Tirumala Temple

కమనీయం 

Updated By ManamThu, 09/20/2018 - 01:03
 • సూర్య, చంద్రప్రభ వాహనాలపై గోవిందుడు 

 • యోగ ముద్రలో బద్రీ నారాయణుడి దర్శనం

 • చంద్రప్రభపై సర్వజగదర్శకుడు విహారం 

 • వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 

TIRUMALAతిరుపతి: తిరుమలలో జరుగుతున్న శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు బుధవారం ఉదయం సూర్య ప్రభవాహనంలోను, రాత్రి చంద్రప్రభ వాహనంలోను మలయప్ప స్వామి కనువిందు చేశారు. చంద్రప్రభ వాహనంపై రాత్రి శ్రీవారు దర్శనమిచ్చి, తన చల్లని కిరణాలతో భక్తులను అమృత స్వరూపులను చేశారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వాసానికి అధిపతిగా చంద్రప్రభ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వ కళా సమాహారాత్మకుడైన ఆది నారాయణుడు తన కళల నుంచి 16 కళలు చంద్రునిపై ప్రసరింపచేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం, పాపహరం అవుతుందని భక్తుల నమ్మకం. అదే విధంగా ఉదయం సూర్యప్రభ వాహనంపై బద్రీ నారాయణుడి అవతారంలో యోగ ముద్రలో తిరుమాడ వీధుల్లో విహరించారు. సూర్య నారాయణుడు దివ్వకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ, భక్తులను ఆరోగ్య వంతులను చేస్తూ, సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషదీపతి అయిన  చంద్రుడు కూడా సూర్య కిరణాలతోనే ప్రకాశిస్తాడు. వాహన సేవ ముందు అనేక మంది కళాకారులు స్వామి వారికి స్వాగతం పలకగా, గజరాజులు ఠీవిగా నడుస్తూ వచ్చాయి. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తించాయి. మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వాములతో పాటు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్.శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు సుధా నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

నేడు రథోత్సవం 
గురువారం ఉదయం రథోత్సవం వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. తెలవారుజామున మూడు గంటల నుంచి 3.50 గంటల మధ్య స్వామి కర్కాటక లగ్నంలో రథారోహణం చేస్తారు. ఉదయం 7.30 గంటల నుంచి ఆలయ మాడవీధుల్లో తిరుగుతారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను జేఈఓ శ్రీనివాసరాజు చేపడుతున్నారు.వైభవోపేతంగా.. గరుడోత్సవం

Updated By ManamTue, 09/18/2018 - 06:28
 • గరుడ వాహనంపై ఊరేగిన మలయుప్ప

TIRUMALAతిరుపతి: ఇల వైకుంఠం తిరుమలలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో సోమవారం రాత్రి ‘గరుడ వాహనా గోవిందా’.. అనే నామస్మరణ మార్మోగింది. రాత్రి ఏడు గంటలకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడవాహన సేవ జరిగింది. పరవుపవిత్రమైన గరుడవాహనంపై శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసేందుకు భక్తులు లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. రెండు లక్షల మందికి పైగా తిరుమల మాడ వీధుల్లో శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో దాదాపు 40 శాతం మంది నడిచి తిరుమలకు చేరకున్న వారే. తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు వాళ్ల స్వగ్రామాల నుంచి నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. 

గరుడవాహనం ప్రాధాన్యం ఇదీ...
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ వాహనసేవ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంలో విహరిస్తుండగా వెంకటేశ్వరుని దర్శించుకోవడం వల్ల సకలపాపాలు తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. గరుడ సేవకు శ్రీవిల్లిపుత్తూరు నుంచి ప్రత్యేకంగా పూలమాలలు వస్తాయి. దీంతోపాటు చెన్నై నుంచి ప్రత్యేకంగా గొడుగులు కూడా తిరుమలకు చేరుకుంటాయి. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడినని తెలియజెబుతారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదిష్టుడైన గరుడిని దర్శిస్తే సర్వపాపాలు తొలుగుతాయని భక్తకోటికి తెలియజెబుతారు. గరుడవాహన సేవలో స్వామివారిని స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. రెండు మీటర్ల నిలువెత్తు ఉండే సహస్రనామ కాసులహారం, లక్ష్మీహారం, మకర మణికంఠ హారాలను ఈ సందర్భంగా స్వామికి ధరింపజేస్తారు. రామానుజాచార్యుల ఆగమనం తరువాతే తిరుమల ఆలయాన్ని వైష్ణవ ఆలయంగా గుర్తించినట్లు చరిత్ర చెబుతోంది. విష్ణువుకు ప్రీతిపాత్రుడు గరుడుడు కాబట్టి, ఆ తర్వాతే ఆలయంలో గరుడాళ్వారు మండపం కూడా నిర్మించారట. అంతటి ప్రాశస్త్యం ఉన్న గరుడవాహన సేవకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వస్తారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చెందిన స్థానికులు పెద్ద ఎత్తున గరుడ వాహనాన్ని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఉదయం స్వామివారు మోహినీరూపంలో శృంగార రసాధిదేవత గా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే శ్రీకృష్ణుడు అలంకృతుడై మరో తిరుచ్చిపై భక్తులకు అభయమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా, భక్తుల కోలాటాలు, వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ ఊరేగింపు అత్యంత  రమణీయంగా జరిగింది. ఈ కార్యక్రమాలలో ట్రస్టుబోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు మేడా రామకృష్ణారెడ్డి, సుధానారాయణ మూర్తి, పొట్లూరి రమేష్ బాబు, రాఘవేంద్ర రావు, ఎన్.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.కల్పవృక్ష వాహనంపై గోవిందుడు

Updated By ManamSun, 09/16/2018 - 22:22
 • బకాసుర వధ అలంకారంలో దర్శనం

 • రాత్రి సర్వభూపాల వాహనం అభయం

 • నేడు గరుడ సేవకు ఏర్పాట్లు పూర్తి 

 • వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

TIRUMALAతిరుపతి: తిరుమల వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేతుడై కల్పవృక్ష వాహనంలో నాలుగు మాడవీధుల్లో విహరించారు. బకాసుర వధ అలంకారంలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు, భక్త జన బృందాలు, చెక్క భజనలు, జీయంగార్ల  గోష్టితో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారు వాహన సేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు ఇచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. క్షీరసాగర మధనంలో ఎన్నో విలువైన వస్తువులు ఉద్భవించాయి. అందులో కల్పవృక్షం ఒకటి కాగా,  ఆ చెట్టు చాటున ఉన్న వారికి ఆకలిదప్పులు ఉండవు. పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది. సాధారణంగా వృక్షాలు ఆ చెట్టులో కాసిన ఫలాలను మాత్రమే అందిస్తుంది. అయితే కల్పవృక్షంలో కోరిన ఫలాలన్ని ప్రసాదిస్తుంది. ఆ వాహనంలో ఊరేగిన స్వామి వారిని దర్శించుకున్నట్లయితే, భక్తులకు కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకం ఉంది. రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. రాజులు, దిక్పాలకులు మిళితమైన సర్వభూపాలవాహనంలో స్వామి వారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణాన యముడు, నైరుతిలో నిర్నతి, పశ్చిమాన వరుణుడు, వాయవ్యంలో వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లు తున్నారు. వీరందరూ స్వామి వారిని తమ భుజ స్కందాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. ఆదివారం శ్రీవల్లిపుత్తూరు నుంచి స్వామి వారి కోసం ప్రత్యేకంగా పూలమాలలు వచ్చాయి. ప్రతి బ్రహ్మోత్సవాలకు తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరు నుంచి మాలలు రావడం పరిపాటి. గోదాదేవి ఆలంకరించిన మాలలను గరుడసేవ రోజున స్వామి వారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మాలలను పెద్ద జీయర్ మఠం నుంచి తిరుమాడవీధుల్లో ప్రదర్శనగా శ్రీవారి ఆలయానికి తీసుకుని వెళ్లారు.

నేడు గరుడసేవకు ఏర్పాట్లు పూర్తి
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి కీలకమైన ఘట్టంగా గరుడ సేవ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ జేఈఓ శ్రీనివాస రాజు తెలిపారు. ఆయన ఆదివారం తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగు మాడవీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీలలో రెండు లక్షల మంది తిలకించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్యాలరీల్లో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు, తాగునీరు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గరుడ సేవకు స్వామి వారికి అలంకరించేందుకు ప్రత్యేకంగా చెన్నై నుంచి గొడుగులు తిరుమలకు చేరుకున్నాయి. హిందూ దర్మార్థ సమితి ట్రస్టీ ఆర్‌ఆర్ గోపాల్‌జీ గొడుగులను టీటీడీ అధికారులకు అందించారు. గొడుగులను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా అందుకున్నారు. నాలుగు మాడ వీధుల్లో వీటిని ఊరేగించిన తరువాత ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు 

Updated By ManamThu, 09/13/2018 - 03:11
 • ఈ నెల 22 వరకు తిరుమల శ్రీవారి ఉత్సవాలు 

 • నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు

 • వైభవంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

 • నాలుగు మాడవీధుల్లో ఊరేగిన విష్వక్సేనుడు 

TIRUMALAతిరుపతి: తిరుమల శ్రీవారి  బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా బుధవారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆలయం నుంచి విష్వక్సేనుడు తిరువీధులకు చేరుకుని, నాలుగు మాడ వీధుల్లోను ఊరేగారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామి వారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. విత్తనాలను నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. అంకురార్పణ  జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానపెడుతారు. బ్రహ్మ పీఠాన్ని ఏర్పాటు చేసి, ఆ తరువాత బ్రహ్మ, గరుడ, శేష,  సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ దేవతలను ఆహ్వానిస్తారు. ప్రతిరోజు ఈ పాలికల్లో నీరు పోస్తారు. ఈ కార్యక్రమం వేద మంత్రోఛ్చారణ, మంగళ వాద్యాల మధ్య జరుగుతుంది. అక్కడ నుంచి ఆయన మాడవీధుల్లోని వసంత మంటపం వద్ద నుంచి పుట్టమన్ను తీసుకుని వచ్చారు. గురువారం ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను ఈ నెల 22వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి రానున్నారు. ఆయన సాయంత్రం ఆరు గంటలకు తిరుమలకు చేరుకుని, స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనవాయితీగా వస్తున్న కార్యక్రమం. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 1.00 గంటలకే తిరుమలకు చేరుకోనున్నట్లు జిల్లా కలెక్టరు ప్రద్యుమ్న తెలిపారు. సాయంత్రం 6.00 గంటల వరకు సమయం ఉండటంతో ఆయన జిల్లాకు సంబంధించిన ప్రగతిపై సమీక్ష చేసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా కరువు పరిస్థితి, స్పోర్ట్స్ సిటీ, శ్రీకాళహస్తి మాస్టర్ ప్లాన్,  సీజనల్ వ్యాధులకు సంబంధించిన అంశాలపై సమీక్షించనున్నారు.

భారీ బందోబస్తు
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల, తిరుపతిలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన సిబ్బందికి తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి సూచనలు ఇచ్చారు. క్రమశిక్షణ ముఖ్యమని, ఎక్కడా హద్దు మీరరాదని సూచించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారని, రాష్ట్రం నుంచే కాకుండా, దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారని తెలిపారు. పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నామని కాకుండా, దేవ దేవునికి సేవ చేస్తున్నామనే భావంతో పనిచేయాలని సూచించారు.బ్రహ్మోత్సవ శోభ

Updated By ManamMon, 09/10/2018 - 00:11
 • వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల

 • భారీ స్థాయిలో విద్యుదలంకరణలు.. రూ.9 కోట్లతో ఇంజినీరింగ్ పనులు

 • స్వామికి పరదాలు సిద్ధంచేసిన మణి.. న భూతో.. అన్నట్లుగా ఉత్సవాలు

tirumaతిరుపతి: తిరుమల బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఈనెల 13 నుంచి జరగనున్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుపతి, తిరుమల నగరాలను టీటీడీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. తిరుమలలో ప్రత్యేకాలంకరణలపై దృష్టి సారించారు. అలంకరణలు, పెయింటిం గుల పనులను టీటీడీ ఇంజినీరింగ్ విభాగం తొమ్మిది కోట్ల రూపాయలతో చేపడుతోంది. తిరుపతి నుంచి భక్తులు బస్సులు, రైళ్లు దిగిన ప్రాంతాల నుంచి తిరుమల వెళ్లే మార్గాల్లో విద్యుత్తు దీపాలంకరణలు చేస్తోంది. భక్తుడు తిరుపతికి రాగానే ఇల వైకుంఠంలో అడుగుపెట్టిన అనుభూతి కలిగించేలా చర్యలు తీసుకుంటోంది. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ‘నభూతో న భవిష్యతి’ అన్న చందాన ప్రతి సంవత్సరం జరుగుతాయి. వేంకటేశ్వరుడు శ్రవణం నక్షత్రం రోజున ఆవిర్భవించిన రోజును పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు ఏనాటి నుంచో జరుగుతున్నాయి. బ్రహ్మదేవుడు నిర్వహించినందువల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందిన ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాల సమయంలో  వైకుంఠం నుంచి దేవతలు అందరూ తిరుమాడ వీధుల్లో తిరుగుతూ ఉంటారని అంటారు.  అందుకే తిరుమల, తిరుపతిలలో అన్ని మార్గాలను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి, తిరుమలలో దేవతామూర్తుల ప్రతిమలను లైటింగ్‌తో అలంకరిస్తున్నారు. వేంకటేశ్వర స్వామితో సహా మహావిష్ణువు దశావతారాలను వివిధ ప్రాంతాలలో విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. పెయింటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ధర్మప్రచార మండళ్ల సహకారంతో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నారు. పుస్తకప్రసాదం పంపిణీ, సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న సంస్థలకు ఆర్థికసాయం తదితర కార్యక్రమాలను చేపడుతున్నారు. కలియుగంలో శ్రీవారి కృపాకటాక్షాలు పొందేందుకు హరినామ సంకీర్తన ఒక్కటే మార్గమని,  దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులలను ఆహ్వానించి, తిరుమలలో ప్రధాన కల్యాణకట్ట వద్ద 24 గంటల పాటు భజన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీంతో పాటు తిరుమల, తిరుపతిలలోని ఆడిటోరియాలు, ఇతర వేదికలపై  వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వేదికలను కూడా ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.  

స్వామివారి పరదాలు సిద్ధం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఉపయోగించే పరదాలను తిరుపతికి చెందిన మణి సిద్ధం చేశారు. వంశపారంపర్యంగా ఈ పరదాలను మణి శ్రీవారికి అందజేస్తున్నారు. మణి పరదాలను తీసుకుని, తిరుమలకు కాలినడకన కుటుంబ సమేతంగా వెళ్లి ఈ పరదాలను శ్రీవారికి అందజేస్తారు. సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులకు పరదాలను ఆయన అందించనున్నారు.తిరుమల దర్శనాల్లో పలు మార్పులు.. 

Updated By ManamThu, 08/09/2018 - 20:13
 • ఆరు రోజుల పాటు ఆర్జిత సేవలు.. ప్రత్యేక దర్శనాలు రద్దు

Tirumala Temple, TTD, Lord venkateswara, Special visitsతిరుపతి: మహా సంప్రోక్షణ సందర్భంగా తిరుమల దర్శనాల్లో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పలు మార్పులు చేసింది. తిరుమలలో ఆరు రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేయనున్నారు. రేపటి (శనివారం) నుంచి సర్వ దర్శనం క్యూలైన్ మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఎల్లుండి నుంచి ఆగస్టు 16 వరకు పరిమిత సంఖ్యలోనే స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతించనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న సమంత

Updated By ManamSun, 08/05/2018 - 11:19

Akkineni samantha, Tirumala temple, VIP visit timingsతిరుమల: తిరుమల శ్రీవారిని సినీనటి సమంత దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో అక్కినేని సమంత పాల్గొన్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపానికి ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా సమంతకు అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

స్వామివారి దర్శనం అనంతరం సమంత మాట్లాడుతూ.. ‘‘ తిరుమల అంటే నాకు ఎంతో ఇష్టం. గతంలోనూ చాలాసార్లు స్వామివారి దర్శనానికి వచ్చాను. మళ్లీ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటాను. శ్రీవారిని దర్శించుకుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది’’ అని సమంత చెప్పారు. టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా..

Updated By ManamWed, 08/01/2018 - 10:21

Ysrcp MLA Roja on TTD Samprokshanam

తిరుపతి: మహాసంప్రోక్షణ సమయంలో తిరుమల వెంకన్న ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భక్తుల ఆగ్రహావేశాలకు వెనక్కి తగ్గిన టీటీడీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ వ్యవహారంపై అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై పలు ఆరోపణలు సైతం చేయడం జరిగింది.

తాజాగా మరోసారి రోజా మాట్లాడుతూ.. మహాసంప్రోక్షణ సమయంలో భక్తులను అనుమతించాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సంప్రోక్షణ సమయంలో దర్శనాలను నిలిపివేయాలని చెప్పిన పాలకమండలి సభ్యులను సస్పెండ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు.తిరుమల వెంకన్నకు కాపలా కాసింది చంద్రబాబే: లోకేశ్

Updated By ManamTue, 05/22/2018 - 19:29

AP CM, chandrababu naidu, Tirumala temple, Lokesh babu విశాఖపట్నం: తిరుమలలోని వెంకన్నస్వామివారికి అహర్నిషలూ కాపలా కాసింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఏడుకొండల జోలికి వస్తే మాడి మసైపోతారని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించింది చంద్రబాబేనని ఆయన గుర్తుచేశారు. టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో లోకేశ్‌ తనదైన శైలిలో ప్రసంగించారు. ‘‘విభజన హామీలు, ప్రత్యేక హోదా పోరాటం నుంచి అందరి దృష్టిని మరల్చడానికే బీజేపీ నేతలు వెంకన్నను దించారు. టీటీడీలో అన్యాయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. మనలో ఐక్యతను కూలగొట్టడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. అసలు వెంకన్నకు అహర్నిషలు కాపలా కాసింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారే. 68 ఏళ్ల వయసులో ఇంతగా కష్టపడుతున్న ఆయనకు.. హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సిన బీజేపీ రాజకీయాలు చేస్తోంది. 2019లో చంద్రబాబు పిలుపు మేరకు జనమంతా బీజేపీకి సినిమా చూపిస్తారు’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాజల్

Updated By ManamSun, 04/08/2018 - 14:18

Kajal Agarwal, Tirumala temple, TTD officials చిత్తూరు: అందాల తార కాజల్ అగర్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో కాజల్ పాల్గొన్నారు. స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆమె శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు కాజల్‌కు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను కాజల్‌కు అందజేశారు. స్వామివారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా తిరుమలలో కాజల్ మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం తాను బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నానని చెప్పింది. సినీనటుడు శర్వానంద్‌తో కూడా ఓ సినిమా చేయనున్నట్టు కాజల్ తెలిపారు.
Kajal Agarwal, Tirumala temple, TTD officials

Related News