kona venkat

హారర్ థ్రిల్లర్‌లో అనుష్క.. విలన్‌గా మాధవన్

Updated By ManamSat, 08/25/2018 - 12:29

Anushka, Madhavan‘భాగమతి’ తరువాత ఇప్పటివరకు ఖాళీగా ఉన్న యోగా బ్యూటీ అనుష్క కొత్త చిత్రానికి ఓకే చెప్పింది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘సైలెంట్’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేయగా.. ప్రముఖ నటుడు మాధవన్ విలన్‌గా కనిపించనున్నాడు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం మరో విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇదిలా ఉంటే అనుష్క, మాధవన్‌లకు హారర్ కొత్తేం కాదు. 13B వంటి హారర్ థ్రిల్లర్‌తో పాటు బ్రీత్ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో మాధవన్ నటించగా, భాగమతి అనే థ్రిల్లర్‌తో అనుష్క నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని త్వరలో సెట్స్ మీదకు తీసుకువెళ్లనుండగా.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలపనున్నారు.



‘నీవెవ‌రో’ మూవీ రివ్యూ

Updated By ManamFri, 08/24/2018 - 14:32
Neevevaro

నిర్మాణ సంస్థ‌:  కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎంవీవీ సినిమా
న‌టీన‌టులు: ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్, వెన్నెల‌కిషోర్‌, తుల‌సి, శివాజీరాజా, శ్రీకాంత్ అయ్య‌ర్‌, స‌త్య‌కృష్ణ‌న్‌, సప్త‌గిరి, ఆద‌ర్శ్, ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు
సంగీతం: అచ్చు రాజామ‌ణి, ప్ర‌స‌న్
ర‌చ‌న‌, స‌మ‌ర్ప‌ణ‌:  కోన వెంక‌ట్‌
నిర్మాత‌:  ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌
ద‌ర్శ‌క‌త్వం:  హ‌రినాథ్‌
కెమెరా: సాయిశ్రీరామ్‌
క‌ళ‌: చిన్నా
కూర్పు: ప్ర‌దీప్ ఇ.రాఘ‌వ్‌
పోరాటాలు: వెంక‌ట్‌
విడుద‌ల తేదీ: 24.08.18

కొత్త క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని, వాటి కోసం అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డి మంచి ప్రాడెక్ట్ ని ప్రేక్ష‌కుల‌కు ఇవ్వాల‌న్న కాంక్ష మంచిదే. కేవ‌లం డ‌బ్బుల కోస‌మే సినిమాలు చేయ‌కుండా, ప్యాష‌న్‌తో సినిమాలు చేయ‌డ‌మూ మంచిదే. అలా మంచి పని చేస్తున్నారు ఆది పినిశెట్టి. ర‌విరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అయి పుష్క‌రం అవుతున్న సంద‌ర్భంగా మ‌ర‌లా హీరోగా ఆయ‌న న‌టించిన తెలుగు సినిమా `నీవెవ‌రో`. ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు మెప్పించింది అనేది తెలుసుకోవాలంటే చ‌దివేయండి.

క‌థ‌:
అంద‌రిలాగే ఆరోగ్యంతో పుట్టిన కల్యాణ్ ( ఆది పినిశెట్టి) త‌న 15వ ఏట క‌ళ్లు పోగొట్టుకుంటాడు ఓ ప్ర‌మాదంలో. పోయింది క‌ళ్లే గానీ, సెల్ప్ కాన్ఫిడెన్స్ కాద‌న్న‌ది అత‌ని అభిప్రాయం. ఎవ‌రైనా అత‌ని ప‌ట్ల సానుభూతి చూపిస్తే అత‌నికి న‌చ్చ‌దు. అలాంటిది వెన్నెల (తాప్సీ) అత‌నికి అనుకోకుండా ద‌గ్గ‌ర‌వుతుంది. అను (రితికా) ద‌గ్గ‌ర‌వ్వ‌డానికి ప్ర‌య‌త్నించినా.. అందులోనూ ఏదో ఒక సానుభూతి అత‌నికి క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో క‌ల్యాణ్ ప్ర‌మాదానికి గుర‌వుతాడు. అత‌నికి చూపు తిరిగి వ‌స్తుంది. వెన్నెల తండ్రి తిల‌క్ వ‌చ్చి క‌ల్యాణ్ క‌లుస్తాడు. ఓ సంద‌ర్భంలో తిల‌క్ ప్ర‌మాదానికి గుర‌వుతాడు. అత‌న్ని గుర్తుప‌ట్టిన క‌ల్యాణ్ అది హ‌త్య అని తెలుసుకుంటాడు. ఆ హ‌త్య తాలూకు కూపీ లాగుతుంటే అత‌నికి వెన్నెల నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డుతుంది. ఇంత‌కీ వెన్నెల ఎవ‌రు? క‌ల్యాణ్ తెలుసుకున్న కొత్త నిజం ఏంటి?  వెన్నెల మెడ‌లో మూడు ముళ్లు వేశాడా?   లేకుంటే అనును పెళ్లి చేసుకున్నాడా అనేది ఆస‌క్తిక‌రం. 

ప్ల‌స్ పాయింట్స్
- న‌టీన‌టుల న‌ట‌న‌
- సంగీతం
- కెమెరా
- ఆర్ట్

మైన‌స్ పాయింట్లు
- క‌థ‌, క‌థ‌నం
- నెమ్మ‌దిగా సాగిన స్క్రీన్‌ప్లే
- సాగ‌దీత స‌న్నివేశాలు

Neevevaro

స‌మీక్ష‌
రీమేక్‌లు అన్నీ పండ‌వు. అన్నీ మెప్పించ‌వు. కానీ కొన్ని మాత్రం బావుంటాయి. అలా బావుంటుంద‌నుకుని కోన వెంక‌ట్ తెర‌కెక్కించిన సినిమా `నీవెవ‌రో`. త‌మిళంలో స‌క్సెస్ అయిన `అదే క‌న్‌గ‌ళ్‌` చిత్రానికి రీమేక్ ఇది. తెలుగు ఆడియ‌న్స్ టేస్ట్ కు త‌గ్గ‌ట్టు కొన్ని మార్పులు చేశారు. ఆది పినిశెట్టి చూపు లేకుండా, చూపు క‌లిగిన కుర్రాడిగా బాగా న‌టించాడు. తాప్సీ స‌హజంగా న‌టించింది. త‌న పాత్ర ప‌రిధిలో రితిక‌, స‌త్య కృష్ణ‌, తుల‌సి, శ్రీకాంత్ అయ్యంగార్‌, శివాజీరాజా, వెన్నెల కిశోర్‌, స‌ప్త‌గిరి.. అంద‌రూ మెప్పించారు. చాన్నాళ్ల త‌ర్వాత స‌ప్త‌గిరికి మంచి పాత్ర ప‌డ్డ‌ట్ట‌నిపించింది. న‌టీన‌టుల ప‌రంగా సినిమా ప‌క్కాగా బావుంది. కాక‌పోతే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే విష‌యంలోనే ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకోవాల్సింది. అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు చాలా ఉన్న‌ట్ట‌నిపించాయి. ఎడిట‌ర్ కొన్ని వేల గంట‌లు రూమ్‌లో కూర్చుని సినిమాను ఈ షేప్‌కు తెచ్చార‌ని అంతా తెగ‌పొగిడారు. మ‌రికొన్ని గంట‌లు ఎడిటింగ్ మీద దృష్టి పెట్టి ఉంటే బావుండేది. ఆర్ట్, కాస్ట్యూమ్స్, కెమెరా వ‌ర్క్ బావుంది. ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాస్త అటూ, ఇటూ త‌డ‌బ‌డ్డ‌ట్టు అనిపిస్తుంది. రీరికార్డింగ్ అక్క‌డ‌క్క‌డా అస‌లు అత‌క‌లేదు. ఎమోష‌న్స్ కొన్ని చోట్ల స‌రిగా పండ‌లేదు. అక్క‌డ‌క్క‌డా లాజిక్ కూడా మిస్ అయిన‌ట్టు అనిపించింది. మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్ కి మాత్రం క‌నెక్ట్ అయ్యే సినిమా.
రేటింగ్: 2/5
బాట‌మ్ లైన్‌:  న‌త్త న‌డ‌క‌న‌.. `నీవెవ‌రో`.



‘నీవెవరో’కు సెన్సార్ పూర్తి

Updated By ManamTue, 08/21/2018 - 15:19

Neevevaroఆది హీరోగా హరినాథ్ తెరకెక్కించిన చిత్రం ‘నీవెవరో’. ఆగష్టు 24న ప్రేక్ష్కుల ముందుకు రానున్న ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ పూర్తైంది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. దీంతో ప్రమోషన్లలో మరింత వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. కాగా ఈ చిత్రంలో ఆది అంధుడి పాత్రలో నటిస్తుండగా.. ఆయన సరసన తాప్సీ, రితికా సింగ్ నటించారు. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ శ్యామ్ సంగీతం అందించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.



‘ఈవీఎం’కు కొత్త అర్థం చెప్పిన కోనవెంకట్!

Updated By ManamTue, 05/15/2018 - 16:02

Kona Venkat, Full form of EVM, BJP, Congress, Karnataka assembly elections ఎన్నికల్లో గెలిస్తే సంబరాలు.. అదే ఓడిపోతే ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)ల టాంపరింగ్ జరిగిందంటూ రాజకీయ పార్టీలు గెలిచిన పార్టీపై ఆరోపణలు చేయడం మామూలే. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ రచయిత కోన వెంకట్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ‘ఈవీఎం’ అనే పదానికి ఆయన కొత్త అర్థాన్ని చెప్పారు. ‘‘కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఈరోజు ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లను తెరిచినప్పుడు ‘ఎవ్రిబడీ ఓటెడ్ ఫర్ మోదీ’ అని ఫలితాలు వచ్చాయి. నో కామెంట్స్’’ అని కోన వెంకట్ ట్వీట్ పెట్టారు.



'కత్తి' కౌంటర్ 'కోన'కేనా..?

Updated By ManamThu, 01/04/2018 - 12:58

Kathi, Konaగత కొన్ని రోజులుగా సినీ విమర్శకుడు కత్తి మహేష్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పవన్ అభిమానులు ఎప్పటినుంచో ఆగ్రహం వ్యక్తం చేయగా.. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద యుద్ధమే జరుగుతోంది. అయితే ఇదే సమయంలో "పవన్ మౌనాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది జోకర్లు రెచ్చిపోతున్నారు" అంటూ ప్రముఖ రచయిత కోన వెంకట్, కత్తి మహేష్‌పై విమర్శలు చేశాడు.

దీనిపై కత్తి మహేష్‌ సైతం పరోక్షంగా అంతే ఘాటుగా తన స్పందనను ఇచ్చాడు. "ఒక జోకర్ను మరో జోకర్... ఒక బ్రోకర్ను మరో బ్రోకర్ సమర్థించుకోవడం సహజమే. చేతకానితనాన్ని మౌనంతో అధిగమించడంలో కొంచమైనా వివేకం ఉంది. మీలాంటి వాళ్లు అనవసరంగా మొరుగుతూ పవన్ కల్యాణ్‌ను మరీ ఏబ్రాసిని చేసేయకండి. ఇప్పటికే ఆయన చాలా వరకు అయిపోయాడు" అంటూ కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ కోన వెంకట్‌ను ఉద్దేశించి పెట్టిందే అంటూ పలువురు అభిప్రాయపడ్డారు.
 



అంధుడిగా ఆది పినిశెట్టి?

Updated By ManamSun, 12/17/2017 - 13:16

aadi'ఒక విచిత్రం'తో తెలుగు తెర‌కు క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు ఆది పినిశెట్టి. ద‌ర్శ‌కుడు ర‌విరాజా పినిశెట్టి త‌న‌యుడిగా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టినా.. అన‌తి కాలంలోనే త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది. గ‌తేడాది 'స‌రైనోడు' చిత్రంతో విల‌న్‌గా అవ‌తార‌మెత్తిన ఆది.. ప్ర‌స్తుతం 'అజ్ఞాత‌వాసి', 'రంగ‌స్థ‌లం' చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నాడు. మ‌రోవైపు.. చాలా కాలం త‌రువాత‌ క‌థానాయ‌కుడిగానూ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. తాప్సీ క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ చిత్రాన్ని కోన వెంక‌ట్ నిర్మిస్తున్నాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాలో ఆది అంధుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది.. 'అంధ‌గాడు'లో రాజ్ త‌రుణ్‌, 'రాజా ది గ్రేట్‌'లో ర‌వితేజ అంధుడి పాత్ర‌ల్లో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే.  





Related News