kidambi srikanth

ఫ్రెంచ్ ఓపెన్‌పై... సింధు, సైనా, శ్రీకాంత్ గురి

Updated By ManamTue, 10/23/2018 - 03:45
  • నేటి నుంచి వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ   

imageపారిస్: డెన్మార్క్ ఓపెన్ తర్వాత హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఫ్రెంచ్ ఓపెన్‌పై దృష్టి పెట్టారు. ఈ టోర్నీ మంగళవారమిక్కడ ప్రారంభం కానుంది. డెన్మార్క్ ఓపెన్‌లో ప్రపంచ 10వ ర్యాంక్ షట్లర్ సైనా అద్భుత ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు చేరుకుంది. కానీ తుది పోరులో ఐ జు యింగ్ చేతిలో ఓటమిపాలైంది. ఇదే టోర్నీలో శ్రీకాంత్ సెమీఫైనల్ వరకు పోరాడగా సింధు ఆదిలోనే వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్ డ్రాలో శ్రీకాంత్‌తో పాటు బి. సాయి ప్రణీత్, సమీర్ వర్మ కూడా ఉన్నారు. డెన్మార్క్ ఓపెన్ మారథాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సమీర్ సహచరుడు శ్రీకాంత్ చేతిలో ఓడాడు. అశ్వినీ పొన్నప్ప మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రమే పాల్గొంటోంది. సాత్విక్‌రాయిరాజ్‌తో కలిసి బరిలోకి దిగనుంది.
 ప్రీ క్వార్టర్స్‌కు కిదాంబి శ్రీకాంత్

Updated By ManamThu, 09/20/2018 - 00:09
  • అశ్వినీ పొన్నప్ప- సాత్విక్‌సాయిరాజ్ జోడి కూడా.. చైనా ఓపెన్ 

srikanthచాంగ్‌జౌ: చైనా ఓపెన్‌లో భారత షట్లర్లు వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ కిదాంబి శ్రీకాంత్ 21-9, 21-19తో డెన్మార్క్‌కు చెందిన రస్‌మస్ జెమ్‌కిని చిత్తు చేసి ప్రీ క్వార్టర్స్‌లోకి చేరుకున్నాడు. శ్రీకాంత్‌తో పాటు మిక్సిడ్ డబుల్స్ విభాగంలో సాత్విక్‌సాయిరాజ్- అశ్వినీ పొన్నప్ప జోడి కామన్‌వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన జంటకు షాక్ ఇచ్చారు. సాత్విక్- అశ్వినీ జోడి 21-13, 20-22, 21-17తో మార్కుస్ ఎల్లిస్- లారెన్ స్మిత్ (ఇంగ్లాండ్) ద్వయాన్ని ఓడించి దర్జాగా ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. వీరు ప్రీ క్వార్టర్స్‌లో చైనాకు చెందిన జెంగ్ సివీ- హుయంగ్ జోడితో తలపడనున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జంట 19-21, 20-22తో మలేషియాకు చెందిన షేమ్- వీ కియంగ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. వీరితోపాటు కామన్‌వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళల జోడి పొన్నప్ప- సిక్కిరెడ్డి 10-21, 18-21తో కిమ్ సో యంగ్- కాంగ్ హీ యొంగ్ (కొరియా) చేతిలో ఓటమిపాలయ్యారు.పోరాడి ఓడిన శ్రీకాంత్ 

Updated By ManamFri, 09/14/2018 - 22:21
  • ముగిసిన భారత్ పోరు

  • జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్

imageటోక్యో: కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలు కావడంతో జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. శుక్రవారమిక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఏడో సీడ్ శ్రీకాంత్ 21-19, 16-21, 18-21తో కొరియాకు చెందిన లీ డాంగ్ కున్ చేతిలో పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్ దాదాపు 1 గంట 19 నిమిషాల పాటు జరిగింది. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలిచిన మాజీ నంబర్ వన్ శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో ఆసియా గేమ్స్‌లో ఓటమికి హాంకాంగ్‌కు చెందిన వాంగ్ వింగ్ కి విన్సెంట్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. శ్రీకాంత్ కూడా అవుట్ కావడంతో ఈ టోర్నీలో భారత్ పోరు ముగిసినట్టయింది. గురువారం జరిగిన మహిళలు, పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఆసియా గేమ్స్ రజత పతక విజేత పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా అవుటయ్యారు. పురుషుల డబుల్స్‌లోనూ భారత్‌కు నిరాశ ఎదురైంది. మను అట్రి, బి. సుమీత్ రెడ్డి జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది.ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి

Updated By ManamSun, 08/12/2018 - 23:01
  • శ్రీకాంత్, ప్రణయ్‌కు మాజీ కోచ్ విమల్ కుమార్ సూచన

  • ఈ నెల 18 నుంచి ఆసియా గేమ్స్


న్యూఢిల్లీ: ఈ వారంలో ప్రారంభం కానున్న ఆసియా గేమ్స్‌లో కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ పతకాలు గెలవాలంటే ఒత్తిడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని జాతీయ బ్యాడ్మింటన్ మాజీ కోచ్ విమల్ కుమార్ సూచించారు. ఆసియా గేమ్స్ ఈ నెల 18వ తేదీన ఇండోనేషియాలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ మలేసియాకు చెందిన డారెన్ ల్యూ చేతిలో ఓటమిపాలు కాగా.. ప్రణయ్ బ్రెజిల్‌కు చెందిన అనామక ఆటగాడు ఇగోర్ కొహెల్ చేతిలో పరాజయంపాలయ్యాడు. ‘శ్రీకాంత్, ప్రణయ్‌ల ఆట తీరును చూసి నిజంగా నిరుత్సాహం చెందాను. ఒక ప్రణాళిక ఫలితానివ్వనప్పుడు మరో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. వీళ్లిద్దరూ ఆటాకింగ్ ప్లేయర్సే.. కానీ పరిస్థితులు అనుకూలించనప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోలేరు. ప్రధానంగా వీళ్లకు కావాల్సింది అదే’ అని విమల్ అన్నారు. ముఖ్యంగా ఆయన ఎక్కడ నిరుత్సాహం చెందారంటే.. వరల్డ్ చాంపియన్‌షిప్‌కు లీ చాంగ్ వీ దూరం కావడాన్ని శ్రీకాంత్ సద్వినియోగం చేసుకోలేకపోవడం. ‘డ్రాలోని రెండో అర్ధ భాగంలో నుంచి లీ చాంగ్ వీ తనకు తానుగా దూరం కావడాన్ని శ్రీకాంత్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

image


ఇక ల్యూ కెరీర్‌లో గొప్ప విజయాలంటే ఏమీ లేవు. ఒక్కోసారి టాప్ ప్లేయర్‌పై గెలుస్తాము. కానీ ల్యూది కనీసం శ్రీకాంత్, ప్రణయ్ స్థాయి కూడా కాదు. ఆ మ్యాచ్‌లో శ్రీకాంత్ సరిగా ఆడలేదని భావిస్తున్నాను. కానీ ఈసారి ఆసియా గేమ్స్‌లో ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే ఒక్క మొమొట మినహా టాప్ ప్లేయర్స్ అందరూ సరైన ఫామ్‌లో లేరు’ అని మాజీ కోచ్ వివరించారు. సైనా నెహ్వాల్‌కు మూడేళ్లు శిక్షణ ఇచ్చి ఆమెను నంబర్ వన్‌గా నిలబెట్టిన 55 ఏళ్ల విమల్ కుమార్ వరల్డ్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో ప్రమాణాలు చాలా పేలవంగా ఉన్నాయని.. మరికాస్త స్థిరంగా ఆడితే ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లు సత్తా చాటగలరని చెప్పారు. ‘ఓవరాల్‌గా పురుషుల సింగిల్స్ ప్రమాణాలను గమనిస్తే.. ఒక్క కెంటో మొమొటో మినహా అందరూ పేలవంగా ఆడారు. లీ చాంగ్ వీ, లిన్ డాన్ తర్వాత ఇతనొక్కడే బ్యాడ్మింటన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తున్నాడు. నిజంగా ఇతను అందరితో ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఇతను అటు అటాకింగ్, డిఫెన్స్ ఆడగల సత్తా ఉన్నవాడు. మోసపూరితమైన షాట్లు కూడా కొట్టగలడు. 

మొమొటో లేకపోతే పురుషుల సింగిల్స్ చూడటం బోర్ కొట్టేది. నిర్మాణాత్మక ర్యాలీలు లేవు. ఈసారి నాణ్యమైన మ్యాచ్‌లు లేవనిపిస్తోంది. కానీ ఖచ్చితంగా మొమొట ప్రస్తుతం ప్రపంచంలో అందరికీ ఆసక్తికరమైన ఆటగాడు. అతడిని ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేరు. చాంగ్ వీ, లిన్ డాన్‌లపై కూడా ఆధిపత్యం ప్రదర్శించగలడు’ అని విమల్ చెప్పారు. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు నిరుత్సాహం కలిగించినప్పటికీ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు రజతం గెలవడంతో యావత్ భారత్ ఆనందపడింది. వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ చేతిలో సింధు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే సింధు ఈ ఓటమిని త్వరగా మర్చిపోయి ఆసియా గేమ్స్‌లో సత్తా చాటుతుందన్న ఆశాభావాన్ని మాజీ కోచ్ వ్యక్తం చేశారు.

 ‘ఇది నిజంగా నిరుత్సాహం కలిగించే సంఘటన. ఎందుకంటే ఆ స్థాయి వరకు వచ్చి ఓటమిపాలు కావడం చాలా బాధాకరం. అయితే ఆమె దీని గురించి ఎక్కువగా ఆలోచించదని ఒక కోచ్‌గా నా అభిప్రాయం. తన మనసులోని నెగెటివ్‌నంతా తీసేసుకుంటుంది. ఆమె ఇంకా యుక్త వయసులో ఉంది. ఖచ్చితంగా వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుస్తుంది. వరల్డ్ చాంపియన్‌షిప్ ప్రతి ఏడాది వస్తుంది. ఓటమికి సింధు నిరుత్సాహ పడకూడదు.

దాని మర్చిపోయి ఆసియా గేమ్స్‌కు సిద్ధపడాలి’ అని రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్ అన్నారు. అయితే వరల్డ్ చాంపియన్‌షిప్ టోర్నీ ఆద్యంతం సింధు ప్రదర్శనపై విమల్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ‘మోసపూరిత హాఫ్ షాట్స్‌ను ఆమె పక్కాగా అమలు చేసింది. కోర్ట్ డ్రాప్స్, స్ట్రెయిట్, క్రాస్ డాప్స్ వంటి షాట్లను అద్భుతంగా ఆడింది. ఎవరైతే స్లో డ్రాప్స్ ఆడాలనుకుంటున్నారో వాళ్లను ఎదుర్కొనేందుకు సింధు సిద్ధంగా ఉంది. ఒకుహర, యమగూచిలపై కూడా సింధు ఇదే తరహాలో ఆడింది. ఓవరాల్‌గా సింధు బాగా ఆడింది’ అని విమల్ చెప్పారు. మూడో రౌండ్‌లో సింధు, శ్రీకాంత్

Updated By ManamWed, 08/01/2018 - 23:12
  • హెచ్‌ఎస్ ప్రణయ్ అవుట్ 

  • వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్

వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ షట్లర్ల హవా కొనసాగుతోంది. సైనా నెహ్వాల్‌తో పాటు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ తమ స్థాయి ఆటను ప్రదర్శించి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అయితే హెచ్‌ఎస్ ప్రణయ్‌కి నిరాశ ఎదుైరెంది. గత ఎడిషన్‌లో కాంస్య, రజత పతకాలు గెలిచిన సైనా, సింధు ఈసారి కూడా పతకాలు వేటలో నిమగ్నమయ్యారు.  
 
imageనంజాంగ్ (చైనా):
హైదరాబాద్ స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. కానీ ప్రపంచ 11వ ర్యాంక్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ఓటమిపాలై ఇంటిముఖం పట్టాడు. బుధవారమిక్కడ జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సింధు 21-14, 21-9తో ఇండోనేషియాకు చెందిన ఫిట్రియాని ఫిట్రియానిపై సునాయాస విజయం సాధించింది. తొలి రౌండ్‌లో సింధుకు బై లభించిన సంగతి తెలిసిందే. గత ఎడిషన్‌లో రజతం గెలిచిన 23 ఏళ్ల సింధు తదుపరి మ్యాచ్‌లో 2015 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన కొరియాకు చెందిన సంగ్ జి హ్యున్‌తో ఆడుతుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21-15, 12-21, 21-14తో స్పెయిన్‌కు చెందిన పాబ్లో అబియన్‌పై పోరాడి గెలిచాడు. గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచిన శ్రీకాంత్ తదుపరి మ్యాచ్‌లో మలేసియాకు చెందిన డారెన్ ల్యూతో ఆడనున్నాడు. బి. సాయి ప్రణీత్ కూడా మూడో రౌండ్‌లో ప్రవేశించాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రణీత్ 2-18, 21-11తో స్పెయిన్‌కు చెందిన లూయిస్ ఎన్నిక్ పెనల్వెర్‌ను ఓడించాడు. దీంతో తదుపరి మ్యాచ్‌లో ప్రణీత్ డెన్మార్క్‌కు చెందిన హన్స్- క్రిస్టియన్ సోల్బర్గ్ విట్టింగస్‌తో ఆడనున్నాడు. అయితే 11వ సీడ్‌గా బరిలోకి దిగిన ప్రణయ్ మాత్రం ముందుకు సాగలేకపోయాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రణయ్ 21-8, 16-21, 15-21తో ప్రపంచ 39వ ర్యాంక్ షట్లర్ కొయెల్హో చేతిలో పోరాడి ఓడాడు. 

డబుల్స్‌లో మాత్రం భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎందుకంటే అన్ని విభాగాల్లో భారత డబుల్స్ జోడీలు ఈimage ప్రతిష్టాత్మక టోర్నీలో ఓటమిపాలయ్యాయి. కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత జంట సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట 18-21, 21-15, 16-21తో డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ 8వ ర్యాంక్ ద్వయం కిమ్ ఆస్ట్రప్, ఆండర్స్ స్కారప్ రస్ముస్సెన్ చేతిలో ఓటమిపాలైంది. మహిళల డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప, ఎన్. సిక్కిరెడ్డి జోడీ 14-21, 15-21తో రెండో సీడ్ జంట యుకి ఫకుషిమ, సయక హిరోట చేతిలో పరాజయం పాలైంది. ఇదిలావుంటే జాతీయ చాంపియన్స్ మను అట్రి, సుమీత్ రెడ్డి ద్వయంపై 24-22, 13-21, 16-21తో జపాన్‌కు చెందిన ఏడో సీడ్ సకుటో ఇనౌ, యుకి కనెకో జంట గెలిచింది. తొలి గేమ్‌లో విరామం సమయానికి సింధు 11-7 ఆధిక్యం సంపాదించింది. 

తర్వాత వరుసగా ఆరు పాయింట్లు సాధించి 17-7తో నిలిచింది. ఆ తర్వాత చాలా సౌకర్యవంతంగా తొలి గేమ్‌ను సింధు కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ సింధు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలుత 4-5తో వెనకబడిన సింధు విరామం సమయానికి 11-5తో నిలిచింది. ఆ తర్వాత ప్రత్యర్థి ఫిట్రియాని పుంజుకునేందుకు సింధు ఎటువంటి అవకాశమూ ఇవ్వలేదు. ఆ తర్వాత వీలైనంత త్వరగా గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక శ్రీకాంత్ విషయానికొస్తే.. తొలి గేమ్ ఆరంభంలో 2-4తో వెనకబడిన భారత షట్లర్ తర్వాత ఆ తేడాను 6-8కి మెరుగుపరచుకున్నాడు. ఆ తర్వాత 16-13 ఆధిక్యాన్ని సంపాదించాడు. తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్ పాయింట్‌కు చేరుకున్నాడు. ప్రత్యర్థి పాబ్లో మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నించాడు కానీ అంతలోపే శ్రీకాంత్ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌ను శ్రీకాంత్ 6-3 ఆధిక్యంతో ప్రారంభించాడు. కానీ పాబ్లో వరుసగా ఆరు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. తర్వాత శ్రీకాంత్ 10-12తో మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ స్పెయిన్ షట్లర్ వరుసగా ఏడు పాయింట్లు సాధించి తిరుగులేని ఆధిక్యంతో నిలవడంతో పాటు గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. 

ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో విరామం సమయానికి పాబ్లో తిరుగులేని 11-9 ఆధిక్యాన్ని సంపా దించాడు. కానీ శ్రీకాంత్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశ మివ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. 

image‘బాగానే ఆరంభించాను. కానీ రెండో గేమ్‌లో చాలా తప్పులు చేశాను. అనేకసార్లు నా వ్యూహాన్ని మార్చాను. అయినా సాధ్యపడలేదు. బహుశా నేను ప్రయత్నించిన వ్యూహాలు, అనేక మార్పులు పనికిరాలేదనుకుంటున్నాను. వీటిపై కోచ్‌తో మాట్లాడతాను. రెండో గేమ్‌లో నేను తప్పులు చేయకుండా ఉండాల్సింది. వాటి గురించే నేను ఆలోచిస్తున్నాను. చివరి 10 పాయింట్లను సరిగా ఆడి సంపాదించానని అనుకుంటున్నాను. తదుపరి మ్యాచ్‌లు తప్పులు జరగకుండా చూసుకుంటాను’ అని శ్రీకాంత్ చెప్పాడు. ప్రణయ్ కూడా తప్పులు చేసినట్టు అంగీకరించాడు. ఈ ఓటమిని మరిచి ఆసియా గేమ్స్‌కు సిద్ధపడాలనుకుంటున్నట్టు చెప్పాడు. ‘రెండు, మూడు గేముల్లో పుంజుకునేందుకు ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. అతను కొట్టిన ప్రతి షాట్ సక్సెస్ అవుతోంది. నా డిఫెన్స్ సరిగా లేదు. నేను ఎన్నో అవకాశాలు ఇవ్వడం అతనికి సౌకర్యవంతంగా మారింది. తొలి గేమ్‌లో బాగా ఆడాననుకుంటున్నాను. కానీ నాకు కీలకమైన రెండో గేమ్ ఆరంభమే సమస్యగా మారింది. ప్రత్యర్థికి అనవసరంగా ఆధిక్యం ఇచ్చాను. ఆ ఆధిక్యం పొందడం వల్ల అతనిలోని ఆత్మవిశ్వాసం బలపడింది. అదే నేను చేసిన పెద్ద తప్పు. అయితే ఈ మ్యాచ్‌ను మరిచిపోయి ఆసియా గేమ్స్‌కు సిద్ధపడాలని అనుకుంటున్నాను’ అని ప్రణయ్ చెప్పాడు. థాయ్‌లాండ్‌ ఓపెన్‌‌‌‌కు కిదాంబి శ్రీకాంత్ దూరం

Updated By ManamTue, 07/10/2018 - 17:06

Kidambi Srikanth, men's singles category Sameer Verma, Parupalli Kashyap, Thailand Openబ్యాంకాక్‌: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ నుంచి వైదొలగాడు. గాయం కారణంగా తాను థాయ్‌లాండ్ ఓపెన్‌ నుంచి తప్పుకుంటున్నట్టు శ్రీకాంత్‌ తన ట్విటర్‌ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. ‘ఇదొక చేదు వార్త. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకుంటున్నాను. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడతాను’ అని శ్రీకాంత్‌ పేర్కొన్నాడు. గత ఇండోనేషియా ఓపెన్ టోర్నమెంట్‌లో శ్రీకాంత్ ప్రదర్శన ఒడిదుడుకులతోనే ముగిసింది. వారంలోపే జపాన్ బ్యాడ్మింటన్ కెంటో ముమోటాతో జరిగిన టోర్నీలో రెండోసారి పరాజయాన్ని చవిచూశాడు. గత ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలిచిన శ్రీకాంత్‌ ఈ ఏడాది ఇంకా ఖాతా తెరవలేదు. 

కశ్యప్‌, సమీర్‌ వర్మ బరిలోకి..
థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత్ తరపున బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో పారుపల్లి కశ్యప్‌, ప్రణయ్‌, సమీర్‌ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టోర్నీ ఆరంభంలో థాయ్‌లాండ్ క్రీడాకారుడు టానంగ్సాక్‌తో సమీర్ వర్మ తలపడనుండగా, చైనా టాప్ సీడ్ షై యుక్వితో కశ్యప్ తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో తొలిరౌండ్‌లో రెండో సీడ్‌ సింధు బల్గేరియాకు చెందిన లిండా జెచిరితో, ఐదో సీడ్‌ సైనా థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్‌తో తలపడనున్నారు.రజతంతో సరిపెట్టుకున్న కిదాంబి శ్రీకాంత్

Updated By ManamSun, 04/15/2018 - 08:35

Kidambi Srikanthకామన్వెల్త్ గేమ్స్: కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత ఆటగాడు, ప్రపంచ నంబర్.1 కిదాంబి శ్రీకాంత్ పోరాడి ఓడారు. ఫైనల్లో భాగంగా మలేషియాకు చెందిన ప్రపంచ మాజీ నంబర్.1 లీ చాంగ్ వై‌తో తలపడ్డ శ్రీకాంత్.. 21-19, 14-21, 10-18 తేడాతో ఆయన చేతిలో ఓడిపోయారు. దీంతో ఈ సంవత్సర కామన్వెల్త్‌లో రజతంతో సరిపెట్టుకున్నారు శ్రీకాంత్. మరోవైపు డబుల్ స్క్వాష్‌లో న్యూజిలాండ్ జోడీ చేతిలో జోష్న-దీపికా పల్లికల్ జోడీ ఓడిపోయి.. సిల్వర్‌ను అందుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు భారత్‌కు 65 పతకాలు రాగా.. అందులో 26 బంగారు, 19 రజతం, 20 కాంస్య పతకాలు ఉన్నాయి. నీ విజయం భారతీయులకు గర్వకారణం: రాజమౌళి

Updated By ManamThu, 04/12/2018 - 15:04

Kidambi బ్యాడ్మింటన్ ఆటగాడు, తెలుగు దేశం కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించినట్లు బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడికి పలువురి నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. దర్శకధీరుడు రాజమౌళి కూడా తన విషెస్‌ను చెప్పారు. ‘‘బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని సంపాదించినందుకు కంగ్రాట్స్. నీ విజయం భారతీయులందరికీ గర్వకారణం’’ అని రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన అందరికీ కూడా కంగ్రాట్స్ అంటూ వారికి విషెస్‌ చెప్పారు రాజమౌళి.కిదాంబి శ్రీకాంత్‌కు డిప్యూటీ కలెక్టర్ పదవి

Updated By ManamThu, 03/22/2018 - 07:53

Srikanth అమరావతి: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ బుధవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ను కైవసం చేసుకున్న శ్రీకాంత్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రూపు-1 ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఆ హామీ మేరకు క్రీడా కోటా ద్వారా శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు నంబరు 136ను జారీ చేసింది. త్వరలోనే శ్రీకాంత్ ఆ పదవికి బాధ్యతలు తీసుకోనున్నారు.ధోనీకి పద్మభూషణ్.. శ్రీకాంత్‌కు ‘పద్మశ్రీ’

Updated By ManamThu, 01/25/2018 - 23:22
  • ధోనీకి పద్మభూషణ్ 

  • పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

ms dhoniన్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 85 మంది ప్రముఖులకు ప్రతిష్టాత్మక పద్మ పౌర పురస్కారాలను ప్రకటించింది. ఇందులో క్రీడా రంగానికి సంబంధించి తెలుగు తేజం, హైదరాబాద్ స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. గతేడాది శ్రీకాంత్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచిన భారత తొలి షట్లర్‌గా ఘనత సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్, జార్ఖండ్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి పద్మభూషణ్ అవార్డు వరించింది. గత ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లతో జరిగిన సిరీస్‌లలో ధోనీ తన తెలివైన ఎత్తుగడలను, జట్టుకు తనవంతు సహకారాన్ని అందిస్తూ టీమిండియాకు అండగా నిలిచాడు.

త్రిపురకు చెందిన భారత టెన్నిస్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. మహారాష్ట్రకు చెందిన స్విమ్మర్ మురళీ కాంత్ పెట్కర్‌కు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. ఈయన 1972లో జర్మనీలో జరిగిన పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించారు. 50 మీటర్ల ఫ్రీ స్టైల్‌లో 37.33 సెకన్లతో వరల్డ్ రికార్డును నెలకొల్పారు. అంతేకాకుండా అదే ఒలింపిక్స్‌లో మరో మూడు (జావెలిన్, ప్రెసిషన్ జావెలిన్, స్లాలోమ్) ఈవెంట్లలో ఈయన ఫైనలిస్ట్‌గా నిలిచారు. అంతేకాకుండా భారత ఆర్మీలో ఈయన ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో జవాన్‌గా పనిచేశారు. 1965లో జరిగిన ఇండియా, పాకిస్థాన్ యుద్ధంలో ఈయనకు వెన్నెముకలో బుల్లెట్ దిగడం వల్ల చేతిని కోల్పోయారు.

Related News