sammakka

వైభవోపేతంగా మేడారం జాతర

Updated By ManamFri, 02/02/2018 - 11:16

Medaram Jatharaతెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం మహాజాతర వైభవోపేతంగా సాగుతున్నాయి. జనజాతరలో మూడో రోజైన శుక్రవారం వనదేవతల దర్శనం కోసం వేల సంఖ్యలో కిలో మీటర్ల పొడవున భక్తులు బారులు తీరారు. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెల మీదకు చేరుకోగా...గురువారం సమ్మక్క కూడా గద్దెల మీదకు చేరుకోవడంతో జాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. గద్దెల మీద నుంచి సమ్మక్క, సారక్క భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు.  మేడారం గద్దెలు జనసంద్రంగా మారాయి. గద్దెల వద్ద బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్ మేడారంలో వనదేవతలను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రేపు(శనివారం) వన దేవతలు వన ప్రవేశం చేయనున్నారు. అమ్మవార్ల వనప్రవేశంతో మేడారం జాతర ముగియనుంది. 



మేడారం గద్దెపైకి చేరిన సమ్మక్క

Updated By ManamThu, 02/01/2018 - 20:55

sammakkaతెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వనదేవత సమ్మక్క తల్లి మేడారం గద్దెల మీదకు చేరుకుంది. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెల మీదకు చేరుకోగా...గురువారం సమక్క కూడా చేరుకుంది. చిలకలగుట్ట నుంచి డప్పు వాయిద్యాల మధ్య, గిరిజన సంప్రదాయ రీతిలో ఊరేగింపుగా పూజారులు సమక్కను మేడారానికి తీసుకువచ్చారు. ఆదివాసీ సంప్రదాయ నృత్యాల నడుమ పగిడిద్దరాజు, గోవిందరాజుతో కలిసి సమ్మక్కను మేడారంలోని ఆలయానికి తీసుకువచ్చారు.  సమ్మక్క రాకతో మేడారం గద్దెలు జనసంద్రంగా మారాయి. గద్దెల వద్ద బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దర్శనం కోసం రెండు ప్రవేశ మార్గాల ద్వారా భక్తులకు అనుమతిస్తున్నారు.



గద్దెపై కొలువుదీరిన సారలమ్మ

Updated By ManamThu, 02/01/2018 - 15:49

పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా..
జంపన్న వాగుపై ఆసీనుడైన జంపన్న
భక్తుల పబ్బతులతో హోరెత్తిన అడవి
మొదలైన మేడారం జాతర మహాసంరంభం
నేడు వేంచేయునున్న సమ్మక్క తల్లి
వనమంతా జన ప్రవాహమే...

medaram

మేడారం మహాజాతరలో తొలి అంకం ఆవిష్కృతమైంది. రెండు సంవత్సరాలుగా కోట్లాది మంది భక్తులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. ఆదివాసీల ఆరాధ్య దైవాలై న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం అనేక ప్రాంతాల నుండి బయలుదేరి  మేడారం చేరుకుని చల్లని తల్లుల కరుణా కటాక్షాలకై వేచి చూస్తున్న కోట్లాది భక్తుల ఎదురు చూపులు ఫలించాయి. కన్నెపల్లి సారలమ్మ తల్లి మేడారానికి తరలివచ్చింది. తల్లిరాకతో భక్తజనకోటి పూనకాలతో పులకించిపోయారు. వారి పిలుపులు, మొక్కులతో మేడారమంతా మార్మోగిపోయింది.నీటి అలలతో ఓలలాడే జంపన్న వాగు జనసంద్రమైంది. చల్లని తల్లి కాలు మోపగానే మేడారం నేల పునీతమైంది. కన్నెపల్లి వాసులు తల్లికి హారతులిస్తూ, నీళ్లతో ఆరగిస్తు మేడారానికి సాగనంపగా, నాలుగు కిలోమీటర్ల్ల దారిపొడుగునా భక్తుల పబ్బతులు అందుకుంటూ దారిలో జంపన్న తీరంలో కొలువైన సోదరుడు జంపన్నను మందలించుకుంటూ వరాల తల్లి గద్దె నెక్కింది. తల్లి రాకకు ముందే పూనగుండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి  గోవిందరాజులు వారివారి గద్దెలపైకి చేరుకున్నారు. మరోపక్క తన బిడ్డలు.. భక్తజనకోటి కోసం మేడారం రావటానికి మహాతల్లి సమ్మక్క చిలకలగుట్టైపై నుండి బయులుదేరింది. ఆ  మహాద్బుత ఘట్టం కోసం భక్తజనకోటి ఉద్విగ్న భరితంగా ఎదురుచూస్తోంది. 
బుదవారం నాడు గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువు తీరగా, జంపన్న తీరంలో జంపన్న కొలువు తీరి భక్తజనకోటికి దీవెనలు, వరాలిస్తున్నారు.ఆదివాసీ గిరిజన కోయలు బుధవారం ఉదయం నుండి  తమ ఆచార సాంప్ర దాయాల ప్రకారం రోజంతా పూజలు నిర్వహించారు. కన్నె పల్లి ఆడబిడ్డలు సారలమ్మ ఆల యంలో ప్రత్యేక పూజలు చేసి శుద్ది చేసే సామాగ్రి, మంచి నీటితో మేడారానికి బయలు దేరి వచ్చి మేడారం సారలమ్మ గద్దెను శుద్ది చేసి పట్టు పరిచారు. సాయంత్రం సారలమ్మ గుడివద్ద ప్రధాన పూజారులు  ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రతిరూపమైన  బండారి ( పసుపు ) కుంకుమలను వెదురుబుట్టలో  తీసుకుని సారలమ్మ ప్రదాన పూజారి కాక సారయ్య సాయంత్రం 8 గంటల 10  నిమిషాలకు బయలు దేరి జంపన్న వాగు మీదుగా పవనసుత హనుమాన్ జెండానీడలో  పటిష్ట బందోబస్తు నడుమ పోలీసులు , ఆదివాసీ వాలంటీర్లు  తదితరులు వెంటరాగా,  పూజారులు కాక కిరణ్, కాక శ్యాం, గ్రామపెద్దలు  సారలమ్మను మేడారానికి చేర్చారు.

 కన్నెపల్లి నుండి సారలమ్మ తల్లి జంపన్న వాగు వద్దకు రాగానే పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తజనకోటి ఉప్పొంగిన భక్తిపారవశ్యంలో  ‘సారలమ్మ తల్లీ దండాలు’ అంటూ హోరెత్తించారు. తల్లి నడిచివచ్చేనీటిలో స్నానాల కోసం పోటీలు పడ్డారు. సాయంత్రం సుమారు 10 గంటల ప్రాంతంలో పూజారులు సారలమ్మతో  పాటు పడిగిద్దరాజు, గోవిందరాజులను  గద్దెలపై కొలువుంచారు. ప్రభుత్వం తరఫున ముఖ్య అధికారులు హాజరయ్యారు. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను కొలువుంచే సమయాల్లో దర్శనాలను  నిలిపివేశారు. సారలమ్మ గద్దెపైకి చేరిన ఘట్టానికి గుర్తుగా ఆదివాసి పూజారులు కొమ్ము బూరలు ఊదారు.  అమ్మవారి రాక అద్బుత సన్నివేశాన్ని కనులారా తిలకించేందుకు కన్నెపల్లి నుండి మేడారం దారి పొడవునా భక్తజనకోటి అమ్మోరికి ఎదురేగి దండాలు పెట్టారు. ఎదురుకోళ్లు అందించారు. కోళ్లు, మేకలతో మొక్కులు చెల్లించారు.సారలమ్మను తీసుకుని వచ్చే ప్రధాన పూజారి తమపైనుండి నడుచుకుంటూ పోతే కోరికలు తీరుతాయనీ,  తమ జన్మసుకృతం అవుతుందన్న నమ్మకంతో దారిపొడువుగా భక్తులు వరాలు పట్టారు. పూజారులు వీరిపైనుండి నడుచుకుంటూ గద్దెలైవెపు సాగారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల, .భక్తజనకోటి హోరు, హిజ్రాలు, జోగమ్మల శివాలుతో సారలమ్మ ఆలయం భక్తిపారవశ్యమైంది. మహాజాతర పరిసర ప్రాంతాలు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడాయి.  వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తుల ప్రవాహంతో వనాల్లోని బాటలన్నీ నిండిపోయాయి.  దాదాపు 20 కిలో మీటర్ల వరకు  అడవి దారులన్నీ కిక్కిరిసిపోయాయి.

 
నేడు వేంచేయునున్న సమ్మక్క...
జాతరలో రెండో ప్రధాన ఘట్టం సమ్మక్క తల్లి ఆగమనం. మేడారానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో చిలకలగుట్టపై వెలసి ఉన్న  సమ్మక్క తల్లిని  గురువారం నాడు మేడారానికి తీసుకురానున్నారు.  వనదేవతల జాతరలో ఈ ప్రధాన ఘట్టం కోసం భక్తజనకోటి కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది.

ప్రధాన పూజారి అలక
సారలమ్మను గద్దెకు తీసుకవచ్చే క్రమంలో మేడారం జాతర ప్రధాన పూజారైన సారయ్య తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని దేవతను తీసుకురావడానికి నిరాకరించారు. ఈ క్రమంలో కన్నెపల్లిలోని సారలమ్మ గుడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయతించడంతో జాతర బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏఎస్పీ దక్షిణామూర్తి సారయ్యను బుజ్జగించి లోపలికి తీసుకెళ్లాడు. సరైన ప్రాధాన్యత కల్పిస్తామని నచ్చజెప్పడంతో సారయ్య శాంతించి పూజలో పాల్గొన్నారు.  



కాసేపట్లో మేడారంలో కీలక ఘట్టం

Updated By ManamWed, 01/31/2018 - 19:23

medaramతెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మేడారం పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. డప్పు దరువులు, శివసత్తుల పూనకాలతో మేడారం మార్మోగుతోంది.  లక్షలాది మంది భక్తులు వనదేవతలు దర్శనం కోసం మేడారం చేరుకున్నారు. బెల్లాన్ని బంగారంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతరలో తొలిఘట్టంలో భాగంగా గద్దె మీద ప్రతిష్టించేందుకు సారలమ్మను మరికాసేపట్లో తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

రెండోరోజైన గురువారం(ఫిబ్రవరి 1) సమ్మక్కను గద్దె మీదకు తీసుకురానున్నారు. చిలకలగుట్ట నుంచి ఫిబ్రవరి-1న సమ్మక్కను గద్దె మీదకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిలకలగుట్ట చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వన మూలికల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 



మేడారం.. జనసంద్రం

Updated By ManamSun, 01/28/2018 - 11:55
  • మూడేండ్ల పిల్లల నుంచి ముసలోళ్ల దాకా..

  • పెరుగుతున్న జాతర జోరు

  • షాపింగ్ మాల్స్‌ను తలదన్నే

  • స్థాయిలో దుకాణాలు

మేడారం.. జనసంద్రం(మేడారం నుంచి మనం ప్రతినిధి): మేడారం... దాదాపు 90 గడపలు, 700లోపు జనాభా.. ఇదీ గ్రామ సాధారణ స్వరూపం. అయితే, రెండేళ్లకోసారి నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా కుగ్రామం కాస్తా మహానగరంగా రూపుదాలుస్తుంది. మామూలు రోజుల్లో కనీసం కప్పు కాఫీ కూడా సరిగా దొరక ని ఈ గ్రామంలో మాత్రం లిక్కర్ నుంచి స్కాచ్ బాటిల్ వరకు అన్నీ లభిస్తాయి. జాతరకు నాలుగు లక్షల కుటుంబాలు.. కోటి మందికిపైగా భక్తులు తరలివస్తారు. ఈ సమయంలో షాపింగ్ మాల్స్‌ను తలదన్నేలా దుకాణాలు వెలుస్తాయి. మరోవైపు జాతరకు వచ్చిన భక్తులు వండే వంటల ఘుమఘుమలు.. మందుబాబులు పొంగించే బీరు సీసాల బుసబుసలు చెప్పనక్కర్లేదు. ఒక్కటనేమిటి.. మేడారం జాతర ఓ మినీ ప్రపంచాన్నే ఆవిష్కరిస్తుంది.

రాత్రింబవళ్లు తేడా లేకుండా..
మామూలు రోజుల్లో రాత్రి ఏడు గంటల లోపే దుకాణాలు బందవుతాయి. మేడారం గ్రామంలో జాతర సమయంలో రాత్రింబవళ్లకు తేడా అనేదే ఉండదు. సమ్మక్క-సారలమ్మ నినాదాలకు అంతే ఉండదు. విద్యుద్దీప కాంతులతో కెమెరా ప్లాష్‌ల వెలుగులు పోటీ పడుతుంటాయి. ఓ వైపు నిర్విరామంగా కోళ్లు, మేకల తలలు తెగిపడుతుంటే.. పొయ్యి మీద మసాలా వంటల ఘుమఘుమలు గుప్పుమంటాయి. జల్సా చేయాలనుకునే వారికి గుడుంబా నుంచి స్కాచ్ వరకు అన్నీ సిద్ధమే. ఈసారి ఐటీడీఏ, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధునిక గుడారాలు ఆకర్షణీయంగా మారాయి.

పల్లెలన్నీ ఒక్కటై...
జాతర సమయాన మేడారం చుట్టూ దాదాపు 50 కిలో మీటర్ల మేర ఎటుచూసినా భక్తజనంతో నిండిపోయి పరిసర గ్రామాలన్నీ ఒక్కటైపోతాయి. సాధారణ రోజుల్లో చెట్టుకొ కటి.. పుట్టకొకటి.. అన్నట్టుండే గ్రామాలన్నీ ఏకమైపోయి మహా నగరం మొలుచుకొచ్చిందా! అనిపిస్తాయి. ఈ సుందర దృశ్యాల్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. గద్దెల ప్రాంగణం నుంచి జంపన్నవాగు మధ్యగల మార్గాలవెంట షాపులు ఏర్పాటు కానుండగా.. దారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్,  వెంగళాపూర్ వరకు మొత్తం పది కిలోమీటర్ల వరకు ఉన్న అడవులు, పంట పొలాల్లో భక్తులు విడిది చేస్తారు. గ్రామాల మధ్య ఖాళీ లేకుండా భక్తులు, వారి వాహనాలతో నిండిపోతాయి. తాడ్వాయి మార్గంలో నాలుగు కిలోమీటర్ల దూరంలోగల గుంజేడు ముసలమ్మ గుడి వరకు భక్తులు విడిది చేస్తారు.

రూ.కోట్లలో వ్యాపారం..
జాతర జరిగే నాలుగు రోజులు కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగుతుంది. చెంప పిన్నుల నుంచి పట్టుచీరల వరకు జాతరలో ఏది కావాలన్నా దొరుకుతుంది. ప్రధానంగా మాంసాహారం, మద్యం, దుకాణాల్లోని వివిధ రకాల వస్తువుల అమ్మకాలు ఒక్కసారిగా స్టాక్ మార్కెట్‌ను తలపిస్తాయి. అయితే, నాలుగు రోజుల తర్వాత ఒక్కసారిగా వ్యాపారాలు ముగిసిపోతాయి. కోళ్లను తూకంవేసి ఇచ్చేంత సమయం లేకపోవడంతో వ్యాపారులు గుండుగుత్తగా కోడి మొత్తానికీ ధర నిర్ణయించి విక్రయిస్తుంటారు. మద్యం అమ్మకాలు సైతం ఇదే స్థాయిలో కొనసాగుతాయి. మద్యం ధర వింటే చాలు.. అప్పటికే తాగి ఉంటే మత్తు దిగిపోతుంది. మొత్తంమీద అధికారికంగా, అనధికారికంగా రూ.8 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతాయని అంచనా.

30 వేల మంది సిబ్బంది సేవలు
వివిధ శాఖలకు చెందిన 30 వేల మంది సిబ్బందిని ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇందులో సగం పోలీసు బలగాలు కాగా, మిగిలినవారిలో ఆర్టీసీ, జిల్లాలోని వివిధ శాఖల్లోని కిందిస్థాయి సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, వలంటీర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలవారు సేవలందిస్తున్నారు. అయితే, ప్రస్తుత పారిశుధ్య కార్మికుల సంఖ్య ఏమాత్రం సరిపోవడం లేదు. ఎక్కడి వ్యర్థాలు అక్కడే పేరుకుపోవడంతో దుర్వాసన ముక్కుపుటాలు అదరగొడుతోంది. కోళ్లు, మేకల వధ మొదలైతే.. ఈ పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. రక్షణపరంగా డ్రోన్ కెవెలతోపాటు ప్రత్యేక దళాలు అణువణువునా గస్తీ నిర్వహిస్తున్నాయి.

వేల సంఖ్యలో బస్సులు.. 
సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే నాలుగు రోజుల్లో ఆర్టిసీ నాలుగు వేలకుపైగా బస్సులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నడుపుతుంది. ఇంతకు నాలుగు రెట్ల సంఖ్యలో ప్రైవేటు వాహనాల్లో భక్తులు మేడారం చేరుకుంటారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. అన్నిశాఖల నాలుగో తరగతి ఉద్యోగులుసహా రాష్ట్రంలోని ఉన్నతాధికారుల వరకు మేడారంలోనే మకాం వేసి జాతరను పర్యవేక్షిస్తుంటారు. పదివేల మంది ప్రభుత్వ సిబ్బంది, 12 వేల మంది పోలీసులు, 11వేల మంది ఆర్టిసీ సిబ్బంది జాతరలో పనిచేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. వైద్య సాయం అందించేందుకు వెయ్యి మందితో ప్రత్యేక బృందం కూడా సిద్ధంగా ఉంటుంది.

జంపన్న వాగులో  జలకాలేవీ..
జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జంపన్నవాగులో పుణ్యస్నానం చేస్తారు. రానురానూ రద్దీ ఉహించని రీతిలో పెరుగుతుండటంతో చాలామంది భక్తులు జాతర మొదలవక ముందే.. అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఈ నెల 31 నుంచి జాతర ప్రారంభం కానుంది. ఆ రోజుకల్లా జంపన్నవాగులో నీరుండేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. అందుకనుగుణంగానే లక్నవరం చెరువు నుంచి గురువారం నీటిని విడుదల చేశారు. ఇంతవరకూ బాగానే ఉందిగానీ.. ముందస్తుగా వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానం చేసే భాగ్యం దక్కలేదంటూ ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతానికి వాగులోని బోరుమోటార్ల నీటిని నల్లాల ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ నల్లాల నీటితోనే వారు స్నానం చేశామనిపించి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.



మేడారం జాతర అదిరిపోవాలి

Updated By ManamThu, 01/11/2018 - 15:50

medaram reviewదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు పకడ్భంది ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో మేడారం జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.  ఈ సమావేశంలో మున్సపిల్ శాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్, పర్యాటక,సాంస్కృతిక  కార్యదర్శి బి.వెంకటేశం, దేవాదాయశాఖ కమీషనర్ శివశంకర్, గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ,  శ్రీ నాగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు జరిగే సమ్మక్క, సారమ్మ జాతరను జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో ప్రచారం లభించేలా చూడాలని, కుంభమేళ తరహాలో ఏర్పాట్లు చేయ్యాలని అన్నారు. అంతర్జాతీయ ఛానెల్, బ్లాగులు, సోషల్ మీడియాను వినియోగించాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. విదేశీయాత్రికుల కోసం అత్యున్నత సదుపాయాలతో ప్రత్యేక నివాసాలను ఏర్పాటు చేయాలన్నారు. సాంస్కృతిక శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, జాతర కార్యక్రమాలను పర్యవేక్షించాలని అన్నారు. గతంలో వరంగల్ కలెక్టరుగా పనిచేసిన కరుణను జాతర కోసం ప్రత్యేక అధికారిణిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రులను, సెక్రటరీలను, గిరిజన పార్లమెంటు సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని సి.యస్ ఆదేశించారు. జాతర కోసం వచ్చే వివిధ ముఖ్య అతిధులను తగు  ప్రోటోకాల్ లో ఆహ్వానించాలని సూచించారు. మేడారంలో పారిశుధ్యానికి ప్రత్యేక శ్రధ్ద తీసుకోవాలని మున్సిపల్ శాఖ ద్వారా తగు సిబ్బందిని నియమించాలని, సరిపడ అత్యాధునిక మరుగుదొడ్లను నిర్మించాలని ఆదేశించారు. సాంస్కృతిక దేవాదాయశాఖ అధికారులు జాతర ఏర్పాట్లపై ప్రత్యేకంగా శాఖలవారిగా సమావేశాలు నిర్వహించాలని అన్నారు. టూరిజం శాఖ ద్వారా ప్రత్యేక బ్రోచర్ ను విడుదల చేయాలని అన్నారు. జాతర కోసం హెలికాప్టర్ సేవలను కూడా యాత్రికులకు కల్పించాలన్నారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్భంది కలగకుండా భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.



మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష

Updated By ManamSat, 12/23/2017 - 16:10

kadiyam srihariహైదరాబాద్: మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎంపీలు వచ్చే నెల 2న కేంద్ర గిరిజన శాఖ మంత్రిని కలిసి మేడారంను జాతీయ పండుగగా గుర్తించాలని కోరతారని స్పష్టంచేశారు. శనివారం ఆయన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, చందూలాల్, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాతర నిర్వహణ, సౌకర్యాలు, భక్తులకు కల్పిస్తున్న వసతులు తదితర అంశాలపై చర్చ జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కడియం సూచించారు. ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. 


సమీక్షా సమావేశం అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ మేడారం జాతరను గతంలో కంటే ఘనంగా నిర్వహిస్తామన్నారు. జాతరకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతర నిర్వహణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.80 కోట్లు కేటాయించారన్నారు. జనవరి 15 నాటికి జాతర పనులన్నీ పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జాతర పనుల్ని వీలైనంత వరకు స్థానికులకే అప్పగించాలన్నారు. జనవరి 18న మేడారంలో మరోమారు సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. 

medaram jatharaకాగా వచ్చే ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు మేడారం జాతర జరుగునుంది. 31 వ తేదీ తొలిరోజు సారలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకు వస్తారు. ఫిబ్రవరి 1 న రెండో రోజు సమ్మక్క దేవతను చిలుకలగుట్ట నుంచి గ‌ద్దెలపైకి తీసుకువస్తారు. ఫిబ్రవరి 2న భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. ఫిబ్రవరి 3న వనదేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు.  

మేడారం జాత‌ర రూట్ మ్యాప్ యాప్ ఆవిష్క‌ర‌ణ‌

స‌మ్మ‌క్క‌-సారాల‌మ్మ  జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు కోసం  "మేడారం గైడ్" అనే యాప్ ను ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి, దేవ‌దాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్క‌రించారు. మేడారం జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తులకు రూట్ మ్యాప్ యాప్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.





Related News