Telangana govt

ఎంసెట్‌ నిబంధనలు సవరించిన ప్రభుత్వం

Updated By ManamFri, 02/23/2018 - 18:02

Eamcet Rules, Telangana govt, Eamcet entrance examహైదరాబాద్‌: ఎంసెట్‌ నిబంధనలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్ నిబంధనల సవరణతో ఇప్పటి నుంచి బీఎస్సీ (ఫారెస్ట్రీ) కోర్సుకు కూడా ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. దాంతో ఎంసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహించే ఇంజినీరింగ్‌, మెడికల్‌, అగ్రికల్చరల్‌, వెటర్నటీతో పాటు బీఎస్సీ (ఫారెస్ట్రీ) కోర్సును కూడా చేర్చి నిర్వహించనున్నారు.కొత్త పాస్‌బుక్‌లపై కేసీఆర్ సూచన

Updated By ManamFri, 02/09/2018 - 19:21

passbookప్రతిష్టాత్మకంగా భూరికార్డుల ప్రక్షాళన చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం...త్వరలోనే రైతులకు కొత్త పాస్‌ బుక్‌లను అందిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు ఇచ్చే కొత్త పాస్‌బుక్‌లపై తన ఫొటో ముద్రించవద్దని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. రైతులకు ఇవ్వనున్న కొత్త పాస్‌బుక్‌ల నమూనాలను ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో కేసీఆర్ పరిశీలించారు. ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న పాస్ బుక్‌ను సీఎం ఎంపిక చేశారు. పాస్ బుక్‌లో కేసీఆర్ ఫొటో ఉన్న నమూనాలు కూడా అధికారులు చూపించగా దాన్ని కేసీఆర్ తిరస్కరించారు. పాస్ బుక్‌పై రైతు ఫొటో తప్ప రాజకీయ నేతల ఫొటోలు అవసరం లేదని అధికారులకు కేసీఆర్ సూచించారు. రైతు ఫొటో, తెలంగాణ ప్రభుత్వం ముద్ర మాత్రమే పాస్‌బుక్‌లపై ఉండాలని స్పష్టం చేశారు.రాజకీయ లబ్ధి కోసమే..: పొంగులేటి

Updated By ManamSat, 01/13/2018 - 18:53

ponguletiహైదరాబాద్, జనవరి 13 (మనం ప్రతినిధి): రాజకీయలబ్ధి కోసమే పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెచ్చేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడారు. సర్పంచ్‌ల ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు చట్టంలో మార్పులను సీఎం కేసీఆర్ తీసుకువచ్చే పనిలో పడ్డారని విమర్శించారు. ఈ విషయంలో 14వ ఆర్థిక సంఘం ఏం చేస్తుందో అర్థం కావటం లేదన్నారు. అఖిలపక్ష సమావేశం పెట్టిన తర్వాతనే పంచాయతీరాజ్ చట్టంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ చట్టం రాజ్యాంగ  స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలన్నారు. కర్ణాటకలో చట్టం తీసుకొచ్చే ముందు వివిధ వర్గాలతో చర్చించారని తెలిపారు. వ్యక్తిగత ఎజెండాతో కాకుండా ప్రజల ఎజెండాతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. టీఆర్‌ఎస్‌లో గ్రూపుల లొల్లి ప్రారంభమైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు ఈ రోజు మంత్రులుగా కొనసాగుతున్నారని ఆ పార్టీ మంత్రులే చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌పై విరుచుకపడ్డ విమలక్క

Updated By ManamFri, 01/12/2018 - 16:47

vimalakkaహైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై అరుణోదయ మండలి అధ్యక్షురాలు విమలక్క తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ప్రజల పక్షాన మాట్లాడే వారి పట్ల ప్రభుత్వం అణచివేత ధోరణిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. అణచివేతతో పరిపాలన కొనసాగిస్తామని భావిస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే టీఆర్ఎస్ సర్కారుకు కూడా పడుతుందన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న ఆనంద్, భరత్, మందకృష్ణ మాదిగలను అరెస్టు చేసి ప్రభుత్వం ఇబ్బందులపాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన నిలిచేవారిని సహించేది లేదన్న ధోరణిలో ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతూ...అబద్ధాలు మాట్లాడుతోందని అన్నారు.
 2018లో ప్రభుత్వ సెలవులు ఇవే!

Updated By ManamSat, 12/30/2017 - 13:34
 • జనవరి 1న సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. రెండో శనివారం పనిదినం.. 

 • 28 సాధారణ సెలవులు.. 22 ఐచ్ఛిక సెలవులు.. 

2018 General holidays, Optional Holidays, Telangana govtహైదరాబాద్: 2018 కొత్త సంవత్సారానికి సంబంధించి సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 28 సాధారణ సెలవులు, 22 (ఆప్షనల్ హాలిడేస్) ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది. మొత్తం 28 సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒక రెండో శనివారం ఉన్నాయి. నూతన సంవత్సరం (జనవరి 1) రోజును ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఇక రెండో శనివారాన్ని పని దినమని పేర్కొంది. అలాగే ఆది, రెండో శనివారాల్లో వచ్చిన పర్వదినాల్లో జనవరి 14 భోగి, మార్చి 18 ఉగాది, ఏప్రిల్ 14 డాక్టర్ అంబేద్కర్ పుట్టిన రోజు, జూన్ 17న రంజాన్ ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తంలో ప్రభుత్వం ప్రకటించిన సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి..

2018 ప్రభుత్వ సెలవులు

సాధారణ  సెలవులు

ఐచ్ఛిక సెలవులు

నెల

సెలవుదినం

వారం

 

నెల

సెలవుదినం

జనవరి 1 నూతన సంవత్సరం సోమవారం   జనవరి 16 కనుమ
జనవరి 14 భోగి ఆదివారం   జనవరి 22 శ్రీపంచమి
జనవరి 15 సంక్రాంతి సోమవారం   ఫిబ్రవరి 1 హజ్రత్ సయ్యద్ మహ్మద్ జన్మదినం
జనవరి 26 రిపబ్లిక్ డే శుక్రవారం   మార్చి 29 మహావీర్ జయంతి
ఫిబ్రవరి 13 మహాశివరాత్రి  మంగళవారం   ఏప్రిల్ 1 హజ్రత్ అలీ జన్మదినం
మార్చి 1 హోలీ  గురువారం   ఏప్రిల్ 15 షబ్‌ఏ మెరాజ్
మార్చి 18 ఉగాది (తెలుగు సంవత్సరాది) ఆదివారం   ఏప్రిల్ 18 బసవ జయంతి
మార్చి 26 శ్రీరామనవమి సోమవారం   ఏప్రిల్ 29 బుద్ధ పూర్ణిమ
మార్చి 30  గుడ్ ఫ్రైడే శుక్రవారం   మే 2 షబ్ ఈ బరాత్
ఏప్రిల్‌ 5 బాబూ జగ్జీవన్‌రాం జయంతి గురువారం   జూన్ 5 షాదత్ అలీ
ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి శనివారం   జూన్ 12 షాబ్ ఏ ఖదీర్
జూన్‌ 16 రంజాన్‌    శనివారం   జూన్ 15 జుమా అతుల్ వాదా 
ఆగస్టు 6 బోనాల పండుగ సోమవారం   జూలై14 రథయాత్ర
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం బుధవారం   ఆగస్టు 17 పార్శీల నూతన సంవత్సరం
ఆగస్టు 22 బక్రీద్‌ బుధవారం   ఆగస్టు 24 వరలక్ష్మీ వ్రతం
సెప్టెంబరు 3  శ్రీకృష్ణాష్టమి సోమవారం   ఆగస్టు 26 రాఖీపౌర్ణమి
సెప్టెంబర్ 13 వినాయక చవితి గురువారం   ఆగస్టు 30 ఈద్‌ఏ గదీ
సెప్టెంబర్ 21  మొహర్రం శుక్రవారం   సెప్టెంబర్ 20 మొహర్రం
అక్టోబరు 2 మహాత్మా గాంధీ జయంతి  మంగళవారం   అక్టోబర్ 30 అరెబయీన్
అక్టోబర్ 9 బతుకమ్మ పండుగ ఆరంభం మంగళవారం   నవంబర్ 6 నరక చతుర్దశి
అక్టోబర్ 17 దుర్గాష్టమి-బతుకమ్మ పండుగ బుధవారం   డిసెంబర్ 19 యాజ్ దహుమ్ షరీఫ్
అక్టోబర్ 18 (దసరా) విజయదశమి   గురువారం   డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్
నవంబరు 7 దీపావళి బుధవారం   - -
నవంబర్ 21 మిలాద్ ఉన్‌నబీ బుధవారం   - -
నవంబర్ 23 కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి శుక్రవారం   - -
డిసెంబరు 25 క్రిస్మస్‌ మంగళవారం   - -
డిసెంబర్ 26 బాక్సింగ్‌ డే  బుధవారం   - -


స్టాలిన్‌కు కేసీఆర్ ఫోన్..

Updated By ManamMon, 11/27/2017 - 15:45
 • కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

 • సామాజిక న్యాయం సాధనపై మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వానికి డీఎంకే నేత లేఖ

Telangana CM, DMK leader Stalin, Social Justice Support, Telangana Govt హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీలో విపక్షనేత డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి కృతజ్ఞ‌తలు తెలిపారు. రాష్ట్రాలకు అధికారం కోసం సామాజిక న్యాయం సాధించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స్టాలిన్ స్వాగతించారు. ఈ మేరకు కేసీఆర్‌కు స్టాలిన్ లేఖ రాశారు. స్టాలిన్ లేఖపై స్పందించిన సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం ఆయనకు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు పెంచాలని ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానించిన సంగతి విదితమే.

సామాజిక న్యాయం సాధనకు రాష్ట్రాలకు అధికారమివ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. చెన్నైలో ఆదివారం కేసీఆర్‌ను అభినందిస్తూ స్టాలిన్ ఓ పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. సామాజిక న్యాయ సాధన కోసం డీఎంకే చేసిన కృషి ఫలితంగా తమిళనాడులో రిజర్వేషన్లు 69 శాతానికి పెరిగాయని స్టాలిన్ లేఖలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం సాధించే విషయంలో రాష్ట్రాల అధికారం కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నాలకు తాను మద్దతిస్తున్నట్టు స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. స్టాలిన్ ప్రకటనపై స్పందించిన కేసీఆర్ ఆయనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు.23 లక్షలు.. 24 గంటలు!

Updated By ManamThu, 11/09/2017 - 11:00
 • అన్ని పంపుసెట్లకూ ఉచిత విద్యుత్
 • ప్రయోగాత్మకంగా ప్రారంభించాం
 • దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డు
 • వచ్చే రబీ నుంచి శాశ్వతంగా ఇస్తాం
 • రెప్పపాటు కూడా కోత విధించడం లేదు
 • రాష్ట్ర ఏర్పాటు నాటికి విద్యుత్ సంక్షోభం
 • నాడు పరిశ్రమలకు పవర్ హాలీడే.. ధర్నాలు
 • నీళ్లున్నా తోడుకోలేక రైతుల స్థితి దైన్యం
 • అన్ని రంగాల్లో అలుముకున్న గాఢాంధకారం
 • ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల సరఫరా
 • చిమ్మ చీకట్ల నుంచి వెలుగుజిలుగుల తెలంగాణ
 • అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ ప్రకటన

Free power, CM KCR , Telangana govt, Pump sets, Farmers free currentహైదరాబాద్, నవంబరు 8 (మనం ప్రతినిధి): రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తు ఇవ్వడం ప్రయోగాత్మకంగా ప్రారం భించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఆయన ఈ విషయమై ఒక సుదీర్ఘ ప్రకటన చేశారు. ఈ విషయంలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన అన్నారు. దేశంలో ఇంకెక్కడా లేనివిధంగా చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో సుమా రు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు మంగళవారం రాత్రి నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. దీనిపై ఆయన చెప్పిన విషయాలిలా ఉన్నాయి... ‘‘దశాబ్దాల పాటు కరెంటు కష్టాలు అనుభవించిన రైతాంగానికి ఇది తీపి కబురు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఐదారు రోజులపాటు అధ్యయనం చేసి, వచ్చే రబీ నుంచి శాశ్వత ప్రాతిపదికన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ తుది ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో 25 శాతం విద్యుత్, వ్యవసాయ పంపుసెట్ల ద్వారానే వినియోగమవుతున్నది. రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల నుంచే అన్ని పంపుసెట్లకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది.

గత జూలై నెల నుంచి పాత మెదక్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. వచ్చే రబీ నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. అందుకు కావాల్సిన విద్యుత్ ను కూడా సమకూర్చుకుంటున్నది. ఇటీవల రాష్ట్రంలో 9,500 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఏర్పడినా ఎక్కడా రెప్పపాటు కూడా కోత విధించకుండా రికార్డు స్థాయిలో 198 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాం. వచ్చే రబీ సీజన్‌లో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల ఏర్పడే 11,000 మెగావాట్ల డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను.

బలోపేతానికి భారీ వ్యయం
12,136 కోట్ల రూపాయల వ్యయంతో పంపిణీ, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకున్నం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 400 కెవి సబ్ స్టేషన్లు ఆరు ఉంటే, కొత్తగా మరో ఐదు నిర్మించి, వాటి సంఖ్యను 11కు చేర్చాము. 400 కెవి సబ్ స్టేషన్లు మరో 5 నిర్మించడానికి ప్రణాళిక రచించాం. 220 కెవి సబ్ స్టేషన్లు 51 ఉంటే, కొత్తగా మరో 19 నిర్మించి, వాటి సంఖ్యను 70కి పెంచాం. 132 కెవి సబ్ స్టేషన్లు 176 ఉంటే, కొత్తగా 35 నిర్మించి, వాటి సంఖ్యను 211కు చేర్చాం. 33 కెవి సబ్ స్టేషన్లు 2,181 ఉంటే, కొత్తగా 515 నిర్మించి, వాటి సంఖ్యను 2,696కి పెంచాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి అన్ని రకాల సబ్ స్టేషన్లు కలిపి 2,414 ఉండగా, 574 సబ్ స్టేషన్లను కొత్తగా నిర్మించి, నేడు 2,988 సబ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చాం. రాబోయే మూడు నాలుగేళ్లలో పంపిణీ, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి రూ. 42 వేల కోట్ల పెట్టుబడితో కొత్తగా పద్దెనిమిది 400 కెవి సబ్ సబ్ స్టేషన్లు, ముప్పయి నాలుగు 220 కెవి సబ్ స్టేషన్లు, తొంభై 132 కెవి సబ్ స్టేషన్లు, 937 33/11 కెవి సబ్ స్టేషన్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించాం.

కొత్త లైన్ల వివరాలు
Free power, CM KCR , Telangana govt, Pump sets, Farmers free currentనాడు 400 కెవి లైన్లు 1682 కిలోమీటర్లుంటే, కొత్తగా 1,012 కిలోమీటర్ల మేర ఏర్పాటు చే శాం. 220 కెవి లైన్లు నాడు 5,559 కిలోమీటర్లు ఉంటే, కొత్తగా 1,340 కిలోమీటర్ల లైను వేశాం. 132 కెవి లైన్లు నాడు 9,136 కిలోమీటర్లుంటే, కొత్తగా 1,184 కిలోమీటర్లు వేశాం. మొత్తం హైటెన్షన్ లైన్లు నాడు 16,378 కిలోమీటర్లుంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా 3,537 కిలోమీటర్లు కొత్తగా వేశాం. నేడు తెలంగాణ రాష్ట్రంలో 19,916 కిలోమీటర్ల మేరు హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ల లైన్లు కూడా భారీ స్థాయిలో పెంచాం. 33 కెవి లైన్లు నాడు 17,760 కిలోమీటర్లుంటే, అదనంగా 4,180 కిలోమీటర్లు వేశాం. 11 కెవి లైన్లు నాడు 1,20,834 కిలోమీటర్లుంటే, కొత్తగా 25,551 కిలోమీటర్లు వేశాం. ఎల్.టి. లైన్లు నాడు 2,94,374 కిలోమీటర్లుంటే, కొత్తగా 21,302 కిలోమీటర్లు వేశాం. మొత్తం డిస్ట్రిబ్యూటరీ లైన్లు నాడు 4,32,968 కిలోమీటర్లుంటే, కొత్తగా 51,033 కిలోమీటర్లు జతచేయడం ద్వారా నేడు తెలంగాణలో 4,84,001 కిలోమీటర్ల లైన్లు అందుబాటులోకి వచ్చాయి.

హైటెన్షన్ సామర్థ్యం పెంచాం
పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దడం కోసం హైటెన్షన్ సరఫరా సామర్థ్యాన్ని 12,653 మెగావాట్ల నుంచి 20,660 మెగావాట్లకు పెంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం చూపించిన చొరవ కారణంగా ఉత్తర, దక్షిణ గ్రిడ్ ల మధ్య కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం కూడా జరిగింది. వార్దా-మహేశ్వరం వయా డిచ్ పల్లిల మధ్య 765 డబుల్ సర్క్యూట్ లైన్ నిర్మాణం పూర్తయింది. వరంగల్-వరోరా లైను మరో మూడేళ్లలో నిర్మాణం పూర్తవుతుంది. ఈ లైన్ల ద్వారా తెలంగాణ రాష్ట్రం 2,000 మెగావాట్ల విద్యుత్ పొందడానికి వీలుగా పీజీసీఐఎల్ తో ఒప్పందం చేసుకుంది. ఈ లైన్ల ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా కావాల్సినంత విద్యుత్ పొందే వెసులుబాటు తెలంగాణ రాష్ట్రానికి కలిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్ సరఫరా జరగడానికి వీలుగా జీహెచ్‌ఎంసీ చుట్టూ 142 కిలోమీటర్ల మేర 400 కెవి రింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశాం.

ఈ లైన్లను అనుసంధానం చేయడానికి 220 కెవి సబ్ స్టేషన్లు ఆరింటిని నిర్మించాం. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆర్థిక క్రమశిక్షణకు, మెరుగైన పనితీరుకు ప్రశంసాపూర్వకంగా ఆర్.ఇ.సి., పి.ఎఫ్.సి. లాంటి ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణంపై వడ్డీని 12 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గించాయి. దీనివల్ల ప్రతీ ఏటా విద్యుత్ సంస్థలకు 200 కోట్ల మేర వడ్డీ భారం తగ్గుతున్నది. డిస్కమ్‌లపై ఆర్థిక భారం తొలగించడానికి తెలంగాణ రాష్ట్రం ఉదయ్ పథకంలో చేరింది. డిస్కమ్‌లకున్న 8,923 కోట్ల రుణభారాన్ని ప్రభుత్వం భరిస్తున్నది. దీని ద్వారా డిస్కమ్‌లు రుణవిముక్తి పొంది, మరింత స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యమవుతుంది.

ఆర్థిక ప్రగతికి సూచికగా చెప్పే తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును మించింది. తెలంగాణ ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం ఏడాదికి 1,200 యూనిట్లుగా ఉంటే, ఇప్పుడది 1,505 యూనిట్లకు పెరిగింది. మూడున్నరేళ్లలో తెలంగాణలో విద్యుత్ వినియోగం 26 శాతం పెరిగింది. 2016-17 సంవత్సరంలో జాతీయ సగటు 1,122 యూనిట్లయితే, తెలంగాణ సగటు అంతకన్నా 383 యూనిట్లు అదనంగా నమోదైంది. ఈ పెరుగుదల తెలంగాణ రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర ప్రజల మెరుగైన జీవన విధానానికి అద్దం పడుతున్నది. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్న శుభ తరుణంలో రైతులకు వినమ్రపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఆటో స్టార్టర్లను తొలగించుకోవాలని కోరుతున్నాను. కేవలం విద్యుత్ ఆదా చేయడానికి ఇలా కోరడం లేదు. భూగర్భ జలాలను కాపాడడం కోసం కూడా ఆటోస్టార్టర్ల తొలగింపు తప్పనిసరి అని విన్నవించుకుంటున్నాను.

కొత్తగా ఉద్యోగాల భర్తీ
విద్యుత్ సంస్థలను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. విద్యుత్ సంస్థలలో పనిచేసే 22,550 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు వ్యవస్థ నుంచి తప్పించి నేరుగా జీతాలు చెల్లిస్తున్నది. విద్యుత్ సంస్థల్లో కొత్తగా 13,357 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. విద్యుత్ సంస్థల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంకితభావంతో కష్టపడి పనిచేసి మెరుగైన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులందరికీ అభినందనలు తెలుపుతున్నాము. చిత్తశుద్ధితో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని ప్రకటిస్తున్నాను. తెలంగాణలో అన్ని వర్గాలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ను అవసరమున్నంత మేరకు సరఫరా చేయడానికి ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని మరోసారి ప్రకటిస్తున్నాను’’ అని ఆయన ముగించారు.

భారీగా అదనపు విద్యుత్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 6,574 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంటే, గడిచిన మూడున్నరేళ్లలోనే అదనంగా మరో 7,981 మెగావాట్ల విద్యుత్‌ను సమకూర్చుకోగలిగింది. సింగరేణి పవర్ ప్లాంటు ద్వారా 1200 మెగావాట్లు, కేటీపీపీ ద్వారా 600 మెగావాట్లు, జారాల ద్వారా 240 మెగావాట్లు, పులిచింతల ద్వారా 90 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్లు, సీజీఎస్ తదితర మార్గాల ద్వారా మరో 2000 మెగావాట్లు అదనంగా సమకూర్చుకున్నం. గ్రీన్ పవర్ ఉత్పత్తి గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో తెలంగాణలో కొత్త సౌర విధానం తెచ్చినం. దీని ఫలితంగా తెలంగాణ రాష్ట్రం 2,792 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని సగర్వంగా ప్రకటిస్తున్నాను. వీటన్నింటి ఫలితంగా నేడు తెలంగాణలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14,555 మెగావాట్లు. మరో 13,752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాతో పాటు, కొత్తగా నిర్మించే ఎత్తిపోతల పథకాలకు 8,500 మెగావాట్లు అవసరమవుతుంది.

కొత్తగా నెలకొల్పే పరిశ్రమలతో పాటు ఇతరత్రా పెరిగే డిమాండ్ కోసం విద్యుత్‌ను సమకూర్చుకోవడం కోసం ఈ కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నది. 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి అల్ట్రా మెగా పవర్‌ప్లాంటు నిర్మాణం జరుగుతున్నది. మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ల ద్వారా 1,880 మెగావాట్ల విద్యుత్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుంది. ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నిర్మాణంలో ఉంది. 28 వేల మెగావాట్లకు పైగా స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. పూర్థిస్థాయి పారదర్శకత సాధించడం కోసం, జాప్యాన్ని నివారించడం కోసం విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించాం.

చీకట్ల నుంచి వెలుగులకు
చిమ్మ చీకట్లు అలుముకున్న దుస్థితి నుంచి ఇవాళ వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరించడానికి ఎంతో కృషి జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే, విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి, అమలు చేసింది. దాదాపు రూ. 94వేల కోట్ల తో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా నత్తనడకన నడుస్తున్న ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పరుగులు పెట్టించింది. కొత్త ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్ఠం చేసింది.

అప్పట్లో తీవ్ర సంక్షోభం
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున తీవ్రమైన విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది. నిత్యం కరెంటు కోతలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ నగరంలో రోజూ రెండు నుంచి నాలుగు గంటలు, ఇతర నగరాలు - పట్టణాల్లో ఆరు గంటలు, గ్రామాల్లో 9 గంటలు అధికారిక విద్యుత్ కోతలు అమలయ్యేవి. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలుండేవి. కావాల్సినంత కరెంటు లేకపోవడంతో పరిశ్రమలు మూతపడ్డాయి. కరెంటు కోసం ఫిక్కి, సిఐఐ ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేసేవారు. హైదరాబాద్‌లో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడే వాతావరణం ఉండేది. వ్యవసాయానికి రెండు మూడు గంటల కరెంటు కూడా అందకపోవడంతో పంటలు ఎండిపోయేవి. భూగర్భంలో నీళ్లున్నా తోడుకునేందుకు కరెంటు లేక చేతికొచ్చిన పంట కళ్లెదుటే ఎండిపోతున్నా రైతులు ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండేవారు.

అన్నిరంగాల్లో గాఢాంధకారం
తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం6,574 మెగావాట్లు. ఇందులో నికరంగా విద్యుత్ అందే థర్మల్ పవర్ ప్లాంట్ల సామర్థ్యం 4,300 మెగావాట్లు. జల విద్యుత్ 2,081 మెగావాట్లు. నాడు తెలంగాణ రాష్ట్రానికి 2,700 మెగావాట్ల వరకు విద్యుత్ లోటు ఉండేది. డిమాండ్‌కు సరిపడ సరఫరా జరగలేదు. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్ల, ప్రణాళికా లోపం వల్ల అన్ని రంగాల్లో గాఢాంధకారం అలుముకుం ది. విద్యుత్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు.. ఈ సభలో ఈ ప్రకటన చదువుతున్న నిమిషానికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతున్నదని సగర్వంగా, సంతోషంగా ప్రకటిస్తున్నాను.

Related News