tv

స్మార్ట్ ఫోన్ ధరలో స్మార్ట్ టీవీ

Updated By ManamFri, 10/05/2018 - 22:09

inmageహైదరాబాద్: గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ‘హోమ్ ఇండియా’ సంస్థ స్మార్ట్ టీవీలను హైదరాబాద్‌లో శుక్రవారం ఆవిష్కరించింది. గుజరాత్‌లో టీవీలను ఆవిష్కరించిన మూడున్నర నెలల్లోనే 20,000 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. మొదటి సారిగా కంపెనీ ఉత్పత్తులను దక్షిణాదిన అదీ హైదరాబాద్ నుంచి  మార్కెట్‌లోకి ప్రవేశ పెడుతున్నట్లు కంపెనీ డైరెక్టర్ అహ్మద్ జియా చెప్పారు. మొదట ఈ టీవీలను  పట్టణాల్లో ఉన్న మల్టీ బ్రాండ్ అవుట్‌లెట్‌ల ద్వారా వ్రియాలు సాగిస్తామని ఆయన చెప్పారు. వీటితో పాటు మరిన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లో వాషింగ్ మెషీన్లను, వచ్చే ఏడాది మార్చినాటికి రిఫ్రిజిరేటర్లను ఇక్కడి మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు వీటి తయారీకి రాజ్‌కోట్, నోయిడాలోని సదుపాయాలను వినియోగించుకుంటున్నట్లు హోమ్ గ్రూపు మార్కెటింగ్, సేల్స్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిల్ పుజారా తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నోయిడాలో ఉన్న సదుపాయం ద్వారా 20 వేలకు పైగా యూనిట్లను తయారు చేస్తున్నామని హైదరాబాద్‌లో నెలకొల్పబోయే సదుపాయం సామర్థ్యాలను అప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.

\ప్రస్తుతం కంపెనీ ఆదాయం ఏడాదికి రూ. 25,000 కోట్లుగా ఉందని తెలిపారు. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ప్యానెళ్ళను హోమ్ స్మార్ట్ టీవీల తయారీలో వినియోగించుకుంటున్నట్లు చెప్పారు.   కంపెనీ ప్రోడక్ట్ హెడ్ జేమ్స్ స్టీఫెన్  హోమ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల గురించి వివరిస్తూ ఇవి ఇతర స్మార్ట్ టీవీల మాదిరి కాదన్నారు. వీటిలో పొందు పర్చిన రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు ఫైల్ ట్రాన్స్‌ఫర్‌కు ఉపయోగడతాయని చెప్పారు. ఎల్‌ఈడీ టీవీ (32 రెండు అంగుళాలది)  రూ. 10,990 కి, స్మార్ట్ టీవీని రూ. 13,490కి అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కంపెనీ 40, 48, 49, 55 అంగుళాల శ్రేణిలో స్మార్ట్, అల్ట్రా స్మార్ట్ టీవీల ధరలను రూ. 17, 990 నుంచి రూ. 34,990 మధ్య నిర్ణయించింది. స్మార్ట్ 4కే, 64 అంగుళాల టీవీ ధర  రూ. 64,990గా కంపెనీ పేర్కొంది.  ఇక ఇంటర్నెట్‌ను పెద్ద స్క్రీన్‌పై ఆస్వాదించాలనుకునే వారికి హోమ్ టీవి కచ్చితంగా నచ్చుతుందని స్టీఫేన్ అన్నారు. నాణ్యమైన పిక్చర్, సౌండ్ సిస్టమ్ ఇందులో ప్రధాన ఆకర్షణగా ఆయన పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీవో, లావా మొబైల్ కంపెనీలకు బ్రాండ్ పంపిణీదారుగా ఉన్నా రమేశ్ బాబు హోమ్ స్మార్ట్ టీవీ రాష్ట్ర భాగస్వామిగా వ్యవహరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. స్మార్ట్ ఫోన్‌ల కంటే చౌకగా హోమ్ స్మార్ట్ టీవీలు లభించడం నిజంగా గొప్ప విషయమని రమేశ్ బాబు ఆన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ప్రధాన మొబైల్ దుకాణాల్లో ఈ నెల 10 నుంచి హోమ్ స్మార్ట్ టీవీలు విక్రయానికి అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఎగుమతిదార్లకు ఊరట

Updated By ManamWed, 09/12/2018 - 22:33

tvన్యూఢిల్లీ: మరమ్మతుల నిమిత్తం దిగుమతి అవసరమయ్యే మొబైల్ ఫోన్‌లు, కలర్ టీవీలు, నిర్దిష్ట వైద్య పరికరాల  వంటి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతికి సంబంధించి ప్రభుత్వం నిబంధనలను సడలించింది. మరమ్మతుల అనంతరం ఈ వస్తువులను తిరిగి ఎగుమతి చేయాలనే షరతుపై సుంకాలు లేకుండా వాటి దిగుమతికి అనుమతి ఇస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.   ఎగుమతి చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను, వాటిని ఎగుమతి చేసిన ఏడేళ్ళ లోపల, మరమ్మతుల నిమిత్తం ఇప్పుడు దిగుమతి చేసుకోవచ్చు.  అయితే, వాటిని దిగుమతి చేసుకున్న ఏడాది లోపలే తిరిగి ఎగుమతి చేయవలసి ఉంటుంది.  ఇంతకు ముందు, ఎగుమతి చేసిన వస్తువులను తిరిగి దిగుమతి చేసుకునేందుకు వాటిని ఎగుమతి చేసిన మూడేళ్ల లోపు మాత్రమే అనుమతించేవారు. ఆరు నెలల లోపల వాటికి మరమ్మతులు చేసి తిరిగి  ఎగుమతి చేయాల్సి ఉండేది. జిరాక్స్ పరికరాలు, ప్రింటర్లు, మొబైల్ ఫోన్లు, కలర్ టీవీలు, ఎల్‌సీడీ/ఎల్‌ఈడీ ప్యానెల్‌లతో పాటు వైద్య పరికారాలైన ఈసీజీ, ఎంఆర్‌ఐ, అల్ట్రా సౌండ్ వంటి పరికరాలు వంటివి ఈ నోటిఫికేషన్ పరిధిలోకి వస్తాయి.  మరమ్మతుల నిమిత్తం ఆ వస్తువులను దిగుమతి చేసుకున్నవారు వాటికి మరమ్మతులు చేసిన తర్వాత, లేదా చక్కదిద్దిన తర్వాత, దిగుమతి చేసుకున్న ఏడాదిలోపలే వాటిని తిరిగి ఎగుమతి చేయకపోతే వారు కస్టమ్స్ సుంకాలను చెల్లించాల్సి ఉంటుందని సీబీఐసీ పేర్కొంది. ‘‘ఉత్పత్తుల తయారీ, ఎగుమతిదార్లకు ఇది స్వాగతించదగ్గ పరిణామం. ఎగుమతి చేసిన వస్తువులను మరమ్మతులకు దిగుమతి చేసుకుని తిరిగి ఎగుమతి చేసేందుకు దీర్ఘకాలిక సుంక రహిత సమయం దొరుకుతోంది ’’ అని ఈవై ట్యాక్స్ పార్ట్నర్ అభిషేక్ జైన్ అన్నారు.

Related News