neet

ఒక్కసారే నీట్.. జేఈఈ మెయిన్స్ రెండుసార్లు!

Updated By ManamTue, 08/21/2018 - 20:13
  • అది కూడా పెన్ను-పేపర్‌తోనే.. ఆన్‌లైన్ పరీక్ష యోచనకు గుడ్‌బై

  • రెండుసార్లు నీట్ వద్దన్న ఆరోగ్యశాఖ.. గ్రామీణ విద్యార్థులకు ఆన్‌లైన్ కష్టమే

  • పిల్లలపై ఒత్తిడి పెరుగుతుందని వెల్లడి.. హెచ్‌ఆర్‌డీ శాఖ సానుకూల స్పందన

  • జేఈఈ మెయిన్స్ మాత్రం రెండుసార్లు.. పరీక్షల షెడ్యూలు వెల్లడించిన ఎన్‌టీఏ

Medical Entrance Exam, NEET, NEET-2018, HRDA Department, JEE Mainsన్యూఢిల్లీ: ఏడాదికి రెండుసార్లు నీట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలన్న ప్రతిపాదనను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఉపసంహరించుకుంది. ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన సూచనల నేపథ్యంలో  నిర్ణయం తీసుకుంది. అయితే జేఈఈ మెయిన్స్‌ను మాత్రం రెండుసార్లు నిర్వమించనున్నారు. 2018 డి సెంబరు, 2019 మే నెలల మధ్యలో వివిధ పరీక్షలు నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం షెడ్యూలు విడుదల చేసింది. అందులో నీట్‌ను 2019 మే 5వ తేదీన పెన్ను-పేపర్ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విజ్ఞప్తి మేరకు నీట్ పరీక్ష విధానాన్ని మార్చామని, గత సంవత్సరం ఉన్న పద్ధతే ఈసారీ ఉండాలని ఆరోగ్యశాఖ తెలిపిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వర్గాలు చెప్పాయి. అయితే ఆరోగ్యశాఖ ఎందుకలా చెప్పిందన్న వివరాలు మాత్రం తెలియజేయలేదు. నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని భావిస్తున్నట్లు హెచ్‌ఆర్‌డీ మంత్రి ప్రకాష్ జావడేకర్ జూలై నెలలో చెప్పారు. ఎన్‌టీఏ నిర్వహించే పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారితంగానే ఆన్‌లైన్‌లో ఉంటాయని కూడా అప్పట్లో తెలిపారు. 

అయితే, నీట్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తే పరీక్షల క్యాలెండర్ రూపొందించడం కష్టం కావడంతో పాటు విద్యార్థులపై అదనపు ఒత్తిడి పడుతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ హెచ్‌ఆర్‌డీ శాఖకు రాసి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయంపై కూడా విమర్శలు వచ్చాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండే ఆవకాశం తక్కువని, అలాంటప్పుడు  ఆన్‌లైన్‌లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తే వారు చాలా ఇబ్బందులు పడతారని అన్నారు. కొందరు విద్యార్థులు రెండుసార్లు పరీక్ష విధానాన్ని స్వాగతించగా, మరికొందరు మాత్రం వద్దని చెప్పారు.

రెండుసార్లు పరీక్షలంటే ఎనిమిది సెట్ల ప్రశ్నపత్రాలుంటాయని, అలాంటప్పుడు అదృష్టం బాగుంటే మార్కులొస్తాయి, లేకపోతే లేదని అన్నారు. ఈ సంవత్సరం నీట్ పరీక్ష రిజిస్ట్రేషన్ నవంబరు 1 నుంచి 30 వరకు ఉంటుంది. అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 15 నుంచి డౌన్‌లోడ్ చే సుకోవచ్చు. పరీక్ష నిర్వహించిన సరిగ్గా నెల రోజుల తర్వాత.. అంటే జూన్ 5న ఫలితాలు ప్రకటిస్తారని నేషనల్ టెస్టింగ్ ఏజె న్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక జేఈఈ మెయిన్స్ పరీక్షను మాత్రం 2019 జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండుసార్లు నిర్వహిస్తారని ఎన్‌టీఏ చెప్పింది. యూజీసీ-నెట్, సీమ్యాట్, జీప్యాట్ పరీక్షలకు కూడా ఎన్‌టీఏ తేదీలు ప్రకటించింది.



నీట్, జేఈఈ ఏడాదికి రెండుసార్లు

Updated By ManamSat, 07/07/2018 - 14:46
  • 2019 నుంచి అన్ని పరీక్షలు  ఆన్ లైన్ లోనే

న్యూఢిల్లీ: నీట్, జేఈఈ మెయిన్, నెట్ పరీక్షలు ఇకపై ఎన్టీఏ ఆధ్వర్యంలో ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. నూతన విధానం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నట్లు జవదేకర్ శనివారమిక్కడ వెల్లడించారు. విద్యార్థులు రెండుసార్లూ లేదా ఏదైనా ఒకసారి పరీక్షకు ఎప్పుడైనా హాజరు కావచ్చొని ఆయన తెలిపారు. అయాతే ఎక్కువ స్కోర్‌ వచ్చిన పరీక్షను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

 Prakash Javadekar

నీట్, జేఈఈ, నెట్ పరీక్షలను ఇక నుంచి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తామన్నారు. కాగా ఇప్పటివరకూ నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహిస్తుండగా తాజాగా ఈ పరీక్షల బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తీసుకుంది. నెట్(నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) డిసెంబర్‌లో, జేఈఈ మెయిన్స్‌ను జనవరి, ఏప్రిల్ నెల్లో, నీట్‌ను ఫిబ్రవరి, మే నెలల్లో నిర్వహించనున్నారు.  అలాగే సిలబస్ కూడా మారనుంది.



జేఈఈ మెయిన్, నీట్.. ఏడాదికి రెండుసార్లు! 

Updated By ManamFri, 06/22/2018 - 17:05

JEE Main, NEET, National Testing Agencyన్యూఢిల్లీ: నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలను ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆమోదం మేరకు అభ్యర్థులకు మరో అవకాశంతో పాటు తగిన సమయం ఇచ్చేందుకు వీలుగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1, 2017న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సమయంలో అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్షలైన నీట్, జేఈఈ పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలనే ప్రతిపాదనను ఎన్‌టీఏ తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనకు 2017 నవంబర్ 10న (పదినెలల తరువాత) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతో తొలి విడతగా ఎన్టీఏకు రూ.25 కోట్లను విడుదల చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 2018, మార్చి 12న హెచ్ఆర్‌డీ మంత్రి సత్యపాల్ సింగ్ ఈ పరీక్షపై లోక్‌సభలో లేవనెత్తారు.

ప్రస్తుతం నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహిస్తుండగా, ఎన్‌టీఏనే ఈ రెండు పరీక్షలను ప్రథమంగా నిర్వహించాలని ఆయన కోరారు. దీంతో జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలను ఏడాది రెండుసార్లు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్టు చెప్పారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు జిల్లాస్థాయిల్లో కూడా సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉండేలా ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకూ జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలను ఏడాదిలో ఏప్రిల్-మే నెలలో నిర్వహిస్తున్నారు. అందిన నివేదికల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో రెండు పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. ఏదిఏమైనా దీనికి సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ లేదు. 



నీట్‌లో ఫెయిల్ అయినందుకే ఆత్మహత్య

Updated By ManamTue, 06/05/2018 - 14:53

suicide హైదరాబాద్: నగరంలోని అబిడ్స్‌లో పది అంతస్థుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని వివరాలను పోలీసులు తెలిపారు. ఆమె కాచిగూడకు చెందిన ముస్కాన్ సింగ్ అని వారు వెల్లడించారు. నీట్‌లో ఫెయిల్ అయినందుకే ముస్కాన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు వారు తెలిపారు. అయితే ఈ ఉదయం అబిడ్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్ పదో అంతస్థు నుంచి ఓ యువతి కిందికి పడింది. తల పగలడంతో ఆమె అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే.

 



దేశవ్యాప్తంగా నీట్ ప్రారంభం..

Updated By ManamSun, 05/06/2018 - 10:45

NEET, NEET 2018 Exam, CBSE Board exam (14975)హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశపరీక్ష(నీట్) ఆదివారం ప్రారంభమైంది. రాతపరీక్ష విధానంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షను నిర్వహిస్తున్నారు. నీట్‌కు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 7.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. పరీక్ష ప్రారంభం కావడానికి 9.30 గంటలకే ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతిని నిలిపివేశారు. ఈ సంవత్సరం దేశ్యాప్తంగా నీట్ పరీక్షకు 13.26 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటే 1.76 లక్షల దరఖాస్తులు పెరిగాయని చెబుతున్నారు. ఈసారి నీట్‌కు మరిన్ని కఠిన నిబంధనలు విధించారు. అభ్యర్థులందరూ పొడుగు చేతుల దుస్తులు కాకుండా పొట్టి చేతులున్న దుస్తులనే ధరించి పరీక్షకు హాజరవ్వాలని సీబీఎస్‌ఈ స్పష్టీకరించింది.

బురఖాలు ధరించి వచ్చిన విద్యార్థులను గంట ముందే లోనికి అనుమతించి తనిఖీలు చేశారు. సెల్‌ఫోన్‌లు, ఇయర్‌ ఫోన్స్, వాచీలు, చెవిదిద్దులు, ముక్కుపుడకలు ధరించి రావడాన్ని నిషేధించారు. ఇదిలావుంటే.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ సంవత్సరం నీట్‌కు దరఖాస్తు చేసుకున్న వారు 70 వేల మంది ఉండనున్నారు. కాగా గతేడాది తెలంగాణ నుంచి 46 వేల మంది మాత్రమే నీట్‌కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది, తెలంగాణలో నాలుగు రీజనల్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు.



అనితా ఓ అనితా

Updated By ManamSat, 09/16/2017 - 20:14

చిన్నప్పటినుంచీ ఆమెకున్న ఒకే ఒక స్వప్నం... డాక్టర్ అవ్వాలని. ఇందుకోసం పాపం రేయింబవళ్లు కష్టపడి చదివింది, మంచి మార్కులు సాధించింది, కానీ ఇంతలోనే ‘నీట్’ అనే రాకాసిబల్లి బారిన పడి.. ప్రాణాలు కాపాడాల్సిన వైద్య వృత్తి చేపట్టకముందే బలవంతంగా ప్రాణాలు తీసుకుంది అనిత. సరదాగా అందరూ డాక్టర్ అనిత, డాక్టర్ అనిత అంటూ ఎప్పుడూ ఏడిపించేవారు, కానీ అర్థాంతరంగా మరణించిందన్న అనిత మరణవార్త విని, బహుశా కంటతడి పెట్టని తమిళ విద్యార్థి, తమిళ తల్లిదండ్రులు ఉండరేమో. అంతలా అందరినీ కలచివేసింది అనిత జీవితం, అనిత మరణం.

నీట్ బలితీసుకున్న విద్యాకుసుమం

200/200 మార్కులు..
దళిత కుటుంబంలో పుట్టిన అనిత అత్యంత వెనుకబడ్డ గ్రామీణప్రాంతంనుంచి వచ్చినప్పటికీ చదువులో మాత్రం అందరికంటే ముందుండేది. కడు పేద అమ్మాయి.. కానీ చదువుల్లో సాక్షాత్తు సరస్వతీదేవి అన్నట్టు మార్కులు సాధించింది. 12వ తరగతిలో 200కు గానూ ఏకంగా 196.75 మార్కులను సాధించింది. కానీ నీట్‌లో 720కి గానూ 86 మార్కులు మాత్రమే స్కోర్ చేయగలిగింది. ఇక్కడే అనిత చతికిలపడింది. ఫిజిక్స్, మ్యాథ్స్‌లో 200కు 200 మార్కులు, కెమిస్ట్రీలో 199, బయాలజీలో 194 సాధించిన తెలివైన విద్యార్థిగా నిలిచిన అనిత జీవన పోరాటంలో ఓడిపోయింది. అసామాన్య ప్రతిభా పాటవాలను చదువులో ప్రదర్శించిన సామాన్యురాలు చివరికి విధి వంచితురాలిగా మిగిలిపోయే దుస్థితికి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించడం కుదరదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో డిప్రెషన్‌లోకి పోయింది అనిత. మరోవైపు రాజకీయ ఒత్తిడి కూడా అనితను ఊపిరాడకుండా చేశాయి. అసలు క్లాస్ 12లో వచ్చిన మెరిట్ ప్రాతిపదికనే గత 9 ఏళ్లుగా మెడికల్ సీట్లు ఇస్తూ వస్తున్న తమిళనాడు ప్రభుత్వం ప్రతిభకు మాత్రమే పట్టంకట్టింది. కానీ తాజాగా నీట్ కారణంగా తనకు మెడికల్ సీట్ వచ్చినట్టే వచ్చి, చేజారడంపై అనిత తీవ్రంగా ఆవేదన చెందింది. ఎన్జీఓల ఆర్థికసాయంతో సుప్రీంకోర్టులోనూ పోరాడి, ఓడి, అలసిన అనిత, బలవన్మరణానికి పాల్పడి, మరోసారి నీట్‌పై అగ్గిని రగిల్చింది.

నీట్‌ను క్రాస్ చేయాలంటే కోచింగ్ తప్పదు...
పేద, గ్రామీణ, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు నీట్ పరీక్షలో అర్హత సాధించడం అసాధ్యం. తమిళనాడులో విద్యావిధానాన్ని ఒకటో తరగతి నుంచి మార్చుకుంటూ వస్తే తప్ప, వీరెవ్వరూ నీట్‌లో ఉత్తీర్ణత సాధించడం అసాధ్యం. లేదా లక్ష రూపాయలకు పైగా ఫీజు చెల్లిస్తే కోచింగ్ తీసుకుని, నీట్ సిలబస్‌ను ఔపోసనపట్టి, అప్పుడు మాత్రమే నీట్‌లో ర్యాంక్ సాధించే ఛాన్స్ లభిస్తుంది. కానీ ఈ స్థోమత లేని విద్యార్థులకు ఆత్మహత్యే శరణ్యం అన్నట్టు తయారైంది పరిస్థితి. 

నీట్‌లో క్వాలిఫై కాలేని అసమర్థులుగా దక్షిణాది విద్యార్థులను ముద్ర వేసి, బలవంతంగా వారి కలలను తొక్కేయడం అసంఖ్యాకమైన విద్యార్థుల్లో అసహనం, డిప్రెషన్‌ను రాజేసింది. ‘ఇది చాలా కష్టమైన పరీక్ష, ఎందుకంటే పేదవారు నీట్ పరీక్ష కోసం కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టలేరు, నాలాంటివారి పరిస్థితి ఏమిటి అంటూ అనిత్ వాపోయేది. 

తమిళుల ఆశాదీపం..
తమిళ విద్యార్థుల నీట్ కష్టాలకు అనిత ఉద్యమ రూపం, మెడికల్ సీట్ల కోసం పోటీపడుతున్న లక్షలాది మంది విద్యార్థులందరి సమస్యలకు అనిత అనే ఈ అమ్మాయే ఆశాదీపంగా మారింది. తమిళ విద్యార్థులకు ప్రమాణాలు తక్కువ ఉండేలా సిలబస్ ఉందనే అపవాదును దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న సమయంలో ఒక ఆడబిడ్డ చేసిన పోరాటం ఎంతోమంది కళ్లు తెరిపిం చింది. ముఖ్యంగా తమ పిల్లలను వైద్యులుగా చూడాలనుకున్న డాక్టర్లకైతే అనిత ఓ ఆశాదీపంలా కనిపించింది. కోర్టులో న్యాయపోరాటం చేసింది..కోర్టు తమిళనాడుకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదంది.  అంతే పోరు నడిపింది. మరోవైపు, సాంఘికంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబడ్డ అనిత కుటుంబానికి ఈమె చక్కని దారి చూపించగలదన్న సమయంలో ఇలా అర్ధాంతరంగా బలవన్మరణం పాలవ్వాల్సి వచ్చింది. అసలు అనిత అంత పిరికిదా అంటే దీనికి జవాబు మాత్రం నో అనే వస్తుంది. నాడు తమిళ విద్యార్థులను, తల్లిదండ్రులను నీట్‌పై పోరుకు ఏకం చేసిన గళంగా నిలువగా, నేడు తమిళ ప్రజలనంతా ఆలోచింప చేస్తోంది. అనిత మరణం ప్రభావం కేంద్రంపై ప్రత్యక్షంగా పడుతోంది.

కేంద్రానికి పెద్ద షాక్...
నీట్ పరీక్షను బలవంతంగా కేంద్రం రుద్దుతున్న ఓ చర్యగా తమిళనాడులోని గ్రామగ్రామానికి చెందిన ప్రజలు భావిస్తున్నారు. తప్పకుండా దీనికి తగిన మూల్యం తమిళనాడులో బీజేపీ చెల్లించాల్సి వస్తుంది.. అన్నది తాజాగా ద్రవిడ పార్టీలన్నీ వెలిబుచ్చుతున్న అభిప్రాయం. అనితకు జరిగిన అన్యాయంపై తమిళులంతా ఏకమై గళమెత్తారు. సెలబ్రిటీలు, సామాన్యులు అన్న తేడా లేకుండా ఉన్నవారు లేనివారు అంతా కదలివచ్చారు, కేంద్రంలో కదలిక తెచ్చేందుకు సోషల్ మీడియా, మీడియాలో నీట్‌పై గళమెత్తారు. తిరుచ్చిలో రోజు కూలీగా పనిచేస్తున్న షణ్ముగం కుమార్తె ..17 ఏళ్ల అమ్మాయి అనిత మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇప్పుడు నీట్ లోతుపాతులను పరిశీలించేలా చేస్తోంది.  నీట్‌పై అంతకంతకూ పెరుగుతున్న ఒత్తిడిని కేంద్రం తట్టుకోలేక పోతోంది. రాష్ట్రవ్యాప్తంగా తమిళులంతా చేస్తున్న ఉద్యమం కాస్తా ద్రవిడ ఉద్యమంగా రూపాంతరం చెందింది.

దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఇది మరో జల్లికట్టు ఉద్యమంలా మారుతుందేమోననే భయం పట్టుకుంది. వెరసి నీట్‌పై పోరాటం బీజేపీ, బీజేపీయేతర ద్రవిడ పార్టీల ఉద్యమంగా మారిపోయింది. అందుకే ‘మా ఓపికను పరీక్షించవద్దు, మాపై అనాగరికంగా దాడి చేయవద్దు అంటూ బీజేపీ ఘాటుగా తమిళులపై స్పందించాల్సి వచ్చింది. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, కేవలం నగరాలకు చెందిన పార్టీ అని, ఇంకా చెప్పాలంటే ఉత్తరాది పార్టీనే అన్న విషయం మరోమారు రుజువైందంటూ తమిళ పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. గత కొన్ని నెలలుగా నీట్‌పై తమిళులు చేస్తున్న ఈ ఆరోపణలపై విసుగు చెందిన బీజేపీ, తమిళ నేతలు బ్రూటల్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. 

ప్రాణం పోతే డబ్బిస్తారా? 
అనిత మరణంతో, తమ ప్రభుత్వంపై పడ్డ మరకను తొలగించుకునేందుకు అన్నాడీఎంకే సర్కారు 7 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి, చేతులు దులుపుకుంది. చెక్ ఇవ్వడానికి అనిత తల్లిదండ్రులవద్దకు జిల్లా కలెక్టర్ వచ్చి సాయాన్ని అందజేసే ప్రయత్నం చేశారు. కానీ అనిత తల్లిదండ్రులు పేదవారైనా ఆత్మాభిమానం మెండుగా ఉన్న కుటుంబం కావడంతో ఆ సాయాన్ని తిప్పికొట్టారు. ‘అనిత మరణించింది కేవలం నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని మాత్రమే కానీ ఎటువంటి ప్రభుత్వ సాయం కోసం కాదు’ అంటూ తల్లిదండ్రులు గట్టిగా జవాబు చెప్పేసరికి జిల్లా కలెక్టర్ షాక్ తిన్నారు. ఇంకే విద్యార్థి అనితలా చావకూడదంటూ భోరుమన్నారు అనిత తల్లిదండ్రులు.

సెలబ్రిటీలను కదిలించిన అనిత...
‘అనిత నా కుమార్తె.. ఆమె కోసం నేను గొంతెత్తా ఇది అనిత మరణవార్త తెలిసి, విశ్వనటుడు కమల్‌హాసన్ స్పందించిన విధానమంటే అనిత వేదన, అనిత లాంటి వారి ఆవేదన ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. రజనీకాంత్ కూడా అనిత మరణం అత్యంత హృదయవిదారకమైన విషయంగా పేర్కొన్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా అనిత మరణంపై స్పందిస్తూ, విద్యార్థులెవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక అనిత చేపట్టిన నీట్ వ్యతిరేక ఉద్యమం మరో కీలక మలుపులు తిరిగేలా సామాజిక మాధ్యమాల్లో శరవేగంగా వ్యాపిస్తోంది. అసలు మన విద్యావిధానం ఎటుపోతోందనే అనుమానాలను రేకెత్తిస్తోంది. రామనాథపురం వంటి అత్యంత వెనుకబడిన జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు గతేడాది మెడికల్ కాలేజ్‌లో అడ్మిషన్ సంపాదించారు.

మరి వారంతా చక్కగా మెడిసిన్ చదువుకుంటుండగా, కొత్తగా వచ్చిన నీట్‌తో మాకు వచ్చిన ప్రత్యేక లాభమేంటి అని తమిళులు అమాయకంగా అడుగుతున్న ప్రశ్నకు జవాబులు చెప్పేవారు లేరు. ఇప్పటివరకూ ఉన్న మన భారతీయ వైద్యులెవ్వరూ నీట్ పరీక్షలకోసం చదివినవారు, నీట్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు కారే, మరి ప్రపంచం మెచ్చిన వైద్యులుగా వారు తమ వృత్తిలో ఎలా విజయం సాధించగలుగుతున్నారు ? నీట్‌లు లేని కాలంలో వైద్య కోర్సులకు విద్యార్థులను ఎంపిక చేసిన విధానం లోపభూయిష్టమైనదైతే, వీరంతా తమ వైద్యవృత్తిలో అసామాన ప్రతిభా పాటవాలు ఎలా చూపగలిగారన్నవి ఇప్పుడు శేషప్రశ్నలుగా మిగిలాయి. 





Related News