Prepare vehicles for Brahmotsavas

బ్రహ్మోత్సవాలకు వాహనాలు సిద్ధం

Updated By ManamSat, 09/08/2018 - 23:18
  • వాహనాల్లో బ్రహ్మాండనాయకుని ఊరేగింపు

  • మెరుగుపట్టి తళతళ మెరిపించిన కార్మికులు

  • గరుడవాహన సేవకు రానున్న గొడుగులు 

imageతిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు వాహనాలన్నీ సిద్ధమయ్యాయి. ఈనెల 13వ తేదీ నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాలలో అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని ఊరేగించడానికి అన్ని వాహనాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. కార్మికులు కష్టపడి.. అన్ని వాహనాలకు మెరుగుపెట్టి తళతళలాడేలా చేశారు. వాహనాలు తిరువీధుల్లో తిరిగే సమయంలో, అక్కడి దీపాల కాంతిలో మరింతగా మెరుస్తూ భక్తులకు దర్శనమిస్తుంటాయి. ఈ వాహనాల్లో  గరుడ వాహనానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.

బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజున... అంటే ఈనెల 17వ తేదీన రాత్రి ఏడు గంటలకు గరుడవాహన సేవ ప్రారంభమవుతుంది. శ్రీవారు మలయప్పస్వామి రూపంలో తిరువీధుల్లో తిరుగుతారు. పౌరాణిక నేపథ్యం ప్రకారం 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడసేవ ప్రాముఖ్యత సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తానుimage దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలుగుతాయని స్వామివారి భక్తకోటికి తెలియజేసే వాహనసేవ అని అంటారు. అదేవిధంగా శ్రీహరికి అత్యంత సన్నిహతుడైన ఆదిశేషుని కూడా తన వాహనంగా చేసుకుని పెద్దశేష వాహనంపై ఊరేగుతారు. ఆదిశేషుడు రామావతారంలో లక్ష్మణుడిగాను, కృష్ణావతారంలో బలరాముడిగా స్వామికి సన్నిహితులుగా ఉండేవారట. చిన్న శేషవాహనాన్ని వాసుకిగా భావిస్తారు. భక్తులకు కోరుకున్న ఫలాలను అందజేసే కల్పవృక్ష వాహనాలలో 15వ తేదీన ఉదయం స్వామివారు విహరించనున్నారు. అదేవిధంగాశ్రీవారు సకల దిక్పాలకులకు రారాజని తెలియజేసేలా సర్వభూపాల ఊహనంపై 16వ తేదీన రాత్రి 8 గంటలకు ఊరేగుతారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు కావడంతో గురుశిష్యతత్వాన్ని బోధించేందుకు హనుమంత వాహనంపై ఈనెల 18వతేదీన ఉదయం ఊరేగనున్నారు.

సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శించుకున్నవారికి ఆరోగ్య, విద్య, ఐశ్వర్యం, సంతానం లాంటి ఫలాలను imageసూర్యదేవుని అనుగ్రహం ద్వారా అందుతాయి. అదే విధంగా చంద్రప్రభ వాహనంలో స్వామి వారిని దర్శించుకునే భక్తుల హృదయాల నుంచి ఆనందరసం స్రవిస్తుంది. శ్రీవారి రథోత్సవాన్ని తిలకించే భక్తులకు స్థూలశరీరం వేరు.. సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. స్వామివారు అశ్వ వాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని అశ్వవాహనం తెలియజేస్తుంది. శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులు అందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యి, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. ఇవికాకుండా చిన్న శేష వాహనం, హంసవాహనం, సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం, మోహినీ అవతారం, స్వర్ణరథం సేవలు ఉంటాయి. ఒక్కో వాహనాన్ని దర్శించుకునే భక్తులు తదనుగుణంగా పుణ్య ఫలాలను పొందుతారు.

ఈ వాహనాలన్నింటినీ గత కొన్ని రోజులుగా సిద్ధం చేస్తూ వచ్చారు. శనివారం నాటికి అన్ని వాహనాలు శ్రీవారి సేవలకు సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దారు. గరుడ వాహనం రోజున స్వామివారికి కొత్త గొడుగులు వివిధ ప్రాంతాల నుంచి వస్తాయి. గతంలో చెన్నై నుంచి ఒక ఛారిటీ సంస్థ గొడుగులను తీసుకుని వస్తుండగా, గత కొన్నేళ్లుగా పలు సంస్థలు గొడుగులను పంపుతున్నాయి. 

Related News