Kondagattu bus accident

ఆ ఊళ్లకు దసరా లేదు

Updated By ManamThu, 10/18/2018 - 00:55
  • కళ్లముందే కదలాడుతున్న ‘కొండగట్టు’ ప్రమాదం

  • ఆరు గ్రామాల్లో కానరాని సద్దుల బతుకమ్మ..

  • అంతటా నిశ్శబ్ద వాతావరణం.. కదిలిస్తే క న్నీటి గాధలు..

  • కేంద్రం రూ.1.49 కోట్లు సహాయం 

  • పంపిణీకి అడ్డంకిగా ఎన్నికల కోడ్ 

  • ఎన్నికల కమిషన్‌కు జగిత్యాల ‘కలెక్టర్’ లేఖ

kondagattu-bus-accidentగతేడాది దసరా, బతుకమ్మ సంబురాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న ఆ ఊర్లలో ఇప్పుడు పండుగ సందడే కనిపించడం లేదు. ఆ ఆరు గ్రామాల్లో ఎవరూ పండుగలను జరుపుకోవడం లేదు.  ఒక్క ఇంటి నుండి కూడా సద్దుల బతుకమ్మ వెళ్లలేదు. గ్రామ చావడి, చెరువుగట్ల వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలు కానరాలేదు. ఎటు చూసినా విషాద ఛాయలు. నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. ‘కొండగట్టు’ ప్రమాద ఘటనను ఆ ఊర్లు మర్చిపోలేకున్నాయి.  ఎవరినైనా కదిలించినా వారి కంట కన్నీటి ధారే కనిపిస్తోంది. ఆప్తులను కోల్పోయి కొందరు.. నెత్తుటి గాయాలతో ఇంకొందరు ధీనంగా కనిపిస్తున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన ఆ  ఐదు గ్రామాల ప్రజల కన్నీటి గాధలపై ప్రత్యేక కథనం. 

కరీంనగర్ ప్రత్యేక ప్రతినిధి, మనం న్యూస్: జగిత్యాల జిల్లా కొండగట్టు బస్సు ప్రమాద ఘటనను ఆ ఆరు గ్రామాల ప్రజలు మరిచిపోలేదు. ప్రమాదంలో కొల్పోయిన కుటుంబసభ్యుల కదలికలే వారి కళ్ల ముందు కనిపిస్తున్నాయి. కొండగట్టు అంజన్న దర్శన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆర్టీసి బస్సు ఘాట్ రోడ్డులో బస్సు బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో  63 మంది చనిపోగా, మరో 43 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన 51 మంది మృత్యువాతకు గురయ్యారు. డబ్బు తిమ్మయ్యపల్లి, రాంసాగర్, హిమ్మత్‌రావుపేట్, శనివారంపేట్, తిరుమలాపూర్, చందులపల్లి, కోనాపూర్ గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మరో 12 మంది ఉన్నారు. క్షగాత్రుల్లో 43 మందికి పైగా నేటికి నెత్తుటి గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దేశ వ్యాప్తంగా దసరా పండుగ సంబరాల్లో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్న సమయంలో ఆ ఐదారు ఊర్ల ప్రజలు మాత్రం విషాదంలో మునిగి తన వాళ్లను, బస్సు ప్రమాద నెత్తుటి గాయాలను నెమరు వేసుకుంటూ పండుగ వాతావరణానికి దూరంగా ఉన్నారు. ఆ ఊర్లలో నిశ్శబ్ద వాతవరణం కనిపిస్తోంది. ఊరి చవడి వద్ద సంబరాలు లేవు. వేడుకలు లేవు. సంబరాలు, వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనే వారంతా కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయారు. ఇక మిగిలిన మేము ఎందుకు, ఎవరి కోసం సంబరాలు చేసుకోవాలే అని ఆవేదన గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఏ ఇంటిలో తొంగి చూసిన ఆవేదనే కనిపిస్తోంది. విషాదంలో సుడులు తిరుగుతున్న కన్నీటి గాధలేకనిపిస్తున్నాయి. మరి కొన్ని క్షణాల్లో ఇల్లు చేరుకుంటావునుకున్నా తమ వారంతా కళ్లముందే తనువులు చాలిస్తుంటే చూసిన మాకు ఆ కదలికలే కనిపిస్తున్నాయని బోరున విలపిస్తున్నారు. ఆపదలు దూరం చూస్తాడని నమ్మి  దేవుడి దర్శనానికి పోతే ఆ దేవుడే బస్సు రూపంలో కభళిస్తాడని కలలో కూడా అనుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. నా అనే వారులేక అందరినీ పోగుట్టుకుని వట్టి చేతులతో ఇలా ఉన్నామని వారి నిస్సాహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పెద్దవారు లేక ఇంటి కల కోల్పోచిందని, ఇక పండుగ చేసుకునేదెలా అని విలపిస్తున్నారు.

కేంద్రం నుండి రూ.1.49 కోట్లు సహాయం విడుదల
దేశంలోనే అతి పెద్ద బస్సు ప్రమాదంగా గుర్తించిన జగిత్యాల జిల్లా కొండగట్టు బస్సు ప్రమాద బాధితలను ఆదుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రమాదంలో చనిపోయిన వారికి ఒక్కోక్కరికీ రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రూ.1.49 కోట్ల ఈ సహాయనిధిని  ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ పరిహారం అందించేందుకు కొంత సమయం పడుతోంది.

పరిహారం పంపిణీకి కలెక్టర్ ప్రయత్నం
కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతిచెందిన  బాధితులకు తెలంగాణ ప్రభుత్వం నుండి అందాల్సిన పరిహారం కోసం జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పరిహారం అందించేందుకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు పరిహారం అందజేతలో ఎన్నికల కోడ్‌ను మినహయింపు ఇవ్వాలని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన ఆవసరాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను తక్షణం ఆదుకునేందుకు పరిహారం అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. 

మేం భార్యభర్తలమిద్దరం కొండగట్టుకు పోయి అంజన్న దర్శనం చేసుకున్నాం. మా ఇంట అంతా మంచి జరగాలని కోరుకున్నాం. అందరం బాగుండాలని పాడిపంట చేతికిరావాలని మొక్కుకున్నం. అంజన్న ఆశీస్సులు తీసుకుని బస్సులో తిరుగు ప్రయాణం ఆయ్యాం. కొద్ది క్షణాల్లోనే బస్సు రూపంలో మృత్యువు కభలించింది.  నా భర్త స్వామి నా కళ్ల ముందే కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. నాకు కాలు చేతుల ఎములు విరిగిపోయాయి. 20 రోజులు ఆసుపత్తిలో చికిత్స పొందిన... వైద్యానికి  సర్కారు నుండి డబ్బులు రావడం లేదని ఆస్పత్రులోళ్లు నిన్ననే ఇంటికి పంపించారు.  నా భర్త స్వామికి దసరా పండుగ బాగా ఇష్టం.. బతుకమ్మ పండుగ వచ్చిందంటే.. బలే సంబరపడేవాడు.  ఇప్పుడు ఆ సంబరాలు చేసేవాడే లేడు. ఆయన జ్ఞానకాలే కన్ను కదిలిస్తున్నాయి. నేను పెద్ద దిక్కు కోల్పోయాను.  పని చేసే స్థితిలో లేను. నా ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారు. అందరి మొఖం చూస్తున్నారు.
ద్యాగాల అనిత, రాంసాగర్.

పోయిన పండుగ నాడు అమ్మానాన్నలు ఉన్నారు. బతుకమ్మ పండుగ, దసరా పండుగకు మా అక్క, చెల్లలను తోలుకువచ్చి.. వారికి కొత్త బట్టలు పెట్టించారు.  ఇంటికి ఆడబిడ్డలే అన్నింటికీ ముందుండాలని చెప్పేవారు. ఏనాడు ఆడబిడ్డల్ని మరిచిపోవద్దు బిడ్డా.. నాకు మరిమరి చెప్పారు.. ఆనాడు వారెందుకు నాకు అలా చెప్పారో అర్థం కాలేదు.. ఇప్పుడు అర్థం అయింది. ఈ పండుగ నాటికి వారు లేరు.. బస్సు ప్రమాదంలో అమ్మానాన్నలు పోయారు.. పండుగ సంబరం లేదు. ఆడబిడ్డలను ఈ సారీ తీసుకువచ్చేవారు లేరు. ఇంటి పెద్ద దిక్కును కోల్పాను.
కాశీరాం, డబ్బుతిమ్మయ్యపల్లి.



మమ్మల్నీ చంపెయ్యండి

Updated By ManamMon, 10/15/2018 - 03:42
  • కొండగట్టు బస్సు ప్రమాద బాధితుల రోదనలు

  • కాళ్లుచేతులిరిగి.. ఎముకలు నలిగి జీవచ్ఛవాలుగా..

  • అందని పరిహారం.. వైద్య సేవలు అంతంతే

  • కొండగట్టు బాధితులకు  ‘కోడ్’ అడ్డంకీ

  • అపన్న హస్తం కోసం 43 కుటుంబాల ఎదురుచూపులు

kondaకరీంనగర్ ప్రత్యేక ప్రతినిధి, మనం న్యూస్: కొండగట్టు బస్సు ప్రమాదం వంద మంది కుటుంబాలను వల్లకాడు చేసింది.  ఐదుఊర్లను స్మశానం వాటికలుగా మార్చేసింది. ఈ బస్సు ప్రమాదంలో 63 మంది అక్కడిక్కడే చనిపోయిండ్రు. ఇందులో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన వారు 53 మంది ఉన్నారు. మరో 43 మంది గాయాలపాలైన నిరాశ్రయలున్నారు.  వారందరినీ నాయకులు, అధికారులు  వైద్యం కోసం పలు ఆస్పత్రుల్లోకి పంపించారు. అన్ని చూసుకుంటామన్నారు.. కానీ వారందరూ ఇప్పుడు కానరావడం లేదని  బాధితులు బోరున విలపిస్తున్నారు. తీవ్రగాయాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతునోళ్లకు ఇక వైద్య సేవలు అందించలేం అంటూ.. వైద్యులు, ఆస్పత్రుల నిర్వాహకులు చేతులెత్తేసారు. చేతిలో చిల్లిగవ్వలేక అప్పుపుట్టక మాయని గాయాలు, అతకని ఎముకలతో బాధితులు ఇండ్లలో అవస్థలు పడుతున్నరు. ఈ నెత్తుటి గాయానికి నెల రోజులు కావస్తున్నా.. కానరాని వారు కరువయ్యారు.  ఆర్థిక సహాయం అందించి అండగా ఉంటామని హామీలిచ్చిన రాజకీయ నేతలు కనుమరుగయ్యారు. క్షతగాత్రులైన 43 మంది బాధితులలో ఎవరిని కదిలించినా వారి  ధీన గాధ ఇలానే ఉంది. 

పరిహారానికి ‘కోడ్’ అడ్డు
కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు ఎన్నికల కోడ్ అండంకిగా మారింది. వారి పాలిట  ఎన్నికలు ఓ శాపంగా మారాయి. బస్సు ప్రమాదంలో మరణించిన, గాయ పడ్డ కుటుంబాలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరుపున రూ.5లక్షలు, ఆర్టీసీ తరుపున రూ.3 లక్షలు పరిహారం అందించేందుకు హమీలు ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. మంత్రులు హరీశ్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎంపీలు కవిత, వినోద కుమార్ కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను ఆదుకుంటామని హమీ ఇచ్చారు. వైద్య సేవల కోసం తక్షణం రూ.20 వేల చొప్పున ఆర్థిన సహాయం అందించి చేతులు దులుపుకున్నారు. ఈ నెత్తుటి గాయమై నెల రోజులు కావస్తోంది.. నేటికీ  పరిహారం ఆందలేదు. కొందరికీ ఆర్టీసి సంస్థ నుండి పరిహారం ఆందినా.. మరికొందరికీ అందలేదు.. సర్కారు నుండి పరిహరం అందలేదు.. ఇదేంటని అడిగితే.. ఎన్నికల కోడ్ ఉంది.. ఆతర్వాత ఇస్తామని చేతులేత్తేసిండ్రు.. దీంతో దిక్కుతోచని దుస్థితిలో కొండగట్టు బాధితులు అపన్న హస్తాల కోసం ఎదురు చూస్తున్నారు.                                                                                                             
అయ్యలారా.. అమ్మలారా  మమ్మల్నీ మరిచిపోయి ఉంటరు.. బాంచెన్ మీ కాల్మొక్తం... బస్సు ప్రమాదంలో బతికి చచ్చినోళ్లం..అయ్యో రామా... మాకు చావన్నరాదాయే.. మావాళ్లందరినీ పోగుట్టుకున్నోళ్లం.. మాకెవరూలేనోళ్లం.. అందరు ఉన్న అనాధలం.. కాళ్లుచేతులు విరిగి, చెవులు, ముక్కులు తెగిపడి.. పక్కటెముకలు.. ఎన్నుపూసబొక్కలు విరిగి నెల రోజులుగా రక్తపు మరకలతో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొండగట్టు బస్సు బాధితులం.. అయ్యలారా.. నొప్పులు భరించలేకపోతున్నం.. అవస్థలు తట్టుకోలేకపోతున్నం.. మీకు దండం పెడుతం మాకు విషమిచ్చి చంపెయ్యండీ.. హాయిగా చచ్చి మీ కడుపున పుడుతాం అంటూ  కొండగట్టు బస్సు ప్రమాద బాధితుల అరణ్యరోదణలు మార్మోగుతున్నాయి.

lachavaబస్సు ప్రమాదంలో మా అమ్మకు  ఒకే కాలు నాలుగు చోట్ల విరిగిపోయింది. ఇప్పటి దాకా లచ్చ అప్పుతెచ్చి పట్నంలో వైద్యం చేయించనం.. ఇంకా ఎముకలు అతకలేదు.. రక్తం కారడం మానలేదు.. పట్నం నిమ్స్ దవఖాన్లలో చాన రోజులున్నా.. ఇక పైల్లేవని డాక్టర్లు ఇంటికెళ్లగొట్టిర్లు.. నా కాలు తీసేసిండ్రు.. తలకు పెద్ద గాయమైంది.. చచ్చినా బావుండు..
లచ్చవ్వ, శనివారంపేట

అయ్యా.. నా నడుమిరిగింది.. పక్కటెముకలు ఇరిగినయి. నాతో పాటు మా అమ్మకు చెప్పుకోని దెబ్బలుvijaya తగిలినయి.. ఆమె శరీరంలోని బొక్కలన్నీ విరిగినయి. మా అమ్మను వైద్యం కోసం కన్నారం, పట్నం దావఖాన్లకు తీసుపోయిండ్రు. నాయకులెవరో  డాక్టర్లకు రూ.20 వేలు ఇచ్చండ్రు పోయిండ్రు.. మా వద్ద పైసల్లేవని వైద్యం ఆపేసిండ్రు.. ఇంటికి పంపించుండ్రు.. మా చేతిలో చిల్లి గవ్వ లేక ఇంటికాడ గీ.. మంచం మీద బ్రతికి చచ్చిపోతున్న..   విజయ, డబ్బు తిమ్మయ్యపల్లి

malammaసర్కారోళ్లు పైసలిత్తలేరని. డాక్టర్లు ఇంటికి పంపించుండ్రు.. దేవుని దర్శనానికి పోతే.. నాకు, నా కోడలుకు కాళ్లు చేతులు పోయి నయి. మా శరీరమంతా గాయాలే.. బొక్కలు ఇరిగిన చోటే ఇరిగినయి.. ఏం చేయాలే.. అచ్చన్నర అప్పుల పాలైన.. అయినా.. మా పాణం బాగాలేదాయే.. మేమెంటా బ్రతికేదీ..
         మల్లమ్మ, హిమ్మత్రావుపేట



కొండగట్టు ప్రమాదంపై హెచ్‌ఆర్సీలో పిటిషన్

Updated By ManamWed, 09/12/2018 - 13:44
Petition Against kondagattu bus accident In HRC

హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కొండగట్టు ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై న్యాయవాది అరుణ్ కుమార్ బుధవారం మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని  అరుణ్ కుమార్.. ఆ ఫిర్యాదులో మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. మరోవైపు కొండగట్టు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరింది. 



ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం

Updated By ManamTue, 09/11/2018 - 16:19
  • 51కి పెరిగిన మృతుల సంఖ్య

kondagattu bus accident: For the first time in the history of RTCకొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన ఆర్టీసీ చరిత్రలోనే అది పెద్దదిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 51మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 32మంది మహిళలు, 15మంది పురుషులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. గాయపడ్డ మరో 37మందిని  జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స అందచేస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందినవారు ఉన్నారు. బస్సు డ్రైవర్ శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

Kondagattu bus accident: 51 dead, 37 injured in Telangana

ఆంజనేయస్వామికి ప్రీతిపాత్రమైన మంగళవారం కావడంతో కొండగట్టుపైన ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి భారీగా వెళ్లిన భక్తులు త్వరగా రావాలనే తొందరలో సానివారంపేట నుండి జగిత్యాల వస్తున్న ఆర్టీసీ బస్సులో  పరిమితికి మించి ఎక్కారు. తిరుగు ప్రయాణీకులతో ఘాట్ రోడ్‌పై జగిత్యాల వస్తున్న ఆ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద కుదుపుకు గురవడంతో ప్రయాణీకులు డ్రైవర్ వైపుకి ఒరగటంతో బస్సు అదుపు తప్పి సుమారు 30 అడుగుల లోతులో ఘాట్ రోడ్డు నుండి పడిపోయింది. అయితే బస్సు రాంగ్ రూట్‌లో రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.

బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతోనే ప్రమాదం జరిగిందని, మరోవైపు బస్సు బ్రేకులు కూడా ఫెయిల్ అవడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 88 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు ఉండడంతో ఒకరి మీద మరొకరు పడటంతో ఊపిరాడక అధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ మృతుల్లో 35మందిని పోలీసులు గుర్తించారు.

మృతుల వివరాలు:

1. లాంబ కోటవ్వ 65 ( హిమత్ రావుపేట)
2. బందం లసవ్వ 65 ( ముత్యంపేట)
3. బొల్లారం బాబు 54 ( శనివారంపేట)
4. లైసెట్టి చంద్రయ్య 45 (శనివారంపేట)
5. ఎండికల ఎంకవ్వ ( శనివారంపేట)
6.ఇంద్రికాల సుమ 30 (శనివారంపేట)
7. రాజవ్వ 56 (డబ్బు తిమ్మయ్యపల్లి)
8. ఉత్తమ్ నందిని (కొనపూర్)
9 మాల్యాల అనిల్19 (హిమత్ రావుపేట)
10. గాజుల చిన్నవ్వ 60 ( డబ్బు తిమ్మయ్యపల్లి)

11. నామాల మౌనిక 24 సం ( శనివారంపేట)
12. బైరి రిత్విక్ 3సం ( రామసాగర్)
13. పోలు లక్ష్మి 50 ( హిమత్ రావుపేట)
14. చెర్ల లక్ష్మి 45 ( హిమత్ రావుపేట)
15. గండి లక్ష్మీ 60 ( శనివారం పెట)
16. డబ్బు అమ్మయి 50 ( డబ్బు తిమ్మయ్యపల్లి)
17. బండపల్లి చిలుకవ్వ 76 
18. గోలి అమ్మాయి 44 ( శనివారం పేట)
19. తిప్పర్తి వెంకటరత్నం 56 ( తిరుమల పూర్)
20. కంకణాల ఎల్లవ్వ 70 (సండ్రలపల్లి

21. చెర్ల గంగవ్వ 75 (శనివారం పేట)
22. ఒడినల లసమవ్వా 55 ( తిమ్మయ్యపల్లి)
23. ఒడినల కాశిరం 65 ( తిమ్మయ్యపల్లి)
24 బొంగిని మల్లయ్య 55 (పెద్దపల్లి)
25. గోల్కొండ లచవ్వ 50( డబ్బు తిమ్మయ్యపల్లి) 
26.గోల్కొండ దేవవ్వ 63 ( డబ్బు తిమ్మయ్యపల్లి)
27.కొండ అరుణ్ సాయి 5 (కోరేం) 
28. బొంగోని మదనవ్వా 65(పెద్దపల్లి)
29. శమకురా మల్లవ్వ 38 (తిర్మల్పూర్)
30. సలేంద్ర వరలక్ష్మి 28 (శనివారంపేట)


31. కుంబల సునంద 45 (శనివారంపేట)
32. గుడిసె రాజవ్వ 50 ( శనివారం పేట)
33. పందిరి సతవ్వ 75 (హిమత్ రావుపేట)
34. దాసరి సుశీల 55 (తిరుమలపూర్)
35. రాగల ఆనందం 55 (రామసాగర్) 
36. నేదునూరి మదనవ్వ 75 ( హిమాత్రవుపేట)
37. చెర్ల హైమా 30 ( హిమాత్రవుపేట)
38. పిడిగు రాజవ్వ 30 (డబ్బు తిమ్మయ్యపల్లి)



అంజన్న సన్నిధిలో తీవ్ర విషాదం

Updated By ManamTue, 09/11/2018 - 13:52
  • కొండగట్టు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

  • ఆర్టీసీ బస్సు బోల్తా, 45మందికి పైగా మృతి

  • పెరుగుతున్న మృతుల సంఖ్య

  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

  • రాంసాగర్ నుంచి జగిత్యాల వెళుతుండగా ప్రమాదం

Kondagattu bus accident: 40 dead, 28 injured in Telangana

కొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలోని ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 40మందికి పైగా మృతి చెందారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే 26మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 21మంది మహిళలు, 20మంది పురుషులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. బాధితులంతా జిగిత్యాల జిల్లాకు చెందినవారే.

తీవ్రంగా గాయపడినవారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ఘ‌ట‌నాస్థ‌లంలోనే అత్య‌వ‌స‌ర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ శరత్ సంఘటనాస్థలానికి చేరుకుని, సహాయక చర్యలు సమీక్షిస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 70మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు సమచారం. కాగా శనివారంపేట నుంచి  ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి రాంనగర్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 
Bus accident at Kondagattu Ghat Road





Related News