Have an advanced strategy

ముందస్తు వ్యూహం కలిసొచ్చేనా... 

Updated By ManamTue, 09/11/2018 - 01:29

imageఊహించినట్లుగానే తెలం గాణ శాసనసభ రద్దయింది. గురువారం ఉదయం నుంచి, మధ్యాహ్నం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టేవరకు క్రమ పద్ధతిలో పరి ణామాలు వేగంగా జరిగిపొ యాయి. సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగిన క్యా బినెట్ సమావేశం శాసనసభ రద్దుకు సంబంధించి ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించడం, దాన్ని కేసీఆర్ ఒక్కరే ప్రిన్సి పల్ సెక్రెటరీతో కలిసి గవర్నరుకు అందజేయడం, గవర్నరు వెంటనే దాన్ని ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. వెనువెంటనే తెలంగాణ కోసం అమరులైన వీరులను స్మరించుకొని, ఆ తరువాత కేసీఆర్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ ప్రెస్‌మీట్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనేక విషయాలు వెల్లడించారు. విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో చెణుకులు విసురుతూ సమాధానాలిచ్చారు. బీజేపీతో ఎట్టి పరిస్థితిలోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. మజ్లిస్ పార్టీతో స్నేహ పూరితమైన అవగాహన ఉంటుందని స్పష్టం చేశారు. నూటికి నూరుపాళ్ళూ తమది సెక్యులర్ పార్టీ అని, అందులో ఎలాంటి అను మానాలకూ ఆస్కారం లేదన్నారు. మోదీతో దోస్తానా గురించి ప్రస్తావించగా, ఒక ముఖ్యమంత్రి గా ప్రధానమంత్రితో సవాలక్ష పనులుంటాయని, దాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబం దాలుగానే చూడాలి తప్ప, బీజేపీతో అంటకాగుతున్నట్లు ఊహించుకోవడం సరికాదన్నారు.

image105 మందితో తొలిజాబితా ప్రకటించిన కేసీఆర్ మరో పద్నాలుగు మంది జాబితా త్వరలోనే ప్రక టిస్తామన్నారు. అభ్యర్థుల జాబితా దాదాపు పాతదే అయినా అక్కడక్కడా కొన్ని మార్పులు చేశా రు కేసీయార్. బాబూమోహన్, నల్లాల ఓదేలు లాంటి వాళ్ళను పూర్తిగా పక్కన పెట్టడం, బాల్క సుమన్‌ను పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీకి పంపాలనుకోవడం, జర్నలిస్టు మిత్రుడు క్రాంతి కిరణ్‌కు అసెంబ్లీ టికెటు ్టకేటాయించడం, విమర్శలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ అవకాశం కల్పించడం లాంటి పరిణామాలు తొలిజాబితాలో చెప్పుకోదగ్గవి. ఈ విధంగా  ఏడున హుస్నాబాద్‌లో జరిగిన ఆశీర్వాద సభ ద్వారా కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. ముందుగా ప్రకటించి నట్లుగానే యాబై రోజుల్లో వందసభలు నిర్వహిస్తామని, ప్రతిసభలో తాను స్వయంగా పాల్గొని ఈ నాలుగున్నర సంవత్సరాల తమ పరిపాలనా కాలంలో ఏమేమి చేసిందీ, ముందుముందు ఏమి చెయ్యబోయేదీ ప్రజలకు వివరిస్తానన్నారు. కొంగరకలాన్ సభయినా, శాసనసభ రద్దయినా ఏదో ఒక్కపూటలో, ఒక్కరోజులో సంభవించిన పరిణామాలు, నిర్ణయాలు కావు. మూడునాలుగు నెలల ముందునుండే పకడ్బందీ ప్రణాళిక ప్రకారం కేసీఆర్ పావులు కది పారు. ప్రత్యర్ధి పార్టీలు ఊహించని రీతిలో ప్రణాళికలు రూపొందించి ఆచరణలో పెట్టారు. నిజా నికి కేసీఆర్ మనసులో ఏముటుందో, ఎప్పుడు ఏంపని చేస్తారో ఎప్పుడూ పక్కన తిరిగే మంత్రు లకు, అంతరంగికులకు కూడా తెలియదంటే అతిశయోక్తికాదు.

నిజానికి శాసనసభ రద్దుకు ఇప్పు డొచ్చిన తొందరేమీలేదు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ అనిశ్చితీ నెలకొనిలేదు. ముందస్తు ఎన్ని కలకు ఏ రాజకీయ పార్టీ కూడా డిమాండ్ చేయడంలేదు. ముఖ్యమంత్రిపై ఎవరైనా తిరుగు బాటు చేస్తారన్న భయమూ లేదు. ఏవిధంగానూ, ఎలాంటి రాజకీయ సంక్షోభం లేదు. దాదాపు మరో తొమ్మిది నెలల పాటు నిక్షేపంగా అధికారంలో కొనసాగే అవకాశం ఉంది. అదీగాక జమిలి ఎన్నికలకు జైకొట్టి ఏకకాలంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎన్నికల ఖర్చు గణనీ యంగా తగ్గుతుందని కూడా చెప్పిన కేసీఆర్ ముందన ఎన్నికలకు సై అంటూ శాసనసభను రద్దుచేసి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగడానికే నిర్ణయించుకున్నారంటే ఎలాంటి వ్యూహం లేకుండా ఉంటుందా? ప్రత్యర్థి పార్టీలు ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకోవడం, మాటల తూటాలతో నోర్లు మూయించడం, రిస్క్ ఉంటుందని తెలిసినా ఎదుర్కోడానికి సిద్ధపడి ముందుకు పోవడం ఆయన నైజం. ఈ నైజమే ఆయన్నొక విలక్షణమైన వ్యక్తిగా నిలబెట్టిందంటే అతి శయోక్తికాదు. ఇదిలా ఉంటే, విపక్షాల వాదన మరోలా ఉంది.

ఓటమి భయంతోనే కేసీఆర్ ముందస్తురాగం అందుకున్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వంద సీట్లు గ్యారంటీ అని జబ్బలు చరుచుకుంటున్నవారు, ఐదేళ్ళ పూర్తికాలం పాలించమని కట్టబెట్టిన అధికారాన్ని వదులు కొని ముందస్తుకు ఎందుకు వెళుతున్నారని, ఇది ప్రజలను వంచించడం, ప్రజాధనం దుర్విని యోగం చేయడం కాదా? అన్నది వారి వాదన. టీఆర్‌ఎస్‌కూ, బీజేపీకు లోపాయికారీ అవగాహన ఏదో ఉందని, లేదని నిరూపితం కావాలంటే, కేసీఆర్‌కు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వకుండా గవర్నర్ పాలన విధించాలని కూడా కొందరంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ ముందస్తు వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో కాంగ్రెస్, విపక్షాల ఐక్యపోరాటం ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాల్సిందే.

- యండి.ఉస్మాన్ ఖాన్ 
సీనియర్ జర్నలిస్టు

Related News