jaleel khan

మళ్లీ తడబడిన బికామ్‌లో ఫిజిక్స్ ఎమ్మెల్యే..!

Updated By ManamFri, 08/31/2018 - 15:00
  • జగన్‌ను విమర్శించబోయి తప్పులో కాలేసిన జలీల్ ఖాన్..

  • నారా హమారా.. టీడీపీ హమారా కార్యక్రమంలో వ్యాఖ్యలు..

TDP MLA, Jaleel Khan, tongue slip, Nara Hamara TDP hamara, Gunturవిజయవాడ: బికామ్‌లో ఫిజిక్స్ చదివిన ఎమ్మెల్యే అనగానే టక్కున గుర్తుచ్చే పేరు జలీల్ ఖాన్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేగా ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఆయన మాట్లాడే విధానంతో అందరిని కడుపుబ్బా నవ్విస్తారు. జలీల్ ఖాన్ ఎప్పుడు మీటింగ్‌ల్లో పాల్గొన్న ఆయన మాటల్లో తడబాటుతో తప్పులో కాలేసి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా గుంటూరులో ఏర్పాటు చేసిన ‘టీడీపీ హమారా.. నారా హమారా..’ కార్యక్రమంలో మైనార్టీల సమస్యలపై జలీల్ ఖాన్ మాట్లాడుతూ మరోసారి తప్పులో కాలేశారు. టీడీపీ చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలు పెట్టిన జలీల్ ఖాన్.. కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గతంలో 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ ముస్లింలకు చేసింది ఏమి లేదని విమర్శించిన ఆయన.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించబోయి తడబడ్డారు. ‘రాయలసీమలో ముస్లింలను ఎదగకుండా చూసిన చరిత్ర రాజశేఖర్ రెడ్డి వాళ్ల నాన్న.. జగన్ మోహన్ రెడ్డిది..’ అనడంతో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. బికామ్‌లో ఫిజిక్స్ ఉన్నట్టుగానే.. వైఎస్సార్‌కు జగన్ మోహన్ రెడ్డి నాన్న అంటూ మరోసారి హ్యాస్యాన్ని పండించారు.

తుని తరహాలో గొడవకు వైసీపీ పథకం..
అదేవిధంగా శనివారం అమరావతిలో జరిగిన నారా హమారా.. టీడీపీ హమారా కార్యక్రమంలో మాట్లాడుతూ.. తుని ఘటన తరహాలో గొడవ చేసేందుకు వైసీపీ పథకం రచిస్తోందని జలీల్ ఖాన్ మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీల్లో అల్లర్లు చేయడం జగన్‌కే కాదు.. ఆయన తాత, తండ్రీకి అలవాటేనని విమర్శించారు. జగన్ అధికారంలోకి వస్తే ఫ్యాక్షనిజం పెరుగుతుందని జలీల్ ఖాన్ విరుచకపడ్డారు. కాగా, 2004లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచిన జలీల్ ఖాన్.. చంద్రబాబు ఆకర్ష్ మంత్రంతో రాత్రికి రాత్రే టీడీపీ తీర్థం పుచ్చేసుకున్నారు. చంద్రబాబు కేబినెట్‌‌లో మైనార్టీ శాఖ ఖాళీగా ఉండటంపై కన్నేసిన జలీల్ ఖాన్.. రాజీనామా చేయకుండా టీడీపీలోకి జంప్ చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేగా పార్టీలో కొనసాగుతున్నారు. 2017లో వీళ్లను మాత్రం మర్చిపోలేరు!

Updated By ManamMon, 12/25/2017 - 17:37

jaleel khan2017సంవత్సరం మరో ఆరు రోజుల్లో ముగిసిపోనుంది. ప్రజలంతా పాత సంవత్సరానికి గుడ్‌బై చెప్పి.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం వార్తల్లో నిలిచిన కొందరు ప్రముఖులు, వివాదాస్పద వ్యక్తుల గురించి ఒక్కసారి గుర్తుచేసుకుందాం. 

బీకాంలో ఫిజిక్స్: ఈ సంవత్సరం ఏపీ, తెలంగాణతో పాటు తెలుగు వారంతా ఎక్కడుంటే అక్కడ అంతటా ఆయన గురించే చర్చ. ఆ వీడియో చుట్టూనే రచ్చ. ఒక ఎమ్మెల్యే అంతమాటన్నారా.. అబ్బే ఆయన అలా అని ఉండరని కొందరు, నిజంగానే అన్నారని ఇంకొందరు. ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. ఇంకెవరు ‘బీకాంలో ఫిజిక్స్’ ఫేం జలీల్‌ఖాన్ గురించే. ఈ ఒక్కమాటతో ఆయన సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయారు. సోషల్‌మీడియాలో ఏ పొలిటీషియన్‌కు ఈ మధ్యకాలంలో రానంత క్రేజ్ ఆయన సొంతం చేసుకున్నారు. నంది అవార్డుల తరహాలో సోషల్ మీడియాలో కూడా అవార్డులు ప్రకటిస్తే ‘వైరల్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2017 ఇన్ తెలుగు స్టేట్స్’ అవార్డు ఆయనకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తనకు మ్యాథ్స్ అంటే ఇష్టమని, అందుకే బీకాంలో చేరానని ఆయన చెప్పిన మాటలు నవ్వులపువ్వులు కురిపించాయి. బీకాంలో మ్యాథ్స్ ఉంటది, ఫిజిక్స్ ఉంటది, కామర్స్ ఉంటది అంటూ ఆయన పేల్చిన బాంబులు మామూలివి కావు. చిన్నప్పటి నుంచి తనకు లెక్కల్లో నూటికి నూరు మార్కులు వచ్చేవని జలీల్‌ఖాన్ చెప్పడంతో అవాక్కవడం ఆ యాంకర్ వంతయింది. జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీలో ప్రస్తావించారంటే ‘బీకాంలో ఫిజిక్స్’ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించానని జలీల్‌ఖాన్ చెప్పిన సంగతి తెలిసిందే. వీడియో 2016 డిసెంబర్ చివరి వారంలో వెలుగులోకొచ్చినప్పటికీ 2017 సంవత్సరమంతా సోషల్ మీడియాలో ఆ వీడియో కొన్ని నెలల పాటు హల్‌చల్ చేసింది. 

బీరును హెల్త్ డ్రింక్ అన్న ఏపీ మంత్రి: ఇక జలీల్‌ఖాన్‌లాగే వ్యాఖ్యలు చేసి ఏపీ ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్ వార్తల్లో నిలిచారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జవహర్ బీరును హెల్త్ డ్రింక్‌గా చెప్పుకొచ్చారు. చల్లటి బీరును సేవించాలని ఆయన సలహా కూడా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసించడాన్ని తప్పుబట్టిన మంత్రి.. ప్రభుత్వమే బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రచారం చేస్తుందని తెలిపారు. బీరు హెల్త్ డ్రింక్ కాదని ఎవరు చెప్పారని సదరు యాంకర్‌ను మంత్రి నిలదీశారు. తాను బీరు ఆరోగ్యానికి శ్రేయస్కరమని నిరూపించగలనని మంత్రి జవహర్ చెప్పారు. ఈ వీడియో కూడా సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది.

ఫ్యాన్స్‌కు బాలయ్య వాయింపులు: ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా అక్టోబర్‌లో తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంలో ఓ అభిమాని హడావుడిలో బాలయ్య కంటే ముందు నడిచాడు. దీంతో బాలయ్య అతనిపై చేయి చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకృష్ణ నంద్యాల వెళ్లారు. దీంతో అభిమానులు ఆయనను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంలో ఓ అభిమాని చెంపను బాలయ్య చెళ్లుమనిపించాడు. సెల్ఫీ దిగడానికి వచ్చిన ఓ వ్యక్తిని పరుష పదజాలంతో దూషించాడు. జైసింహా షూటింగ్ ప్రారంభోత్సవంలో అసిస్టెంట్‌పై బాలకృష్ణ చేయిచేసుకున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చూడటానికి హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌ లోపలికి వెళుతుండగా బాలయ్యను అభిమానులు చుట్టుముట్టారు. వారిలో ఒక అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో సహనం కోల్పోయిన బాలయ్య సెల్ఫీ తీస్తున్న చేతిని కొట్టడంతో సెల్‌ఫోన్ కింద పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య షాట్స్ చాలానే ఉన్నాయి.

మహేశ్ కత్తి: కాటమరాయుడు సినిమా రివ్యూతో తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా పాలిట దేవుడిగా మారిన వ్యక్తి కత్తి మహేశ్. ఒక మామూలు సినీ విమర్శకుడికి ఇంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం పవన్ ఫ్యాన్స్ అని చెప్పక తప్పదు. కాటమరాయుడు సినిమా బాగోలేదని అనడం, జనసేనను విమర్శించడంతో పవన్ ఫ్యాన్స్ కత్తి మహేశ్‌పై రగిలిపోయారు. సోషల్ మీడియాలో కత్తి మహేశ్‌ ఫోన్ నంబర్‌ను పోస్ట్ చేసి పవన్ ఫ్యాన్స్ అంతా ఫోన్ చేయాలని అభిమానులు పిలుపునిచ్చారు. దీంతో కత్తి మహేశ్ చెవులకు చిల్లులు పడేంతలా ఫోన్లు చేసి ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆ తర్వాత బిగ్‌బాస్‌తో కత్తి మహేశ్ పేరు కాస్త ప్రముఖంగా వినిపించింది. అనంతరం ఏ న్యూస్ చానల్ చూసినా కత్తి మహేశే కనిపించేవాడు. ఫ్యాన్స్‌కు ఫోన్ చేయడం, కత్తి మహేశ్‌కు, ఫ్యాన్స్‌కు గొడవపెట్టడమే పనిగా పెట్టుకున్నాయి తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని చానళ్లు. కత్తి మహేశ్ వీడియోలకు రేటింగ్స్ కూడా విపరీతంగా రావడంతో ఇప్పటికీ అతని హవానే నడుస్తోంది.

తీరు మారని ఆర్జీవీ-వివాదాల అర్జున్ రెడ్డి: వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ సిద్ధహస్తుడు. అలాంటి రాంగోపాల్ వర్మ వెబ్ సిరీస్‌లతో వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాడు. ‘గన్స్ అండ్ తైస్’ పేరుతో ముంబై మాఫియా గురించి ఉన్నది ఉన్నట్లు చూపిస్తానని ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ, ‘కడప’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేసి రాయలసీమ రెడ్ల చరిత్ర చెబుతానంటున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ జీవితంలోని చివరి రోజుల్లో జరిగిన వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తానని వర్మ ప్రకటించడం అత్యంత వివాదాస్పదంగా మారింది. అర్జున్‌‌రెడ్డి సినిమా షూటింగ్ సమయంలో కాంగ్రెస్ నేత వీహెచ్‌కు కూడా వర్మ చురకలంటించారు. అర్జున్‌రెడ్డి సినిమాలో అశ్లీలత పెరిగిపోయిందంటూ, బూతులు ఎక్కువగా ఉన్నాయంటూ యాంకర్ అనసూయ, కాంగ్రెస్ నేత వీహెచ్‌తో పాటు పలు మహిళా సంఘాలు కూడా గళమెత్తాయి. ఇన్ని వివాదాల నడుమ కూడా అర్జున్ రెడ్డి సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.

దండం పెట్టిన ఇన్‌స్పెక్టర్: అనంతపురం జిల్లా మడకశిర ఇన్‌స్పెక్టర్ శుభ్‌కుమార్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన గంటల వ్యవధిలోనే ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలు, మరో మహిళను బైక్‌పై ఎక్కించుకుని వస్తూ ఆయన కంటపడ్డారు. అంతమందిని ఒకే బైక్‌పై చూసిన శుభ్‌కుమార్ ‘మీకు చెప్పడం నా వల్ల కాదు మహాప్రభో’ అన్నట్లుగా చేతులెత్తి దండం పెట్టారు. ఈ దృశ్యాన్ని ఎవరో ఫొటో తీసి నెట్‌లో పెట్టడంతో వైరల్ అయింది.

Related News