Elections are a referendum TO TRS

ఎన్నికలు తెరాస పాలనకు రెఫరండం

Updated By ManamWed, 09/12/2018 - 01:14
  • అభివృద్ధి - అభివృద్ధి నిరోధకుల మధ్యనే పోటీ

  • ఎమ్మెల్సీ  కర్నే ప్రభాకర్

imageహైదరాబాద్: ముందస్తు ఎన్నికలు తెరాస పాలనకు రెఫరండంగానే భావిస్తున్నామని పార్టీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా తెరాస వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.  అభివృద్ధికి, అభివృద్ధి నిరోధకుల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిఎస్‌ఐడిసి ఛైర్మన్ గాదరి బాలమల్లుతో కలిసి ఆయన మాట్లాడారు. ముందస్తు ఎన్నికలంటేనే భయపడిపోతున్న విపక్షాల మధ్య కుదురుతున్న అనైతిక పొత్తులను ప్రజలు అంగీకరించబోరన్నారు. తెలంగాణ వ్యతిరేకులతో కాంగ్రెస్ పొత్తు  నీతిమాలిన చర్య అన్నారు. తెదేపాతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు ఏ మేరకు సహేతుకమనేది రాబోవు ఎన్నికల్లో ప్రజలు తేల్చబోతున్నారని వివరించారు. తెలంగాణ అభివృద్ధి నిరోధకులతో కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటును నిలదీయాలని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తోక పార్టీలన్ని కలిసి కూటమిగా ఏర్పడతాయని తెరాస ఎప్పుడో చెప్పిందన్నారు.  పొత్తు ముఖ్యమనుకుంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెదేపాతో పొత్తు గురించి ఉవ్విళ్లురుతున్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ బషీబాగ్, ముదిగొండ కాల్పుల గురించి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎందుకు కోరుకుంటాడని ఒక ప్రశ్నకు సమాధానంగా కర్నె ప్రభాకర్ వివరించారు. కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి అరెస్టుతో తెరాసకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గతంలో నమొదైన కేసులో విచారణలో భాగంగానే అరెస్టు చేసి ఉంటారని అన్నారు. ఆయనను చూసి తెరాస భయపడాల్సిందేమి లేదన్నారు. టిఆర్‌ఎస్ భయపడేంత గొప్ప నాయకుడేమి కాదాయన అని పలు ప్రశ్నలకు సమాధానంగా కర్నె ప్రభాకర్ వివరణ ఇచ్చారు.

కేటీఆర్, కవిత సమక్షంలో తెరాసలో చేరికలు
తెరాసలో చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు కుల సంఘాల నేతలు  కూడా తెరాసలో చేరుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన మజ్లీస్ నాయకులు పలువురు పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత నివాసంలో తెరాస కండువ కప్పుకున్నారు. తెరాసలో చేరిన ఎంఐఎం నాయకుల్లో షేక్ బాసిత్, షేక్ అలీముద్దీన్, షేక్ సాబీర్, మమ్మద్ కబీర్ ఉద్దీన్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. కేటీఆర్ అధికార నివాసంలో  జరిగిన కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముదిరాజ్ మహసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్, నాయకులు అమరేందర్ తదితరులు తెరాలో చేరారు. మంత్రి కేటీఆర్ ముదిరాజ్ మహసభ నాయకులకు తెరాస కండువాలు కప్పి సాధరంగా  పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

15న తెరాస మెనిఫెస్టో కమిటీ సమావేశం
తెరాస మెనిఫెస్టో  కమిటి తొలి సమావేశం ఈ నెల 15 తేదీన సాయంత్రం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం అవుతుంది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సమాలోచనలు జరుపుతారు. మహిళలు, రైతులు, నిరుద్యోగుల ప్రయోజనాలకు అనుగుణంగా మెనిఫెస్టోను రూపొందించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలియచేశాయి. మెనిఫెస్టో కమిటీకి పార్టీ ప్రధాన కార్యదర్శి కె.కేశవరావు సారధ్యం వహిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలును సమీక్షించడంతో పాటు కొత్త హామీల విషయంలో లోతైన అధ్యయనం జరుగుతుందని పేర్కొన్నారు.

సిద్ధమైన ప్రచార రథాలు
తెరాస అభ్యర్థుల ప్రచార రథాలు సిద్దమయ్యాయి. ఇప్పటికే 70 మంది అభ్యర్ధులు ప్రత్యేక ప్రచార రథాలను తయారు చేయించుకుంటున్నారు. గుంటూరులోని ఐషర్ వాహన డీలర్ రామ్‌కోర్ సంస్ధ ప్రచార వాహనాలను తయారు చేస్తుంది. మరో వారం రోజుల్లోనే ప్రచార వాహనాలు అభ్యర్ధులకు అందచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రచారానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు ఈ వాహనాల్లో ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

Related News