Investment Checks DISTRIBUTION BEFORE to Elections

ఎన్నికలకు వారం ముందే పెట్టుబడి చెక్కులు!

Updated By ManamWed, 09/12/2018 - 01:14
  • కోడ్ అమలులోకి వస్తే.. కష్టమే

  • ఎన్నికల కమిషన్ స్పందనే కీలకం

  • గందరగోళంలో వ్యవసాయశాఖ

imageహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం(ఎకరాకు నాలుగు వేలు పెట్టుబడి) కింద రెండో విడత సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రబీ సీజన్ అక్టోబర్ నెల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పెట్టుబడి చెక్కులను రైతులకు అందజేసేందుకు ముందస్తుగానే నిధులను విడుదల చేసింది. అయితే ముందస్తు ఎన్నిక ల నేపథ్యంలో పంట పెట్టుబడి సాయంపై సందిగ్ధత నెలకొంది. ఎనిమిది నెలలు ముందుగానే శాసనసభ రద్దు కావడం.. నవంబర్‌లోనే ఎన్నికలు ఉండే అవ కాశం ఉండడంతో రబీ సీజన్‌కు సంబంధించి పెట్టుబడి చెక్కుల పంపిణీపై చిక్కుముడి పడింది. నవంబర్‌లోనే పెట్టుబడి సాయం చెక్కులను పంపిణీ చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అందుక్కావల్సిన నిధులను సైతం ముందే మంజూరు చేశారు. కానీ ఒకవేళ ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే.. చెక్కుల పంపిణీ సాధ్య పడుతుందా? లేదా? అన్నదానిపై అనుమానాలు నెలకొన్నాయి.

రబీలో పెట్టుబడి ఇలా
రాష్ట్రంలో 58.16 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరికి ఖరీఫ్ సీజనల్ 58.81 లక్షల చెక్కులు ముద్రించారు. ఇందులో 51.11 లక్షల చెక్కులు పంపిణీ కాగా, 7.70 లక్షల చెక్కులు వివిధ కారణాల వల్ల పంపిణీ కాలేదు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.12వేల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం పథకం ప్రారంభంలో సాగు చేసిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని ఒకానొక దశలో ప్రకటించారు.  పత్తి, మిరప, చెరుకు వంటి పంటలు పండించే రైతులకు ఖరీఫ్‌కు సంబంధించిన రూ. నాలుగు వేలు మాత్రమే అందుతాయని నిరుత్సాహపడ్డారు. ఖరీఫ్ సీజన్‌లో 1.08 కోట్ల ఎకరాలు సాధారణ సాగు విస్తీర్ణం కాగా, రబీ సీజన్‌లో 31.92 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉంది. అంటే ప్రభుత్వం ముందస్తు ప్రకటించిన విధంగా అయితే ఖరీఫ్‌తో పోల్చుకుంటే.. మూడో వంతు రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందేది. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌లో చెక్కులు తీసుకున్న రైతులందరికీ రబీలోనూ చెక్కులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. దీంతో 58.16 లక్షల మందిలో పెట్టుబడి సాయం అందుతుందన్న ఉత్సాహం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కలిసొచ్చే అవకాశం లేకపోలేదు.

మళ్లీ చెక్కుల రూపంలోనే
రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందించే పంట పెట్టుబడి సాయం ఎకరాకు సీజన్‌కు రూ.4వేలను మొదటి విడతలో చెక్కుల రూపంలో అందించిన విషయం విదితమే. ప్రతిసారీ చెక్కులను తీసుకుని రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాలంటే.. ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో రెండో విడత సాయాన్ని కార్డుల రూపంలో అందజేయాలని భావించారు. అందుకు తగిన విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కానీ పంట పెట్టుబడి చెక్కుల పంపిణీ సమయంలో గ్రామాల్లో పండగ వాతవరణం నెలకొంది. దాదాపు రెండుమూడు నెలల పాటు పంట పెట్టుబడి సాయం, రాష్ట్ర ప్రభుత్వం గురించే ప్రధానంగా ప్రజలు, రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. దీనికితోడు ప్రభుత్వం రైతులకు నేరుగా ఎంతమేర లబ్ధి చేకూర్చుతుందనే విషయం ప్రజలకు సులువుగా అర్థమవుతోంది. ఇలా కాకుండా కార్డుల రూపంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తే.. ఎవరికీ తోచిన విధంగా వారు ఏటీఎంలను ఆశ్రయించి డబ్బులను తీసుకుంటారు. దీంతో ప్రభుత్వ పథకంపై చర్చ సాగదు. ఈ విషయాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా చెక్కుల రూపంలోనే పెట్టుబడి సాయాన్ని అందించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. ఇదిలావుంటే.. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే.. పెట్టుబడి సాయం పంపిణీ ఏలా అనేదానిపై వ్యవసాయశాఖ గందరగోళంలో పడింది.

ఎన్నికల కమిషన్ స్పందనపైనే 
ముందస్తు ఎన్నికలు నవంబర్‌లో జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ముందస్తు ఎన్నికలకు అక్టోబర్‌లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఊహగానాలు విన్పిస్తున్నాయి. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే.. పంట పెట్టుబడి చెక్కుల పంపిణీ సాధ్యం కష్టమేనని పలువురు చెబుతున్నారు. కానీ ఈ పథకం ఇప్పటికే కొనసాగుతున్న పథకం అవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని మరికొందరు అభిప్రాయప డుతున్నారు. ఇవన్నీ పక్కనబెడితే.. రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల మందికి పెట్టుబడి చెక్కులు అందనున్నాయి. ఈ లెక్కన నేరుగా 58 లక్షల మంది రైతులు ఒక్కోక్కరు రూ.4 వేలు లబ్ధి పొందుతున్నారు. మరీ దీనిపై ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇదిలావుంటే.. నవంబర్‌లోనే ఎన్నికలు ఉంటాయని, ఎన్నికలకు వారం ముందే పంట పెట్టుబడి చెక్కులు రైతులకు అందాల ని సర్కారు వ్యవసాయ శాఖకు సూచించినట్టు సమాచారం.
 

Related News