editorial

సౌదీ అకృత్యం

Updated By ManamSat, 10/20/2018 - 03:25

imageయెమెన్‌లో ‘మానవతా విపత్తు’ సృష్టించి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదు ర్కొంటున్న సౌదీ అరేబియా జర్నలిస్టు జమాల్ ఖుషోగ్గీ హత్యోదంతంతో మరింత అప్రతిష్టకు గురయింది. అక్టోబర్ 2వ తేదీన ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లిన ఖుషోగ్గీ అదృశ్యమైన మిస్టరీ ఎట్టకేలకు సౌదీ అధికారులే అతన్ని హత్య చేశారని టర్కీ దర్యాప్తు బృందాలు నిర్ధారిస్తుండడం అంతర్జాతీ యంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఇరు దేశాల మధ్య దౌత్య సం బంధాలు మునుపెన్నడూ లేనంతగా ఘోరంగా దెబ్బతినడమే కాక సౌదీ దౌత్య సంక్షోభంలో కూరుకుపోయింది. త్వరలో జరగనున్న ‘సౌదీ మదుపుల సదస్సు’లో పాల్గొనేందుకు అమెరికా, బ్రిటన్ దేశాలు నిరాకరించడమేకాక, డచ్, ఫ్రాన్స్ సహా పలు దేశాలు, గోల్డ్‌మన్ సాక్స్, పెప్సీ, ఈడీఎఫ్‌లు కూడా ఈ సదస్సు నుంచి తప్పుకోనున్నాయి. సౌదీలోని రాచరిక పాలన ఇటీవల మరింత క్రూరంగా తయా రు కావడంతో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నియమిత రహస్య హంతక ముఠాల సారథ్యంలో అసమ్మతివాదుల అపహరణలు, హత్యలు, అదృ శ్యాలు పెరిగిపోయిన నేపథ్యంలో జర్నలిస్టు ఖుషోగ్గీ హత్య అత్యంత క్రూరంగా జరిగింది. భౌగోళిక రాజకీయాల్లో అత్యంత నమ్మదగిన భాగస్వామిగా ఉన్న సౌదీ అరేబియాను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించడమే కాకుండా, ‘మృత్యు రాకుమారుడు’గా సల్మాన్‌ను విమర్శించాడు. ‘టర్కీలోని తమ కాన్సులేట్‌లో ఏం జరిగిందో తనకు తెలియదని’ ట్రంప్‌కు సౌదీ యువరాజు బిన్ విన్నవించుకోవడం హాస్యాస్పదం. అరబ్ ప్రపంచంలో అమెరికా ప్రయోజనాలకు, వ్యూహాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సౌదీ అరేబియా ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఇంటా, బయటా ఫాసిస్టు ధోరణితో వ్యవహరి స్తోంది.

గతంలో వివాహమాడిన మహిళ నుంచి విడాకుల ధ్రువపత్రం కోసం జమాల్ ఖుషోగ్గీ తనకు కాబోయే భార్యను వెంటబెట్టుకుని టర్కీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. అయితే ఖుషోగ్గీ పెళ్ళి చేసు కోబోయే మహిళ కార్యాలయం బయటే వేచి ఉండడంతో, ఆమె ద్వారా ఖుషోగ్గీ హత్యోదంతం బయట ప్రపంచానికి పొక్కింది. ఖుషోగ్గీని సౌదీ ప్రభుత్వ హంతక దళం హింసించి హత్య చేసిందనీ, ఆయన శరీరాన్ని ముక్కలు చేసి బయటకు తర లించిందన్న ఆరోపణలున్నాయి. వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు ఖుషోగ్గీకి సౌదీ రాచ కుటుంబంతో సుదీర్ఘకాలంగా సంబంధాలున్నాయి. సంపాదక స్థాయిలో పనిచేసి నందున మీడియా ప్రముఖలతోనే కాకుండా, సమాజంలోని భిన్నవర్గాలతో ఆయ నకు విస్తృత సంబంధాలున్నాయి. సౌదీలోనే కాకుండా అరబ్ అభ్యుదయవాదుల తోనూ, పాశ్చాత్య మేధావులతోనూ అంతర్జాతీయంగా మంచి సంబంధా లుండ టమే కాకుండా ట్విటర్‌లో ఆయనకు ఇరవై లక్షల మంది అనుయాయులున్నారు. మృత్యు రాజకుమారుడు బిన్ ఫాసిస్టు చర్యలకు, విధానాలకు వ్యతిరేకంగా ఆయన తన రచనల్లో తరచూ ఎండగట్టేవారు. యెమెన్‌లో మానవతా సంక్షోభం, లెబనాన్‌తో ఘర్షణలు, ఖతార్‌పై పగ సాధింపులు, మహిళా హక్కుల ఉద్యమ కారిణిని నిర్బంధించడం వంటి నియంతృత్వ పోకడలను ఆయన తీవ్రంగా విమర్శి స్తుండడం వల్ల సౌదీ పాలకులు ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు కొన్ని ఆధా రాలు బయటపడ్డాయి. ఖుషోగ్గీ అదృశ్యంపై నిష్పాక్షిక విచారణ జరిగే విధంగా అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకురావాలి. అయితే సౌదీ యువరాజు సల్మాన్ అణచివేత విధానాలకు ట్రంప్ వత్తాసు ఉన్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు ఏ మేరకు స్పందించగలవన్నది అనుమానమే. సౌదీ చర్యలు గత కొంతకాలంగా ప్రపంచ దేశాలకు కొరుకుడుపడని విధంగా ఉండటానికి అమెరికా మద్దతే ప్రధాన కారణం. 2003లో అసమ్మతివాదిగా ముద్రపడి, జెనీవాలో తలదాచుకుంటున్న సౌ దీ రాజకుటుంబాలకు చెందిన ప్రిన్స్ సుల్తాన్ బిన్ తుర్కిని అపహరించి, తమ దేశానికి తరలించి శిక్షించడం, లెబనాన్ ప్రధానిని తమ దేశానికి అతిథిగా ఆహ్వా నించి, నిర్బంధించి రాజీనామా ప్రకటన చేయించడంపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సౌదీ ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది.

2011లో అరబ్ విప్లవం ఉనికిలోకి వచ్చిన నాటి నుంచి సౌదీ రాజకుటుం బానికి, టర్కీ అధినేత ఎర్డొగాన్‌కు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ-దుబాయ్), ఈజిప్టులలో అసమ్మతిని రెచ్చగొట్టేందుకు, ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థకు టర్కీ సహాయ సహ కారాలు అందిస్తోందని సౌదీ రాజకుటుంబం భావిస్తోంది. ఇదేవిధమైన ఆరోపణ లతో ఖతర్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడిన విషయం విదితమే. అదేవిధంగా 2016లో తనకు వ్యతిరేకంగా జరిగిన విఫల సైనిక తిరుగుబాటుకు కారణం సౌదీ అరేబియానే అని టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ భావిస్తున్నారు. దానికి తోడు  మధ్య ఆసియా ప్రాంతంలో జరుగుతున్న అంతర్యుద్ధాల్లోని పరస్పర విరుద్ధ శక్తుల పక్షం వహిస్తున్నాయి. తన మిత్రపక్షాల మధ్య ఏర్పడిన ఈ వైషమ్య స్థితిని పరిష్క రించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. టర్కీ, సౌదీ దౌత్య యుద్ధం ఇరాన్‌కు లాభించకూడదన్న లక్ష్యంతో అమెరికా పావులు కదుపుతోంది. రాజరిక కుట్రలు, హత్యలు బైజాంటిన్ రిపబ్లిక్ సంప్రదాయంలోనే కాకుండా, అంతర్యుద్ధ అగ్ని గుండంగా మారిన మధ్య ఆసియాలో ఇలాంటి అకృత్యాలు, అదృశ్యాలు సర్వసా దారణంగా మారాయి. పౌర హక్కులు, మీడియా హక్కులు సహా సకల ప్రజా స్వామిక సంప్రదాయాలు ఆవిరవుతున్నాయి. భౌగోళిక ఆర్థిక, రాజకీయ సమీ కరణలకు, స్థానిక నిరంకుశ రాజ్యాలకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా, దుబాయ్ తదితర దేశాల్లో మరో అరబ్ విప్లవం మొలుచుకు వచ్చి, అది సమగ్ర, నూతన ప్రజాస్వామిక ఉద్యమ స్థాయికి రూపాంతరం చెందితేనే అరబ్ ప్రజలకు ఉపశ మనం లభించగలదు. 
 యే న్యాల కత్తి పట్టమని సెప్తాంది

Updated By ManamWed, 10/17/2018 - 02:43

imageప్రతి కథకు ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యం ఆధారంగా ఆ కథను నడిపిస్తాడు కథకుడు. అనేక నేపథ్యాలలో ఫ్యాక్షన్ నేపథ్యం కూడా ఒకటి. ఫ్యాక్షన్ కథలను సినిమాగా తెరకెక్కిం చడం ఇదేం మొదటిసారేం కాదు. సినిమా అంత నరకడం, చంపడం చూపించి చివరగా ఈ సంస్కృతి వద్దు అని చెప్పడం పరిపాటిగా వస్తుంది. అలా వచ్చిన సినిమానే ‘అరవింద సమేత వీరరాఘవ’. రాయలసీమలో మనుషులను రాక్షసులుగా చూపించడం సినిమా వాళ్లకు మాములైంది. రాయలసీమలో మను షులు ఇలాగే ఉంటారనే భావన మిగతా ప్రాంతాల వారి కి పడిపోయింది. రాయలసీమలో ఊర్లకు ఊళ్లు ఫ్యాక్షన్ చేసు కోవడం ఎక్కడా కనపడరు. రెండు గ్రూపులు ఆధిపత్యం కోసం చేసుకునే దాడులనే ఫ్యాక్షన్‌గా ముద్రవేశారు. ఏ ప్రాంతంలో లేదు రెండు గ్రూపుల మధ్య తగాదా! అధికారం కోసం, ఆధిపత్యం కోసం ప్రతి చోట జరిగేవే! కానీ రాయలసీమలో జరిగితే ఫ్యాక్షన్ ముద్ర! ఈ ముద్ర నుంచి బయటపడాలని ఇప్పుడిప్పుడే ఈ ప్రాంత యువత చైతన్యమవుతుంది. కానీ ఈ సమయంలో ఫ్యాక్షన్ సీమ సినిమాల ద్వారా సీమ యువతకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఈ సినిమా దర్శకులు?
‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో హీరో ఊరి పేరు కొమ్మద్ది. ఇది కడప జిల్లా వీరపునాయనిపల్లె మండలంలో ఉంది. ఒకప్పుడు ఈ వూరు ఫ్యాక్షన్‌కు నలిగిన గ్రామం. ఫ్యాక్షన్ కోరలకు రక్తతర్పణం చేసిన గ్రామమే. కానీ ఇప్పుడు కాదు. దాదాపు 30 సంవత్సరాల క్రితం మాట అది. రెండు వర్గాలు ఇప్పటికీ అదే ఊర్లో ఉన్నాయి. వాళ్ల పిల్లలు మాత్రం పట్టణాలలో స్థిరపడ్డారు. వాళ్లకు ఇది ఒకకథగా మాత్రమే తెలుసు. కానీ సినిమా రూపంలో వచ్చిన తరువాత పాత గాయాలను మళ్లీ రేపుతున్నారని అక్కడి ప్రజలు చర్చించు కుంటున్నారు. సినిమాను సినిమాలా సూడమని సెప్తాన్నారు. కానీ పెద్దలు సెప్పిన ఒక మాట ఉంది. ‘మంచిని అంత త్వర గా నేర్చుకోలేరు. చెడు మాత్రం చాలా త్వరగా నేర్చుకుంటా’ రని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాతగాయాల మీద కారం సల్లె ప్రయత్నంలా చర్చించుకుంటున్నారు సీమ ప్రజా సంఘాలు. వాళ్ళే 30 సంవత్సరాలుగా శాంతియుతంగా బతు కుతున్నారు. మీరు బతకమని సెప్పేదేముంది. కర్నూలు కత్తులు, కడప బాంబులు యాడున్నాయ్ ఇప్పుడు మీరు సూపిచ్చే సినిమాలో తప్ప?
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొదటి రోజే ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా చూశా! నేను ఒక రీసెర్చ్ స్కాలర్ ను. నేను చూసిన తరువాత పీజీ విద్యార్థులను, నా సహచర పరిశోధక విద్యార్థులను సినిమా ఎట్టుంది నచ్చిందా అని అడిగా! నాకు వచ్చిన సమాధానం విని ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యా! నాకు వచ్చిన సమాధానం మాది కడప కదా! మాది రాయలసీమ కదా! అని అంతే నాకు ఇంక ఏమ్ మా ట్లాడాలనిపించలేదు. వీళ్లు ఇలా మాట్లాడటానికి కారణం ఏందా! అని మళ్ళీ ఒకసారి సినిమా చూశా! అప్పుడర్థమ యింది సినిమా అంతా స్టార్టింగ్‌లో ఉండే నలబై నిమిషాల ఫ్యాక్షన్ స్టోరీకి కనెక్ట్ అయ్యారని సినిమాలో డైలాగ్‌లు కూడా కొద్దిగా సీమ యువకుల మీద ప్రభావం చూపే విధంగా ఉండాయనిపించింది.

సినిమా చివరిలో విలన్‌తో పలికించిన డైలాగ్ గుర్తొస్తోంది. ‘ఈ న్యాల కూడా కత్తి పట్టమని సెప్తాంది’. ఈ డైలాగ్ రాయలసీమ ప్రాంతానికి మొత్తం ఆపాదించాడు. మా రాయ లసీమ నేల కత్తి పట్టమని యానాడు మాకు సెప్పలేదు. కాసిన్ని నీళ్లు ఇయ్యండి మీకు బువ్వపెడతానని మా మాడిపోతున్న కడుపులను సూసి దీనంగా అర్థిస్తోంది. నీళ్లు ల్యాక, వర్షాలు ల్యాక, నెర్రలిచ్చిన భూమి పొగలుకక్కుతూ కంటికి కనపడ కుండా రోదిస్తోంది. మా సీమలో వలసలు ఉన్నాయి, కరు వుంది, అన్నదాత ఆత్మహత్యలున్నాయి, పూటగడవడం కష్టమై పిల్లాపాపలతో వలసలు వెళ్లిన ఊర్లకు ఊర్లున్నాయి. ఎందుకు వలసెల్లుతున్నారని ఈ వలసలను ఇలా నిరోధించొచ్చని ఎవరు సినిమా తీయరు. వీళ్లకు కావలసిందల్లా నరకడం, చంపడం చివరకు మారాలి అని మెసేజ్ ఇవ్వడం. అందరికీ కనెక్ట్ అయ్యే ది మాత్రం నరికేదే! ఆ విషయం ఈ దర్శకులకెప్పుడు అర్థమ వుతుందో మా సీమబాధలను ఎప్పుడు సినిమాలుగా వస్తాయో!?
మరొక డైలాగ్ ‘కదిరప్పా ఇడ మందిలేరా, కత్తులు లేవా!’ అంటే సీమలో మంది ఉంటే కత్తులు పట్టుకుని తిరగలా! ఏమ్ పెన్ను పట్టుకుని అక్షరాలు నేర్చుకుని మీ జీవితాలు మార్చు కోండ్రా అని మెసేజ్ ఇవ్వొచ్చుగా! ఇవ్వరు ఎందుకంటే సీమ సినిమాలో కత్తి పట్టుకుంటేనే కలెక్షన్స్! పెన్ను పట్టిస్తే ఫ్లాప్ అవుతుందని భయం. మీ కలెక్షన్స్ కోసం ఇంకా సీమ సినిమాలలో నరకడం, చంపడం చూపడం మానండి. ఎండిపోతున్న మా నాలుకలకు కాసిన్ని నీళ్లు ఇచ్చే సినిమాలు తీయండి. ఇంకా ఎన్నాళ్లు నరకడం, చంపడం సూపిస్తారు. ఒకసారి ఆలోచించం డి. ఇప్పుడు ఫ్యాక్షన్ మీరు సూపించేంత లేదు. అసలు ఫ్యాక్షనే లేదు. అది ఒకసారి గుర్తించి ఎడారి సీమ బతుకులను సినిమా లుగా తీయండి.

ఇక ఈ సినిమాలో రాయలసీమ యాసను బాగా వాడారు అందుకు ఆనందపడ్డా! ‘జేజి’ అనే పదం సినిమాలో వినగానే ఒకింత ఒళ్లు పులకరించింది. చాల మంచిపదాన్ని పరిచయం చేశారు. అలాగే సీమలో స్త్రీలు తాము ముండ మోసినా మరో స్త్రీ ముండ మోయాలని ఎవరు కోరుకోరని సీమ స్త్రీలలో ఉండే కల్మషం లేని మనస్తత్వాన్ని చూపించినందుకు అభినందించాలి. సీమలో ఫ్యాక్షన్ సంస్కృతి విడనాడాలనే మార్పు మీద తీసిన సినిమా ఫ్యాక్షన్‌ను ఆకాశానికి చూపించి మార్పును మాత్రం పాతాళంలో చూపిచ్చినట్టనిపించింది. ఏది ఏమయినా ఇప్పటి నుంచి వచ్చే సీమ నేపథ్య సినిమాలయినా సీమ బతుకు వెత లను సూపించాలని దర్శకులకు విన్నవించుకుంటున్నాం!
వెంకట నరేంద్ర ప్రసాద్
రాయలసీమ విశ్వవిద్యాలయాల పరిశోధకుల సంఘం
9177509623పారిశ్రామిక పూజారికి పురస్కారమా!

Updated By ManamSat, 10/13/2018 - 01:14

imageఅక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా స్వయంగా ప్రధాని నేతృత్వంలో ‘స్వ ఛ్ భారత్’ నిర్వహించాలని నిర్ణయించారు. తాను చెప్పిందే అనుసరించే మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుని నేటి రాజకీయ నాయకులు అలా ప్రవర్తిస్తారని భావించడం ఊహాజనితమే కాగలదు. అయితే, మహాత్ముడికి ఘనంగా నివాళులర్పించి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తామని ఎవరికి వారు ప్రతినలు బూనారు. మహాత్ముడికి మూసధోరణిలో ఆపాదించే వాటిల్లో ఒక అంశాన్ని ప్రస్తుత పాలకులు ముఖ్యంగా ప్రచారం చేసుకునేందుకు తగినదని భావిస్తున్నారు. ‘స్వాతంత్య్రం కంటే పరిశుభ్రతే ప్రధానైవెునద’ని ఆయన చేసినట్లుగా చెబుతున్న ప్రకటనను ఉద్దేశపూర్వకంగా ఉ దహరిస్తున్నారు. ఈ ప్రకటనను ఒకరకమైన ఉద్వేగం నిండిన సభికులకు తెలియజెప్పడం ద్వారా పూర్వపు పాలకుల పట్ల అనుమానాస్పద వైఖరిని ప్రదర్శించి, తమైపె విశ్వాసం ప్రకటించే అవకాశాలున్నాయని ప్రస్తుత పాలకులు భావిస్తున్నారు.
 
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తరువాత ప్రకటించిన కార్యక్రమాల్లో ‘స్వఛ్‌భారత్’ మొట్టమొదటిది. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తరువాత వివిధ హిందు దేవతలకు భక్తుైడెన మా తాతగారిని స్ఫురణకు తీసుకొచ్చింది. ఆయా దేవతామూర్తులను ఆయన పూజగదిలో ప్రతిష్టిం చారు. అసలు పూజ ప్రారంభమవడానికి ముందు ఆయన దేవతా విగ్రహాలను శుభ్రపరిచేవారు.  చిన్నవయసులో అంటే పది పన్నెండే ళ్ల వయసులో ఈ సంప్రదాయ సంక్లిష్టైమెన పూజావిధానాన్ని, ఆచార ప్రక్రియను గమనించేవాడిని. ఆయన రోజుకు ఈ విధంగా ఐదుగంటల పాటు పూజలుచేసేవారు. పది పన్నెండేళ్ల వయసులో కొ న్నిసార్లు ఆసక్తిగా నేను పాల్గొనేవాడిని. గట్టిగా గం ట కొట్టడం, చిన్నచిన్న పనులు నిర్వర్తించేవాడిని. నేను పెద్దవాడిని అవుతున్నకొద్దీ ఐదుగంటల తరువాతగానీ లేదా ఐదేళ్ల తరువాతగానీ ఎప్పుడో ఒకప్పుడు ఆయనీ ఆచారం నుంచి బయటపడతారని భావించాను. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘స్వఛ్‌భారత్’ కార్యక్రమం మా తాతగారి ఆచార వ్యవహారాల్లో భాగంగా నిత్యం చేసే పూజాది కార్య క్రమాలతో పోల్చదగినదిగా లేదు. గత ఐదేళ్లుగా ప్రధాని మోదీ మనకు పాలనను అందించాల్సి ఉంది. విశ్వాసం, ఆధ్యాత్మికతపై ఆధారపడకుండా నాణ్యైమెన పరిపాలన అందించవచ్చు. పర్యావరణంలో నాణ్యతను పర్యావరణ ప్రభావాలను అంచనావేయడం ద్వారా గమనించవచ్చు. మోదీ హయాంలో ఏమాత్రం పర్యావరణ పాలన అందిం చారో అంచనా వేసుకుని పర్యావరణకు ఏవేురకు చట్టబద్ధత కల్పించారో తెలుసుకోవచ్చు. 

స్వఛ్‌భారత్ వంటి పర్యావరణాన్ని కాపాడే విధానాలను అమలుచేస్తున్నందుకు గాంధీ జయంతి తరువాతి రోజు అంటే అక్టోబర్ మూడో తేదీన మోదీకి ‘చాంపియన్ ఆఫ్ ఎర్త్’ అవార్డును ఐక్యరా జ్య సమితి ప్రకటించింది. స్వఛ్‌భారత్ మిషన్ కొ న్ని విజయాలను నమోదుచేసినప్పటికీ పర్యావరణ సమస్యలు గత రెండు దశాబ్దాలుగా చుట్టుముట్టి ఉన్నాయని కొంతమంది గుర్తుచేస్తున్నారు. స్వఛ్‌భారత్ విజయానికి సంబంధించి అకాల ఉత్సవాలు జరుపుకోవడం సరికాదని నా అభిప్రాయం. దేశ పౌరులుగా వాస్తవాల్ని గ్రహించాల్సిన బాధ్యత మనపై ఉన్నది.

గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ రెండు పర్యాయాల హయాంలో పారిశ్రామిక విధానం పేరుతో రెండు పారిశ్రామిక వాడలను స్థాపించా రు. వాపి, అంకలేశ్వర్ పారిశ్రామికవాడలు దేశం లోనే కాలుష్య కారకాలుగా నిలుస్తున్నాయి. కాం ప్లెక్స్ ఎన్విరాన్‌మెంటల్ పొల్యూషన్ ఇండెక్స్ ప్రకారం, ఈ రెండు ప్రాంతాలు వరుసగా 88.5, 88.09 శాతం కాలుష్యానికి కారకాలుగా ఉన్నాయి. ఈరోజుకి కూడా వాపి ఈ జాబితాలో అగ్రభాగానే ఉన్న ది. దేశంలో గుర్తించిన 43 తీవ్ర కాలుష్యప్రాంతా ల్లో 2009 నాటికి గుజరాత్‌కు చెందిన తొమ్మిది ప్రాంతాలున్నాయి. 2016 నాటికి ఈ 43 ప్రాంతాల జాబితాలో ఉన్న కర్ణాటకకు చెందిన భద్రావతి చె ప్పుకోదగిన అభివృద్ధి సాధించింది. ఆరు మాత్రం స్వల్పంగా అభివృద్ధి చెందాయి.  2016 పరిస్థితిని పరిశీలిస్తే ఈ 43 ప్రాంతాల్లో 36 ప్రాంతాల పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉన్నది. వీటిలో 61 శాతం  బీజేపీ పరిపాలనలోనే ఉన్నాయి. బీజేపీ పాలనలో  ని ప్రదేశాల్లో 10 ప్రాంతాలు తీవ్ర కాలుష్యవలలో చిక్కుకోగా, కాలుష్య స్థాయిలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. బహిరంగ మలవిసర్జన పెద్ద సమస్యగా పరిణమించిన నేపథ్యంలో ఈ సమస్యపై వెంటనే పరిష్కార చర్యలు చేపట్టవలసి ఉన్నది. తీ వ్ర పర్యావరణ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాం తాల్లో ఎక్కువగా కాలుష్యం పారిశ్రామికవాడల వ ల్లే వస్తోంది. విషతుల్యైమెన, ప్రమాదకర వ్యర్థాల ను బహిరంగంగా పారవేయడం వల్లనే ఈ పరిస్థితి త లెత్తుతోంది. ఈ విషాలు పర్యావరణంలో, నీరు, భూమి, గాలిలో కలిసిపోయి సహజవనరులపై తీ వ్ర ప్రభావం చూపుతున్నాయి. సహజవనరులను వినియోగించుకోలేక అనేక అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఫలితంగా క్యాన్సర్, ప్రపంచం లో ఔషధ నిరోధక సూక్ష్మజీవులను వ్యాప్తిచేస్తాయి. 

తెలంగాణలోని బొల్లారం-పటాన్‌చెరు ప్రాం తంలో 2009 నుంచి 2016 వరకు సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక (సెపి - ఇఉ్కఐ) 70.07 నుంచి 76.05కు పెరిగింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తలు నడుపుతున్న ఫార్మా పరిశ్రమల వల్లే ఈ ప్రాంతంలో పర్యావరణ సమ స్య తలెత్తుతోంది. అంతేగాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీని ప్రకటించడం కూడా ఆందోళన కలిగించే విషయం. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అవసరైమెన అనుమతులు మంజూరుచేసింది. దీనికి తోడు అటు కేంద్ర ప్రభుత్వం వద్దగానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వద్దగానీ పారిశ్రామికమైన గొప్ప పర్యావరణ పాలనా సూచికలు లేవు. సెపీ గణనను లె క్కించే పద్ధతిని మోదీ ప్రభుత్వం మార్చివేసింది. దాంతో ఇకముందు బాధితులకు సంబంధించిన అవగాహనలను అందించలేం. 1995లో పర్యావర ణ పరిరక్షణ చట్టం 1985కు సవరణ చేశారు. బాధితుల గొంతును తగ్గించేందుకు సెపీలో కాలుష్య లెక్కను తగ్గించారు. బాధితుల గొంతును నొక్కే తొందరపాటు చర్యలు తీసుకుని గట్టిగా పరిశుభ్రత గురించి గొంతుచించుకుంటే మాత్రం ప్రయోజనం ఉండదు. పర్యావరణ పాలనలో వైఫల్యాలను గు ర్తించడానికి బదులు పారిశ్రామికవేత్తల వల్లనే కా లుష్యానికి కారణమవుతోంది. కార్పొరేషన్లకు ఆధునిక బ్రాహ్మణ పూజారిగా ఉన్న వ్యక్తికి దక్షిణగా ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు లభించింది. తమకోసం ఆచారాలను గత ఐదేళ్లుగా పాటిస్తున్న మోదీకి వారే ఈ అవార్డును అందజేశారు. 

- డాక్టర్ జి. విజయ్
స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, 
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్

 కత్తి దెబ్బల్ని మించిన దెబ్బలు!

Updated By ManamSat, 10/13/2018 - 01:14

అమృత, పెద్ద కులం అమ్మాయి. ప్రణయ్, చిన్న కులం అబ్బాయి. వాళ్ళు పరస్పరం ఇష్టపడి, పెద్ద కులం పెద్దలు ఇష్టపడకపోయినా, వాళ్ళిద్దరూ స్వతం త్రించి పెళ్ళి చేసుకుని, వాళ్ళ దారిన వాళ్ళు  బతుకు తూ వుంటే, తర్వాత ఆ అబ్బాయికి ఎటువంటి ఘో రం జరిగిందో, దానివల్ల ఆ అమ్మాయి పరిస్థితి ఎం త విషాదకరంగా అయిపోయిందో, అందరికీ తెలిసిం దే. ఈ సందర్భంలో, మొట్ట మొదట మాట్లాడుకో వలిసింది, ‘కుల విధానం’ గురించే. 

కుల విధానంలో, చిన్నా-పెద్దా కులాలు ఉన్నా యనే మాటల్ని, చిన్న కులాల వారు పూర్తిగా తిరస్కరి స్తారు.image ‘కులాల్లో, చిన్నా-పెద్దా అంటారెందుకూ? అన్ని కులాలూ సమానం కాదా? మీ కులం ఎలాం టిదో, మా కులమూ అలాంటిదే’ అంటూ ఈ మధ్య కొత్త వాదన చెయ్యడం చూస్తున్నాం. కులాల్లో చిన్నా- పెద్దా తేడాలు లేకుండా, అన్నీ సమానమే అయితే, అన్నీ ఒకటే అయితే, అప్పుడు ‘కుల విధానం’ ఎం దుకు వున్నట్టు? - అని వాళ్ళు బొత్తిగా గ్రహించరు. ‘మా కులాన్ని చిన్నకులాలు అంటారా?’- అని కోపం తెచ్చుకుంటారు. మళ్ళీ వీళ్ళే, ‘కుల విధానం, నిచ్చెన మెట్ల విధానం’ అని అంబేడ్కర్ మాటల్నే ఉటంకి స్తారు. నిచ్చెన మెట్లు ఎలా ఉంటాయి? ఒక మెట్టు, అన్నిటికన్నా పైన వుంటే, ఒక మెట్టు అన్నిటి కన్నా అడుగున ఉంటుంది కదా? మిగిలిన మెట్లు ఎలా ఉం టాయి? అవి అన్నీ ఒకేచోట వుండవు. నిచ్చెనకి కింది నించి చూస్తే, దాని మెట్లు ఒక దాని కంటే ఒకటి పైన ఉంటాయి; లేదా, నిచ్చెనని పైనించి చూస్తే, ఆ మెట్లు, ఒక దానికంటే ఒకటి కింద ఉంటాయి! ‘కుల విధానం’లో, కులాలు, నిచ్చెనమెట్ల రకంగా ఉన్నట్టు పోల్చడం, పూర్తిగా సరైన పోలిక. సమాజంలో జనా భా, ఇన్ని తక్కువ-ఎక్కువ స్థాయిల్లో వుంటే, వాళ్ళ భావాలు సమానంగా ఎలా ఉంటాయి?

చిన్న కులాల వారు, ‘అన్ని కులాలూ సమానమే’ అనే కొత్త వాదన చేస్తూనే; ‘కుల విధానమే పోవాలి’ అనే వాదన కూడా చేస్తారు. అన్ని కులాలూ సమాన మే అయితే, ఇక ఆ విధానం పోయినట్టే కదా? అసలు కులాల్లో పరిస్థితులు ఎలా వున్నాయో, ఆ పరిస్థితు లు ఎలా మారాలో, ఆ విషయాల్ని, ఏ కులం వాళ్ళ యినా అర్థం చేసుకోరు. కుల విధానాన్ని తీసివేసే చట్టాలు చెయ్యాలంటారు. చట్టాలు నిజంగా అమలు జరిగితే, ‘2 గ్లాసుల పద్ధతి’ వంటి అస్పృశ్యత విధా నాలన్నీ పోతాయి. కానీ, ‘కులాంతర వివాహాలు’ జర గాలంటే, ఆ మార్పు, చిన్నా-పెద్దా కులాల యువతీ యువకుల ప్రేమానురాగాల ద్వారా గానీ; లేదా పెద్ద ల ‘సంస్కరణ’ భావాల ద్వారా గానీ జరగాలి. ‘ప్రే మ’ గానీ, ‘సంస్కరణ’ గానీ, శ్రమ సంబంధాల్లో తీ వ్రమైన భేదాలు వున్న పరిస్థితుల్లో జరగవు. అలా జ రగడం లేదు. చిన్నకులాల యువతీ యువకులు చేసే అట్టడుగు శ్రమలు, మేధాశ్రమల వేపు మారడం వల్ల మాత్రమే వారికి, పెద్ద కులాల వారితో వివాహాలు జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు, కేవలం ‘చట్టాల’ ద్వారా మాత్రం జరగవు. ఒక చిన్నకులం మనిషికీ, ఒక పెద్దకులం మనిషికీ వివాహం జరగా లని, ఏ చట్టమూ ఆజ్ఞాపించలేదు. చిన్నా-పెద్దాకులా ల గురించి పెద్ద వాళ్ళకు వుండే స్పష్టతలూ, వ్యతి రేక తలూ, చిన్నవయసుల వాళ్ళకి అదేరకంగా వుండవు.

అమృత మీద, ఎక్కువ మందికి మొట్టమొదటి విమర్శ ఏమిటంటే, ‘తొమ్మిదో తరగతిలోనే ప్రేమా? చదువుకోమని స్కూలుకి పంపితే, చక్కగా చదువు కోవాలి గానీ, ప్రేమా దోమా ఏమిటి?’ అనే విమర్శే! తొమ్మిదో తరగతి అంటే, కనీసం 14 ఏళ్ళ వయసు. 16 ఏళ్ళ వయసుని అయితే గొప్పగా పొగుడుతారు. 16 ఏళ్ళ వయసు మాత్రం ప్రేమకు తగిన పెద్ద వ యసా? 16 ఏళ్ళ వయసుతో పోలిస్తే 14 ఏళ్ళ వయ సు చిన్న వయసే గానీ, ఆ వయసులో ‘ప్రేమ’ వంటి స్పందన ఎక్కువ మంది పిల్లలకు కలగక పోవచ్చు; కానీ, అలా కలగడంలో అసహజత్వం ఏమీలేదు. ఒక మనిషికి, రెండో మనిషితో ‘స్నేహం’ ఎలా మొద లవుతుందో, అలాగే ఒక ‘ఆకర్షణ వంటి ఇష్టం’ మొద లు కావచ్చు. ఆకర్షణ, మొట్టమొదటే ‘శారీరక సంబం ధం’ దృష్టితో వుండదు. రెండో మనిషి రూపురేఖలో, ప్రవర్తనో, మాటలో, స్నేహభావమో, క్రమక్రమంగా ఇద్దరు యువతీ యువకుల మధ్య ‘ఇష్టం’గా ఏర్పడ వచ్చు. అమృతా-ప్రణయ్‌ుల మధ్య ఎలా జరిగిందో ఆ వివరాలు ఇక్కడ అక్కరలేదు. వాళ్ళ మధ్య ఇష్టా లు, స్థిరంగానే ఏర్పడ్డాయి. వాళ్ళకి ప్రారంభంలో, ఒక రి కులం ఒకరికి తెలీదు. ఒకరి ఆర్ధిక పరిస్థితులు ఒక రికి తెలీవు. ఆ అమ్మాయి కుటుంబానికి వున్న ‘ఆస్తి’ని చూసి ఆ అబ్బాయి ఆశపడ్డాడని గానీ, ఆ అబ్బాయి అందాన్ని చూసి ఆ అమ్మాయి ఆశ పడిందని గానీ, అలా తేల్చడానికి అవకాశం లేదు. ఆ అమ్మాయి, తన 9వ తరగతి నించీ అతన్ని గమనిస్తూ వున్నా, ఆ అమ్మాయికి ఆనాడే అతనితో వివాహం ఆలోచన ఉం డదు. వాళ్ళ ఇష్టాలు పెరగడానికీ, స్థిరపడడానికీ, కొం తకాలం తప్పనిసరిగా పడుతుంది.
ఆ అమ్మాయికి, ఆ అబ్బాయి మీద వున్న ‘ఇష్టం’ సంగతి, ఆ అమ్మాయి ఇంటి వాళ్ళకి ఎలా తెలిసింది? ఎవరి ద్వారా తెలిసింది? - ఈ విషయాలు స్పష్టంగా తెలియలేదు. ఆమె సంగతి, ఇంటి వాళ్ళకి తెలియడం అయితే జరిగింది! అప్పుడు వాళ్ళేం చెయ్యాలి? ఆ అబ్బాయి గురించి వివరాలు ఆమెని అడగాలి. ‘అత ను మంచివాడేనా? మంచి వాడని నీకెలా తెలుసు?’ అని అడిగి, ఆమె ఇష్టాన్ని గమనించాలి. ఆ అబ్బాయి ఎటువంటివాడో తెలుసుకోవాలని, ఆ తండ్రి తన ప్రయత్నాలు తను చెయ్యాలి. అతను చెడ్డవాడనే స మాచారం దొరికితే, ఆ నిజాల్ని ఆమె ముందు పెట్టా లి. ఆ తల్లిదండ్రులు అలాంటివేమీ చెయ్యలేదు. అత ని గురించి, ‘ఏం కులం? ఏం కులం?’ అని పదేపదే అడిగేవారనీ, ‘ఆ కులమా!’ అని మాత్రం అనే వార నీ, ఆమె చెప్పింది. ఆ కులం తెలిసి ఆమెని తిట్టడం, కొట్టడం, ‘నీకు ఆస్తి ఇవ్వం’ అనడం, వంటివన్నీ చేశా రు. ఆ తిరస్కారాలతో ఆమె ఇష్టం మరింత ఎదిగి వుంటుంది. 

సాధారణంగా, పెద్దకులం అమ్మాయికి, చిన్న కు లం అబ్బాయి మీద వ్యతిరేకతే వుంటుంది. కానీ, ఈ అమ్మాయికి చిన్నకులం మీద అటువంటి వ్యతిరేకత కలగలేదంటే, దాన్ని ఆమె సంస్కారంగానే భావించా లి. ‘ఆ అమ్మాయికి తొమ్మిదో తరగతి నించే ప్రేమా?’ అని, మీటింగులు పెట్టి విమర్శలు గుప్పించిన వాళ్ళు, ఈనాటికీ జరుగుతోన్న బాల్య వివాహాల గురించి ఎ ప్పుడైనా మీటింగులు పెట్టి మాట్లాడారా? హిందూ మత సంస్కృతి ప్రకారం, ఆడపిల్లకి 8 ఏళ్ళు నిండక ముందే పెళ్ళిచెయ్యాలి - అని వుండేది. 8 ఏళ్ళు దాటకుండా పెళ్ళిచేస్తే, ఆ పిల్ల, 13వ ఏడాది నాటికి ‘పెద్దమనిషి’ అవుతుంది. ఇక అప్పుడు ఆ పిల్ల, భర్త తో సంసారానికి సిద్ధమైపోయినట్టే! పెద్దమనిషి అయి న తర్వాత, ఒకటి రెండు నెలల్లోనే ‘శోభనం’ పేరుతో సంసారం! ఇది అంతా 13వ ఏడాదిలోనే. ఆ పిల్ల, 14వ ఏడాదిలోనే తల్లి కూడా అయిన సందర్భాలు అనేకం వున్నాయి. ఆడపిల్లల్ని 13వ సంవత్సరంలోనే కాపురానికి సిద్ధం చెయ్యడంలో, ఏ తప్పూ లేదు గానీ, ఒక అమ్మాయికి 14వ ఏడాది తర్వాత క్రమంగా ఒక అబ్బాయి మీద ఇష్టం పెరగడంలో తప్పు వుందా?

ఆ అమ్మాయి చేసిన తప్పొప్పులు నిర్ణయించ డానికి, బైటి పెద్దలందరూ సభలూ, సమావేశాలూ ప్రారంభించి, చర్చలు కొనసాగించి, చివరికి, ‘ఆ తం డ్రి, కూతుర్ని ఎంత ప్రేమించాడు! అసలు, తల్లిదం డ్రులు పిల్లల్ని ఎంత ప్రేమిస్తారు!’ అంటూ తల్లిదం డ్రుల గురించి భజనలు చేశారు! తల్లిదండ్రులు ఎం తెంత మూర్ఖులుగా ప్రవర్తిస్తారో; ఎందరు తల్లిదం డ్రులు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ చేతులతోనే చంపుకున్నా రో, అనేకసార్లు చూశాం; రోజూ చూస్తున్నాం! తల్లి దండ్రులైన వాళ్ళు, తమ చిన్నతనాల్లో, తమ తల్లిదం డ్రుల చేత తన్నులు తింటూ పెరిగి, ఇక వాళ్ళు తమ అధికారాల్ని తమ పిల్లల మీద చూపిస్తారు. ఇదంతా ఇప్పుడు కూడా జరుగుతున్నదే.

అసలు ‘వివాహం’ అనేది, నూటికి నూరు పా ళ్ళూ, ఆ వివాహం చేసుకునేవాళ్ళ హక్కు! పిల్లల ‘వివాహం’ మీద, తల్లిదండ్రుల హక్కులేమీ వుండవు. ఇది, చట్టాల విషయం కాదు. పిల్లల క్షేమాన్ని కోరే తల్లిదండ్రులైతే, పిల్లల నిర్ణయాలు తమకు నచ్చక పో తే, ఆ విషయాల్లో పిల్లలకి నచ్చచెప్పడానికి మొదట్లో ప్రయత్నించాలి. అది సాధ్యంకాకపోతే, పిల్లలకి దణ్ణా లు పెట్టి తమ నోళ్ళు మూసుకోవాలి. ఆ నచ్చని పిల్ల లతో సంబంధాలు ఇష్టం కాకపోతే వాటిని ఆపేసు కోవాలి. అంతేగానీ, పిల్లల వివాహాల మీద పెత్తనాలు సాగిస్తూపోతే, ఆ మూర్ఖుల చేతుల్లో పిల్లలు లొంగి పోయి బతకనక్కరలేదు.

అమృత, తన ఇష్టం గురించి, తల్లిదండ్రులకు చెప్పుకోడానికి కొంతకాలం ప్రయత్నించి, అది సా ద్యం కాదని గ్రహించిన తర్వాతే తనదారి తను చూసుకుంది. ఆమె భర్త, కత్తి దెబ్బలతో మరణించి వుండకపోతే, తను నమ్మిన వ్యక్తితో తను సుఖంగానే బతికేది.

‘ప్రేమ వివాహాలు నిలబడతాయా? ఎంత మం ది విడిపోతున్నారో చూడండి’ అంటాడు ఒక పెద్ద మనిషి, ఒక మీటింగులో. (నేను చూసినవన్నీ వీడి యోలే.) తల్లిదండ్రులు కట్నాలిచ్చి, కానుకలిచ్చి, ఒకే కులంలో చేసిన పెళ్ళిళ్ళలో విడాకులు జరగడంలేదా? అది, ప్రేమ వివాహాల్లోనూ జరిగితే జరుగుతుంది. భార్యాభర్తల్లో, ఒకరి వేపు నిజాయితీ లేనప్పుడే అలా జరుగుతాయి. అమృత, తల్లిదండ్రుల మాట వినక పోవడం పెద్దనేరంగా కనపడుతోంది, మీటింగులు పెట్టుకున్న పెద్దలకి! ఈ పెద్దల భయం, తమ పిల్లలు, తమని ధిక్కరించి, పోతారేమోనని కావచ్చు!

ఒక దళిత యువకుణ్ణి హత్య చేయించిన పెద్ద కులంవాణ్ణి, ఎంతమంది మెచ్చుకుంటున్నట్టు మా ట్లాడారో, మీటింగుల్లో! కాకపోతే, ‘హత్య చేయిం చడం తప్పే అనుకోండీ’ అని ఒక్క దొంగమాట అనే సి, తర్వాత ఆ హంతకుణ్ణి పొగడడమే. ఆ హంతకు డికి కోట్ల కోట్ల డబ్బు వుండడమే, వాడి మీద బైటి వాళ్ళ మెచ్చుకోళ్ళు!

ఒక పెద్ద మనిషి, ఎలా వాగాడంటే, ‘అసలు అది ప్రేమా? కామంతో వెళ్ళింది’ అంటూ ప్రేలాపన! ‘కామం’తో అయితే ఆ మనిషి కోసమే నిరీక్షించన క్కరలేదు. ‘ప్రేమ’ పేరుతో ఆడపిల్లల మీద యాసిడ్లు పొయ్యడం చేసే నీచుల్ని గురించి అయితే, ‘వాడిది ప్రేమా? కామంతో వాడి కళ్ళు మూసుకుపోయాయి గానీ’ అను! ఆ సందర్భాల్లో అనవలిసిన మాట అది. అటువంటి సందర్భమా ఇది? ఇక్కడ తల్లిదండ్రుల్ని వదిలెయ్యడం ఎందుకు జరిగింది? వాళ్ళు తల్లిదండ్రు ల్లా ప్రవర్తించలేదు కాబట్టి!

‘ఆ అమ్మాయి, తన కడుపులో వున్న బిడ్డ కోసం ప్రేమ చూపిస్తోంది కదా? ఆమె తల్లిదండ్రులు ఆమెని ఇంతకాలంగా అలా ప్రేమతో పెంచలేదా?’ - అం టున్నారు, కొందరు పెద్దలూ, కొందరు చిన్నలూ కూడా! పెంచక ఏం చేస్తారు? కన్నారు కాబట్టి పెం చారు. అది వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యత, పిల్లల వివా హాల మీద కూడా సాగవలిసింది కాదు. తల్లిదండ్రులు పెత్తందారులు కాకపోతే, వాళ్ళని మరణాల దాకా పిల్ల లు బాధ్యతగానే చూసుకోవాలి. పెత్తందారులు కాని తల్లిదండ్రుల్ని, పిల్లలు పట్టించుకోని సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. వాటి సంగతి ఇక్కడ కాదు.
ఇక్కడ, తండ్రి అనేవాడు, కూతురు జీవితాన్ని ధ్వంసం చేశాడు కాబట్టి, ఆ తండ్రికి ‘మరణ శిక్ష’ పడాలనే కూతురు కోరింది! అమృత ప్రేమ నిజమై నది - అనడానికి కారణం, ఆమె పెద్ద కులంలో పుట్టి పెరిగినా, చిన్న కులాల్ని వ్యతిరేకించ లేదు. తండ్రికి వున్న కోట్ల కోట్ల ఆస్తిని లక్ష్యపెట్టలేదు. తన ప్రియుడు ఆస్తిపరుడు కాడనీ, గేదెల్ని పెట్టుకుని పాల వ్యాపారం వంటిది చేసి బతకదలిచిన ఆస్తి హీనుడనీ తెలిసినా, అతని మీద ఆమె ఇష్టం తగ్గలేదు!

ఒక ఇంటర్వ్యూలో ఒక పెద్ద మనిషి ఇలా అంటా డు: ‘ఆమె, ఇంకా పుట్టని తన కడుపులో వున్న బిడ్డని ప్రేమిస్తోందే! అలాగే, తన తండ్రి తనని ప్రేమించా డని తెలుసుకోవద్దా?’ అని! అమృత అయితే, బిడ్డ మీద ప్రేమ తెలిసిన తల్లి అవుతుంది. ఆ బిడ్డ పుట్టి, ఇరవై యేళ్ళు పెరిగి పెద్దదై, తను ఎవరినో పెళ్ళాడ దలిచానని తల్లికి చెపితే, ఈ తల్లి, దుష్టుడైన తన తండ్రి ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తుందా? అలా ప్రవర్తిం చదు. ‘నీ ఇష్టం అమ్మా! నీ సంతోషమే, నా సంతో షం!’ అంటుంది. ఒక పశువు రకపు పెద్ద, (పశువు లన్నీ క్షమించాలి) ఏమన్నాడో విన్నారా? ‘ఆమెకి అత్తగారింట్లో ఎన్నాళ్ళు గడుస్తుంది? గడవదు. ఆమె, తన పుట్టింటికి చేరవలిసింది. తండ్రి వుంటేనే ఆమెకి రక్షణ’ - ఇదీ వాడి వాగుడు! హత్య చేయించి, జైల్లో పడ్డ వాడు, బైటికి రావాలట! అమృతకి అత్తింట్లో గడవక పోతే, ఏదైనా చిన్న పనిచేసుకుంటూ, తన బిడ్డని తను పెంచుకోలేదా? తన జీవితాన్ని ధ్వంసం చేసిన పశువుతో మళ్ళీ కలవడమా! 
అమృత మీద సాగిన విమర్శలు కత్తి దెబ్బల్ని మించిన క్రూర విమర్శలే. మరణించిన నిర్దోషి యువకుడు అయితే, హఠాత్తుగా మరణించాడు. కానీ, అమృత మీద దాడి చేసే విమర్శలు, ఆమెని చాలా పీడిస్తాయి. కానీ, మరణించిన భర్త మీద ఆమె ఇష్టా న్ని మరింతగా పెంచి, స్థిరం చేస్తాయి.

నాకైతే, అమృత మీద విమర్శ, ఆమె ప్రేమ గురించి కాదు; ఆమె పెళ్ళి గురించి కాదు. తమ భార్యాభర్తల ప్రేమని, తమ స్వంత అనుభూతులుగా దాచుకోక, కెమెరాల మనుషుల ముందు సినిమా ప్రే మలుగా ప్రదర్శించుకోవడం గురించి మాత్రమే. భా ర్యాభర్తల ప్రేమకు, వారి ప్రైవసీ వారికి వుండాలని నేను అనడాన్ని కూడా ఒక ‘కత్తి దెబ్బ’ లాగే వాదించే వాళ్ళు ఉంటారనుకోండీ!

- రంగనాయకమ్మ  పోట్లాడే పొట్టేళ్ల మధ్యలో...

Updated By ManamSat, 10/13/2018 - 01:14

imageఅమెరికా, చైనా (రష్యా, ఈయూల దన్నుతో) సామ్రాజ్యవాద శక్తులు భౌగోళిక ఆర్థిక, రాజకీయ ఆధిపత్యం కోసం పొట్టేళ్లలా పోట్లాడుకుంటున్నాయి. ఈ నేప థ్యంలో అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం పరాకాష్టకు చేరడంతో గత దశాబ్దకాలంగా చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణనీయంగా క్షీణించింది. ఎగుమతులు గత రెండేళ్ళలో వేగంగా పడిపోయాయి. భారీ మౌలిక సదుపా యాల కోసం రుణాలు తీసుకున్న వెనుకబడిన దేశాలు చెల్లింపుల విషయంలో ఇబ్బంది పడుతుండడంతో చైనా తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ నిర్మాణ ప్రాజెక్ట్‌పై ఆయా దేశాల ఉంచి అనేక సందేహాల నీలినీడలు కమ్ముకున్నాయి. అదే సమ యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 2007 గృహ రుణాల సంక్షోభం (సబ్ ప్రైం క్రైసిస్) నుంచి వేగంగా క్షీణిస్తూ, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రపంచార్థిక సంక్షో భంలో దాదాపుగా కుదేలయిన దుస్థితికి చేరుకుంది. ప్రధానంగా చైనాతో వాణిజ్య లోటు భరించలేని స్థాయికి చేరుకోవడమే కాక, అంతర్జాతీయ చైనా సరుకులతో పోటీ పడలేక అమెరికా కంపెనీలు అనేకం పడకేశాయి. 

అమెరికా వినియోగ దారుల మార్కెట్‌లో చైనా సరుకుల మాయ కొనసాగడమే కాక, ద్రవ్య వాణిజ్యం, లావాదేవీల్లోను ఆ దేశం నుంచి అమెరికా అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచీకరణ క్రమానికి గండికొడుతూ అమెరికా స్వీయరక్షణ ఆర్థిక విధానాలను చేపట్టడమే కాక, దిగుమతి సుంకాలను పెంచుతూ గ్లోబల్ వాణిజ్య యుద్ధానికి తెరలేపింది. అనేక దేశాల నుంచి తాను దిగుమతి చేసుకుంటున్న సరు కులపై సుంకాలను విధించి, ఆయాదేశాలు అమెరికా సరుకులపై ప్రతి సుంకా లను విధించడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. అమెరికా వాణిజ్య ఫిరంగులు భారతీయ ఎగుమతులను వదిలిపెట్టలేదు. రష్యాతో రక్షణ ఒప్పందాల విషయంలో భారత్‌కు అవెురికా నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా అమెరికాకు ప్రత్యామ్నాయాన్ని ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. ఊపిరాడనివ్వని ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయి, స్వీయరక్షణ చర్యలు చేప ట్టిన అమెరికాకు, ప్రపంచ ఆర్థిక సంక్షోభం, అమెరికా మొదలెట్టిన వాణిజ్య, కరెన్సీ యుద్ధ పరిస్థితుల్లో ఆర్థిక వికాసం నేల చూపులు చూస్తున్న చైనాకు ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక ఆసరాగా వేగంగా దూసుకెళుతున్న జీడీపీతో పాటు చౌక సహజ వనరులు, చౌక శ్రమశక్తి మార్కెట్, సరుకుల వినిమయ మార్కెట్లతో వర్థిల్లుతున్న ఇండియాపై కన్నుపడింది. ఈ నేపథ్యంలో అమెరికా చైనాలు ఇండియాతో సత్సంంబంధాలు పెంచుకునేందుకు పోటీపడుతున్నాయి.

భౌగోళిక ఆర్థిక, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో సంక్షోభంలో కూరుకుపోయిన అభివృద్ధి చెందిన అమెరికా, ఈయూ దేశాలకు చై నా, ఇండియా వంటి వేగంగా వృద్ధిచెందుతున్న దేశాల మార్కెట్లను మృత సంజీ వనులుగా, వాణిజ్య డార్లింగ్‌లుగా మారాయి. ఈయూ సరోగేట్ పెట్టుబడి, రష్యా పలుకుబడి అండతో చైనా సామ్రాజ్యవాద దేశంగా ఎదిగి ఏకధ్రువ ప్రపంచ అధి నేత అమెరికాకు అన్నిరంగాల్లో సవాలు విసిరింది. అయితే చైనాతో పోటీ పడలేక, అభివృద్ధి చెందిన దేశాల బలహీనమైన సహకారంతోనైనా ప్రపంచశక్తిగా ఎదగా లని ఇండియా ఉవ్విళ్లూరుతూ విఫల ప్రయత్నాలు చేస్తోంది. అయితే స్వీయరక్షణ విధానాల బాటపట్టిన అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాలను చేజారడం, చైనాతో ప్రత్యక్షంగా ఢీకొట్టడం కంటే ఆ దేశంతో వాణిజ్య యుద్ధం కంటే స్నేహం చేస్తే ఉభయుల ప్రయోజనాలు నెరవేరగలవని భారత్ భావిస్తోంది. అమెరికాతో వాణిజ్యయుద్ధంలో 603 సరుకులపై చైనా సుంకాలు విధించింది. అయితే అమె రికా సరుకులపై ఆంక్షలు విధించిన వాటిలో 44 సరకులను చైనాకు భారత్ ఎగు మతి చేస్తున్నప్పటికీ వాటిలో కేవలం 17కి మాత్రమే తగిన అవకాశం దక్కింది. ఫార్మా మార్కెట్‌లో భారత్ అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉన్నప్పటికీ, ఫార్మా ఎగుమతుల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే చైనాకు ఎగుమతి చేస్తోంది. గ్లోబల్ వాణిజ్య యుద్ధం, డోక్లం తదితర అనేక ఉద్రిక్తతల నడుమ గత ఏడాది భారత్ -చైనాల మధ్య 84 బిలియన్ డాలర్ల వాణిజ్య లావాదేవీలు జరిగాయి. చైనా ఎగుమతులు భారత్‌లో 70 బిలియన్ డ్లాలర్లకు పైగా చేరుకున్నాయి. ఈ నేపథ్యం లో చైనా, భారత్‌లు వైషమ్యరహిత, ఆరోగ్యకరమైన వాణిజ్య పోటీని పరస్పరం కోరుకుంటున్నాయి. అయితే దక్షిణాసియాలో భౌగోళిక ఆర్థిక, రాజకీయ ఆధిప త్యం కోసం భారత వ్యతిరేక దౌత్యచర్యలకు చైనా పాల్పడుతోంది. ఒకవైపు పాకి స్థాన్ వంటి సంప్రదాయక దాయాది దేశాలకు లోపాయికారీగా మద్దతు నివ్వడం, మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతలను సృష్టిస్తూ భారత్‌ను ఆర్థికంగా, రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. అయితే అమెరికా తదితర అభివృద్ధి దేశాలతో దౌత్య సంబంధాల్లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో భారత్ కూడా చైనా అనుసరిస్తున్న ఎత్తుగడలనే వ్యతిరేకదిశలో అను సరిస్తున్నది. చైనా ప్రత్యర్థి అమెరికాతో రక్షణ, వాణిజ్య తదితర ఒప్పందాలు, ర ష్యాతో మైత్రి పునరుద్ధరణ, ఆఫ్ఘానిస్థాన్ పునర్నిర్మాణంలో కీలకపాత్ర, ఫ్రాన్స్ తదితర ఈయూ దేశాలతో అణువాణిజ్య, రక్షణ తదితర ఒప్పందాలు చేసు కోవడం, చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవడం వంటి ప్రతి ఎత్తు గడలతో ఆ దేశం దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన తదితర ప్రాజెక్టుల పేరుతో శ్రీలంక, పాకిస్థాన్ తది తర దేశాల్లో వాటి ఆర్థిక వ్యవస్థలను ఇబ్బంది పెట్టిన చైనా నిర్వాకం భారత్‌కు తెలియంది కాదు. సామ్రాజ్యవాద దేశాల భౌగోళికాధిపత్య పోటీ, వాణిజ్య యుద్ధాలు క్రమంగా వాటి మధ్య భౌతిక యుద్ధంగా పరిణమించే పరిస్థితులు ముసురు కుంటున్నాయి. చైనా, రష్యాలతో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్న సంకేతాలు ఇటీవల అమెరికాలోని పెంటగాన్ కేంద్ర సైనిక కార్యాలయం రూపొందించిన తాజా నివేదిక ద్వారా వెల్లడైనాయి. ఈ నేపథ్యంలో ‘వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి’ విధానాన్ని సమర్థంగా అనుసరించగలిగి, స్వదేశీ మార్కెట్ ఆధారిత వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలను సమన్వయించే ఆర్థిక విధా నాన్ని అనుసరించగలితే బలమైన ప్రపంచ ఆర్థికశక్తిగా అవతరించగలిగే సా మర్థ్యం భారత్ కలిగి ఉందన్న ఎరుకతో పాలకులు వ్యవహరించాలి. ‘విశాఖ’ విఫలం : వివక్ష యథాతథం

Updated By ManamWed, 10/10/2018 - 00:54

imageరాజస్థాన్‌లోని ఒక గ్రామంలో 1992 సెప్టెంబర్ 22న జరిగిన ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగిం చిం ది. రాజస్థాన్‌లో వివాహాలకు పవిత్రైమెన తేదీగా భా విం చే ‘అఖా తీజ్’ ఉత్సవం సందర్భంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు ‘సతిన్’ (స్నేహితుడు)ను గ్రామీణ స్థాయి లో మహిళా ఏజెంట్‌ను ప్రభుత్వం నియమించింది. ఏడాది పాపకు చేసిన పెళ్లిప్రయత్నాలను ఈ ఏజెంట్ అత్యంత సాహసంతో ఎదుర్కొన్నది. అందుకు ఆగ్రహించిన పాప బంధువులు కొందరు ఆ ఏజెంట్ భర్త ఎదుటే ఆమెపై అ త్యాచారానికి పాల్పడ్డారు. ఇది తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తు న్న మహిళలు వృత్తి నిర్వహణలో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులకు  ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ఘటనను ‘విశాఖ’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మహిళలకు పనిప్రాంతంలో తగు భద్రత కల్పిం చే లా న్యాయపరంగా జోక్యం తీసుకునేలా సుప్రీంకోర్టును ఆ సంస్థ తరఫున పిటిషన్ దాఖలుచేశారు. ఇది శాసనపరంగా విఫలంగానే స్పష్టమవుతోందని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. 

1992లో విశాఖ వెర్సెస్ రాజస్థాన్‌గా ప్రఖ్యాతిగాంచిన ఈ కేసు తీర్పు ఒక వైులురాయి వంటిది. పనిప్రాంతంలో మహిళలకు లైంగిక వేధింపులకు తావులేని విధంగా భద్ర త కల్పించేందుకు అవసరైమెన సవివరైమెన మార్గదర్శకాలను అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది. అంతర్గతం గా ఫిర్యాదుల కమిటీని ప్రతి సంస్థ ఏర్పాటుచేయాలని 1997లో సుప్రీంకోర్టు ఆదేశించింది. విశాఖ కమిటీ పేరుతో ఏర్పాటుచేసే ఈ కమిటీ పనిప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై ఫిర్యాదులు దాఖలు చేయాలని సూచించింది. లైంగిక వేధింపులు ఎట్టి పరిస్థితుల్లోను ఆహ్వానింపదగినవి కావని, భౌతికంగా, మాటల రూపంలో, చేతల్లో లైంగిక వేధింపులను అనుమతించకూడదని సుప్రీంకోర్టు వీటిని నిర్వచించింది. 

పని ప్రదేశంలో లైంగిక బెదిరింపుల కారణంగా ఉద్యో గ బాధ్యతల నిర్వర్తనలో మహిళ వెనకబడిపోతే అది ఆమె పని విధానంపై ప్రభావం చూపుతుందని లైంగిక వేధింపులకు నిర్వచిస్తూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విశాఖ మార్గదర్శకాలు తరువాత పని ప్రదేశంలో మహిళల లైంగి క వేధింపులు (నిరోధించడం, నివారణ) చట్టం, 2013 ద్వారా రద్దుచేయబడింది. ఈ చట్టం ప్రకారం సంస్థలు అంతర్గత ఫిర్యాదుల కమిటీని మాత్రం నిర్వహించాలి. ఫలితంగా మహిళలకు పని ప్రదేశంలో ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా సంస్థలు భరించాలి. వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు సమయంలో సహకరించేలా, సాక్షులను బెదిరించడం, బాధిం చడం వంటి చర్యలను నిరోధించే చర్యలను సంస్థలే చేపట్టాలి. ఈ కమిటీలు ఏర్పడి 21 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో మహిళలకు పూర్తి భద్రత కల్పించడంలో పోలీస్‌స్టేషన్లు, న్యాయస్థానాల వైఫల్యం, అంటే విశాఖ కమిటీలు సంపూర్ణంగా విఫలం చెందాయని స్పష్టమవుతోంది.

అయితే, ఈ విశాఖ కమిటీలు ఎందుకు విఫలమయ్యాయని ప్రశ్నించుకుంటే, పని ప్రదేశాల్లో మహిళలకు సమానత్వం చూపడం లేదనే అంశంపై దృష్టిపెట్టాల్సి ఉం ది. లైంగిక వేధింపులను అరికట్టే బాధ్యత సంస్థ యాజమాన్యం, లేదా బాధ్యుైలెన వ్యక్తులపైనే ఉన్నది. ఇలాంటి నేరాలను ప్రాసిక్యూట్ చేసేందుకు అవసరైమెన చర్యలన్నింటినీ తీసుకోవలసి ఉన్నది. యాజమాన్యం, బాధ్యు లైన వ్యక్తులంటే సాధారణంగా ఎక్కువగా పురుషులే ఉం టారు కాబట్టి వారు స్పందించడంలో బాధ్యతా రాహిత్యం గానే వ్యవహరిస్తారనే అభిప్రాయం నెలకొనివున్నది. అనేకమంది మహిళల పరిస్థితి ఆ బాధ్యుల దయాదాక్షిణ్యంపైనే ఉంటోందనే భావం కనిపిస్తోందంటున్నారు. పని ప్రదేశం లో మహిళలు భయపడే పరిస్థితుల నేపథ్యంలో విశాఖ కమిటీలు ఉద్భవించాయన్నది వాస్తవం. ఎయిర్ ఇండియా లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులకు సం బంధించి ఒక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఒక సీనియర్ అధికారి ప్రవర్తనపై ఎయిర్ హోస్టెస్ ఒకరు ఫిర్యాదుచేశారు. ఆ అధికారి ‘మద్దతుదారులు’ ఎయిర్‌హోస్టెస్‌పై వ్యతిరేక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ విధైమెన వేధింపులు కొనసాగుతున్నప్పటికీ ఆ అధికారి ఆరేళ్లుగా ప్రమోషన్లపై ప్రమోషన్లు అందుకుంటూనే ఉన్నారు. 

ఆ అధికారిపై ఆమె విమానయాన మంత్రిత్వ శాఖకు ఫిర్యాదుచేసినప్పుడు మహిళా లైంగిక వేధింపుల కమిటీచేత దర్యాప్తు చేయిస్తామని ఆమెకు హామీ లభించింది. ఆమె ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన కమిటీ చైర్మన్ కూడా మహిళే ఉన్నారు. ఆ సమయంలో ఆ చైర్మన్ కల్పించుకుని ‘ఆయన ఎలా మాట్లాడతాడో నీకు తెలిసిందే కదా! నన్ను కూడా ఆయన అలాగే వేధించి ఆనందించేవాడు’ అని వ్యాఖ్యానించారు. ఆ సందర్భంగా పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు ఆ మహిళ రాసిన లేఖ ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిలో ఎక్కువ మంది పురుషులే ఉంటున్నారని అనేకమంది ఫిర్యాదులు చేస్తున్నారు. మరి దీన్ని అరికట్టడంలో ఆయా సంస్థలు ఎందుకు విఫలమవుతున్నాయో అర్ధం కాని విషయం. 

- వందన
(డైలీ ఓ నుంచి)హద్దుల్లో సరిహద్దులు

Updated By ManamWed, 10/10/2018 - 00:52

imageప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ఇప్పుడు అట్టుడికిపోతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ తదితర ప్రాంతాల నుంచి వలస శ్రామికులపై ఠాకూర్లు దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే 20వేల మందికి పైగా గుజ రాతేతర్లు సొంత ఊర్లకు వెళ్ళిపోయారని ఉత్తర్ భారతీయ వికాస్ పరిషత్ ప్రక టించింది. సాబర్‌కాంతా జిల్లాలో 14 నెలల ఒక చిన్నారిపై బిహార్ యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటనతో ఈ దాడులు ప్రారంభమయ్యాయని పైకి కనబడుతున్నా, తమ ఉపాధి అవకాశాలను వలసదారులు కొల్లగొడుతున్నారనే కారణంతోనే కొంతమంది గుజరాతీయులు ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగడుతు న్నట్లు సమాచారం. ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అల్లర్లకు పాల్పడినవారిని వందలమందిని అరెస్టు చేసి నిర్బంధించినప్పటికీ, సోషల్ మీడియాలో సాగు తున్న ప్రచార వైపరీత్యం వల్ల భయాందోళనలు కొనసాగుతున్నాయి. గుజరాతీ భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా పబ్బం గడుపుకుంటున్న పాలకులు, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పదేపదే అలాంటి సెంటిమెంట్లను ఆసరాగా చేసుకుని ప్రజల మధ్య ప్రాంతీయతా విభజన విద్వేషాలను రెచ్చగొట్టడం కద్దు. దేశవ్యాప్తంగా జాతి, మత, కుల, ప్రాంత అస్తిత్వ ఉద్వేగాలను ఆసరాగా చేసు కున్న ప్రభుత్వాలు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఇలాంటి విద్వేష రాజకీయాలను నడపడం అక్కడి ప్రజల అభివృద్ధికి క్షేమకరం కాదు. 1960లో ఉమ్మడి బాంబే రాష్ట్రం నుంచి గుజరాత్ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న నాటి నుంచి అక్కడి రాజకీయ పక్షాలు ప్రాంతీయ ఉద్వేగాల కేంద్రంగానే రాజకీయ ఎత్తుగడలు వేయడం పరిపాటిగా మారింది. 

గుజరాత్‌లో ఇప్పుడు జరుగుతున్న మూకహింస ఒక నిర్ధిష్ట సంఘటన కార ణంగా కావొచ్చు. అయితే, దేశవ్యాప్తంగా ‘పరాయి వ్యతిరేక’ ఉద్వేగ విద్వేష కాండగా వివిధ స్థానిక రాజకీయ స్వార్థాల పునాదిగా రగులుకునే అవకాశాలు న్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గుజరాత్‌లో పాటీదార్ ఉద్యమం నడు స్తున్న సమయంలోనూ, 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వలసవచ్చిన ‘బయటి’ వ్యక్తుల కారణంగా ఉపాధి కల్పన అడుగంటి పోతున్నదనే వాదనలు వచ్చాయి. గత మాసంలో, ఫ్యాక్టరీలలో 80 శాతం ఉద్యోగాలు గుజరాతీలకే ఇ వ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్‌లో వేగంగా వృద్ధి చెందు తున్న వస్తు తయారీ కేంద్రం (మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ )లో పెద్ద ఎత్తున వలస శ్రామికులే పనిచేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్ పారిశ్రా మికంగా అభివృద్ధి చెందిన  రాష్ట్రం. అక్కడ వివిధ రకాల పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో పనిచేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వలసలు వస్తుంటారు. అతి తక్కువ కూలీతో, హీనమైన పరిస్థితుల్లో విసుగు పుట్టే శ్రమరంగంలో అసం ఘటిత రంగ శ్రామికులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెల్లువెత్తారు. ప్రపంచవ్యాప్తంగా పట్టిపీడిస్తున్న ఆర్థిక సంక్షోభం, ఆ పరిస్థితులలో జాతీయ ఆర్థిక వ్యవస్థను, స్థానిక మార్కెట్లను బలోపేతం చేసే వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల సమన్వయంతో  ప్రజల జీవనప్రమాణాలను పెంచే ఆర్థిక విధా నాలను రూపొందించగల సమర్థత, చిత్తశుద్ధి లేని ప్రభుత్వాల కారణంగా దేశం లో పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య తలెత్తింది. పాలకుల కార్పొరేట్ అనుకూల విధానల వల్ల భరించలేని వ్యవసాయక సంక్షోభం, కునారిల్లుతున్న పారిశ్రామిక రంగాలు దేశప్రజల జీవితాలను ఉదాసీనంగా మార్చివేస్తున్నాయి. అంతేగాని ఉపాధి అవకాశాలు క్షీణించడానికి వలస శ్రామికులు కారణం కాదు.

రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు, ఉపాధి తదితర సమస్యల్ని పరిష్కరించ డంలో విఫలమైన స్థానిక ప్రభుత్వాల విధానాలే ప్రధాన కారణం. శ్రమ మార్కె ట్‌లో పోటీ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు దోహదం చేసి, తద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుందని ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తల తల్లకిందులు అం చనా. కార్పొరేట్ లాభాలను పెంచే చౌక శ్రమశక్తి వలసలను పారిశ్రామికవృద్ధికి అవకాశాలను సృష్టించడంలో భాగంగా ఒకవైపు ప్రోత్సహిస్తూనే, ప్రజల్లో ప్రభు త్వ వ్యతిరేకత పెరిగిన సందర్భంలో  అలాంటి వలసలు స్థానిక ప్రజల ఉపాధి అవకాశాలను కాలరాస్తున్నాయనే ప్రాంతీయ ఉద్వేగ విద్వేషాలను పాల కులు (ముఖ్యంగా ప్రాంతీయ లేదా ప్రాంతీయ తత్వంగల రాజకీయ పక్షాలు) మరొక వైపు రెచ్చగొడుతున్నారు. వలస ప్రజలను తమ కష్టాలకు, కండగండ్లకు ప్రధాన విలన్లుగా మారుస్తున్నారు. అదే సమయంలో వలసదారులకు ఎలాంటి చట్టబద్ధ మైన రక్షణలుగానీ, సంక్షేమ పథకాలుగానీ ఉండకపోవడంతో ఇంటిపని శ్రామి కుల నుంచి పారిశ్రామిక కార్మికుల దాకా, చిన్నచిన్న రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల నుంచి సాధారణ వ్యాపారస్తులు, ఉద్యోగుల దాకా ప్రతిరాష్ట్రంలో అత్యంత హీన మైన రెండవ తరగతి పౌరులుగా బతుకులీడుస్తున్న దృశ్యం దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. వలసకారుల సమస్యల కేంద్రంగా నేడు రాజకీయ నాయకులు తాజాగా ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్సీ)’పై తీవ్రంగా చర్చిస్తున్నారు. అస్సాంలో దేశ సరిహద్దులోని కొన్ని నిర్ధిష్ట, ప్రత్యేక చారిత్రక రాజకీయ పరి స్థితుల నేపథ్యంలో ఎన్‌ఆర్సీ రూపొందింది. అయితే ఆ చట్టం దేశవ్యాప్తంగా తలెత్తుతున్న వలసదారుల సమస్యలకూ ఆయా నిర్ధిష్ట పరిస్థితులకు అనుగుణం గా అన్వయించాలని బీజేపీ నాయకులు అనాలోచితంగా మాట్లాడుతున్నారు. దే శంలోనే ప్రాంతాల ప్రాతిపదికను సరిహద్దులను సృష్టించే విద్వేష వాతావర ణాన్ని ఏర్పరచడం ద్వారా తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చు కునేందు కు ప్రయత్నిస్తున్నారు. ఉద్వేగాల పునాదిగా ఒక జాతిని గాని, ఒక ప్రజలను గా ని కొన్ని ప్రాదేశిక సరిహద్దుల మధ్య నిర్మించడం మాత్రమే చేయగలం కానీ, ప్రజాస్వామిక, సామాజిక ప్రాంతంగా ఆ ప్రాంతీయ అస్తిత్వ ప్రజానీకాన్ని    తీర్చిదిద్దలేరు. ఆలయాల్లో సగం...!

Updated By ManamSat, 10/06/2018 - 01:53

imageఇటీవల భారత అత్యున్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పులు వెలువరిస్తూ న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఎనలేని గౌరవాన్ని పెంచుతోంది. మొన్నటి ట్రిపుల్ తలాక్ నుంచి నిన్నటి ఆధార్ రాజ్యాంగబద్ధత, ఐపిసి 497ను రద్దు చెయ్యటం వరకూ అన్నీ సంచలనాత్మక తీర్పులే. శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది. మహిళలను దేవతలుగా పూజింపబడే దేశంలో ఆలయాల్లోకి వారికి ప్రవేశం లేకుండా నిషేధించటం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 4-1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. అయ్యప్ప స్వామి అస్కలిత ‘బ్రహ్మచారి’ అని అందుకే రుతుస్రావం వచ్చే 10-50 సంవత్సరాల మధ్య వయస్సుకల మహిళలకు కేరళలలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించటంపై నిషేధం వుంది. అయితే ఈ చర్య లింగ సమానత్వానికి విరుద్ధమం టూ 2006లో మహిళా న్యాయవాదుల బృందం, ‘భూమాత బ్రిగేడ్’ వంటి మహిళా సంఘాలు కలసి కోర్టు లో కేసులు వేశాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26ల ప్రకారం పురుషులకు వర్తించేవన్నీ మహిళలకు కూడా వర్తిస్తాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆలయాల్లోకి ప్రవేశించి పూజలు చేసుకోవటం మహిళలకు రాజ్యాం గం కల్పించిన హక్కు. దానినెవ్వరు తోసిరాజనలేరు. 

సమానత్వం ముందు సంప్రదాయం తలవం చింది. 400 సంవత్సరాలుగా అపచారం పేరిట ఆలయంలోకి ఆడవారిని రాకుండా అడ్డుకున్న ఆచారం పక్కకు తొలగింది. ఆకాశంలో సగం అంటూ వేదికలెక్కి అరుస్తూ, ఆడవాళ్ళు ఆలయాల్లో ప్రవేశానికి కూడా కోర్టువెుట్లెక్కాల్సిన దుస్థితికి మన పురుషాధిక్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాలి. తనలో సగభాగాన్ని గౌరికిచ్చి, నెత్తిన గంగను పెట్టుకుని అర్థనారీశ్వరతత్వాన్ని, స్త్రీ ప్రాముఖ్యతను చాటిచెప్పిన ఆ మహాశివుడ్ని చూసైనా మన మగ వుహరాజులు మేల్కోవాలి. గతంలో కోర్టు తీర్పులు వెన్నుదన్నుగా నిలువగా ‘భూమాత బ్రిగేడ్’ వంటి మహిళా సంఘాల పోరా టం ఎట్టకేలకు ఫలిస్తోంది. తృప్తి దేశాయ్ నేతృత్వంలో మహిళలు శనిసింగనాపూర్ ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేశారు. గణతంత్ర దినోత్సవం నాడు త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రవేశానికి ప్రయత్నించి పోలీసుల లాఠీ దెబ్బలతో ఒకడుగు వెనక్కు వేసినా, 1956 చట్టం ప్రకారం కోర్టు తీర్పు ఇచ్చిన ఉత్సాహంతో ఒక్క శనిసింగనాపూర్ మాత్రమే కాకుండా మరిన్ని ఆలయాల్లో మహిళలకు ప్రవేశం కోసం ముందడుగు వేసింది తృప్తి దేశాయ్. దేవుడ్ని పూజించడానికి కూడా ఉద్యమాలు, ఉత్పాతాలు జరపాల్సిన అవసరం వచ్చిందంటే మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తప్పుగా అర్థం చేసుకుంటున్న ఛాందసవాదుల కళ్ళు తెరిపించాలి. దైవాన్ని పూజించటం, ఆలయంలోకి ప్రవేశం వంటి వన్నీ మనిషి విశ్వాసానికి, మానసిక స్వాంతనకు సంబంధించినది. భక్తుడికి, భగవంతునికి మధ్య వేరొకరి ప్రమేయం ఎంతమాత్రం ఆమోదించతగ్గది కాదు. 

శనిసింగనాపూర్ ఆలయంలో మహిళ ప్రవేశం నిషేధానికి ఆలయ ధర్మకర్తలు చెపుతున్న సాకు, శిలనుంచి హాని కలిగించే తరంగాలు వెలువడుతున్నాయని, అవి ఆడవాళ్ళ శరీరానికి హానిచేస్తాయని. ఈ వాదనకు ఎటువంటి శాస్త్రీయ ఆధారమూ లేదు. ఇదేవిధంగా శబరిమల ఆలయంలో రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు మాత్రమే ప్రవేశాన్ని కల్పించారు. అసలు దైవానికి మైల ఏమిటి, ఒక జాతివాడో, వర్ణం వాడో, మహిళలో ప్రవేశిస్తేనే వైులపడే వాడు భగవంతుడవుతాడా. ఈ చరాచర సృష్టినంత తనలోనే ఇముడ్చుకున్న ఆ భగవానుడికే వైులను అంటగట్టే మన కుహనా ఛాందసవాదులు రుతుక్రమమే లేకపోతే మానవజన్మే లేదని తెలుసుకోవాలి. ఆ లెక్కన ప్రతి ఒక్కరం అపవిత్రులమే. 

సంప్రదాయ పరిరక్షకులుగా చెప్పుకుంటూ వంద ల ఏళ్ళుగా కొనసాగుతున్న అర్థం పర్థం లేని నియమాలు, కట్టుబాట్లను ఈ ఆధునిక కాలంలో కూడా అమలు చెయ్యటానికి రక్తపాతానికి సైతం దిగటం మూర్ఖత్వమే అవుతుంది. విద్య, మానవ హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ మహిళలకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియచెప్పిన రామకృష్ణ పరమహంస ను చూసైనా వీళ్ళు కళ్ళు తెరవాలి. తన సొంత భార్యలోనే దైవత్వాన్ని కనుగొన్న మహనీయుడు ఆయన. శారదాదేవిని కూడా సాక్షాత్తు కాళీమాత అవతారంగా ప్రజలు పూజించారు. ప్రతి మతంలోనూ, సంస్కృతి లోనూ మంచి, చెడూ రెండూ వుంటాయి. మంచిని మాత్రమే గ్రహించి, కాలానుగుణంగా మార్పును ఆహ్వానిస్తూ ముందుకెళ్ళినప్పుడే నాగరికత వెల్లివిరిస్తుంది. అలా జరగని నాడు అనాగరిక ప్రపంచానికి తెరతీసిన వాళ్ళమవుతాం. 
 ఈదర శ్రీనివాసరెడ్డి
డీన్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంమతం నుంచి సైన్స్‌లోకి ...

Updated By ManamSat, 10/06/2018 - 01:53

 అశాస్త్రీయ ఆలోచనలన్నీ తొలగిపోవడానికి మరికొంతకాలం అంటే కొన్ని తరాల సమయం పడుతుంది. మతాలన్నీ మూడనమ్మకాలే, నమ్మకదగినవి కానివే. నిరంతరం అభివృద్ధి చెందుతున్న సైన్స్‌లోనే సత్యం దాగివుంది. భారతదేశం అభివృద్ధిపథంలో పయనించాలంటే మనం మతం నుంచి సైన్స్‌వైపు నడవాలి.

imageమతం, విజ్ఞానం అనేవి పూర్తిగా ఒకదానికొకటి వ్యతిరేకమైనవి. ఒకటి ఉత్తర ధ్రువమైతే, రెండో ది దక్షిణ ధ్రువం వంటివి. అవి ఒకదానినొకటి ప్రశంసించుకుంటాయి. 
1). అతీంద్రియ శక్తి ఉన్నదని, దాన్నే దేవుడు అంటారని మతం చెబుతుంది. అది నిశ్చలం, శాశ్వతం, సర్వశక్తిమంతం, క్షమాగుణం, అంతా మంచికి నిలయమని మతం పేర్కొంటుంది. అయితే, విజ్ఞానం (ఖిఛిజ్ఛీఛ్ఛి) ఈ వాదాన్ని విశ్వసించదు. విశ్వంలో శాశ్వతమైనది అంటూ ఏమీ ఉండదని సైన్స్ వాదిస్తుంది. ప్రతిదీ మారుతుందని, ప్రవాహం వంటిదని అంటుంది. శాస్త్ర పరిశోధనల ద్వారా అది నిరూపితమవుతుందని తెలుపుతుంది. దేవుడు, దేవత వంటి అతీంద్రియ శక్తి అంటూ ఏమి ఉండదని, యక్షిణి, మంత్రగతె్త, ఆత్మలనేవి వట్టి బూటకమని సైన్స్ స్పష్టం చేస్తుంది. అందువల్ల పరకాయ ప్రవేశం, పునర్జన్మ అనే వాటిని సైన్స్ విశ్వసించదు. కొన్ని సూత్రాలకు అనుగుణంగా చలించే పదార్థమొక్కటే వాస్తవమని చెబుతుంది. ఇదే అంశంలో ‘మరి పదార్థాన్నెవరు సృష్టస్తా’రని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. అందుకు సమాధానంగా, పదార్థానికి సృష్టికర్త ఎవ రూ లేరని, మార్పులు చెందుతున్నప్పటికీ పదా ర్థం పదార్థం నుంచే ఉద్భవిస్తుందని సైన్స్ వాదిస్తుంది. 2) ప్రతి ఒక్క అంశంలోనూ సైన్స్ పురోగతి చెందుతుండగా, మతం వెనక్కి వెళ్తుంటుంది.  ఇందు కు ఉదాహరణగా ఒకానొక సమయంలో మసూచి అనేది దేవత ఆగ్రహం వల్ల వస్తుందని భావించగా కానీ, ఇప్పుడు అదొక వైరస్ వల్ల వస్తుందని మనం తెలుసుకున్నాం. దాన్ని వైద్యంతో నివారించవచ్చునని అనుభవపూర్వకంగా గ్రహించాం. అలాగే, వర్షాలు ఇంద్రదేవుడి వల్ల సంభవిస్తాయని ఒకప్పుడు జనం విశ్వసించేవారు. ఒకవేళ ఎక్కడైనా వర్షాలు లేక కరువు తాండవిస్తుంటే అందుకు వానదేవుడి కరుణ తరిగిం దని భావించేవారు. ఇప్పటికీ మనదేశంలో చాలామంది దీన్ని విశ్వసిస్తూనే ఉంటారు. వేడెక్కిన భూమిపై అల్పపీడనం వల్ల వానలు కురుస్తాయని నేడు మనం తెలుసుకున్నాం. ఆడమ్-ఈవ్‌లను దేవుడు సృష్టించాడని ఒకప్పుడు ప్రజ లు విశ్వసించేవారు. తరువాత మనుషులు కోతుల నుంచి ఉద్భవించారని డార్విన్ పరిణామ సిద్ధాంతం రుజువుచేసింది. 


3) మతవునేది విశ్వాసం, దైవద్యోతకంపై ఆధారపడుతుంది. అదే సైన్స్ విషయానికొస్తే పరిశీలన, ప్రయోగం, కారణంపై ఆధారపడుతుంది. 
4) తాను చెప్పిందే వేదమనే విధంగా మతం మాట్లాడుతుంది. ఎలాంటి మార్పులకు అనుమతించదు. కాబట్టే వేదాలు, బైబిల్, ఖురాన్‌లను మార్చలేం. సైన్స్ అలాకాదు. సైన్స్‌లో తుది నిర్ణయం అంటూ ఏమీ ఉండదు. సైన్స్ తెలియజెప్పే కథనాలను ప్రతినిత్యం శోధనకు గురవుతూనే ఉంటా యి. మార్పులకు దారితీస్తూనే ఉంటాయి. ఉదాహరణకు, 1666లో కాంతి కణాల రూపం లో ప్రయాణిస్తుందని న్యూటన్ చెప్పాడు. దీన్నే తేజీ ఘటిక లేదా కణికా సిద్ధాంతం (ఛిౌటఞఠటఛిఠజ్చూట ్టజిౌ్ఛటడ) అని పిలుస్తారు. అయితే, హేగెన్స్ అనే డచ్ శాస్త్రవేత్త 1678లో ప్రెస్నెల్ సూత్రీకరణను  (ఊట్ఛట్ఛజూ ఞటజీఛిజీఞజ్ఛూ) ప్రతిపాదించాడు. ఆ తరువాత మాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థీరీని (ఖఠ్చ్టఠఝ ్టజిౌ్ఛటడ) సూత్రీకరించాడు. క్వాంటమ్ థీరిననుసరించి కాంతి వివిక్త కణాల (ఛీజీటఛిట్ఛ్ట్ఛ ఞ్చట్టజీఛిజ్ఛూట) ద్వారా ప్రయాణిస్తుంది. అనంతర కాలంలో డి బ్రొగ్లీ  ప్రతిపాదించిన క్వాంటమ్ మెకానిక్స్‌ను హైసెన్ బెర్గ్, స్క్రోడింజర్ అభివృద్ధి చేశారు. కాంతికణాలు తరంగాలుగా ప్రయాణిస్తాయని క్వాంటమ్ మెకానిక్స్ సిద్ధాం తం చెబుతుంది. 

5) ఒక ప్రత్యేక సమయంలో ప్రాణులన్నీ నివశించే విశ్వాన్ని దేవుడు సృష్టించాడని మతం చెబుతుంది. అయితే, జీవులు వాతంటవే ఉద్భవిస్తామని డార్విన్ పరిణామ సిద్ధాంతం (ఛిట్ఛ్చ్టఠట్ఛట జ్చిఠ్ఛి ్ఛఠిౌజూఠ్ఛిఛీ) తెలుపుతుంది. 
6) విశ్వం సృష్టికర్త దేవుడేనని మతం ప్రకటిస్తోంది. అలాంటి సృష్టికర్త అంటూ ఎవరూ లేరని సైన్స్ చెబుతోంది. విశ్వంలో పదార్థమొక్కటే వాస్తవమని సైన్స్ ప్రకటిస్తోంది (అదే పదార్థ శక్తి లేదా సైన్స్ పదార్థం, శక్తి అనే రెండు రకాలుగా ఉంటుందని ఐన్‌స్టీన్ రుజువుచేశాడు). పదార్థం కొన్ని సూత్రాలకు ఒడంబడి చలిస్తుంటుంది. దీన్ని శాస్త్రీయ పరిశోధనల ద్వారా కనుగొన్నారు. పదార్థం ఎక్కడి నుంచి వస్తుం దనే సందేహానికి పదార్థం పదార్థం నుంచే వస్తుందని సమాధానం వస్తుంది. ప్రతి ఒక్కటీ సృష్టికర్త నుంచే వస్తుంది. సృష్టికర్తకు కూడా ఇంకో సృష్టికర్త కూడా ఉంటాడని చెబుతారు. అతడినే సూపర్ సృష్టికర్త అంటారని మతం చెబుతుంది. ఆ సూపర్ సృష్టికర్తకు కూడా సృష్టికర్త ఉంటాడని, ఇలా ఇదొక గొలుసుకట్టుగా ఉంటుందని మతం తెలుపుతుంది. అనంతంగా కొనసాగే ఈ ప్రక్రి యను ఒక అవాస్తంగా మిగిలిపోతుందని సైన్స్ వాదిస్తుంది. 

7) దేవుడు అత్యంత శక్తిమంతుడని, దయగలవాడని, అన్నింటా సుగుణాలు గలవాడని మతం చెబుతుంది. అదే నిజమైతే ప్రపంచంలో లక్షలాది మంది పిల్లలు ఆకలితో మలమలమాడిపోతున్నారెందుకు? అనేక రోగాలబారిన పడుతున్నారెందుకు? దేవుడు దయాగుణం ఉన్నవాడైతే మరెందుకు అలా బాధలు పడేవారిని ఆదుకునేందుకు ఆహారం, దుస్తులు, నివాసం ఏర్పాటుచేయడు? 
ప్రపంచంలో ఎందుకింత పేదరికం, అంతరాల భేదాలు, నిరుద్యోగం, పోషకాహార లోపం, అనారోగ్యం ప్రబలుతోంది? దేవుడే గనుక దయాగుణం ఉన్నవాడైతే ఈ ఈతిబాధల నుంచి ప్రజలను రక్షించవచ్చుకదా! కొంత మంది శాస్త్రవేత్తలు కూడా దేవుణ్ణి విశ్వసి స్తారన్నది వాస్తవమే. ఇవన్నీ- శాస్త్రీయ, అశాస్త్రీయ ఆలోచనలన్నీ ఒకే మెదడులో సహజీవనం చేస్తాయని రుజువవుతోంది. అశాస్త్రీయ ఆలోచనలన్నీ తొలగిపోవడానికి మరికొంతకాలం అంటే కొన్ని తరాల సమ యం పడుతుంది. మతాలన్నీ మూడనమ్మకాలే, నమ్మకదగినవి కానివే. నిరంతరం అభివృద్ధి చెందుతున్న సైన్స్‌లోనే సత్యం దాగివుంది. భారతదేశం అభివృద్ధిపథంలో పయనించాలంటే మనం మతం నుంచి సైన్స్‌వైపు నడవాలి. 
 మార్కండేయ్ కట్జూ
డైలీ ఓ నుంచిరైతన్నకు మరణమే, శరణ్యమా!

Updated By ManamSat, 10/06/2018 - 01:53

 The death of the farmer, the sunrise!రైతే రాజు అన్నది ఒకప్పటి మాట. పంట పండించే రైతు చేతులోకి పంట వచ్చేవరకు భయం భయంగా బతుకుతున్నారు. పని చేసే ప్రతి ఉద్యోగికి నెల తిరిగే సరికి జీతం అందుతుంది. కాని ఆహర్నిశలు కష్టపడే రైతుకు పంట చేతికి వచ్చే వరకు వస్తుందో రాదో తెలియదు. కృత్రిమ ఎరువును భూమిలో వేసేవారు. (పశువుల పేడ) కాని నేడు మంత్రాలతో వ్యవసాయం చేస్తున్నారు. కృత్రిమ ఎరువుల వాడకం వల్ల దిగుబడి ఎక్కువగా వచ్చేది. వరి ధాన్యం గుంటకు ఒక బస్తా పండించే వారు కాని నేడు ఆ పరిస్థితి లేదు. దిగుబడి కొరకు ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులు వాడటం వల్ల పెట్టుబడి పెరుగుతుందే కాని దిగుబడి రావడం లేదు. పెట్టుబడి కొరకు అప్పులు తేవడం, ఇన్ని కష్టాలు దాటుకుంటు కుప్పనూర్చిన పంటను కాపాడుకోలేక పోతున్నారు. వరుణ దేవుడు నేనున్నానంటూ పలకరించి వెళ్లడం వల్ల వర్షం నుండి కాపాడుకోలేక పంట తడిసి ముద్దవుతుంది. ప్రభుత్వం కట్టించిన ‘గోదామ్‌లు’ ఉన్నప్పటికి అవి కొంత మందికే పరిమితమౌతున్నాయి. చివరి దశలో గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల అడ్డికి పావుశేరుకు అమ్ముకొని వస్తున్నారు. నేటి కాలంలో కూలీ, రసాయనిక ఎరువుల రేట్లు పెరగడం వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారు. ఖరీఫ్ పంట పోయినా రబీ అయిన రాక పోతుందా అనే ఆశతో వేసిన 24 గంటల విద్యుత్ ఆరు నెలలు పోయాల్సిన బోర్లు నాలుగు నెలలే పోస్తున్నాయి. రెండు తడులు అయితే పంట చేతికి వచ్చే సమయంలో నీరు లేకపోవడం పంటను చేన్లో వదిలేయలేక బోర్లు వేసి అవి పడకపోవడం వల్ల పంట ఎండిపోవడం చూసి ఆరుకాలం చేసి అడవిలో పోయింది అని తీరుగా రైతు దాని జీర్ణించుకోలేక పంట రాక తెచ్చిన అప్పులు తీర్చక గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి కొంత మంది ఉన్నది అంతా అమ్ముకొని పట్టణాలకు వలస వెళ్ళి చిన్నా చితక పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
- ఇ. సురేందర్
9052726693

Related News