sarakka

గద్దెపై కొలువుదీరిన సారలమ్మ

Updated By ManamThu, 02/01/2018 - 15:49

పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా..
జంపన్న వాగుపై ఆసీనుడైన జంపన్న
భక్తుల పబ్బతులతో హోరెత్తిన అడవి
మొదలైన మేడారం జాతర మహాసంరంభం
నేడు వేంచేయునున్న సమ్మక్క తల్లి
వనమంతా జన ప్రవాహమే...

medaram

మేడారం మహాజాతరలో తొలి అంకం ఆవిష్కృతమైంది. రెండు సంవత్సరాలుగా కోట్లాది మంది భక్తులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. ఆదివాసీల ఆరాధ్య దైవాలై న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం అనేక ప్రాంతాల నుండి బయలుదేరి  మేడారం చేరుకుని చల్లని తల్లుల కరుణా కటాక్షాలకై వేచి చూస్తున్న కోట్లాది భక్తుల ఎదురు చూపులు ఫలించాయి. కన్నెపల్లి సారలమ్మ తల్లి మేడారానికి తరలివచ్చింది. తల్లిరాకతో భక్తజనకోటి పూనకాలతో పులకించిపోయారు. వారి పిలుపులు, మొక్కులతో మేడారమంతా మార్మోగిపోయింది.నీటి అలలతో ఓలలాడే జంపన్న వాగు జనసంద్రమైంది. చల్లని తల్లి కాలు మోపగానే మేడారం నేల పునీతమైంది. కన్నెపల్లి వాసులు తల్లికి హారతులిస్తూ, నీళ్లతో ఆరగిస్తు మేడారానికి సాగనంపగా, నాలుగు కిలోమీటర్ల్ల దారిపొడుగునా భక్తుల పబ్బతులు అందుకుంటూ దారిలో జంపన్న తీరంలో కొలువైన సోదరుడు జంపన్నను మందలించుకుంటూ వరాల తల్లి గద్దె నెక్కింది. తల్లి రాకకు ముందే పూనగుండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి  గోవిందరాజులు వారివారి గద్దెలపైకి చేరుకున్నారు. మరోపక్క తన బిడ్డలు.. భక్తజనకోటి కోసం మేడారం రావటానికి మహాతల్లి సమ్మక్క చిలకలగుట్టైపై నుండి బయులుదేరింది. ఆ  మహాద్బుత ఘట్టం కోసం భక్తజనకోటి ఉద్విగ్న భరితంగా ఎదురుచూస్తోంది. 
బుదవారం నాడు గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువు తీరగా, జంపన్న తీరంలో జంపన్న కొలువు తీరి భక్తజనకోటికి దీవెనలు, వరాలిస్తున్నారు.ఆదివాసీ గిరిజన కోయలు బుధవారం ఉదయం నుండి  తమ ఆచార సాంప్ర దాయాల ప్రకారం రోజంతా పూజలు నిర్వహించారు. కన్నె పల్లి ఆడబిడ్డలు సారలమ్మ ఆల యంలో ప్రత్యేక పూజలు చేసి శుద్ది చేసే సామాగ్రి, మంచి నీటితో మేడారానికి బయలు దేరి వచ్చి మేడారం సారలమ్మ గద్దెను శుద్ది చేసి పట్టు పరిచారు. సాయంత్రం సారలమ్మ గుడివద్ద ప్రధాన పూజారులు  ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రతిరూపమైన  బండారి ( పసుపు ) కుంకుమలను వెదురుబుట్టలో  తీసుకుని సారలమ్మ ప్రదాన పూజారి కాక సారయ్య సాయంత్రం 8 గంటల 10  నిమిషాలకు బయలు దేరి జంపన్న వాగు మీదుగా పవనసుత హనుమాన్ జెండానీడలో  పటిష్ట బందోబస్తు నడుమ పోలీసులు , ఆదివాసీ వాలంటీర్లు  తదితరులు వెంటరాగా,  పూజారులు కాక కిరణ్, కాక శ్యాం, గ్రామపెద్దలు  సారలమ్మను మేడారానికి చేర్చారు.

 కన్నెపల్లి నుండి సారలమ్మ తల్లి జంపన్న వాగు వద్దకు రాగానే పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తజనకోటి ఉప్పొంగిన భక్తిపారవశ్యంలో  ‘సారలమ్మ తల్లీ దండాలు’ అంటూ హోరెత్తించారు. తల్లి నడిచివచ్చేనీటిలో స్నానాల కోసం పోటీలు పడ్డారు. సాయంత్రం సుమారు 10 గంటల ప్రాంతంలో పూజారులు సారలమ్మతో  పాటు పడిగిద్దరాజు, గోవిందరాజులను  గద్దెలపై కొలువుంచారు. ప్రభుత్వం తరఫున ముఖ్య అధికారులు హాజరయ్యారు. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను కొలువుంచే సమయాల్లో దర్శనాలను  నిలిపివేశారు. సారలమ్మ గద్దెపైకి చేరిన ఘట్టానికి గుర్తుగా ఆదివాసి పూజారులు కొమ్ము బూరలు ఊదారు.  అమ్మవారి రాక అద్బుత సన్నివేశాన్ని కనులారా తిలకించేందుకు కన్నెపల్లి నుండి మేడారం దారి పొడవునా భక్తజనకోటి అమ్మోరికి ఎదురేగి దండాలు పెట్టారు. ఎదురుకోళ్లు అందించారు. కోళ్లు, మేకలతో మొక్కులు చెల్లించారు.సారలమ్మను తీసుకుని వచ్చే ప్రధాన పూజారి తమపైనుండి నడుచుకుంటూ పోతే కోరికలు తీరుతాయనీ,  తమ జన్మసుకృతం అవుతుందన్న నమ్మకంతో దారిపొడువుగా భక్తులు వరాలు పట్టారు. పూజారులు వీరిపైనుండి నడుచుకుంటూ గద్దెలైవెపు సాగారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల, .భక్తజనకోటి హోరు, హిజ్రాలు, జోగమ్మల శివాలుతో సారలమ్మ ఆలయం భక్తిపారవశ్యమైంది. మహాజాతర పరిసర ప్రాంతాలు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడాయి.  వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తుల ప్రవాహంతో వనాల్లోని బాటలన్నీ నిండిపోయాయి.  దాదాపు 20 కిలో మీటర్ల వరకు  అడవి దారులన్నీ కిక్కిరిసిపోయాయి.

 
నేడు వేంచేయునున్న సమ్మక్క...
జాతరలో రెండో ప్రధాన ఘట్టం సమ్మక్క తల్లి ఆగమనం. మేడారానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో చిలకలగుట్టపై వెలసి ఉన్న  సమ్మక్క తల్లిని  గురువారం నాడు మేడారానికి తీసుకురానున్నారు.  వనదేవతల జాతరలో ఈ ప్రధాన ఘట్టం కోసం భక్తజనకోటి కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది.

ప్రధాన పూజారి అలక
సారలమ్మను గద్దెకు తీసుకవచ్చే క్రమంలో మేడారం జాతర ప్రధాన పూజారైన సారయ్య తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని దేవతను తీసుకురావడానికి నిరాకరించారు. ఈ క్రమంలో కన్నెపల్లిలోని సారలమ్మ గుడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయతించడంతో జాతర బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏఎస్పీ దక్షిణామూర్తి సారయ్యను బుజ్జగించి లోపలికి తీసుకెళ్లాడు. సరైన ప్రాధాన్యత కల్పిస్తామని నచ్చజెప్పడంతో సారయ్య శాంతించి పూజలో పాల్గొన్నారు.  మేడారం జాతర అదిరిపోవాలి

Updated By ManamThu, 01/11/2018 - 15:50

medaram reviewదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు పకడ్భంది ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో మేడారం జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.  ఈ సమావేశంలో మున్సపిల్ శాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్, పర్యాటక,సాంస్కృతిక  కార్యదర్శి బి.వెంకటేశం, దేవాదాయశాఖ కమీషనర్ శివశంకర్, గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ,  శ్రీ నాగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు జరిగే సమ్మక్క, సారమ్మ జాతరను జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో ప్రచారం లభించేలా చూడాలని, కుంభమేళ తరహాలో ఏర్పాట్లు చేయ్యాలని అన్నారు. అంతర్జాతీయ ఛానెల్, బ్లాగులు, సోషల్ మీడియాను వినియోగించాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. విదేశీయాత్రికుల కోసం అత్యున్నత సదుపాయాలతో ప్రత్యేక నివాసాలను ఏర్పాటు చేయాలన్నారు. సాంస్కృతిక శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, జాతర కార్యక్రమాలను పర్యవేక్షించాలని అన్నారు. గతంలో వరంగల్ కలెక్టరుగా పనిచేసిన కరుణను జాతర కోసం ప్రత్యేక అధికారిణిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రులను, సెక్రటరీలను, గిరిజన పార్లమెంటు సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని సి.యస్ ఆదేశించారు. జాతర కోసం వచ్చే వివిధ ముఖ్య అతిధులను తగు  ప్రోటోకాల్ లో ఆహ్వానించాలని సూచించారు. మేడారంలో పారిశుధ్యానికి ప్రత్యేక శ్రధ్ద తీసుకోవాలని మున్సిపల్ శాఖ ద్వారా తగు సిబ్బందిని నియమించాలని, సరిపడ అత్యాధునిక మరుగుదొడ్లను నిర్మించాలని ఆదేశించారు. సాంస్కృతిక దేవాదాయశాఖ అధికారులు జాతర ఏర్పాట్లపై ప్రత్యేకంగా శాఖలవారిగా సమావేశాలు నిర్వహించాలని అన్నారు. టూరిజం శాఖ ద్వారా ప్రత్యేక బ్రోచర్ ను విడుదల చేయాలని అన్నారు. జాతర కోసం హెలికాప్టర్ సేవలను కూడా యాత్రికులకు కల్పించాలన్నారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్భంది కలగకుండా భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష

Updated By ManamSat, 12/23/2017 - 16:10

kadiyam srihariహైదరాబాద్: మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎంపీలు వచ్చే నెల 2న కేంద్ర గిరిజన శాఖ మంత్రిని కలిసి మేడారంను జాతీయ పండుగగా గుర్తించాలని కోరతారని స్పష్టంచేశారు. శనివారం ఆయన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, చందూలాల్, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాతర నిర్వహణ, సౌకర్యాలు, భక్తులకు కల్పిస్తున్న వసతులు తదితర అంశాలపై చర్చ జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కడియం సూచించారు. ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. 


సమీక్షా సమావేశం అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ మేడారం జాతరను గతంలో కంటే ఘనంగా నిర్వహిస్తామన్నారు. జాతరకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతర నిర్వహణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.80 కోట్లు కేటాయించారన్నారు. జనవరి 15 నాటికి జాతర పనులన్నీ పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జాతర పనుల్ని వీలైనంత వరకు స్థానికులకే అప్పగించాలన్నారు. జనవరి 18న మేడారంలో మరోమారు సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. 

medaram jatharaకాగా వచ్చే ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు మేడారం జాతర జరుగునుంది. 31 వ తేదీ తొలిరోజు సారలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకు వస్తారు. ఫిబ్రవరి 1 న రెండో రోజు సమ్మక్క దేవతను చిలుకలగుట్ట నుంచి గ‌ద్దెలపైకి తీసుకువస్తారు. ఫిబ్రవరి 2న భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. ఫిబ్రవరి 3న వనదేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు.  

మేడారం జాత‌ర రూట్ మ్యాప్ యాప్ ఆవిష్క‌ర‌ణ‌

స‌మ్మ‌క్క‌-సారాల‌మ్మ  జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు కోసం  "మేడారం గైడ్" అనే యాప్ ను ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి, దేవ‌దాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్క‌రించారు. మేడారం జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తులకు రూట్ మ్యాప్ యాప్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.

Related News