచి ముక్కచీవాట్లు పెడతాడు. మైదానం చుట్టూ యాభైసార్లు పరిగెట్టాలంటూ హుకుం జారీ చేస్తాడు. దాంతో మీ నెత్తిన పిడుగు పడుతుంది. ఇక ప్రదక్షిణాలు షురూ! మరపుతెరల మాటు మణగని ఆ సంఘటన ఇప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా, అప్పటి కాళ్ళనొప్పులు మళ్ళీ తీయగా సలపరిస్తాయి కదూ!

రామకోటి
ఎన్నిసార్లు చెప్పినా సరే, మీరు ‘శారద’ అనే పదాన్ని ‘షారద’ అనే పలుకుతున్నారు, ఎన్నిసార్లు దిద్దించినా సరే, మీరు ‘సిఒటి’ కాట్ అని రాయమంటే, ‘సిఎటి’ క్యాట్ అనే రాస్తున్నారు. మీ తెలుగు టీచర్‌కి, ఇంగ్లీష్ టీచర్‌కి ఒకేసారి కోపం నషాళానికంటింది. ఇక శారదను వందసార్లు అప్పజెప్పాల్సి వచ్చింది. సిఒటి కాట్‌ను వెయ్యిసార్లు తిరగరాయాల్సి వచ్చింది. అన్నట్టు మీ పాప పేరు ‘శారదే’ కదూ! పాపను పిలిచినప్పుడల్లా, మంచాన్ని చూసినప్పుడల్లా తిరగరాత గుర్తుకొస్తూనే ఉంటుంది.. మీ పెదాల మీద చిరునవ్వు వికసిస్తూనే ఉంటుంది.

Related News