Just do it!

జస్ట్ డూ ఇట్!

Updated By ManamWed, 09/12/2018 - 04:26
  • విలక్షణమైన ‘నైక్’ వాణిజ్య ప్రకటనలు

pinkఒక వాణిజ్య సంస్థ తన లాభనష్టాలతో నిమిత్తం లేకుండా సామాజిక, ప్రజా రాజకీయ ప్రయోజనాలకు బాసటగా నిలబడింది. అది నిజానికి ఇవాల్టి గ్లోబల్ , మార్కెట్ ఆధారిత జీవన సంస్కృతి మీద విసిరిన సవాలే! నేటి భారతీయ వాణిజ్య ప్రపంచం కూడా నేర్చుకోవలసిన ఒక చక్కని పాఠమిది. ప్రముఖ బహుళజాతి సంస్థ ‘నైక్’ పాదరక్షలకు, దుస్తులకు, ఇతర యాక్ససరీస్‌కు ప్రసిద్ధి. అయితే ఈ సంస్థ తన వాణిజ్యప్రకటనల్లో ఉపయోగించే వాక్యం ‘జస్ట్ డూ ఇట్’. (అనుకున్నది చేసేయ్!). నైక్ సంస్థ తన వార్షికోత్సవాల్ని ‘జస్ట్ డూ ఇట్’ అనే టాగ్‌లైన్ పేరిట నిర్వహించడం పరిపాటి. అయితే నైక్ ప్రకటనలు ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా ఉండడం మాత్రం ఆ సంస్థ అనుసరిస్తున్న వ్యాపార వ్యూహంలో ఒక భాగమే అయినప్పటికీ, ఈ వ్యాపార వ్యూహం ఒక సామాజిక బాధ్యతను నెరవేరు స్తోందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. నైక్ తన ‘జస్ట్ డూ ఇట్’ కాంపెయిన్‌లో 30 వ వార్షికోత్సవం సందర్భంగా ఎప్పట్లాగే ఒక సంచలనానికి తెర తీసింది. అమెరికన్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌కు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు కేపర్నిక్ ముఖచిత్రాన్ని (బ్లాక్ అండ్ వైట్) వాడుతూ, ఆయన ముఖచిత్రం మీద ‘‘నమ్మండి..., నమ్మిన దాని కోసం చివరికి మీరు అన్నింటినీ త్యాగం చేయాల్సి వచ్చినా సరే... నమ్మం డి!’ అనే వాక్యాన్ని రాసింది. నల్లజాతీయుల పట్ల దేశంలో కొనసాగుతున్న నిరసనకు వ్యతిరేకంగా కేపర్నిక్ అమెరికన్ జాతీయ గీతాలాపన సమయంలో మోకాళ్ళ మీద కూర్చుని తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నైక్ సంస్థ తన తాజా వాణిజ్య ప్రకటనకు ఇలాంటి వివాదాస్పదమైన వ్యక్తిని ఎన్నుకుని, ఆయన నమ్మిన సిద్ధాంతానికి మద్దతు తెలిపింది. నైక్ వ్యాపార పురోగతి మీద ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం కూడా ఉన్న ఈ ఎత్తుగడ నిజానికి సాహసంతో కూడుకుంది. అయినప్పటికీ నైక్ ఎంతమాత్రం భయపడలేదు. ఆ సంస్థ ఆశించినట్టే ఈ వాణిజ్య ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నైక్ వాణిజ్య ప్రకటనలు చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి. 

ఉదాహరణకు అమ్మాయికి పొడవైన కాళ్ళుంటే సెక్సీగా ఉంటుందని పురుష ప్రపంచం భావిస్తుంది. కానీ ఆ కాళ్ళు బలహీనంగా ఉండడమన్నది మాత్రం అనేకమంది మహిళల ఆరోగ్య సమస్యకు సంబంధించిన సమస్యే! ఈ సమస్యను అర్థం చేసుకున్న నైక్ వాణిజ్య ప్రకటనల రూపకర్తలు ఒక ఆసక్తికరమైన ప్రకటనను రూపొందించారు. నైక్ ఒక సందర్భంలో మహిళల కోసం డాన్స్‌షూల్ని తయారు చేసింది. ఈ షూల తాలూకు ప్రకటనలో ఒక అమ్మాయి ఒకానొక బ్యాలే నృత్యశాలలోని గోడ దగ్గర బ్యాలెన్సింగ్ రాడ్‌ను పట్టుకుని నిలబడి ఉంటుంది. ఈ నిలబడిన భంగిమలో ఆమె తన కాలిని వంచి పాదాన్ని పైకెత్తి పట్టుకుని ఉంటుంది. ఆ ప్రకటనలో కాళ్ళు బలంగా ఉండడమే ఆరోగ్యం అనే సందేశాన్ని పలు రంగుల్లో, పలు ఫాంట్లని ఉపయోగించి రాశారు. మహిళలు బలహీనంగా ఉండనక్కర్లేదన్న సందేశాన్ని ఈ ప్రకటన ద్వారా చెప్పింది నైక్.

Related News